నేను సైతం... -డి.కె.చదువులబాబు

    
రాత్రి సమయం పదకొండు గంటలు కావస్తూంది. భోజనం చేసి కాంపౌండ్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాను. కొడుకు, కోడలు సీరియల్స్ చూస్తున్నారు. టి.వి. శబ్దం నా గదిలోకి బిగ్గరగా వినిపిస్తూ వుంటుంది. నిద్ర రాదు. టి.వి.కట్టేసేవరకూ కాంపౌండ్‌లో తిరగటం అలవాటు.

    ఎదురింటి ముందు హీరోహోండా వచ్చి ఆగింది. ఎదురింటి కుర్రాడు క్రిందకు దిగకుండానే హారన్ మ్రోగించాడు. వాడి వయసు ముప్పై సంవత్సరాలకు కొంచెం అటు ఇటు వుండవచ్చు. వాడు తల తిప్పి నా వైపు చూశాడు. వాడి ముఖంలో ఓ పలకరింపు లేదు. చిరునవ్వు లేదు. ఓసారి నావైపు చూసి గేటు వైపు తల తిప్పాడు. బ్లాక్ ప్యాంట్ మీద చారల చొక్కా చేతులు పైకి మడిచి. గొంతు క్రింద మొదటి బటన్ వదిలేసి రేగిన జుట్టుతో ఏదీ పట్టనట్లు వుంటాడు. ఎప్పుడూ అంతే.

    ఆ కుర్రాడి అమ్మ వచ్చి గేటు తీసింది. అలాగే లోపలికి దూసుకెళ్ళి కాంపౌండ్ లోపల బండి నిలిపి దిగాడు. ఆ కుర్రాడు రోజూ ఇల్లు చేరే సమయం ఇదే. రోజూ చూస్తున్నదే. ఉదయం నేను పళ్ళు తోముతుండగా హోండాలో వెళ్ళిపోతాడు. రాత్రి పదకొండు గంటలకు ఇల్లు చేరుతాడు. సెలవు రోజుల్లో కూడా అంతే. అంత ఉద్ధరించే పనులేముంటాయో అర్థం కాదు.

    నా కొడుకూ ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరుతాడు. సెలవు దినాల్లో ఇంటిపట్టునే వుంటాడు. కానీ ఇంటిపట్టునుండకుండా సెలవు దినాల్లో వీధుల్లో పడి తిరగటమే వాడి ఉద్యోగంలా ఉంది. పక్కింటి రామారావుగారిని అడిగితే వాడి పేరు 'అనంతే' అని మాత్రం తెలిసింది. వాడి వివరాలేవీ ఆయనకు తెలియవన్నాడు. ఇరుగుపొరుగువారికి ఎదుట పడినా పలకరించని వాడి గురించి ఎలా తెలుస్తుంది? మా అబ్బాయి నవీన్ పేరు, చేస్తున్న ఉద్యోగం చుట్టూ పాతిక ఇళ్ళకు తెలుసు. నవీన్ అనంత్‌లా మట్టిముద్ద కాదు. మా నవీన్‌కీ అనంత్‌కీ నక్కకూ నాకలోకానికీ వున్న తేడా ఉంది. మా వాడికి ఎలాంటి దురలవాట్లు లేవు. నలుగురిలో కలిసిపోవటం, ఒక్కసారి పరిచయమైతే చాలు మళ్ళీ మళ్ళీ పలకరించటం మావాడి నైజం. నా కొడుకును చాలా శ్రద్ధ తీసుకుని పెంచాను. ఉద్యోగస్థుడిని చేశాను. వాడు అనంత్‌లా ఊరిమీద పడి ఉండడు. ఇంట్లో వుంటాడు. కానీ నన్ను పలకరించే తీరిక లేదు. టి.వి.తో బిజీగా వుంటాడు.

    ఈ మధ్య మనస్సు ఏమీ బావుండటం లేదు. నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. మనిషికి తిండి వుంటే సరిపోదు. కొంతయినా ప్రేమ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాలి. ఇంతకాలం సర్వ స్వతంత్రుడిగా జీవించిన నేను నేడు ముసలితనం వల్ల స్వాతంత్ర్యం కోల్పోయాను.

    నాలుగు రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాను.

    ఉదయం నవీన్‌తో "పన్ను సలుపుతోందిరా! ఈ బాధ పడలేకున్నా" అన్నాను. ఆ మాటకు పక్కనే ఉన్న కోడలు ముఖం చిటపట లాడటం నా దృష్టిని దాటిపోలేదు.

    వాడు ఓసారి భార్యవైపు చౌసి, తలదించుకుని "ఇదీ ఓ సమస్యేనా! పన్ను నొప్పిదేముంది తాంబూలం వేసుకు పుక్కిలించేస్తే పోతుంది. దవడన పొగాకు పెట్టుకో తగ్గిపోతుంది. అంత మాత్రానికి హాస్పిటల్‌కెందుకు దండగ" అని చెప్పి వెళ్ళిపోయాడు.

    వాడి మాటలకు హృదయం విలవిలలాడింది. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. పంటి నొప్పి పోగొట్టుకోవడానికి నేను చేయని స్వంత వైద్యం లేదు. దేనికీ తగ్గలేదు. డాక్టర్ దగ్గరకెళ్ళడమొక్కటే మిగిలి వుంది. కానీ ఆ విషయం వాడితో అనలేదు. ముసలివాడికి అన్నమే దండగనుకునే వాళ్ళు జబ్బులకు డబ్బులు ఖర్చుపెడతారా?

    కొడుకు, కోడలు, పిల్లలు టూత్‌పేస్టు వాడితే నేను వాడేది బొగ్గుపొడి. ఏరోజూ పేస్టు వాడమని అనలేదు. పంటి నొప్పితో పేస్టు వాడబోతే కోడలి ముఖంలో చిటపటలు. వేప పుల్ల దొరకని చోట బొగ్గు తప్ప ఏముంది? ఇంటి ఆర్థిక స్థితికి ఏ లోటూ లేదు. కానీ నేను ఉక్కకు ఉడికిపోతున్నా ఫ్యాన్ వేసుకునే అర్హత లేదు. ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నా అడగటానికి లేదు. కోడలు పెట్టినప్పుడు తినాల్సిందే. ఏ రోగం లేకున్నా పిల్లల్ని తాకడానికి లేదు. ఏ జబ్బు అంటుకుంటుందో అని భయం. నేను జేబులో డబ్బులేకుండా ఏ రోజూ గడపలేదు. ఈనాడు పిల్లలకు ఓ రూపాయి ఇద్దామన్నా నా వద్ద లేదు.

    పిల్లలు డబ్బడిగితే ఇచ్చి ఆ కళ్ళలో మెరుపు చూడాలని ఎంతో ఆశ. తనవద్ద డబ్బుండదని తెలిసి అడగటం మానేశారు. పిల్లలను స్పర్శించాలని నా హృదయం ఎంతగానో తపిస్తూంది. ఆ తపన తీరేదెలా?

    నా కొడుకును ఈ చేతులతో నా గుండెలపై ఆడిస్తూ మాటలు నేర్పాను. నేడు ఇంట్లో నాతో మాట్లాడేవాళ్ళు లేరు. ఓ పలుకు లేదు. పిలుపు లేదు. చదువుకోసం పిల్లల పరుగులు. కొడుకు ఉద్యోగం. ఇంటికొస్తే భార్య, టి.వి తో కాలక్షేపం. టి.వి.గుర్తుంటుంది కానీఅ గదిలో నాన్న ఉన్నాడు పలకరించాలని గుర్తుండదు. ఫ్యూజు పోయిన బల్బుతో పనేముంది? మౌనమే నా నేస్తం. జీవితంలో ఒంటరితనాన్ని మించిన భయంకరమైనదేదీ లేదు. ఆ విషయం వీళ్ళెప్పుడు గుర్తిస్తారు. పొరపాటున చేతులు వణికి నీళ్ళు ఒలికినా కోడలు మాటలతో ప్రాణం తీస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా మనసొప్పక దండగనుకునే స్థితి.

    నా పరిస్థితే ఇలా వుంటే ఉదయం వెళ్ళి ఏ అర్థరాత్రో ఇల్లు చేరే అనంత్ వాడి అమ్మను ఏం చూసుకుంటాడు? ఆమె పరిస్థితి నా కంటే మెరుగ్గా ఏమీ వుండదు. చాలా మంది ఇళ్ళలో పెద్దవాళ్ళ పరిస్థితి ఇలాగే వుంది. భగవంతుడు కనిపిస్తే "మానవ సంబంధాలు ఎందుకిలా మారిపోయాయి. మానవత్వం, మానవీయతల చిరునామా ఎక్కడ?" అని అడగాలని వుంది.

    ఓసారి మార్కెట్‌కెళ్ళి కూరగాయలతో తిరిగి వస్తున్నాను. రోడ్డుపక్కన హోండా ఆపి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అనంత్. బ్లాక్ ప్యాంట్, పైకి మడిచిన చారల చొక్కా, రేగిన జుట్టు. నావైపు చూశాడు. ఆ చూపులో అదే నిర్లక్ష్యం. ఎవరో అపరిచితుడ్ని చూసినట్లు చూసి తల తిప్పేసుకున్నాడు. వాడికి బరువు బాధ్యతలు తెలియవు. మంచి చెడులు తెలియవు. ఇరుగుపొరుగు వారిని కీనీసం పది రోజులకు ఒకసారైనా పలకరించాలని తెలియదు. సభ్యత సంస్కారం తెలియవు. మరి జీవించడమెందుకు? తిని తిరగటానికా?

    ఆలోచనలతో ఇల్లు చేరాను.

    ఆ రోజు సాయంకాలం కొడుకు, కోడలు, పిల్లలు హోండాలో సినిమాకు బయలుదేరారు. ఎదురింటి కాంపౌండ్‌లో అనంత్ భార్య పూలు కోస్తోంది. ఆమెను చూస్తే నాకు జాలేస్తుంది. ఆమె భర్తతో కలిసి బయటికి వెళ్ళగా ఏనాడూ చూడలేదు. ఆమె ఇంట్లో పడివుంటే అనంత్ మాత్రం పండగరోజు, ఆదివారం అనేది లేకుండా జల్సారాయుడిలా వీధుల్లోకి వెళ్ళిపోతాడు. ఆమె ఎలా భరిస్తోందో అనిపించింది. కానీ ఆమె ముఖంలో ఎక్కడా విషాద ఛాయలు లేవు. ప్రశాంతంగా కనిపిస్తుంది. పూలకోసం ఆమె ఇంటి దగ్గరకొచ్చే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వుంటుంది.

    రాత్రి పది గంటలకు నవీన్, కోడలు, పిల్లలు వచ్చారు. అన్నం పెడితే తిని పడుకున్నాను.

    మరుసటి రోజు ఉదయం నవీన్ నా దగ్గరకొచ్చాడు. "నాన్నా నీతో ఓ విషయం మాట్లాడాలి" అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాను. 

    "మీ కోడలికి ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరం పనిచేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చు" అన్నాడు. కోడలు ఉద్యోగం చేయాల్సిన అవసరమేమిటీ నాకర్థం కాలేదు. ఆ విషయం నాకెందుకు చెబుతున్నాడో అర్థంకాలేదు. వాడి ఆర్థిక స్థితికి ఏ లోటూ లేదు. ధరలు పెరిగి మేమున్న ఇల్లే లక్షల విలువ చేస్తుంది. మంచి జీతం వస్తోంది. పల్లెలో చెమటలు ధారపోసి పంటలు పండించి వాడిని ఈ స్థితికి తెచ్చిన భూమి వుండనే వుంది. ఆ భూమి కౌలు డబ్బులు అందుతున్నాయి. ఆ విషయమే అడిగాను. "ఉద్యోగం వచ్చి మంచి జీతం వస్తుంటే ఎందుకు వదులుకోవాలి?" అన్నాడు. 

    "నీ ఇష్టం" అన్నాను.

   "మేము ఇద్దరం ఆఫీస్‌కు, పిల్లలు స్కూల్‌కి వెళ్తే నువ్వు ఇంట్లో ఒంటరిగా వుండాల్సి వస్తుంది. ఎలా వుంటావు. బోర్ కొడుతుంది. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను" అన్నాడూ.

    ఏం చెబుతాడోనని ఊపిరి బిగబట్టాను.

    ఇప్పుడు మాత్రం నేను ఒంటరిని కానా?

    క్షణం తర్వాత అన్నాడు... "వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. నీకు ఏదైయినా అనారోగ్యంగా ఉంటే ఎవరో ఒకరు అక్కడయితే అందుబాటులో ఉంటారు..." చెబుతున్నాడు.

    నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటున్నట్లయింది. నెత్తిమీద వెచ్చటి రక్తం గుమ్మరిస్తున్నట్లుంది. గుండె బ్రద్దలౌతూ ఉంది. అలాంటి మాట వాడి నోట వినాల్సి వస్తుందని నేను ఏనాడూ అనుకోలేదు. నేను పొలం పనుల్లో క్షణం తీరిక లేకున్నా సమయం కేటాయించి మా నాన్న మంచిచెడ్డలు చూశాను. జీవితంలో ఎన్నో బంధాలు... అభిమానాలు... ఆత్మీయతలు ... ఎన్నెన్నో జ్ఞాపకాలు.

    వాడికి చిన్న దెబ్బతగిలినా, ఒళ్ళు కొమెచెం వేడిగా అనిపించినా గిజగిజలాడి పోయాను. ఎత్తుకుని డాక్టర్ల చుట్టూ తిరిగాను. నా ఎదను ఆట స్థలంగా చేసి, నా గుండె లబ్‌డబ్ శబ్దాలతో మాటలు నేర్పాను. వాడికి భవిష్యత్ సౌధాన్ని నిర్మించడానికి నేను ధారపోసిన స్వేదం, ఏది అడిగినా సమకూర్చటానికి పడిన తపన... ఒక్కో జ్ఞాపకం కళ్ళముందు నిలుస్తూ వుంది. గుండె గాయమై రక్తాశ్రువులు చిందిస్తూ వుంది.

    నేనేం మాట్లాడలేకపోయాను. తండ్రిని ఇంట్లో అడ్డుగా, బరువుగా భావిస్తున్న వాడితో... తండ్రిని చివరి వరకూ ఎలా మోయాలని ఇప్పుడే బరువు దించుకోవటానికి మార్గం వెదుకుతున్న వాడితో ఏం మాట్లాడను? వాడు చెప్పే కారణం ఏదైనా వాళ్ళ ఉద్దేశం నన్ను ఇంట్లో లేకుండా చేయటమే! అది వాడి ఆలోచనో, కోడలి మంత్రాంగమో ఏమైనా నేను ఆశ్రమానికి వెళ్ళిపోవాలి.

    "నీవు వచ్చి చేర్చాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళి చేరిపోతా" అన్నాను. నా గుండెల్లో బడబాగ్ని జ్వలిస్తోంది.

    ఆ రాత్రంతా నిద్ర లేదు. పిడికిళ్ళు విప్పని వాడి రూపం, బోసి నవ్వులు, ప్రతి రోజూ వాడితో నేను గడిపిన గంటలు, వాడి భవిష్యత్ కోసం పడిన శ్రమ... ఒక్కో జ్ఞాపకం నాటి నుండి నేటిదాకా నా కళ్ళ కన్నీరులో కదిలి కంటి కొసల నుండి జారిపోతున్నాయి. నా కన్నీటితో దిండు తడిసిపోయింది.

    తెల్లవారుతూంది. పక్షుల కిలకిల రావాలు, పుష్ప వికసితాలు ఎక్కడున్నాయి? పక్షులు, పుష్పాలు షోకేసుల్లో బొమ్మల్లా మారుతున్నాయి. నా బట్టలు సర్దుకుని సూట్‌కేస్‌తో బయటకు నడిచాను. ఎప్పుడో దారిలో దొరికితే ఖర్చుచేయకూడదని తెచ్చి బట్టల మధ్య ఉంచిన ఇరవై రూపాయల నోటు మాత్రం నా వద్ద వుంది.

    ఎదురింటి అనంత్ హోండా స్టార్ట్ చేస్తున్నాడు. నావైపు చూశాడు. లిఫ్టు ఇస్తానని కూడా అనలేదు. తల తిప్పేసుకున్నాడు. ఆ చూపులో దేన్నీ పట్టించుకోని అదే నిర్లక్ష్యం. వాడి అమ్మ కూడా ఏదో ఒకరోజు అనాథలా ఆశ్రమానికి చేరాల్సిందే అనిపించింది.

    ఆటోస్టాండు వైపు నడిచాను. ఆటోవాలాను ఆశ్రమాల వివరాలడిగాను. "నెలనెలా డబ్బు కడితే ధనవంతులకోసం అన్ని సౌకర్యాలు కల్పించే ఆశ్రమాలున్నాయి. ఏమీలేని అనాథలకోసం స్వచ్ఛందంగా స్థాపించిన "విశ్వంభర" ఆశ్రమం వుంది. ఎక్కడికెళ్ళాలి?" అన్నాడు.

    "విశ్వంభర" అనాథల ఆశ్రమానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. 

    పట్టణం వెలుపలనున్న ఆశ్రమం ముందు ఆటో ఆగింది. ఆటో ఛార్జి ఇచ్చి లగేజీతో లోపలికెళ్ళాను. ఎంట్రన్స్ దాటాక మేనేజర్ రూం కనిపించింది. లోపలికెళ్ళి కలిశాను. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఆశ్రమంలో చేరిపోయాను.

    సువిశాలమైన స్థలంలో గదులు... పచ్చని చెట్లు... అరుగులు... చుట్టూ ప్రహారీ. చలాని గాలి వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. మరికొన్ని గదులు నిర్మాణ దశలో వున్నాయి. ఆశ్రమం ఎందరో వృద్ధులకు నీడనిస్తూ కల్పవృక్షంలా వుంది.

    ఆశ్రమం అంతా కలియ తిరిగాను. అక్కడికి కొద్ది దూరంలో అనాథ పిల్లల కోసం గదులున్నాయి. ఎందరో పిల్లలు ఆ బడికి చేరుకుని చదువు సంధ్యలతో, కడుపు నిండా తిండితో మంచి జీవితాన్ని గడుపుతున్నారు. వృద్ధులు, పిల్లల ముఖాల్లో ఆనందం, ప్రశాంతత. బాధ అనేది మచ్చుకైనా కానరాలేదు. వృద్ధులు ఒకరికొకరు తోడుగా, అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఆ పిల్లల్లో తమ మనవళ్లను, మనుమరాండ్రను చూసుకుంటూ అందరూ తృప్తిగా కనిపించారు. ఎక్కడా ఒంటరితనం లేదు. మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చుగానీ జీవితం మీద ఇంట్రెస్ట్‌ని మాత్రం పోగొట్టుకోరాదు. అక్కడున్న వారందరూ జీవితంపై ఇష్టంతో ఆనందంగా జీవిస్తున్నారు. 

    ఒక్కరోజులో అందరితో కలిసిపోయాను. 

    మరునాడు పేపర్ తిరిగేస్తుంటే కనిపించింది.

    'మానవత్వమా! నీ చిరునామా ఎక్కడ?' అనే హెడ్డింగ్. హెడ్డింగ్ పక్కనే ఓ బస్ షెల్టర్‌లో ఇద్దరు వృద్ధులు పడి వున్న ఫోటో ఉంది. నా కళ్ళు వేగంగా అక్షరాల వెంట పరుగులు తీస్తున్నాయి. 'ప్రభుత్వ హాస్పిటల్ బయట రోడ్డు పక్కన బస్ షెల్టర్‌లో ఓ వృద్ధుడి శవం, పక్కనే ప్రాణముండీ కదల్లేని నిస్సహాయ స్థితిలో మరో వృద్ధుడు. శవం కుళ్ళి వాసన వేస్తోంది. శవం పక్కన జీవచ్ఛవంలా మరో వృద్ధుడు పడి వున్నాడు. చూసేవాళ్ళే కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. ఇదీ వార సారాంశం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెస్తూ వార్త ప్రచురించారు. అది చదివి నా మనస్సు కలుక్కుమంది. ఎవరైనా ఆ శవాన్ని దహనం చేసి వృద్ధుడిని ఆదుకుంటే బావుండుననిపించింది.

    మరునాడు పేపర్‌లో మానవత్వం పరిమళించిన వేళ' అన్న హెడ్డింగ్ కనిపించింది. ఆతృతగా చదవసాగాను.

    'విశ్వంభర' ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు అనంత్ పత్రికలో వార్తకు స్పందించి వెంటనే హాస్పిటల్ బయట బస్ స్టాప్‌లో వున్న వృద్ధుడిని హాస్పిటల్‌లో చేర్చారు. అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించారు...' అంటూ అనంత్ సామాజిక సేవా కార్యక్రమాల్ని ప్రశంసిస్తూ వార్త...పక్కనే ఫోటో. ఆ ఫోటోను చూసి పక్కనే బాంబ్ బ్లాస్ట్ అయినట్లు ఉలిక్కిపడ్డాను.

    అ... అ... త... ను ఎదురింటి కుర్రాడు అనంత్.

    ఉదయమే బయటపడి ఏ అర్థరాత్రో ఇల్లు చేరే అనంత్. 

    నా కళ్ళముందు కమ్ముకుపోయిన తెరలు నెమ్మదిగా తొలగిపోతున్నట్లు... కారు మబ్బుల మధ్య కాంతి పుంచం తొంగి చూస్తున్నట్లు... నా మూర్ఖపు ఆలోచనల చీకట్లను తొలగిస్తూ కాంతి పుంజంలా... తన జీవితకాలాన్నంతా అనాథలకోసం అర్పించిన భానుడిలా అనంత్...ఫోటోను చూస్తూ ఎంతసేపుండిపోయానో!

    మరునాడు ఓ వృద్ధుడిని వెంట తీసుకుని ఆటోలో వచ్చాడు అనంత్. షెల్టరులో శవం పక్కన జీవచ్ఛవంలా పడి వుండి అనంత్ సాయంతో హాస్పిటల్‌లో కోలుకున్న ఆ వృద్ధుడిని నడిపించుకుంటూ వస్తున్నాడు అనంత్. నల్ల ప్యాంట్‌లో, చారల చొక్కా పైకి మడిచి, రేగిన జుట్టుతో దేన్నీ పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని, ఆశయాన్ని మాత్రమే చూపుల్లో...అణువణువులో నింపుకున్న అనంత్. ఇద్దరు యువకులు వచ్చి ఆ వృద్ధుడిని గదివైపు తీసుకెళ్ళారు.

    ఒక్కక్కరినే ఆప్యాయంగా పలకరిస్తూ వస్తున్నాడు అనంత్. జీవితం మనం జీవించడానికి... మనం సంతోషంగా వుంటూ ఇతరులను సంతోష పెట్టడానికి. జీవితమంటే పని, తిండి, నిద్ర కాదు. కష్టాల్లో ఓదార్పు, సహకారం, మానవత్వం అంటూ జీవితానికి నిర్వచనంలా అనంత్.

    నేను నా గదిలోకి వెళ్ళాను. పెట్టె తెరిచాను. నవీన్‌కు తెలియకుండా వెంట తెచ్చుకున్న పొలం దస్తావేజులు, పట్టా పాసు పుస్తకం తీసుకున్నాను. బయటకొచ్చాను. అనంత్ నా దగ్గరకు వచ్చాడు. ఆత్మీయంగా పలకరించాడు. దస్తావేజులు, పాస్ పుస్తకం అనంత్ చేతిలో పెట్టాను. "లక్షలు విలువ జేసే నా పొలాన్ని 'విశ్వంభర' ఆశ్రమానికి రాయిస్తాను. ఈ ఆశ్రమం అభివృద్ధిలో నేను కూడా పాలుపంచుకునే అదృష్టం ఇవ్వు" అన్నాను.

    జీవితమంటే ఏమిటో మరింతగా బోధపడిన క్షణాలు అవి.

(ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధం 13 జులై 2008 సంచికలో ప్రచురితం)
     
 
Comments