నైజం - పర్కపెల్లి యాదగిరి

 
   
కుక్కపిల్ల అరుస్తూ ఉన్న శబ్దానికి మెలుకువ వచ్చింది శర్మకు. పడుకొనే ఒళ్ళు విరుచుకుంటూ ఆవలింత తీశాడు. 
   
    గోడ గడియారం రెండు గంటలు కొట్టింది.
    
    కుక్కపిల్ల దయనీయంగా అరుస్తోంది. తెరలు తెరలుగా మూలుగుతోంది. అప్పుడప్పుడూ రాగాలు తీస్తోంది.
    
    'దానికి ఆకలేస్తున్నట్టుంది పాపం' అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళి పాలకోసం వెతికాడు. గిన్నె ఖాళీగా ఉంది. మజ్జిగైనా పోయొచ్చు అనుకొని పెరుగుకోసం చూశాడు. అది కూడా లేదు.
    
    కుక్కపిల్ల అరుస్తూ ఉంటె శర్మగారి హృదయం తల్లడిల్లి పోతోంది. ఏమి చేయాలో బోధపడక ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
        
    .....
    
    నిన్నటి సాయంకాలం...
    
    పడమటి దిక్కు చీకట్లు ఆవరిస్తూ ఉంటే, తూర్పు దిక్కు నిండు చంద్రుడు, నింగిని చీల్చుకుంటూ వెన్నెల కిరణాలతో పుడమిని స్పృశిస్తూ ఉన్నాడు. వేపపూల పరిమళం గుబాళిస్తోంది. చెట్లపై పక్షులు సందడి చేస్తూ ఉన్నాయి. పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు ఇళ్ళకు చేరుకుంటున్నారు. పున్నమి కాంతిలో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు.
    
    శర్మ మోటరుసైకిలుపై మూల తిరుగుతూ ఉంటే, ఇంటి పక్కనే ఉండే సాంబయ్య వీధి మలుపున ఎదురుపడి నవ్వాడు. తలపై గడ్డిమోపు కూడా ఉంది.

    "సారూ... ఎక్కడిదో కుక్కకూన, పొద్దటి సంది నా ఎనుకంటే తిరుగుతంది" అన్నాడు సాంబయ్య. అతని వెనకే కుక్కపిల్ల పరుగెడుతూ వస్తోంది.

    "పూర్వజన్మ బంధం అయ్యుంటుంది, ముద్దుగా ఉంది పెంచుకో" అన్నాడు శర్మ,

    "అంతేనంటవా సారూ..."

    శర్మ ఇంటికి చేరుకున్నాడు.

    కాళ్ళూ చేతులూ ముఖం కడుగుకొని టీ తాగుతూ గద్దెపై కూర్చున్నాడు శర్మ.

    అప్పుడే సాంబయ్య గడ్డిమోపు పందిరి మీద వేస్తున్నాడు.

    "సాంబయ్య. కుక్కపిల్ల మగదా... ఆడదా...” అడిగాడు శర్మ

    తువ్వాలు దులిపి ముఖం తూడ్చుకుంటూ "మొగదే సారూ... మొగదే. ఇర్వైగోర్లున్నయి. ఇంటికి మంచిదంటరు నిజమేనా సారూ...” అన్నాడు సాంబయ్య.

    "ఎక్కడిదా... అడ్డమైన కుక్కపిల్ల, ఎల్లగొట్టు ఎల్లగొట్టు" గయ్మంటూ అరిచింది సాంబయ్య భార్య రాజవ్వ.

    "అరే. ఉండనీతీ... ఏమంటంది, పొద్దటి సంది కాల్లల్ల తిరుగుతుంది.

    "ఏహే. ఎల్లగొట్టు. ఎందుకూ... అంత ఏర్గుతది ఉచ్ఛపోస్తది" అంటూనే కుక్కపిల్లను కాళ్ళతో వాకిలి బయటకు తోస్తోంది.

    "అరే. నీయక్క! నీకేమన్న పిచ్చిగిట్ల పట్టిందా... కుక్కంటే మల్లన్న దేవుడు కాదూ, కాల్లతోటి తంతారూ... పాపం గాదే."

    భార్యాభర్తల మాటల్లో కుక్క అరుపుకూడా మిళితమై పోయింది.

    "రాజవ్వ... ఉండనీయమ్మా... మనింట్లో కలిగింది వేస్తే అదే బతుకుద్ది, పాపం ఇంక పాలు కూడా మరవనట్టే ఉంది” అన్నాడు శర్మ,

    "ఆ... మంచిగనే చెప్తానవు సారూ... మాకే తిననీకి గతిలేదు’ అంది రాజవ్వ.

    "అరే... ఉండనియ్యే. నీకు పున్యముంటదీ... పెద్ద పెద్ద కుక్కలు ఆయింత దాన్ని కొరికి సంప్తయి..." అంటూ కుక్కపిల్లని చేతుల్లోకి తీసుకున్నాడు సాంబయ్య.

    "నా మాట చెల్లనిత్తావూ." అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజవ్వ

    సాంబయ్య కుక్కపిల్లను నిమురుతూ "కుక్కపిల్ల మాత్రం ముద్దుగున్నది, పురాంగ తెల్లగున్నదీ... షెపులు సుతం ముకం మీదికే వాలి ఉన్నయి" అన్నాడు.

    "అవును బాగుంది, పొలం దగ్గర్కీ ఇంటికీ రాత్రింబగల్లు తిరుగుతూ ఉంటావు, నీకు తోడుగా ఉంటుంది" అన్నాడు శర్మ.

    "మా రాజవ్వ ఏంజేస్తదో..." అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు సాంబయ్య.
    .....

    గడియారం మూడు గంటలు కొట్టింది.

    కుక్కపిల్ల అరుస్తూనే ఉంది.

    శర్మగారు లైట్ వేసి బయటకు వచ్చాడు.

    సాంబయ్య ఆవుపాలు పితుకుతూ ఉన్నాడు శర్మను చూడగానే "కుక్కపిల్లకు ఆకలైతానట్టున్నది సారూ...”

    "అవును పాపం... చాలా సేపటి నుండి అరుస్తా ఉంది, పాలు కుక్కపిల్ల కోసమేనా" అన్నాడు.

    "అబ్బో. నీ ఆరాటం పాడుగానో.. దిక్కుమెల్లె కుక్కపిల్లకు పాలు పిండి మరీ పోత్తున్నవా..."  దీర్ధాలుతీస్తూ అంది రాజవ్వ. ఆమె మాటలు చీకట్లో ప్రతిధ్వనించాయి.

    "అరే... షీకట్ల గంతగనం ఒర్రుతానవేందే. అందరు లేత్తరు."

    “నీ ఇష్టం ఏమన్న షేస్కో...” అంటూ ఇంట్లోకి వెళ్ళింది.

    "తల్లిదగ్గరుంటె పొద్దుకు మూడుమాట్ల జీకు" అంటూ కుక్కపిల్ల ముందు పాలగిన్నె పెట్టాడు సాంబయ్య.

    అది ఆబగా తాగేస్తోంది, ఏమేమో సణుగుతోంది కూడా.

    "పాపం బిడ్డ మస్తు ఆకలితోటుంది"

    శర్మగారు ఆవలింత తీస్తూనే "సాంబయ్యా. నిదురొస్తోంది. ఆఫ్‌డే స్కూలు, ప్రొద్దున్నే పోవాలి" అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

*  *  * 

    రాజవ్వ అలసటతో వచ్చి అరుగుపై కూర్చుంది. 

    కుక్క తోక ఆడిస్తూ వచ్చింది "కుయ్ కుయ్" మంటూ రాజవ్వ భుజాలపై ముందటి కాళ్ళు వేసి చెవివద్ద నాకింది, వెనుకకూ ముందుకూ కదులుతూ వీపుతో తడిమింది. 

    "లే! కుక్కలే..." తోసేసింది. "కట్టేదిరా" అంటూ అటూ ఇటూ కర్ర కోసం వెతుకుతున్నట్టు నటించింది. కుక్క దూరం జరిగి వెల్లకిలా పడుకొని పొట్టచూపిస్తూ తోక ఆడిస్తూ అరుస్తోంది. 

    "ఏందో..." నవ్వుతూ "ఆకలిగిట్ల ఐతాందా ఏందీ, ఓ పోరీ... గింతంత బువ్వపెల్ల తెచ్చి కుక్కకెయ్యి" కేకేసింది రాజవ్వ. 

    "ఆగు, నేను పండు తింటున్న ఆగు, తిన్నంక తెత్త అంది కూతురు సీతాఫలం గింజలు ఉమ్ముతూ.

    కుక్కమళ్ళీ రాజవ్వ వెనుక చేరింది

    “అరే... అడ్డమైన కుక్కో...”

    ముందుకు వచ్చి తలవంచి కూర్చుంది కుక్క

   "అవ్వో... దీని గావురం పాడుగానో... దువ్వాల్నంట" అంటూ తలపైనుండి తోక వరకు నిమురడం మొదలుపెట్టింది.

    కుక్క కళ్ళు మూస్తు తెరుస్తూ మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తోంది.

    రాజవ్వ మేకల్ని, కోళ్ళనూ పెంచుకుంటుంది.

    రాజవ్వ కుక్కకు రాజూ అని నామకరణం చేసింది. అయినా దాన్ని వీధిలో వాళ్ళెవరూ రాజూ అని పిలవరు.

    రాజవ్వ కుక్క, రాజవ్వ మేకలు రాజవ్వ కోళ్ళు, రాజవ్వ మొగుడూ, రాజవ్వ బిడ్డ అంటూ పిలుస్తారు. ఆఖరికి శర్మను కూడా పేరువెట్టి ఎవరూ సంబోధించరు. రాజవ్వ ఇంటి పక్క సారూ అంటారు.

    రాజవ్వ "రాజూ"... అంటూ కేకేసిందంటే చాలూ ఏ వీధిలో ఉన్నా ఆఘమేఘాల మీద పరుగెత్తుకు రావాల్సిందే.

    రాజవ్వ కూతురు అన్నం తెచ్చి కుక్క తినే గిన్నెలో వేసింది. అయినా కుక్క గిన్నె వద్దకు పోవడం లేదు.

    "రాజూ... బువ్వ తినుపోరా...” అంటూ కుక్కను అన్నం వైపు తోసింది. కుక్క అన్నం తింటోంది. 

    రెండ్రోజులు గడిచాయి. 

    తూర్పు దిక్కు ఆకాశం ఎరుపెక్కుతోంది. పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశమంతా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ధరణీమాత మంచు ముసుగు ధరించి ఉంది. 

    రాజవ్వకోళ్ళను అప్పుడే వదిలి పెట్టింది. రాత్రంతా గూళ్ళలో ఉన్న కోళ్ళు స్వేచ్ఛగా రెక్కలు విప్పకొని నేలపై పరుగెడుతున్నాయి. మేకపిల్లలు అరుస్తూ గెంతులు వేస్తున్నాయి. పశువులు మేతకు తరలిపోతున్నాయి. జనం పొలం పనులకు వెళ్తూ ఉన్నారు. బాలభానుడు తన లేలేత కిరణాలతో సకలచరాచర జీవకోటిని మృదువుగా ముద్దాడుతున్నాడు. 

    శర్మగారు వేపపుల్ల నములుతూ ఎదురుగా గల డాబా వైపు వస్తూ ఉన్నాడు. 

    ప్రతి రోజు దానిపైకి ఎక్కి నీరెండలో నిలబడ్డం అలవాటుగా మారింది అతడికి. ఆ ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఆపేసారు. చుటూ కాంపౌండు కట్టారుకాని ఇంకా గేట్ వగైరా పెట్టించలేదు. లోనికి ప్రవేశించే సరికి కుక్క మూలుగు వినబడింది. అటువైపు చూసాడు. 

    "అయ్యో... రాజవ్వా... కుక్క సెప్టిక్ టాంక్‌లో పడింది. తొందరగా రా... చచ్చిపోద్ది పాపం" కేకేసాడు శర్మ.

     రాజవ్వ వాకిలి ఊడుస్తోంది. విననట్టే నటిస్తోంది.

    శర్మ మళ్లీ కేకేసాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది.

    ఈ మధ్యనే సెప్టిక్ టాంక్ ప్లాస్టరింగ్ చేశారు. సిమెంట్ ఫిక్సింగ్ కావడం కోసం దాని నిండా నీళ్ళు నింపారు. దానిపై ఇంకా మూతకూడా వేయలేదు. కుక్క అందులో పడి ఈదుతోంది. తలమాత్రమే బయటపెట్టి టాంక్ అంతా తిరుగుతోంది.

    శర్మ దానిని మెడపట్టి బయటకు లాగబోయాడు. అది అతని చేయిని కరిచే ప్రయత్నం చేస్తోంది. దానిని ఎలా బయటకు తీయాలో అర్థం కావడం లేదు. శర్మలో ఆందోళన ఎక్కువైయ్యింది. 

    రాజవ్వ బొగ్గు నములుతూ బయటకు వచ్చింది.

    "రాజవ్వా. కుక్క సెప్టిక్ టాంకిలో పడిపోయింది. బయటకు తీద్దువుగాని రా."

    నోట్లో వేలుపెట్టి పళ్ళు తోముతోంది నిర్లక్ష్యంగా...

    శర్మ మళ్లీ చెప్పాడు.

    "ఆ... పడితే పడన్తీ"  ఏమి పట్టనట్టుగా అంది.

    "అరే... ఏంటమ్మా... అట్ల మాట్లాడ్తాన్నావ్... సాంబయ్య లేడా...” గద్దిస్తూ అన్నాడు.

    "గట్లనే మాట్లాడ్తరు" అంటూ బొగ్గు ఉమ్మింది.

    'ఏం మనిషి. పిచ్చెక్కిందా ఏంటీ' అనుకుంటూ కుక్కను  "రాజూ" అంటూ పిలుస్తూ మళ్ళీ బయటకు లాగే ప్రయత్నం చేసాడు. అలాగే చేయిని కరిచేందుకు వస్తోంది. 
    
    కుక్కకు ఆయాసం వస్తోంది. ఈదలేక మునిగిచనిపోయేలా ఉంది. అతని మనస్సంతా తల్లడిల్లిపోతోంది. "రాజవ్వా... నువ్వు రావమ్మా.. నువ్వుంటే కుక్క ఏమనదూ... అన్యాయంగ కుక్క చచ్చిపోతుంది" బతిమాలుతున్నట్టుగా అన్నాడు. 

    "ఆ కుక్క అండ్లనే సావాలే. వాసన లేవాలే. ఆ ఇంటి ముండ కావ్రం ఒంగాలే, అది దాని ఊరికెల్లి రావాలే. మున్సిపాల్లోల్లకు పైసలిచ్చి గుంజిపియ్యాలే. నేను ఇన్నాండ్లు దాని ఇంటికి కావలికాస్తె ఏర్పడ్లేదు" అంది గొంతు పెంచుతూ. 

    "రాజవ్వా. వాళ్ళ మీద కోపంతో ప్రాణంగా పెంచుకున్న కుక్కను చంపుకుంటమా... అయినా కుక్క చచ్చిపోతే మనకేగద చెడు వాసన వచ్చేది"

    "ఒస్తే ఒచ్చే. నీకెందుకు సారూ... నా కుక్క నా ఇష్టం, నేను దాన్ని సంపుకుంట, సాదుకుంట నీకెందుకు" అంది. 

    నోట్లోంచి బొగ్గు నమిలిన ఉమ్మి కిందవడకుండా ముఖం గాలిలోకి ఎత్తి.. వంకర చూపులు చూస్తూ ఉంది రాజవ్వ. 

    "మేక పిల్ల నీళ్ళల్లో పడితే ఇట్లనే వదిలేస్తవా..."

    "ఎందుకు సూత్త"
    "ఎందుకు చూస్తవ్... దాన్ని అమ్మకుంటే డబ్బులొస్తయి కదా...”
 
    "అవును మరీ. కుక్క సత్తె ఉంకోదాన్ని సాదుకుంటం... ఊరుమిది కుక్కలు పున్యానికే దొర్కుతయి..." అంది రాజవ్వ.

    కుక్క అలిసి పోతుంది. దాని ముక్కులోంచి రక్తం కారుతోంది. చావు భయం దాని ముఖంలో కనబడుతోంది. 

    "రాజవ్వా. నీకు దండం పెడుత... రా... అమ్మ... కుక్క చచ్చిపోద్ది" దయనీయంగా అన్నాడు శర్మ.

    "ఏంది సారూ... నీకు బడికి టైం ఐతలేదా... ఏమో పొద్దున్నె నా ఎంబడి వడ్డవు"

    "రాజవ్వా... నువ్వు మనిషివా రాక్షసివా..." శర్మకు ఆవేశం ఆగలేదు. 

    బొగ్గు ఉమ్మింది రాజవ్వ. 

    "నువ్వెవనివి అయ్యా.. మాటలు అద్దుమీరుతానయి. మంచిగుండది మరీ"

    ఆవేశం తగ్గించుకొని "జంతువులను పెంచుకునే అధికారమే ఉంటది. కాని సంపే అధికారముండది. పోలీసులు జేల్లో పెడుతారు" అన్నాడు మృదువుగా. 
    "ఆ ఏసిండ్లుతీ... బాంబులు వెట్టి మన్సుల సంప్తనే దిక్కులేదు ఈ దేశంల."

    రాజవ్వలో ఏమాత్రం ఆందోళనలేదు. నీలాంటి మనిషిని నేనింత వరకు చూడలేదు” 

    కుక్క నలువైపులా ఈదుతోంది. శర్మ ముఖంలోకి చూస్తోంది. "చస్తూ ఉంటే చూస్తారా" అంటూ కుక్క ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. 

    భార్యను కేకేసాడు. శర్మగారు కొడుకూ భార్యా పరుగెత్తుకొచ్చారు. 

    "రాజవ్వా. నీకు పిచ్చిగిట్ల పట్టిందా...” అంది శర్మ భార్య. 

    నానా మాటలంటోంది రాజవ్వ. ఇరుగూ పొరుగు జనం చూస్తున్నారే తప్ప కల్పించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాజవ్వతో పెట్టుకోవడం ఎవరి తరమూకాదు. అకారణంగా కొన్ని నెలలు బూతులు తిట్టిపోస్తుంది. 

    ఈది ఈది కుక్క శక్తి అంతా తరిగిపోయింది. మధ్య మధ్య మునుగుతూ లేస్తూ ఉంది. 

    రాజవ్వ నోటి విశ్వరూపంతో వీధంతా మారుమ్రోగిపోతోంది. ఇరుగుపొరుగు జనం. కలుగుల్లోంచి ఎలుకల్లా బయటకు వచ్చి టీవీలో సీరియల్ చూస్తున్నంత ఉత్కంఠతో చూస్తున్నారు. 

    "ఆ కుక్కను మీరు బయటకు తీయాలే... ఇగ మీకు మాకే ఉన్నది లొల్లి. వాడల కెల్లి ఇల్లు అమ్మకొని పోవాలే... సారు గీరు ఏం సూడ... ఏమనుకుంటాండ్రో..." చూపుడు వేలు ఊపుతూ హెచ్చరించింది రాజవ్వ. 

    కొద్దిక్షణాలైతే కుక్క ప్రాణం పోయేలా ఉంది. శర్మగారు చూస్తూ ఉండలేక పోతున్నాడు. అతడికి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. 

    "డాడీ. నేనిప్పడే వస్త" అంటూ కొడుకు పరుగెత్తాడు. 

    రాజవ్వ ఇంటికి ఎదురుగా సరోజన అనే ఒకావిడ ఇల్లు కట్టుకుంటోంది. ఆమె నివాసం సిద్దిపేట నుండి ముప్పై కిలోమీటర్ల దూరం ఉండే పల్లె. ఆమె ఇల్లుకట్టుకునే సమయంలో సిమెంటు, నిర్మాణ పనిముట్లు వగైరా దాచుకునేందుకు రాజవ్వ ఇల్లునే అద్దెకు తీసుకుంది. సిమెంట్ ప్లాస్టరింగ్ అయిన తర్వాత గోడలకు రాజవ్వే నీళ్ళు పట్టింది. అందుకు గాను జీతం డబ్బులు కూడా పుచ్చుకొంది. రాజవ్వ ఇంట్లో బోరూ కులాయి ఏమిలేక పోవడం వల్ల సరోజన ఇంట్లోంచే నీళ్ళు వాడుకునేది. కొన్ని కారణాల వల్ల ఇంటి నిర్మాణం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ ఇంటి తాళం చెవులు నీళ్ళు వాడుకునేందుకు రాజవ్వే ఉంచుకుంది. నెలనెలా కరెంటు బిల్లు కూడా సరోజనే చెల్లించేది. 

    రాజవ్వ ఇదే అదనుగా భావించి తన మేకలను, ఎడ్లను సరోజన ఇంటిముందే కట్టివేసేది. ఇళ్ళంతా గొడ్లచావిడిలా తయారు చేసింది. ఈ విషయంలో సరోజనకు రాజవ్వకు పెద్ద గొడవ జరిగింది. 

    శర్మ కొడుకు బాత్ రూం డోర్ పట్టుకొచ్చాడు. దానిని సెప్టిక్ టాంక్ నీళ్ళల్లోకి ఏటవాలుగా దింపారు. కుక్క మెల్లగా దానిపైకి ఎక్కి ఒడ్డుకు చేరింది... 

    అది చూసి రాజవ్వ వీరావేశంతో ఊగిపోయింది. నోరు పెంచింది.  

    కుక్క రాజవ్వ దగ్గరకు పరుగెత్తింది... కళ్ళు మిటకరిస్తూ... తోక ఊపుతూ.... మూలుగుతూ ఆమె పైకి లేస్తూ ఏమేమో... అరుస్తోంది. రాజవ్వ పాదాలు నాకుతోంది. కాళ్ళ దగ్గర కూర్చుని వీపుతో నిమురుతోంది.

    "లే. అడ్డమైన కుక్క నాశనం గానూ. ఇది జెయ్యవట్టి మంది తోని మాటలు పడ్తి. సావక ఎందుకు బత్కినవే..." అంటూ... చీపురుతో
కొట్టింది కుక్కను. 

    అయినా దూరం పోయినట్టే పోయి మళ్ళీ వస్తోంది.

*  *  * 

    రోజులు గడుస్తున్నాయి.

    ఆదివారం...

    మధ్యాహ్నం వేళ. కుక్క మొరుగుతున్న శబ్దం వినబడుతుంటే శర్మ బయటకు వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. అతనికి నోటిమాట రావడం లేదు. గుండె వేగం పెరిగింది. కాళ్ళలో వణుకు మొదలైయ్యింది. ఏమి చేయాలో తోచడం లేదు.

    రాజవ్వ పందిరికింద నేలపై నిద్రపోతోంది. ఆమె కాళ్ల దగ్గర్లోనే త్రాచుపాము పడగవిప్పి ఉంది. కాలు కదిలిస్తే కాటేసేలా ఉంది. కుక్క దాని ఎదురుగా నిలబడి మొరుగుతోంది. కాళ్ళతో నేలపై కొడుతోంది. పాము వెనక్కి తగ్గడం లేదు.

    "రాజవ్వా..." అంటూ పిలిచాడు శర్మ

    ఆమె నిద్ర నుండి మేల్కోవడం లేదు. పాము పడగ పైకి లేపుతోంది.

    అయినా కుక్క వెనక్కి తగ్గడం లేదు. మొరుగుతోంది. పాము వెనక్కి తగ్గడం లేదు.

    శర్మకర్ర పట్టుకొని దూరంగా నిలబడి నేలపై కొట్టాడు. శర్మవైపు చూసి పాము పడగదింపి వెనక్కి తిరిగింది.

    "రాజవ్వా. అంత మొద్దు నిద్రనా... నీ కాళ్ళ దగ్గర్కి పాము వచ్చింది" అన్నాడు శర్మ

    రాజవ్వ హఠాత్తుగా లేచి కూర్చుంది.

    త్రాచు పామును కుక్క తరుముకుంటూ వెళ్ళిపోతూంది.

    "రాజవ్వా. కుక్క చూడక పోతే.. ఈ రోజు నీ ప్రాణం పోవు" అన్నాడు శర్మ

    రాజవ్వ పాముని కుక్కని చూస్తోంది.

    "రాజూ..." అంటూ కేకేసింది.

    కుక్క పరుగెత్తుకొచ్చింది. రాజవ్వ ఒడిలో వాలిపోయింది.

    కుక్కను గట్టిగా కౌగిలించుకుని రాజవ్వ బోరున ఏడ్చింది.
Comments