నిప్పుల నడక లోంచి ... కళ్యాణి - వి.శాంతి ప్రబోధ

 
   
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మా కాంపస్ కి కొండంత అండగా నిండుగా కనిపించే కొండని కమ్మేసిన చీకటిమేఘం. మా ఆవరణలోని చెట్లు చిన్న చిన్న నాట్యభంగిమలతో చేసే వయ్యారాలు మాని పూనకం వచ్చినట్లు భీభత్సంగా ఊగుతూ.. ఎక్కడ విరిగి దేనిమీద పడతాయోనన్న భయం గొల్పుతూ.. హోరు గాలి తుఫాను గాలిని తలపిస్తూ.. పుడమి తల్లిని సుభిక్షం చేస్తూ టపటపా పెద్ద పెద్ద చినుకులతో వర్షం. ఉరుములూ, మెరుపులూ లేకుండా అకస్మాత్తుగా.. కొద్ది క్షణాల్లో ప్రచండ రూపం దాలుస్తూ.., అంతలోనే, గుండె ఆగిపోయే విధంగా ఏదో చెట్టు కొమ్మ ఫెళ ఫెళ మంటూ విరిగిన శబ్దం. అంతా క్షణాల్లో ..

    ఆ వర్షాన్నీ, గాలినీ చీల్చుకుంటూ వచ్చి ఆగిందో వాహనం. అందులోంచి దిగిన ఓ పదకొండు పన్నెండేళ్ళ పాప, మరో ఇద్దరూ.. ఎవరో విసిరేసినట్లుగా.. వర్షపు పొర కమ్మేస్తుంటే ఆ వెనక మసక మసకగా అగుపిస్తూ .. దగ్గరవడంతోనే అర్ధమయింది వాళ్ళెవరో. స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి అప్పుడప్పుడూ మా సంస్థకి పిల్లల్ని తీసుకువచ్చే సతీష్, బాలరాజులు.

    తడిసిన తల, చేతులూ, మొహం దస్తీతో తుడుచుకొని నా దగ్గరకొచ్చారు వాళ్ళు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు పంపిన లేఖ అందించారు. గతంలో వారి ద్వారా వచ్చిన పిల్లల బాగోగులు తెల్సుకొన్నారు. తమతో తీసుకొచ్చిన అమ్మాయిని నాకు అప్పగించారు. అప్పటికి వర్షం కాస్త తగ్గు ముఖం పట్టింది. హోరు గాలి శాంతించింది. వచ్చిన వాళ్ళు బయలుదేరతామని లేచారు.

    మనసుని అలరించే చురుకైన విన్యాసాల సీతాకోక చిలుకలా ఉంది ఆ అమ్మాయి. పేరు కళ్యాణి. వాళ్ళు బయలుదేరతామని లేవగానే బిక్క మొహం వేయడం, రాళ్ళు రప్పల మధ్య నలిగిపోతున్నట్లుగా ముడుచుకు పోవడం గమనిస్తూనే ఉన్నాను.

    కళ్యాణి వివరాలు వారిచ్చిన లేఖ ఆధారంగా రిజిస్టర్ చేసుకున్నాను. తీసుకొచ్చిన వారి సంతకం తీసుకున్నాను. హోం లోపలికి పంపుదామనుకుంటూ ఆ అమ్మాయి కేసి చూసా. ఇక ఆ పని చేయాలనిపించలేదు. గడ్డు ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఆమెలో భయం, బెదురూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు. మిగతా పిల్లలతో పరిచయమైతే ఒకటి రెండు రోజుల్లో అదంతా మంచులా కరిగి పోతుంది. అది పిల్లల సహజ స్వభావంకదా! మా హోం పిల్లలంతా బడికి వెళ్లారు. ఇంకో గంట అయితే వస్తారు. అంతవరకూ నా దగ్గరే ఉంచుకుందామనుకున్నా.

    మాములుగా అయితే ఒకటి రెండు రోజులయ్యాక అంటే కొద్దిగా అలవాటయ్యాక వచ్చిన పిల్లల పూర్తి సమాచారం కేసు స్టడీ కోసం తీసుకుంటాం. అయితే, ఈ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉందో క్లుప్తంగా తెలుపుతూ లేఖ సతీష్ వాళ్ళు ఇచ్చారు కదా! కాబట్టి, విషయం అర్ధమయింది. కళ్యాణి భయం, బెదురూ పోవాలంటే తనతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడాలి. మా పట్ల తనకి నమ్మకం కలగాలి. అందుకే నెమ్మదిగా మాటల్లోకి దించాను. కలివిడి మనిషి. కొద్దిసేపటికే నవ్వుతూ గలగలా మాట్లాడడటం మొదలు పెట్టింది. పాటలు పాడింది. శ్రావ్యమైన గొంతు. సాధన చేస్తే ఇంకా బాగా పాడగలదు. మాకు మంచి సింగర్ దొరికిందని సంతోషపడ్డా. ఆ మాటే కళ్యాణితో అంటే ' ఊహూ.. మీకు నేను దొర్కలే .. నేనే మీ తానకచ్చిన .. ' అంది నవ్వుతూ.

    'ఓ.. నిజమే కదా .. నువ్వే మా దగ్గరకోచ్చావ్. పాటల చిలకే అనుకున్నాను మాటల చిలకవు కూడా ... " చిరునవ్వుతో అంటున్న నా కళ్ళలోకి కళ్ళుపెట్టి గుచ్చి గుచ్చి చూస్తూ 'ఛి చ్హి .. .నన్ను చిలక అంటున్నరా ... నాకిష్టంలే.. ' స్పష్టంగా చెప్పింది. ఆ చూపులో ఆ మాటంటే ఉండే ఏహ్యత అంతా గొంతులోనూ చూపులోనూ పలికిస్తూ.. చిన్నగా నవ్వి ఆమె తలపై నిమురుతూ 'నీకిష్టం లేకపోతే అననులే' అంటూ తేనె తుట్టె లాంటి తన గతం ఏమిటో నని మనసులో అనుకుంటూ నెమ్మదిగా కదిపా. అప్పుడామె గాఢమైన శ్వాస విడుస్తూ నన్ను చూసిన సుదీర్ఘమైన చూపు .. నా కళ్ళలోకి సూటిగా గుచ్చి గుచ్చి చూసిన చూపు.. నా హృదయాంతరాళలోకి వెళ్లి దుర్భిణి వేసి వెతికి వచ్చినట్లున్నఆ చూపు.. నేనెన్నడూ మరచిపోలేను. ఇప్పటి వరకూ ఎంతో మంది పిల్లలు నా దగ్గరికొచ్చారు. కొందరు ఇక్కడే ఉండిపోతే కొందరు వెళ్ళిపోయారు. కానీ ఎవరి చూపూ నన్ను ఇలా స్కాన్ చేయలేదనుకుంటా ..ఆ చూపులో నిన్ను నమ్మవచ్చా అన్న సందేహం .. భయం.. బాధా... అంతలోనే ఒకలాంటి నిర్లిప్తత ..ఉదాసీనత.. కలగాపులగంగా .. నీరింకిన ఆల్చిప్ప ల్లాంటి ఆ కళ్ళలో ఉత్పాతాలు దోబూచులాడుతూ .. కొన్ని క్షణాల నిశ్శబ్దం.

    ఇప్పుడే ఆమె గతాన్ని అడిగి నేను తప్పు చేశానా, తొందర పడ్డానా ..నాలో సందేహం నన్ను కలవరపెడుతూ.

    ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ.. స్తంభించిన కాలానికి చలనం తెస్తూ, ఆ చూపుల్ని ఆటంక పరుస్తూ నేను లేచి ఆమె అరచేయి నొక్కి వదిలి ఆ కళ్ళలోకి చూసి చదవడానికి ప్రయత్నం చేస్తూనే 'నీకు ఇష్టం లేకపోతే చెప్పోద్దులేమ్మా.. నీకు బాధ కలిగించే విధంగా ఉంటే వద్దులే ' అనునయంగా అన్నాను.

    నా మాటల్లో తనకి ఏ అనుమానం తీరిందో .. లేక ఏ అభయం దొరికిందో తెలియదు కానీ నెమ్మదిగా గత కాలపు మలుపుల కాగితపు మడతలు విప్పడం మొదలు పెట్టింది.

* * *

    'మా ఊరు రాంపూర్, ధర్పల్లి మండలం. మా నాన్న ఉండంగనే అమ్మ వేరేటొన్ని చేసుకొని ఎవ్వరితో చెప్పకుంట ఎటో పోయిందట. అందుకే నాన్న చచ్చిపోయిండని అమ్మమ్మ వాల్లంటరు. అమ్మే చంపిందని నాయనమ్మ తిడ్తది. ఏది నిజమో ..!' చిన్న నిట్టూర్పు. ఒక్క క్షణం ఆగి, ఆకాశం కేసి చూస్తూ మళ్ళీ చెప్పడం ఆరంభించింది.

    'నేను అమ్మమ్మ దగ్గరే పెరిగిన. కొన్ని రోజులు పిండి బడికి పోయిన. ఆ బడిల మా లక్ష్మి టీచర్ మస్తు పాటలు నేర్పుతుండే. మంచిగ పాడ్తున్ననని మా పిండి బడికి ఎవరొచ్చిన నాతోనే పాటలు పాడిపిస్తుండే. కొన్ని రోజులయినంక ఆ టీచర్ నన్ను, నా దోస్త్ రోజాని వేరే బడిల ఏస్తనన్నది. అప్పుడే చిన్న మామ లగ్గమయింది కదా.. . ఇంట్లో మస్తుగ గొడ్వలు పరేశానుండే .. నా గురించే అన్నీ. ఒకనాడు అమ్మమ్మ నెత్తి నోరు మొత్తుకున్నా ఆమె మాట వినకుంట చిన్నమామ నన్నుతోల్కపోయి నాన్నమ్మ ఇంటి వాకిట్ల వదిలిపోయిన్డు. కొంచెమయినంక నన్నుజూసి నా కొడుకే ల్యాకపాయే. పోరీ నువ్వేటికోచ్చినవే? నేనేడ సాకుత అన్నది నాన్నమ్మ. ఉన్న ఎకరం చేనులో నాకు బీ వాటా ఇవ్వాల్నని బాబాయి పిన్ని ఇంట్లకే రానియ్యలే. ఎటు పోవాల్నో, ఏం జెయ్యల్నో .. సమజ్గాలే. రోడ్డుబట్టుకొని అట్లనే తిరిగిన. కాళ్ళు నొయ్యబట్టే, నోరెండుకపోబట్టే.. దాహం.. ఆకలి.. ఎండ .. నల్ల నీళ్ళు అప్పటికే రెండు సార్లు తాగిన్నా... మళ్ల తాగిన.. కడుపుల ఎట్లనో అయితాంది. ఏడ్సిన.. అట్లానే యాప చెట్టు కింద కూచున్న. అంతే నాకేం తెల్వలే. తెలివోచ్చేప్పటికంటే అమ్మమ్మ ఒడిల ఉన్న. ఆమె ఏడుత్తాంది. నేను ఇంట్ల ఉంటే అత్త బయటికి పోతనన్నది. మామ అమ్మమ్మని, నన్ను ఇంట్లకెల్లి పొమ్మన్నడు. నూకేసిండు. అమ్మమ్మ ఏడ్సుకుంట నన్ను ఎన్టబెట్టుకొని ఇంట్లకెల్లచ్చి బడికాడ మర్రిచెట్టు కింద కూసున్నది. మా అమ్మకు కబురుపెట్టిన రాలే. ఇదంతా ఎందుకయితాందో నాకు తెలుస్తలే. కన్నతల్లి పక్కకు నూకేసిన బిడ్డని కుక్కలు సుత కానవని అమ్మమ్మ ఏడ్సింది ' చెప్తున్నదల్లా ఆగి దీర్ఘ శ్వాస వదిలింది. ఎదురుగా ఉన్న చెట్టు వైపే తదేకంగా చూస్తోంది.

    చెట్టు కొమ్మల మధ్య భద్రంగా ఏర్పరచుకున్న గూడు. ఆ గూట్లో పిల్లలు తలెత్తి తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తున్నాయి. తల్లిపిట్ట ఏవో ముక్కుతో కరుచుకుని తెచ్చి పిల్లలకి అందిస్తోంది. ఇది నేను తరచూ చూసే దృశ్యమే. ఆ బుల్లిపిట్ట తనపిల్లలపై చూపే ప్రేమ కళ్యాణి తల్లి ఎందుకు అందించలేకపోయింది.. తన సుఖం కోసం, తన స్వార్ధం కోసం నవమాసాలు కన్న చంటిదాన్ని వదిలి ఎలా ఉండగలుగుతోంది.. ఎన్నో ప్రశ్నలు మొలకెత్తుతూ . . చెట్టుపై వాలుతున్నతల్లి పిట్టను చూస్తున్న నా ఆలోచనలకి అడ్డు కట్ట వేస్తూ

    'ఒకనాడు సాయంత్రం మా ఊర్లకు తెల్లబట్టల అక్కలు వచ్చిన్రు. చెట్టుకింద ఉన్న మాముందటికెల్లి పోయిన్రు. తర్వాత, ఆల్లకి ఎవరో నాగురించి చెప్పింరట. అందులో ఒక అక్క నన్ను తనతో తీసుకపోతనన్నది. అమ్మమ్మ ఏడ్చుకుంట నన్ను వాళ్లకు అప్పగించింది. ఆల్లకాడ మంచిగ యాల్లకింత తింటనని. నాకయితే ఏమి తెలవలే. మా అమ్మమ్మ ఏడుస్తాంటే నాకూ ఏడుపాగలే. అమ్మమ్మను పట్టుకుని ఏడ్సిన. ఆయక్కతో పొతే డబుల్ రొట్టెలు, కారీలు, సేపులు అన్నీ కొనిస్తది ఏడవద్దని అమ్మమ్మ చెప్పింది కద. ఆ అక్కతోటి పోయిన.

    హృదయం భారంగా అవుతుండగా 'తెల్ల బట్టల వాళ్ళు అంటే ' అడిగాను నేను.

    'తెల్ల బట్టలలోల్లంటే .. ' ఎట్లా చెప్పాలాని తల గోక్కుంటూ ఒక క్షణం ఆగి, ' ఆ అక్క తెల్లబట్టలేస్కుంటది. ఆ అక్క నన్ను మంచిగ సూస్కున్నది. నన్ను బడిలో ఏసింది. తను ఏడికి పొతే ఆడికి నన్నూ తీస్కపోయేది. ఆ అక్క దగ్గర ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళెవ్వరు యాదికే రాలే నాకు. నేను మంచిగ అయిన. డబల్ రొట్టె బుగ్గలొచ్చినయి తెల్సా .. ' బుగ్గలు సాగదీసి చెప్తున్న ఆ తీరు చూసి నవ్వొచ్చింది .

    'మా ఊర్ల పటేల్ పిల్లలు పోయినట్లే నేనూ రోజూ బడి బస్సులో బడికి పోయొస్తుంటి. అక్క నాకు మంచి బట్టలు కొనిస్తుండె. నేను పుట్టి బుద్దెరిగినంక నాతోటి అంత ప్రేమతోని ఎవ్వరులేరు. ఆమె చేసినంత ముద్దు ఎవ్వరు చేయలే. అక్క అంటుంటి కాని ఆమెనే నాకు దేవుడు. అప్పటికి నాకు మూడో తరగతి అయింది. అప్పుడు తెలిసింది మా అక్కకి కాన్సరు జబ్బు అని. ఆమె దవాఖానల చేరింది. నన్ను హైదరాబాద్ లో ఆల్ల సుట్టాలింటికి పంపింది. బాగా చూసుకొన్రని సెప్పింది. మా అక్కని ఇడిచి పోవాల్నంటే మస్తు దుఖమయింది. ఏడవకు నాకు తగ్గగనే మళ్లీ నా దగ్గరికే వచ్చేస్తవ్ అని అక్క చెప్పింది కదా .. గందుకే పోయిన. ఆల్లేమో వారం పదిరోజులయినంక ఇంకెవరో ఇంటికి పంపిన్రు. ఆల్లకేమో మన మాట తెలుగు రాదు. హిందీ మాట్లాడుతుండే. నాకు అర్ధమేకాకుండే. తర్వాత చిన్నగచిన్నగ ఆ బాసకు అలవాటుపడిన. నేనూ కొద్ది కొద్దిగా నేర్సిన. నాకు ఆడ ఉండాల్నని అస్సలే లేకుండే... '

    అంతలో నా ఫోన్ మోగడంతో చెప్పడం ఆపింది. నేను ఫోన్ మాట్లాడుతుంటే కాంపస్ లో అటూ ఇటూ తిరిగి చూసింది. సంత్రా చెట్టు నిండా ఉన్న పిందెలకేసి అందుకోవాలని ప్రయత్నించింది. నేను గమనిస్తున్నానని ఆగిపోయింది. ఓ గులాబీ కోసింది. చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూస్తూ మురిసిపోతోంటే పెట్టుకుంటావా అడిగా.

    'ఆహ్హాహ్హ .. నా బోడి నెత్తిల ఎట్ల పెట్టుకునేది ..?' ఎదురుప్రశ్న

    నవ్వి నా దగ్గరున్న సైడ్ పిన్ ఇచ్చా . 'థాంక్స్ ఆంటి ' అంటూ పిన్ అందుకుని జుట్టులో కుడిపక్కన గులాబీతో అలంకరించుకుంది.

    చక్కగా పెట్టుకున్నావ్ అంటూ అభినందించా.

    'ఇక్కడ మంచిగున్నది చమన్, పూలు, పండ్ల మొక్కలు, ఉయ్యాల్లలు, జారుడు బల్లలు .. మంచిగ అన్పిత్తాంది.' చూపు చుట్టూ సారిస్తూ

    'అవునా .. వెళ్లి ఆడుకుంటావా .. వెళ్ళు '

    'అంత జెప్పలేగదా .. ' అమాయకంగా చూస్తూ

    'మరి చెప్పు ..' అన్నాను

    'ఆ .. ఏమ్జెప్పిన .. ఆల్లు అందరికేమో మా సుట్టాలమ్మాయి. ఇక్కడే ఉండి చదువుకుంటది అని చెప్పేటోళ్ళు . కానీ ఎన్నడూ సుట్టంలెక్క చూడలే. గందుకే అక్కకి ఎప్పుడు తగ్గుతదో నేను అక్క దగ్గరకి ఎన్నడు పోతనో అని ఎదురు జూసిన. ఆల్లు నన్ను పేరుకి బడిల ఎసిన్రు. కానీ, బడికి పంపేటోల్లే
కాదు. ఎన్నడన్న ఒకసారి అట్లా చుట్టంలెక్క బడికి పోయేది. ఆ ఆంటి, అంకుల్ ఇద్దరూ డ్యూటీకి పోతరు కదా, ఆళ్ళ ఏడాదిన్నర కొడుకుని పట్టుకొని నేను ఇంట్ల ఉండేది. వాళ్ళు ఇంటి బయట తాళం ఏస్కోని పోతుండే. ఇల్లు శుభ్రం చేసి, బాసన్లు తోమి, బట్టలు మిషన్లో ఏసేది, బాబుకి బట్టలు మార్సుడు, అన్నం పెట్ట్టుడు, పాలు పట్టుడు అంత నేనే చేసేది. ఒక్కోనాడయితే మస్తు ఏడుస్తుంటి. ఎంతజేసిన, ఆంటి వచ్చినక ఏదో వంకపెట్టి తిట్టేది. వాళ్ల కొడుక్కి అన్నీ నేను పెట్టా లె. నా కయితే పొద్దున్న మిగిలిన అన్నం రాత్రి. రాత్రి మిగిలిన అన్నం పొద్దుగాల . మిగిలిన కూరలు అంతే.. ఇంక ఏం పెట్టకపోతుండే. అట్లనే రెండేండ్లు ఆల్లింట్ల ఉంటి. ఒకపారి వాళ్ళ బాబు తినకుంటే ఆ నెయ్యేసిన అన్నం నేను తిన్న. అది ఎట్ల తెలిసిందో ఆమెకి.. నా చేతులకు వాతలు పెట్టింది ' అంటూ చేతులకున్న మచ్చలని చూపింది.

    పసి పిల్లపై ఇంత క్రౌర్యం ఎలా చూపగాలిగారో .. నా మనసులో బాధ ప్రవాహంలా తన్నుకొచ్చింది.

    'ఆ తర్వాత కొన్నిరోజులకు ఆంటి తమ్ముడోచ్చిండు. రోజూ కాలేజికి పోతుండే. ఒకనాడు అతని గది నూకుతున్న. ఎన్క కెల్లొచ్చి నన్ను తన మీదికి లాక్కున్నడు. అది ఆంటి జూసింది. నన్ను కొట్టింది తిట్టింది. అలగా జనం అలగా బుద్దులు. ఏడికి పోతయి అని మస్తు ఆగం ఆగం జేసింది... నా బట్టల బాగ్ బయటేసింది. నాకయితే ఏం అర్ధమే కాలే నేనేమి తప్పు జేసిన్నో.. ఆనాడే పొద్దుకున్కుతంటే నన్ను ఊరికి తోలేసింది.

    ఎందుకోగాని చిన్నమామ అత్త ఏమనలే. అప్పుడు అమ్మమ్మ మంచంలో ఉండే. కొద్ది రోజుల్లకే చచ్చిపోయింది. అమ్మమ్మ లెక్కనే ఉన్నామె వచ్చింది. ఆమె మా అమ్మ అట. తనతోటి చిన్న బాబున్నడు. నాకు తమ్ముడట. నాకు ఆమెతో మాట్లాడ బుద్దికాలే. మస్తు కోపం ఉండే. నన్ను గాలికొదిలి పోయిందని. అందుకే మాట్లాడేదాన్నికాదు. ఆమెనే కల్పించుకొని కల్పించుకొని నాతో మంచిగనే మాట్లాడింది. అమ్మ తనతో నన్నూ నిజామాబాదు తీస్కపోయింది. ఇగ నేనేక్కడ ఉండాల్నని ఆమెతోని పోయిన.

    అమ్మ దగ్గరకు ఎవరెవరో మస్తుమంది మగాళ్ళు వస్తరు. తలుపులుమూస్తరు. తమ్ముడు నేను బయట ఆకలితోటే. తమ్మున్ని పట్టుకోనికే అమ్మ నన్ను తనతో తీసుకచ్చింది కావచ్చు. అమ్మ కోసం ఏడ్సేటి తమ్ముడిని నేనే సముదాయిన్చేదాన్ని. కొత్త నాన్న ఆటో పక్కకుబెట్టి ఎప్పుడు తాగుడే తాగుడు. అమ్మ సుతం తాగుతుండే. అన్నం కూర ఎన్నడు సరిగ చేసేదేకాదు. ఒక్కోసారి హోటల్ కెల్లి ఇడ్లీలు అట్లా ఏమన్న తెప్పిస్తుండే. ఎప్పుడు ఆకలికి మాడుడే మా పని' విషగుళికలాంటి ఆ జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఆమెను గాయపరుస్తుండగా మొహం అదోలా పెట్టి చెప్పింది కళ్యాణి.

    'ఆటో కు చేసిన బాకీ కట్టలేదని కొత్తనాన్న ఆటోని ఫైనాన్సోల్లు పట్టుకపోయిన్రు. తమ్ముడు ఏడుత్తాంటే ఆడిపిస్తున్న. అప్పుడొచ్చిండు కొత్త నాన్న, బగ్గ తాగి తూలిపోతున్నడు. నన్ను రెక్కపట్టి లాక్కుపోతున్నడు. అమ్మ లోపటికెల్లి చూసినట్టున్నది. ఇడిపిచ్చి లోపలి పొమ్మంది. ఆ రోజు ఆల్లిద్దరికీ మస్తు పెద్ద గొడవ అయింది. అమ్మకళ్ళు గా బాదంకాయల్లెక్క ఎర్రగ,ఉబ్బుగ అయినయి.

    ఆ తెల్లారే అమ్మ నాకు రెండు జతల కొత్త బట్టలు, ఎత్తు చెప్పులు కొనుక్కచ్చింది. అబ్బ! మా అమ్మ ఎంత మంచిది! నేనంటే ప్రేమనే అనుకుంటి.. నన్నుబీ మంచిగ సుస్తాందని మురిస్తి. ఆ మాటే ఆమెతో చెప్పిన.. అమ్మ చిన్నగ నవ్వింది. అమ్మా.. నా చెవులకు జుంకాలు కొనవా అని అడిగిన గార్వంగా. సరే , రేపు కొంటనని చెప్పి ఒక ముద్దు ఇచ్చే. పొద్దుగాల్లనే లేపింది. ముంబైకి పోతున్నమని చెప్పింది. ఎందుకంటే ఆడ సుట్టాల దగ్గరికి అన్నది. రైలుగాడిల అమ్మ వొడిల తలపెట్టి పండుకొన్న. నా చిన్నప్పటి ముచ్చట్లన్ని చెప్పిన. అవి ఆమెకు తెలవది గద. అట్ల చెప్పుకున్టనే హాయిగ నిద్రపోయిన. ఇక నేనెప్పటికీ తమ్ముడ్లెక్కనే అమ్మతోనే ఉంటననీ, ముచ్చట్లు బెడ్తననీ ఏవేవో కలలు. లేలే... మనం వచ్చేసినం, గాడి దిగాలె అని అమ్మ నిద్రలేపే.

    రైలుగాడి దిగిన కాడికి ఎవరో వచ్చిన్రు. అమ్మతో మాటాడిన్రు. ఆల్లతోని మేం పోయినం. పాములెక్క మెలికలు మెలికలు తిరిగి ఉంది ఆ బాట. సందుల్ల కెల్లి, గొందుల్లకెల్లి ఓ ఇంటికి తీసుకపోయిన్రు. ఆల్తోని మాటాడొచ్చి నన్ను ఆడనే ఉండుమని జెప్పి జుంకాలు తేనికి బయటకు పోయింది అమ్మ. అంతే .. మల్ల మా అమ్మ నాకగుపియ్యలె. నేను జుంకీల కోసం , అమ్మ కోసం మస్తు జూసిన. ఏడ్సిన. మాతో తెచ్చిన బ్యాగు నా కాడనే ఉన్నదిగద.. అమ్మ వస్తదన్న ఆశతోని ఎదురు చూసిన. అట్లనే రెండు రోజులు అయినయి. బయట ఉన్నోల్ల మాటల్ల తెలిసింది. మా అమ్మ ఇక ఎప్పటికీ రాదని. కానీ నమ్మ బుద్ది కాలే. నాలో ఆశ... మల్ల అంతల్నే అమ్మ ఇంతే.. నా మీద ప్రేమే లేదు అనిపిస్తుండే. రైలుగాడిల వచ్చేతప్పుడు ఎంత మంచిగ ప్రేమగ ఉన్నది నాతోని. అదంత నిజం కాదా.. ఉత్తదేనా .. ముల్లు గుచ్చుకున్నట్టయ్యేది. మల్ల, ఉహు .. కాదు కాదు వస్తది. అమ్మనా కోసం తప్పకుంట వస్తదన్న ఆశ నాలోపట.' తలొంచుకుని కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచింది.

    కాల్చేసే జ్ఞాపకాల భారం ఎలా మోస్తోందో .. ఇంత చిన్న పిల్లకి ఎన్ని కస్టాలు. ఇంతటి విషాదాన్ని ఆ చిన్ని గుండె ఎలా భరించిందో.. ఎలా తట్టుకుందో అనుకుంటూ 'నీ ఒక్క దానివే ఉన్నావా ఆ ఇంట్లో ' అంటూ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకున్నా, ఆమె వాక్ ప్రవాహదిశ మళ్ళిస్తూ . ఆమెకు తల్లి గురించిన ఆలోచనల భారం దూరం చేసి తల్లి ప్రేమ అందించాలనే భావనతో .

    'ఊహు.. నేనొక్కదాన్నే కాదాంటి, నేను పోయేప్పటికే ఆ చిన్న గదిల ఆరుగురు ఉన్నారు. కొందరు నా తొటోల్లె ఉండొచ్చు. ఇద్దరుముగ్గురయితే నాకంటే నాలుగయిదేళ్ళన్న పెద్దగ ఉండొచ్చు. ఆల్లంత ఊకే ఏడ్సుకుంట ఉండేది. అమ్మ రాదని తెలిసినా .. నన్ను 30 వేలకు అమ్మేసిందని తెలిసిన నాకెందుకనో ఏడుపే రాలే. బిర్యానీ, చాక్లెట్లు అన్ని బాగనే పెడుతున్నరు కద.. చేతులు అరిగి పోయేతట్టు పనిలేదు. వాతలు తేలి బొప్పి కట్టే దెబ్బలు లేవు కద అనుకున్న. అక్కడున్నాళ్లకు తెలుగే రాదు. హిందీ ఇంకా వేరే ఏదో మాట్లాడేటోల్లు.'

    'మరి నీవు వాళ్ళతో ఎట్లా మాట్లాడేదానివి ?' స్పీడు బోటంత వేగంగా ఉత్సుకతతో నా ప్రశ్న

    'నాకు హిందీ తోడెం తోడెం తెల్సు కద. నేను హైదరాబాద్ లో హిందీ వాళ్ళతోని ఉన్నప్పుడు నేర్సిన కద.' నవ్వుతూ

    'నిన్ను మీ అమ్మ తీసుకుపోయిందక్కడికి. మరి.. వాళ్ళనెవరు తీసుకొచ్చారు ' విషయం అర్ధమవుతుండగా నా ప్రశ్న

    'కరిష్మా, సరోజ్ ఇద్దరూ పెండ్లిళ్ళు అయితే భోయనాలు పెడతరు కదా! అట్ల భోయనాలు పెట్టే పని ఉన్నదనీ, ఆ కంపెనీ నెలకు నాలుగు వేలు జీతం ఇస్తదని తెల్సినోళ్ళు చెప్తే వచ్చిన్రట. ఆళ్ళేమో ఎక్కడెక్కడ్నో తిప్పి తెచ్చి ఆ గదిలో పడేసిన్రట. సావిత్రినేమో పక్కింటాయన పెళ్లి చేసుకుంటనని తీసుకొచ్చి లాడ్జ్ లో పెట్టి బూతు సిన్మాలు తీసిన్డట. కొన్ని రోజులైనంక ఆడ్నే వదిలిపోయిండట. రాలేదని ఏడుత్తాంటే లాడ్జి లకెల్లి బయటికి తోలేసిన్రట. ఎటుపోవాల్నో తెల్వక ఆమె ఏడుత్తాంటే ఒకాయిన అతని దగ్గరికి కొంటబోతనని జెప్పి ఈ ఇంట్లకి తెచ్చి పడేసిండని ఏడుస్తుండే. కళావతికేమో సినిమాల్లకి పోవాల్నని, అందరూ తనను సినిమాల చూడాల్నని ఆమె ఆశ. ఇంట్లజెప్తే తిడతరని ఆమె పెళ్ళికోసం వాళ్ళమ్మ చేపిచ్చిన సనుగులు, నాన్న దాచిపెట్టిన పైసలు తీసుకొని ఇంట్లకెల్లి పారిపోయి రైలెక్కి ముంబై పోయిందట. ఆడ దిగినంక ఏడికి పోవాల్నో, ఏమ్జెయ్యాల్నొ తెల్వలేదట. బిత్తర బిత్తర చూత్తాంటే ఆడి పోలీసులు పట్టుకోన్నరంట. ఆమె దగ్గరున్న పైసలు, నగలు గుంజుకుపోయారట. ఇంటికి తిరిగి పోదామంటే మొఖం రాలేదట. వేరే పోలీసాయన నేనున్నదగ్గర ఒప్పజెప్పిండట.

    ప్రేమల ఇటుక బట్టిల్ల పనిచేసేదట. సీన్మ హిరోయిన్ లెక్క అందంగ ఉన్నవ్. ఈడ ఉండేటిదానివి కావు అనేవారట కొందరు. నేను నిన్ను ఇంక మస్తు అందంగ తాయారు చేస్తననీ, నీ జీవితం మార్చేస్తనని బ్యూటి పార్లర్ కి కొంటబోయి చానా అందంగాచేసిందట ఒకామె. ఆమె సినిమాల్లోకి తీస్కపొమ్మని ఎవరితోనో చెప్పి పంపిందట. తనే సీన్మ హీరోయిన్ అయినట్టు కలలు కనుకుంట ఉంటె తెచ్చి ఈ బందెలదొడ్డిల పడేసిన్రని ఏడుత్తుండే.

    మాకు కావలి ఎప్పటికీ ఇద్దరు ఉంటుండే. ఆల్లెటన్న పోతే ఇంకో ఇద్దరు ఉంటుండే. ఆల్లు గాక గేటు కాడ వాచ్మన్ ఉంటుండే. మేం ఉన్న రూం కాడనే ఉండే ఆ... గుండు గాడయితే ఊకే పూజ బుగ్గలు పిస్కేటోడు. మెత్తగా ఉన్నయని ముద్దు ఇవ్వబోతే పూజ మాస్తు తిట్టింది. ఆ బుగ్గను వాడు ముట్టుకున్నడని గోడకేసి నెత్తురు కారేటట్టు రుద్దుకుంది. చేతిలో కత్తి ఉంటే ఆ బుగ్గను కోత్తుండేనేమో ... అంత కోపమొచ్చిన్దామెకి.

    అప్పటికే నేను నాలుగైదు రోజుల్నించి ఉంటున్న కదా. కొబ్బరి పీచులెక్క ఉన్న నా పిలక జుట్టు కత్తిరించి భుజాలమిదికి చేయించిన్రు. మంచి డ్రస్సులిచ్చి ఏసుకోమన్నరు. జుంకీలు ఇచ్చిన్రు. లిప్ స్టిక్ , పౌడర్, క్రిం అన్ని ఇచ్చిన్రు. మా అమ్మ ఏమి తేలే.. కానీ ఈల్లన్ని ఇచ్చిన్రని సంతోషమయింది. అప్పుడు ఒక మేడం వచ్చిమమ్మల్ని మంచిగ తయారుజేసింది. అద్దంల నా మొకాన్ని చూసున్న. నేనేనా .. అన్పిచ్చె .. ఎంత ముద్దుగ, అందంగ ఉన్ననో .. చెయ్యి గిల్లి చూసుకున్న .. మాయని కూడ గిల్లుమన్న . నేనే ..అంత మంచిగ ఉన్న. ఆ కెమెరలకెల్లి చూస్తే . అందరిని అట్లనే తయారుజేసిన్రు. నవ్వుతూ ఉండాల్నని చెప్పి బుర్రమీసాలోడు కెమెరతో పోట్వలు తీసిండు. నేను నవ్వుకుంట ఆల్లు జెప్పినట్టు ఫోజు పెట్టి దిగిన్నని మెచ్చుకున్నరు. ముందు రోజు వచ్చిన మాయని నేనే నవ్విపిచ్చిన ఫోట్వ దిగేతందుకు.

    ఆల్లంత ఎప్పటికీ ఏడుసుకున్టనే ఉంటుండే. లేకుంటే ఆల్లను తెచ్చి బందెలదోడ్డిలో ఏసినట్టు ఈడ పడేసినోళ్ళను తిట్టుకుంటుండే. నేనొక్కదాన్నే అందరితో ఏదోటి మాట్లాడ్తుంటి. వాళ్ళని ఇసిగిస్తుంటి. మాయ నా ఎన్కెనుక ఉంటుండే. ఆమెను ఆళ్ళింటి ముంగట ఆడకుంటాంటే కిడ్నాప్ చేసిన్రట.' ఎంతో చనువుగా నా ముంజేతి గాజుల్ని అటూ ఇటూ కదుపుతూ లావా ప్రవాహంలా చెప్పుకుపోతోంది కళ్యాణి

    ఆశ్చర్యంతో " ఇంటి ముందా... " అంటున్న నాకు అడ్డుతగులుతూ 'అవునాంటీ.. , వాళ్ళింటి ముంగట్నేనట. పక్కింటోళ్ళు ఇల్లు కట్టుకోనికి ఇసుక పోసుకున్నరట. ఆదివారం బడి లేదని ఇసుకల గూళ్ళు కట్టి తమ్ముడితో ఆడుతాందట. వాళ్ళ అమ్మ వంట పనిల, బాపు పేపర్ చదువుతూ ఉన్నరట ఇంట్లనే. తెల్లటి మారుతి వ్యాను వచ్చి ఆగిందట. మాయని చటుక్కున వ్యాను లోపట్కి గుంజి స్పీడుగా పోయిందట. ఆమె అరుస్తాంటే నోట్ల గుడ్డ కుక్కిన్ర్తట. తమ్ముడి అరుపులకు ఆమె బాపు బయటికివచ్చుడు కనిపించిందట ఆమెకి. అమ్మ నాన్న , తమ్ముడు తన గురించి ఎంత వెతుకుతున్నరో .. ఎంత బెంగ పెట్టుకున్నరో అని రోజూ ఏడ్చేది' తను నోటితో చెప్పే తాలుకు భావాల అనుగుణంగా కల్యాణి శరీర భాష .

    'మా అమ్మ తెచ్చిన బ్యాగుల నా కోసం కొన్న కొత్త బట్టలతోటి లోపట జిప్ ల 150 రూపాయలు కనవడ్డయ్. అమ్మ మర్సిందో లేకుంటే కావాల్నని పెట్టిందో నాకయితే ఎర్కలేదు. అవి మాయ చూసి నాకు ఒక రూపాయి ఇవ్వవా .. మా బాపుకి ఫోన్ చేస్త అని రహస్యంగా అడిగింది. ఫోన్ చేయాల్నంటే ఎట్ల.. బయటికి పోవాలె కద .. మస్తు ఆలోచించినం. మా రూం ఆవల, గేటు బయట ఎప్పటికీ కావలి ఉంటుండే.. వాళ్ళ మాటల్ల తెలిసింది. ఒకటి రెండు రోజుల్ల మమ్ముల వేరేకాడికి తరలిస్తరని. ఇంకో అమ్మాయి రాక కోసం చూస్తున్నరని

    నేను , మాయ , ఒక్కోసారి పూజ మా గదిలకెల్లి బయటకు వస్తున్టిమి. మొదట్ల 'అందర్ జావ్ ' అని అరిచేటోల్లు కాని తర్వాత ఏమనలే. నాకు మాట్లాడకుంట ఉండాల్నంటే చానా కష్టం. నేను ఏదోటి వాగుతుంటి కదా . అంతా ఫ్రెండ్స్ అయ్యిన్రు. ఆ రోజు సాయంత్రం ఏమయ్యిండో ఆ గుండుగాడు, మీసాలోడు ఇద్దరూ లేకుండే. మాయ తొందర చేసింది ఫోన్ చేద్దామని. వాచ్మన్ దగ్గరకి పోయి బతిమాలినం.. చాక్లెట్ తెచ్చుకుంటనని. మొదట ఒప్పుకోలే. ఆకరికి చెవిల జోరీగల్లెక్క అడుగుతాంటే ఏమనుకున్నడో ఏమో .. పక్కనే షాప్ ఉంది. ఇక్కడున్నట్టు రావాలె అన్నడు. నేను మాయ బయలు దేరినం. ఆమెను పంపనన్నడు. అసలు నేను అడిగిందే తన కోసం కద .. అందుకే అబ్బ .. అబ్బ .. ప్లీజ్ అంకుల్ . ఒక్కదాన్నయితే నాకు భయం. తోడు పంపండంకుల్ అని చేతులు పట్టుకుని బతిమాలిన. ఏమనుకున్నడో ఏమో .. సరే అయిదు నిముషాల్ల ఈడ ఉండాలి . లేదా నా పని పోతది అన్నాడతను. నీ ఉద్యోగం ఎందుకు పోతుంది చాచా అడిగింది మాయ. పోలీసులు .. దాడులు .. మాకాం మార్చడమ్... తనలో తనే చిన్నగా గొణుక్కున్నడు.

చాచా నీకేమి భయం లేదే .. నేనెక్కడికి పోత ? అమ్మ ఈడ పడేసి పోయింది. నాకెవరున్నరే మీరు తప్ప అని చెప్పి అతన్ని అతి కష్టం మీద ఒప్పించి మాయతోటి బయటపడిన.

దగ్గరలోనే ఉన్న దుకాణంల చాక్లెట్ కొనుక్కొని యాబై రూపాయల నోటు ఇచ్చిన. దుకాణం అతను ఇచ్చిన చిల్లర అంత మాయ చేతిలో పెట్టిన. నా చేతిల వంద నోటు ఉన్నది. మాయ వెంటనే ఉరుకుడుబెట్టింది. ఆమె కనిపించనంత దంక అట్లానే చూస్కుంట నుంచున్న. హమ్మయ్య మాయ వాళ్ళింటికి పోతది. అమ్మ నాన్న, తమ్ముడుతో హాయిగా ఉంటది. తనకు సాయం చేసినందుకు చాల సంతోషం అనిపిచ్చింది. మా అమ్మ ఎందుకు ఆ పైసలు ఆడవెట్టిందో కనీ.. వాటితో మాయ తన వాళ్ళకాడికి పోతది అన్న ఆలోచన రాంగనే మనసులనే అమ్మకు థాంక్స్ చెప్పుకొని ఎనిక్కి తిరిగిన. రెండడుగులేసిన. మాయ లేకుంట పోతే ఏమంటరో నన్న బయం ఎన్నుల వణుకు పుట్టిచ్చే. అంతే, నేనూ ఉరుకుడు అందుకుంటి. సందులు గొందుల్లకెల్లి ఒక పెద్ద రోడ్ పైకి వచ్చిన.

    మా అక్క ఏసుకున్నట్టు తెల్ల బట్టలోళ్ళు కనిపిచ్చిన్రు. మా అక్క యాదికొచ్చింది. సంతోషమయింది. ఉరికిపోయిన. మా అక్క తెలుసా అని అడిగిన.. తెలియదన్నరు. నా గురించి అడిగిన్రు. చెప్పిన. ఆశ్చర్య పోయిన్రు. అక్కడి పోలీసులకు అప్పజెప్పిన్రు . ఆడికెల్లి నిజామాబాదు పంపిన్రు. నిజామాబాదు బాలసదనంల ఉంచిన్రు. బడిల ఎసిన్రు. నిన్న బడి కెల్లి బాలసదనంకి పోతున్న. మా కొత్త నాన్న ఆటోలకెల్లి చూసిండు కావచ్చు. నా దగ్గరకు తెచ్చి ఆటో ఆపి ఎక్కు అని గద్దించ్చిండు కోపంతోని. ఆయననట్ల చూసుడే నాకు చాలా బయమయింది. అరుచుకుంట బాలసదనంలోకి ఉరికిన. ఆయమ్మ, మేడం అందరూ ఏమైందంటూ ఉరికొచ్చిన్రు. ఏమనుకున్నరో ఏమో ఇయ్యాల్ల ఈడికి పంపిన్రు'. బాధతో బరువెక్కిన చాతిని మధ్య మధ్యలో ఒత్తుకుంటూ .. ఏడ్చి ఏడ్చి నీరింకిన కళ్ళను గట్టిగా మూసుకొని తెరిచింది కల్యాణి .

    పన్నేండేళ్ళయినా లేని ఈ చిన్నారి ఎన్ని కష్టాలు పడింది. సుడులుతిరుగుతున్న ఇలాంటి కష్టాలు సినిమాల్లో చూస్తాం. నిజంగా జీవితంలో ఇలా జరుగుతాయా .. సందేహం. అసలు జీవితం ఇంత కఠినంగానూ నిర్దయగానూ ఉంటుందా ..?! ఒక్కరికే.. అదీ ఇంత చిన్నతనంలోనే.. ఇన్ని కష్టాలా .. కళ్యాణి చెప్పింది వింటుంటే రక్తం సలసల కాగుతోంది. హృదయం ద్రవించి కళ్ళలోంచి నీరై కారిపోతోంది. ఆమెను అలా చూస్తూనే ఉన్నా.. ఆ స్థానంలో సహజ .. నా సహజ .. రూపం కదలాడుతుండగా.. ఆ అనుభవం తాలూకు ఉద్వేగం ముంచెత్తుతోండగా..

    'మాయ ఇంటికి పోయిందో.. తనని ప్రాణం పెట్టి చూసుకునే వాళ్ళున్నరు. బాగా చూసుకుంటరు. ప్చ్ .. నాకెవరూ లేరు. మొన్న ముంబైల, నిన్న నిజామాబాదు బాలసదనంల ఇయ్యాల్ల ఇక్కడ ఉన్న.. రేపు ఎక్కడుంటనో ..' మబ్బువీడుతున్న ఆకాశం కేసి చూస్తూ తనలో తానే అనుకున్నట్లుగా ఆమె అన్నప్పటికీ నా చెవిన పడ్డాయి ఆ మాటలు. భవిష్యత్ పట్ల ఆమె ఆందోళన, భయం ఆమె మోహంలోనూ ప్రవహించి ప్రతిఫలిస్తూ ..

    లేచి కళ్యాణిని దగ్గరకు తీసుకున్నా. స్నేహపూర్వకంగా భుజాలపై చెయ్యి వేశా. ఉలిక్కిపడింది. తన చేయి నా చేతిలోకి తీసుకున్నా. 'భయపడకు, బాధపడకు నీవు ఇక్కడికి చేరావు కదా .. ఇక ఇక్కడే ఉంటావు. ఎటూ వెళ్ళవు. ఇక్కడే చదువుకున్నంత చదువుకుంటావు ' లోతుగా చూస్తూ భరోసా కలిగిస్తూ నేను .

    నిజంగానా .. నమ్మలేనట్లు చూపు .. ఆ వెంటనే ఆ కళ్ళలో ఓ వెలుగురేఖ ప్రసరించడం నా దృష్టిని దాటి పోలేదు.

    మళ్లీ నా కూతురు సహజ గురించిన ఆలోచనలు...నన్ను అతలాకుతలం చేస్తూ .. నా కూతురు దూరమయి ఎనిమిదేళ్లయింది. అప్పుడు సరిగ్గా కళ్యాణి ఇప్పుడున్న వయసులోనే ఉంది. తను చదివే స్కూల్ హాస్టల్ లో ఉండే పిల్ల్లలు తెచ్చిపెట్టమన్నారని దారంరీలు కొనడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. అంతే, నా చిట్టి తల్లి తిరిగి ఇంటికి రాలేదు. ఏమైందో .. ఎక్కడ ఉందొ.. ఎలా ఉందో.. జాడ తెలియదు. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఎక్కడికో తరలించి ఉంటారు. ఆడపిల్లల అక్రమ రవాణా .. తరలింపు వార్తలు పత్రికల్లో ఎప్పుడు చూసినా .. నా బంగారు తల్లే కళ్ళముందు కదలాడుతుంది. ఆనాటి నుంచి తల్లిగా మనసులో చెలరేగే ఇసుక తుఫానుల్ని దిగమింగుకుని బతుకుతున్నా ..అన్వేషణ సాగిస్తున్నా. ఏనాటికైనా నా కూతురు నన్ను చేరక పోతుందా అన్న చిన్ని ఆశతో .. ఆ ఆశే నాకు శక్తినిస్తోంది. నన్ను బతికిస్తోంది.

    సహజ కోసం వెతకని చోటు లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పత్రికల్లో, త్.వ్. లో ప్రకటన ఇచ్చాం. పోస్టర్లు అతికించాం. ఆచూకీ తెలిపిన వారికి భారీగా బహుమానం ప్రకటించాం. . ప్చ్ .. లాభం లేదు. ఇంతవరకూ ఎలాంటి ఆచూకి లేదు. అందుకే ఆపదలో ఉన్న బాలికల్ని చేరదీసి వాళ్ళలో నా కూతురిని చూసుకుంటున్నా. కొంతలో కొంత ఉపశమనం పొందుతున్నా.

    'మేడం, అయిన వాళ్ళందరినీ దూరం చేసి ఈ పసివాళ్ళ జీవితాల్ని కాలరాసే హక్కెవరిచ్చారు ఆ దుర్మార్గులకి. ఎప్పుడో వందల ఏళ్ళ కిందట నల్ల వాళ్ళను బలవంతంగా దేశాంతరం తీసుకెళ్ళి పనులు చేయించుకునేవారని విన్నాం . ఆ బానిసత్వం పోయిందనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదేమిటి.? బలవంతంగా ఎత్తుకు పోయో, ప్రేమ పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో మోసం చేయడం లేకపోతే పేదరికం ఆసరాగా చేసుకుని డబ్బు ఎర వేసి లొంగదీసుకోవడం..తమ నియంత్రణలో ఆడపిల్లను ఉంచుకోవడం, వారి స్వేచ్చను హరించడం అంటే.. అంటే.. అది బానిసత్వం కాదా ..? ' ఎప్పుడు వచ్చి కళ్యాణి జీవితం గురించి విన్నదో గానీ ఆవేశంతో ప్రశ్నించింది మాధురి.

    మాధురిని వింతగా చూస్తోంది కళ్యాణి. తెలంగాణా యూనివర్సిటీలో సోషల్ వర్క్ చదువుతున్న మాధురి ప్రాజెక్ట్ వర్క్ కోసం నా దగ్గరకి వచ్చింది. సామాజిక కార్యక్రమాలంటే ఏంతో ఆసక్తి ఉన్న మాధురి అప్పుడప్పుడూ నా దగ్గరకి వస్తూనే వుంటుంది. నేను ఎప్పుడూ చూసే మాధురి వెన్నలంత చల్లగా.. ఈ రోజు మండుతున్న అగ్నికణంలా.. కొత్తగా...

    'పసివాడని ఈ కుసుమాలు కర్కశ మృగాల చేతుల్లో చిక్కి మనసు, శరీరం మానని గాయాలయి, పచ్చి పుండులా సలుపుతా వుంటే .. బిచ్చగాళ్ళుగానో, వేశ్యలుగానో .. బానిసలుగానో దుర్భరంగా బతుకుతున్నారంటే అందుకు బాధ్యులెవరు మేడం..? ' మరో బాణం లాంటి ప్రశ్న మాధురి ఆవేదనకు నిలువుటద్దంలా .

    'నీ ఆవేదనని అర్ధం చేసుకోగలనమ్మా మాధురీ .. విషపురుగులా బుసలు కొడుతున్న తరతరాల వివక్ష, ఆమె శరీరంపై ఆమెకు హక్కు లేకపోవడం, మారిన విలువలు, పలచనైపొతున్న మానవసంబంధాలు, మితిమీరిపోతున్న వ్యాపార సంస్కృతి, ప్రపంచీకరణ ల నేపథ్యంలో చితికిన గ్రామీణ ఆర్ధిక స్థితిగతులు వంటివెన్నెన్నో.. నిప్పుల నడకపై ఆడపిల్ల .. ' మధ్యలో అందుకుని

    'కొందరి జీవితాల్లో నయినా వెన్నెల పూయించాలని మీ తపన తాపత్రయం. కానీ, బందీలైన నిగూఢ గాధలు నిశ్శబ్ద స్వరాలు ఎన్నో.. వారి చెర వీడేది ఎన్నడో కదా మేడం.. ఆడపిల్లని అంగడి సరుకుగా మార్చే వేయి పడగల విషనాగుల కోరలు తీసేది ఎప్పుడో ..' మాధురి స్వర తీవ్రత స్థాయి కొద్దిగా తగ్గి సాలోచనగా.

    ఆ రహస్యాల దారులకోసం తీవ్రంగా వెతుకుతోంది నా మనసు. దూరంగా కనబడే కొండల బారుతో పోటీపడుతూ బారులు తీరి బడి నుండి కదలి వచ్చే మా పిల్లల పలకరింతల కేరింతల అలలు నాలోకి ప్రవహిస్తూ మదిలో చెలరేగే భావపరంపరల్ని భంగపరుస్తూ.. వాస్తవంలోకి లాక్కొస్తుండగా కళ్యాణి నాకేసి, మాధురి కేసి, పిల్లలకేసి వింతగా చూస్తూ.. మొహంపై మొలిచిన చిరునవ్వుతో ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ .. కొత్త ప్రపంచం కేసి ఆనందంగా అడుగులేస్తూ..

    'నేనూ వీళ్ళతో పాటే ఉంటాను కదా .. ' అంటూ ముందుకు కదిలింది కళ్యాణి.

(భూమిక మాసపత్రిక డిసెంబర్ 2015 సంచికలో ప్రచురితం)

Comments