నిన్నలా...మొన్నలా...లేదురా! - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ,

      
 
"ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందిరా"అన్నాడు వెంకటేశం ఫోన్‌లో.
        
        వాడంతే. ఏ సమయంలో, ఏ విషయం గురించి ఎందుకలా స్టేట్‌మెంట్ ఇస్తాడో ఒక పట్టాన అర్థం కాదు.

        "నస పెట్టక విషయం చెప్పరా" అన్నాను చిరాగ్గా.

        "ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. నేనన్నదానికి బోలెడు నేపథ్యముంది.నీకు తీరిక ఉందంటే చెప్పు. సాయంత్రం ఇంటికి పోతూ క్రాస్‌రోడ్స్ లో కాసేపు చాయ్ తాగుతూ మాట్లాడు కుందాం" అన్నాడు.

        "తీరికగా మాట్లాడుకునే అవకాశం ఫోన్‌లోనే ఉంటుందిరా! ఈ ట్రాఫిక్‌లో ఒకళ్ళదగ్గరకు ఒకళ్ళు వెళ్ళి నింపాదిగా అరగంట సేపు కబుర్లు చెప్పుకునే తీరిక ఎక్కడిది?" అన్నాను నిట్టూరుస్తూ.

        అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ మధ్య మా బాబాయిగారి అబ్బాయి రోడ్డు మీద ఎదురుపడ్డాడు. 'ఏరా ఎలా ఉన్నావ్?' అని అడిగితే 'బాగానే ఉనాను. విశేషాలు తరువాత ఫోన్‌లో చెబుతాలే' అంటూ స్కూటర్‌మీద తుర్రుమన్నాడు గ్రీన్ సిగ్నల్ పడిందని సైగ చేస్తూ.

        హైదరాబాద్ సిటీలో తెలిసిన మనుషులు కలిసి ముఖాముఖీ మాట్లాడుకోవడం తగ్గిపోయి చాలా రోజులే అయిపోయింది. పెళ్ళిళ్ళకు పేరంటాలకూ ఫోన్‌లోనే ఇన్విటేషన్లు అందుకునే రోజులొచ్చేశాయి. ఇవన్నీ వెంకటేశంకు తెలియంది కాదు. కానీ నాతో కాసేపు గడపాలనుకున్నాడంటే... ఏదో విషయం ఉండే ఉంటుందనిపించింది.

        "సరే. సాయంత్రం ఇంటికి వెళ్తూ మీ ఆఫీస్‌కు వస్తాను" అన్నాను.

        ఎప్పటిలానే ఐదున్నరకు ఆఫీస్‌నుండి బయటపడాలని ఎంత ప్రయత్నించినా, ఆరుగంటలు దాటిపోయింది. పంజగుట్టలోని మా ఆఫీస్‌ నుండి అశోక్‌నగర్‌లోని వెంకటేశం ఆఫీస్‌కు చేరాలంటే కనీసం గంట పడుతుంది. ఈమధ్య రోడ్డుమీద ట్రాఫిక్‌నే కాకుండా కూలిపోతున్న ఫ్లై ఓవర్లను చూసుకుంటూ ఇటు నేలను, అటు నింగినీ కూడా గమనిస్తూ పోవాల్సి వస్తోంది.

        అశోక్‌నగర్‌లోని వెంకటేశం ఆఫీస్‌కు చేరేసరికి అనుకున్నట్టుగానే ఏడున్నర అయింది. ఇద్దరం కలిసి చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో కూర్చున్నాం. అలా తీరికగా వాడితో కబుర్లు చెప్పి కొన్ని నెలలు అయింది.

        "సిటీలో ఉంటున్నామన్న మటే కానీ మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైపోయింది" అన్నాను.
        
        "కలిసినప్పుడు అలానే అంటావు. కానీ మళ్ళీ నీ దర్శనం ఎన్ని రోజులకో. అదీ నేను పిలవగా పిలవగానే వస్తావు" అన్నాడు నిష్ఠూరంగా.

        "సరెసరే... విషయం చెప్పు. తొందరగా వెళ్ళాలి. ఇంటిదగ్గర మా ఆవిడ ఎదురుచూస్తుంటుంది" అన్నాను.

        "ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో నీ సలహా నాకు కావాలిరా. అందుకే పిలిచాను" అన్నాడు వాడు.

        నాకు నవ్వు ఆగింది కాదు. ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో నేను సిద్ధహస్తుడనని వాడికి ఎవరు చెప్పారో తెలియదు. అదే ప్రశ్న వాడిని అడిగాను. 

         "ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో నీ సలహా నాకు కావాలిరా. అందుకే పిలిచాను" అన్నాడు వాడు.

        నాకు నవ్వు ఆగింది కాదు. ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో నేను సిద్ధహస్తుడనని వాడికి ఎవరు చెప్పారో తెలియదు. అదే ప్రశ్న వాడిని అడిగాను.

        "నీది ప్రేమ వివాహం కదా! అమ్మాయి మనసును అర్థం చేసుకోకపోతే ఎలా ఆమెను ఒప్పించగలిగావ్. అలానే మీ ఆఫీసులో మెజారిటీ ఎంప్లాయిస్ ఆడవాళ్ళే. నీ బాసు, నీ కింద పనిచేసేవాళ్ళు అంతా ఆడవాళ్ళే అని ఆమధ్య చెప్పావ్. వాళ్ళందరితో ఎలా వేగుతున్నావ్‌రా?" అన్నాడు వాడు.

        "ఇవన్నీ నిజమే కానీ నీకొచ్చిన సమస్య ఏమిటీ?" అన్నాను సర్వర్ తెచ్చిన టీని తాగుతూ.

        "ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. ఇవాళ మధ్యాహ్నం ఆఫీసులో అందరి ముందు అందరి ముందు అభాసు పాలయ్యాను. మా కొలీగ్ ఒకావిడ నాతో జీవితంలో మాట్లాడనంటూ శపథం చేసింది" అన్నాడు వాడు.

        అంత ఘోరమైన పొరపాటు కొలిగ్ విషయంలో ఏం చేశాడా అనే సందేహం వచ్చింది. అదే అడిగితే....

కాస్త గొంతు సవరించుకుని...

        "మధ్యాహ్నం మా ఆఫీస్‌లో ఏడెనిమిది మంది కలిసి లంచ్ చేస్తాం. ఈ మధ్య కొత్తగా కుసుమ అనే ఆవిడ మా ఆఫీస్‌లో చేరింది. ఆవిడను చూడగానే ఏదో కొత్తగా, ప్రత్యేకంగా అనిపించింది. ఏమిటా అని తేరిపార చూస్తే... ఆవిడ నుదుట బొట్టు లేదు, కాళ్ళకు మట్టెలు లేవు, చేతులకు గాజులు లేవు, చెవులకు దుద్దులూ లేవు. చాలా సింపుల్‌గా ఉన్నా, చీర కట్టిన తీరు మాత్రం చాలా పొందికగా, గౌరవప్రదంగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం భోజనాల సమయంలో ఆవిడ 'మా వెంకటసుబ్బయ్య చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. కూరగాయల మార్కెట్‌నుండి అన్నీ పుచ్చు వంకాయలే తెచ్చాడు' అని అంది. వెంటనే నేనూ ఆవిడతో మాటలు కలపాలనే ఆత్రంతో 'అంతే మేడం. పనివాళ్ళను పంపిస్తే అలానే తెస్తారు. తినేది వాళ్ళు కాదు కదా! అందుకనే కూరగాయల విషయంలో పనివాళ్ళ మీద ఆధారపడ కూడదు' అన్నాను సానుభూతి ఒలకబోస్తూ. అంతే నా మీద ఖయ్యిమని లేచింది. 'ఏయ్ మిష్టర్ వెంకటేశం. ఏం మాట్లాడుతున్నావ్? వెంకట సుబ్బయ్య అంటే మా పనివాడు కాదు. నా హజ్బెండ్. నేనతన్ని పేరు పెట్టే పిలుస్తాను. నోరు జాగ్రత్త' అంటూ దడదడ లాడించేసింది. ఈ రియాక్షన్ నేనసలు ఊహించలేదు. నలుగురిలో భర్తను పేరుతో సంబోధించే ఆడవాళ్ళను అప్పటి వరకు నేను చూడలేదు. ఆ తర్వాత పక్క సీటులో ఉండే గోవిందం చెప్పాడు ఆవిడతో పెట్టుకోకు. ఆవిడ ఫెమినిస్టు అని. 'మాఆయన' అనడానికి ఆవిడకు ఎందుకు నామోషినో నాకైతే అర్థం కాలేదు. అసలీ ఆడవాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి" అన్నాడు అయోమయంగా.

        "ఓస్ ఇంతేనా? దీనికే ఇంత కంగారు ఎందుకు? రేపటి నుండి నువ్వు ఆవిడతో కలిసి లంచ్ చేసే సమయంలో 'మీ ఆయన ఏం చేస్తారు... మీ ఆయన ఎలా ఉన్నారు' అని కాకుండా 'మిష్టర్ వెంకటసుబ్బయ్య ఏం చేస్తారు? మిష్టర్ వెంకటసుబ్బయ్య ఎలా ఉన్నారు?' అని అడుగు. అలానే మీ ఆవిడ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా 'మా ఆవిడ...' అని నొక్కిచెప్పకుండా 'మా పద్మ' అంటూ మాట్లాడేసేయ్. మనుషుల మధ్య ఉందే సంబంధాన్ని కాకుండా మనిషిని మనిషిగానే గుర్తిస్తున్నావని ఆవిడ సంతోషిస్తుంది. నీలోని స్త్రీవాదిని చూసి సంబరపడుతుంది" అని అన్నాను.

        ఇంత సింపుల్‌గా వాడి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వాడసలు ఊహించలేదు.
        "అలా మాట్లాడితే ఆవిడ మెచ్చుకుంటుందంటావా?" అడిగాడు అనుమానంగా.
        "ఢోకా లేదు. స్త్రీలంటే నీకెంతో గౌరవం ఉన్నట్టు నటించు. స్త్రీశక్తికి తిరుగులేదని దబాయించు. 'నేటి స్త్రీ అబల కాదు సబల' అని నొక్కి వక్కాణించు. తప్పకుండా ఆవిడ నిన్ను అర్థం చేసుకుని అభిమానిస్తుంది" అని చెప్పేశాను. 

        నా సలహాకు వెంకటేశం సంతృప్తి చెందాడు.
        "ఇక నేనింటికి వెళతాను. మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది" అని చెప్పి కుర్చీ లోంచి లేచాను.         ఇంతలో "అన్నట్టు విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడకు మూడోనెల. కాస్త ఆలస్యంగా ప్రెగ్నెన్సీ రావడంతో డాక్టర్లు బెడ్‌రెస్ట్ తీసుకోమన్నారు" అన్నాడు వెంకటేశం.         "శుభవార్త చెప్పావ్. మా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. ఇలా ఆఫీస్ విషయాలతో బుర్ర పాడు చేసుకోకుండా తొందరగా ఇంటికి వెళ్ళి తనకు తోడుగా ఉండు" అని చెప్పాను.
* * * 

        వారం రోజులు గడిచిందో లేదో వెంకటేశం నుండి మళ్ళీ ఫోన్.
        "ఒరేయ్... నీ సలహా పాటించాను. సక్సెస్. ఇప్పుడు మా కొలీగ్ కుసుమ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. లంచ్ టైంలో తన కూరల్ని నాతో షేర్ చేసుకుంటోందు కూడా. ఆమధ్య వాళ్ళాయన... సారీ మిష్టర్ వెంకతసుబ్బయ్య వస్తే నాకు పరిచయం కూడా చేసింది" అన్నాడు.         "వెరీగుడ్" అన్నాను.         "కానీ..."      ఈ నాన్చుడు ధోరణికి వీడు ఫుల్‌స్టాప్ ఎప్పుడు పెడతాడో.         "విషయం చెప్పరా" అన్నాను చిరాగ్గా.         "మళ్ళీ సాయంత్రం ఓసారి మనం కలవాలి. నీతో కొన్ని విషయాలు చెప్పాలి" అన్నాడు.         "నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి. మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది" అన్నాను విసుగ్గా.         "ప్లీజ్...ప్లీజ్... అలా అనకు. నువ్వు ఏదో ఒక సలహా చెబితే నేను సమస్యల్లోంచి ఇట్టే గట్టెక్కుతాను" అన్నాడు అభ్యర్థనగా.         ఎప్పటిలానే చిక్కడపల్లి లోని హోటల్లో ఆ సాయంత్రమూ కలిశాము.

        వేడివేడిగా కాఫీ తాగుతుంటే వెంకటేశం తన కొత్త సమస్యను ఏకరువు పెట్టడానికి నీళ్ళు నములుతున్నాడు.         "చెప్పరా... ఇప్పుడేం సమస్య వచ్చింది"         "ఈసారి సమస్య ఇంట్లోనే వచ్చిందిరా" అన్నాడు.         "ఏమైంది" అన్నాను ఆసక్తిగా.         "మా ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. డాక్టర్లు బెడ్‌రెస్ట్ తీసుకొమన్నారని ఉద్యోగం కూడా మానిపించాను. ఇంతకాలం పిల్లలు లేని మా యిల్లు ఇక పసిబిడ్డతో కళకళలాడిపోతుందని ఎంతో సంతోషించాం. తొమ్మిది నెలల తర్వాత వచ్చే పసిబిడ్డ సంగతి ఏమో కానీ మా ఆవిడే ఇప్పుడు చిన్నపిల్ల అయిపోయింది. డాక్టర్లు నించోవద్దన్నారని వంటగదిలోకి రావడమే మానేసింది. యిల్లు తుడిచి, అంట్లు తోమే పని అమ్మాయితో వంట చేయిస్తానంటే ఒప్పుకోదు. హోటల్‌నుండి క్యారేజి తెప్పిస్తానంటే ససేమిరా అంటుంది. మా దగ్గరకు వచ్చి సాయం చేసే దగ్గరి బంధువులూ లేరు. ఎలా చచ్చేది?" అన్నాడు ఆవేశంగా.

        "నిజమే... పెద్ద సమస్యే" అన్నాను.
        "దానికి తోడు ఆ బుడ్డరాకాసి ఏమందో తెలుసా?" అన్నాడు.         "ఆ రాకాసి ఎవరు?" అన్నాను ఆశ్చర్యంగా.         "మా పక్కింటి కాత్యాయినిగారి కూతురు. నిండా ఆరేళ్ళు లేవు. అది పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోంది" అన్నాడు.         "ఏం జరిగిందిరా..." అన్నాను.
        "మొన్నొకరోజు పొద్దున్నే నేను పేపర్ చదువుతుంటే మా యింటికొచ్చింది. పుట్టిన రోజు అంటూ చాక్లెట్ ఇచ్చింది.'మీ ఆంటీ లోపల ఉంది. అక్కడికెళ్ళి చాక్లెట్ ఇవ్వు' అని చెప్పాను. మా ఆవిడ పడుకుని ఉండటం చూసి 'ఏంటి ఆంటీ పడుకున్నావు' అని అడిగింది. మా ఇంటికి చిన్నబాబు వస్తాడు. అందుకని డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు' అంది మా ఆవిడ. 'మరి మీరు రెస్ట్ తీసుకుంటే భోజనం ఎలా' అని అడిగింది. 'మీ అంకుల్‌తో చేయిస్తాను' అంది. 'అంకుల్ వంట చేస్తారా' అని అది ఆశ్చర్యపోయింది. 'అయిదారేళ్ళుగా నేను వంట చేస్తే ఆయన సుబ్బరంగా తిన్నారు కదా! మరి నాకు ఓ ఆరునెలలు వండి పెట్టలేరా' అంది మా ఆవిడ. అంతే ఆ బుడ్డ రాకాసి 'సెభాష్ ఆంటీ కరెక్ట్ చెప్పారు. నిజమే... అంకుల్‌తోనే వంట చేయించడి' అని నా కళ్ళ ముందే షేక్‌హాండ్ ఇచ్చింది. దాని అభినందన చూస్తే నా బుర్ర తిరిగిపోయింది. దాంతో కోపమొచ్చి ఆ బుడ్డదానితో 'మగవాళ్ళు ఉద్యోగం చేయాలి. ఆడవాళ్ళు వంట చేయాలి. మరి నన్ను వంట చేయమండం కరెక్టా' అని అడిగాను. 'మరి మొన్నటి వరకు ఆంటీ కూడా ఉద్యోగం చేసింది కదా అంకుల్' అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. నేను షాక్ అయ్యాను. ఆ మధ్య నా కొలిగ్గే ఫెమినిస్టు అనుకున్నాను. కానీ ఇదిగో ఇవాళ ఇంటిలోనే నా భార్య రూపంలో ఇంకో ఫెమినిస్టు కనిపించింది. దానికి సపోర్టుగా మా పక్కింటి ఈ బుడ్డరాకాసి రాబోయే తరాల ఫెమినిస్టుగా తయారవుతోంది. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ ఇప్పుడు వంటగదిలో గరిట తిప్పే బాధ్యత నాకే పడిందిరా. చేతనైనట్టుగా చేసి మా ఆవిడకు పెడుతున్నాను. అయినా మా ఆవిడకు తృప్తి లేదు. 'ఇది సరిగా లేదు. అది సరిగా లేదు' అంటుంది. 'ఇందులో ఉప్పు తగ్గింది. అందులో కారం ఎక్కువైంది' అంటూ ఒకటే నస. నా సమస్యకు పరిష్కారం ఏమిటీ" అన్నాడు బాధగా. బహుశా ఆ క్షణాన వెంకటేశంకు ఇంతకాలం తన భార్య వండిపెడుతుంటే తాను పెట్టిన వంకలు గుర్తొచ్చి ఉండక పోవచ్చు.
        వాడి సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాను.

        "అదేమిట్రా...ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కారం చెపుతుంటావ్. ఈ విషయంలో ఇంత ఆలోచిస్తున్నావేమిటీ" అన్నాడు వాడు.
        ఓ నిమిషం మౌనం వహించి తర్వాత గొంతు సవరించుకుని "ఏ సమస్య ఎదురైనా ఎప్పుడూ మనవైపు నుండే ఆలోచిస్తాం. అసలు ఆ సమస్య ఎవరివైపు నుండి వచ్చింది? అలాంటి సమస్య రావడానికి కారణం ఏమిటీ? అని లోతుగా ఆలోచించం. మొన్న మీ కొలీగ్ అలా ప్రవర్తించినా, నిన్న మీ ఆవిడ అంత సూటిగా మాట్లాడినా నీకు బాధ కలిగింది. నిజానికి ఎన్నో సవత్సరాలుగా వాళ్ళ మనసుల్లో అణిగి ఉన్న బాధ అంతా ఇప్పుడీ సమయంలో ఇలా బయటకు వచ్చిందేమో అనిపిస్తోంది నాకు. వాళ్ళవైపు నుండి ఆలోచిస్తే వారి ప్రవర్తనలో ఏమాత్రం తప్పులేదు. మన ముందు తరంలో మాదిరి ఇవాళ చాలామంది వివాహితలు ఎవరి మీద ఆధారపడి ఉండటం లేదు. కుటుంబపరమైన బాధ్యతల్ని నెరవేర్చుతూనే మరో వైపు ఆర్థికంగానూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అటువంటివాళ్ళు మాకూ మీతో పాటు సమాన గౌరవం ఇవ్వండి అని అడగడంలో తప్పులేదు. ప్రస్తుతం వాళ్ళు కేవలం 'కోరుతున్నారు'. మనంగనక వాళ్ళ కోరికను గౌరవించక పోతే... ఇదిగో నువ్వు ఇందాక చెప్పిన బుడ్డరాకాసి పెరిగి పెద్దదైతే కాలర్ పట్టుకుని 'డిమాండ్' చేస్తుంది. ఆడవాళ్ళను అర్థం చేసుకోకపోవడం అన్నది మన బుర్రలో ఉన్న సమస్య తప్పితే వేరే ఏమీ కాదు" అన్నాను. 

        నా ఈ చిన్నపాటి ఉపన్యాసం పూర్తి చెసిన వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఠకాలున నా బ్యాగ్‌లోంచి మాలతీ చందూర్ 'వంటలు - పిండివంటలు' పుస్తకం తీసి వాడి చేతిలో పెట్టాను. హఠాత్తుగా చేతిలోకొచ్చిన ఆపుస్తకాన్ని చూసి వాడు విస్తుపోయాడు.
        "ఇదేమిటీ" అన్నాడు.         "నీకు చెప్పకూడదు కానీ గత పది రోజులుగా నేనూ ఓ సమస్యలో చిక్కుకున్నాను. 'మీతో సమానంగా నేను ఉద్యోగం చేసే నేనే రెండు పూటలా వంట ఎందుకు చేయాలి? రాత్రి పూట మీరే చేయండి' అంటూ మా ఆవిడ ఆర్డర్ వేసింది. ఆవిడ చెప్పిన దాంట్లోనూ నాకు న్యాయం కనిపించింది. అందుకనే పదిరోజులుగా ఆఫీస్ కాగానే త్వరత్వరగా ఇంటికి వెళ్ళిపోయి వంట డ్యూటీ పట్టేస్తున్నాను. అందులోనూ సంపూర్ణత సంపాదించాలనే దీనిని కొనుక్కెళ్తున్నా. నువ్వూ ఇక మీదట మీ ఆవిడకు నచ్చెలా వంటలు చేసేయ్" అని వాడి భుజం తట్టి హడావుడిగా బయలు దేరాను.         కోఠికి పోయి మరో వంటల పుస్తకం కొనుక్కోవాలి కదా!
(నవ్య వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక 2007లో ప్రచురితం)
        

        
        

        
Comments