నష్టఫలహారం - సి.ఆనందారామం

    
గడియారం అయిదు గంటలు కొట్టింది. పిచ్చి సుబ్బమ్మగారింట్లో ఉయ్యాల ఊగుతున్న కాశీరత్నం ఉలికిపడి లేచింది. సుబ్బమ్మ దాన్ని లేవనియ్యకుండా పట్టుకుని "ఒసేయ్!మరొక్కసారి ఈ పగుళ్ళ మధ్య నూనె రాయవే! నిన్నింకా ఎంతసేపయినా ఉయ్యాల ఊగనిస్తాను" అని బతిమాలసాగింది. కాశీరత్నం ఆవిడ చెయ్యి విదిలించుకుని, "హమ్మో గొడ్లొస్తున్నయ్, నే పోవాల! మా మామ్మ చంపుద్ది" అని పరుగుతీసింది. గొడ్లు మందలుగా వస్తున్నాయి. అలవాటుగా అవే వాటి యజమాని ఇంటివైపు మళ్ళుతున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న ఇంటి ఇల్లాలో లేక కూతురో, వాళ్ళ వాళ్ళ గేదెల్నీ, ఆవుల్నీ కట్టేసుకుని తయారు చేసి ఉంచిన కుడితి తొట్టెల్ని వాటి ముందు ఉంచుతున్నారు. 

    ఆ వీధిలో అందరూ కోర్టుజవానులూ, మిల్లు కూలీలూ మొదలైనవాళ్ళే ఉంటారు. అందుకే ఆ వీధికి జవాను వీధి అని పేరువచ్చింది. అయితే అక్కడ కోర్టులో కాపీయిస్టు, ఒక చెట్టు క్రింద ప్లీడరూ, ఒక లెక్చెరరూ కూడా ఉన్నారు. కాపీయిస్టు పెంకుటిల్లు కట్టుకున్నాడు. అతడింట్లోనే ఉయ్యాల ఉంది. వెనుక నుయ్యి ఉంది. ప్లీడరూ, లెక్చరరూ ఆ వీధిలో ఉన్న ఒకే ఒక మేడ ఇంట్లో అద్దెకుంటున్నారు. మిగిలినవన్నీ జమ్ముపాకలూ, లేక్పోతే తాటాకు పాకలు. కాపీయిస్ట్ వెంకటపతి భార్య సుబ్బమ్మ - చీటికీ మాటికీ వీధినబడి గట్టిగా అరుస్తుండేది. అందుకే ఆమెను పిచ్చి సుబ్బమ్మ అనేవారు. ఆ వీధిలో ఉయ్యాల ఉన్న ఇల్లు అదొక్కటే కావటం వల్ల పిల్లలంతా ఉయ్యాల మీదెక్కి ఊగటానికి సుబ్బమ్మను ఆశ్రయించేవారు. సుబ్బమ్మ ఊగనిచ్చేది కానీ, అందుకు ప్రతిఫలంగా పగిలు ఒరిస్ పుళ్ళయిన తన కాలి వేళ్ళ మధ్య నూనె రాయమనేది. ఆ బాధపడలేక పిల్లలు చాలా మంది పారిపోయి, తోటలో చెట్లకి ఉయ్యాలలు కట్టుకునేవారు. పాపం, కాశీరత్నానికి ఆ అవకాశం లేదు. దానికి తల్లీ తండ్రీ పోయారు. అమ్మమ్మ మాత్రమే ఉంది. అమ్మమ్మ అక్కడి టౌన్‌లో జూట్‌మిల్‌లో పని చేస్తోంది. దాని పేరు సోవమ్మ! మొదటి కూత కూయగానే సోవమ్మ మనవరాలిని లేపుతుంది. అది తెల్లవారు జామున నాలుగు గంటలకి. అప్పటి నుంచి కాశీరత్నానికి పని మొదలు. పాచి ముఖమయినా కడగకుండా గోధుమ రొట్టెలు చేస్తుంది. అప్పటికి రెండో కూత కూస్తుంది. సోవమ్మ వీధి పాచి, చలమనుంచి నీళ్ళు తెచ్చిపోసి, రొట్టెలు డబ్బాలో పెట్టుకుని గంజితాగి వెళ్ళిపోతుంది. మూడోకూత కూసేసరికి అది మిల్‌దగ్గిర ఉండాలి. సోవమ్మ వెళ్ళాక అప్పుడు ముఖం కడుగుతుంది కాశీరత్నం. చద్దన్నముంటే గంజిలో కలిపి తాగుతుంది. లేకుంటే వట్టి గంజి. ఆ తరువాత పొయ్యి రాజేసి, ఎసరు పడేసి వొక కుండలో నీళ్ళుపోసి, గేదెల దగ్గిరకొస్తుంది. పేడ పోగుచేసి మూలగా కుప్పేసి, దాణా బుట్ట నెత్తిమీద పెట్టుకుని పలుపుతాడు చేత్తో పట్టుకుని, గేదెలను వాడికల ఇళ్ళకు తీసుకెళ్ళి చెంబు చూపించి పాలు పిండుతుంది. లెక్చరర్‌గారింట్లో, పై వీధిలో మరో రెండిళ్ళలో ఉన్నాయి వాడికలు. పాలు పిండుతున్నప్పుడల్లా దానికొకటే ఆలోచన - కాఫీ ఎలాగుంటుందోనని. తన స్నేహితుల్లో చాలా మంది కాఫీ తాగిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి కాఫీ పెట్టుకుందామని అమ్మమ్మ నడిగితే "అట్టాంటి ఆలోచనలు పెట్టుకోమాక. పాల డబ్బంతా జమచెయ్యాలి, నీకు పెల్లి చేయాల" అంటుంది. అమ్మమ్మకెప్పుడూ తన పెళ్ళి బెంగే! పోనీ, పెళ్ళయ్యాక తను కాఫీ కాచుకోవాలి. పెళ్ళి ఛీ!పాడు! 

    పాలు పిండి ఇంటికొచ్చే సరికి బాగా పొద్దెక్కేది. అప్పుడు బిందె పుచ్చుకుని చలమకు బయల్దేరేది. అమ్మమ్మకు తను చలమకెళ్ళటం ఇష్టంలేదు. "ఈడొచ్చిన పిల్లవు బయట తిరక్కు" అంటుంది. తనకు మాత్రం చలమ నుంచి నీళ్ళు తేవటం భలే ఇష్టం. ఆ సమయంలో చలమకి తన స్నేహితులంతా వస్తారు. నాగులు, సుబ్బులు, లక్ష్మి, వెంకటి అందరూ...

    చలమలో నీళ్ళు ముంచుకుంటూ ఒకటేముచ్చట్లు - కబుర్లాడుకుంటూ నీళ్ళు తెచ్చుకునేసరికి, గొడ్లను తోలుకు పోయే వాడొస్తాడు. వాడికి గేదెలనప్పజెప్పేసి అప్పుడు చేస్తుంది స్నానం. తోటల్లోకి వెళ్ళటానికి అమ్మమ్మ ఒప్పుకోదు. అందుచేత సుబ్బమ్మ ఇంటికి బయలు దేరుతుంది, ఉయ్యాల ఊగటానికి - కానీ, అమ్మమ్మ ఇంటికి రాకముందే తిరిగొచ్చేసి బుద్ధిమంతురాలిలాగా బియ్యం ఏరుతూనో, గుడ్డలు కుడుతూనో కూచుంటుంది. 

    సుబ్బమ్మ చెయ్యి విడిపించుకుని వచ్చేసి బియ్యం చేట ముందేసుకుని, వీధి వైపు చూస్తూ ఏరసాగింది - మధ్య మధ్య ఓ గింజ నోట్లో వేసుకుంటూ.

    కానీ, ఆ రోజు సోవమ్మ జాడలేదు. చీకటి పడింది. దీపాలు పెట్టారు. కాని సోవమ్మ జాడలేదు. కాశీరత్నానికి భయం వేసింది. చీకటింట్లో దీపం పెట్టి ఏడుస్తూ కూచుంది.

    "ఇంట్లో ఎవరూ?" బయటినుంచి కేక వినిపించింది. తలుపు తీసి భయం భయంగా బయటికి చూసింది. ఎవరో కొత్త మనిషి! గభాలున తలుపు చాటుకి పోయింది. 

    "సోవమ్మ మీ అమ్మమ్మేనా?"

    "అవును"

    "దెబ్బలు తగిలినాయి - ఆస్పిటాలులో నున్నాది. నిన్ను రమ్మంటుంది" చెప్పేసి వెళ్ళిపోయాడు.

    కాశీరత్నానికి కాళ్ళూ చేతులూ వణక సాగాయి. దానికి హాస్పిటల్ అంటే అంతులేని భయం. చచ్చిపోయే వాళ్ళనే అక్కడ చేరుస్తారని దానికో నమ్మకం. ఆ నమ్మకం వృథాగా ఏర్పడలేదు. ఆ చుట్టుపక్కల ఇళ్ళలో హాస్పిటల్‌లో చేర్పించిన వాళ్ళెవరూ సజీవంగా బయటకి రాలేదు. హాస్పిటల్ పేరు తలుచుకుంటేనే దాని గుండెలు దడ దడ లాడాయి. హాస్పిటల్ ఎక్కడుందో దానికి తెలుసు. కాన్వెంట్ స్కూల్ ఎదరగా ఉంది. కానీ చీకటి! మనసులో చీకటి! చుట్టూ చీకటి! తలుపుకు తాళం పెట్టి ఆ చీకట్లో బయలుదేరింది. హాస్పిటల్ ఒక మహారణ్యంలాగ ఉంది. హడావుడిగా అటు ఇటు తిరిగే మనుష్యులు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని "సోవమ్మ! మా అమ్మమ్మ ఏడుందీ?" అని కనిపించిన అందర్నీ అడిగింది. కొందరు చికాగ్గా చీదరించుకొంటూ వెళ్ళిపోయారు. కొందరసలు వినిపించుకోలేదు. మరి కొందరు కనీసం "మాకు తెలీదు" అని సమాధానం చెప్పారు. చివరకు ఒక తెల్ల కోటాయన కొద్దిసేపు నిలబడి "ఏంజబ్బు? హాస్పిటల్‌లో ఎప్పుడు చేర్పించారు?" అన్నాడు.

    "దెబ్బలు తగిలినాయంటండి. ఇయ్యాలే జేర్పించారు" ఏడుపు నిగ్రహించుకొంటూ చెప్పింది.

    "ఓ! ఏక్సిడెంట్ కేసా? నాతోరా!" అన్నాడు. అతడి వెంట నడిచింది. అక్కడ వార్డ్‌లో కాలినిండా కట్లతో కదలలేని దశలో పడుకుని ఉంది సోవమ్మ.

    "అమ్మమ్మో!" అని కాశీరత్నం

    "ఓరి, నాబిడ్డో!" అని సోవమ్మ ఒక్కసారిగా రాగాలు మొదలు పెట్టారు -  నర్సు వచ్చి గదమాయించాక కానీ, ఆ ఏడుపులాగలేదు.

    ఆ రాత్రి కాశీరత్నాన్ని అక్కడ ఉండనియ్యలేదు.

    "ఒంటరిగా పడుకోమాకే! సత్తిమ్మత్తయ ఇంటి కాడ పడుకో!" అంది సోవమ్మ.

    కాశీరత్నం తలూపింది. ఆ మరునాడు ఇంటిపనులు ముగించుకుని కాశీరత్నం చూడటానికి వచ్చినప్పుడు సోవమ్మ అటు ఇటు చూసి పక్కనున్న టీపాత్ డ్రాయర్‌లో తను దాచిన బ్రెడ్ స్లైసెస్ రెండు తీసి ఇచ్చింది. కాశీరత్నం అవి పరికిణీలో దాచుకుని "మరి నీకో?" అంది.

    "నాకు ఆకలని అడిగి తీసుకుంటాలే! పిచ్చి ముండవి ఏమి తిన్నావో, ఏటో?" అంది. 

    పాపం, సొవమ్మకి మళ్ళీ అడిగినా ఇయ్యరని కాశీరత్నానికి తెలీదు.

    నాలుగు రోజులు గడిచాయి. సోవమ్మకి మళ్ళీ కాలు రాదనీ, కుంటుకుంటూ కర్రల సాయాంతో నడవ వలసిందేననీ చెప్పారు. అయితే ఈ వార్త విన్న సోవమ్మ ఏడవ లేదు సరి కదా, పొంగి పోయింది. ఏడుస్తున్న కాశీరత్నాన్ని దగ్గరకి తీసుకుని బుజ్జగిస్తూ చెప్పింది -

    "యేడవకే యెఱ్ఱి ముకమా? నా కాలు పోతే పోయిందిలే! నేను పనిలోకి పోకపోతే పీడా పోయింది. మనకు నష్ట పరిఆరం(నష్ట పరిహారం) వొస్తాందట"

    "అంటే?"

    "శానా పైసలొస్తయ్!"

    "అమ్మమ్మా! మనం ఉయ్యాలున్న ఇల్లు కట్టుకుందామే!"

    "అట్టాగే!"

    "నేను రోజూ కాఫీ తాగుతానే!"

    "అట్టాగేనే!"

    "నాకు నైలా వోణీ కొనిత్తావా?"

    "యెఱ్ఱిముకమా! అన్నీ అడుగుతావుకానీ బంగారమంటి మొగుణ్నడగవేమే!" నవ్వింది సోవమ్మ. పారిపోయింది కాశీరత్నం.

    సోవమ్మకి తన అవిటి కాలు బాధ తెలియలేదు. తను పనికి పోకపోతే వృద్ధాప్యంలో తనకెలా గడుస్తుందనే ఆలోచన రాలేదు. తల్లినీ తండ్రినీ పోగొట్టుకున్న తన మనవరాలికి పెళ్ళి చెయ్యకలుగుతుంది! అది చాలు! ఆ తరువాత తనేమయి పోయినా ఫరవాలేదు.

    మిల్ మేనేజర్‌ని తనకు రావలసిన డబ్బు ఇయ్యమని అడిగింది. అతడు నవ్వి "ఇలా ఇవ్వరు - అప్లికేషన్ వ్రాసి డాక్టర్ సర్టిఫికేట్ జత చేసి ఇవ్వాలి" అన్నాడు. సోవమ్మ కుంటుకుంటూ గుమాస్తా దగ్గిరకెళ్ళి ఒక అప్లికేషన్ ఫారం ఇయ్యమంది. గుమాస్తా నవ్వి "నువ్వు నష్టపరిహారం తెచ్చుకుంటావు - కానీ, మరి నాకేం వస్తుందీ?" అన్నాడు - సోవమ్మ కర్థం కాలేదు.

    "ఆ కాగితాలేమో, ఇయ్యయ్యా!" అంది.

    ముఖం చిట్లించి "ఇప్పుడు లేవు వెళ్ళు" అన్నాడు.

    అలా అయిదుసార్లు లేవనిపించుకున్నాక అప్పుడు సోవమ్మ కర్థమయింది. మనసులో గుమాస్తాను తిట్టుకుంటూనే పాలమ్మ కాశీరత్నం పెళ్ళికని దాచిన డబ్బులోంచి పదిరూపాయలు తీసికెళ్ళి అతని చేతిలో పెట్టి "ఇప్పుడియ్యి" అంది. వెంటనే ఇచ్చేశాడు గుమాస్తా. కూలీలలో కాస్త చదువొచ్చిన కుర్రోడిని ఆ కాగితాలు పూర్తి చేసి పెట్టమంది. అతడు సోవమ్మ చెప్పినట్లు వ్రాసి, "ఇదిగో ఇక్కడ మేస్త్రీ సంతకం పెట్టాలి" అన్నాడు.

    "ఆడి సంతక మెందుకు?"

    "నువ్వు పనిలో ఉండగానే ప్రమాదం జరిగిందని చెప్పటానికి!"

    "ఓరయ్యో? కుంటికాలు కనపడతానే ఉందిగా!"

    "ఆ ప్రమాదం మరెక్కడయినా జరగొచ్చుగా"

    "దెబ్బ తగిలిందాక, ఈడనే ఉంటిగా!"

    "అందుకే మేస్త్రీ సంతకం"

    సోవమ్మ ఆ కాగితాలు తీసుకుపోయి మేస్త్రీ చేతిలో పెట్టి నమస్కారం చేసి "ఆడ సంతకం పెట్టయ్య" అంది. ఆ కాగితాలు ఎగాదిగా చూసి పక్కన పెట్టాడు మేస్త్రీ. సోవమ్మ గుండె గుభిల్లుమంది. ఇప్పుడు దానికి ఇలాటి విషయాలు త్వరగా అర్థమవుతున్నాయి. ఈసురోమంటూ ఇంటికెళ్ళి మరో పదిరూపాయలు తెచ్చి మేస్త్రీ చేతిలో పెట్టబోయింది. ఆ పదీ విసిరికొట్టి "ఏంటే? ఎవడికిస్తన్నావు ముష్టి? నువ్వేమో కాలుమీద కాలేసుకుని పదివేలదాకా దొబ్బుతున్నావు. నా ముఖాన్న పది కొడతావా? రెండొందలు తక్కువయితే తీసుకోను" అన్నాడు. గుండె గుభిల్లుమంది. రెండొందలు! పాలమ్మి మనవరాలి పెళ్ళికోసం కూడబెట్టిన డబ్బు!

    "నాకాడ ఏడున్నాయి?" 

    "లేకపోతే పో! ఆ కుంటికాలితోనే ఏడు. నువ్వు మిల్లు పనిలోనే కాలు పోగొట్టుకున్నావని నేను రాయను"

    "ఓరన్న, ఓరన్న! ఈ ముసలిదాని మీద, కుంటి దాని మీద దయచూపరన్నా!"

    "పోయే! పదేలూ నీకూ, పత్తిత్తు మాటలు నాకూనా! రెండొందలిస్తేనే సంతకం పెట్టేది!"

    సోవమ్మ ఏడ్చుకుంటూ ఇంటికిపోయి కుంటుకుంటూ రెండొందలూ తెచ్చి మేస్త్రీ చేతిలో పోసి సంతకం పెట్టించుకుంది. ఆ కాగితాలు తీసుకుని డాక్టరు దగ్గిర కొచ్చింది.

    డాక్టరొక్కసారి ఆ కాగితాలు ఎగాదిగా చూసి సంతకం చెయ్యకుండా పక్కకి పెట్టేసాడు.

    సోవమ్మ చేతిలో కర్రజారి కిందపడి కూలబడి పోయింది.

    "తవరికెంత తెమ్మంటారు బాబూ!" సూటిగా అడిగేసింది.

    "అయిదు వందలు" తనపని చేసుకుంటూ తలెత్తకుండా తాపీగా అన్నాడు.

    "పెద్దింటోళ్ళు! సదువుకున్న మారాజులు! తమరు కూడా..."

    "ఏయ్!" తలెత్తి కళ్ళెర్రజేసి గద్దించాడు.

    "గొడవ చేసావంటే నీకు తగిలిన దెబ్బ చిన్నదేననీ, అందువల్ల యాజమాన్యం నీకేమీ ఇవ్వక్కర్లేదనీ రాసేస్తాను."

    "అదేంటి బాబూ! కాలిరిగిందిగా?"

    "ఏమో? నువ్వెప్పుడు ఎక్కడ విరగ్గొట్టుకున్నావో?"

    కిందపడ్డ కర్ర తీసుకుని మళ్ళా బయలుదేరింది. పిడతలో డబ్బులన్నీ లెక్కపెట్టింది. నాలుగొందలున్నాయి. ఇంకో వంద జమచెయ్యాలి. ఆ మూలా ఈ మూలా దాచిన చిల్లర డబ్బులన్నీ ఏరింది. పాతిక కూడా కాలేదు. తనకు రాబోయే పరిహారం గురించి చెప్పి చుట్టుపక్కల అప్పులు చేసి డాక్టర్ చేతిలో పెట్టింది. ముందు ఆ నోట్లు జేబులో పెట్టుకుని, ఆ తరువాత సర్టిఫికేట్ ఇచ్చాడు డాక్టర్. ఆ కాగితాలు తీసుకుని మళ్ళా మేనేజర్ దగ్గిర కొచ్చింది. అవి అందుకుని ఓ విషపు నవ్వు నవ్వాడు అతడు.

    "ఈ కాగితాలివ్వగానే మేనేజ్‌మెంట్ నీకు డబ్బు ఇస్తుందనుకున్నావా? ముందు నేనీ కాగితాలు వారి దగ్గిరికి పంపాలి. తరువాత వారంతా ఈ విషయ్మ్ చర్చించలి. అప్పుడు నీకు డబ్బిస్తారు."

    "అదేదో తొరగా సూడండి బాబూ!"

    "ఫలితం నీకూనూ, వట్టి శ్రమ నాకూనా?" మళ్ళా నవ్వాడు మేనేజర్. సోవమ్మ కర్థమయిపోయింది. దాని నడుములు విరిగిపోయాయి. కూలబడిపోయింది.

    "ఓర్నాయనో! నాకాడ సిల్లి దమ్మిడీ లేదండీ!"

    "సిల్లిదమ్మిడీలు ఇప్పుడెవరి దగ్గరా లేవు. నాకు కావలసినవి రూపాయలు, వెయ్యి!"
 
    "వెయ్యి! వెయ్యి రూపాయలు! ఏద నుండి తెమ్మంటారండీ! కూలిముండని!"

    "ఏం? పదివేలు తీసుకుంటున్న దానివి నాకో వెయ్యి రూపాయలియ్యలేవా? ఎక్కడైనా అప్పడిగి ఇయ్యి?" సోవమ్మలో సహనం చచ్చిపోయింది. మనసు మండిపోయింది. ఉక్రోషం పట్టలేక పోయింది.

    "నా పరిఆరం మాటేమోగాని బాబులూ, ఈ పలారాలు నా పేనాలు తీసినయి. ఇంకే పరిఆరం వద్దు గాని, నాకాడేదీ లేదు. ఆ కాయితం పంపండి. వచ్చిన నాటి కొస్తది."

    కర్ర టక్కు టక్కు మనిపించుకుంటూ ఇంటికొచ్చింది.

    కోటి కలలలో ఊగిపోతోంది కాశీరత్నం.

    ఇల్లూ, ఉయ్యాలా, పెళ్ళి, రోజూ పొద్దున్న కాఫీ. ఆ రోజుకి మాత్రం ఇద్దరికి గంజినీళ్ళు కూడా లేవు. ఆకలికి తాళలేక "అమ్మమ్మా! నీ డబ్బు ఇంకా ఎప్పటి కొస్తదే?" అంది.

    సోవమ్మ సమాధానం చెప్పలేదు. కళ్ళద్దాలు లేని చత్వారం కళ్ళతో మనవరాలిని చూసింది. 

    "నీకు కాఫీ తాగాలని ఉంది కదంటే!"

    "అవునే! నాకు కాఫీ సానా యిష్టం. పాడు గంజి థూ!"

     "పై వీధి శామలమ్మగారు పనికి మనిషి కావాలన్నారు. పోతావా? రోజూ కాఫీ పోస్తారు."

    తన చెవులు తను నమ్మలేకపోయింది కాశీరత్నం. ఏడుపు ముఖం పెట్టి "ఏంటే? నన్ను పాచి పనికి పొమ్మంటావ?" అంది.

    "కాఫీ పోస్తది గదే!"

    "నాకు కాఫీ వద్దు, పాచి పనికి పోను"

    "కాఫీ అక్కర్లేక పోయినా గంజినీళ్ళయినా కావాలి కదే! చేసిన అప్పులు తీర్చుకోవాలి. నేనింక పనికి పోలేను కదా! నా కాలిరిగి పోయింది. నువ్వు దయతలిసి ఇన్ని గంజి నీళ్ళోస్తే తాగుతాను. లేకపోతే లేదు. ఆ దేవుడికి దయొచ్చి నన్ను తీసుకుపోతే నీకు నా బరువు తగ్గుతాది. ఆ పైన నీ బతుకు నీది -"

    ముసలిదాని చూపుమందగించిన కళ్ళలో నుండి నెత్తురు బొట్ల లాంటి కన్నీళ్ళు.

    "అమ్మమ్మా" అని ముసలిదాని వళ్ళోపడి బావురుమంది పసిపిల్ల కాశీరత్నం.

    ఇల్లు, ఉయ్యాల, పెళ్ళి, మొగుడు, కాఫీ... అన్నీ ఆ కన్నీళ్ళలో కరిగిపోతున్నాయి. 

(స్రవంతి మాసపత్రిక జనవరి 1981 సంచికలో ప్రచురితం) 
Comments