నన్ను మన్నించరూ ? - డి. శ్రీనివాస దీక్షితులు

    పూర్వ దిగ్విజయ యాత్ర ముగించుకొని శ్రీకృష్ణ దేవరాయలు రాజధానికి తిరిగి వచ్చాడు. విజయోత్సవ వేడుకలతో విజయనగరం కళకళలాడుతోంది.  
         
    కోటలోపల విశాలమైన మైదానంలో ఒక వైపున ఎతైన వేదికని నిర్మించారు. దాని మీద ఉన్నతాసనంలో రాయలవారు అసేనులయ్యారు. ఆయనకి కుడి ప్రక్కన మహామంత్రి సాళువ తిమ్మరుసు, సాళువ గోవిందరాజు, రెంటూరి చిట్టమంత్రి కూర్చున్నారు. ఎడమ వైపున దండనాధుడు త్రియంబక దేవుడు కూర్చున్నాడు. 
          
    మైదానం మధ్యలో వలయాకార ప్రదేశం..... అక్కడ యుద్ధంలో అపూర్వ పరాక్రమాన్ని ప్రదర్శించిన సైనికులు అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇసకవేస్తే రాలనంత జనం.... మగవాళ్ళు, ఆడవాళ్ళు,పిల్లలూ ఆ వలయం చుట్టూ నిలబడి చూస్తున్నారు.... మధ్య మధ్య కరతాళ ధ్వనులు చేస్తూ  సైనికుల్ని ఉత్సాహపరుస్తున్నారు. వలయం చుట్టూ భటులు నిలబడి తోసుకొని ముందుకి రాకుండా జనాన్ని అదుపు చేస్తున్నారు. 
        
    అంతలో మహామంత్రి తిమ్మరుసు లేచి నిలబడి "ప్రభూ! పూర్వ దిగ్విజయ యాత్రలో ఉత్కళాధిపతి కుమారుడైన వీరభద్ర గజపతి మనకి బందీ అయ్యాడు. ఖడ్గ యుద్ధంలో అతని ప్రావీణ్యాన్ని తమరే  స్వయంగా యుద్ధంలో మెచ్చుకున్నారు. ఇప్పుడు వీరభద్ర గజపతి తన ఖడ్గ విద్య ప్రావీణ్యాన్ని తమ సమక్షంలో ప్రదర్శిస్తాడు" అని ప్రకటించి కూర్చున్నాడు. 
        
    జనం ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేటట్లు జయ జయ ద్వానాలు చేసారు.
         
    శ్రీకృష్ణ దేవరాయలు తన  ఎడమ చేతితో గుబురు మీసాన్ని మెలిపెడుతూ ఆసక్తిగా చూస్తున్నాడు. 
          
    ఇద్దరు భటులు వెంటరాగా వీరభద్ర గజపతి రాజసంతో ఠీవిగా నడచి వచ్చి వలయాకారం నడుమ నిలబడ్డాడు. బోనులోనించి బయటికి వచ్చిన పులిలాగా ఉన్నాడు గజపతి. వెంట వచ్చిన భటులు ఇద్దరూ దూరంగా జరిగారు. 
         
    మైదానమంతా నిశ్శబ్ధం ఆవరించింది. చీమ చిట్టుకుమంటే వినబడేంత నిశ్శబ్ధం అది. చుట్టూ ఉన్న జనం వంక కలయ చూసాడు గజపతి. తలేత్తి వేదిక పైనున్న రాయల వంక చూసాడు. ఆ చూపులో కోపం ఉంది... పౌరుషం ఉంది...ఆత్మాభిమానం ఉంది...అవమానభారం ఉంది… 
           
    మహామంత్రి తిమ్మరుసు వంక చురుక్కుమని చూసాడు….. దండనాధుని వంక కసిగా చూసాడు గజపతి. 
          
    తన నడుముకి వేలాడుతున్న ఓర లోంచి ఖడ్గాన్ని సర్రున బయటికి లాగాడు వీరభద్ర గజపతి. దాన్ని పైకెత్తి కుడి చేత్తో పట్టుకుని అతను గుండ్రంగా తిరిగాడు. ఆ ఖడ్గం తళ తళా మెరుస్తోంది . కాలసర్పంలా ఉన్న ఆ కరవాలాన్ని గాలిలో ఇష్టం వచ్చినట్లుగా పైకి.... కిందకి.... అటు....ఇటు....గుండ్రంగా.... మెరుపు వేగంతో తిప్పూతూ అంతే కంటే వేగంగా తానూ కదులుతుంటే గజపతిని జనం నిశ్చేష్టులై చూస్తున్నారు.... రెప్ప వెయ్యటం కూడా మరిచిపోయారు.     

    అంతలోనే గాలిలోకి ఎగిరాడు గజపతి.... నేల మీద నలుదిక్కుల తిరిగాడు.... అతనితో పాటు కత్తీ  తిరుగుతోంది.... కత్తితో పాటు అతను తిరుతున్నాడు.... కత్తి కనిపించటంలేదు.... కత్తీ అతను కనిపించటంలేదు. 
         
    “అహొ! కరవాల చాలనంలో ఏమి లాఘవం....ఎంత నైపుణ్యం....ఏం వేగం.... ఎంత చాకచక్యం.... భళీ! వీరభద్ర గజపతి! భళీ!" అని వేదికపై నుంచి ప్రశంసించాడు శ్రీకృష్ణ దేవరాయలు. 
  
    ఆ ప్రశంసల్ని వింటునే వీరభద్ర గజపతి అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు.  
        
    ఎడమ చేత్తో.... కుడి చేత్తో.... కుడి చేత్తో.... ఎడమ చేత్తో.... చూపులకి అందనంత వేగంతో రెండు చేత్తుల్లోకి మార్చుకుంటూ కత్తిని తిప్పుతున్నాడు గజపతి. 
      
    అతని శరీరమంతా చెమటతో తడసి ముద్దయింది. అయినా అతనిలో ఏమాత్రం అలసట కనిపించటంలేదు. 
    
    గజపతి ఖడ్గ విన్యాసాలు పరాకాష్టకి చేరుకున్నాయి. 
    
    జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. 
    
    రెప్పలార్పకుండా చూస్తున్నారు. 
    
    మరుక్షణంలో....
     
    గజపతి పాదాల తాకిడికి ఉవ్వెత్తున దుమ్ము లేచింది.... ఆ దుమ్ముతో పాటే అతని చేతులోని ఖడ్గం తారాజువ్వలా నింగి కెగిరింది.... అతను నడుముని కొంచెం వెనక్కి వంచి గుండెని దానికభిముఖంగా చేసి నిలబడ్డాడు.... అంతే.... ఆ ఖడ్గం ఆకాశం నుంచి వేగంగా వచ్చి అతని గుండెలో దిగబడింది. వెంటనే రక్తం పైకి విరజిమ్మింది. తటాలున వెనక్కి పడిపోయాడు గజపతి.... ఆ మహావీరుని ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమయ్యాయి....
  
    జనం హాహాకారాలు చేసారు. 
  
    మహామంత్రి నివ్వెరపోయాడు.
           
    మహారాజు మొహం చిన్న బోయింది. 

* * *               
              
    క్షణాల్లో  ఈ వార్త రాయల అంతఃపురంలో బందీగా ఉన్న గజపతి తల్లి వసుంధరాదేవికి చేరింది. ఆమె దు:ఖ  సముద్రంలో మునిగి పోయింది. పరిచారికలు ఆమెను ఓదార్చారు.  
              
    "నాయనా! వీరభద్రా! నాకంటే ముందుగా నువ్వే వెళ్ళిపోయావా?  ఎందుకయ్యా ఇంత తొందరపడ్డావు? నువ్వు లేకుండా నేనెలా జీవించేది? నీ ఖడ్గ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మెప్పూ పొంది వీర మరణాన్ని వరించావు! నీకు తప్పకుండా వీరస్వర్గం లభిస్తుంది! మహారాజునీ.... నీ సోదరినీ.... నేనెలా ఓదార్చేది?" అని వసుందరాదేవి కడుపుతరుక్కుపోయేలా రోదించింది. 
              
    పూర్వ  దిగ్విజయ యాత్రలో భాగంగా బలవంతులైన గజపతుల ఆధీనంలో ఉండి శత్రు దుర్బేద్యమైన కొండపల్లి దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యంతో ముట్టడించాడు. నెలల తరబడి యుద్ధం కొనసాగింది. చివరికి ఆ దుర్గాన్ని రాయలు స్వాధీనం చేసుకున్నాడు. గజపతుల అధీనంలోని ఇతర దుర్గాల్ని కూడా రాయలు జయించాడు. కృష్ణానదికి ఆవలి ఒడ్డున యుద్ధ సన్నద్ధుడై ఉన్న ఉత్కళాధిపతి ప్రతాపరుద్ర గజపతి పైకి రాయలు దండెత్తగా అతను తప్పించుకొని పారిపోయాడు. అతని భార్య వసుంధరదేవినీ, కుమారుడు వీరభద్ర గజపతినీ చెరబట్టి విజయనగరానికి పంపాడు రాయలు.          

    తర్వాత సింహాచలం వరకూ దిగ్విజయ యాత్రని సాగించి రాయలు తిరిగి రాజధానికి చేరుకున్నాడు. ఆ సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో వీరభద్ర గజపతి మరణించాడు. మహామంత్రి తిమ్మరుసు తన వేగుల ద్వారా ప్రతాపరుద్ర గజపతికి అతని కుమారుని మరణ వార్తని పంపాడు. 
             
    గజపతి భార్యని చేరబట్టినా ఆమెను కారాగారంలో ఉంచలేదు. రాయలు వారి అంతఃపురంలోనే ప్రత్యేక మందిరంలో ఉంచారు. ఆమెను సేవించటానికి పరిచారికల్ని నియమించారు. ఆమె గౌరవానికి భంగం వాటిల్లకుండా తిమ్మరుసు అన్ని జాగ్రత్తల్లూ తీసుకున్నాడు. వసుందరాదేవి దగ్గరికి మహామంత్రి తిమ్మరుసు పరిమిత పరివారంతో వచ్చాడు. ఆమె విచార వదనంతో కూర్చుని ఉంది. "మహారాణీ! మీ కుమారుడు వీరభద్ర గజపతి.... మేం ఊహించని రీతిలో.... తన ప్రాణాల్ని తీసుకున్నాడు. రాయలవారు ఈ సంఘటన చూసి బాగా కలత చెందారు. మేమందరం బాధపడ్దాం. వెంటనే ప్రతాపరుద్ర గజపతులవారికి ఈ వార్తని వేగుల ద్వారా పంపించాం. మీకు కలిగిన ఈ గర్భశోకాన్ని ఎవరూ పోగొట్టలేరు. రాజులకి జనన మరణాలు అత్యంత సహజమైనవని అందరికీ తెలిసిందే. గుండె దిటవు చేసుకోండి. మీ కుమారుడు మహా వీరుడు. వీరోచితంగానే ప్రాణాల్ని వదిలాడు" అని వసుంధరాదేవితో స్వాంతన వాక్యాలు పలికాడు మహామంత్రి. 
           
    "మహామంత్రీ! మా వీరభద్ర గజపతికి చిన్నప్పటినుంచీ ఆత్మాభిమానం ఎక్కువ. జయాప జయాలు దైవాధీనాలని గ్రహించకుండా అపజయాన్ని జీర్ణించుకోలేక తొందర పడ్డాడు. వె...ళ్ళీ... పో... యా...డు...వె...ళ్ళీ...పో...యా...డు...!" అంటూ వసుంధరాదేవి తన చీరకొంగుని ముఖానికి అడ్డం పెట్టుకుని దు:ఖాన్ని దాచుకోవటానికి ప్రయత్నించింది. 
          
    "మహారాణీ! ఊరడిల్లండి....ఊరడిల్లండి! ఓదార్పులకీ సానుభూతులకీ లొంగని దు:ఖం మీది. మీ బాధని మాన్పే శక్తి ఒక్క కాలానికే ఉంది. రాజాజ్ఞ అయింది... ఒక్కసారి వచ్చి.... మీరు మీ కుమారుని.... కడసారి చూపు చూస్తే.... రాజలాంఛనాలతో మీ కుమారునికి ఉత్తరక్రియలు జరిపిస్తాం" అన్నాడు మహామంత్రి తిమ్మరుసు.  
       
    "అలాగే!" అంది వసుంధరాదేవి. 
        
    తిమ్మరుసు వెళ్ళి పోయాడు. 
          
    పరిచారికలు వెంటరాగా వసుంధరాదేవి వెళ్ళి తన కుమారుని పార్ధివ శరీరాన్ని చూసి వచ్చింది. రాజలాంఛనాలతో వీరభద్ర గజపతి ఉత్తరక్రియలు పూర్తయ్యాయి. 
       
    వారం రోజుల తర్వాత ప్రతాపరుద్ర గజపతి దగ్గరి నుంచి వార్తా హరుడు వచ్చి తిమ్మరసుకి ఒక లేఖని అందించాడు. అందులో గజపతి సంధిని కోరాడు. ఆ విషయాన్ని రాయల వారితో చర్చించాడు తిమ్మరుసు.      మహారాజు అనుమతితో "మీ కుమార్తెను మా మహారాజుగారికిచ్చి వివాహాన్ని జరిపిస్తే మీ సంధికి మేం అంగీకరిస్తాం. మీ మహారాణిని విడిచి పెట్టగలం. మేం జయించిన మీ దుర్గాల్ని మీకు తిరిగి ఇవ్వగలం" అని తిమ్మరుసు ప్రత్యుత్తరాన్ని ప్రతాపరుద్ర గజపతికి పంపాడు.
       
    ఆ లేఖని చదివి గజపతి "తన కుమార్తెను రాయలవారికిచ్చి వివాహాన్ని జరిపించటానికి మనఃస్పూర్తిగా అంగీకరిస్తున్నట్టు లేఖ రాసి తిమ్మరుసుకి పంపాడు. 
        
    వసుంధరాదేవిని సగౌరవంగా గజపతి వద్దకు పంపాడు తిమ్మరుసు. గజపతి సంతోషించాడు.  
       
    కానీ.... గజపతి కుమార్తె లక్ష్మీదేవి మాత్రం రాయల వారిని వివాహమాడటానికి సుముఖంగా లేదు.
 
    "నాన్నగారూ! నాకు చెప్పకుండా మీరీ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది?" అని తండ్రిని సూటిగా అడిగింది లక్ష్మీదేవి.

    "అమ్మా! మన రాజ్యక్షేమం కోసం మహారాణీ విడుదల కోసమే నేనీ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అంతే కానీ నిన్ను బాధపెట్టటం కోసం కాదు తల్లీ!" అన్నాడు గజపతి.

    "నా సోదరుని మరణానికి కారణమైన రాయలవారిని నేనెలా వివాహమాడతానననుకున్నారు?" అంది రాజకుమారి.
      
    "రాజకుమారీ! నీ సోదరుని మరణానికి రాయలవారు కారణం కాదు. వీరభద్రుడు తొందరపడ్డాడు" అంది మహారాణీ.

    ".....అమ్మా! మీతో నేను ఏకీభవించలేను. అయినా... నాకు మరో కారణం కూడా ఉంది!" అంది రాజకుమారి.

    "ఏంటా కారణం?" మహరాజూ, మహారాణీ ఇద్దరూ ఒకేసారి అడిగారు.

    "నేను గజపతుల వారి బిడ్డని, సుక్షత్రియ వంశంలో జన్మించాను. మరి రాయాలో.... దాసీ పుత్రుడు! ఆయనతో నాకు వివాహమా?"ఈసడింపుగా అంది రాజకుమారి.

    గజపతి మౌనంగా ఉండిపోయాడు.
 
    "రాజకుమారీ! రాయలవారు దాసీ పుత్రుడని నీకెవరు చెప్పారు?" మహారాణీ అడిగింది.

    "తల్లిగారూ....! మీరింత వరకూ వినలేదా? లోకమంతా కోడై కూస్తుంటే..." హేళనంగా అంది రాజకుమారి.

    "లోకులు కాకులు! వాళ్ళు చేప్పేవన్నీ నిజాలు కావు" అంది మహారాణీ.

    "అమ్మా! అయితే.... తమరు గ్రహించిన నిజమేమిటో సెలవియ్యండి" అంది రాజకుమారి.

    గజపతి ఆసక్తిగా వింటున్నాడు.

    "రాయలవారు  ఉత్తములు.... సంస్కారవంతులు. విదేశీ యాత్రికులు కూడా ఆయన్ని గొప్పగా మెచ్చుకుంటున్నారు. నేను వారి చెరలో ఉన్నప్పుడు నన్నెంతో గౌరవంగా చూసుకున్నారు. నన్ను చెరసాలలో ఉంచలేదు. ప్రత్యేక మందిరంలో ఉంచారు.  నీ సోదరుని కూడా గౌరవంగానే చూసారు..." చెప్పింది మహారాణీ.

    “విషయాన్ని మహారాణీ గారు ప్రక్కదోవ పట్టిస్తున్నారు" అంది రాజకుమారి అసహనంగా.

    "లేదు! లేదు! రాయల వారి గురుంచి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలనే నీకీ విషయాలు చెప్పాను. రాయల వారు దాసిపుత్రుడని లోకంలో ప్రచారమైన మాట నేనూ విన్నాను. నేనక్కడ ఉన్నప్పుడు ఆ విషయమే తెలుసుకోవాలనుకున్నాను. తెలుసుకున్నాను." అంది మహారాణీ.

    "ఊ చెప్పండి!" అనడిగింది రాజకుమారి.

    "రాయల వారి తండ్రి నరసింహరాయలుకి తిప్పాంబిక, నాగంబిక,ఓబాంబిక అని ముగురు భార్యలు. తిప్పంబికకి వీరనరసింహరాయలు, నాగంబికకు శ్రీకృష్ణదేవరాయలు,ఓబాంబికకు అచ్యుతరాయలు, 
శ్రీరంగరాయలు జన్మించారు. తిప్పాంబిక చదరంగాపు ఆటలో దిట్ట. కుటిల బుద్ధిలో సాటి లేనిది. మహారాజుకి అంత్యంత ప్రియురాలిన నాగంబిక మీద తిప్పాంబిక ద్వేషాన్ని పెంచుకుంది. ఒక రోజు చదరంగపు ఆటలో ఓడిన వారు గెలిచినా వారికీ ఆరు నెలలు పాటు దాసిగా ఉండాలని పందెం వేసింది తిప్పాంబిక . ఆమె బలవంతం మీద నాగంబిక చదరంగం ఆడి ఓడిపోయింది. అప్పటి నుండి ఆరు నెలల పాటు నాగంబికని "దాసీ" అని పిలిచింది తిప్పాంబిక . ఆ విధంగా పరిహాసంగా నాగంబిక దాసీ అయిందే కానీ ఆమె నిజంగా దాసీ కానే కాదు! ... రాయలు దాసీ పుత్రుడు కాడు!'' వివరంగా చెప్పింది మహారాణీ.

    "అయితే... నాగంబిక ఎవరి ఆడపడుచు?" ఆసక్తిగా అడిగింది రాజకుమారి.

    "నాగంబిక సాగి వారి ఆడపడుచు. సాగి వంశం పురాతన కాలం నుంచి సుక్షత్రియ వంశం" అంది మహారాణీ.

    " అమ్మా! ... మీరెంతగా చెప్పినా నాలో రగులుతున్న  ప్రతీకార జ్వాల చల్లారటంలేదు. నా మనుసు నా మాట వినటం లేదు" అంది రాజకుమారి.  
       
    పెళ్ళైన తర్వాత అన్ని అవే సర్ధుకుంటాయిలే అనుకోని రాజ దంపతులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.  
         
    తర్వాత శ్రీకృష్ణదేవరాయలుకి ... లక్ష్మీదేవికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. 
         
    పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మీదేవిని చాల జాగర్తగా గమనిస్తున్నాడు తిమ్మరుసు. 
         
    సపరివారంగా రాయలు రాజధానికి తరలివచ్చాడు.

*  *  *

    ఆ రోజు .... రాయల వారికి శోభనం. 

    మహామంత్రి తిమ్మరుసే స్వయంగా ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు. శోభన మందిరాన్ని అందంగా అలకరించారు. మందిరంలో పానుపు మీద శ్రీకృష్ణదేవరాయలు పడుకొని ఉన్నాడు. పసిడి బొమ్మల మెరిసిపోతున లక్ష్మీదేవి శోభన  మందిరంలోకి అడుగుపెట్టింది. తలుపులు మూసుకున్నాయి. సన్నని దీపాల వెలుగులో క్రీగంటగా రాయల వారిని  చూసింది లక్ష్మీదేవి.  
     
    ఆమె మనసులోని ప్రతీకార జ్వాల ఉవ్వెత్తున లేచింది.... నిగ్రహించుకుంది.... అంత:పురంలోని పరిచారికలు అన్న మాటలు ఆమెకు గుర్తొచ్చాయి.  
        
    "కొత్త రాణిగారు ఎంత  అద్రుష్టవంతురాలో.... రసికులైన రాయలవరి పొందు లభించటం అంటే మాటలా?... మన రాయలవారు పిన్న వయసులోనే ఎన్నో విజయలు సాధించారు.సాహితీ సమరాంగణ సార్వభౌముడు.... మహ పురుషుడు...దయార్ద్రహృదయుడు...స్ఫురద్రూపి ఆయన".
 
    ఆ మాటలే  ఆమె చెవుల్లో  మారుమ్రోగుతున్నాయి.   
      
    మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ...తల వంచుకుని ఆమె పానుపు దగ్గరికి చెరుకుంది. శృంగారంతో పరవసించి పోవలసిన ఆమె తనువు ఉద్రేకంతో ఊగిపోతోంది.... కళ్ళు ఎరుపెక్కాయి .... పెదవులు అదురుతున్నాయి.... ముక్కు పుటాల్లోంచి వెచ్చని నిట్టూర్పులు వెలుపడుతున్నాయి. 
     
    పానుపు మీద వెల్లికిలా పడుకుని ఉన్నాడు రాయలు. పాదాల నుంచి మెడ వరకూ దుప్పటి కప్పుకొని ఉన్నాడు . 
   
    "మహారాజు నిద్ర పోవటానికి ఇదా సమయం? ఇదేమి రసికత?" అనుకుంటూ ఆమె కాసేపు నిలబడింది.      ఉద్రేకం ఆమెను నిలవనివ్వటం లేదు.  
     
    "ఇక ఆలస్యం చెయ్యటం మంచిది కాదు!'' అని దృఢంగా నిర్ణయించుకొని బొడ్డులో దాచిన చురకత్తిని ఆమె బయటకు తీసింది. 
        
    తన శక్త్తినంతా కూడదీసుకుని రాయల గుండెలో చురకత్తితో గట్టిగా మూడు సార్లు పొడిచింది లక్ష్మిదెవి.రక్తం పైకి చిమ్మింది. ఆమె ఉద్రేకం పాల  పొంగులా చల్లారిపొయింది. ఆమె ఆలొచించటం ఆరంభించింది.  
      
    "అయ్యో! తొందరపడి రాయలవారిని చంపేసానా? అందరూ అనుకొంటున్నట్టు ఆయన మంచి వాడేనా? అయితే .... నా పాపానికి నిష్కృతి లేదా? మంచి రాజుని... బంగారంలాంటి భర్తని పొట్టన పెట్టుకున్నానా? ఛీ! ఛీ! ఇక నా బ్రతుకెందుకు?" అనుకుంటూ రాయలుని పొడిచిన కత్తితోనే తనను పోడుచుకోవటానికి సిద్దపడింది లక్ష్మీదేవి. 
     
    రహస్య ద్వారం లోంచి మందిరంలోకి వస్తూ "ఆగండి రాణిగారూ! ఆగండి.... తొందరపడకండి" అన్నాడు తిమ్మరుసు. "ఇక నేను జీవించి ఏం లాభం? ఎవరికి లాభం? నన్ను ఆపకండి!" అని కత్తితో పోడుచుకోబోయింది లక్ష్మీదేవి.  
  
    వెంటనే వేగంగా ముందుకి కదిలి లక్ష్మీదేవి చేతిలోని కత్తిని తీసుకుని పక్కకి విసిరేసాడు తిమ్మరుసు.తర్వాత లక్ష్మీదేవిని రహస్య ద్వారం గుండా విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు తిమ్మరుసు.
       
    ఆ గది మధ్యలో మల్లె పూలతో అలంకరించిన హంసతూలికాతల్పం ఉంది. దానిమీద తెల్లటి వస్త్రాలు ధరించి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు కృష్ణదేవరాయలు. ఆయన్ని చూడాగానే ఆశ్చర్యపోయి తిమ్మరుసు వంక చూసింది లక్ష్మీదేవి.   
          
    "మహారాజు మీద పగతో ఉన్నారని గ్రహించాను. మీలో పశ్చాత్తాపం  కలగాలని భావించాను. అందుకే మైనంతో చేసిన రాయలవారి విగ్రహాన్ని పానుపు మీద పెట్టించాను. మీకు అనుమానం రాకుండా తగు జాగర్తలు తీసుకున్నాను. మీ మనసులోని భావోద్రేకం వాళ్ళ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు" చెప్పాడు తిమ్మరుసు.  
        
    "మహామంత్రి! వెంటనే నన్ను ఉరి తీయించండి.! నేను చేసిన పనికి అదే సరైన శిక్ష." అంటూ తన రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తోంది లక్ష్మి దేవి. 

    మెల్లగా పానుపు దిగి వచ్చాడు రాయలు. 

    తిమ్మరుసు అక్కడి నుంచి నిష్క్ర్రమించాడు.   

    లక్ష్మీదేవి  భుజాల మీద చేతులు వేసాడు రాయలు. 

    ఆమె కళ్ళు తెరచి చూసింది.    

    ఎదురుగా మొలకనవ్వుల రాయలు.   

    "నన్ను మన్నించరూ?" పరితాపంతో అంది లక్ష్మీదేవి.     
 
    "ఊ ...." అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

(నవ్య వీక్లీ అక్టోబరు 27,2010 సంచికలో ప్రచురితం)
Comments