నాకొక కుటుంబం కావాలి - ఇలపావులూరి మురళీమోహనరావు

    ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆధ్యాత్మిక పత్రిక తిరగేస్తున్న మంగమ్మ దృష్టి విచిత్రంగా కనిపించిన ఒక ప్రకటన మీదికి మళ్లింది. ఎనభై సంవత్సరాల వృద్ధుడి ఫోటో కింద ఈ విధంగా రాసుంది.     "నాకొక కుటుంబం కావాలి. అయిన వారందరిని పోగొట్టుకుని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, మృత్యుముఖంలో ఉన్న నాకు...ఈ చరమాంకంలో ఆదరంగా చూసే ఒక కుటుంబం కావాలి. ఆస్తిపాస్తులు లేని ఈ దీనుడికి ఆప్యాయతానురాగాలు లభించే కుటుంబ వాతావరణం కావాలి. దయ గల తల్లులెవరైనా నన్ను సంప్రదించండి.  
- ప్రసాదరావు, విశాఖపట్నం"
    ప్రకటన చదివిన మంగమ్మ మనసు వికలమైంది. వృద్ధుడి ఫోటోను పదేపదే చూసింది. పేపర్ చదువుతున్న కొడుకు ప్రసాదుకు పత్రికిచ్చి ఆ ప్రకటన చూడమంది. దాన్ని చది ప్రసాదు పకపక నవ్వాడు. "ఎవరమ్మా పిచ్చివాడు? కన్నవారినే వృద్ధాశ్రమాలకు తరిమేస్తున్న ఈరోజుల్లో ముక్కూ ముఖం తెలియని ముసలాడిని, అందునా రోగిష్టిని, ఎవరు ఇంటికి తీసికెళ్లి ఆదరిస్తారు?" అన్నాడు.

    "అత్తయ్యగారూ... కాఫీ..." మూడు కప్పులతో వచ్చింది సుగుణ. మంగకు, ప్రసాదుకు చెరోటిచ్చి తానూ కూర్చుంది. పత్రికను భార్యకిచ్చి చదవమన్నాడు ప్రసాదు. దాన్ని చదివి సుగుణ కూడా భర్త అభిప్రాయాన్నే వెలిబుచ్చింది.
    మంగ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది.     "మనం ఒకసారి వెళ్లి ఆయనను చూసొస్తే ఎలా ఉంటుంది?" అడిగింది కొడుకును.
    "అమ్మా... ఇటువంటి వాళ్లు ప్రపంచంలో లక్షల మంది ఉంటారు. ఆయనను చూసిరావాల్సిన అవసరం మనకేంటి?" అన్నాడు ప్రసాదు.

    "ఇటువంటి వారిని చూసినపుడు కడుపులో ఒకటే బాధగా ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. పాదాల పారాణి తడి ఆరకముందే భర్తను కోల్పోయాను. అప్పటికే నువ్వు కడుపులో పడ్డావు. అందుకే ఆత్మహత్యకు తెగించలేకపోయాను. నీ కోసమే బతుకుతూ పాతిక రూపాయల కోసం పది మంది ఇళ్ల్ల్లో పాచిపనులు చేస్తున్నప్పుడు, ఇంటి యజమానురాళ్లు...నా సాటి స్త్రీలు... నా వయసు కన్నా చిన్నవాళ్లు...నన్ను ఛీ..ఛీ..అని కసురుకున్నప్పుడు...తల్లిదండ్రులకు దూరమైనందుకు ఎంత ఏడ్చానో తెలుసా? నన్ను కన్నకూతురిలా ఆదరించి, మహారాణిలా చూసే వాళ్లుంటే నాకీ ఖర్మ తప్పేది కదా అని ఎంత బాధ పడ్డానో తెలుసా?" మంగమ్మ గొంతు జీరబోయింది.
    ప్రసాదు కళ్లు చిప్పిల్లాయి. "ఆ భయంకరమైన కాలాన్ని ఇంకా తల్చుకోవడం దేనికి?" అన్నాడు.     "కాలం విసిరే పాశం ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క దశలో వస్తుంది. వయసు, ఓపిక ఉన్న కాలంలో దాని ప్రభావాన్ని భరించగలం కానీ...పండు రాలిపోతున్న దశలో ఆ బాధను భరించడం చాలా కష్టం. తల్లిదండ్రులు, అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు లాంటి ఏ అనుబంధానికి నోచుకోకుండానే ఏభై ఐదేళ్ల జీవితం గడిచిపోయింది. నా తండ్రి వయసు వారికి ఏదైనా సేవ చేసి జన్మ చరితార్థం చేసుకోవాలని మనసు తహతహలాడుతున్నది" కళ్లు తుడుచుకున్నది మంగమ్మ.     ఆ వయసులో కన్నతల్లి కంట నీరు చూసి విలవిలలాడిపోయాడు ప్రసాదు. తల్లి చేయిని తన చేతుల్లోకి తీసుకుని "అమ్మా...నీ సేవలు అందుకునే భాగ్యం ఆ వృద్ధుడికుందేమో. కానీ...లోకం ఏమనుకుంటుందోనని..." అన్నాడు.     "ఇవాళో రేపో రాలిపోయే ముదివగ్గుకు ఇంత ముద్ద వండి పెట్టడం తప్పు అని లోకం అంటుందా? ఒకవేళ మా నాన్న ఉన్నాడనుకుందాం. మనం ఆదరించకుండా ఉండగలమా?" కొంచెం ఆశగా అన్నది మంగమ్మ.
    సుగుణ వంక చూశాడు ప్రసాదు.

    "ఎప్పుడైతే మీ ఇంటి కోడలుగా వచ్చానో ఆనాడే మా అమ్మను మర్చిపోయాను. అత్తయ్యా...మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మతో పాటు తాతయ్య కూడా ఉన్నారనుకుంటాను" అన్నది సుగుణ.
    ఆ మాటలకు పులకించిపోయింది మంగమ్మ. "ఇదే నా కూతురైతే నా మాటను ధిక్కరించేదేమో? నువ్వు నా కూతురివి కాదమ్మా...కోడలివి... ఈ ఇంటి భవిష్యత్తువు" ఆప్యాయంగా కోడలిని హత్తుకుంది.

* * *
    విశాఖపట్నం స్టేషన్లో దిగారు మంగమ్మ, ప్రసాదు. వృద్ధుడి చిరునామా వెతుక్కుంటూ ఆటోలో వెళ్లారు. నగర శివార్లలో ఉందా ప్రాంతం. ఓ పాత కాలపు డాబా ముందాగింది ఆటో. ఆటో దిగారిద్దరూ. అటుగా వెళ్తున్న ఓ పదేళ్ల పిల్ల వీరిని చూసి దగ్గరకొచ్చింది. "ఎవరు కావాలి?" అడిగింది.     "ప్రసాదరావుగారిల్లు ఇదేనా?" అడిగాడు ప్రసాదు.     "తాతగారి కోసమా? ఇదే... లోపలకు రండి" అని గేటు తీసింది పిల్ల. ఆ పిల్ల వెంట లోపలకు నడిచారిద్దరూ.
    "తాతా...తాతా. నీకోసం ఎవరో వచ్చారు" కేకవేసింది పిల్ల.

    వంటగదిలో కుంపటితో కుస్తీ పడుతున్న ప్రసాదరావు దగ్గుతూ ఆయాసంతో మెల్లిగా వరండాలోకి వచ్చి "ఎవరూ? ఎవరు కావాలి?" అడిగాడు కనుబొమలు చిట్లిస్తూ.
    జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన వాడిలా కనిపిస్తున్న ప్రసాదరావును చూడగానే మనసు కలుక్కుమన్నది మంగమ్మకు.

    "ప్రసాదరావుగారంటే..." అడిగాడు ప్రసాదు.
    "అవును... మీరు...?" కళ్లు చికిలించి చూస్తూ అడిగాడు ప్రసాదరావు.     "మాది హైదరాబాదు. నా పేరు క్రిష్ణ ప్రసాదు. ఈవిడ మా అమ్మగారు మంగమ్మగారు. మొన్న భక్తిభావం పత్రికలో మీ ప్రకటన చూసి వచ్చాం" చెప్పాడు ప్రసాదు.     నలిపేసిన కాగితంలా ఉన్న ప్రసాదరావు ముఖం సూర్యకిరణం సోకిన కమలంలా విచ్చుకుంది. బోసినోటితో నవ్వాడు.     "అలాగా... కూర్చోండి కూర్చోండి" దగ్గు తెరనాపుకుంటూ అన్నాడు.     దుమ్ముపట్టిన నులకమంచం మీద కూర్చున్నారిద్దరూ.     "అమ్మా...ఈ వీధిలోనే రామాలయం పూజారి ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు. నా బాధ చూడలేక అతనే ఈ పని చేయించాడు. అయినా అతడి పిచ్చిగానీ ఇలాంటివి సినిమాల్లో జరుగుతాయేమోగానీ...నిజ జీవితంలో జరుగుతాయా? అయినా ఒక ప్రకటన చూసి ఇంత దూరం వచ్చారంటే ఇంకా మానవత్వం కలిగిన మనుషులు ఈ కలియుగంలో ఉన్నారనిపిస్తున్నది. ఉండండి...కాఫీ తెస్తాను" తడబడుతున్న అడుగులతో లోపలికి నడవబోతున్న ప్రసాదరావును వారించింది మంగమ్మ!     "ఇప్పుడవేం వద్దు తాతగారూ. మీరు కూర్చోండి. నేను స్టేట్‌బ్యాంకులో పనిచేస్తూంటాను. చిన్నప్పుడే నాన్నగారు పోయారు. కూలిపనులు చేసి ఎంతోకష్టపడి అమ్మ నన్ను చదివించింది. పది సంవత్సరాలక్రితం పెళ్లయింది. ఒక బాబు. ఒక పాప. మీ వివరాలు తెలుసుకుందామనుంది" అన్నాడు ప్రసాదు.

    ఒక నిముషం పాటు మథన పడ్డాడు ప్రసాదరావు. ఆ తరువాత ఏదఒ నిర్ణయానికి వచ్చిన వాడిలా గంభీరంగా చూశాడు. "బాబూ...మునిసిపాలిటీలో పనిచేసి ఇరవై ఏళ్ల క్రితం రిటైరైయ్యాను. ఏభై సంవత్సరాలు నాకు తోడు నీడగా ఉన్న ఇల్లాలు రెండు సంవత్సరాల క్రితం దైవసన్నిధికి చేరింది. ఒక కొడుకున్నాడు కానీ..." ఆగిపోయాడు.     "ఏమయ్యాడు?" అడిగింది మంగ.     "చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. అయినా దాచుకోవడానికి నాకింకేం వయసుందని? ఎవరికి భయపడాలని? స్వయం కృషితో వృద్ధిలోకొచ్చినా అంత ఎదిగిన కొడుకును అహంకారంతో దూరం చేసుసున్నాను. వాడిమీద, కోడలి మీద ఆధిపత్యం చెలాయించాలని, చెప్పుకింద తేళ్లలా ఉంచాలని ఆశించాను. ఎదిగిన పిల్లల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే ఇంగితం కొరవడి వాళ్లను చిన్నచూపు చూశాను. దాంతో వాడు విసిగిపోయి భార్యాపిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. పాతిక సంవత్సరాల పాటు వాళ్లను గురించిన సమాచారమే లేదు. మూడు సంవత్సరాల క్రితం అమెరికా నుంచి కబురొచ్చింది. వాడు అక్కడే కారు ప్రమాదంలో మరణించాడని. కన్న కొడుకు కుటుంబాన్ని నాలుగు రోజులు దగ్గరుంచుకోలేని దౌర్భాగ్యుడిని తల్లీ" భోరుమన్నాడు ప్రసాదరావు.     మంగ కళ్ల నుండి రెండు నీటి చుక్కలు రాలాయి. "మరి కూతుళ్లు లేరా మీకు?" అడిగింది.     ఆ ప్రశ్న వినగానే ప్రసాదరావు ముఖం జేవురించింది. కోపంతో కళ్లు ఎర్రబారాయి. "దాని పేరు ఉచ్చరించడం కూడా నాకిష్టం లేదు" అన్నాడు ముభావంతో.     "మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. మేం తీసుకెళ్లిన తరువాత వాళ్లు బాధపడొచ్చు. మా నాన్నను మేం చూసుకోలేమా అని రేపెపుడైనా వాళ్లొచ్చి అడిగితే మేం సమాధానం చెప్పుకోవాలి కదా?" అన్నాడు ప్రసాదు.     "ఆ...మీరు... నన్ను తీసుకెళతారా?" సంభ్రమంగా అన్నాడు ప్రసాదరావు.     "అవును...అమ్మ నిర్ణయించింది" చెప్పాడు ప్రసాదు.     "ఒక కూతురుది బాబూ...సర్వమంగళాదేవి అని అమ్మవారి పేరు పెట్టి గారాబంగా పెంచాము. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే మంచి సంబంధం చూశాం. కానీ మమ్మల్ని వంచించి ఎవడో వేరే కులం కుర్రాడిని ప్రేమించి వాడితో వెళ్లిపోయింది. దాని ముఖం కూడా గుర్తు లేదు. కొడుకు పోయిన దిగులుతో నా భార్య సంవత్సరం తిరగకుండానే కన్నుమూసింది. కొడుకు పోయినా, కూతురు పోయినా నేను మాత్రం రాయిలా పడున్నాను" కన్నీళ్లను బలవంతంగా నిగ్రహించుకున్నాడు ప్రసాదరావు.     రెండు నిముషాలు భారంగా గడిచాయి. పూజారి నారాయణశాస్త్రి వచ్చాడు. "బాబాయ్... పాలు పోసే పిల్ల చెప్పింది. ఎవరో బంధువులు వచ్చార్ట" ప్రసాదును, మంగమ్మను చూసి "వీరేనా వారు? నమస్కారమండి. నా పేరు నారాయణశాస్త్రి. ఈ వీధిలోని శ్రీ సీతారామాంజనేయస్వామి వారి దేవస్థానం అర్చకుడిని. ప్రసాదరావుగారి కుటుంబ స్నేహితుడిని. బాబాయ్ విధివంచితుడు" గలగలా అన్నాడు.     పరిచయ కార్యక్రమాలయ్యాక నారాయణశాస్త్రి కొనసాగించాడు. "బాబాయికి నాలుగు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదు తల్లీ. ఈ వయసులో కొడుకులు కోడళ్లు,కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మునిమనవళ్ల మధ్య జీవితం ఆనందంగా గడచిపోవాలని కోరుకుంటారేవరైనా. కానీ బాబాయికి ఆ భాగ్యం లేకుండా చేశాడు భగవంతుడు."     "మరి వారిని మీతో ఉంచుకోవచ్చుగా?" అడిగాడు ప్రసాదు.     విషాదంగా నవ్వాడు శాస్త్రి. "అంత అదృష్టం నాకూ లేదు బాబూ. పది సంవత్సరాల క్రితం జరిగిన ఒక బస్సు ప్రమాదంలో నా భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఆ సీతారాములే నాకు దిక్కు" అన్నాడు.     ఆ ప్రశ్న అడిగినందుకు బాధ పడ్డాడు ప్రసాదు. "క్షమించండి" అన్నాడు సిగ్గుపడుతూ.     "మృత్యువు ముంచుకొస్తుందని తెలిశాక దిక్కులేని అనాథగా మరణించిన తరువాత నా శవం స్మశానికే వెళ్తుందో కుక్కలకు ఆహారమవుతుందో తెలియని భయంకర స్థితిలో చావడాన్ని భరించలేను. పిల్లల విలువేదో నాకిప్పుడు తెలిసివస్తున్నది. కూతూరు ఎప్పటికైనా మరో ఇంటి కోడలే. కానీ దుష్టుడైనా, దుర్మార్గుడైనా కొడుకు నా వాడు. కోడలు నా ఇంటి దీపం అనే సత్యం చేతులు కాలాకనే తెలిసింది. నా పాపాన్ని భగవంతుడు క్షమించడు. నన్ను నాన్నా అని పిలిచే వారు కావాలి.నన్ను తాతా అని పిలిచేవారు కావాలి. నన్ను మామయ్యా అని పిలిచే వారు కావాలి. నలుగురి అనురాగం, ఆప్యాయతలు కావాలి. నెలకు రెండువేలు పడేస్తే వృద్ధాశ్రమాల్లో తిండి దొరుకుతుంది. కానీ...అనుబంధాలు ఎక్కడ దొరుకుతాయి?" మారుతున్న స్వరంతో అన్నాడు ప్రసాదరావు.
    "నాన్నా" ప్రసాదరావును పొదివి పట్టుకుంది మంగమ్మ అకస్మాత్తుగా.
    ప్రసాదరావు పులకించాడు ఆ పిలుపునకు. ముఖం ఆనందంతో విచ్చుకుంది.
    "ఎ...ఎ...ఎ... ఏమన్నావు తల్లీ... మళ్లీ... మళ్లీ ఒక్కసారి అను తల్లీ" కంపిస్తూ అన్నాడు.
    "నాన్నా...నిన్ను నేను నాన్నా అని పిలుస్తాను. మాతో పాటు మా ఇంటికిరా నాన్నా" ఉద్వేగంగా అన్నది మంగమ్మ.
    "బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి" ఆనందంగా అన్నాడు శాస్త్రి.
    "వద్దమ్మా వద్దు. కన్నబిడ్డల్ని చేతులారా దూరం చేసుకున్న ఈ పాపాత్ముడికి అంత అర్హత లేదు. ఆస్తిపాస్తులు లేవు. రెండువేల రూపాయల పెన్షన్ తప్ప మరో ఆధారం లేదు. నన్ను చూడటానికొచ్చారు. అదే పదివేలు" అన్నాడు ప్రసాదరావు ఆయాసపడుతూ.
    "నాన్నా...అమ్మానాన్నలను చిన్నతనంలోనే పోగొట్టుకున్నాను. పెళ్లయిన సంవత్సరం తిరక్కుండానే భర్తను పోగొట్టుకున్నాను. బంధువులెవ్వరూ ఆదరించలేదు. అందరు ఉండీ ఒంటరితనం అనుభవించడం ఎంత నరకమో చిన్న వయసులోనే తెలుసుకున్నాను. మీ వయసు వారినెవరిని చూసినా మా నాన్నే గుర్తుకొస్తాడు. మీ ఆస్తులు, పెన్షన్లు నా కవసరంలేదు. 'నాన్నా' అని పిలిచేవారు నీకెలా కావాలో, నాకూ 'అమ్మాయ్' అని పిలిచే దిక్కు కావాలి. మాకున్న దాన్లోంచి నీకూ పెడతాం. నా మాట కాదనకు" బతిమాలింది మంగమ్మ.
    శాస్త్రి కళ్లు వర్షించాయి. "బాబాయ్...దేవతలనే వారు ఎక్కడో లేరు... మన మధ్యనే ఉన్నారు. మనం అదృష్టవంతులమైతే మనకు కనిపిస్తారు. సందేహించకుండా వెంటనే బయలుదేరు" అన్నాడు.
    ఇరుగుపొరుగు కూడా వచ్చారు. ప్రసాదు, మంగమ్మల ఔదార్యాన్ని ప్రశంసించారు. ప్రసాదరావు అదృష్టాన్ని అభినందించారు.
* * *

    మంగమ్మతో పాటు కుటుంబమంతా ప్రసాదరావును ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ప్రసాదు, సుగుణలు తాతయ్యా అని పిలుస్తున్నారు. ఇద్దరు మనుమలు ముత్తాతా అని ముద్దుగా పిలుస్తున్నారు. ఇక మంగమ్మ రోజూ నాన్నా అని వెయ్యిసార్లయినా పిలుస్తుంది. వేళకు రుచికరమైన భోజనం, మందులు అందిస్తున్నారు. అనుకోని ఈ ఆప్యాయతానురాగాలు ప్రసాదరావు ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి మళ్లీ తీసుకురావడం, సాయంకాలం పిల్లలకు హోంవర్క్ చేసిపెట్టడం లాంటి పనులు చేస్తూ కుటుంబంలో త్వరగా కలిసిపోయాడు. రెండు సంవత్సరాలు గడిచాయి.
    ఒకరోజు నారాయణశాస్త్రికి వంట్లో బాగాలేదని ఫోన్ వస్తే విశాఖపట్నం వెళ్లి వారం రోజులుండి వచ్చాడు. పదిరోజుల తరువాత ఉన్నట్లుండి ప్రసాదరావుకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. ఇంటి పక్కనే ఉన్న డాక్టర్ వచ్చి పరీక్షించి ప్రాణం పోయిందని చెప్పాడు.
    "నాన్నా" శవం మీద పడి గుండె పగిలేలా రోదించింది మంగమ్మ. మంగమ్మ ఏడుస్తున్న తీరు చూసి నిన్న గాక మొన్న వచ్చిన వ్యక్తి కోసం అంతగా దుఃఖించడం ఇరుగుపొరుగునే కాక ప్రసాదును కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
    "నాన్నా...నీ కూతురు సర్వమంగళను నేనే నాన్నా. ప్రేమించిన వాడితో వెళ్లిపోయి మళ్లీ నీకు ముఖం చూపించలేక రాలేదు. పత్రికలో నీ ఫోటో చూసి గుర్తు పట్టే నీకోసం వచ్చాను. నా మీద నీకింకా కోపం పోలేదని తెలిసి నిజం చెప్పలేక పోయాను. నా ఒక్కగానొక్క కొడుక్కు నీ పేరే పెట్టుకున్నాను నాన్నా. నాకు జన్మనిచ్చిన నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు నాన్నా" పొర్లి పొర్లి ఏడుస్తున్న మంగమ్మను చూసి అంతా నిశ్చేష్టులయ్యారు.
    "ఏంటీ... ప్రసాదరావుగారు మీ కన్నతండ్రా?" ఆశ్చర్యంగా అడిగాడు పొరుగింటి పార్వతీశం.
    "అవునన్నయ్యా...ఆయన మా నాన్నే. ఇంట్లోనే ఉంచుకుని ఎవరికీ చెప్పలేని దౌర్భాగ్యురాలిని. ప్రసాద్...ఈయన మీ నిజమైన తాతయ్య. తన కన్నకూతురి దగ్గరే తాను కన్నుమూశానని తెలియకుండానే వెళ్లిపోయాడురా...అయిన వాళ్ల మధ్యే చనిపోయావని ఆయనకు ఎలా చెప్పేదిరా?" వెక్కి వెక్కి ఏడుస్తున్నది మంగమ్మ.
    ప్రసాదరావు తన సొంత తాతగారేనని తెలియడంతో ప్రసాదుకు కూడా దుఃఖం ముంచుకొచ్చింది. కర్మకాండలు ఘనంగా చేశాడు.
    పూజారి నారాయణశాస్త్రి కూడా వచ్చి కన్నీరు కార్చాడు. ఆ సాయంత్రమే వెళ్లిపోతూ "అమ్మా...పదిరోజుల క్రితం బాబాయి విశాఖ వచ్చినప్పుడు ఈ కవరు నాకిచ్చాడు. తన మరణానంతరం మీకు అందజేయమని చెప్పాడు" మంగమ్మకు ఒక సీల్డ్ కవర్ అందిచాడు.
    "కవరా? ఏముంది దీన్లో?" ఆశ్చర్యంగా అడిగింది మంగమ్మ.
    "తెలియదమ్మా...నేను అడగలేదు" అన్నాడు శాస్త్రి. కవరును చించాడు ప్రసాదు. స్టాంపు పేపరు మీద టైపు చేసిన డాక్యుమెంట్లు, పాస్‌బుక్స్, ఒక ఉత్తరం కనిపించాయి. చదవసాగింది మంగమ్మ.
    "అమ్మా సర్వమంగళాదేవీ, అశీస్సులు. నలభై సంవత్సరాల తరువాత నిన్ను చూస్తే గుర్తు పట్టలేననుకున్నావా? నేను నీ కన్న తండ్రిని అని చెప్పుకోడానికి ముఖం చెల్లలేదు తల్లీ. ఇద్దరు బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించాను. కన్న మమకారం చూపించలేని పశువును. నేనే నీ తండ్రి అని చెబితే అసహ్యించుకుంటావని భయపడ్డాను. కూతురు, మనవళ్ల ఒడిలో పోతున్న అదృష్టశాలిని. విశాఖలోని పాత ఇంటిని అమ్మేశాను. పది లక్షలొచ్చాయి. డాక్యుమెంట్స్ కాపీలు ఈ కవర్లో పెడుతున్నాను. నీ పేరుతో ఐదులక్షలు, ప్రసాదు పేరుతో రెండులక్షలు, మనవరాలి పేరుతో లక్ష, ఇద్దరు మునిమనవళ్ల పేరుతో చెరో లక్షా డిపాజిట్లు చేశాను. పాస్‌పుస్తకాలు ఈ కవర్లోనే ఉన్నాయి. స్త్రీధనంగా స్వీకరించి నాకు సద్గతులు ప్రసాదించు తల్లీ.
     
    ఇట్లు...తండ్రి అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్న నీ తండ్రి"

    "నాన్నా" మరోసారి గుండెలవిసేలా ఏడ్చింది మంగమ్మ.
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 25-9-2008 సంచికలో ప్రచురితం)
Comments