ముసురు - జడా సుబ్బారావు

    అగ్నిపర్వతం బద్దలైనట్లు.... ఆకాశంలో ఉరుముల చప్పుడు!

    కాశానికి చిల్లుపడినట్లు... ఆగకుండా వర్షం...! 

             
    ఆ రోజుకి మూడురోజుల నుంచి ఒకటే ముసురు...!
    
    తెరిపిలేదు... వర్షం కురుస్తూనే ఉంది! వానరాకడ... ప్రాణం పోకడ...        
    
    బిక్కుబిక్కుమంటూ జనం... ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని.... ఉంటామో... ఊడతామో తెలియని సందిగ్ధంలో...!    

    
    గడపలకే అంకితమైపోయారు...!            
    
    పార్వతమ్మ ఇంటిమీద తాటాకునేసి మూడుసంవత్సరాలు దాటింది.
    
    ఈ మూడేళ్ళలోనూ... పడిన వర్షాలకు చీకిపోయినది చీకిపోగా...పురుగులు కొరికేసి తాటాకు... రంధ్రాలతో... అసలు ఆ ఇంటిమీదే తాటాకే లేదేమోననే భ్రమను కల్గిస్తోంది.

    
    బయట ఉన్నట్లే వుంది లోపల కూడా. 

    
    వాస్తవానికి వర్షం బయటే కురుస్తోంది... కానీ లోపలున్న వాళ్ళను కూడా తడిపి ముద్దచేస్తోంది.                                                    
    
    చిన్న ఇల్లు.... ఒక్కటే గది, బయట చిన్న వరండా.
    
    ఉన్న సామాన్లు... మంచాలు... దుప్పట్లు... దిండ్లు... అన్నీ ఒక మూలకి సర్ది తడవకుండా జాగ్రత్త చేసింది పార్వతమ్మ. ఇంట్లో నిల్చోడానికి చోటులేదు... ఎక్కడ నిల్చున్నా.. తడవక తప్పదు...!  
    
    కొడుకులు రమేష్... సురేష్ ల మీద తన పమిటకొంగుని కప్పి... వాళ్ళు తడవట్లేదనే భ్రమతో... భ్రాంతితో... వాళ్ళవంక దీనంగా చూస్తోంది పార్వతమ్మ. భర్త ఆనందరావు చనిపోయేనాటిని అరెకరం మాగాణి... గవర్నమెంటు ఉద్యోగం... పెద్ద ఇల్లు పార్వతమ్మకు దక్కిన ఆస్తి. అష్టకష్టాలు పడితే ఉద్యోగం పెద్దకొడుకు రాజేష్ కి వచ్చింది. తనకు పెన్షన్... మిగిలిన ఇద్దరు కొడుకులు... వాళ్ళిద్దరితోనే తన లోకం.  
    
    పెద్దకొడుక్కి పెళ్ళీడు వచ్చింది. ఉద్యోగం ఉండడం వల్ల చాలా సంబంధాలు వచ్చాయి. మరీ దూరం పోవడం ఇష్టంలేని పార్వతమ్మ దగ్గర సంబంధం... అన్నగారి కూతురు వసంతను... కొడుక్కిచ్చి చేసింది. ఇంట్లోవాళ్ళతో కలిసిపోతుందని... మరుదుల్నీ అత్తగార్నీ బాగా చూసుకుంటుందనీ...!                
    
    తానొకటి తలిస్తే దైవం మరోటి తలచిందని... పెళ్ళయిన మూడోనాటికే భర్తచేత వేరుకాపురం పెట్టించిన వసంతను చూస్తూ మౌనంగా వుండిపోయింది పార్వతమ్మ. దానికి తోడు దూరాన ఉద్యోగం కూడా చేయవలసి రావడంతో వసంతకు అదృష్టం కలిసి వచ్చినట్లయింది.                            
    
    పుట్టబోయే పిల్లలకంటూ మెల్లమెల్లగా పొలం అమ్మించింది వసంత. బ్రతికి వున్న వాళ్ళను మాత్రం... ఇలా అనాథలుగా వదిలేసింది... ఇల్లు కప్పిస్తానని వచ్చే ఉత్తరం తప్ప కొడుకు జాడలేదు.
    
    తన గురించి తనకు దిగుల్లేదు... తాను ఆరిపోయే దీపం! కానీ మిగిలిన పిల్లలిద్దర్నీ చూస్తుంటేనే... కడుపు తరుక్కుపోతోంది...! కొడుకుమీద పెట్టుకున్న ఆశలు... ఒక్కొక్కటే జారిపోసాగాయి... దోసిట్లో పట్టిన నీటిబిందువుల్లా! ఏం చేయాలో అర్థంకాదు. గుప్పెడు మెతుకులు పెట్టలేని నిస్సహాయత... గుండెల్ని పిండి నిలువునా నీరు కార్చేస్తోంది.        

    
    "అమ్మా... ఆకలవుతోందే...!" సురేష్ గొంతు దీనంగా వినిపించింది.
    
    "................"      
    
    "అమ్మా ఆకలవుతోందే..." దీనత్వంతో పాటు నీరసం కూడా మరింత ధ్వనిస్తోంది.        
    
    మౌనం తప్ప మాట పెగల్లేదు గొంతులోంచి!
    
    ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరూ అడిగినా సమాధానం లేకపోయేసరికి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిస్సహాయంగా చూస్తుండిపోయారు అమ్మవైపు.    
    
    "కాసేపు ఆగండయ్యా... వర్షం తగ్గితే వెళ్ళి ఎవర్నయినా అడిగి తీసుకొస్తాను... కాసేపు ఓపిక పట్టండి నాన్నా..." కన్నబిడ్డల ఆకలి తీర్చలేని ఆవేదన చాలా దైన్యంగా వినిపించింది గొంతులోంచి.
    
    గంటలు దొర్లిపోతున్నాయి.... వర్షం కురుస్తూనే వుంది తెరిపి లేకుండా...! నిజానికి వర్షం తగ్గకుండా ఉంటేనే బాగుండుననిపించింది ఆ క్షణం పార్వతమ్మకు. వర్షం తగ్గితే అప్పుకోసం వెళ్ళాలి... అప్పు పుట్టదని తెలుసు. అభిమానం.... ఆశ రెంటినీ చంపుకుని వాళ్ళముందు పిల్లల కోసం దీనంగా నిల్చోవాలి... లాభం ఉండదు!                

    
    "ముందుచేసిన బాకీలు తీర్చలేదు... మళ్ళీ అప్పంటే ఎలా...?" మాటల్లో కాకపోయినా వారి ముఖాల్లో కనిపించే ప్రశ్నలు...! ఎక్కడికెళ్ళాలో... ఎవర్ని అడగాలో... సందిగ్ధావస్థ...!                            
    
    ఆకలికి తట్టుకోలేక... అల్లాడుతూ ముడుచుకుని పడుకున్న పిల్లలిద్దర్నీ చూస్తే మనసు వికలమవుతోంది పార్వతమ్మకి.        

    
    ఏదో ఒకటి చేయాలి.                      

    
    పైటకొంగు తలపై చుట్టుకుని... చేతిలో గిన్నె పట్టుకుని బయటికి వచ్చింది పార్వతమ్మ.                            
    
    ఉన్నట్టుండి... ఒక్కసారిగా... భూమండలం దద్దరిల్లేలా ఉరుము ఉరిమింది.


* * * 

    
    "చిట్టెమ్మమ్మా... అరసోలెడు బియ్యముంటే ఇవ్వమ్మా! రేషన్ తెచ్చాక ఇస్తాను?"        
    
    "ఎవరూ... ఆ...ఆ... పార్వతమ్మా! అయ్యో తల్లీ...! నేను ఇంకా రేషన్ తేలేదమ్మా... పొద్దున నేను కూడా అప్పే తెచ్చి వండాను..." జాలిగా పలికింది చిట్టెమ్మ గొంతు.                                    
    
    "అమ్మాయ్ సరితా! అరసోలెడు బియ్యముంటే యివ్వమ్మా! రేపొద్దున్నే ఇచ్చేస్తాను. పిల్లలు ఆకలికి తట్టుకోలేక పోతున్నారు. నిన్నట్నుంచి ఏమీ తినలేదు..."                                    
    
    "ఇంతకుముందే రాజమ్మ వచ్చి తీసుకెళ్ళిందత్తయ్యా... కొంచెం ముందొచ్చి అడిగినా ఇచ్చేదాన్ని..." ఇవ్వలేకపోయానన్న బాధా, అంత వర్షంలో వచ్చిందనే జాలీ కలగలిసిన గొంతుతో చెప్పింది సరిత.
    
    ఒక ఇంటి నుంచి... ఇంకొక ఇంటికి...! ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి...!
    
    వర్షం కురుస్తూనే వుంది తెరిపిలేకుండా...! పార్వతమ్మ తిరుగుతూనే వుంది విసుగులేకుండా...!      
    
    తడిసిపోయిన ఒళ్ళు గజగజ వణికిపోతోంది. అయినా తప్పదు... తిరగాలి. ఒకచోట కాకపోతే మరోచోట... ఎలాగైనా సరే కాసిని బియ్యం సంపాదించి పిల్లలకి అన్నం వండి పెట్టాలి. మరో ఆలోచనఏదీ లేదు. తిరుగుతూనే వుంది పార్వతమ్మ. ఆఖరిసారి అడగాలనే ఉద్దేశ్యంతో భారతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది.              

    
    "భారతీ! నిన్నట్నుంచి పిల్లలు ఏమీ తిన్లేదే... వాళ్ళను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందే... బియ్యముంటే ఇవ్వవే...!" బ్రతిమలాడుతోంది పార్వతమ్మ.
    
    "బియ్యమైతే లేవుగానీ... కానీ అన్నం మిగిలింది పార్వతమ్మా! సరిపోతుందో లేదో మరి... సర్దుకుని తినండి..." చేతిలోని గిన్నె తీసుకుని మిగిలిన అన్నం దానిలో కొంచెం పచ్చడి వేసి పార్వతమ్మ చేతిలో పెట్టింది భారతి.              

    
    కృతఙ్ఞతతో కళ్ళు తడిసిపోయాయి. గబగబా గిన్నె తీసుకుని ఆత్రంగా ఇంటివైపు నడిచింది పార్వతమ్మ. పిల్లలిద్దర్నీ నిద్రలేపి ఆ అన్నాన్నే ముద్దలుగా కలిపి తినిపించింది. మంచినీళ్ళు తాగి ఇద్దరూ పడుకున్నారు.
    
    వాళ్ళిద్దరూ తినగా ఏమీ మిగల్లేదు గిన్నెలో! అసలు వాళ్ళకైనా సరిపోయిందో లేదో...!
    
    బిందెలో నీళ్ళుతాగి ఒక పక్కకి ఒరిగింది పార్వతమ్మ. ముసురుపట్టిన నాటినుంచీ సరిగా నోట్లోకి ముద్దే పోలేదు. కడుపంతా ఖాళీగా ఉంది. దానికి తోడు తిరిగి తిరిగి రావడం చేత కాళ్ళనొప్పులతో పాటు నిలువెల్లా నీరసం ఆవరించింది.


* * * 

    
    "పోస్ట్..."

    
    "పోస్ట్... పోస్ట్"

    
    "ఏవండోయ్... పోస్టని అరుస్తుంటే వినబడ్డం లేదూ... ఏమీ పట్టనంత్లు కూర్చుంటారు. ఒక్కచేతిమీద పనులన్నీ చేసుకోలేక చచ్చిపోతున్నాను... వంటింట్లోంచి వసంత సుప్రభాతం మొదలైంది.
    
    "వెళ్తున్నా లేవే..." లేచాడు రాజేష్. ఉత్తరం తీసుకుని లోపలికి వస్తుంటే కొంగుతో చేతులు తుడుచుకుంటూ వసంత ఎదురుగా వచ్చి "ఎక్కడి నుంచండీ ఉత్తరం...?" ఆతృతగా అడిగింది.
    
    "అమ్మ దగ్గర్నుంచి...!"                                  
    
    అంతే అరక్షణం క్రితం కలువల్లా విచ్చుకున్న కళ్ళు... ఎండదెబ్బ తగిలినట్లు ఒక్కసారిగా కిందికి వాలిపోయాయి.  

    
    "మళ్ళీ ఏమొచ్చిందో...! ఇంటిమీద తాటాకు లేదు... ఒంటిమీద కప్పుకోవడానికి బట్టల్లేవు... తింటానికి తిండిలేదు... అంటూ ఎప్పుడూ బీద అరుపులే... దిక్కుమాలిన సంత..." కడుపులోని అక్కసంతా మాటల్లో వెళ్ళగక్కింది వసంత.

    
    "ఛీ... ఛీ... మళ్ళీ మొదలుపెట్టావా. కాసేపన్నా మామూలుగా ఉండడం చేతకాదా నీకు...?" కోపంతో రాజేష్ కళ్ళు ఎర్రబడ్డాయి.                                                      

    "అవును మరి. నాకు మామూలుగా ఉండడం ఏం చేతనన్వుతుంది. మీ దగ్గరనుంచి నేర్చుకుంటాలే. పెళ్ళయినప్పటి నుంచీ ఇంతే, ఏనాడన్నా... నా మాట విన్నారా? పెట్టారా? ఎప్పుడూ మా అమ్మ, మా తమ్ముళ్ళు... ఇవేగా మీ మాటలు... నా మాటలు ఎప్పుడైనా పట్టించుకున్నారా...?" చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంది వసంత.                

    
    "మరీ అంత బుద్ధి లేకుండా మాట్లాడకు వసంతా... ఇంటికి పెద్దవాడిని ఆ మాత్రం బాధ్యత లేదా నాకు? ఇది అమ్మ చెయ్యనంటే నాకు వచ్చిన నాన్న ఉద్యోగం. నా సంతంగా సంపాదించింది కాదు...." ఆవేశంతో రాజేష్ ఒళ్ళు కంపించిపోతోంది.         
    "సొంతగా సంపాదించుకునే తెలివితేటలే వుంటే పరిస్థితులు ఇలా ఎందుకు తగలబడతాయి... ఖర్మ... ఖర్మ..." మాటకు మాటా ఎదురుచెప్తోంది వసంత.
    
    "..................."        

    "నిన్న వచ్చిన గాలికి బెడ్రూం కిటికీ పగిలిపోయింది. కాస్త కొత్త అద్దం వేయించండీ అని మొత్తుకున్నాను. నా మాట పట్టించుకున్నారా...?" ముక్కు చీదుతోంది వసంత.                                  
    
    "అవతల ఇల్లు లేక వాళ్ళేడుస్తుంటే... నీకు బెడ్రూం కిటికీలు కావాలా...? బుద్ధుండా నీకసలు...? ఛీ...?"        

    
    "మీ సంగతి తెలిసి తెలిసి... మీతో మాట్లాడాను చూశారూ అదీ నేను చేసిన తప్పు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి... నాకనవసరం...!" బెడ్రూం తలుపు ధడేలున మూసుకుంది.        
    
    ఈసారి కూడా అమ్మకి డబ్బులు పంపించడం కుదరదనే విషయం అర్థమైంది రాజేష్ కి. ఒకవేళ పొరపాటున పంపిస్తే ఏం జరుగుతుందో ఇంతకుముందు అనుభవమే. వంటింట్లోకి వెళ్ళి గ్లాసెడు మంచినీళ్ళు తాగి టేబుల్ ముందు కూర్చున్నాడు అమ్మకి ఉత్తరం రాయడానికి. డబ్బులు పంపిస్తానని కాదు... పంపించడం కుదరదని రాయడానికి...!


* * *

    
    తెల్లవారింది. ఊరంతా గందరగోళంగా ఉంది. వాన మిగిల్చిన విషాదం ఊరిని చుట్టుముట్టింది.             
    
    "ఏమిటే రాజమ్మ అలా పరిగెడుతున్నావ్? ఏమయింది... అంత కంగారుగా వున్నావు... ఏం జరిగింది..." కంగారుగా పరిగెడుతున్న రాజమ్మను అడిగింది చిట్టెమ్మ.
    
    ఆగి కాస్త ఆయాసం తగ్గగానే "ఏమీ లేదే... రాత్రి వచ్చిన పెద్ద వర్షానికి పార్వతమ్మకి ఏదో అయ్యిందంట... చూద్దామని వెళ్తున్నా..."                                                  
    
    "ఏదో అవ్వడమేంటే... అర్థమయ్యేటట్లు చెప్పు..." అడిగిన దానికి బదులు చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న రాజమ్మను అలాగే చూస్తున్న చిట్టెమ్మకి ఒక్కక్షణం ఏమీ అర్థం కాలేదు. రాత్రేకదా బియ్యం అడగడానికి వచ్చింది. లేవంటే తిరిగి వెళ్ళింది. ఏమై వుంటుంది...? తన ఆలోచనలకు తనకే కాళ్ళూ చేతులూ ఆడక తనూ చూడడానికి బయల్దేరింది చిట్టెమ్మ. పార్వతమ్మ ఇంటిముందు గంభీరంగా నుంచున్న జనాన్ని చూసిన చిట్టెమ్మ మనసు ఏదో కీడు శంకించింది. భయపడుతూనే వారిని దాటుకుని ముందుకు వెళ్ళిన చిట్టెమ్మ అక్కడి దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది.

    
    పిల్లలమీద తన పమిట కొంగును కప్పిన పార్వతమ్మ రాత్రంతా చలికి వణకడం వల్ల అలాగే తన ప్రాణాలు కోల్పోయింది. పడుకోవడానికి చోటులేక కూర్చున్నది కూర్చున్నట్లే చనిపోయింది.
    
    వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ దృశ్యం చూసి మౌనంగా దు:ఖించసాగారు. లేవని తల్లివైపు దీనంగా చూస్తున్న పిల్లలిద్దరినీ ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు వారికి. రాత్రి సజీవంగా తమ ఇంటికి వచ్చిన పార్వతమ్మ తెల్లవారేసరికి ఇలా నిర్జీవంగా మారడం జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు.
    
    కొడుకు నిర్లక్ష్యం చేసినా ఎన్నో తంటాలు పడి సంసారాన్ని నెట్టుకు వచ్చిన పార్వతమ్మ ఉసురు మృత్యు రూపంలో ఈ ముసురులో కలిసిపోవడంతో అందరూ శవం వైపు దీనంగా చూడసాగారు.


(నవ్య వీక్లీ నవంబర్ 28, 2012 సంచికలో ప్రచురితం) 
Comments