నేరము-శిక్ష-క్షమ - డి.ఆర్.ఇంద్ర

    తెల్లారితే ఉగాది అవడంతో సాయంకాలం బజారంతా వేప్పువ్వు కట్టలు, మామిడి కాయలు, చెఱకు ముక్కలతో - గిరిగీసి బేరాలాడే పిసినిగొట్లతో సందడిగా, బాగా రద్దీగా ఉంది. డీలక్స్ సెంటర్ నుండి కోటగుమ్మం దగ్గరి శివుడి బొమ్మదాకా ఆ సందడంతా అనుభవిస్తూ పదిరూపాయల వస్తువుని పావలాకిస్తావా అని బేరాలాడుతూ కొనుగోళ్లు చేయడం మా సీతకి ఇష్టం. ఆ కొనుగోళ్లు మొయ్యడానికి ఆఫీసరమ్మ పక్కన డఫేదారులా నేనుండాలి కాబట్టి - వుండి, జనసముద్రంలో సీతకి దారి కల్పిస్తూ ముందు నడుస్తున్నాను.

    అప్పుడు జరిగిందో సంఘటన.

    ఆ రద్దీలో ఎదురుగా వస్తున్న ఓ కుర్రజంటలోని అమ్మాయి చూసుకోకుండా నన్ను గుద్దింది. సారీ చెప్తూ ఆ పిల్లా, సారీ అంటూ నేనూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఒక్కసారిగా తెల్లబోయాం. ఆ పిల్ల చేతిలోని వేప్పువ్వు కట్ట జారి నేలపై పడింది. ఆ పిల్ల ముఖం కత్తివాటుకి నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది. పక్కన పచ్చని ఆ పిల్ల చెయ్యి పట్టుకుని నల్లగా సన్నగా రివటలా దొండపండుని ముక్కున కరచుకున్న కాకిలా ఆ కుర్రాడు.

    ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా నా రెండు చేతులూ ఆ పిల్ల ముఖాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాయి. నా పెదవులు ఆ పిల్ల నుదుటి మీద చుప్మంటూ గాఢంగా, ఆత్మీయంగా ముద్దాడాయి. ఆ పిల్ల బిత్తరపోయి సిగ్గుతో తలవంచుకుంది.

    నడి బజార్లో ఏమిటా పిచ్చి పని అన్నట్టు సీత ఎర్రగా చూస్తూ నా చొక్కా పట్టుకుని వెనక్కి లాగింది. అప్పటికే జనాలు మా వంక అదోలా చూస్తున్నారు. ఆ పిల్ల తల మీద చేయివేసి ఆప్యాయంగా నిముర్తూ "బావున్నావా తల్లీ!'' అన్నాను.

    "వూఁ...!'' అందా పిల్ల పొడిగా, ఇబ్బందిగా నా ముఖంలోకి సూటిగా చూడలేక పక్కకు తప్పుకుంటూ.

    సీత నన్ను గబగబా ముందుకు లాక్కుపోయింది. పోయి పుష్కరాల రేవు మెట్ల మీద కూర్చున్నాం. సీత సీరియస్‌గా ముఖం మరోవైపుకి తిప్పుకుని కూర్చుంది.

    "సిగ్గు లేదా మీకు? ఏమిటి మీరు చేసిన పని? జన్మలో ఇక దాని ముఖం చూడనన్న మీ శపథం ఏ గోదాట్లో కలిసింది? అది చేసిన రాద్ధాంతం అంతా మరచిపోయారా? బావున్నావా తల్లీ అట! బావోకేం? ఇంతమంది గుండెల్లో గునపాలు గుచ్చి నిక్షేపంలా వుంది గుండ్రాయిలా. దాని గురించి నిద్రాహారాలు మాని పిచ్చెక్కించుకున్నది మీరు. అది మీ బాగు అడిగిందా? అయిన వాళ్లెలా ఛస్తే దానికేం? ప్రేమికుడితో కులుకుతూ మహా చక్కగా వుంది మరింత నిగనిగలాడ్తూ - విశ్వాసఘాతకురాలు'' ఈ మాటలన్నీ సీత గొంతులోంచి కసిగా రాబోయి, తీవ్రమైన అయిష్టత వల్ల ఆగిపోయాయని నాకు తెలుసు.
ఏడాది క్రితం వరకూ నాకన్నా ఎక్కువగా ఆ పిల్లను ప్రేమించిన సీతకి అంత కోపం రావడంలో తప్పేమీ లేదు. ఆ పిల్ల చేసిన ఘనకార్యం అటువంటిది.

* * *

    మొదటినుండీ ఆడపిల్లలంటే నాకు పిచ్చి అభిమానం. నాకో పుత్రరత్నం తప్ప ఆడపిల్లల్లేకపోవడం వల్లా, ఇంట్లో వో ఆడపిల్ల వుంటేనే గానీ ఇంటికీ, జీవితానికీ ఓ అందమూ, నిండుతనమూ వుండవన్న నమ్మకం వల్లా, ఆడపిల్ల లేని ఇల్లు ఇల్లేకాదనే వేపకాయంత వెర్రి వుండటం వల్లా ముద్దుగా డాడీ అని పిలిచే ఆడకూతురి కోసం తహతహలాడాను. నా బాధ చూసి సీత "పోనీ నేనే డాడీ అని పిలవనా? భార్యలో తల్లి (భోజ్యేషుమాతలా) వున్నప్పుడు కూతురు కూడా వుండదా యేం డార్లింగ్ డాడీ?'' అని నవ్వించేది.

    నేనుండబట్టలేక నా కొడుక్కే గౌను తొడిగి ముచ్చట తీర్చుకుందామనుకుంటే సీత 'మీ కూతురు పిచ్చి దొంగల్తోలా. పిల్లాడ్ని ఆడా - మగా కాకుండా చేస్తారా? మీకంత ఇదిగా వుంటే ఏ అనాథశరణాలయం నుంచో ఓ పిల్లని తెచ్చుకుందాం' అని ఘాటుగా కూకలేసిన నెల్లాళ్లకే నా కుడి భుజమైన సూరికి దబ్బపండులాంటి కూతురు పుట్టింది. అసూయంటే ఎరగనివాడ్ని ఆ క్షణంలో సూరిని చూసి అసూయపడ్డాను. 'ఆ పిల్లని మనకిచ్చేసి వాళ్లు మరో పిల్లని కనకూడదా' అని సీతతో చాటుగా అన్నాను.

    జవాబుగా సీత ఓ మొట్టికాయ మొట్టి 'వోర్నా వెర్రి మొగుడోయ్, అటువంటి మాటలు పైకి అనకు. బావుండదు. వాళ్లు కష్టపడి కన్నది నీకివ్వడానికి కాదు. కావాలంటే దాన్నెత్తుకుని తిరుగుతూ మీ ముచ్చట తీర్చుకోండి' అంది.

    బారసాల రోజున సూరి వాళ్లమ్మ పేరైన 'లక్ష్మీ వెంకట నరసమాంబ' పేరే పెడతారని అందరూ అనుకుంటుండగా - నా భావాలను మెచ్చుకునే సూరి భార్య సుగుణ పీటలమీద సూరితో 'పేరు బావగారు పెడతారు' అంది. నోరు విప్పి ఎప్పుడూ ఏదీ అడగని సుగుణ కోర్కెను సూరి కాదనలేకపోయాడు.

    నేను వెంటనే చీటీ మీద 'స్వేచ్ఛ' అని పేరు రాసి బ్రహ్మగారికిచ్చాను. అదేం పేరు అని గుసగుసలు వినిపించినా నేను పట్టించుకోలేదు. యేం, ఆడపిల్లకి స్వేచ్ఛ అని పేరు పెట్టకూడదా? పేరులో నాజూకుతనం లేదా, అందం లేదా, అర్థం లేదా? నాకో కూతురు పుడ్తే లోకంలో ఏ ఆడపిల్లకీ లేని పేరు పెట్టాలనే నా కోర్కె అలా తీరింది.

    ఆ రోజునుంచి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఆ పిల్లని నెత్తిన పెట్టుకుని వూరేగడం మొదలుపెట్టాను. దానికి రకరకాల గౌన్లు కొన్నాను. గాజులు కొన్నాను. వెండిపట్టీలు కొన్నాను. వొంటిపేట గొలుసు చేయించాను. పట్టు పరికిణీలు కుట్టించాను. డజన్ల కొద్దీ టెడ్డీబేర్లూ, బార్బీబొమ్మలూ సరేసరి ... ఇంకా యేం కొనాలో చాంతాడంత లిస్టు రాసి పెట్టుకున్నాను. దాని చేత డాడీ అని కాకపోయినా 'పెద్దనాన్నగాలూ' అని పిలిపించుకుని మురిసిపోయాను. అది పకపకా నవ్వుతూ నా వీపెక్కి తొక్కుతూంటే జన్మ ధన్యమైపోయిందనిపించేది.

    అది సూరింటికీ - మా ఇంటికీ ఉమ్మడి యువరాణి అయిపోయింది. నేను దాన్ని సైకిలుమీద కూర్చోబెట్టుకుని ఇంటికి తెచ్చుకుని మోకాళ్ల మీద మోచేతుల మీద వంగుని వీపు మీదెక్కించుకుని 'చెల్ చెల్ గుల్లం చెలాకి గుల్లం' ఆడుకుంటుంటే కాసేపటికే కొంపలు మునిగిపోయినట్టు సూరి రయ్రయ్ మంటూ వచ్చేసి పిల్లని తీసుకెళ్లిపోవడం నాకు గుండెలో గుచ్చుకునేది. కష్టపడి వాడు కన్న పిల్లమీద నాకేం హక్కుంది కాదనడానికి. నా దిగులు చూసి సీత 'వీపెక్కేందుకు నీ యువరాణి లేకపోతే యేం, ఈ మహారాణీ వుందిగా, చెల్ చెల్' అంటూ నా వీపెక్కుతూ నవ్వించేది. రెండో యేట సీత దానికి సిగ్గుబిళ్ల చేయించాలన్నప్పుడు - 'మొగపిల్లలకి (అవసరం)లేని సిగ్గుబిళ్ల ఆడపిల్లకి వుండాలనడం అంటే వివక్ష చూపించడమే' అని అడ్డుకున్నాను. అది బయట ఆడుకుని వస్తే సీత ఇప్పటిదాకా ఎక్కడికెళ్లావే అని నిలదీస్తే - 'మొగపిల్లల మీద లేని కట్టడి ఆడపిల్ల మీద ఎందుకూ? స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుకోనీ' అని విసుక్కున్నాను.

    'బాగుంది మీ వరస, ఇలా అయితే రేపది ఏకు మేకై కూర్చుంటుంది. ఆడపిల్ల స్వేచ్ఛకి హద్దుండాలి. ఇనుముని వేడిమీదే వొంచాలి' అని సీత క్లాసు పీకితే దులిపేసుకునేవాణ్ణి.

    స్వతంత్రంగా ఆలోచించడానికీ, స్వతంత్రంగా జీవించడానికీ ఆడా - మొగా తేడా లేకుండా స్వేచ్ఛ ఉండాలి. ఆడపిల్లలు స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తారేమో అని స్వేచ్ఛ లేకుండా చెయ్యడం అమానుషం అని చెప్పినా సంకెళ్లలో పెరిగిన సీతలాంటి వాళ్లకి అర్థం అయ్యేది కాదు.

    ఆ పిల్ల నోరారా 'పెదనాన్నా' అని నా ముచ్చట తీరేలా పిలుస్తున్నా, నా కన్నా తండ్రితోనే ఎక్కువ చనువుగా వాటేసుకుని గడపడం నాకెక్కడో బాధించేది. సూరి కూడా కూతురంటే పడిచచ్చేవాడు. అది పెద్ద మనిషయ్యాక కూడా ఇంకా అన్నం కలిపి బతిమాలుతూ ఇల్లంతా తిరిగి తినిపించేవాడు. దాన్ని డాక్టర్ చేయాలని సైన్సూ, లెక్కలూ నూరిపోసేవాడు. కూతురు మీద చెయ్యేసి పడుకుంటే గానీ వాడికి నిద్ర పట్టేది కాదు. వాళ్లిద్దరి కబుర్లకీ నవ్వులకీ అంతూ పొంతూ వుండేది కాదు. అది చూసి నాకు లోపల రగిలేది. అది సూరికన్నా నన్నే ఎక్కువ ఇష్టపడాలంటే ఏం చేయాలా అని తెగ ఆలోచించేవాడ్ని. 

    అది టెంత్ పాసయినప్పుడు చాలా ఖరీదైన రిస్ట్ వాచ్, లేడీస్ బైకూ బహుమతిగా ఇచ్చాను. నీ పెదనాన్న లాంటి పెదనాన్న మాకు వుంటేనా అని దాని ఫ్రెండ్స్ అసూయపడేలా అది మెచ్చే ఫ్యాషనబుల్ డ్రెస్సులు (అప్పులు చేసి) కుప్పలుగా కొన్నాను.మెడిసిన్ ర్యాంకు రాకపోవడంతో బి.ఎస్సీలో చేరింది. పిల్ల మంచి అందగత్తె కావడంతో 'కాణీ కట్నం లేకుండా చేసుకుంటామ'ని జమిందారీ సంబంధాలు వెదుక్కుంటూ వస్తూంటే - 'అప్పుడే పెళ్లేమిటి? అది పి.జీ చేసి, పి,హెచ్.డీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చాకే పెళ్లీ గిళ్లీ' అంటూ పెదనాన్న హోదాలో కేకలేసాను. సీతతో - 'సీతా, ఎంత ఖర్చయినా సరే మనమే భరించి, మంచి చాకులాంటి కుర్రాడ్ని చూసి మనమే దాని పెళ్లి చాలా గ్రాండ్‌గా చేద్దాం' అన్నాను ఒకసారి. సీత ' ఆ చేసేదేదో చాకులాటి కుర్రాడ్ని నాకిచ్చి చెయ్యి - మీ నసయినా తప్పుతుంది' అంది చురచుర చూస్తూ.

    జీవితాలు అనుకున్నవి అనుకున్నట్టుగా సజావుగా సాగితే లోకంలో ఇన్ని కథలకీ, కథా సాహిత్యానికీ అవకాశం వుండేది కాదేమో. జీవితం ఎప్పుడూ ఓ మూసిన గుప్పిటే. అందులో తాయిలమే వుందో తాచుపాము విషమే వుందో ఎవరూ ఊహించలేరు. తనని పిచ్చిగా ప్రేమించే ఈ వెర్రి తండ్రికి తనెంత గొప్ప పండగ బహుమతి ఇవ్వదల్చుకుందో కూడా ఊహించలేకపోయాను. ఆ పిల్ల తన గుప్పిట విప్పిన ఆ రోజునెప్పుడూ మరిచిపోలేను. క్రితం ఉగాది ముందు రోజు మధ్యాహ్నం ఆ పిల్ల ఎవడితోటో లేచిపోయిందనే పిడుగులాంటి విషయం నాకు ఫిరంగి గుండులా తాకింది. నమ్మక తప్పని పచ్చి నిజం! సూరి నన్ను పట్టుకుని హృదయ విదారకంగా ఏడుస్తూంటే తట్టుకోలేకపోయాను. 

    ఆ పిల్ల నాలుగేళ్లుగా ఓ కుర్రాడితో చాటుగా తిరుగుతోందనే విషయం దాని ఫ్రెండ్స్ ద్వారా ఆ రోజే తెల్సిందట. నిలదీసేసరికి ఇంట్లోంచి ఉడాయించిందట! ప్రేమట! ప్రేమ!సూరి దుఃఖ్ఖావేశంలో 'ఇదంతా నీవల్లే జరిగింది. మా అమ్మ పేరు పెట్టుకున్నా మా అమ్మ మంచి బుద్ధులు వచ్చివుండేవేమో. గొప్ప పేరు పెట్టావు - స్వేచ్ఛట! స్వేచ్ఛ! లేచిపోవడానికా స్వేచ్ఛ?' అని నిందించేసరికి మిన్ను విరిగి నెత్తిన పడ్డట్టు నిర్ఘాంతపోయాను. విషయం విన్న సీత కూడా నాకే తలంటింది. 'మగపిల్లలు లేని కట్టడి ఆడపిల్లలకెందుకూ, స్వేచ్ఛగా వుండనిమ్మంటూ ఉపన్యాసాలు దంచావ్గా. అందుకే స్వేచ్ఛని స్వేచ్ఛగా దుర్వినియోగం చేసింది. సిగ్గుపడే పనిని నిస్సిగ్గుగా చేసింది. నేలకి పోయేది నెత్తిన రుద్దుకున్నావ్' అంటూ వాతలు పెట్టింది. నన్ను డిఫెండ్ చేసుకునేందుకేమీ లేక దోషిలా నిలబడి మౌనంగా గరళకంఠుడిలా చివాట్లు దిగమింగాను.

    మూడో రోజు కథ ఇంకా పాకాన పడింది. సుగుణ ఏడుస్తూ సూరిని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారని చెప్పడంతో గాభరాగా పరిగెత్తాను - వొంటూపిరిగాడు వాడేమైపోతాడోనని. అదృష్టవశాత్తు స్టేషన్లో తెలిసిన హెడ్ కానిస్టేబుల్ వుండడంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యాను. లేచిపోయిన పిల్ల లేచిపోయినట్టుండక పుండు మీద మరింత కారం రాసింది. లేచిపోయి ఎక్కడో గుళ్లో పెళ్లి చేసుకోవడమే కాక, తనకీ తన భర్త ప్రాణాలకీ తన తండ్రీ, పెదనాన్నల వల్ల ప్రాణ భయం వుందనీ, అందువల్ల పోలీస్ ప్రొటెక్షన్ కావాలనీ ఎస్పీ, డి.జి.పిల వరకూ కంప్లెయింట్ ఇచ్చిందట! వారెవ్వా! నా బంగారు తల్లి! ఆ క్షణంలో సూరికీ నాకూ కళ్లమ్మట జాలువారినవి కన్నీటి చుక్కలు కాదు - రక్తపు చుక్కలు. కన్న వాళ్ల రుణమూ, పెంచిన వాళ్ల రుణమూ ఎంత చక్కగా తీరుస్తోంది!

    'ఈ పిల్లలూ, వీళ్ల ప్రేమలూ ఇంతే సార్. రోజూ ఇటువంటివి చాలా చూస్తూంటాం. నాల్రోజులు పోయాక వాళ్లే తిరిగొస్తారు. మీ గురించి నాకు తెలియదా, మీరు వెళ్లండి, కేసేమీ లేకుండా మేం చూసుకుంటాం' అని హెడ్డుగారు అభయం ఇవ్వటంతో చావుదప్పి కన్ను లొట్టబోయినట్టు పోలీస్ వేధింపులు లేకుండా బయటపడ్డాం.

    'బాధపడటం యెందుకూ? లక్షల కట్నకానుకలిచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత తప్పించినందుకు సంతోషపడాలి' అన్నారెవరో. వెటకారమో, జాలితో కూడిన పరామర్శో! దెప్పేవాళ్లకి దెప్పసందు కదా.

    సూరి సిగ్గుతో చితికిపోయి వీధి మొఖం చూడటమే మానేశాడు. తిండి తినక, నిద్రపోక కూతురు కోసం ఏడ్చి ఏడ్చి, వేసవికి ఎండిపోయిన చెలమల్లా కళ్లు తడారి పోయి గుంటలు పడి, గెడ్డం పెరిగి పీక్కుపోయిన ముఖంతో జీవచ్ఛవంలా తయారయ్యాడు. సుగుణ సరేసరి. ఆ పిల్ల తండ్రితో బాటు నన్ను కూడా పోలీసు కేసులో ఇరికించిందని తెలిసి సీత కోపం నషాళానికంటింది. నన్నెవరేనా కించపరిస్తే సీత ఎంత మాత్రం సహించదు - 'కూతురో కూతురో అని అమ్మవారిని నెత్తిన పెట్టుకుని వూరేగే గణాచారిగా గంతులేసారుగా. అటువంటి కూతురు లేని తల్లిదండ్రులు ధన్యులు. కన్న వాళ్ల కళ్లు గప్పి ఎంత నాటకం ఆడింది! మహానటి! అది నా కూతురే అయితే పీకపిసికి గోదాట్లో ముంచేద్దును. తల్లిదండ్రుల వుసురూ, పెంచిన వాళ్ల వుసురూ వూరకేపోదు, ఇంతకింతా అనుభవిస్తుంది' అంది అక్కసుగా.

    నేను భరించలేకపోయాను. 'అలా శాపనార్థాలు పెట్టకు సీతా. తథాస్తు దేవతలుంటారు. కని పెంచటం తప్ప వాళ్లెంత బాధ కలిగించినా శపించేందుకు మనకు హక్కు లేదు' అన్నాను.

    'ఈ మెతకదనమే ఇంతవరకూ తెచ్చింది' అంది కొరకొరా చూస్తూ. రోజులు భారంగా గడుస్తున్నాయి. నా గుండెల్లో ఏదో బరువు. అన్నం అరగదు - నిద్ర పట్టదు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు. నా కేమిటీ శిక్ష? ఆ పిల్లెవరు - నేనెవరు? ఆ పిల్ల లేచిపోడానికి నేను కారణమని అందరూ నన్ను నిందించడం ఏమిటి? మొగపిల్లలకీ - ఆడపిల్లలకీ వివక్ష చూపకండి, సమానంగా స్వేచ్ఛగా వుండనివ్వండి అంటే ఇలా లేచిపోడానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టా? ఆడా మొగా సమానమే అనే నా ఆదర్శం ఎంత నవ్వులపాలైంది!

    ఆ పిల్ల ఆ కుర్రాడిలో ఏం హీరో లక్షణాలు చూసి అంతగా మోహించింది? అతగాడికి చదువు లేదట! సంపాదన లేదట! సూరితో మీ అమ్మాయిని ప్రేమించానని చెప్పే నిజాయితీ అయినా లేకపోయింది! ప్రేమ గుడ్డిదని ఇందుకే అన్నారా? సూరీ నేనూ ఆ పిల్లకోసం ఏడుస్తూండడం కూడా ప్రేమవల్లే అయితే మా ప్రేమా గుడ్డిదేనా? నా ప్రేమ కెమిస్ట్రీ యేమిటో నాబోటి వెర్రి వెంగళప్ప (సీత ఇచ్చిన బిరుదు)కి అర్థం కాదేమో. ఈ గుడ్డి ప్రేమకున్న మరో కొత్తకోణం నాకు మరో మూడ్నెల్లకి తెలిసొచ్చింది.

    సూరి దీనికంతకూ నువ్వే కారణం అన్నాక గిల్టీగా ఫీలై వాడింటికి వెళ్లడమే తగ్గించేసాను. ఇప్పుడా పిల్ల తన ప్రేమికుడితో సహా సూరి ఇంట్లోనే వుంటోందని తెలిసి ఆశ్చర్యపోయాను - ఇంత రాద్ధాంతం జరిగాక అసలేమీ జరగనట్టు ఏ ముఖం పెట్టుకుని నిస్సిగ్గుగా మళ్లా ఇంట అడుగుపెట్టిందా అని షాక్ అయ్యాను. నాకు సూరి ఒక పజిలై కూర్చున్నాడు. సూరి కూతుర్ని క్షమించేసాడా? కూతురెంత జుగప్సాకరంగా, బాధ్యతారహితంగా, కరుడు గట్టిన స్వార్థంతో ప్రవర్తించినా - పేగు బంధాన్ని తెంపుకోలేక, కన్న మమకారం చంపుకోలేక, దూడ కోసం తన ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డ గంగిగోవులాగ ఆత్మాభిమానం చంపుకుని, మానావమానాలు దిగమింగుకుని కూతుర్ని చేరదీసాడా? నాది పెంచిన అనుబంధమే తప్ప పేగుబంధం కాదు కాబట్టి సూరిలా ఆ పిల్లని క్షమించలేక పోతున్నానా?

    ఇంట్లో ఆ 'ఛెండాలపు పిల్ల' వూసెత్తవద్దని ఆర్డరేసిన సీతే నా సందేహం తీర్చేసింది.

    'దానికి సిగ్గా బొగ్గా? దానికి తండ్రీ అక్కర్లేదు, తండ్రి గౌరవమూ అక్కర్లేదు. కొత్త కాపురానికి తండ్రి ఆర్థిక అండదండలు మాత్రం కావాలి! అందుకే కూతుర్ని విడిచి వుండలేని తండ్రి బలహీనతను వాడుకుని చెట్టువదలని విక్రమార్కుడి శవంలా తిరిగి కొంపకు చేరింది! అది స్వార్థానికే కాదు, సిగ్గులేనితనానికి కూడా పరాకాష్ట' అంది. కూతుర్నీ అల్లుడ్నీ (?) ఇంట్లోనే పెట్టుకున్నాక సూరి ఆరోగ్యం బాగుపడి దారిలో పడ్డాడని తెల్సి సంతోషించాను. కానీ సూరి ఓ రోజు బజార్లో ఎదుటపడీ, నన్ను చూడనట్టు పక్కకి తిరిగి తప్పించుకుపోవడం నన్ను నివ్వెరపరచింది! ఏం మహాపాపం చేశానని నన్ను వెలి వేస్తున్నాడు! నేరం చేసిన కూతుర్ని క్షమించి యే నేరమూ చెయ్యని నన్ను శిక్షిస్తున్న సూరినెలా అర్థం చేసుకోవాలి? నేలకి పది అడుగుల ఎత్తులో ఆదర్శపు ఊహల్లో తేలుతూ బతికే నాకు ఈ నేలమీద మనుషులెవుడూ అర్థం కారేమో.

* * *

    ఈ నేపథ్యంలోనే - ఎవరినైతే మళ్లా చూడను, మాట్లాడను అని సీత ఒత్తిడి వల్ల సీతకి మాటిచ్చానో ఆ పిల్లే ఇప్పుడు నడిబజార్లో ఢీ కొట్టింది - ఎక్కడికి తప్పించుకుపోతావ్ అన్నట్టు! అసంకల్పితంగానే అయినా వాగ్దాన భంగం చేసినందుకు ఇప్పుడు సీతకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    'చూడు సీతా! సమాజంలో జరిగే తప్పుడు పనులకు మూలాలు మనం పాటించే సమాజపు తప్పుడు విలువల్లోనే వుంటాయి. వాటిని సమూలంగా సంస్కరించకుండా తప్పుడు పనులను నిరోధించలేం. అప్పటిదాకా మనందరమూ కూడా నేరాల్లో భాగస్తులమే.

    బహిష్కరణలూ, పోలీస్ స్టేషన్లూ, కటకటాలూ తప్పుడు పరిష్కారాలే అవుతాయి. ఆ పిల్ల మనని బాధించే తప్పుడు పని చేసిందని జీవితాంతం వెలివెయ్యాలా? నడిరోడ్డు మీద ఆడపిల్లల ముఖాలమీద ఏసిడ్లు పోసేవాళ్లనీ, రేప్ చేసి చంపేసే మానవ మృగాలనీ, సమాజానికి చీడపురుగుల్లాంటి బాబాల్నీ, స్వాముల్నీ, బంగ్లాలకే ఆడపిల్లల్ని రప్పించుకునే ఘరానా గవర్నర్లనీ, ఎంతటి ఘోరాల్నీ అవలీలగా చేసే నేరగాళ్లనీ తగినట్టు శిక్షించకపోగా కనీసం మనం వెలివెయ్యడం లేదు. ఆ పిల్ల చేసింది వాటికన్నా పెద్ద తప్పా? ఆ పిల్లని క్షమించడమంటే ఆ పిల్ల చేసిన పని రైటని అంగీకరించడం కాదు. ఎదుటివాడ్ని నిందించే ముందు ఎదుటివాడి కోణంలోంచి విషయాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించి చూడు. సమస్యా, సమస్యా పరిష్కారమూ తేలికవుతాయి. కానీ మనం ఆ పని చెయ్యం సీతా.

    ఎంతమటుకూ మనమే కరెక్ట్ అనే తప్పుడు భావనలో కూరుకుపోయి సమస్యని జటిలం చేసుకుంటాం. సమస్యని ఆ పిల్ల కోణం లోంచి ఆలోచించి చూడు. తన ఇష్టాన్ని పెద్దలు తిరస్కరిస్తారనే భయంలోంచి వచ్చిన తెగింపుతోనే, స్వార్థంతోనే ఆ పని చేసింది. స్వార్థం జీవి ప్రాధమిక నైజం సీతా. ఆ పిల్ల చేసింది తప్పే అనుకున్నా, కన్నవాడే క్షమించాక కొసరు వాడికి కోపం ఎందుకు? జీవితం ఎప్పుడూ సరళరేఖలోనే ప్రయాణం చెయ్యదు. వంపులు అనివార్యం. మనకి ఎంత ఇష్టం లేని విషయాలనైనా ఒకోసారి అంగీకరించాల్సి వస్తుంది.

    అలా అంగీకరిస్తేనే జీవితంలో ఘర్షణ నివారించవచ్చు. కందెన యంత్రాల్ని చప్పుడు చేయకుండా, త్వరగా అరిగిపోకుండా చేస్తుంది. క్షమాగుణం కూడా అలాగే జీవితంలో ఘర్షణల్ని నివారిస్తుంది' (ఈ సత్యం సూరి కన్నా తెలివైనవాడ్ని అనుకునే నాకు సూరి తిరిగి కూతుర్ని చేరదీసాకే అర్థమైంది) అని చెబుదామనుకున్నాను గానీ చెయ్యని నేరానికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు గొంతు డెక్కు పట్టినట్టయ్యి ఏమీ చెప్పలేకపోయాను. నే చెప్పే సంజాయిషీ ఏమీ లేదని భావించిన సీత - "హూ!'' అని కోపంగా లేచింది. ఆఫీసరమ్మని వేపకట్టల్తో అనుసరించాను.

* * *

    రాత్రి పదిన్నర అవుతూంటే సీత నిద్రలోకి జారుకుందని రూఢి చేసుకున్నాక నిశ్శబ్దంగా బెడ్రూమ్ తలుపు జారేసి ఫోన్ వున్న డ్రాయింగ్ రూమ్‌లోకి వచ్చాను.

    "... హలో! ... ఎవరూ ... పెదనాన్నా!?''

    "నేనేరా, నా బంగారు తల్లీ! పడుకున్నావా! ఏం లేదూ ... రేపు సరదాగా ఇక్కడే ఉగాది చేసుకుందాం. పొద్దుటే నువ్వు, మీ ఆయనా ఇక్కడికి వచ్చేయండి ...''

    కొన్ని సెకన్ల నిశ్శబ్దంలో ఆ పిల్ల బరువుగా ఊపిరి తీస్తున్న చప్పుడులో ఆశ్చర్యం, ఆనందం!

    "... పెదనాన్నా ... పె పె పెద్దమ్మ వొప్పుకుందా?''

    "పిచ్చిపిల్లా, పెద్దమ్మే మిమ్మల్ని రమ్మని చెప్పమని దెబ్బలాడి ఫోన్ చేయిస్తోంది ఈ టైంలో ... నీ మీద మాకు కోపం ఏమిట్రా పిచ్చితల్లీ ... అదేం లేదు ... నిజం ... ఒట్టు ... పొద్దుటే వచ్చేయండి తప్పకుండా మరి ... వుంటానే.''

    హమ్మయ్య! వో పనైపోయింది. సంవత్సరం నుంచి గుండెల మీద మోస్తున్న టన్ను బరువుని తీసిపారేసినట్టు మనసు దూదిపింజెలా తేలిగ్గా ప్రశాంతంగా హాయిగా వుందిప్పుడు! తప్పుల్ని క్షమించడం చేతగాని బలహీనతో - ఔన్నత్యమో నాకు తెలియదు గానీ, జీవితంలో క్షమే అలవరుచుకుంటే మనసుల్ని తినేసే ఎన్ని రోగాలు మందులవసరం లేకుండా మటుమాయమవుతాయో అనిపించింది. ఫోన్ పెట్టేసి లేవబోతూ వులిక్కిపడ్డాను. చాకచక్యంగా బేంక్కి కన్నమేసి నోట్లకట్టలు మూటకట్టి భుజాన పెట్టుకుని కన్నంలోంచి బయటకు రాగానే ఎదురుగా లాఠీతో ఠీవిగా దర్శనమిచ్చే పోలీస్ ఇన్స్పెక్టరులా ఎర్రెర్రగా చూస్తూ సీత!

    ఒక్క క్షణం తెల్లబోయినా తేరుకున్నాను.

    "ఏమిటలా చూస్తావ్ నేనేదో క్షమించరాని మహాపరాధం చేసినట్టు? నేను మొగాడ్నీ, మొగుడ్నీ, ఇంటి యజమానినీ. పండక్కి పిల్లనీ, పిల్లాడ్నీ రమ్మని ఆహ్వానించే స్వేచ్ఛ నాకు లేదా? ఏయ్! ఆగాగు .. అలా మీద మీద కొచ్చేస్తావేమిటి? నేనసలే సరైనవాడ్ని కాను'' అన్నాను. అయినా సీత ఆగడం లేదు.
బ్రేకులు ఫెయిలై రైలు క్రాసింగ్ పట్టాలమీద ఆగిపోయిన డొక్కులారీ మీదకు దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్‌లా వస్తోంది. చీకటి ఆకాశంలో మెరుపులా సీత ముఖంలో కనిపించీ కనిపించని ఓ చిరుదరహాసం తళుక్కుమంది - పూతన చంకెక్కే ముందు బాలకృష్ణుడి బుల్లి పెదవుల మీద లాస్యమాడిన చిరుదరహాసం లాటి దరహాసం!

(ఆదివారం ఆంధ్రజ్యోతి 18 జులై 2010 సంచికలో ప్రచురితం)
Comments