నాలాగా ఎందరో - కొమ్మూరి రవికిరణ్

    "ఏమిటంకుల్ మీరు చెప్పేది? మన జో...జ్యోతి...ఇంత పని చేసిందా?" నెత్తి మీద పిడుగుపడినట్లుగా అడిగింది స్వప్న.  

    జీవం లేని నవ్వు నవ్వాడు రామకృష్ణ. "హూ... కన్నతండ్రిని దాన్ని ఎలా పెంచానో నీకు తెలుసు.  ఒక్కగానొక్క కూతురు. నేను నీకు అబద్ధం చెప్పట్లేదమ్మా." 

    నొచ్చుకుంది స్వప్న. "ఛ...ఛ... మీరలా అనుకోవద్దంకుల్. నాకు జ్యోతి ఫోన్ కానీ, మెయిల్స్ గాని ఇచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. మొన్ననే ఇండియాకి వచ్చాను. జ్యోతిని ఎప్పుడు చూద్దామా అని ఆత్రుత తో వచ్చాను.  ఇంతకాలం మట్లాడుకోకుండా ఉండలేదు మేము. ఇప్పుడు మీరు చెబుతుంటే..." గొంతు జీరబోయింది స్వప్నకి.

    లోపల్నుంచి ఎవరో రోదిస్తున్న ధ్వని.

    "ఆంటీ... పాపం చాలా అప్ సెట్ ఆయినట్లున్నారు..." అంది స్వప్న.

    లోపలికి తొంగి చూసి భార్యని కసురుకున్నాడు రామకృష్ణ.

    "ఊరుకోవే...స్వప్నంటే ఇవాళ వచ్చింది కాబట్టి కొత్తగా ఉంది. నీకింకా అలవాటు కాలేదా? ఎన్నాళ్ళు ఏడుస్తావ్?"

    కళ్ళు తుడుచుకుంది సుజాత.

    టాపిక్ మరల్చడానికన్నట్లు "ఇంతకీ...జ్యోతి ఇంజనీరింగ్ తరువాత ఏం చేసిందంకుల్?"

    రామకృష్ణ చెప్పింది విని నివ్వెరబోతూ అడిగింది. "ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ?... కళ్ళకద్దుకుని పిలిచి మరీ జాబ్స్ ఇస్తారంకుల్?"

    "అదేనమ్మా నా బాధ. ఎన్ని కలలు కన్నాం తన గురించి... ఆడపిల్లయినా డాషింగ్గా పెంచాను. ఈ రోజు అది చేసిన పనికి తల్లిదండ్రులం మేమే కాదు, తను చదివిన కాలేజీ లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరికీ అర్థం కాలేదు.  దాని జీవితం చివరకి అనాథల మధ్య ఓ అనాథగా ఉంది." ఆవేదనగా అన్నాడు రామకృష్ణ.

    ఆ మాటలకు లోపల సుజాత దుఃఖం ఉధృతమైంది.

    "ఊరుకో... ఊరుకో... అది పోయిందనుకున్నాను. నువ్వు కూడా పోతే, పీడా పొతుంది."

    గాభరాగా అంది స్వప్న, "ఏంటంకుల్ ఆ మాటలు... పాపం ఆంటీ.."

    "లేకపోతే ఏమిటమ్మా, మెదడు ఉండే ప్రవర్తిస్తోందా అది?"

    "ఎన్నాళ్ళయింది జ్యోతి వచ్చి ఇక్కడికి?"

    ఈసడింపుగా అన్నాడు రామకృష్ణ "వచ్చింది నాలుగైదు సార్లు. కానీ... నేనే గుమ్మం కూదా ఎక్కనివ్వలేదు. దాని మనసు మార్చుకుని, మళ్ళీ నేను చెప్పినట్టు వింటేనే తన ముఖం చూస్తాను."

    బాధగా నిట్టూర్చింది స్వప్న. కాసేపాగి సందేహిస్తూనే అడిగింది.  "పోనీ... పోనీ నన్ను ఓ సారి జ్యోతిని కలవమంటారా?" 

    "కలిసీ?"

    "తన మనసు మారుతుందేమో చూస్తాను. నా మాట కాదనదనే అనుకుంటున్నాను." ఆశగా అంది.

    నవ్వాడు రామకృష్ణ. "అది ఒకప్పటి జ్యోతి కాదమ్మా, చాలా పెద్దదయిపోయింది."

    "ఎంత పెద్దదయినా నా స్నేహితురాలే కదంకుల్?"

    కొంచెం సేపు ఆలోచించి అన్నాడు, రామకృష్ణ. "నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. ఆది మళ్ళీ మనలోకి వస్తే  అంతకన్నా కావలసిందేముంది?" 

    భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది.

    "అమ్మా... స్వప్నా..." వెనకనుంచి పిలిచాడు రామకృష్ణ.

    "చెప్పండంకుల్, ఫర్వాలేదు."

    "జ్యోతి నీ ప్రాణ స్నేహితురాలు కాబట్టి ఒక విషయం చెప్పు. తనని పైకి తీసుకురావడానికి నేనెంత కోల్పోయానో చెప్పమ్మా చాలు."

    "తప్పకుండా."

* * *

    ఊరికి కొంచెం చివరలో ఉన్న "ఆశ్రయా సేవా సంస్థ" అన్న బోర్డ్ దగ్గర కారు స్లో చేసి, సంస్థ ఆవరణలోకి వెళ్ళి కారాపింది స్వప్న. 

    కారు ఆగగానె కాస్త దూరంలో ఉన్న గది లోంచి ఓ పద్ధెనిమిదేళ్ళ అమ్మాయి స్వప్న దగ్గరకు పరిగెత్తుకొచ్చి, "ఎవరు కావాలి మేడం?" ఆనడిగింది.

    "జ్యోతి..."

    "ఓ...పెద్ద మేడం గారా?" అని, "అక్కడే ఆఫీసులో ఉన్నారు వెళ్ళండి." అంది.

    ఆ అమ్మాయి చూపించిన వైపు కదిలింది స్వప్న.  నడుస్తూ ఆలోచిస్తోంది.  తను చాలా కాలం తర్వాత జ్యోతిని కలవబోతోంది.  తనతో పూర్వపు ఆపేక్షతోనే ఉంటుందా?  ఆలోచిస్తూ చూస్తోంది.  ఆశ్రయా సేవా సంస్థ తనూహించిన దానికంటే పెద్దదిగా ఉంది.  పెద్ద స్థలం.  ఆ స్థలంలో అక్కడక్కడా సుమారు పది దాకా పెద్ద గదులు.  ఆ గదులన్నీ రెల్లు గడ్డితో కప్పబడి ఉన్నాయి. ప్రతీ గది చుట్టూ అందమైన పూల మొక్కలతో ఒక విధమైన ప్రశాంతతతో నిండి ఉంది ఆ ప్రదెశం. 

    ఇందాకమ్మాయి చూపించిన ఆఫీసు దగ్గరికొచ్చింది. అది కూదా రెల్లు గడ్డితో కుటీరంలా ఉంది.  స్వప్న ఓరగా తలుపు నెట్టి చూసింది. లోపల టేబుల్ ముందు కూర్చుని రాసుకుంటోంది జ్యోతి. ఎంతో నిర్మలంగా ఉంది ఆమె ముఖం. ఆమెలో వింత వెలుగును చూస్తూ అలాగే ఉండిపోయింది స్వప్న.

    ఈ మూడేళ్ళలో ఎంతో మార్పు వచ్చిందామెలో.  గంభీరంగా, చాలా పెద్దదానిలా కనపడింది జ్యోతి.

    చిన్నగా తలుపు తట్టి "లోపలికి రావచ్చా మేడం?" అనడిగింది.

    ఉలిక్కిపడి తలెత్తి, స్వప్నని చూసి సంభ్రమాశ్చర్యాలతో "హే...డార్లింగ్..." అని లేచి వెళ్ళి గట్టిగా కౌగలించుకుంది జ్యోతి.

    ఒక్క నిమిషం స్వప్న కూడా స్నేహితురాల్ని అంతులేని ఆపేక్షతో గట్టిగా దగ్గరకు తీసుకుని, ఏదో తట్టినదానిలా ఆమెని వెనక్కి తోసింది.

    "ఏయ్...ఏయ్..." అని పడిపోకుండా ఆపుకుంది.  ఆమె ముఖం చిన్నబోయింది.

    "ఈ ఆప్యాయత ఇన్నాళ్ళూ ఏమైందే?  అసలెందుకు నాతో మూడేళ్ళు చెప్పాపెట్టకుండా మట్లాడడం మానేశావు?" స్వప్న గొంతు వణికింది.

    జ్యోతి కళ్ళలో కూడా నీళ్ళు.  అయినా తేలిగ్గా  నవ్వేసి, "అదా... ముందు నువ్వు కూర్చో" అని లోపలికి లాక్కొచ్చి కూర్చోబెట్టింది.  జ్యోతి కూడా కూర్చుని, ఇంటర్కంలో ఎవరితోనో తను చెప్పేదాకా లోపలికి ఎవరినీ రానివ్వద్దంది.

    స్వప్న గదంతా పరిశీలించింది.  గదికి ఓ మూల బీరువా, కిటికీ పక్కనె కంప్యూటర్, ఎవరైనా వస్తే కూర్చోవడానికి నాలుగైదు కుర్చీలు ఎక్కవగా సరంజామా లేకుండా శుభ్రంగా ఉందాగది.

    ఆ మాటే అంది స్వప్న. "బావుందే..."

    "బావుంటుంది కాబట్టే ఇలా ఏర్పాటు చేశాను."

    "అది సరే, నేనెప్పుడు వచ్చాను?  ఎలా వచ్చాను ఇక్కడికి? అడగవేం?  నన్ను చూసిన ఎక్సయిట్మెంట్ కూడా నీ ముఖంలో కనపడలేదు" నిరాశగా అంది స్వప్న.

    మందహాసం చేసింది జ్యోతి.  "ఆన్నీ తెలిసినవేగా?  నువ్వు వచ్చి రెండురోజులయ్యుంటుంది. వచ్చీ రాగానే నా గురించి ఎంక్వైరీ చేసి ఉంటావు.  మా ఇల్లు కనుక్కుని, మా వాళ్ళని కలిసి ఇలా వచ్చావు."

    గడ్డం కింద చెయ్యి పెట్టుకుని, "ఎంత తేలిగా చెప్పావ్? బాగా మారిపోయావ్. నీకు నన్ను, ఎవర్నీ మిస్ అయినట్లు అనిపించలేదా?"

    "ఎందుకు?"

    "నీ చిన్నతనం నుంచి నాకు తెలుసు. నాకు తెలిసీ, నీతో పరిచయమైన ప్రతీవారు నిన్ను అమితంగా ఇష్టపడేవాళ్లు. ఇప్పుడు ఒక్కసారిగా అందరికీ దూరంగా, ఇలా ఒంటరిగా, ఎవరూ లేని అనాథలతో గడపడం, జీవితం బేలగా, బెంగగా లేదూ?" కుతూహలంగా అడిగింది స్వప్న.

    టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్దుతూ, "ఒకప్పుడు అందరికీ ఇష్టపడేలా ఉండే దాన్ని. ఇప్పుడు... నాకు నచ్చినట్లు ఉంటున్నాను. అందుకే ఇప్పుడు నేను ఎవరికీ నచ్చట్లేదు" అంది జ్యోతి. 

    "అదే... ఎందుకు?" రెట్టించింది స్వప్న.

    మృదువుగా వ్వి, "బహుశా వయసు పెరుగుతూంటే, మనసు కూడా మారుతుందేమో?"

    "వేదాంతం ఒకటి... అది సరే పరమ భక్తురాలివి. ఒక్క దేవుడి బొమ్మ కూడా లేదేమిటి?"

    ఏదో చెప్పబోయి ఆగింది జ్యోతి. ఇంతలో ఫోన్ మోగింది. జ్యోతి రిసీవర్ ఎత్తి మాట్లాడసాగింది. స్వప్న లేచి గదంతా కలియతిరిగింది. అలా తిరుగుతూ బీరువా దగ్గరకొచ్చి ఆగి "తెరిచి చూడొచ్చా?" అనడిగింది.

    జ్యోతి ఫోన్ పెట్టేసి నవ్వి, "నీకు అడ్డేమిటే?" అంది.

    స్వప్న బీరువా తలుపు తెరిచింది. లోపల కనపడిన పెద్ద ఫోటోని ఆశ్చర్యంగా చేతుల్లోకి తీసుకుని, "ఇదేమిటి...? ఈ గదిలో ఒక్క దేవుడి ఫోటో కూడా పెట్టలేదు గానీ, అంకుల్ ఫోటో మాత్రం పెట్టుకున్నావ్?" అడిగింది.

    "అవునూ... ఐ లవ్ మై ఫాదర్. నాకు దేవుడు, గైడ్ సమస్తం అన్నీ ఆయనే. ఒక రకంగా ఈ సేవా సంస్థ నడపడానికి మా నాన్నగారే ఇన్స్పిరేషన్."

    "వ్వాట్?" అని ఆగి, "మరి... మరి... అక్కడ అంకుల్ నీ గురించి..." అయోమయంగా అడిగింది.

    జ్యోతి లేచి స్వప్న దగ్గరకొచ్చి, ఆమె భుజాల మీద చేతులు వేసి, "నువ్వు మా ఇంట్లో విన్న మాటలకి, ఇక్కడ నువ్వు వింటున్నదానికి పోలికే లేదు కదూ?" అంది.

     ఆలోచిస్తూ తలూపింది స్వప్న. జ్యోతి ఏం మాట్లాడకుండా ఫోటో లోపల పెట్టి తలుపేసింది.

    అర్థం కాక, "మరెందుకు ఇలా... అందరికీ దూరంగా ఎవరూ ఇష్టపడని నీ జీవన విధానం... ఏమిటే ఇదంతా?" అనడిగింది.

    జ్యోతి ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, "ఇందాక నువ్వు లోపలికి రాగానే నన్ను చాలా కాలం తరువాత చూశావు కదా, ఏమనిపించింది?" అని అడిగింది.

    వెంటనే అంది స్వప్న. "ఏదో గొప్ప వెలుగు నీలో... చాలా ప్రశాంతంగా ఉన్నావు."

    "ఈ ప్రశాంతతతో గత ఆరునెలలుగానే ఉన్నాను."

    స్వప్న తదేకంగా జ్యోతి కళ్లలోకి చూసి, "అసలేమైందే? నాకు మతిపోతోంది సరిగ్గా చెప్పు..." అంది.

    నిట్టూర్చింది జ్యోతి. స్వప్నను కూర్చోబెట్టి తనూ కూర్చుని చెప్పసాగింది.

    "నా జీవితంలో కొంత భాగం అంటే నా బాల్యం నీకు తెలిసిన విషయమే. నాకు చిన్నప్పట్నుంచి నీళ్లంటే చాలా భయం. నాకు బాగా గుర్తు. అది సమ్మర్. స్కూలుకి సెలవులు. నాన్నగారి ఆఫీసులో కొలీగ్స్ కొంతమంది వాళ్ల వాళ్ల పిల్లల్ని సమ్మర్ కోచింగ్ అని స్విమ్మింగ్‌లో చేరుస్తున్నారని, మా నాన్నగారు కూడా నన్ను బలవంతంగా, నేను భయంతో ఏడుస్తున్నా వినిపించుకోకుండా స్విమ్మింగ్‌లో చేర్పించారు. అంతవరకు ఎంతో గారాబంగా చూసిన నాన్న ఈ విషయంలో ఎందుకు పట్టుదలగా ఉన్నారో అర్థం కాలీదు. జీవితంలో మొట్టమొదటిసారిగా అభద్రతాభావం నాలో బలంగా నాటుకు పోయింది. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ రోజు రాత్రి నేను పడుకున్నానని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అడిగింది "ఎందుకండీ ఈ వయసులో దాన్ని పొద్దున్నే లేపి... దాన్ని చూస్తే జాలేస్తుంది. దానికసలే నీళ్లంటే భయం."

    "నీకు తెలియదు సుజాతా... నాకూతురు దేనికీ భయపడకూడదు. దాంతో పోటీకి ఎవరైనా భయపడాలి" అన్నారు నాన్న. 

    ఆ మాటలు నాలో కసిని రేపాయి. అందరితో పాటు స్విమ్మింగ్‌కి వెళ్లేదాన్ని. కొన్నాళ్లకి నాకు నీటిమీద తేలడం వచ్చింది. విచిత్రంగా అప్పటిదాకా భయంగా కనిపించే నీటి మీద ఎంతో మమకారం పెరిగింది. చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను. పట్టుదలగా చేసేదాన్ని. ఫలితం... సిటీలో స్విమ్మింగ్ ఫస్ట్. తరువాత జిల్లాలో ఫస్ట్. మెల్లగా నాకు గుర్తింపు మొదలయ్యింది. ఆ గుర్తింపు పోకూడదని మరింత బాధ్యతగా తీసుకున్నాను. ఈ సారి రాష్ట్రస్థాయి ఫస్ట్. తరువాత నేషనల్స్‌లో టాప్ త్రీలో నేను సెలెక్టయ్యాను."

    స్నేహితురాలిలో ఓ కొత్త మనిషిని చూస్తూ వింటోంది స్వప్న. తనకు తెలిసి జ్యోతిలో ఇంత భావోద్రేకం ఎప్పుడూ లేదు.

    జ్యోతి చెబుతూనే ఉంది. "ఎప్పుడైతే నేషనల్స్‌లో సెలెక్ట్ అయ్యానో, అప్పుడు కలిగింది నాకు ఆశయం, ఎలాగైనా ఒలింపిక్స్‌లో పాల్గొని మన దేశానికి ఒక పతకం తీసుకురావాలని. అకుంఠిత దీక్షతో సాధన చేస్తున్నాను. అప్పుడే స్కూల్ ఫైనల్స్‌కి వచ్చాను. ఆరోజే నా ఆశయం ఆరిపోయింది."

    "ఏమైంది?"

    "నాన్నగారి ఆఫీసులో ఆయన కొలీగ్స్ వాళ్ల పిల్లలని అన్నీ మానిపించేసి, కేవ్లం చదువు మీదే దృష్టి పెట్టారట. నాన్నగారు అన్నారు "ఇక నుంచి స్విమ్మింగ్ బంద్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. స్టేట్‌లో ర్యాంకు రావాలి" అని.

    "మరి స్విమ్మింగ్?"

    "ఇప్పటి దాకా చేశావు కదా చాల్లే. చదువు మీద శ్రద్ధ పెట్టు."

    "ఇప్పుడు బాగానే చదువుతున్నాను కదా నాన్నా, స్కూల్లో నేనే ఫస్టు."

    "అది చాలదు, ఇప్పుడే నీకు కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. నువ్వు వీళ్లందర్ని మించిపోవాలి" అన్నారు.

    చచ్చిపోవాలనిపించింది మొదటిసారి. నాలో బలవంతంగా ఒక క్రీడాకారిణిని చేసింది నాన్న. మళ్లీ ఇప్పుడు చంపేస్తోంది నాన్నే. విషయం తెలుసుకుని మా నాన్నగారి మిత్రులు కొంతమంది, నాకు కోచింగ్ ఇచ్చే ఆయన వచ్చి మా నాన్నగార్ని బ్రతిమిలాడారు. స్విమ్మింగ్ ఆపవద్దని, ముందు ముందు నాకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. కానీ ఆయన ఒప్పుకోలేదు.

    "నేను ఎంతో చదువుకుందామని అనుకున్నాను. మా తల్లిదండ్రులు చదివించలేకపోయారు. మా అమ్మాయితో అలా అనిపించుకోను" అన్నారు ఖచ్చితంగా.

    నాకు మళ్లీ పంతం పెరిగింది. ఆ పంతానికి నిర్దిష్టరూపం లేదు కానీ, అదృష్టవశాత్తు దానిని ఇంకోలా కాక చదువు పైనే చూపించాను. మళ్లీ కఠోర శ్రమ. పరీక్షలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి. నాన్నగారు కోరుకున్నట్లుగానే స్టేట్ ర్యాంకు వచ్చింది. నన్ను ఇంటర్‌వ్యూ చేయటానికి రెండు మూడు పత్రికలనుంచి విలేకర్లు వచ్చారు. ఒక సిమ్మరుగా ఇవ్వాల్సిన ఇంటర్‌వ్యూ, బాగా చదివినందుకు ఇచ్చాను" అని ఒక్క క్షణం ఆగింది జ్యోతి.

    "ఎందుకు ఆపావు? చెప్పు... చెప్పు" తొందరగా అడిగింది స్వప్న.

    నవ్వింది జ్యోతి. "అంత తొందర ఎందుకు? ఏదైనా కథ రాస్తున్నావా?"

    "అబ్బే... అబ్బే... కథా నా బొందా? చెప్పు."

    "నన్ను ఇంటర్మీడియెట్‌లో చేర్పించుకోడానికి కొన్ని కాలేజీలనుంచి అధికారులు స్వయంగా వచ్చారు.

    "అదేమీటే నా ముఖం?"

    "ఇప్పుడంతేలే అలాగే వస్తున్నారు. మా నాన్న ఉన్న వాటిల్లోంచి మంచి కార్పొరేట్ కాలేజీని సెలెక్ట్ చేసి అందులో చేర్పించారు. అప్పుడే ఆత్మహత్యాయత్నం చేసి కూడా ఆగిపోయాను."

    "ఎందుకని?" ఆందోళనగా అడిగింది స్వప్న.

    "ఈ ప్రపంచంలో నిస్వార్థంగా సేవ చేసే అవకాశం డాక్టరుకుంది. పెద్ద డాక్టరయ్యి, నా వంతు సేవ చెయ్యాలనే సంకల్పం బలంగా ఉండేది. కానీ నా సంకల్పాన్ని నిర్దయగా పటాపంచలు చేస్తూ, "మెడిసిన్ అంటే నువ్వు సెటిల్ అవ్వడానికే దాదాపు పదేళ్లు పడుతుంది. అదే నువ్వు ఇంజనీరింగ్ చేస్తే తొందరగా అయ్యి, వేలకు వేలు సంపాదించవచ్చు. ఇప్పుడందరూ అదే చేస్తున్నారు" అన్నారు. 

    గదిలోకి వెళ్లి నన్ను నేను కొట్టేసుకున్నాను. పక్కవాళ్ళతో పోల్చుకుని, పిల్లల ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోకుండా, మన ఉనికిని, స్వేచ్ఛని బానిసత్వం చేసుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నందుకు నాలో నేనే కుమిలిపోయాను. అప్పటికి శతవిధాలా ప్రయత్నించాను. చివరకు నాన్న మాటే నెగ్గి, నన్ను ఇంటర్‌లో చేర్పించి ఐఐటి కోచింగ్ ఇప్పించారు.

    అసలే బలహీనంగా ఉన్న నా మనసు మీద ఇంకో బలమైన దెబ్బ పడింది. ఇంట్లోనే ఉండి రోజూ కాలేజీకి వెళుతుంటే చదువు సాగదని హాస్టల్లో చేర్పించారు. ఒకే ఊళ్లో ఉంటూ, కాలేజీ దగ్గర పెట్టుకొని, తల్లిదండ్రులతో పాటు ఉండనివ్వక, నాకెవరూ లేనట్లు హాస్టల్లో ఉండి చదువుకునే ఈ జన్మెందుకు? మరబొమ్మలా మా పెద్దవాళ్లు చెప్పినట్లు చేసాను. పుస్తకాల్లో, సినిమాల్లో చూస్తూంటాం. ఆ వయసులో మనసుకి వ్యతిరేకంగా, గుర్తింపు రాహిత్యంగా ఏం జరిగినా, ఆ డిప్రెషన్‌లో మనిషి పరిపరివిధాలుగా తయారయ్యి, ఒక్కోసారి మానవ ద్వేషంగా తయారయ్యే అవకాశం ఉంది.

    కానీ అదేమి చిత్రమో, నేనెంత నిరాశా, నిస్పృహలకు లోనయినా, నా వాళ్లమీద ప్రేమా, మమకారం ఎప్పుడూ తగ్గలేదు. పొద్దున్నే ఏడుగంటలకు క్లాస్‌కి వెడితే, రాత్రి తొమ్మిదింటికే మళ్లీ హాస్టల్‌కఒచ్చేది. దాదాపు అందర్నీ మరిచిపోయాను. వారానికోసారి మా అమ్మా, నాన్నా వచ్చేవారు. బయటకు తీసుకువెళ్లేవారు. నాక్కావలసినవి ఏర్పాటు చేసి వెళ్లిపోయేవారు. చాలా ఉక్కిరిబిక్కిరిగా, ఇరుకుగా అనిపించేది జీవితం."

    కళ్లవెంబడి నీళ్లు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయింది స్వప్న.

    "ఒకరోజు ఉన్నట్టుండి క్లాస్ జరుగుతుండగా, మా నాన్నగారొచ్చి, ప్రిన్సిపాల్‌తో మాట్లాడి 'ఇంటికెళదాం పద' అన్నారు. నేను ఒలంపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించినా అంత ఆనందం అనిపించేది కాదేమో. ఆ మాట వినేసరికి నాకు అంత ఆనందం కలిగింది. మేము ఇంటికెళ్లేసరికి ఇల్లంతా బంధువులతో కళకళలాడిపోతోంది. నేనెప్పుడూ చూడని వాళ్లు హాళ్లో కూర్చుని ఉన్నారు. మా నాన్నగారు నన్ను వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు 'అత్తయ్య, మామయ్య' అని. 

    "అత్తయ్యంటే..."

    "నాకో చెల్లెలుంది, ఆస్ట్రేలియాలో ఉంటుందని చెప్పాను! అదే... ఇక్కడికి మామయ్య వాళ్లింట్లో పెళ్లుంటే వచ్చారు. నిన్ను చూడాలని అంటే తీసుకొచ్చాను."

    "అదీ... సంగతి" అనుకున్నాను.

    అత్తయ్య నన్ను దగ్గరికి తీసుకొని, "మూడురోజులయ్యింది ఇక్కడకి వచ్చి. నిన్ను చూడాలని గట్టిగా ఒత్తిడి చేస్తే ఇవ్వాళ తీసుకొచ్చాడు నిన్ను మీ నాన్న" అంది.

    చాలా ఆత్మీయురాలిగా అనిపించింది అత్తయ్యను చూస్తే. అలా మిగతా బంధువులందర్నీ ఒకేసారి చూస్తుంటే చాలా సంతోషం వేసింది.

    అదీ గంట సేపే.

    "నిన్ను కాలేజీ దగ్గర దింపొస్తాను పద" అన్నారు నాన్నగారు.

    ఏడుపొచ్చింది ఆ మాట వినేసరికి.

    "ఇప్పుడే కదరా తీసుకొచ్చావ్ దాన్ని. మనతో పాటు ఓ రెండు రోజులుంటుందిలే..."

    "రెండు రోజులా? రెండు గంటల పర్మిషన్ తీసుకోవడానికే చాలా బ్రతిమాలాను ప్రిన్సిపాల్‌ని"

    "అదేం కాలేజీ!" విస్తుపోయింది అత్తయ్య.

    "ఇప్పుడన్నీ సిస్టమ్స్  మారిపోయాయి. చదువులతో సహా. అంతా కాంపిటీషన్. ఒక్కరోజు క్లాస్‌కి వెళ్లకపోతే వెనకపడిపోతుంటారు. అందుకే హాస్టల్లో చేర్పించాను."

    అత్తయ్య నా వైపు చూసిన చూపు జన్మలో మరిచిపోలేను. అంత జాలి ఉంది ఆమె చూపులో. ఎంత భావుకత్వం నాలో అంత భావదారిద్రంతో బ్రతికాను. ఐఐటిలో ర్యాంకు వచ్చింది. నాన్నగారు కోరుకున్నట్లుగానే ఇంజనీరింగ్‌లో చేరాను.

    ఇంజనీరింగ్‌లో అందరూ సరదాగానే ఉండేవారు. నేనే... ఎవరితో కలవలేక ఇంట్రావర్ట్‌గా ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా, నాలో అసంతృప్తిని, అలజడిని జయించలేకపోయాను. నా జీవితం నాకే కృత్రిమంగా అనింపించేది. నామీద నాకు ఒక విధమైన ఏవగింపు. తోటి వాళ్లు వాళ్ల బాల్యం గురించి చెప్తుంటే భరించలేకపోయేదాన్ని. ఒక ఆటా లేదు, పాటా లేదు. రుచిలేని జీవితం. కనీసం ఆప్తులతో కలిసి జీవించే అదృష్టం లేదు. టీవీల్లో చూస్తుంటాను. చిన్నచిన్న పిల్లలు బ్రహ్మాండంగా పాడుతుంటారు. జడ్జీలు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ వారి ప్రతిభని ఒక స్థాయికి వెళ్లేదాకా వాళ్లని ప్రోత్సహిస్తున్నారా? లేక మధ్యలో ఆపించేస్తారా? పేపర్లో చూస్తాను. ఈ ఏడాది ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన వాళ్లని చూస్తే ఓ పక్క ఈర్ష్య, ఓ పక్క ఆనందం. నాకు తెలిసి స్వప్నా, మనిషిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వాళ్లే గొప్పవాళ్లు."

    "అంటే... నీ భవిష్యత్తు కోసం తాపత్రయ పడడం మీ వాళ్లు చేసిన నేరమంటావు?"

    ఆ మాటలకు బాధపడింది జ్యోతి. "నా ప్రాణం పోయినా ఆ మాట అనను. మా నాన్నగారు నాకోసం ఎంత త్యాగం చేశారో నాకు తెలుసు. ఆయన లేకపోతే నా గురించి కేర్ తగ్గుతుందని, ఎన్ని సార్లు ప్రమోషన్లు వచ్చి వేరే వూరు వెళ్లాల్సి వచ్చినా ఆపేసుకున్నారు."

    "మరి?" ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. 

    "చదువు మనిషికి చాలా అవసరం. కానీ మనలో ఇతర టాలెంట్స్ ఉంటే మాత్రం, అది గుర్తించి, ధైర్యం చేసి సహకరించారు కాబట్టే, ఇంకా మనం కొంతమంది కళాకారుల్ని, క్రీడాకారుల్ని చూడగలుగుతున్నాం."

    "తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు."

    "ఏం జరుగుతుంది? ఇంజనీరింగ్ అయిపోయింది. ఐఐఎమ్‌లో ఎమ్‌బిఏ పూర్తి చేశాను. ఇక్కడా మంచి అవకాశాలు వచ్చాయి. విదేశాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. మా ఇంట్లో మాత్రం అమెరికా వెళ్లమని పట్టుబట్టారు. చిన్నతనంలో నా లక్ష్యాన్ని దూరం చేశారు. తర్వాత నాకిష్త్టమైన నేను కలలు కన్న చదువుకి దూరం చేశారు. అసలు వాళ్లనుంచే నన్ను దూరం చేశారు. ఇప్పుడు... ఇప్పుడు నా దేశాన్నుండే దూరమైపొమ్మంటే భరించలేకపోయాను. అందుకు అందరికీ దూరం అయిపోయి, రెండేళ్లపాటు హైదరాబాద్‌లో ఒక పెద్ద కంప్నీలో జాబ్ చేశాను."

    "మరి... ఈ ... ఆశ్రమం..." చుట్టూ చూస్తూ అడిగింది స్వప్న. 

    "ఒకసారి నేను పనిచేస్తున్న కంపెనీకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. మా స్టాఫ్ అందరికీ చిన్న మీటింగ్ పెట్టి, ఆయనతో మాట్లాడించారు. ఆ వ్యక్తి ఓ అనాథాశ్రమం నడుపుతున్నాడని, కానీ వయోభారం వల్ల, ఆర్థిక ఇబ్బందులవల్ల, తను మేనేజ్ చెయ్యలేక విరాళాలకోసం స్వచ్ఛందంగా, సమర్థవంతంగా నడిపే వాళ్లకోసం చూస్తున్నానని చెప్పాడు. 

    మా కంపెనీ విరాళాలు ఇవ్వడానికి ఒప్పుకుంది కానీ, దాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు. వృద్ధుని మాటలు నా మీద బాగా పైంచేశాయి. జీవితమన్న తరువాత ఆదర్శ్వంతంగానైనా ఉండాలి లేదా ఆచరించే విధంగానైనా ఉండాలి. ఈ రెండూ లేవు నా జీవితమంతా, నా ప్రమేయంతో కాకుండా ఆజ్ఞలు, ఆదేశాల మధ్య జరిగింది. ఇందాక నువ్వు అడిగావ్, ఎవర్ని మిస్ అయినట్లు అనిపించలేదా అని. నన్ను నేనే మిస్ అయ్యాను.

    దీనికి కారణమేమిటి? నా మనసులో ఉన్న భావాల్ని, అభిరుచుల్ని, ఆశయాలనీ సరిగ్గా తెలియజేయబోవడం వల్ల. అందుకే నాకీ అసంతృప్తి. ఇలా నాలాగా ఎందరో ఉన్నారు. నాకందరూ ఉండీ, అన్ని సౌకర్యాలుండి, నేనే... నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోయానే? మరి పుట్టుకతోనే అనాథలుగా జీవితాన్ని ప్రారంభించి, గాలి ఎటు వీస్తే అటుగా వెళ్లే వాళ్లనెవరు ప్రోత్సహిస్తారు? వీళ్లే కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువత డిప్రెషన్స్‌కి గురవడానికి కారణం, వాళ్లకేం కావాలో వాళ్లకే సరిగ్గా తెలీక, తెలిసినా సరైన పంథాలో తెలియపరచలేక... రెండేళ్ల క్రితం మన దేశంలో లక్షా ఎనభై వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటే, అందులో నలభై శాతం యువత తెలుసా?

    ఇక ఆలోచించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇదే ఆశ్రయా అనాథాశ్ఫ్రమం నడిపే బాధ్యత తీసుకొన్నాను.'

    "మరి ఈ ఆశ్రమం నడపడానికి స్ఫూర్తి మీ నాన్నగారన్నావు?" అర్థం కాక అడిగింది స్వప్న.

    "అవును. మా నాన్నగారు నా మీద అవ్యాజమైన ప్రేమతో బాధ్యతగా పెంచుదామని నన్ను ఆయనకు అన్వుగా పెంచారు. అది నేను ముళ్ల కిరీటంలా ఫీలయ్యి స్వేచ్ఛను కోరుకున్నాను. చదువు స్వేచ్ఛనివ్వాలి. సంస్కారం ఆ స్వేచ్ఛకి సద్వినియోగం చెయ్యాలి. అలా ఒత్తిడితో పెరిగాను కాబట్టేగా, ఇవ్వాళ నాకీ ఆశ్రమం నడపాలని ఆలోచన వచ్చింది. ఆ రకంగా చూస్తే, పరోక్షంగా ఆయనే నాకు స్ఫూర్తి" అభావంగా నవ్వి అంది జ్యోతి.

    "ఒకరోజు నిన్ను మీవాళ్లు అర్థం చేసుకొనే రోజు వ్స్తుంది" ఓదార్పుగా అంది స్వప్న.

    "చూద్దాం."

    స్వప్న వాచీ చూసుకొని, "నెను వెళ్తానే" అని లేచింది.

    "మా ఆశ్రమం చూడవా?"

    "ఇక ఈ ఊళ్లోనే ఉంటాగా! తరచూ వ్స్తుంటాను."

* * *

    రెండు రోజుల తర్వాత

    పొద్దున ఏడు గంటల నుంచి చాలా బిజీగా ఉంది జ్యోతి. ఎడతెరిపి లేకుండా, అభినందనల్తో ముంచెత్తుతూ ఫోన్లు వస్తున్నాయి. 

    మొదట అర్థం కాలేదు జ్యోతికి.

    ఈలోపు ఆశ్రమంలో పనిచేసే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఆరోజు దినపత్రిక ఉంది.

    "ఏమైంది దుర్గా? అలా ఉన్నావ్?"

    "ఇది... ఇది చూడండి మేడమ్" అని జ్యోతి చేతికి ఆరోజు న్యూస్ పేపర్ ఇచ్చింది. జ్యోతి చూస్తుండగా దుర్గ అంది "ఇది దీపం పత్రిక. ఈ రోజే మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో మహిళా ఎడిషన్‌లో మీగురించే రాశారు చూడండి..."

    "నిజమా?" అని గబగబా చూసింది. అంతే... షాక్ అయ్యింది. తన ఫోటో వేసి, తను రెండురోజుల క్రితం స్వప్నతో తన జీవిత విశేషాళు ఏం చెప్పిందో యథాతథంగా ప్రచురింపబడింది.

    నిర్విణ్ణురాలయ్యింది. "ఎలా... ఎలా జరిగింది?" పైకే గొణిగింది. తను స్వప్నతో మాట్లాడుతుంటే ఎవరైనా విన్నారా?

    ఫోన్ మ్రోగింది. 

    అవతల్నుంచి స్వప్న. "హాయ్ డార్లింగ్... ఎలా ఉన్నావ్?"

    తేలిగ్గా నవ్వేసి అంది స్వప్న "అవునూ... అది రాసింది నేనే. దీపం పత్రిక ఎవరిదనౌకుంటున్నావ్? మాదే. దీనికోసమే అమెరికా నుంచి వచ్చేసాను."

    మాట పూర్తికాలేదు. కోపంగా తిట్టింది జ్యోతి. "ఏమనుకుంటున్నావ్? నా గురించి నువ్వు అడిగావు కాబట్టే చెప్పాను. నన్ను మోసం చేస్తావా? ప్రాణ స్నేహితురాలివని నమ్మి చెబితే నీ వ్యాపారానికి వాడుకుంటావా?"

    అట్నుంచి స్వప్న ఆదుర్దాగా "కూల్... కూల్... పూర్తిగా విని అప్పుడు తిట్టు" అంది.

    జ్యోతి మాట్లాడలేదు. ఆమెకు ఇంకా ఆవేశం తగ్గలేదు.

    స్వప్న చెప్పింది "ఈ పత్రికకి నేను అసోసియేట్ ఎడిటర్ని. మహిళా ఎడిషన్‌లో మంచి స్ఫూర్తినిచ్చే జీవిత విశేషాల గురించి రాయాలి.చాలా సేకరించాను. ఇంతలో నిన్ను కలవడం జరిగింది. నువ్వు చెప్పింది నిజమే. జీవతమంటే ఆదర్శవంతంగా ఉండాలి లేదా ఆచరించే విధంగానైనా ఉండాలి. నీ జీవితంలో చాలా కోల్పోయానంటున్నావు. కాని అది పది మందికీ పమిచితే ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుందో నీకు తెలియదు. మనసులోనే బలమైన ఆశలు, లక్ష్యాలు దాచుకుని మథన పడుతూ, తమను తాము కాల్చేసుకునే వారికి నీ కథ వాళ్ళు ఆచరించే విధంగా ఉండాలి. నీ క్లిష్టసమయాల్లో నీతో ఏదీ పంచుకోలేకపోయాను. నీ స్నేహితురాలిగా నా బాధ్యత అనిపించింది. అందుకే రాశాను గానీ వ్యాపారం కోసం కాదు. ఏమైనా నువ్వొక గొప్ప ఉదాహరణ కాబోతున్నావు" అని ఆగి... "ఏమో... ఇది చది అంకుల్ నిన్ను అర్థం చేసుకొంటారేమో?"

    "నా ముఖం చూడ్డం వాళ్లకి ఇష్టం లేదు" అంది జ్యోతి.

    "చెప్పలేం..." అని అంటుండగా తలుపు చప్పుడైంది.

    "ఎవరో వచ్చారు. చూసొస్తాను" అంది జ్యోతి.

    "అంకుల్, ఆంటీ వచ్చారేమో... చూడు" అంది స్వప్న.

    రిసీవర్ పక్కన పెట్టి తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ వ్యక్తులను చూసి మొదట నిర్ఘాంతపోయింది. తర్వాత క్రమక్రమంగా జ్యోతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నోటమాట రానట్లు ఉండిపోయింది. స్వప్న చెప్పిన మాటలు నిజమయ్యాయని వేరే చెప్పాలా?

(నవ్య వారపత్రిక మార్చి 4, 2009 సంచికలో ప్రచురితం)
Comments