నారిగాని బతుకు - గూడూరి సీతారాం

    
పొద్దుగూకస్తుంది. గౌండ్లొల్ల నారిగాడు మంచలకెల్లి లేచి అవతలి మొకాన పోవల్ననుకుంటున్నడు. కండ్లుమూసి తెరిసేవరకే అయిపోయింది. నారిగాని కోడలు కల్లు అంచుతుండంగ అంచుతుండగనే, చేతిలోని ఆకును కిందపారేసి దాని కొంగుపట్టి గుంజిండు కల్లు తాగేటోడు. అది లబ్బ లిబ్బ మొత్తుకుంది. ఆనికి పక్కన కూసున్న యింకోడు జట్టన లేచి దౌడమీదికెల్లి యియ్యర బయ్యర నాలుగుతికిండు.

    లేచి నిలుసున్న నారిగాడు అట్లనే కూలపడిపోయిండు. ఒక్కపారే కండ్లు బైర్లు కమ్మినట్లయింది.

    గా చిన్నతనాన్నే నారిగానికి లగ్గమైంది. ఆని అయ్య అవ్వ ఎప్పుడూ నారి లగ్గమెప్పుడైద్దో చూసి సల్లా కన్ను మూయాలనుకున్నరు. ఆఖరికి ఆల్లు అనుకున్నట్టే ఓ అయిదేండ్ల పోరిని దెచ్చి నారిగానికి ముడేసిండ్రు. నారిగానికి యిద్దరన్నలూ, ఒక అక్కా ఉన్నరు. గప్పుడు అందరు పొత్తుల్నే ఉండెటోళ్ళు. కాని యింట్ల పడకుంట వచ్చింది. నారిగాని ఇద్దరు వదినెలూ యింట్లుంటే సాలు, పొయిల ఉప్పేసుకున్నట్టే. గందుకే నారిగాని పెండ్లాం పెద్దది కాకముందే అన్నగాళ్లు ఏరువడ్డరు. అప్పటికి నారిగాడు చానా సిన్నోడు. మా ఉంటే పదమూడు పద్నాలుగేండ్లు ఉండొచ్చు. ఆళ్ళు ఏరువడేవర్కే అయ్య చచ్చిపోయిండు. యిగా నారిగాడు తల్లిని పట్టుకొని ఉన్నడు. ఆనికి ఒక్క అవ్వదప్ప లోకంల దిక్కెవ్వలున్నరు? పెండ్లాముందేగాని అదీ సిన్న పోరేనాయె. మెల్ల మెల్లంగ నారిగాడు తల్లి పట్టుకొనే పెద్దోడైండు. గానీ గప్పటికే నారిగాని అవ్వ సాతగాకుండ అయింది. ఇగ అవ్వకే అన్ని చేసి పెట్టాల్సచ్చింది నారిగానికి. గట్ల కూడా కొన్ని దినాలు గడిపిండు. ఎందుకో ఏమో పెండ్లాముండంగ వండి పెట్టుడు, అవ్వకు అన్నీ అరుసుకునుడు సిన్నతనమనిపించింది నారిగానికి.   గట్ల అనిపించిన్నాడే అవ్వకుజెప్పి అత్తగారింటికి వోయి పెండ్లాన్ని యెంటవెట్టుకొచ్చి యింటిపన్లన్నీ  జేయించిండు.

    నారిగాడు ఉడుకు నెత్తురు వట్టి ఉన్నడు. ఆని అన్నగాళ్లు సెరొక ఐదు తాళ్లు పట్టుకుంటే నారిగాడు పది ఒక్కడే తీసుకున్నడు. ఊర్లోల్లందరికన్నా పొద్దుగాల్నే లేచి తాళ్ళకు వొయ్యేది. జెప్పజెప్పన తాళ్లను గీసి కల్లు నింపు కొని, ఈదుల్లకు వొయ్యేది. అక్కడా కల్లు యిడుసుకొని అందరికన్నా ముందుగాల్నే ఊరుజేరేది.  మందంతా రెండు కడవలు కావడికేసుకొని మోసుగొస్తే నారిగాడు మూడు, ఒక్కొక్కసారి నాలుగు వేసుకొని వొచ్చేది. యింటికి  రాంగానే  నారిగాని పెండ్లాం లసుము కల్లు అమ్మేది. ఇగ ఈడేమో యింత దిని, సుట్టేసుకొని కమ్మంగా గుర్రుపెట్టుకుంట పండుకొనేది. మల్లా మూడు జాములు దాటంగనే ఓ సుట్టేసుకొని కావడి, మోకు ఏసుకొని ఎల్లిపోయి రాత్రి కొచ్చెటోడు. రాత్రి దెచ్చిన కల్లును కూడా లసుము సాకల్ది ఊరు దిరిగే దాకా అమ్ముకుంటా – మందికి కల్లు అంచుకుంటనే ఉండేది.

    ఇప్పుడిప్పుడే నారిగాని బతుకు ఒక తొవ్వల పడ్డదని నలుగురూ అనుకుంటున్నరు. ఆనికి దగిన పెండ్లామే దొరికింది. ఏదో ఉన్నది కలో గంజో ఉడికేసి గుట్టుగా సంసారం గడుపుకస్తుంది. నారిగానికి అవ్వవోయిన సంగతినే లసుము మరపించింది. సిన్నప్పుడేమో అవ్వ - పెద్ద పెరిగినాంక నేమో పెండ్లాం ఆనికి దిక్కైండ్రు.  నారిగాడు అవ్వవోయినాంక దిక్కులేని పచ్చి అయిండు. అన్నగాళ్ళేమో అంచుకన్నా రానియ్యలే! మొన్నటిదాకా జీతం చేయించుకున్న పటేలు దొంగతనం మోపి, యీపంతా మెరిగవెట్టి యింటికి పీకుమన్నడు. తాళ్లెక్కి కల్లు గీయాలనుకున్నడు నారిగాడు. కాని ఆనికి తాళ్ళు ఎవలిస్తరు. ఎవలిప్పిస్తరు. అయినా చూద్దామని తెగించి ఓనాడు పొద్దుగాల్నే ముస్తాజర్ యింటికి వోయి పెద్ద సాకల్ది ఊరు తిరిగే యాల్లదాకా నిలుసొని, ఆయన్ని కలిసి అడిగిండు. కాని పాపం ఆన్ని ఎవలు అడుగుతరు. "పో! యెల్లు గాడిద నీకెవడిత్తడ్రా తాళ్ళు. రేపకాల్ల ఏదన్న జోకమైతే, కిస్తీ యాల్లకు రకం యియ్యకుంటే ఏంజేసేది. ఆరి నీకు ఊళ్లో ఎవలన్నా జమానతు  ఉంటే తీసుకరా. చూద్దాం" అన్నాడు. పాపం...దిక్కు మొక్కు లేని నారిగానికి జమానతు ఎవలుంటరు. ఆని ఉందామన్నా సక్కంగా కొంపలేదాయె. భూమి - పుట్రా అసలే లేదాయె. నగలు అయితే ఆళ్ళ యింటా - వంటా లేదాయె. యిగ ఎట్లా! నారిగాడు రెండుమూడు రోజుల్దాకా సక్కంగా తిండన్నా తినలే! తిన్నా పెయిన వట్టలే! ఆఖరికి పెండ్లాన్ని బాగా జూసిండు. లసుము గప్పటికే మొగనితోని మాట్లాడుతుంది. దాని పెయ్యిమీద లగ్గంల పెట్టిన కార్లకడాలు, సెవుల పోగులు కనవడ్డయి. నారిగానికి ఏదో పోయిన పాణం లేచివచ్చినట్టైంది. ఆ రాత్రంతా లసుమును ఎన్నొవిధాల బుదరకించిండు. పాపం దానికి మొగడు పడుతున్న కష్టమంతా కనిపించింది. దాని పాణం కరిగిపోయింది. పెయ్యి మీదికెల్లి నవ్వుకుంటనే తీసియిచ్చింది. నారిగాడు తెల్లార సుక్క పొడవక ముందే ముస్తాజరు దగ్గరికి ఉరికిండు. తెచ్చిన నగలు కుదువవెట్టిండు. రెండు తాళ్ళను తీసుకొన్నడు. గా రెండు తాళ్ళతోని మొదలువెట్టిన నారిగాడు గిప్పటికి పదితాళ్ళు గీసే మొగోడైండు. ఉత్త సెవులతో కాళ్ళతో ఉన్న లసుముకు సెవులకు పడిగెలు - కాళ్ళకూ, చేతులకూ కడాలు చేయించిండు. నడుముకు బిళ్ళల ఒడ్డాణం, ఆనికేమో మోసేతికి కడెం అవీ - యివీ బాగా చేయించిండు. నారిగాడు ఊళ్లోని గౌండ్లోల క్కొంచెం మోతబారి ఆసామి అయిండు.  

    గదేందో సిత్రం. కచ్చురం మంచిగ వోయినట్టే పోయిపొయి ఒక్కపారే బొందల పడేదాక తెలువదు. నారిగాడి బతుకూ గట్లనే అయింది. గానాడు నారిగాడు ఎప్పటోలనే పొద్దుగాల తాళ్ళకు వోయి కల్లు తెచ్చి తిని పడుకున్నడు. ఆనికి నిద్ర పట్టకముందే లుసుము రూపాయి పట్వ అమ్మింది. నారిగాడు మాంచి నిద్రలో ఉన్నడు. ఎవలో లేపంగానే లేసి జూసిండు. ఏముంది. లబోదిబో గొట్టుకున్నడు. లసుము చచ్చిపోయింది. ఎట్ల చచ్చింది అన్నది నారిగానికి ఏమీ మనసున వట్టలే! కల్లు అమ్ముతుండగ అమ్ముతుండగనే పాణం విడిసింది. ఊళ్ళో నలుగురూ 'దానసొంటి సావు ఎవరికొస్తది. బంగారమసొంటి సావు. ఒగళ్ళతోటి ఏమన్న చేయించుకుందా ఏమన్ననా! పని జేత్తుజేత్తు జచ్చిపోయింది మారాజు' అని ఎవలకు తోచినట్టు వాళ్ళు అన్నరు.

    నారిగాని బతుకు మళ్ళా మొదటికే పోయింది. తాళ్ళెక్కి ఊళ్ళెకు పొద్దుగాల్నే రావాలని ఎంతజేసినా కాలేదు. పొద్దుగాల లేవాలాయె - కుండలు కడుక్కొని యింత ఉడికేసుకోవాలాయె. యివన్నీ జేసే యాల్లకే పొద్దుపోతుంది. ఇగ తెచ్చిన కల్లు ఎంత రాత్రైనా అమ్ముడువోతనేలేదు. అమ్ముడు యవ్వారం నారిగాని సేతి కబ్బలేదు. అదీగాక ఇదివరకు నారిగాడెన్నడూ కల్లు అమ్మకనేవాయె. ఇప్పుడు రోజూ పాసికల్లు మిగులుతుంది. గాకల్లునే కొత్తదాన్ల కలుపుతుండు. తాగేటోళ్ళు కూడా నారిగాని యింటికి ముందటోలె వస్తలేరు. అదేందే అంటరు. నూతిలో పడ్డోనిమీదే నూరు రాల్లన్నట్లయింది నారిగాని బతుకు.

    కొన్ని దినాలు గడిసినయి. ఆనిలో ముందటోలె చురుకుదనం లేదు. మందకొడోలె తాళ్ళకు వోతడు, వస్తడు. ఎవలన్నా కల్లుకోసం వస్తే అమ్ముతడు. తాగెటోల్లకేమో పంచుతడు. యిదంతా చూచి నారిగాని అన్నలు లోపల్లోపల మురిసిపోయిండ్రు. కాని గౌండ్లోల్లంతా కలిసి నారిగానికి మల్ల లగ్గం జేస్తే ముందటపడుతడని అనుకున్నరు. బస్ అనుకున్న పదిరోజులకే కుంటీ, గుడ్డీ, చెవిటీ గాని ఒకదాన్ని తెచ్చి నారిగానికి మార్వానం జేసిండ్రు. ఎనుక ఎనుక పడుతున్న నారిగాని బతుకు కొత్త పెండ్లాం ఎల్లితో మెరుగున వడ్డది. మల్లా మునుపటోలనే నారిగాడు తాళ్ళకు  వోతుండు. కల్లు అమ్ముతుండు. ఆడు కడుపునిండా తింటుండు. నిద్రపోతుండు.  

    నారిగానికి గిప్పుడిప్పుడే మనసుల అంత ఎట్లనో అనిపియ్యవట్టింది. అదేందో ఒక్కొక్కనికి వద్దనగా ఉసిల్లపుట్టోలె పోరగాండ్లు పుడుతనేవుంటరు. కాని నారిగాడు మొక్కరాని దేవుండ్లకల్లా మొక్కుకున్నడు. కనపడ్డ సన్యాసి తోని, కల్లు వోసి, అదీది చేసి మంచి జేసుకొని తాయెతులు కట్టించుకున్నడు. బయిండ్లోని పిలిచి మీద ఏందో ఉందంటే నాలుగైదుసార్లు తీయించేసిండు. ఎంతచేసినా ఎల్లి కడుపుల యింత పిందె వడపాయె. పాపం నారిగానికి ఏ చింతాలేదు. ఉండటానికి ఓ చతురసాల బవంతి కట్టించుకున్నడు. చచ్చిపోయినాంక అవుతల పారెయ్యడానికి పోరడు ఉంటే ఎంతమంచిగుండు... నారిగాడు రోజులన్నీ ఇగ కొడుకుపుడుతడనే పనిజేస్తుండు. తింటుండు. వంటుండు. కాని ఎల్లి సప్పుడుజెయ్యక ఊర్కోలేదు. ఇక నాకెట్లయినా పిల్లలు పుట్టరు. ఇంకోదాన్ని తెచ్చుకొమ్మని బతిమిలాడింది. కాని నారిగానికి అది మంచిగ అనిపియ్యలే. ఇదువరకే ఇది రెండవ పెండ్లాం. ఇంకోదాన్ని తెచ్చుకుంటే మూడవది. ఛీ...ఛీ...పెయ్యంతా జెర్రులువాకినట్లయింది. ఇక ఎన్నడూ కలలగూడా ఈ మాట అనుకోవద్దనుకున్నడు నారిగాడు. అయిన గిప్పుడే ఏమైంది. దీన్ని తెచ్చుకొని మూడేండ్లన్నా కాకపోయె. ఇంకా చూద్దాం.అనుకుని మనుసును తాత్పర్యం చేసుకున్నడు.

    నారిగాడు పొద్దటిపొంటె పొయ్యచ్చిండు. ఎల్లి కల్లు బాగనే అమ్ముతుంది. ఆనాడు నారిగానిని పడుకుంటే నిద్రపట్టలే! ఎల్లి కల్లు ఎట్ల అమ్ముతదో సూసుకుంట కూసుందామని, పన్నోడు లేచి మంచముల్నే కూసున్నడు. ఎల్లి వచ్చినోనికల్లా మంచిమాటలుజెప్పి అక్కనే తాగినోని కల్లా ఆకుమీద కల్లు అంచుతుంది. ఇంటికి కొనుక్క పోయేటోల్లకు బింకుల పోసియిత్తుంది. ఇంటికి తెమ్మన్నోల్లకేమో పక్కమొకాన పెట్టుకుంటుంది. నారిగానికి అక్కడ కూసుంటే మనసున వట్టలే. అందుల ఎల్లి అక్కడ కూసున్నోల్లకే నవ్వుకుంట, తుల్లుకుంట, ఇంక ఏందేందో చేసుకుంట కల్లు అంచుతుంది. ఛీ...ఛీ... ఏందేందో అనుకున్నడు. అట్ల ఎన్నడూ అనుకోని నారిగాడు ఎట్లెట్లనో అయిపోయిండు పావుగంటల. గాపావు గంటల్నే మొదటి పెండ్లాం లసుము యాదికొచ్చింది. లసుము బతికివున్నపుడు ఎవలు ఏమన్లేదు. కాని అది చచ్చిపోయినాంక దాని మీద బాగా పుకార్లు పుట్టినయి. నారిగాడు  అవన్నీ గాలిమాటలే అనుకున్నడు. కాని లసిమి గట్లాంటిది కాదని ఎందుకు అనుకోవాలె? నారిగాడు అడుక్కున్నడు తనకు తానే! ఛీ...ఛీ... గంత మంచిదానిమీద గిట్లాంటి మాటలా అని చెడామడా చెంపలేసుకున్నడు. యిగ యిట్ల కూసుని పిసోనోలె యిసారం చేయద్దనుకొని జెప్పజెప్పన లేచి ఊళ్లెమొకాన వోయిండు. 

    నారిగాడు గౌండ్లిళ్ల పెద్దమనిషి అయిండు. కిస్తీలు దగ్గరికి రాంగానే రకమంతా వసూలు జేసి ముస్తాజరుకు తనే యిచ్చివస్తడు. ఇట్ల బాగా రోజుల్నుంచి నడుస్తుంది. ఆనాడు కిస్తీ పైకమంతా తీసుకచ్చి యింట్లవెట్టిండు పొద్దుగాల యిచ్చివత్తామని. గంతెల్లమే గట్ల అయితదని ఎవలన్నా కలగంటారా? ఆయింత ఆరాత్రే ఎల్లి ఆ రకమంతా తీసుకొని యింట్లకెల్లి ఎల్లిపోయింది. నారిగాడు లబాలిబా మొత్తుకున్నడు. దాని తల్లిగారింటి మొకాన ఉరికిండు. ఆడ ఎవలున్నరు. ఉన్న ఒక్క ముసల్ది కడుపంతా కొట్టుకుంది నా బిడ్డను వాగు పాలు జేసినవని. నారిగానికి ఇగేంజేయాల్నో తొయ్యలేదు. పిచ్చొనోలె వారంరోజులు చెట్టనక, పుట్టనక తిరిగిండు. ఇంటికి వచ్చినాంక తెలిసింది ఆనికి ఎల్లి ఆ ఊళ్లోడే అయిన కమ్మరి బాలిగానితో లేసిపోయిందని. 

    ఆయింత ఎట్లెట్లనో చేసి రకమంతా గట్టిండు. నారిగాని బతుకు మల్లా ఎప్పటోలనే అయింది. ఇగ ముందటోలె మల్లా లగ్గం జేత్తమని ఊళ్ళోల్లు ఎవరూ ముందుకురాలె. కాని గిట్లా ఒక్కడే బతకడం నారిగానికి కష్టమైంది. ఎట్లైనా జేసి మళ్ళా మార్వానం చేసుకుంటేనే మంచిది అనుకున్నడు. ఈ పారి ఎవలపొత్తు పెట్టుకోకుండనే నారిగాడు పక్క ఊరికి వోయి మొగడు చచ్చి పోయిన ముండరాల్ని మార్వానం జేసుకున్నడు.

    ఇపుడు నారిగాడి బతుకు మూడో పెండ్లాంతో గడుత్తుంది. మల్లా నారిగాడు ముందటోలెనే పన్లూ అవీ జేసుకుంటుండు. పెండ్లాం కల్లు అమ్ముతుంటుంది.

    నారిగాని మూడో పెండ్లాం వయసులో ఉంది. నారిగానికేమో అప్పటికప్పుడే ఎంట్రుకలు నెరుస్తున్నయి. దీన్ని తెచ్చుకున్నాంక యాడాదినర్దముల్నే కొడుకు పుట్టిండు. ఇగ నారిగాని సంతోషానికి పట్టపగ్గాలేకుండా పోయింది.

    ఆనాడు మూడో పెండ్లాం కల్లు అంచుతుంది. నారిగాడేమో నిద్ర రాక మంచంల కూసొని కొడుకును ఆడిస్తుండు. ఇంతట్లకే కల్లు అంచుతున్న కాన్నుంచి పెండ్లాం మొత్తుకుంటున్నట్టు విని ఉరికిండు. కల్లు అంచుతుండగా దాన్ని కొంగువట్టి గుంజినోన్ని నాలుగైదు తన్నిండు. ఛీ...ఛీ...యెదవ బుద్ధి అని తిట్టిండు. యిగ ఆన్నుంచి నారిగాడే కల్లు అమ్ముడు మొదలు వెట్టిండు. అదేమో యింట్లపన్లు జూసుకునేది. ఊళ్ళెకొయ్యి గొబ్బలు పట్టుకచ్చేది అంతే!

    ఇగ అప్పట్నుంచి నారిగానికొడుకు ఎట్లెట్ల పెద్దవెరిగిండో - అట్లట్ల ఆని మూలద్రవ్యం తరుగుడు వెట్టింది. కల్లు అమ్ముడు రోజురోజుకు తగ్గివోయింది. యిరువై తాళ్ళకెల్లి మూడు చిక్కినయి కొడుకు చేతికొచ్చేవరకు. నారిగాడు తన కొడుకును తనోలెగాకుండా చూడాలని చాలా జేసిండు. మూడు తాళ్ళున్నా నిజాయితీగా బతుకుమన్నడు - కల్లును ఆడోళ్లు అమ్మద్దన్నడు. కాని కొడుకు యినలే! ఈ ముసలోనిమాట యిని గిట్ల కూటికి ఎవలు జత్తరు. కల్లమ్మెటోల్లంతా గట్లనే ఉంటరా! అని కొడుకు సవాల్ - ముసలోడైండు నారిగాడు - ఏం జేత్తడు. యాల్లకు యింత పడేస్తే తింటడు. ఓ మూలకు వంటడు. అంతే నారిగాని బతుకు.      

Comments