నీలకంఠం - రాజేష్ యాళ్ళ

    "నాకు తెలీదండీ!" నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు కిరాణా కొట్టు యజమాని.

    నిరాశగా అతని వైపు చూసాను.

    "మా వ్యాపారంలో మేముంటామండీ." ముక్తసరిగానే అన్నా నన్ను చదివినట్టుగా చెప్పాడు.

    అతని దగ్గర వివరాలేవీ దొరకవని అర్థమై ఉసూరుమంటూ వెనుతిరిగాను.  ఇన్నేళ్ళుగా నీలకంఠం తెలిసినా అతని ఇల్లెక్కడో తెలుసుకోనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అతను కనిపించని ప్రతిసారీ ఇలా తిట్టుకోవడం నాకు మామూలే.

    నాలుగు అడుగులు వేసి పక్కనున్న స్కూటర్ మెకానిక్ షాపులోని కుర్రాడిని అడిగాను. పద్నాలుగేళ్ళుంటాయి వాడికి. అడిగిందే తడవుగా "నీలకంఠం ఇల్లు నాకు తెలుసు సార్! మా వీధి చివరే." అన్నాడు.

    నాలో ఆశలు చిగురించాయి. "చూపిస్తావా?" వాడిని అడిగాను.

    మెకానిక్ మా మాటలను గమనించాడు. "ముందు ఆ రెంచి ఇలా ఇవ్వు." కోపంగా పని చెప్పాడు కుర్రాడికి.

    అతన్ని పంపడం తనకిష్టం లేదని ఎంత చాకచక్యంగా చెప్పాడో అనుకుంటూ కుర్రాడితో అన్నాను. "నువ్వు ఇంటికెప్పుడు వెళతావు?"

    "రాత్రి తొమ్మిది గంటలకి."

    "సరేఅప్పుడే వస్తాను." ఆ కుర్రాడికి చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను.

    అన్యమనస్కంగా ఉన్న నన్ను చూసి అడిగింది నా శ్రీమతి భవ్య. "ఇంకా ఆ నీలకంఠం గాడే ఉన్నాడా మీ బుర్రలోఎవరి ఊసో మనకెందుకు అంటే వినరేంటీ?"

    "భోజనం చేసాక బైటకు వెళ్తున్నా. అతని ఇల్లు ఎక్కడో తెలిసింది."

    నా మాటలకు విస్తుపోయిఅంతలోనే విసుగ్గా చూసి విసవిసా లోపలికెళ్ళిపోయింది తను.

    త్వరత్వరగా గడుస్తుందనుకున్న కాలం ఆ కాసేపూ నాకు కఠిన పరీక్షే పెట్టింది. "సరిగ్గా తినండీ అలా కంచంలో కెలికితే ఆకలేం తీరుతుంది?"అన్న శ్రీమతి మాటలను విని కూడా పట్టించుకోకుండా చెయ్యి కడిగేసి తొమ్మిది గంటలు కావస్తుండగా మెకానిక్ షాపుకెళ్ళాను.

    మరమ్మత్తు బాకీ ఉండిపోయిన బళ్ళనుసామానులను లోపలకు తరలిస్తున్నారు మెకానిక్కూపొద్దున్న నాతో మాట్లాడిన అతని అసిస్టెంటు కుర్రాడూ.

    నన్ను చూస్తూనే ఉత్సాహంగా కళ్ళెగరేసాడు కుర్రాడు. "గురూనేను వెళ్ళొచ్చా?" యజమానిని అడిగాడు.

    "చాలా పని ఉండిపోయిందిరారేపు తెల్లవారే ఏడుగంటలకల్లా ఇక్కడుండాలి నువ్వు." ఉరిమాడు యజమాని.

    "సరే గురూపదండి సార్ఎక్కమంటారా?" నా సమాధానం కోసం చూడకుండానే వెనుక ఎక్కి కూర్చున్నాడు.

    "నీలకంఠం వాళ్ళు మీకు బంధువులా?" దారిలో అడిగానా కుర్రాడిని.

    "కాదండీవాళ్ళ ఇల్లు ఆ చివర. మా ఇల్లు వీధి మొదట్లోనే. అటువైపు వెళ్ళినప్పుడెప్పుడో చూసాను వాళ్ళిల్లు." చెప్పాడు కుర్రాడు.

    మరి కొన్ని క్షణాల తర్వాత అడిగాడు. "మీకు బంధువులా వాళ్ళు?"

    "కాదు." అని చెప్పాను. ఆ తర్వాత మా మధ్యలో ఇంకేమీ మాటలు దొర్లలేదు.

    ఆ కుర్రాడు దారి చూపిస్తుంటే ఓ  వీధిలోకి ప్రవేశించాను.

    "కొంచెం స్లో చెయ్యండి సార్." అని చెప్పి బండిని పక్కగా ఆపించి దిగి చెప్పాడు. "ఇదే సార్మా ఇల్లు. ఈ వీధి చివరనుండి మరెక్కడికీ వెళ్ళలేంవెనక్కే రావాలి ఎటు వెళ్ళాలన్నా. వీధి చివర  ఉన్న ఫ్యాక్టరీ గోడకు ఆనుకుని కుడివైపుగా ఉన్న ఇల్లే నీలకంఠం ఇల్లు."

    వాడికి థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళాను. సరాసరి నీలకంఠం ఇంటి ముందే బండి ఆపాను. చిన్న రేకుషెడ్ అది. బండి ఆపుతుంటే క్యారేజ్,ఫ్లాస్క్ పెట్టి ఉన్న ప్లాస్టిక్ బుట్టతో లోపలినుండి బైటకొచ్చింది ఒకామె. నీలకంఠం భార్య అని ఊహించాను.

    ఆమె నా వైపు ఎగాదిగా చూస్తూ, "ఎవరు కావాలి మీకు?" అని అడిగింది.

    "నీలకంఠం ఇల్లు ఇదేనా అమ్మా?" అడిగాను.

    "అవును. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు." దిగులుగా చెప్పింది నీలకంఠం భార్య.

    "అయ్యో... ఇప్పుడెలా ఉన్నాడు?" ఆదుర్దాగా అడిగాను.

    "పర్వాలేదండీ. ప్రమాదం తప్పింది." అని చెప్పిన కంఠంలో ఓ బొంగురు ధ్వని... ఏడుపు ఆపుకునే ప్రయత్నం!

    "సరేనేను హాస్పిటల్ కి వస్తాను. ఏ వార్డులో ఉన్నాడు?" అడిగాను.

    "జనరల్ వార్డులో. బెడ్ నంబర్ పన్నెండు. నేను వెళ్తాను. మీరు రండి." అని నా సమాధానం కోసం చూడకుండా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నీలకంఠం భార్య. ముక్కూ మొహమూ తెలియని మగవాడి బండి ఏ స్త్రీ అయినా గభాలున ఎక్కదు కదా!

    రాత్రి పూట కాబట్టి అటెండెంట్ పాస్ ఉంటే తప్ప హాస్పిటల్ లోపలికి ప్రవేశం ఉండదు అని నాకు తెలుసు. ఓ డాక్టర్ మిత్రునికి ఫోన్ చేసాను. అతను గవర్నమెంట్ డాక్టరే కాబట్టి నా పని తేలికయింది. గేట్ దగ్గరకు వెళ్ళగానే వాచ్ మేన్ తో నా మిత్రుడి పేరు చెప్పగానే నన్ను లోపలికి అనుమతించాడు. ఈ తతంగమంతా కావడానికి అరగంట పైనే పట్టింది.

    జనరల్ వార్డులోని పన్నెండో నంబర్ బెడ్ ని వెదుక్కుంటూ ముందుకు నడుస్తుండగా "సార్!" అన్న పిలుపు వినబడింది.

    వెనక్కి తిరిగి చూసేసరికి మంచం పై ఉన్న నీలకంఠం కనిపించాడు. అతని దగ్గరగా వెళ్ళాను. విరిగిన కుడి కాలు కట్లు కట్టబడి పైకి వేలాడదీయబడి ఉంది. పక్కనే స్టూల్ మీద కూర్చుని ఉన్న అతని భార్య నేను వెళ్ళగానే లేచి నా నించుంది.

    "కూర్చోండి సార్. ఎలా ఉన్నారు?" నీరసంగా ప్రశ్నించాడు నీలకంఠం.

    "నేనడగాలయ్యా ఆ ప్రశ్న. ఎలా జరిగింది?" అడిగాను.

    "రోడ్ మీద నడుస్తుంటే వెనుకనుండి ఆటో వాడు సైకిల్ని తప్పించబోయి నన్ను గుద్దేసాడు సార్."

    "అయ్యో... ఆటో వాళ్ళు స్పీడులో ఎవర్నీ గమనించరు. పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాల్సింది వెధవని."

    చిరునవ్వు నవ్వాడు నీలకంఠం. "వాడూ కావాలని ఢీ కొట్టలేదు కదా సార్?"

    "వదిలేసావాఎవరి పైనైనా సానుభూతే నీకు. ఇలాగే దేశసేవలోనే తరించిపోతే నీ సంగతేంటి చెప్పు?!"

    "మీలాంటి వాళ్ళున్నారుగా సార్. మీరు ఇప్పించిన బ్యాంక్ అప్పు వల్లే మా జీవితం నిలబడింది." కృతజ్ఞతగా చూస్తూ దణ్ణం పెట్టాడు నీలకంఠం.

    "అదేమీ లేదులే బ్యాంక్ లో నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం సాయం చెయ్యగలిగానంతే." అతని రెండు చేతులనూ పట్టుకుని చెప్పాను.

    "బహుశా ఇంకో ఇరవై రోజులు పడుతుందేమో... నువ్వు మామూలు కావడానికి." అతన్నిఅతని భార్యను చూస్తూ అన్నాను.

    "నెల పైనే పడుతుందట సార్." అతని భార్య చెప్పింది.

    "అయ్యో. అన్ని రోజులా?!" బాధగా అన్నాను.

    "ఏం చేస్తాం సార్తప్పదు కదా." దిగాలుగా అన్నాడు నీలకంఠం.

    కాసేపు ఆ మాటా ఈ మాటా నీలకంఠంతో మాట్లాడి అతనికిఅతని భార్యకూ ధైర్యం చెప్పి బయలుదేరాను. అతని భార్యను బైటకు పిలిచి నా దగ్గరున్న రెండు వేల రూపాయలు ఆమె చేతిలో పెట్టాను.

    "వద్దు సార్. ఎందుకు తీసుకున్నావని ఆయన తిడతాడు." మొహమాటంగా చెప్పిందామె.

    "పర్వాలేదు ఉంచు. ఇల్లు గడవాలి కదా. ఇంకా ఏమైనా అవసరం పడితే చెప్పు." అని చెప్పాక మాట్లాడకుండా ఊరుకుందామె.

    వస్తానన్నట్టుగా తల ఊపి ఇంటికి వచ్చాను. నిద్రపోబోతుండగా అడిగింది శ్రీమతి. "సాయంత్రం నుండి ఇంత హైరానా పడుతున్నారు. ఇంతకూ ఎవరీ నీలంకంఠం?"

    "నీలకంఠం అంటే గాంధీ బొమ్మ సెంటర్లో పానీపూరీ బండి నడుపుతాడు." చెప్పాను.

    "పానీపూరీ బండి వాడా?" ఆశ్చర్యంగా నా వైపు చూసింది. ఆమె ముఖంలో అనేక సందేహాల సందడి.

    "అవును. పానీపూరీ బండి నడిపేవాడే కానీ చాలా మంచి మనిషి."

    "ఇంత రాత్రి వేళ అంత అర్జెంటుగా వెళ్ళాల్సినంత అవసరం ఉందంటారా?"

    "రోజూ సాయంత్రం ఇంటికి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగానే వస్తాను కదా. అతను కనిపించకపోతే అదో వెలితిలా ఉంటుంది నాకు." చెప్పాను.

    "సాయంత్రం అతని బండిలో పానీపూరీనోబఠాణీనో తింటే కానీ ఇంటికి రారా మీరు?"

    "అబ్బే. అది కాదు విషయం. నీలకంఠం మా పీయెఫ్ ఆఫీస్ దగ్గర పరిచయం. అతను పనిచేసే కంపెనీ మూతబడి ఉద్యోగం పోయింది. ఆ కంపెనీ నుండి రావలసిన పీ యెఫ్ డబ్బుల కోసం తిరిగే వాడు. అవి వచ్చాక ఆ డబ్బుతో పానీపూరీ బండి పెట్టుకున్నాడు. ఇదంతా దాదాపు ఏడెనిమిదేళ్ళ క్రితం మాట."

    "ఓహో." ఆసక్తిగా వింటూ అంది భవ్య.

    "మంచి సెంటర్లో ఉన్న పానీపూరీ వ్యాపారం కావడంతో నీలంకంఠం ఆదాయం బాగానే ఉండేది. నాలుగేళ్ళ క్రితం ఒకరోజు ఉన్నట్టుండి నా దగ్గరకు వచ్చాడు- అర్జెంటుగా ఏభైవేలు అప్పుగా కావాలనిఎవరైనా బ్యాంకులో తెలిసిన వాళ్ళుంటే ఇప్పించమని. నేను భానుమూర్తితో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ ద్వారా డబ్బు ఇప్పించాను. వ్యాపారం కోసమే డబ్బు అనుకున్నాను."

    "మరి ఎందుకు తీసుకున్నాడు?" భవ్య అడిగింది.

    రోడ్డు పక్కనే ఉన్న నీలంకంఠం పానీపూరీ బండిని ఓ కారు గుద్ది అదుపు తప్పి బోల్తా కొట్టిందట. అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కారులోనే ఉన్న వాళ్ళ పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఆ భార్యాభర్తలిద్దరినీ తనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి జాయిన్ చేసాడు. దురదృష్టం కొద్దీ వాళ్ళ ప్రాణాలు దక్కలేదు."

    "అయ్యో." బాధగా అంది భవ్య.

    "పిల్లలిద్దరూ అబ్బాయిలే. ఒకడికి ఎనిమిదేళ్ళుమరొకడికి ఏడేళ్ళు. వాళ్ళ ద్వారా బంధువులకు ఫోన్ చేసాడు కానీ మూడురోజులైనా ఎవరూ రాలేదు. వాళ్ళది ఛండీఘర్ రాష్ట్రం.  ఒక వైపు హాస్పిటల్ వాళ్ళు బాడీస్ ని తీసుకెళ్ళమని వత్తిడి చేసారు. దాంతో నీలకంఠమే వాళ్ళ అంత్యక్రియలు జరిపించాడు."

    "అప్పు వాళ్ళ అంత్యక్రియల కోసం తీసుకున్నాడా?!" ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అడిగింది భవ్య.

    "కారు గుద్దడం వల్ల అతని బండి కూడా దెబ్బ తిన్నా కూడా అప్పటికి ఆ విషయం పక్కన పెట్టాడు. విషయం తెలుసుకున్న నేను కొంచెం సాయం చేస్తే బండి బాగుచేయించుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు. నిజానికి నీలకంఠానికి సొంత ఖర్చులకంటే ఇలాంటి బయట ఖర్చులే ఎక్కువ."

    "ఈరోజుల్లో అలాంటివాళ్ళున్నారంటే నమ్మలేకపోతున్నా. ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు భవ్య.

    "మరి కొన్ని రోజులకి లేబర్ ఆఫీస్ వాళ్ళొచ్చి అతని బండిని సీజ్ చేసి అతని మీద కేసు వేసారు."

    "అయ్యో. మరి బైటపడ్డాడా?!" ఆత్రుతగా అడిగింది భవ్య.

    "అతని బండి వైపు అలవాటుగా చూసే నాకు ఎప్పుడు బండి కనిపించకపోయినా అదో భయం. ఆ సాయంత్రమే లేబర్ ఆఫీసు వాళ్ళు జీపులో తీసుకెళ్ళారని చుట్టుపక్కల బళ్ళ వాళ్ళు చెప్పడంతో నేనూ ఆ ఆఫీసుకెళ్ళాను. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నాడని వాళ్ళ అభియోగం."

    "అవును. అది మాత్రం అమానుషమే కదా. మీరైనా అలా చేయొద్దని చెప్పాల్సింది."

    "ఆ పిల్లలు తాము పనివాళ్ళం కాదని చెప్పినా లేబర్ ఆఫీసర్ వినలేదు. చివరకు నేను సర్ది చెప్పాక వదిలారు."

    "ఇంతకూ ఎవరా పిల్లలు?"

    "ఏక్సిడెంట్లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు. బంధువులెవరూ రాకపోయేసరికి నీలకంఠం వాళ్ళను పెంచుకుంటూ చదివిస్తున్నాడు. అతను వద్దంటున్నా సాయంత్రం పూట బండి దగ్గరకు వచ్చి సాయం చేసేవాళ్ళు. "

    "ఎంత వయసు ఉంటుంది నీలకంఠానికి?" అడిగింది భవ్య.

    "ముప్ఫై రెండుముప్ఫై మూడు ఉండొచ్చు." చెప్పాను.

    "మరి అతనికి పిల్లలు పుట్టలేదా?"

    "పుట్టరు. ఈ పిల్లలు ఇంటికి వచ్చాక నీలకంఠం ఆపరేషన్ చేయించుకున్నాడు." జవాబు చెప్పి నిట్టూర్చాను.

    మళ్ళీ ఏమీ మాట్లాడలేదు భవ్య. నీలకంఠం గురించి నేనెందుకు అప్పటిదాకా హైరానా పడ్డానో స్పష్టంగా ఇప్పుడర్థమయినట్టుగా ఆమె ముఖకవళికలు చెప్పకనే చెపుతున్నాయి.

    తేలికైన మనసులతో నిద్ర పోయేందుకు కళ్ళు మూసుకున్నాం భవ్యనేనూ!!

 

(జాగృతి వారపత్రిక 23 ఫిబ్రవరి 2015 సంచికలో ప్రచురితం)

Comments