నీడ- శీలా వీర్రాజు

  
    కిటికీ దగ్గర కూచుని ప్రయాణం చేయడం నాకు చాలా సరదా. అలాటి సీటు దొరికితే ఎంత దూరపు ప్రయాణమైనా బోర్ అనిపించదు. గిరగిరా తిరుగుతూ పోయే చెట్లనీ, గట్లనీ మధ్యమధ్యన ఆసక్తిగా చూస్తూ మరో ధ్యాస లేకుండా ప్రయాణం చేసెయ్యగలను. కిటికీలోంచి చూస్తే మరీ అందంగా కనిపిస్తుంది ప్రకృతి. ఎవరి హృదయపు లోతుల్లోకో తొంగిచూస్తున్నప్పుడు మరింత సన్నిహితంగా వెళ్ళినట్టు, ప్రకృతి కూడా అలా చూస్తుంటే మరింత దగ్గరైనట్టుంటుంది. మాట్లాడుతూనే మనిషి ఆంతర్యాన్ని చదవడం నాకు యిష్టం. అలా చూస్తున్నప్పుడు తరచుగా నాకు కవులు ప్రకృతిని గురించి చేసిన ఉపమానం  గుర్తుకొస్తుంది. స్త్రీతో ప్రకృతిని పోల్చడంవల్ల స్త్రీ హృదయం ఎలా అర్థంకాక రహస్యంగా ఉండిపోయి ఆ రహస్యాన్ని విప్పాలన్న ఆసక్తి కలుగుతుందో, అలా ప్రకృతిని చూసినా! అందుకే నాకు కిటికీ పక్క సీటంటే అంత యిష్టం.

    కాని నా కిటికీ పక్క సీటుని మరొకాయన ఆక్రమించుకున్నాడు. బందరు నుంచి బస్సులో వస్తున్నాను. పగటిపూట ప్రయాణం. బెజవాడలో కాఫీ తాగొచ్చేసరికి నా సీటుమీద మరో ఆయన చాలా హుందాగా ఠీవిగా కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. రెండు మూడు నిమిషాలు అతని పక్కనే నుంచున్నాను, ఇటు చూస్తాడేమోనని. ఇటు చూస్తే సీటుగురించి చెబుదామనుకున్నాను. ఎంతకీ చూడకపోతే నేనే పలకరించాను.

    "మేష్టారూ! మీరు ఇలా జరుగుతారా"

    "ఏం" అన్నట్టు చూశాడాయన.అతని ముఖంలో చిరాకు, ఆశ్చర్యం పడుగుపేకల్లా అల్లుకున్నాయి. 

    "ఆ సీట్లో కూచున్నానండి. కాఫీ తాగొద్దామని దిగాను" అన్నాను, సాధ్యమైనంత నమ్రతతోనే.

    చిరాకు, ఆశ్చర్యంతో పాటు కోపం వచ్చి చేరి ముప్పేటల గొలుసైంది.

    "అవతల వెళ్లిన వాళ్ళు సీట్లో ఏమైనా పెట్టుకొని వెళ్లలేకపోయారా? ఇలా కూచున్న వాళ్ళను లేవగొట్టడం ఏం సభ్యత?" అన్నాడాయన. అన్నాడే కాని అక్కడనుంచి జరగలేదు. 

    బైటికి వెళ్ళినప్పుడు సీట్లో న్యూస్‌పేపరు పెట్టి మరీ వెళ్ళాను. అది ఏమైందా అని చూస్తోంటే వెనకసీట్లో వున్నతని చేతిలో కనిపించింది.

    "ఇక్కడ న్యూస్ పేపరు పెట్టి వెళ్ళానండి. ఎవరో తీసి చదువుతున్నారు గాబోలు" అన్నాను.

    "ఛీ ఛీ, ఏం బస్సులో ఏమో. దీనికన్న రైలు ప్రయాణం సుఖం. వెళ్ళదలుచుకున్న వాళ్ళకి క్లాసు కంపార్టుమెంటులైనా వుంటాయి. బస్సుల్లోనూ కొన్ని సీట్లు స్పెషల్‌గా వేసి వాటికి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే వీళ్ళ సొమ్మేంపోయిందో? తాహతున్నవాళ్ళు దానిలో వెళ్ళేవాళ్ళుగా."

    గొణుక్కుంటున్నట్టుగా అన్నా చుట్టుపక్కల వాళ్ళకు వినిపించేటట్టుగానే వున్నాయి మాటలు. 

    నిజమే, మనిషిని చూస్తోంటే బస్సుల్లో తిరిగేవాడిలా లేడు. భారీ శరీరం. నీటుగా అతను చేసుకున్న ముస్తాబు, హోదా వెలగబెడుతున్నట్టు నిటారుగా బిగుసుకుపోయి కూర్చున్న తీరు, ఒళ్ళంతా కదపకుండా ఒక్క మెడ మాత్రమే తిప్పి అటూఇటూ చూసే అతని చూపుల్లో ఠీవీ - చూస్తుంటే యిలా యిరుగ్గా అందరితోపాటు బస్సుల్లో ప్రయాణం చేసేవాడిలా అనిపించడంలేదు. విశాలంగా వెనక సీట్లో కూచుని ఠీవిగా వెనక్కుజారబడి, నాజూగ్గా ఏ పుస్తకమో తీసి చదువుకుంటూ మధ్యమధ్య కిటికీలోంచి అవతలికి చూస్తూ కారుల్లో తిరిగేవాడిలా వున్నాడు.
 
    ఈనాడు దేశంలో సోషలిజం కనిపించకపోయినా బస్సుల్లో మాత్రం కనిపిస్తోంది. ఇలాటివాళ్ళు అర్జీలు పెట్టుకుని ఆమాత్రంకూడా లేకుండా చేసేట్టు వున్నారు. దేశంలో పైతరగతి, మధ్యతరగతి, కింది తరగతి అంటూ మూడు వర్గాలున్నట్టే రైళ్ళల్లోనూ ఉన్నాయి. ఇప్పట్లో ఈ హెచ్చుతగ్గులు తొలిగిపోయేటట్టు లేవు. ఫస్టుక్లాసులనీ, సెకండు క్లాసులనీ బోగీలు తగిలించి ప్రయాణీకుల్ని వర్గాలుగా విడదీసే యీ బ్రిటీష్ పెట్టుబడిదారీ పాత సంప్రదాయం తొలగిపోవాలి. అన్నీ ఒకే క్లాసులో వుంచి, అవసరమైతే సగం రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తే సరి, రైళ్ళలోనూ సోషలిజం వస్తుంది. ఇంత చిన్న రైల్లోనే సోషలిజం తేలేనప్పుడు యింత సువిశాలదేశంలో సోషలిజం తేగలరని అనుకోవడం కల్ల.
 
    ఆలోచనల్లోంచి తప్పుకుని కిటికీలోంచి అవతలకి చూస్తే గలగల్లాడుతూ కృష్ణ కనిపిస్తోంది. అలోచనల్లో గుర్తించనేలేదు, బస్సు అప్పుడే కదలిపోయిందన్నమాట!

    ఆగష్టునెల కృష్ణ పరవళ్ళు తొక్కుతూ పరుగెడుతోంది. ముఖమంతా జేవురించి ఆవేశంతో వూగిపోతూ చేతులుసాచి ఒళ్ళు విరుచుకుని కదులుతోంది. దూరంగా సన్నబడిపోయిన ఒంటిరేఖ గీతలా నీరసంగా అవతలిగట్టు, గట్టు వెనక గుంపులు గుంపులుగా దాక్కొని సమయం చూసి తిరుగుబాటు లేవదీద్దామని ఎదురుచూస్తోన్న మేఘాలు, ఆతిరుగుబాటును చూడాలన్న ఉత్సాహంతో బారులు బారులుగా ఆ వైపు ఎగిరి వెళ్తున్న పక్షులు - చూస్తుండగానే ఆ చిత్రం మారిపోయింది. 

    ఇళ్ళు, పొలాలు, కలుపుతీస్తోన్న బక్కచిక్కిన కూలీలు, గట్లమీద ఊరికే ఎదిగిపోయి అసహ్యంగా భయంగా ముళ్ళడొంకలు, అక్కడక్కడ తిండికి మొహంవాచి ఆకలికి తట్టుకోలేక పొలాల్లోకి జొరబడి మేస్తోన్న పశువులు, ఈ బస్సుల్నీ, యీ కార్లనీ యీ మోటారుసైకిళ్ళనీ ఎక్కే తాహతు  లేక కాళ్ళీడ్చుకుంటూ ధూళి కొట్టుకుపోయి దారిపక్క ఒదిగొదిగి నడిచే సన్నకారు పల్లెజనం.

    చిన్నపల్లె, పల్లెనిండా పూరిపాకలు జాలిగా, బీదగా. ఆ పాకల మధ్య ఆ వూరిని ఏలుతున్నట్టు - ఠీవిగా కోటగోడల్లా పటిష్టంగా, పదో పన్నెండో పెంకుటిళ్ళూ, మేడలూ. ఆ వూరి వీధుల్లో మురికి కాలౌవలూ, పెంటకుప్పలూ, రోడ్డుపక్క వచ్చేపోయే బస్సుల ధూళిని పీలుస్తూ తమ జీవితాలకి అదే గొప్ప ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా సంబరపడిపోయే పిల్లల గుంపులూ, వొంటిమీద నిండుగా బట్టల్లేని ఆ పిల్లల అంటుకుపోయిన పొట్టలూ, వాళ్ళని కసురుకొనే వాళ్ల పెద్దల వొంగిపోయిన నడుములూ - దారిపొడుగునా ఎన్నెన్ని చిత్రాలో! 

      చూస్తూ చూస్తూ యిటు తిరిగాను. నా పక్కతను నావైపే తదేకంగా చూస్తున్నాడు. దృష్టి మార్చుకుని మళ్ళీ కిటికీలోంచి అవతలకు చూస్తూ కుర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ యిటు తిరిగితే అతని చూపులన్నీ నామీదే వున్నాయి! పరిచయ్స్స్తుని చూపుల్లా కుతూహలంగా లేవు. 'ఆ కిటికీని అంటిపెట్టుకుని ఏమిటలా చూస్తాడీయన' అన్నట్టు చిత్రంగా వున్నాయి. అందుకే ఆ నొసలు చిట్లింపు. కుతూహలపు చూప్లైతే కళ్ళు అలా కుదించుకుపోవు. పెదాలు అలా బిగుసుకుపోవు. 

    నందిగామలో బస్సు ఆగింది. డ్రైవర్ కాఫీ తాగొద్దామని ఆ పక్క హోటల్లోకి వెళ్ళాడు. ప్రయాణీకుల్లో అరడజనుమంది వరకు దిగారు. బస్సు ఎక్కువసేపే ఆగేట్టువుంది. నాక్కూడా బస్సుదిగి బయటి గాలిలో నుంచుందామని వుందిగాని నా పక్కాయన్ని తప్పుకోమని అడగాలి. అతన్ని పలకరించడం నాకిష్టంలేక అక్కడే కూచుండిపోయాను బయటికి చూస్తూ. రోడ్డవతల హోటలు పక్కన ఏనాడో మనం నిలువునా పాతేసిన రాచరికపు వ్యవస్థని తవ్వితీసి తెరమీద ఆడించి డబ్బు చేసుకుందామనే జానపద బాక్సాఫీసు దోపిడీ నిర్మాత తాలూకు సినిమా వాల్‌పోస్టర్ వుంటే చూస్తున్నాను. ప్రజల అమాయకత్వాన్ని డబ్బుగా మార్చుకునే యీ దోపిడీకి కేరళలో, పశ్చిమ బెంగాలులో యీనాడు ఉద్వాసన జరిగింది. ఇక్కడి ప్రజలు కూడా అలా ఎప్పుడు తెలివిమీరుతారో మరి!

    నా ఆలోచన తెగిపోయింది. పక్కన ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ఇటు తిరిగి చూస్తే నా పక్కాయన ఓ ముష్టాడిమీద గొంతు చించుకొని అరుస్తున్నాడు.

    "... చెప్తే నీక్కాదూ. ముందిక్కడ్నించి పో. అలాపోయి ఆ రోడ్డు మీద అడుక్కో. డర్టీ స్కౌండ్రల్. ఛీ ఛీ... బస్సుల్లోకి కూడా ఎగబడ్డడమే"

    ఆ ముష్టి ముసలాడికి చెవుడో, లేక యిలాటి వాటికి అలవాటు పడిపోయాడో ఏమో అతని మాటల్ని ఏమీ పట్టంచుకోక బస్సులో మిగతావాళ్ళ దగ్గరికికూడా పోయి యాచించి, రెండుచోట్ల యిచ్చిన పైసల్ని అందుకుని వాళ్ళకు దణ్ణాలు పెట్టి దిగిపోయాడు.

    "ఛీ ఛీ... అడుక్కుతినే వెధవలకి కూడా ఎంత నిర్లక్ష్యం. చెప్తే వినిపంచుకోవడమంటూ ఉందా... ఒకటే ఎగపడటం. ఈ దేశానికి వీళ్ళనుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందో. వీళ్ళతో వెగలేక ఛస్తున్నాం" అన్నాడాయన యిటు తిరిగిన ముందు సీటు అతనితో.

    ఆ వ్యక్తి నిజమేనన్నట్టు తలతిప్పాడూ. "ఎక్కడ చూసినా వీళ్ళే కదండీ. రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. వొళ్ళొంచి కష్టపడి పనిచేయడంకన్నా ఇదే లాభసాటి వృత్తిగా వుంది వీళ్ళకి. అందుకే యిలా ఎగబడుతున్నారు జనం!"

    అసలు ప్రభుత్వమే అడుక్కుతినే ప్రభుత్వమైనప్పుడు ప్రజలు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు? ఈ దేశంలో అడుక్కోవడమే లాభసాటి వృత్తి. ఈ దేశంలోనే కాదు రోజ్సంతా పనిచేస్తే దొరికే రోజువారీకూలి బత్తేనికీ, అడుక్కుతినేవాడి రోజువారీ ఆర్జనకీ అట్టే తేడాలేని ఏ దేశంలోనైనా అడుక్కోవడమే లాభసాటి. అడుక్కునేవాళ్ళు లేకుండా వుండాలంటే కూలీల రోజువారీ బత్తెం ఎక్కువ కావాలి. అది ఎక్కువయినప్పుడు దుర్బలులు, అంగవికలులు తప్ప మిగిలిన వాళ్లంతా కూలిపనికే ఎగబడతారు.

    "మొక్కజొన్న పొత్తులు సార్. వేడివేడి పొత్తులు సార్. ఇమ్మంటారా?" ఆలోచనలు చెదిరిపోయాయి. మొక్కజొన్న పొత్తుల మీద దృష్టి పడింది. పొడుగ్గా నిగనిగలాడుతున్నాయవి. దారిపొడుగునా ఒక్కోగింజ వొలుచుకుతినొచ్చు. మంచి కాలక్షేపం. కొందామనిపించింది. ఒకటి ఇవ్వమన్నాను. మంచిది ఏరి ఒకటి తీసియిచ్చాడు. డబ్బులకని చేయి సాచాడు. వెనక జేబులోంచి తీస్తున్నాను. లోపలికి ఉన్నాయేమో తొందరగా చేతికి అందడంలేదు.

    "ఏయ్ ఏమిటది... అలా మీద పడతావేం. కాస్త దూరంగా వుండలేవూ. ఆయన డబ్బులు యివ్వకుండా పారిపోడులే!"

    కసురుకుంటున్నట్టు అంటున్న నా పక్కాయన మాటలకి మొక్కజొన్న పొత్తుల కుర్రాడు బిత్తరపోయి దూరంగా జరిగి నుంచున్నాడు. ఒంటిమీద మాసిన చెడ్డీతప్ప మరింకేం లేని ఆ నల్లటి కుర్రడి తెల్లటి కళ్ళల్లో మహాపరాధం జరిగిపోయినంత దిగులు ఆవరించుకి వుంది.

    అలా కుర్రాడ్ని బెదరకొట్టేసిన నా పక్కాయన్ని చూస్తే నాకు మహా చిరాకేసింది. అసలు, ఆయన యింట్లో పిల్లల్ని కూడా అలా కసురుకొని ఎప్పుడూ చిరచిరలాడుతాడో లేక మట్టికొట్టుకుపోయిన ఆ కుర్రాడి వొంటి దుమ్ము తన బట్టలకు అంటుకుపోతుందన్న చిరాకో మరి. ఏమయినా అంత అమాయకమైన ఆ పదేళ్ళ కుర్రాడ్ని అలా కసురుకోవడం నాకు నచ్చలేదు.

    డబ్బు యిచ్చేశాను. పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

    కాస్సేపట్లో బస్సుకూడా కదిలింది. తీరిగ్గా కిటికీ అద్దామొలొ జారబడి బయటికి చూస్తూ ఒక్కొక్క గింజే వొలుచుకు తింటున్నాను. ఎంత మెల్లగా తిన్నా గంట పట్టింది. కడుపు నిండిపోయింది. మరో పెద్ద వూళ్ళో బస్సు ఆగినప్పుడు కాఫీ తాగొచ్చాను. వస్తూ వస్తూ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కొనుక్కొన్నాను. కాస్సేపు తిరగేసి దాన్ని పక్కన పెట్టాను. బస్సు కదిలాక కుదుపుల్లో చదవడం కష్టంగా వుంది. 

    "ఎక్కడికి వెళ్తున్నారు?"

    ఇటు తిరిగాను. నన్నే! నా పక్కాయన అడుగుతున్నాడు!!

    "హైదరాబాదుకండి"

    "బెజవాడ అవతలనుండి వస్తున్నట్టున్నారు?"

    "అవునండి. బందరు నుంచి వస్తున్నాను"

    "హైదరాబాదులో ఎక్కడికి వెళ్ళాలి?"

    "చిక్కడపల్లి వెళ్ళాలండి. అక్కడ మా బాబాయిగారు ఉన్నారు"

    ఆయన ఓ నిమిషం ఆగి "ఏదండీ ఆ వీక్లీ. ఓ సారి చూసి ఇస్తాను" అంటూ చేయి సాచాడు.

    ఇందుకన్నమాట ఆయన పలకరించింది! బోరుకొట్టి కాలక్షేపానికి పలకరించాడేమో అనుకున్నాను. లేకపోతే అంత అభిమానమా నా మీద!

    అతనికి పుస్తకం ఇచ్చాను.

    గంట తర్వాత దాన్ని తిరిగి యిచ్చేస్తూ "ఏం చేస్తున్నారు? ఉద్యోగమా?" అంటూ ప్రశ్నించాడాయన.

    అవునంటూ తలూపాను. ఆ తర్వాత చాల ప్రశ్నలూ, ఉద్యోగ విషయాలూ, స్వస్థలం - చాలా విషయాలు దొర్లిపోయాయి. ఒకచోట ఆయన ఆశ్చర్యంగా "ఏమిటీ..! మీ పేరు?" అంటూ అడిగాడు.

    పేరు చెప్పాను.

    "ఓహ్! మీరా... భలే చిత్రంగా కలుసుకున్నాం సమండీ? నన్ను మీరు గుర్తుపట్టలేదేమో... నేనూ - వెంకటేశ్వర్రావుని... సూరిబాబుగారి అల్లుడ్ని... చందనం మా..."

    "మీరటండీ. గుర్తుపట్టలేకపోయాను. ఎప్పుడో పెళ్ళిలో పెళ్ళిపీటలమీద చూశాను. ఆరేడేళ్ళు అయ్యుంటుందేమో కదూ! మీరు యిప్పుడు రామచంద్రపురం హెవీ ఎలక్ట్రికల్స్‌లోనేనా పనిచేస్తుంట? చందనంగారు బావున్నారా?"

    "బాగానే వుంది. అప్పుడప్పుడు మీ గురించి చెబుతుంటుంది."

    యిద్దరమూ కబుర్లలో పడ్డాం. సంసార విషయాలు, ఉద్యోగ విషయాలు - ఇవే. ఏది మాట్లాడినా ఒక పరిధికి మించి అవతలకి పోవటంలేదు సంభాషణలు. ఏ విషయం మొదలెట్టినా కాస్సేపట్లోనే ఆగిపోతుంది. మా ఇద్దరి మధ్యా ప్రత్యక్ష పరిచయం లేకపోవడం వల్లా, యిద్దరి అభిరుచుల మధ్యా సామ్యం లేకపోవడం వల్లా ఓ అర్థగంట గడిచేసరికి మరింకేం మాట్లాడుకోవాలో మాకే తెలీలేదు. అప్పుడప్పుడు ఒకోమాట ఒకోపలుకు - అలా గడుస్తోంది. 

    సూర్యాపేటలో  బస్సు ఆగినప్పుడు ఆయనే కాఫీ ఆఫర్ చేశాడు. తాగొచ్చిన తర్వాత అతను మళ్ళీ యిలస్ట్రేటెడ్ వీక్లీ తీసి చదువుతూ కూచున్నాడు. నేను ఆలోచన్లోకి జారుకున్నాను.

    చందనం! 

    చందనం అప్పుడు సూరిబాబుగారి అమ్మాయి మాత్రమే.

    "ఇదిగో చందనం! నువ్వు కాస్సేపు అలా వుండు. నువ్వు తలదూరిస్తే యీ పని అయినట్టే" అనేంత దగ్గర అప్పుడు.

    ఇప్పుడు "చందనంగారూ బావున్నారా?" అని అడిగేంత దూరం.

    సూరిబాబుగారు మా అందరికీ గురువులాంటివారు. వృత్తిరీత్యా లాయర్ అయినా మంచి కార్యకర్తగానే సుపరిచితులు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఉద్యమాలు ఆయన ఊపిరి. ఎలక్షన్లు వస్తే యింక ఆయన యిల్లే మర్చిపోయేవారు. మాలాటి యువకులందర్నీ కూడగ్ట్టుకుని తరచు ఏదో ఒక కార్యక్రమం జరిపిస్తుంటారాయన. అందరికన్నా నాకే ఆ యింట్లో ఎక్కువ చనువు వుండేది.

    "శంకరం! సమయానికొచ్చావు. పనుంది. నాతోపాటు బయలుదేరు. ఇంటికెళ్ళి భఒంచేసి వచ్చేంత టైములేదు. యిక్కడ తినేసెయ్యి" అనేవారు సూరిబాబుగారు. మొదట్లో మూడు నాలుగుసార్లు మొహమాటపడినా తరచూగా యిలాటి సంఘటనలు ఎదురవుతండడం వల్ల అక్కడే భోంచేసేవాడిని. అందుకే ఆ యింట్లో చనువు యెక్కువ. చందనం కూడా తండ్రిలాగ చనువుగా మెసిలేది.

    "ఏమండోయ్ శంకరంగారూ! మీరు మొన్నటి మీటింగులో బ్రహ్మాండంతా మాట్లాడారట. నాన్నగారు చెప్పారులెండి. మరి నాకు మంచిపార్టీ యివ్వాలి. సగం పాయింట్స్ నేనే చెప్పాను కదా, ఏమంటారు? ఇస్తున్నారా... అలా దాంతో పాటు సినిమా కూడాను" అనేది చందనం.

    "ఓ తప్పకుండా యిస్తా" అనే వాడ్ని.

    అంతే. ఆమె యెప్పుడూ రానూ లేదు. నేను ఇవ్వనూ లేదు. ఇది మద్రాసో, హైదరాబాదో కాదని మా ఇద్దరికీ తెలుసు.

    చందనం ప్రభావం నా ఆలోచనలమీద కూడా పడుతుండేది. ఓసారి ఓ రచయిత మిత్రుడ్ని చూసి నాకూ కథలు రాయాలని అనిపించింది. అరడజను కథలు రాశాను. ఒక కథ స్థానికంగా వచ్చే ఓ చిన్న పత్రికలో అచ్చయింది కూడా. ఆ కథ చందనం చదివి "ఏం కథండీ యిది? అర్థం పర్థం లేని యీ ప్రేమలూ, త్యాగాలూ పెట్టి కథ రాయకపోతేనేం. సామాజిక చైతన్యం వుండాలండి శంకరంగారూ! సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం విధిగా వుండితీరాలి. మీ చుట్టూ ఎన్ని సమస్యలు లేవు. పొద్దున్నలేస్తే పేపరు మిల్లు కూలీలనీ, అల్యూమినియం వర్కర్లనీ, వాళ్ళనీ, వీళ్ళనీ కార్మిక సోదరుల మధ్యే తిరుగుతుంటారుకదా, వారి సమస్యల్ని తీసుకుని రాయగూడదుటండీ. పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం, శ్రమజీవులపాట్లు యెన్నిలేవు రాయాలంటే. ఏమంటారు? వాటివల్ల కొంత మేలైనా జరుగుతుంది! వీటివల్ల ఏం ప్రయోజనం ఉద్ని చెప్పండి. ఇలాటి కథలు రాసేకన్నా చేతులు ముడుచుకుని కూచోడం మంచిది" అంది. ఆ తర్వాత మళ్ళీ నేను కథలు ముట్టుకోలేదు. 

    చందనం చాలా తెలివైనది. కాలేజీలో బి.ఎస్‌స్సీ చదువుతోంది. ఆ చదువుకన్నా తండ్రి దగ్గర ఆమె పొందిన శిక్షణే ఆమెకు విశేషమైన జ్ఞానాన్ని యిచ్చింది. ఆవిడే కాదు, ఆ ఇంటిలో అందరూ అంతే. వాళ్ళన్నయ్య కూడా చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి. విశాఖలో 'లా' చదువుతున్నాడు. సెలవల్లో వచ్చినప్పుడు మాతోపాటు అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు.

    చందనం అంటే మొదటినుంచీ నాకు అభిమానమే - ఆమె తెలివితేటలు - ఆమె ఆలోచనలు - ఆమె చొరవ నాకు నచ్చాయి. ఒక్కొక్కప్పుడు నాకు అనిపించేది - అభిప్రాయాల్లో యింత సామ్యం వుండి, యింత సన్నిహితంగా వచ్చిన ఈ అమ్మాయిని పెళ్ళాడితే బావుండునుకదా అని. ఆమెను ప్రేమిస్తున్నాననీ, నాకు తెలిల్యకుండానే ఆమెపట్ల ఆరాధన పెరిగించనీ నేననుకోను. ఆమె నాకు నచ్చింది. పెళ్ళి చేసుకుంటే బావుండుననిపించింది. అలాటి అవకాశం ఏమాత్రం వచ్చినా వదిలిపెట్టగూడదని అనుకున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను. అప్పట్లో నాకు ఉద్యోగం లేదు. రాజకీయాల్లో పడి చదువు వెనకబడి అత్తెసరు మార్కులతో బి.ఏ పాసయ్యాను. పైకి చదవాలనుకుంటే మార్కులు బాగా రాక సీటురాలేదు. ఉద్యోగాన్వేషణలో వున్నాను. 

    ఒకసారి ఓ యింటర్వ్యూకని వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఇంటర్వ్యూ హడావుడిలో పడి ఓ పదిహేను  రోజులపాటు సూరిబాబుగారింటికి వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళ యింటికి వెళ్ళినప్పుడు తెలిసింది చందనానికి పెళ్ళిచూపులు జరిగాయని. ఫిజిక్సు రిసెర్చి స్టూడెంటట. వచ్చి చూసుకుని వెళ్ళారట. 

    సూరిబాబుగారు ఈ విషయం చెప్తున్నప్పుడు మామూలుగానే ఆలకించినా ఆ తర్వాత యింటికి వెళ్ళి ఆలోచించినప్పుడు మనసు సన్నగా మూలిగింది. సూరిబాబుగారు ఎంత అభ్యుదయ భావాలున్నవారైనా తన కూతుర్ని తీసుకొచ్చి నాలాటి ఏ ఉద్యోగమూ సద్యోగమూ లేని అతి సామాన్యుడిచ్చి పెళ్ళిచేస్తారని నేను ఏనాడూ భ్రమపడలేదు. ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే నేనే ఆమెను కదిపు చూచాయగా ఆమె మనసు తెలుసుకుందామని అనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు.

    వారం  రోజుల తర్వాత ఆ సంబంధం కుదరలేదని తెలిసినప్పుడు మనసులో ఆశ చిన్నగా మిణుకుమంది. కొద్దిగా సంతోషం కూడా కలిగింది. నెల రోజులపాటు ఉద్యోగం గురించి గట్టి ప్రయత్నాలే చేశాను కాని లాభం లేకపోయింది. ఎక్కడా వచ్చేజాడ కనిపించలేదు. 

    చందనానికి మరో సంబంధం చూస్తున్నారు. సూరిబాబుగారే ఓ రోజు ఓ మధ్యవర్తితో ఏలూరులో ఫలానా వాళ్ళబ్బాయి ఉన్నాడనీ, డాక్టర్ పూర్తిచేసి యీ ధ్యే స్వంత డెస్పెన్సరీ పెట్టుకున్నాడనీ, ఆ సంబంధం చూసిపెట్టమనీ చెప్తున్నప్పుడు నేను అక్కడే వున్నాను. అప్పుడే నన్ను నేను తెలుసుకున్నాను. 

    కొద్దిరోజులు చందనంతో మాట్లాడటానికి అదోలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ పూర్వంలా హాయిగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను.

    ఆమెకు ఆ డాక్టరుదికూడా తప్పిపోయి చివరకు ఓ సంబంధం ఖాయపడింది. ఆయన ఇంజనీరు. హైదరాబాదు అవతల రామచంద్రాపురంలో పనిచేస్తున్నాడు. 

    చందనం బి.ఎస్సీ, పరీక్షలు రాసిన వెంటనే పెళ్ళి జరిపించేశారు. పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఉత్తరాలు రాస్తూ వుండేది. 

    ఓ అయిదారు నెలల తర్వాత చందనం పుట్టింటికి వచ్చినప్పుడు చూశాను. అప్పటికి నాకు యింకా ఉద్యోగం దొరకలేదు. ఇంకా నేను ఆ ప్రయత్నాల్లోనే వున్నానై విని "పోనీ హైదరాబాదు వస్తారా. ఆయనతో చెప్తాను, ఎక్కడయినా చూసి పెట్టమని" అంది. అంతదూరం వెళ్ళడం యిష్టంలేక మాట్లాడక ఊరుకున్నాను. 

    ఆ తర్వాత నాలుగు నెలలకు కాకినాడలో టెంపరరీగా ఓ ఉద్యోగం దొరికింది. రెండేళ్లు చేశాక, చివరికి బందర్లో యీ ఎల్.ఐ.సి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత భార్య కూడా.

    "దగ్గరపడ్డట్టున్నాం... అదిగో ట్రాన్స్‌మిషన్ టవర్స్ కూడా కనబడుతున్నాయి" చందనం భర్త వెంకటేశ్వర్రావు నా ఆలొచనల్ని తరిమేశాడు.

    ఆలోచన్నల్లోంచి తేరుకుని చూశాను. దూరంగా టవర్ కనిపిస్తోంది. 

    "మరయితే మీరు మా యింటికి ఎప్పుడొస్తారు? రేపు కుదరదేమో ఎల్లుండి రెండి. అడ్రసు రాసిస్తాను" అంటూ చిన్నకాగితం తీసి అడ్రసు రాసిచ్చాడు.

    మరో అర్థగంటలో బస్‌డిపో వచ్చేసింది. రిక్షా చేయించుకుని వెళ్ళిపోయేముందు "చందనం గారిని అడిగినట్లు చెప్పండి. వీలుచూసుకుని తప్పకుండా వస్తాలెండి" అని చెప్పి బయలుదేరాను.

    ఆ మర్నాడూ, ఆ తర్వాత రోజు కూడా నాకు తీరిక చిక్కలేదు. మూడోరోజున పనేంలేకపోయినా మర్నాడు ఎలాగూ ఆదివారమేకదా, ఆయనకూడా యింట్లోనే వుంటాడుకదా ఆ రోజు వెళ్ళొచ్చులే అని ఆగిపోయాను.

    ఆదివారం ఉదయాన్నే వెళ్ళేసరికి ఆయన ఇంట్లోనే వున్నాడు. ఆయన కంఠం వీథిలోకే వినిపిస్తోంది. ఎవరినో చెడామడా తిట్టేస్తున్నాడు! అలాటి పరిస్థితిలో నేను లోపలికి వెళ్ళడం బావుండదని కాస్సేపు మెట్లదగ్గరే తచ్చాడానుగాని ఆయనే చూసి "రండి! రండి! అక్కడే వుండిపోయారేమిటి?" అన్నాడు. లోపలికి వెళ్ళి చందనాన్ని కేకేసి వచ్చి "ఇంకా నుంచున్నావేం? వెళ్ళు, బైటికి తగలడు. ఆ రమాపతిగారి యింటికెళ్ళి నేను రావడంలేదని చెప్పి వాళ్ళను వెళ్ళిపోమను" అన్నాడు.

    గతుక్కుమన్నాను నేను. ఆ మాటలు నన్నుకాదనీ, ఆ గదిలో బిక్కమొహం వేసుకుని చేతులు కట్టుకుని నిల్చున్న చింపిరితల పనిపిల్లననీ నాకు తెలుసు. కాని ఆ మాటల్లో, నేను రావడం వల్ల తను ఎక్కడికో వెళ్ళాలనుకున్న ప్రోగ్రాం కాస్తా ఆగిపోయిందన్న విసుగు లేదుకదా అనిపించింది.

    చందనం వచ్చింది. వస్తూనే "నిన్నా మొన్నా మీరు వస్తారేమోనని ఎదురు చూసాం. రాకపోతే మర్చిపోయారేమో అనుకున్నాను. బస్సులో వారు కలవకపోతే అసలు మీకు మేం గుర్తుండేవాళ్ళమా - నిజం చెప్పండి" అంది.

    ఆమె చెప్పింది నిజమేగాని నిజమని ఒప్పుకోలేదు నేను. నిజం చెప్పకుండా విషయం దాటేస్తూ "చాలా దూరమండీ మీ యిల్లు. ఒకవూరికి వెళ్ళినట్టే. సిటీలోకి రావాలంటే మీకు యిబ్బందేసుమా" అన్నాను.

    స్కూటర్ వుందిగనక ఫరవాలేదు. అయినా తర్చుగా సిటీలోకి రాము. పిల్లలతో బయలుదేరేటప్పుడు కాస్త యిబ్బందే అనుకోండి. అయినా ఎవరో ఒకరు లిఫ్ట్ యిస్తుంటారు - కార్లున్న ఫ్రెండ్స్ వున్నారులెండి, ఫరవాలేదు" అన్నాడు ఆయన. 

    చందనం కుశల ప్రశ్నలు వేస్తోంది - సంసారం, పిల్లలు, అత్తవారింటి విషయాలు - అన్నీ ఆడవాళ్ళ ప్రశ్నలే. చందనం భర్త ఆ రోజు బస్సులో కలిసినప్పటి మా సంభాషణ వేరు ఈ సంభాషణ వేరు.

    మాట్లాడుతూ, మాట్లాడుతూ యిప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి కాఫీ కాచి పట్టుకొచ్చింది చందనం. గంటకు పైగానే కబుర్లు చెప్పుకుంటూ వుండిపోయాం. ఆడుకోడానికి వెళ్ళిన పిల్లలు వచ్చారు. ఓ అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఆమె పోలికే.

    మరో గంట కూచుని వచ్చేద్దామని లేవబోయానుగాని చందనం వెళ్ళనిచ్చింది కాదు. "ఇంత దూరం వచ్చి భోజనం చెయ్యకుండా ఏం వెళ్తారు, కూచోండి, భోంచేసి వెళ్దురుగాని" అంది. నేను ఎన్నిసాకులు చెప్పినా వీల్లేకపోయింది.

    "మీరు మాట్లాడుకుంటూ వుండండి. వంట చేసేస్తాను" అని ఆమె వెళ్ళిపోయింది. చందనం భర్తకీ నాకూ అట్టే సంభాషణ సాగలేదు. పొడిపొడిగా నడుస్తోంది. అంతలోకే ఆయన మిత్రుడుగాబోలు ఒకాయన వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్నారు. నన్ను ఊరికే పరిచయం చేసి మళ్ళీ వాళ్ళ సంభాషణలో వాళ్ళు వుండిపోయారు. వాళ్ళేదో స్కూటరు గురించి మాట్లాడుకుంటున్నారు.

    "...వాడు మొన్న మనం వెళ్ళినప్పుడు పెద్దగా రిపేరేం లేదూండీ... కాస్త దెబ్బతింది. సరిచేస్తాలెండి అని అన్నాడా. నిన్న సాయంకాలం వెళ్తే యాభై రూపాయలు ఛార్జి చేశాడు. వీడికన్న ఆ గేరేజీలో పెట్టుకున్నాడు చూడండి - హుస్సేన్ - వాడే నయం" అన్నాడు ఆయన మిత్రుడు.

    "వాడూ అలాటివాడేనండీ, దొంగ వెధవ. అసలు వీళ్ళంతా యింతే. వెధవలకి అందుకే ఎంత కష్టపడ్డా ఆ దరిద్రపు బతుకు తప్పదు" అన్నాడు చందనం భర్త.

    సంభాషణ అలా కొనసాగుతూనే వుంది. కాని నాకు అవేం వినిపించడంలేదు. చందనమే నా కళ్ళల్లో కదులుతోంది. పాపం! చందనం యిలాటి భర్తతో ఎలా నెట్టుకొస్తోందో? ఆమె ఆలోచన్లకీ ఉత్తర దక్షిణ ధృవాలంత తేడా వుంది. పేదవాళ్ళ సమస్యలే  తన సమస్యలుగా భావించి బాధపడే చందనానికీ, వాళ్ళను చూస్తేనే అసహ్యించుకొనే చందనం భర్తకీ మధ్య ఒకరి దగ్గరికొకరు దాటిరాలేనంత లోతైన అగాధం వుంది. చిన్నప్పటినుంచీ ఒకరకమైన వాతావరణంలో పెరిగి ఆ రకమైన ఆలోచన్లనే నరనరాన జీర్ణించుకున్న ఆమె, యీ కొత్త వాతావరణంలో పెరిగి ఆ రకమైన ఆలోచన్లనే నరనరాన జీర్ణించుకున్న ఆమె, యీ కొత్త వాతావరణంలో ఊపిరి సలపక ఎంతగా గిలగిల్లాడిపోతోందో పాపం! క్షణం క్షణం అతని ప్రవర్తన ముల్లులా గుచ్చుకొంటుంటే ఎలా భరిస్తోందోకదా. ఆమె మనసునిండా ఎన్ని తూట్లో? ముళ్లగాయాలతో మనసాంతా చింకిపేలికలా అయిపోయివుండాలి. ఆమె నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడినా ఆ వెనక విషాదమే నిండివుంటుంది!

    "వస్తానండీ. మళ్ళీ కలుసుకుందాం" అంటూ ఆ స్కూటర్ అతను నా దగ్గరకొచ్చి షేక్‌హేండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. చందనం భర్త గేటువరకూ వెళ్ళాడు. నేను కూడా వెళ్ళబోతూ ఆగిపోయాను. వంటింట్లోంచి చందనం కంఠం కంచుగంటలా వినిపిస్తోంది.

    "ఇందాకనగా పంపిస్తే ఇప్పుడటే రావడం, పోతులా తిరగడం తెలుసుకానీ పనిచేయడం తెలీదేం. రోజూ మాతోపాటు కాఫీ టిఫిన్లు పడుతున్నాయి కదూ. ఒళ్ళు కొవ్వెక్కి పనిమీద మనసు నిలవడంలేదేమో. నీకూ నాజూకు వచ్చేసిందే. ఇటున్న యీనెపుల్ల అటెయ్యడానికి కూడా బద్ధకం బలిసిపోయింది. ఏవిటలా బెల్లం కొట్టిన రాయిలా నుంచున్నావ్, సంచి పట్టుకెళ్ళి యాదయ్య దగ్గర కాయగూరలు పట్టుకురా. ఇదిగో ఈ చీటీలో రాశాను - తీసికెళ్ళి చూపించు. బైట పెత్తనాలు చెలాయించక తొందరగా తగలడు" అంటూ విసుక్కుంటూ బైటికొచ్చి నన్ను చూసి ఆగిపోయింది.

    చందనం అలా మాట్లాడడం ఆశ్చర్యంగానే వుంది. పనివాళ్ళమీద పెత్తనం చెలాయించే ధోరణిలో ఇంతకు ముందెప్పుడూ ఆమె మాట్లాడగా చూడలేదు. బహుశా చందనం మాటల్లో కోపమేగాని అసహ్యం లేకపోవచ్చు. పని తొందరగా చెయ్యలేదన్న కోపం తప్ప పనిపిల్లలమీద చిన్నచూపు కాకపోవచ్చు.

    కాని నేను అక్కడ వుండగానే జరిగిన మరో సంఘటన నన్ను నిర్విణ్నుడ్ని చేసింది. నా అభిప్రాయాల్ని తారుమారు చేసింది.

    భోంచేసిన తర్వాత సిగరెట్టు కాలుద్దామని వీధి అరుగుమీదకి వచ్చాను. చననం పిల్లలూ, మరో ముగ్గురు పిల్లలూ అరుగుమీద రైలాట ఆడుకుంటున్నారు. వాళ్ళ మాటలూ, వాళ్ళ చేతలూ సరదాగా వున్నాయి. వాళ్ళవైపు చూడకుండా సిగరెట్టు కాల్చుకోవడంలో మునిగిపోయినట్టు నటిస్తూ వాళ్ళ మాటలు వింటున్నాను. 

    అంతలో చందనం హడావుడిగా వచ్చింది. ఆమెను చూస్తూనే బైటిపిల్లలు ముగ్గురూ గేటు తీసుకుని పారిపోయారు.

    "ఏరా రఘూ! ఆ పిల్లల్తో ఆడొద్దని చెప్పానా. చదువూ సంధ్యా లేకుండా వాళ్ళలాగే తయారవుదామను కుంటున్నావా. ఈసారి మళ్ళీ వాళ్ళతో ఆడ్డంచూసానో వీపు చీరేస్తాను జాగ్రత్త" అని కసురుకుని, అక్కడే వున్న నన్ను చూసి -

    "వీళ్ళతో వేగలేక చస్తున్నాననుకోండి. వద్దన్నపనే చేస్తారు. పక్క వాళ్ళింటికిపోయి ఆడుకోగూడదూ. ఎదురింటి పిల్లలే కావాలి వీళ్ళకి. ఈ కొంప ఒకటి యిలా తగలడింది. క్వార్టర్సు మార్చేసుకున్నా బావుణ్ణు" అంది.

    నాకేం అర్థంకాలేదు. ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాతా వాళ్ళ రఘుని పిలిచి అడిగాను. పక్కింటి సునంద, రమేష్‌ల నాన్నగారు ఇంజనీరు. ఎదురింటి రమణ నాన్నగారు గుమాస్తా. ఓసారి బైటికి వచ్చి చూస్తే ఆ తేడా స్పష్టంగా తెల్సింది. రోడ్డుకి యివతల వుంటున్న యిళ్ళన్నీ ఒక తరహావి, అవతల వుంటున్నవి మరో తరహావి.

    చందనాన్ని యిలా నేనెప్పుడూ ఊహించలేదు. సూరిబాబుగారి శిక్షణలో పెరిగిన చందనం, ఆయన భావాల్ని పుణికిపుచ్చుకున్న చందనం యిలా మాట్లాడ్డం చాలా ఆశ్చర్యంగా వుంది. ఆ విషయమే ఆమెతో అన్నాను.

    ఆమె ఒక్కర్తీ వున్నప్పుడు "మీరు చాలా మారిపోయారు సుమండీ. ఊహించలేనంత మార్పు వచ్చింది మీలో" అన్నాను.

    ఆమె ఒకసారి తన వొంటికేసి చూసుకుని నవ్వేసింది.

    గంటసేపు వుండి నేను వచ్చేశాను. దారిపొడుగునా నాకు ఆవిడే గుర్తుకొచ్చింది. 

    హైదరాబాదులో మరో మూడురోజులు వుండి వూరు అదీ చూసి బందరు వెళ్ళిపోయాను. వెళ్ళిన రోజు ఆఫీసు నుంచి అలా అలా తిరిగి ఇంటికొచ్చేసరికి చందనం దగ్గరనుంచి ఉత్తరం వచ్చివుంది.

    అందులో మామూలు క్షేమసమాచారాలు అయిపోయాక - 

    "...శంకరంగారూ! ఆ రోజు మీరు నేను చాలా మారిపోయానని చెప్తే వెంటనే అర్థం చేసుకోలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఒళ్ళు చేయడంవల్ల అలా అన్నారేమో అనుకున్నాను. కాని ఆ రాత్రి ఆలోచిస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థమైంది. మానసికంగా నేను మారిపోయాననీ, వెనకటి నా ఆలోచనలకీ యిప్పటి ఆలోచనలకీ విపరీతమైన తేడా వుందనీ మీ ఉద్దేశంకావచ్చు.

    నిజమే, నేను చాలా మారిపోయాను. నేనిలా మారిపోవడం ఒక్కొక్కప్పుడు నా మట్టుకు నాకే ఆశ్చర్యం వేస్తూ వుంటుంది. మొదట్లో యీ మార్పు నాకే బాధకలిగేది. ఎంతో సంఘర్షణ జరిగేది. తర్వాత నాకు తెలియకుండానే నా మనస్తత్వంలో మార్పు వచ్చేసింది.

    ఈ దేశంలో భర్త ఎప్పుడూ భార్య తన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటాడు. తనకన్న భిన్నమైన ఆలోచనలు గల భార్యను ఏ భర్తా సహించలేడు. భార్య ఎప్పుడూ తనకు నీడలా వుండాలని, తనదే పైచేయిగా వుంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి ప్రయత్నించే భార్యముందు ఇంఫీరియారిటీ ఫీలయి ఆమెకు అలాటి అవకాశమే యివ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. తన గొప్పతనం తనవల్లే రావాలనీ, భార్యవల్ల రాగూడదనీ ఆలోచించే పాతకాలపు ఆలోచనలు మనవి. ఇది ఇక్కడి నరనరంలో జీర్ణించుకుపోయింది. ఈ వ్యవస్థలోంచి తొలగించి తీసేయలేనంతగా కలిసిపోయింది.

    ఇలాటి పరిస్థితుల్లో నేనుమాత్రం యింకెలా ప్రవర్తించగలను? నా భర్త అనురాగం దూరమైపోతుంది. కలతలు ప్రారంభమవుతాయి. నా సంసారం వీధిన పడుతుంది. నా జీవితమే దుఃఖమయమవుతుంది.

    అందువల్ల గత్యంతరంలేక నేనూ మార్క తప్పలేదు. చిత్రమేమంటే నాకు తెలీకుండానే నాలో యీ మార్పు వచ్చేసింది. నేనేకాదు ఈ దేశంలో ప్రతి స్త్రీ యింతే. ఇంతెందుకు మీ ఆవిడ విషయమే తీసుకోండి. ఆమె మీకన్న భిన్నమైన ఆలోచన్లు కలిగి వున్నదేమో ఆలోచించండి. పెళ్ళికి పూర్వం ఆమె ఆలోచనా తీరు ఎలావున్నా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మీ మార్గంలోనే నడుస్తున్నదో లేదో ఆలోచించండి. ఆమెను నేను చూడకపోయినా యీ విషయం మాత్రం గట్టిగా చెప్పగలను.ఆమె మీకు నీడ. ఎందుకంటే ఇది భారతదేశం గనుక. అలాగే నేను కూడా..."

    ఉత్తరం మీద నీడ పడింది. ఇటు తిరిగాను.

    మా ఆవిడ!                      
Comments