నేను సైతం... - పంజాల జగన్నాథం

    జీవితం ఓ సంఘర్షణ. జీవితమంతా ఒకటే పరుగు; డబ్బు వెంట... సుఖాల వెంట... వినోదాల వెంట... విలాసాల వెంట...! జీవితమే ఉరుకులు పరుగులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎగుడుదిగుడులు, పల్టీలు. సుఖదుఃఖాలు... విషాదాలు...కన్నీళ్ళు... కడగండ్లు...బాధలు...గాధలు... సుధీర్ఘ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి.

    తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల్ని పెంచుతుండ్రు. పని నేర్పిస్తుండ్రు. బతుకుదెరువుకు దారి చూపిస్తుండ్రు. ఎదిగినంక పిల్లలు తమ బాధ్యతలను తెలుసుకుంటలేరు. బంధాలు, అనుబంధాలు అన్నీ గాలికి వదిలేస్తుండ్రు. పెద్దవాళ్ళు పోగు చేసిన సంపాదనని ఖర్చు జేస్తు తిని, తాగి తందనాలాడుతూ సోమరులుగా తయారవుతున్నారు.

    రాంనర్సయ్య తన జీవితంలో ఎంతో కోల్పోయిండు.తన ఉద్యోగ సంపాదనని తమ్ముడి పిల్లల పోషణకు ఖర్చు జేసిండు. వాళ్ళను గావురంగా పెంచిండు. ఇప్పుడు వాళ్లే తనని ఛీకొట్టి పొమ్మన్నరు. ఇంతకాలం తను పడ్డ ఆరాటం, తండ్లాట, చేసిన సేవ అంతా బూడిదల పోసిన పన్నీరయిందని మదన పడసాగిండు. నారు పోసి, నీరు పోసి, కలుపు తీసి, ఎరువులేసి పెంచిన చెట్లనుండి ఫలాలను పొందడం ప్రకృతి ధర్మం. అందుకు భిన్నంగా ఉంది రాంనర్సయ్య పరిస్థితి. అపురూపంగా పెంచిన తమ్ముని పిల్లలే అతన్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటి వేసిండ్రు. ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందు జాగ్రత్తగా రాంనర్సయ్య తన గ్రాట్యుటి, ప్రావిడెంట్ ఫండ్‌ను పదిల పరుచుకున్నడు.

    "ఏందిరా గీ అవతారం. కుటుంబ మర్యాద, గౌరవం ఏమిన ఉంటుందా? ఇల్లంత గుల్ల జేస్తున్నవ్. ఆరోగ్యం పాడుజేసుకుంటున్నవ్. బాధ్యతలు గుర్తెరిగి మసలు కోవాలే!" తమ్ముని కొడుకుని నిత్యం తాగి తూగుతూ ఇంట్లోకి వస్తూ వుంటే ఆవేదనతో మందలించిండు.

    పెదనాన్న మాటలు చెవ్వుల్ల పడ్డాయో లేదో నర్సింలు శివమెత్తినట్టు చివ్వున లేచిండు.

    "ఓరి ముసలోడా నువ్వేంది చెప్పేది బోడి నీతులు. పెద్ద నీతిమంతుని లెక్క చెబుతున్నవు. మాకెరుక లేదనుకుంటున్నవా నీ చరిత్ర" తాగిన మైకంల నోటికచ్చినట్టు అవాకులు చెవాకులు పేలిండు. ఒక్కసారి అవాక్కయిండు రాంనర్సయ్య. ఆ మాటలు తన మనస్సుకు ములుకుల్లా కుచ్చుకున్నయి. తల తీసినట్టయింది. అతను సజల నయనాలతో శిలా సదృశ్యంగా నిలిచిపోయిండు.

    'అవును తాగిన మైకంల వాడు సరింగనే మాట్లాడిండు. నిజంగా నేనొక దగాకోరుని. పుండాకోర్‌ని...! వంచకున్ని' కుమిల పోసాగాడు.

    "గవేం మాటలురా పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా" సాహసించి మరదలు, తమ్ముడు కొడుక్కు హితవు చెప్పే ప్రయత్నం చేసిండ్రు.

    "నోరు మూయుండ్రి! ఆవాజ్ జేత్తే బొండిగ పిసుకుత. గీ రపరపంతా మీతోటే...!" చూపుడు వేలుతో చూపిస్తూ గుడ్లురుముతూ ఆవేశంగా ఊగిపోతున్నడు నర్సింలు. గతుక్కుమన్నరు తల్లిదండ్రులు. అవమానభారంతో తల దించుకున్నరు. ఆ దృశ్యం చూసిన రాంనర్సయ్య కళ్లల్ల నీళ్ళు చిప్పిల్లినయి. అతని గుండెల్లో దట్టమైన విషాదమేఘాలు కమ్ముకున్నయి.

    ఇంటి ముందు పెద్ద వాకిలి. పచ్చటి చిక్కటి పెద్ద వేపచెట్టు. చెట్టునీడన వాలు కుర్చీల రాంనర్సయ్య చింతాక్రాంతుడై కూర్చున్నడు. చల్లని గాలి శరీరానికి తాకుతోంది. ఆలోచనలు మనస్సును వేడెక్కుతున్నయి. 

    పిల్లలు అదుపాజ్ఞల్లో లేకుండా బోయిండ్రు. తన గారాబం తోటే వాళ్ళు ఇట్ల తయారయిండ్రు. అన్నింటి తనే కారణం. తనకు జరగాల్సిందే ఈ శాస్తి. అన్ని బంధాలు ధ్వంసమైనయి...! రాంనర్సయ్య పరి పరి విధాల వాపోతున్నడు. అతని మనస్సు అదోలా ఉంది. అతడి అంతరంగంలో గుండెలు పగిలి నెత్తుటి వర్షం కురుస్తోంది.

   'ఏంది మాకోసం పెద్ద త్యాగం జేసినట్టు పెగ్గాలు పలుకుతున్నవ్ పోవయ్యా...! పో...!!' అన్న మాటలు రాంనర్సయ్య చెవుల్ల గింగురుమంటున్నయి. బాధను దిగమింగుకొని దుఃఖాన్ని కనురెప్పల మాటున దాచుకొని కుర్చీలోంచి లేచిండు. బట్టలు సదురుకొని బస్టాండ్ వైపు దారిపట్టిండు. పిల్లల మాటలు అతని ఎదను తూట్లు పొడుస్తున్నయి. 'వీళ్లు తను పెంచిన పిల్లలేనా...!? వీళ్ల కోసమా నేను పాకులాడింది...!! పెద్దనాన్న అన్న పిలుపులు ఏమైనయి...' ఏవేవో జ్ఞాపకాలు రాంనర్సయ్య ఎదను పిండేస్తున్నయి.

* * *

    రాంనర్సయ్య మనస్సులో అనుమానపు పొరలు దట్టంగా వ్యాపించి అపార్థాలకు పోయి చేజేతులారా తన జీవిత భాగస్వామిని దూరం జేసుకున్నడు.అతని జీవితానికి అర్థం, పరమార్థం లేకుండా పోయింది. ముసలితనంలో అతనికి తీరని వ్యధయే మిగిలింది. వయోభారం చేత అతని శరీరం శుష్కించింది. దృష్టి సన్నగిల్లింది. మానసికంగా ఎంతో అలసిపోయిండు... పలు ఆలోచనల గజిబిజిలో భద్రాచలం బస్సు ఎక్కిండు. బస్సులో ప్రయాణీకుల సందడి. ముటాముల్లె సదురుకుకంటుండ్రు. అంతా గాయిగాయిగుంది. బస్సు జర్కులిచ్చుకుంట కదిలింది. క్రమేణ వేగం పుంజుకుంది. పొలిమేర దాటింది. చెట్లు, గుట్టలు వెనక్కి ఉరుకుతున్నయి. కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది. రక్షణగా మఫ్లర్ చుట్టుకున్నడు. మనస్సు పొరల్లో 
నిక్షిప్తమైన గత స్మృతులు కళ్లముందు కదలసాగాయి రాంనర్సయ్యకు.

       రాంనర్సయ్య తండ్రి జబ్బుపడి మరణించడంతో నల్లేరు మీద బండిలా సాగిపోతున్న కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయినయి. ఎగురుతున్న పిట్టకు గులేరు దెబ్బ తగిలినట్లు, ఈదుతున్న చేప గాలానికి చిక్కుకొని గిలగిల కొట్టుకున్న రీతిలో అతని పరిస్థితి తిర్లమర్లయింది. కుటుంబ బరువు బాధ్యతలు బుజాన పడ్డయి. తల్లి, చెల్లి, తమ్ముడి సంరక్షణ... చదువుసంధ్యలు... పెళ్ళిళ్ళు... పేరంటాలు... మొదలగు బాధ్యతలు మీదపడటం... కుడితల పడ్డ ఎలుక చందాన అయింది అతని పరిస్థితి. తన వైవాహిక జీవితాన్ని మరచిపోయిండు. ఇట్లాంటి క్లిష్ట సందర్భంలో సైతం పట్టుదలతో చదివి డిగ్రీ పూర్తి జేసిండు. పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి ర్యాంకు సంపాదించిండు. గిరిజన సంక్షేమ శాఖలో అధికారిగా నియమింప బడ్డడు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ రేంజి పాపికొండల ప్రాంతంలో పొస్టింగ్ ఇచ్చిండ్రు.

    ఉద్యోగ రీత్య భద్రాచలం పోయిన రాంనర్సయ్యకు తన శాఖలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న శివజ్యోతి అనే గిరిజన స్త్రీతో పరిచయం ఏర్పడింది. తొలి పరిచయంలోనే ప్రేమ బీజం మొలకెత్తి మొగ్గతొడిగి పెళ్ళి దాకా వచ్చింది. ఓ శుభముహూర్తాన పాపికొండల్లో శ్రీరాంగిరి గుట్టమీద రామాలయం గుడిలో గూడెం ప్రజల సాక్షిగా మూడుముళ్ళ బంధంతో వాళ్లిద్దరు ఒక్కటయ్యారు.

    భద్రాచలం పక్కనే హొయలు ఒలుకుతూ ఒయ్యారంగా ప్రవహించే గోదారి. దానికి గట్లుగా ఇరువైపులా పాపికొండలు పచ్చని చీరలతో సింగారించుకున్నయి. దట్టమైన అడవి. ఆకాశాన్నంటిన టేకుచెట్లు. అమ్ముల పొదల్లా వెదురు గుబుర్లు. చక్కగా అల్లుకున్న గడ్డిపొదలు పక్షుల కిలకిల రావాలు... కోయిలల కుహూకుహూరాగాలు మనోరంజకమైన ప్రకృతి సౌందర్యంతో మమేకమయిన అక్కడి గిరిజనులు నాగరికతకు బహుదూరం. కడుపుకు తిండి... ఒంటికి బట్టా... చేతికి పనీ అన్నీ కరువే! పోడు ఎవుసం, చేపల వేట, ఇప్పపూవు, మూలికలు, బీడీ ఆకుల సేకరణ తోటి వారి జీవనం. అడవి తల్లిని నమ్ముకుని ఆకలికి నకనకలాడుతూ సగం కడుపుతో బతుకులు వెళ్ళదీస్తుండ్రు.

    చీకటి బతుకులతో సతమతమవుతూ, అర్థాకలితో అలమటిస్తున్న  అడవి బిడ్డలకు జీవనం సాగించే విధానాల పట్ల అవగాహనా సదస్సును గిరిజన సంక్షేమ శాఖ ఓ రోజు శ్రీరాంగిరి వద్ద ఏర్పాటు చేసింది. విద్య, వైద్యం, కోళ్లు, గొర్లు, పాడి పశువుల పెంపకం... మొదలగు అంశాల పట్ల అవగాహన కల్పించడం ఆ సదస్సు ముఖ్యోద్దేశం. సదస్సు ఆరంభమైంది. ఆ శాఖ డైరెక్టర్ మాట్లాడుతున్నడు. అక్కడి గిరిజనుల జీవన స్థితిగతుల్ని డైరెక్టర్కు వివరించడానికి రాంనర్సయ్య ఆ సమావేశంలో సిద్ధంగా ఉన్నడు. ఉన్నట్టుండి అతనికి కడుపులో నొప్పి మొదలయింది. మెలికలు తిరిగి పోసాగిండు. పక్కనే ఉన్న శివజ్యోతి పరిస్థితిని గమనించి డైరెక్టర్‌కు తెలిపింది. డైరెక్టర్ సూచనతో శివజ్యోతి హుటాహుటిన రాంనర్సయ్యను భద్రాచలం తరలించింది. చికిత్స చేయించింది. అట్ల మొదలయ్యింది వాళ్ళ పరిచియం. ఆ పరిచయం మొగ్గతొడిగి ప్రేమ పుష్పంగా చిగురించింది. అంత బంతిపూల పడవ, ఉల్లి ఆకు తెరచాప, తేనె వాగు, తీయని అనుభూతులు, మూడుముళ్ళ బంధం... మధురమైన జీవితం! రోజులు వేగంగా గడిచిపోతున్నయి. కాలం తనపని తాను చేసుకు పోతోంది.

    ఓరోజు ఉద్యోగరీత్య శివజ్యోతి శ్రీరాంగిరికి వెళ్ళింది. వాడవాడ తిరిగి గూడెం ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంది. ఓ గుడిసెలో చెంచు స్త్రీ పురిటినొప్పులతో బాధ పడుతోంది. ఆమెను ఆటోలో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయింది. పురుడు చేయించింది. అలసిపోయి ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. ఆమె వచ్చెటప్పటికి రాంనర్సయ్య కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతున్నడు. దర్వాజల అడుగుపెట్టిందో లేదో..."ఎందుకింత ఆలస్యం. ఎక్కడెక్కడ తిరిగివస్తున్నవ్...?" ముక్కుపుటాలెగరేస్తూ గయ్యిన లేచిండు. ఉక్రోషంగ ఏవేవో మాట్లాడిండు. శివజ్యోతి కంగు తిన్నది. "గూడెంల ఓ గర్భిణీస్త్రీని దవాఖానకు తీసుకుపోయి పురుడు చేయించి వస్తున్న...!" సంయమనంతో జవాబిచ్చింది. ఆ సమాధానం రాంనర్సయ్య చెవికెక్కలేదు. అతని మనస్సు అనుమానంతో కుతకుత ఉడుకుతోంది. శివజ్యోతి ఇట్ల ఏదో పనిమీద రెండు మూడుసార్లు ఇంటికి ఆలస్యంగా వచ్చింది.

    "నీ పద్ధతి ఏమీ బాగాలేదు" పరుషంగా మాట్లాడిండు.

    "ఏమిటీ. మీరు నన్నర్థం చేసుకుంది ఇంతేనా! నాపై నమ్మకం ఇదేనా!? ఇదా మీ విశాలత్వం! మీ ప్రేమ మీ సహృదయత!" శివజ్యోతి తీవ్రస్వరంతోనే అంది. రాంనర్సయ్య వ్యవహరించిన తీరు ఆమె ఎదలో నిప్పులు రేపుతున్నయి. అతని మాటలు రంపాల్లా ఆమె గుండెల్ని పసపస కోసేస్తున్నయి.

    "చూడుండ్రి మనం ప్రేమ పునాదిపై పెళ్ళి చేసుకున్నం. ఉద్యోగరీత్యా ఎన్నో పనుల మీద తిరుగుతుంటం. అది మీకు తెలుసు. మన లాంటి ఉద్యోగులకు లేటు రావడం మామూలే. ఈ మాత్రానికి ఇంత రాద్ధాంతమా! మన సంసారం అనుమానపు పొదరిల్లయింది. ప్చ్. పాడుబడిన ఇంటికి, శిథిలమైన గుడికి, జీర్ణమైన వస్త్రానికి మరమ్మత్తులు అవసరం. అనుమానంతో రగులుతున్న మీ మనస్సుకు చికిత్స అవసరం!" నొసలు కొట్టుకుంటూ నిర్వేదంగా గుండెల్లోని బాధను వెళ్ళగక్కింది శివజ్యోతి.

    రాంనర్సయ్య పిచ్చి పట్టిన వాడిలా ఊగిపోయిండు. నిప్పులు తొక్కిన కోతిలా గంతులేసిండు. గబుక్కున ఇంటినుండి బయటకు వెళ్ళిపోయిండు. ఇహ అప్పటి నుంచి ఇద్దరి మధ్య శూన్యమే రాజ్యమేలుతోంది. వాళ్ళ సంసారంలో సంజ చీకట్లు ముసిరినయి.

    అకస్మాత్తుగా రాంనర్సయ్యకు ఆదిలాబాద్ జిల్లా జిన్నారం ఫారెస్ట్ రేంజికి అదిలీ అయింది. అక్కడి తండాలల్ల జ్వరం గోండులను వణికిస్తుంది. వారి ఆరోగ్యం, యోగక్షేమాలను చూసుకోవడానికి ఆ డిపార్ట్‌మెంట్ రాంనర్సయ్యను ట్రాన్స్‌ఫర్ చేసింది. అదే అవకాశంగా తీస్కుకుని బంధాలను, అనుబంధాలను తెంచుకొని శివజ్యోతికి దూరంగా వెళ్ళిపోయిండు. కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య పట్టింపులు, పట్టుదలలు బిగుసుకుపోయినవి. ఎడబాటు పెరిగింది. పూడ్చలేని ఓ పెద్ద అగాధం ఏర్పడింది.

    రాంనర్సయ్య వయస్సు ఇపుడు అరువై అయిదు సంవత్సరాలు. వృద్ధాప్యపు సమస్యలతో బాధ పడుతున్నడు. మనస్సుకు శాంతి, శరీరానికి విశ్రాంతి లేకుండా పోయినయి. యాంత్రికమైన జీవితం గడుపుతున్నడు. 'తనొక వంచకుడు. ఓ స్త్రీ జీవితంతో చెలగాటమాడిన నమ్మకద్రోహి' పశ్చాత్తాపంతో అతని ఆత్మ దహించుకుపోతోంది. శివజ్యోతి వద్దకు వెళ్ళడానికి అపరాధభావం అతని కాళ్ళకు అడ్డంపడుతోంది. జీవితంలో సరిద్దుకోలేని ఓ పెద్ద తప్పు చేశానని కుమిలి పోతున్నడు. గత జ్ఞాపకాల మంచుతెరలు రాంనర్సయ్యను మనస్సు పొరల్లో ఘనీభవించి బాధపెడుతున్నయి.

    "సార్ భద్రాచలం వచ్చింది" కండక్టర్ కేకతో తేరుకున్న రాంనర్సయ్య సంచి పట్టుకుని బస్సు దిగిండు. నొసలు మీద చెయ్యి పెట్టుకుని చుట్టూ చూసిండు. ఆనవాళ్ళు గుర్తుపట్టనంతగా మారింది. ఎన్నో సంవత్సరాల తర్వాత భద్రాచలంలో అడుగుపెట్టిండు. కళ్ళల్లో ఏదో తెలియని ఆతృత...ఆరాటం...! శివజ్యోతి కనిపిస్తుందా? ఎట్లుందీ? అసహ్యించుకుంటుందా? క్షమిస్తుందా? మానవత్వంతో ఆదరిస్తుందేమో? పలు ప్రశ్నలు, సందేహాలు, ఆశలు అతని మస్తిష్కాన్ని తొలుస్తున్నాయి. గుండెల్లో ఓ మూల మినుకుమినుకు మంటున్న చిరు ఆశ. ఈ సంక్లిష్టతలో అతని హృదయం సహజ వేగానికి మించి కొట్టుకుంటుంది.
 
    భద్రాద్రి రామాలయం వెనుక ఒక చిన్న గుట్ట. దాన్నానుకొని బ్రాహ్మణుల వీధి. అక్కడక్కడ మట్టి పెంకుటిండ్లు. ఆకాలపు సంస్కృతిని ప్రతిబింబింప చేస్తున్నయి. సిమెంటు రోడ్డు వీధిగుండా గూనిపోయిన ఓ ముదుసలి పోతూ వుంది. తెల్లని చీర కట్టుకుంది. బోడితల మీద కొంగు కప్పుకుంది.
 
    "ఓ పెద్దమ్మా ఇక్కడ శివజ్యోతి అని ఒకామె ఉండేది మీకు ఎరుకేనా...?" రాంనర్సయ్య ఆ ముదుసలిని అడిగిండు.
 
    "ఆ తెలుసు!"
 
    "ఆమె ఇల్లెక్కడా?"
 
    చూపుడు వేలుతో చూపుతూ "అదిగో. అదే. అది ఇల్లు కాదు. ఓ ఆశ్రమం. మనఃశాంతికి, ఆత్మ స్థైర్యానికీ అదొక నిలయం. ఆ గేటులో నిడ్డాడే ఆ అబ్బ్బయి ఆ తల్లి కొడుకు! ఎవడో ముదనష్టపోడు ఆ పుణ్యాత్మురాలిని పెళ్ళి జేసుకుని కొంతకాలం కాపురం జేసి పత్తా లేకుండా పారిపోయిండట." గొణుక్కొంటూ వెళ్లిపోయింది ముసలమ్మ. రాంనర్సయ్య మనస్సు చివుక్కుమంది. అతని ఎద ఇనుపచువ్వలతో పొడిచినట్లయింది.
 
    'శివజ్యోతి మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆ అబ్బాయి ఎవరి సంతానం?' ఏదో కుతూహలం అతన్ని వెంటాడుతోంది. తను ఆమె మనస్సును, ఆలోచనలను, ప్రేమను, జీవిత సర్వస్వాన్ని తంకే పరిమితం కావాలనుకున్న స్వార్థంతో సంకుచిత మనస్తత్వంతో ఒక మహోన్నత స్త్రీని దూరం చేసుకున్నడు. ఆమె హృదయాన్ని గాయపరిచిండు. తనో మరుగుజ్జు అయిండు.

    రాంనర్సయ్య మనస్సు తీరని ఆవేదనతో నలిగిపోతోంది. ఏదో భ్రమలో ఆత్మవంచనతో ఇంతకాలం జీవితాన్ని సాగదీసిండు. తమ్ముడి పిల్లల్ని పోషించిండు, పెద్ద జేసిండు. వాళ్ళచేతే ఛీత్కారం పొందిండు...? మెల్లగా నడుచుకుంట గేటు వద్దకు చేరుకున్నడు. అబ్బయిని చూసి ఆశ్చర్య చకితుడయ్యిండు. నూనూగు మీసం, పసిమి ఛాయ. రూపురేఖలు అచ్చం తన లెక్కనే ఉన్నయి. అతని మనస్సు శంకిస్తోంది. ఉబలాటపడుతోంది. ఏదో పాశం ఇద్దరి హృదయాలను కల్లోల పరుస్తుంది. "లోనికి రండి" ఆహ్వానించిండు అబ్బాయి.

    అతను గేటులోకి ప్రవేశించిండు. వింతగా చూడసాగిండు. అదొక ఆశ్రమం. ఉద్యానవనం మధ్యలో ఉంది. చుట్టూతా పెద్ద ప్రహారీగోడ, దాన్ని ఆనుకుని వరుసగ వేప, కానుగ, గుల్‌మొహర్ చెట్లు. చల్లని తెమ్మెరలు, ఆహ్లాదకరమైన వాతావరణం. రెండు పెద్ద షెడ్లు మనిషికి కావలసిన కనీస సౌకర్యాలతో నిర్మింపబడి ఉన్నయి. అవి ఆశ్రమ వాసుల ఆవాసాలు. అక్కడి నివాసుల ముఖాల్లో నిరాశ నిస్పృహలు కనబడతలేవు. వాళ్ళలో సామాజిక చింతన కనబడుతోంది. ఏడుపదులు నిండిన వృద్ధులు సైతం ఏదో పనిలో నిమగ్నమై ఉన్నరు. వారి కళ్ళలో ఆప్టిమిస్టిక్ భావన, అచంచల ఆత్మ విశ్వాసం కనబడుతోంది. వృద్ధాప్యం శరీరాలకు గానీ మనస్సుకు, మనస్సు చేసే ఆలోచనలకు కాదన్నట్లుగా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు చేస్తున్నరు.

    అబ్బాయి రాంనర్సయ్యకు ఆశ్రమం అంతా తిప్పి చూపిస్తున్నడు. ఆ ఆశ్రమంలో చిన్న ఆసుపత్రిని నిర్వహిస్తున్నరు. యునాని, ఆయుర్వేదం, హోమియో చికిత్సలు చేస్తున్నరు. మూలికలు, వేర్లు, పసర్లు, తేనెతో ఆయుర్వేద మందులు వాళ్లే తయారు చేస్తున్నరు. నోట్‌బుక్స్, బిస్కట్లు, పచ్చళ్లు, సాస్‌లు, మామిడి తాండ్ర, కూరగాయల వరుగులు, విస్తరాకులు, బుట్టలు, తాళ్ళు తయారు చేసి అమ్మి వాటి లాభాలను ఆసుపత్రి నిర్వహణకు పేద పిల్లల, వికలాంగుల విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నరని ఆశ్రమ కార్యకలాపాల గురించి వివరంగా తెలిపిండు అబ్బాయి.  

    'మలిసంధ్యలో మానవ సేవ'అన్నట్లు ఉన్నత ఆశయంతో శివజ్యోతి ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. వృద్ధసంఘాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలను ప్రచారం చేసింది. తన దృక్పథాన్ని వివరించింది. సామాజిక సేవా చింతన గలవారు చేయూత నిచ్చిండ్రు. ట్రస్టీలు ఏర్పడిండ్రు. ఆశ్రమ నిర్వహణ తీరు తెలుసుకున్న రాంనర్సయ్య హృదయం పొంగిపోయింది. 

    ఆశ్చర్యంగ తిలకిస్తున్న రాంనర్సయ్యను అబ్బాయి పెంకుటింట్లోకి తీసికెళ్ళిండు. ఆ ఇల్లు ఆశ్రమ సింహద్వారనికి కొంచెం దూరాన ఉంది. ఇల్లంతా సున్నంతో కోడిగుడ్డులా మెరిసిపోతోంది. నేలంతా గచ్చు చేసి ఉంది. వసారాలో కేన్ కుర్చీలు, మధ్యన టీపాయ్ దానిపై రెండు దినపత్రికలు ఉన్నయి. ఓ వైపు అలమారిలో తాత్విక, ఆధ్యాత్మిక, ఆయుర్వేద, సాహిత్యాలకు సంభందించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నయి. పైన సీలింగ్ ఫ్యాన్ ఓ మూల మేజా బల్ల దానిమీద టి.వి ఉంది. గోడ షెల్ఫ్‌లో ఫిలిప్స్ రేడియో పొందికగా ఉంది. నిరాడంబరమైన మదర్ థెరెసా ఫోటో గోడకు వేలాడుతోంది.

    తన్మయంతో ఇల్లంతా పరికిస్తున్న రాంనర్సయ్యకు తెల్లని వస్త్రాల్లో నిరాడంబరమైన ఓ స్త్రీ ప్రత్యక్షమయింది. రాంనర్సయ్య ఒక్కసారిగా దిగ్భ్రమకు లోనయిండు. లిప్తకాలం ఇద్దరి కళ్ళు కలిసినయి. కళ్ళలో సునామీ సుడులు. అవి ఆనంద భాస్పాలో వ్యధాభరిత జీవితపు తాలూకు కన్నీటి తెరలో పోల్చుకోలేని అయోమయ స్థితిలో చిక్కుకున్నరు. ఉద్విగ్న క్షణాలు భారంగా దొర్లిపోతున్నయి. 

    'అమ్మా' అంటూ ఆశ్రమాన్ని చూపించిన యువకుడు అక్కడకు వచ్చిండు. ఆశ్రమ నిర్వహణలో తల్లికి అండదండగ ఉంటున్నడు.

    ఈ అబ్బాయి ఎవరన్నట్లు రాంనర్సయ్య ప్రశ్నార్థకంగా శివజ్యోతి కళ్లలోకి చూసిండు. అతని గుండె లబ్‌డబ్ శబ్దాలు వేగంగా చెవులకు తాకుతున్నయి.

    "మన అబ్బాయ్"  అన్నట్లు చెమర్చిన కళ్ళతో తల ఊపింది. కొడుకును ఆపాద మస్తకం తేరిపారి జూస్తు ఆనంద పారవశ్యంలో మునిగిపోయిండు. కళ్ళల్లో నీళ్ళ సుడులు తుడుచుకున్నడు. మరుక్షణమే శివజ్యోతి గంభీరంగా మారింది. ఇపుడామె మానవత్వం గల ఓ కారుణ్య మూర్తి. రాంనర్సయ్య ఆమెకు ఓ వృద్ధ అనాథ మాత్రమే. మౌనంగా నిష్క్రమించింది అక్కడి నుండి. ఆమె ఉన్నతమైన మానవత్వం అతని లోని అవివేకాన్ని హరించివేసింది. చల్లని పిల్ల తెమ్మెరలో మైకు నుండి "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను" శ్రీశ్రీ గేయం ఎగిసిపడుతోంది. రాంనర్సయ్య జి.పి.ఎఫ్., గ్రాట్యుటీ ఇతర డబ్బు తాలూకు బ్యాంక్ కాగితాల బ్యాగ్ చేతబూని దృఢసంకల్పంతో తలూపుకుంటు ఆశ్రమం వైపు నడక సాగించిండు.      
Comments