నాన్నంటే... పాపకు దీపం ..!! - సాయిపద్మ

సుమతి:

    ఇలాంటి ముదనష్టపు రోజు నా జీవితంలో వస్తుందని అనుకోలేదు. అపర్ణ ని పక్కింట్లో ఉంచి బోలెడు జాగ్రత్తలు చెప్పి బయటకి కదలాల్సి వస్తోంది. అదైనా ఆ సచ్చినాడు బయట తిరగటానికి వెళ్ళినప్పుడు.. ఏంటో నా ఖర్మ .. ఇవాల్టి సాయంత్రం కూడా నా మొగుడు కొట్టిన దెబ్బలకి ఎర్రబడ్డ నా వొళ్ళులా ఉంది .. కనీసం పెద్దలైనా వాడికి బుద్ది చెప్పి  నా జీవితాన్నీ, నా అపర్ణ తల్లి జీవితాన్నీ బాగు చేస్తే బాగుణ్ణు. నెత్తి మీద ఈ కష్టం తీరితే, ఉన్న ఆ నాలుగు వెంట్రుకలూ తిరుపతిలో ఇచ్చేస్తానని మొక్కుకున్నాను.. ఇప్పుడు నా ఆశలన్నీ, మా సర్పంచ్ సదాశివమూర్తి మీదే .. ఆ బాబన్నా ఈ మొగుడు ముదనష్టపొడి తలలో కొంచం బుద్ది కూరితే ఎంత బాగుందిపోతాది.. నా మాట వినడు గానీ .. సర్పంచ్ మాటంటే.. కొంచం భయం లాంటి గౌరవమే .. చూద్దాం ..

    నెమ్మదిగా కాల్లీడ్చుకుంటూ సర్పంచ్ ఇంటికెళ్లానా, అక్కడ అందరూ జనాలే.. పాపం.. అక్కడికీ ఆ బాబు .. నా సమస్యేమిటో చెప్పీమన్నాడు .. అందరూ వెళ్ళాక మాట్లాడతానానని అట్లాగే కూర్చున్నాను . ఈ మధ్య రాత్రయితే భయమేస్తోంది. పక్షులన్నీ గూళ్ళకి చేరుకుంటున్నాయి, గూడంటే ఎంత నిష్పూచీ వాటికి, మరి అలాంటి భద్రత నాకూ, నా కూతురికీ ఎప్పుడో..

    అదిగో, సర్పంచ్ బాబు దగ్గర జనాలు అందరూ ఖాళీ అయిపోయారు, వెళ్లి ముందు గొంతుక్కూర్చున్నా.., మూర్తి బాబు తలెత్తి  "ఏంటీ వేళ కాని వేళ.. పిల్లది ఇంట్లో లేదా?" అన్నారు.

    "కాదయ్యా... కాలేజీ నుంచి వస్తే,పక్కింట్లో ఉండమని చెప్పి  వచ్చాను ..!"– నా గొంతు నాకే అయోమయంగా ఉంది, ఎందుకనో!

    "ఏమైంది ఇంతకీ.. గిరి ఉన్నాడా ఇంట్లో?"

    "పది రోజుల క్రిందటే, రాజస్థాను నుంచి వచ్చాడు బాబూ.. ఉన్నాడు" – సమాధానం ఇచ్చాను నేను.

    "హ్మ్మ్.. ఎలా ఉన్నాడు" – అని అడిగాడు ఆయన .

    నేను చెప్పటం మొదలు పెట్టాను. మొదలు పెట్టగలను, అనుకోలేని నా ఇబ్బంది. చెప్తూనే ఉన్నాను, ఎక్కడో ఉన్న సంద్రంలో అలల్లా.. నా మనసులో హోరు మొదలైంది, ఇళ్ళకి వచ్చే పక్షుల్లాంటి ఒకానొక కలవరం, రెక్కల కింద ఒక పసితనాన్ని దాచలేని, నా నిస్సహాయత, అన్నీ చెప్తూనే ఉన్నాను .

    మూర్తి బాబు, మొదట ఏదో దిలాసాగా కూర్చున్న మనిషి, నా మాటలకి నిట్రాడి కర్రలా నిటారయ్యారు. తర్వాత లేచి ఆ చిన్న అరుగు పక్క నున్న నడవాలో పచార్లు చేస్తూనే ఉన్నారు, ఆగబోయిన నన్ను మాట్లాడమని సైగ చేస్తూ..!

    చెప్పేసాను, నా మనసు విప్పేసాను. పదో నాడు కర్మ చేసి తల కడుక్కున్నంత దిగులైన హాయిగా ఉంది.

    మూర్తి బాబు, చాలా సేపు మాట్లాడలేదు . .. "పంచాయితీ పెట్టిస్తే చెప్తావా ఇదంతా..?"

    ఒక నిమిషం నిశ్శబ్దం.. నా మనసులో , ఆ చీకటిలో .. "చెప్తాను, నా పిల్ల కోసం, ఏమైనా పరవాలేదు" తెలీని ధృఢ నిశ్చయం నా గొంతులో.

    "హ్మ్మ్.. సరే .. ముందు అపర్ణని ఇక్కడ మా ఇంటి నుంచి కాలేజీ కి వెళ్ళమను.." నిర్ణయిస్తున్నట్టు చెప్పారు మూర్తి బాబు.

    బాబూ.. అది ..అని ఏదో చెప్పబోయిన నన్ను ఆపి – "రేపటి నుండీ .. ఇక్కడకి వచ్చి ఇక్కడ నుంచీ వెళ్ళమను .."

    వినల్సింది , చెప్పాల్సింది అంతా అయిపోయినట్టు అయన అలసటగా నన్ను వెళ్ళమన్నారు..!

    ఇంటిదారి నాకు దగ్గరగా ఉంది. ఏదో పరిష్కారం చూపిస్తారు , అడుగులు తేలిగ్గా పడుతున్నాయి... వీధి దీపాలు వెలగక పోయినా, మనసులో వెలుగ్గా ఉంది.

అపర్ణ :

    నా చిన్నప్పటి నుండీ నాన్న కోసం మొహం వాచిపోయా.. మిగతా పిల్లల నాన్నలు, ఇది కొన్నారు, అది కొన్నారు అని చెప్తే కుళ్ళు గా ఉండేది. నాన్న మిలిటరీలో ఉన్నాడు అని అమ్మ చెప్పి, వాళ్ళ ఫోటోలూ అవీ చూపించేది, కదలని కాగితం ముక్కలు ఎక్కడైనా నాన్న అవుతాయా? మీరే చెప్పండి ..!

    ఒక్కసారి పుట్టినరోజుకి కూడా నాన్న రాడు, నువ్వంటే చాలా ఇష్టమేనే అని అమ్మ చెప్పి, కొత్త బట్టలు కొనేది, రెండు పుట్టినరోజులు ఏడ్చి, వేసుకోనంటే అప్పుడు నాన్నతో మాట్లాడించింది. ఎక్కడో నేపాల్ బోర్డర్ లో ఉన్నాడు. మాట్లాడాడు.’ఏరా తల్లీ , అమ్మని విసిగించకు ‘ అన్నాడు. భలే సంతోషం వేసింది. ఏదేదో మాట్లాడాను . నా, పదహారేళ్ళ జీవితంలో అదే నాన్నతో అంతసేపు మాట్లాడటం. పదేళ్ళ క్రితం వచ్చాడు అంట నాన్న, నీకు గుర్తు లేదూ.. మనం సినిమాకి వెళ్లాం, సిటీ తీసుకెళ్ళాడు కదా అని అంటుంది అమ్మ. ఏమో, లీలగా గుర్తు , అంతే ..!

    ఇప్పుడు మాత్రం రెండు రోజులుగా భలే గంతులే గంతులు. నాన్న వస్తున్నాడుగా..!! అందరికీ చెప్పేసాను. మంచి బట్టలు అన్నీ, జాగ్రత్తగా ఉంచుకున్నాను. పది రోజులు ఉంటాడు నాన్న, నువ్వు ఎక్కువ విసిగించకపోతే, ఇక్కడే ఉండిపొమ్మని అడుగుతాను నాన్నని, అని అంది అమ్మ. నాకు వొళ్ళు మండింది. నేనేం విసిగిస్తాను?- అని గట్టిగా అంటే – "కాదమ్మా, వూరికే అన్నా, నాకు కూడా ఒక్కర్తినే అన్ని పనులూ చూసుకుంటూ ఉండటం కష్టంగా ఉంది" అని అన్నది అమ్మ. నిజమే కదా పాపం, ఒక్కర్తీ పొలం పని చూసుకుంటుంది, కొంచం డబ్బు వడ్డీలకి ఇచ్చింది, నా చదువుకి ఉపయోగపడతాయని, వాళ్ళు సరిగ్గా ఇవ్వరు. అవి కూడా అన్నీ తనే చూసుకోవాలి. నేనిప్పుడు పెద్దదాన్ని అయ్యాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను కదా, వడ్డీ లెక్కలూ అవీ వేసి అమ్మకి ఇచ్చి సాయపడుతూ ఉంటాను. నేను వయసుకి మించి కనిపిస్తానేమో, పెద్దదాన్ని అనే అనుకుంటారు. కావాలంటే నేను వెళ్లి కొన్ని పనులు చేస్తానమ్మా అని అంటే, అమ్మ అస్సలు వొప్పుకోదు. వద్దు, నువ్వు చదువుకొని, పెద్ద ఉద్యోగంలో ఉండాలి – అప్పుడు ఇవన్నీ మానేసి, నేను నీ దగ్గరకి వచ్చేస్తాను అంటుంది .. ఏంటో.. పిచ్చి అమ్మ. ఎవరైనా నన్ను అల్లరి చేసినా, ఏమైనా అన్నా మాత్రం, విరుచుకు పడిపోతుంది వాళ్ళ మీద. అందుకని, నన్ను ఏడిపించటానికి భయపడతారు అందరూ.. నవ్వించటానికి ఎవరూ ఉండరు అదే బాధ అనుకో !

    నాన్న రానే వచ్చారు. భలే..ఎంత బాగున్నాడో నాన్న . రెండు రోజులు నాన్నని అంటిపెట్టుకొనే తిరిగాను. తల్లీ అని ఫోన్ లో పిలిచిన సంగతి గుర్తు చేసాను. ముభావంగా నవ్వాడు నాన్న. అలానే పిలవాలని ఏముంది?  అన్నాడు. మీ ఇష్టం నాన్నా అన్నాను. నాన్న మనిద్దరం ఫ్రెండ్స్ అన్నాడు. గిరీ అని పిలవమన్నాడు. ఎందుకో నచ్చలేదు, అలా పిలవటం. పిలవలేను అని చెప్పాను. రెండు డ్రెస్లు తెచ్చాడు. అవి ఇస్తానని చెప్పి, గిరీ అని పిలవమన్నాడు. పిలిచి సిగ్గుపడితే గట్టిగా కావలించుకున్నాడు. మొదట బాగుంది. తర్వాత భయం వేసింది, ఎంతకీ వదలక పోయేసరికి. అమ్మా అని అరిచాను. అమ్మ వచ్చింది. నాన్న వదిలేసి, చాలా ఏళ్ళయిందిగా.. భయపడింది అన్నాడు. అపర్ణ పెద్దదయింది, మీ హద్దుల్లో మీరుండాలి, తండ్రిగా- అన్నది అమ్మ.

    ఏమో, నాకంతా గాభరాగా ఉంది. వెంటనే నా ఫ్రెండ్ సర్పంచ్ గారమ్మాయి స్నేహ దగ్గరకి వెళ్లిపోవాలి. స్నేహ మంచిది. ఎందుకో అమ్మ, నాన్న కోపంగా  ఉన్నారు. నేను వచ్చేసరికి, మాటలు ఆపేస్తున్నారు. నాకేమీ అర్ధం కావటం లేదు.

    పొద్దున్న కాలేజీకి బయల్దేరినపుడే చెప్పింది అమ్మ, రాగానే పక్కింటి ఆంటీ వాళ్ళింట్లో ఉండమని తను వచ్చేదాకా.. ఎందుకలా అంటే .. ఏమో గయిమంది బాబూ..ఈ మధ్య అమ్మకి కోపం ఎక్కువైంది, ఒక్కరోజు సంతోషంగా కొత్త చీర కట్టుకొని ఉందేమో నాన్న వచ్చాక... నాన్న కొడతాడా, ఏమో ఏమీ అలా అనిపించలేదు. ఒకరోజు మాత్రం తాగాడు అని తెలిసింది, అమ్మ ఆ రోజు చికెన్ పకోడీలు చేసింది. బావున్నాయి

    పక్కింట్లో లెక్కలు చేసుకుంటుంటే అమ్మ వచ్చింది. ఏంటో హాయిగా ఉంది . హుషారుగా వచ్చి 'స్నేహ ఇంటికి బయల్దేరు' అంది. అమ్మకేమన్నా మనసులు చదివే శక్తి ఉందా అనిపించింది . నేను కూడా స్నేహ దగ్గరకి వెళ్దామని అనుకున్నా కదా!

    మర్నాడు, నా బట్టలు అమ్మే సర్దింది. నాన్న తెచ్చిన కొత్త బట్టలు పెట్టనా? అని అడిగింది.. వద్దు అని చెప్పాను. ఎందుకు అంటే , మౌనంగా ఉన్నా. భయం వేసింది. ఆ బట్టలు వేసుకుంటే నాన్న వచ్చి మళ్ళీ గట్టిగా అదుముకుంటేనో.. అమ్మో .. వద్దు !

 

గిరిధర్ :

    సుమతి గోల ఏంటో నాకు అర్ధం కావటం లేదు. పైగా నేను అన్నది అంత విచిత్రం ఏముంది ? ఈ పదేళ్ళు నేను రాజస్థాన్ లో మిలటరీలో పని చేసి వచ్చాను. మొదటి నుండీ మిలటరీ లోనే ఉన్నాను.    మనుషులకి  విశాలత్వం అన్నది ఇంకా రాలేదు. యేవో కబుర్లు చెప్తారు కానీ, మీరైనా చెప్పండి .. నేనేం అన్నాను ? నేను అన్నది అంత విచిత్రం లాగా, తల్లీ, కూతురు ఒకటే గోల, ఏడుపులు.

    నేనొకటి అడుగుతాను, చెప్పండి, మీరు ఎక్కడో ఒకచోట, డబ్బు పెట్టి పొలం కొంటారు, పంట పండిస్తారు. వచ్చిన పంట మీద హక్కు మీకు కాకపోతే ఎవరికి ఉంటుంది  మీకే కదా.. కావాలంటే అమ్ముకుంటారు, లేదంటే మీరే తింటారు.. అవునా.. స్థూలంగా ఇంతేనండీ సంగతి.

    ఇకపోతే, అపర్ణ  నిజంగా బంగారం.. బంగారం లాంటి దాని వొళ్ళు, మెరిసే కళ్ళు , నేను పెళ్లి చేసుకున్నప్పుడు మొదటి సంవత్సరం సుమతి అలానే ఉండేది. అబ్బా.. భలే రంజు గా ఉండేది లెండి. తర్వాత్తర్వాత, లూజయిన రబ్బర్ బ్యాండ్ లా తయారయింది. దానికి తోడు ప్రతీదీ ఆరాలు. నేనింత జాగ్రత్తగా ఉంటున్నాను, నువ్వు లేనప్పుడు, నువ్వేం చేస్తున్నావో అక్కడ అని అరాలూ.. కూపీలు. అలసిపోయాను అనుకో, నాకూ వెరైటీ కావాలి కదా ..!!

    అయినా, సుమతి నా జీవితంలోకి ఎలా వచ్చిందో మర్చిపోయినట్టుంది. కళావంతుల వాళ్ళు కదా , ఏదో ఎర్రగా బుర్రగా ఉందని. మా అమ్మా నాన్నా వద్దని చెప్పినా చేసుకున్నాను, గుళ్ళో తాళి కట్టేను. వాళ్లకి నచ్చిన అమ్మాయిని చేసుకోలేదని మా నాన్న, నాకు పిండం ఎప్పుడో పెట్టేసాడు.. జానేదేవ్

    అలాంటి సుమతికి ఎంత విధేయత ఉండాలి.. నేనేమన్నా దూబరా చేసానా.. గడవటానికి మిలిటరీలోకి పోయి, మనసూ, శరీరం ఎండగట్టు కుంటున్నాను. పంపే ప్రతీ పైసా ఇక్కడే కదా ఇల్లు, పొలం ఏర్పాటు చేస్తున్నాను. అన్నీ నా పేరనే ఉన్నాయి అనుకోండి

    అయినా నేను అపర్ణ కి అన్యాయం చేస్తానని అన్నానా... ఉన్న ఇల్లు, ఆ కాస్త పొలం కూడా తన పేరు మీదే పెడతాను, నా తదనంతరం అనుకోండి. ఏం లోటు రానివ్వను. మిలిటరీలో నా ఫ్రెండ్ ఆల్ఫ్రెడ్ చెప్పాడు.. బైబిల్లో కూడా ఇలాంటి కేసు ఉండని.. ఆ ప్రకారం నా కోరిక తప్పు కాదని, అయినా అదంతా అనవసరం ..  "నాదీ అనే వస్తువైనా, మనిషైనా నాదే ... దానిమీద మొదటి హక్కూ, అధికారం నాదే"

    సుమతి ఏదో వాగుతోంది, పంచాయితీ పెట్టిస్తాను అని. పెట్టనీ, నా హక్కుని కాదనే హక్కు ఎవరికుందో చూస్తాను. అయినా నేనేమీ, పూర్తిగా కావాలనుకోవటం లేదు. ఏదో నేను వచ్చినప్పుడు, నాకు కావలసి వచ్చినప్పుడు ..! పెళ్లి లాంటి ఉంచుకోవటమేగా, నేను నిజంగా బలవంతం చేస్తే ఎక్కడికి పోతారు, తల్లీ కూతుళ్ళు..?? ఏదో ఇష్టపడి వస్తే సుఖపడతానని అంతే .. తల్లి నిజం తండ్రి నమ్మకం.. అపర్ణ ని చూస్తే కూతురు అనే ఫీలింగ్ రాకపోవటం ఇంకా పచ్చినిజం. కొంతమంది ఇలాంటి వాటికీ రకరకాల పేర్లు పెట్టి జీవితంతో తడుములాడుతూ ఉంటారు, నేను డైరెక్ట్ గా అడిగేసా..నా ప్రాపర్టీ వాళ్ళిద్దరూ.. ఏం చేసుకుంటాను అనేది కూడా నా ఇష్టమే ..!

    సుమతికి బుద్దిలేదు, ఎలాంటి పరిస్థితుల్లో నా దగ్గరకి వచ్చిందో మర్చిపోయింది. ఏదో నాలాంటి ఉదార స్వభావుడు లేకపోతే వాళ్ళ కులంలో పెళ్ళిళ్ళూ గట్రా అయ్యే పనేనా? అలా పడి ఉండవలసిందే.. సానిపాపలు

    సాని పెద్దదయింది.. పాపని కోరుకుంటున్నా.. తప్పా ???

 

సదాశివ మూర్తి :

    సుమతి చెప్పిన విషయం విని మతిపోయింది. పంచాయితీ పెద్దగా నేనూ చాలా విషయాలు చూసాను. కానీ ఇలాంటిది వినటం ఇదే మొదలు. మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా ..? గిరి నాకు ఈ వూరు వచ్చినప్పుడు నుంచీ తెలుసు. వస్తూ పోతూ ఉండేవాడు. రావటమే సుమతిని తీసుకొని ఈ వూరు వచ్చి, మొదట్లో కొంచం పొలం కౌలుకి తీసుకొన్నాడు. గట్టిగా ఒక సంవత్సరం వ్యవసాయం చేసాడో లేదో, ఒక పొలం కౌలుకి తీసుకున్నాడు. రెండేళ్ళు కూడా కాకుండానే మిలిటరీ కి వెళ్ళిపోయాడు. సుమతినీ, చంటిపిల్ల అపర్ణనీ వదలి. అప్పటినుంచీ సుమతి ఏ కష్టం సుఖం అయినా వచ్చి చెప్పేది, సలహా తీసుకొనేది. గిరి ఒకటీ రెండు సార్లు వచ్చాడేమో. కలిసింది మాత్రం లేదు.

    నా కూతురు స్నేహ, అపర్ణ ఒకీడువాళ్ళే . స్నేహకోసం అపర్ణ వస్తూ పోతూ ఉండేది . మంచి పిల్ల, ఈ కాలపు హంగులు లేవు, ఉన్నంతలో ఎలా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాలా అని ఆలోచించేవాళ్ళు స్నేహితురాళ్ళు ఇద్దరూ. అపర్ణ నిబ్బరం చూసి స్నేహతో తన స్నేహానికి నా పూర్తి ప్రోత్సాహం ఉండేది.

    సుమతి చెప్పిన రాత్రి నాకు నిద్ర లేదు. డాబా మీద పక్కలేసుకొని పడుకున్నాం, వేసవి మొదలైంది దాంతో పాటే ఉక్క కూడా, అందుకని . నిద్రలో స్నేహ నా మీద కాలు వేసింది. అలా స్నేహ మొహం చూస్తూనే గడిపాను. రాత్రి అంతా . ఎంత నిర్భీతిగా గడుస్తుంది బాల్యం, బాల్యం వీడని కౌమారం, హ్మ్మ్ ..లోకాలని గెలిచిన ధీమా ఉంటుంది ఆ అవయసులో..!

    మర్నాడు బట్టలు పట్టుకొని సంతోషంగా వచ్చింది అపర్ణ. కాలేజీకి కూడా వెళ్లి వచ్చారు ఇద్దరూ. సుమతి అపర్ణ బాధ్యత నా మీద పెట్టి హాయిగా ఉంది అనిపించింది. అపర్ణ ని నా గదిలోకి రమ్మన్నాను.

    “ఏంటి అంకుల్ ?” అన్నది వచ్చి .కూర్చోమ్మా ..నీతో మాట్లాడాలి !”

    అపర్ణ కూర్చుంది. నాకేవిటో, ఒక్కసారి ఊపిరి లాగేసినట్టుగా నీరసంగా ఉంది, కళగా ఉన్న ఆ పిల్ల మొహం చూస్తే

    “ ఎలా ఉంది ఇక్కడ ..?” అడిగింది, తడబడుతున్నట్టు నా స్వరం

    “చాలా బావుంది అంకుల్.. తోటలో ఉన్నట్టుగా ఉంది , మొన్నటినుండీ నాకెందుకో స్నేహ దగ్గరకి వచ్చేద్దామని అనిపించింది ..!”- ఉత్సాహంగా సంగీతంలా వినిపించింది అపర్ణ గొంతు.

    నాక్కొంచం శక్తి వచ్చినట్టు అయింది , నాకే తెలీకుండా ..

    “ఎమ్మా.. మీ నాన్న కూడా వచ్చాడు కదా, సంబరపడిపోయావు అని చెప్పింది స్నేహ “

    “.......................................” స్వరానికీ అపస్వరానికీ మధ్య నిశ్శబ్దంలా వినిపించింది స్నేహ మౌనం.

    ఏమైంది తల్లీ ..నీ తండ్రిలాంటి వాడిని, నాతో చెప్పచ్చు కదా – అన్నాను నేను

    ‘వద్దు, మీరు మా నాన్న లాంటి వారు కాదు “ చురుక్కున రోషంగా అన్నది అపర్ణ . కడుపులో కలచివేసినట్టయింది . ఎంత తెలుసు ఈ పిల్లకి ?”

    మళ్ళీ తనే అంది – “ మా నాన్న , అందరి నాన్నల్లా కాదు అంకుల్.. నాకెందుకో భయం వేసింది , అమ్మతో మాట్లాడాలన్నా భయం వేసింది . నాన్న వచ్చిన రెండు రోజుల తర్వాత నుండీ అమ్మ , చాలా ముక్తసరిగా , బెదురుగా ఉంది. నన్ను చాల సార్లు తిట్టింది. “

    కొంచం ధైర్యం వచ్చింది. ఈ అమ్మాయికి ఎంతో కొంత తెలుసు, లేదా అర్ధం అయింది. మనసులో భగవంతుడ్ని ప్రార్ధించుకొని చెప్పటం మొదలు పెట్టాను. సుమతి రావటం, నాకు తెల్సిన విషయం. పంచాయితీ త్వరలో పెట్టించే విషయం. అపర్ణ ని ఇక్కడ ఉంచటానికి గల కారణం.

    దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఒక చిన్నపిల్ల కళ్ళల్లోకి చూడలేకుండా , మాట్లాడటం పెద్ద శాపం. నాకా ధైర్యం లేదు . మొదటిసారి మగవాడ్ని, తండ్రినీ అయినందుకు బాధగా ఉంది. అదే ఒక ఆడదాన్ని అయి ఉంటె, అపర్ణ ని గుండెల్లోకి తీసుకొని చెప్పేవాడ్ని. అది కూడా చేయలేని నిస్సహాయుడిని.

    అపర్ణ వింటూ ఉంది. ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని మాత్రం అర్ధం అవుతోంది. మౌనం అంత కోసేదీ, మనసు తలుపులు మూసేదీ ఏదీ లేదేమో..!

    “ వచ్చే వారం పంచాయితీ తల్లీ ..!” నేను చెప్పటం ఆపాను.

    ఆనాటి ఉక్కపోత రాత్రి, ఆ మౌనం, దూరంగా అంతా మామూలుగానే ఉన్నట్టు వంట గదిలోంచి వంట వాసనలు. ఊపిరాడనివ్వని మౌనం ..!

    “ మీరు పంచాయితీ పెట్టండి అంకుల్.. నాకు కొంచం టైం కావాలి , అప్పటిదాకా ఇక్కడ ఉండనా ?” ఒక గాభారాతో అపర్ణ మాటలు విని, నాకు మగజాతి మీదే అసహ్యం వేసింది .

    అదేంటమ్మా.. నాకు స్నేహ ఎంతో నువ్వూ అంతే , నీ ఇష్టం . – మనఃస్పూర్తిగా సమాధానం ఇచ్చాను నేను.

    ‘స్నేహ దగ్గర ఉంటాను అంకుల్ ‘- కళ్ళు తుడుచుకుంటూ వెళ్తున్న అపర్ణ ని చూస్తుంటే, మనసు బాధతో కలచివేసింది. కానీ నా బాధ్యత ఒకటి ఉంది కదా – ‘ వచ్చే శుక్రవారం పంచాయితీ ఉందమ్మా. మీ అమ్మ ఎటూ వస్తుంది. నువ్వు కూడా ఉండాలి .”

    వెనుకనుండే వెళ్ళిపోతూ, తల ఊపింది అపర్ణ . వెళుతున్న ఆమెని, వంగిన భుజాలనీ , నీడలా అదృశ్యమైపోయిన ఆమె రూపాన్నీ .. ఎప్పటికీ కోల్పోయిన ఆ పిల్ల బాల్యాన్నీ అలా చూస్తూ ఉండిపోయాను.

    తర్వాత నాలుగు రోజులూ, ఒక నిశబ్దం లో గడిచాయి. స్నేహ కూడా అపర్ణతోనే ఉంటోంది. ఏం.. మాట్లాడుకుంటున్నారో ఏమో, రెండు గంభీరమైన నదుల్లా మారిపోయారు , ఇద్దరు పిల్లలూ. స్నేహ, అపర్ణ కూడా సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు – అంటూ మా ఆవిడ గోల పెట్టటం మాత్రం నాకు నిస్సహాయంగా అర్ధం అవుతూనే ఉంది.

    సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలి అని తెలిసినా, ఎటు పరిష్కరించినా తెగని సమస్య, చిక్కుముళ్ళ జీవితంలా అనిపించింది. పరిష్కరించాలి, తప్పదు,

    అందరిలా నేను శుక్రవారం కోసం వేచి చూస్తున్నా.. భారంగా !

 

రచ్చ బండ /పంచాయితీ చెట్టు :

    ఈ వూళ్ళో, ఎన్ని మారినా , మారని దాన్ని నేనే. నేను ఆడో, మగో నాకే తెలీదు గానీ, ఈడనే ఉంటాను , ఉండాలి అని మాత్రం బాగా తెలుసు. ఇన్ని సమస్యలు నా ముంగిట్లో పరిష్కారం అయితే , నాకా మాత్రం తెలివి తేటలు రావేంటి?మీరు మరీనూ..!

    గవర్నమెంట్ ఎన్ని బంగళాలు కట్టించినా, యేవో అడపా దడపా , శంకుస్థాపనలు చేయించినా , వూరి పంచాయితీలు నా నీడలో జరగడమే ఆనవాయితీ. మొదట్లో యేవో నాపరాళ్ళు వేసుకొని కూర్చునేవారు. ఈ సదాశివ మూర్తి వచ్చిన తరువాత, నా చుట్టూ శుభ్రం చేయించి, సిమెంట్ గట్టులూ అవి కట్టించాడు. చుట్టూ అందరూ కూర్చోటానికి. సిమెంట్ బల్లల్లాంటివి, కొన్ని చెట్ల  మొదళ్ళు తెచ్చి వేయించేసరికి. నేనో పార్క్ లాగ తయారయాను. నా మీద నాకే ముచ్చటేసింది. ఇంక చూస్కో, అసలు నాకు ఖాలీయే ఉండదు. మధ్యాహ్నాలు వచ్చీ పోయేవాళ్ళు, ఆడుకొనే పిల్లలు. అదే పంచాయితీ రోజున , గంభీరంగా అయిపోయే వాతావరణం .. అబ్బో భలే ఉంటుందిలే ..!!

    ఒక్కోసారి పంచాయితీ అయిపోయాక కూడా, నా మొదల్లో జారగిలబడి, కలబోసుకొనే కష్ట సుఖాలూ.. నిట్టూర్పులు, ఆక్రోశ, ఉక్రోషాలూ, ఓహ్, అదొక లోకం. వీళ్ళ మాటల బలంతోనే ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో నా అంత మర్రి లేదు అనిపించుకోనేంత గర్వంగా ఎదిగానంటే నమ్మండి.

    అపర్ణ , స్నేహ ఇదిగో నా కనుచూపుమేరలో పుట్టి, పెరిగే చిట్టి మొక్కల్లాగా చిన్నప్పటి నుండీ తెలుసు. స్కూల్ అయిపోయాక వచ్చి, ఇదికో ఇక్కడే , దొంగా బూచి ఆట ఆడుకోనేవాళ్ళు. మధ్యాహ్నం నిద్రపోదామంటే ఒకటే కిలకిలలూ.. ఒక్కోసారి వొళ్ళు విదిలించేసరికి, గాలీ దుమ్ము, ఎండుటాకులు అనుకుంటూ దూరం పోయేవారు. వీళ్ళే కాదు, ప్రతీ చిన్నపిల్లల జట్టూ నాకు తెలుసు. కానీ అపర్ణ, స్నేహది మంచి స్నేహం. ఎప్పుడూ దేబ్బలాడుకోగా చూడలేదు. అపర్ణ , ఇదిగో ఇక్కడే కూర్చొని, స్నేహతో అన్నీ చెప్పుకొనేది. వాళ్ళ నాన్న వచ్చే విషయం కూడా నాకు తెలుసు తెలుసా !

    మొన్న ఇక్కడే కూర్చొని , సదాశివ మూర్తి చెప్తుంటే విన్నాను అపర్ణ నాన్న సంగతి. నిర్ఘాంత పోయాను. నీరసించిపోయాను. ఒక్క ఆకూ కదలలేదు. నా ఊడలే నా మెడ పట్టి పిసికినట్టు అనిపించింది. తన ఊడల్ని చంపుకొనే చెట్టులా , తన పిల్లల్ని చంపి తినే గుడ్డి పాములా .. అయ్యో, అపర్ణకీ వాళ్ళమ్మ కీ ఎంత కష్టం వచ్చింది, అనుకున్నాను.

    అదిగో రానే వచ్చింది , ఎదురు చూస్తున్న శుక్రవారం పంచాయితీ.

    అందరూ ఇక్కడికే వచ్చారు. ఆ చచ్చినోడు అపర్ణ నాన్న తో సహా. అంతా నిశ్శబ్దం. అపర్ణ నిలబడి ఉంది , చేయని తప్పుకు బలి ఇవ్వబోయే మేకపిల్ల లా . పక్కనే ఏడుస్తూ అపర్ణ తల్లి , ఇంతమంది పంచాయితీలో ఇద్దరు ఆడవాళ్ళు. హ్మ్మ్..న్యాయం గురించి భయం వేసింది.

    మళ్ళీ గిరి అడిగిన దాని గురించి అందరూ చర్చించారు. చక్కగా నిలబడి ఉన్నాడు. అంత చక్కగానూ.. బెదురూ జంకూ గొంకూ లేకుండా చెప్పాడు – “ అపర్ణ నేను వేసుకున్న పంట, దానిమీద హక్కు నాదే .. కాదనటానికి మీరెవరు?” – నచ్చాచేపుదామనుకున్న పెద్దలు ఆవేశంగా బుసలు తీయటం నేను విన్నాను. కాస్త దూరంగా వింటున్న యువకులు , కొట్టేసేటట్టు చూస్తున్నారు. ఒక పక్క , అపర్ణ తల్లి ఏడుపు. సదాశివ మూర్తి లేకపోతే గిరిని అక్కడికక్కడే ముక్కలు చేసేవారే.

    కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, సదాశివ మూర్తి మాట్లాడాడు. నిర్దిష్టంగా, గిరికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ- అతని కోరిక ఎంత తప్పో, దాని వల్ల అపర్ణ జీవితం ఎలా పాడవుతుందో తెలియజేస్తూ. సదాశివ మూర్తి అంటే నాకెప్పుడూ గౌరవమే. ఇంకొంచం పెరిగింది. భూభారం మోస్తున్నట్టు మూల నిలబడ్డ పచ్చటి మొక్కలాంటి అపర్ణ మీద జాలి వేసింది. అపర్ణ తల్లి ఉండీ ఉండీ , ఏడుస్తున్న స్వరం మాత్రమే నేపధ్య సంగీతంలా వినిపిస్తోంది.

    గిరిని చూసాను. వింటున్నాడు.వింటున్నాడు. తల దించుకొనే ఉన్నాడు. మారాడా .. మారితే బాగుణ్ణు అనిపించింది.

    సదాశివ మూర్తి మాట్లాడటం ఆపగానే, - తలెత్తాడు గిరి – “అయిపోయిందా మీరు చెప్పటం ?’ అన్నాడు

    “--------------------------“ పంచాయితీలో కాస్సేపు మౌనం , ఊపిరాడని తనం కలబోసుకున్నాయి.

    గిరి మొదలెట్టాడు- ‘నేను నా ఇంట్లో అపర్ణని కావాలనుకుంటే మీరేం చేయగలరు? నేను చాలా మంచివాడిని కాబట్టి, ఏదో డానికి దారి చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రీ గా సుఖం అనుభవించకుండా , నేను బలవంతం చేస్తే ఏం చేయగలరు?, కాదు కాబట్టే కదా ఉంచుకుందాం అనుకుంటున్నాను . కొన్నేళ్ళ తర్వాత ఎవడ్నో ఒకడ్ని చేసుకుంటుంది. అది కూడా దాని అమ్మలాగే. సుమతి భోగం కులంలో పుట్టింది. కన్నెరికం వాళ్ళకేమైనా కొత్తా? “

    ఉన్నపళంగా నా మొత్తం బరువు వాడి మీద వేసి , కుమ్మాలనిపించింది. ఆపుకోలేనితనంతో, ఒక్కసారి నా కొమ్మలు ఝుళిపించాను.

    సదాశివ మూర్తికి కూడా అట్లాగే అనిపించింది కాబోసు, గిరి మీద చెయ్యెత్తి, ఆగిపోయాడు.

    కొద్ది క్షణాలు తమాయించుకొని, మాట్లాడాడు – విన్నావు కదా అపర్ణ తల్లీ, నువ్వు వయసులో చిన్నదానివే కావచ్చు , కానీ , వచ్చిన సమస్య దృష్ట్యా నువ్వేం అనుకుంటున్నావో చెప్పు.

    గుప్పెడు క్షణాల నిశ్శబ్దం తర్వాత అపర్ణ మాట్లాడింది- “ నాన్న.. ఎంత భరోసా అయిన పదం. నువ్వు వచ్చేవరకూ, నేను ఎంత సంతోషించాను నాన్నా.. ఇప్పటికీ నిన్ను గిరీ అని పిలవలేకపోతున్నాను. నువ్వు పిలవమన్నా, నాకు నీకోరిక అర్ధం అవగానే మొదట కడుపులో తిప్పింది. అంటే, నేను స్నేహలాగ .. నాన్న గుండెల్లో దూరలేను, నాన్నతో ఆడుకోలేను. ఎందుకు నాన్నా , అని నేను అడగను . కొన్ని క్షణాల్లోనే నా బాల్యం , నువ్వంటే నాకున్న ఇష్టం అన్నీ భయం గా మారిపోయాయి. నేను చాలా దురదృష్టవంతురాలిని నాన్నా.. తండ్రికి కోరిక పుట్టించిన ఈ శరీరం అంటే అసహ్యం వేసింది. ఏం  తప్పు చేసాను నాన్నా .. నేనే మగపిల్లాడినయితే ఎంత బాగుండును. నువ్వు కొడుకువయిపోతే బాగుండునే అపర్ణా ..అనేది అమ్మ, కొన్ని క్షణాలు నాకూ అలానే అనిపించింది నిన్ను కలిసాక. – దుఖంతో డగ్గుత్తిక స్వరంలా మారింది అపర్ణ కంఠం.

    .........................నాకు నాన్న వద్దు అంకుల్, అతని కోరిక ఒక భయంకరమైన జ్ఞాపకం, నేను అది మర్చిపోయి చదువుకోవాలి అనుకుంటున్నాను. నాకు గిరిధర్ గారితో, శాశ్వతంగా తెగతెంపులు కావాలి. అది మీరు ఎలా చేసినా సరే, నన్ను , తండ్రి లేదా దగ్గర సంబంధీకుల అవాంచిత, అనాగరిక కోరికలకి బలై జీవితాంతం కుమిలిపోయే ఎంతో మంది ఆడపిల్లల సమూహంలో నన్ను చేరనీకండి. “

    గిరి తలదించాడు, మొదటిసారి భుజాలు కూడా వంగినట్టు అనిపించాయి. చావనీ వెధవని అనుకున్నాను – కొద్ది సేపు పంచాయితీ పెద్దల వాదోపవాదాలు సాగాయి. గిరి పక్షాన ఎవరూ ఉన్నట్లు నాకు అనిపించలేదు. హమ్మయ్య

    రెట్టించిన ఉత్సాహంతో ఖంగుమంది సదాశివమూర్తి కంఠం.. “ సుమతి కోరిక మేరకు, ఈ పంచాయితీ పెట్టడం జరిగింది. ఇప్పటివరకూ ఈ పంచాయితీ మొగుడూ పెళ్ళాల విడాకులు మాత్రమే చూసింది. మొదటిసారి ఒక కూతుర్ని తండ్రి ఇంటి పేరు నుండీ, వారసత్వం నుండీ, అధికారికంగా మేము విడదీస్తున్నాం. గిరిధర్ గ్రామంలో సంపాదించిన ఆస్తి, అతని భార్యకీ, కూతురికీ సమానంగా చెందుతుంది. అపర్ణ చదువు ని, గ్రామ పెద్దలు పర్యవేక్షిస్తారు. ఇకనుండీ , ఈ గ్రామమే ఆమె అమ్మ, నాన్న. అపర్ణ తల్లి సుమతి, తనకు విడాకులు కావాలో వద్దో, తనే నిర్ణయించుకోవాలి. అది వేరే విషయంగా పంచాయితీ తీసుకుంటుంది. గిరిధర్ ని, సామాజికంగా వెలి వేయటమే కాకుండా, గ్రామ బహిష్కారం చేస్తున్నాము. అపర్ణ బాధ్యత పూర్తిగా నేను, పంచాయితీ తీసుకుంటున్నాము. ప్రస్తుతం చదువు పూర్తి అయ్యేవరకూ, మా ఇంట్లో ఉంది చదువుకుంటుంది.‘

    నిజం చెప్పొద్దూ నా మనసు పులకరించింది. దూరంగా ఎక్కడో మేఘం గర్జించింది. ఈ గిరిధర్ బహిష్కారం తో, వెచ్చే శ్రావణ వాన ముందుగానే వచ్చినట్టయి, నన్ను నేనే శిరఃస్నానానికి సమాయత్తం చేసుకున్నాను.

    పంచాయితీ పెద్దలు ఒకరూ , ఒకరూ రచ్చబండ దిగి వెళ్ళిపోతున్నారు , సదాశివ మూర్తి వెనుకే అపర్ణ రెండు అడుగులేసి , అక్కడే కూర్చున్న గిరి దగ్గరకి వచ్చింది.

    “ నువ్వు బలవంతం చేస్తే ఏం చేస్తారు అని అడిగారు కదా ..గిరీ.. ఎదుర్కొంటాను,లేకపోతే నిన్ను వీధిలో పెడతాను. ఇవాళ చేసినట్టు .. భోగం వాళ్ళం , వ్యభిచారమే చేయాలనుకుంటే , కన్నతండ్రి తో చేయనక్కరలేదు కదా ? నా తల్లితో సంసారం చేసిన సెకండ్ హ్యాండ్ ప్రియుడు నాకెందుకు ..” చివరిమాట పలికే  కసి, అక్కడ ప్రతిధ్వనించింది.

    అపర్ణ ముందు నడుస్తున్న సదాశివ మూర్తి ని చేరుకుంది .

    నెమ్మదిగా సుమతి , అపర్ణ వేనుకనే అడుగులు కదిపింది. శిలలా కూర్చున్న గిరి చుట్టూ మేఘాల చీకటి ఆవరించింది.

    వచ్చే వర్షానికి సూచనగా వాతావరణం ఆహ్లాదంగా మారింది .


(మాతృక మాసపత్రిక 2015 ఫిబ్రవరి సంచికలో ప్రచురితం)

Comments