నిరాశ్రయులు - నిఖిలేశ్వర్

    జైల్లో ఆ రాత్రి గోడగడియారాన్ని చూసుకొని తొమ్మిది గంటలు కొట్టాడు కాపలా పోలీసు. ఆ గంటల ధ్వని చాలా దూరం వరకు చీల్చుకుంటూ చుట్టుపక్కల వాళ్లకి కాలాన్ని సూచిస్తున్నది. జైల్లోని ఖైదీలంతా ఒకచోట చేరుకుంటున్నారు. ఖైదీలకు తిండిపెట్టే సమయమది. ప్రతి ఖైదీ తన అల్యూమినియమ్ ప్లేటు, లోటా పట్టుకుని ఒకర్ని - ఒకరు తోసుకుంటూ వరుసగా నిలబడుతున్నారు. ప్రొద్దస్తమానం గొడ్లలా చాకిరి చేసిన శరీరాలు తిండికోసం నకనకలాడుతున్నాయి. 

    ఖైదీలలో రకరకాల మనుష్యులు - విభిన్న వయస్సులవాళ్ళు అక్కడో ప్రపంచాన్ని సృష్టించి వేశారు. వారి దుస్తులు తెల్లగుడ్డపై నల్ల చారలున్న నిక్కరు - షర్టు.

    ఖైదీల 'క్యూ' కదులుతూంది. ఎదురుగా జైలర్ గొడ్లకాపరిలా చూస్తూవుంటే ఒక వార్డెన్ వరుసగా కొలిచిన గిన్నెలతో ఒక్కొక్కడికి అన్నము చారు పోస్తున్నాడు. ఆ ప్లేట్లు చేత్తో పట్టుకొని ఖైదీలు చెల్లాచెదురుగా, అక్కడా - ఇక్కడా కూర్చొని ఏదో ఆందోళనతో గబగబా తినేస్తున్నారు. 

    అది సెంట్రలు జైలు. చుట్టూ ఎత్తయిన గోడలు. వాటిపై గాజుపెంకులు గుచ్చారు. ఆ జైలుకి నాలుగు ప్రక్కలా ఇనుప తీగెలతో సరిహద్దు నిర్ణయించి ఉంది. ఉత్తరంవైపు పెద్దగేటు. ఆ పెద్దగేటులో ఒక చిన్న పిల్ల తలుపు. ఇప్పుడది మూసి ఉంది పెద్ద - పెద్ద తాళాలతో పెద్దల్ తలుపు - చిన్న తలుపు.

    లోపల మానవులరూపంలో ఉన్న తోడేళ్లను, గొర్రెలను, దయ్యాలను, రాక్షసులను, హంతకులను ఒకచోట చేర్చి తలుపుల దగ్గర ఇరవైమంది పోలీసులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. జైలు పెద్దగేటు పైన ఉన్న గదులలో ఇద్దరు పోలీసులు 'పహరా హుషార్' పచార్లు చేస్తున్నారు. అవతల నాలుగు కొనల్లో నలుగురు పోలీసులు అస్తమానం తుపాకులను అంటిపెట్టుకొని భయంతో పడివున్నారు. 

    ఖైదీలలో తొందర హెచ్చుతూ ఉంది. ఏవో గుసగుసలు అగ్నికణాల్లా చిటపట మంటున్నాయి. ఈ ఖైదీల్లో అన్నివిధాల శిక్ష లనుభవిస్తున్న వారున్నారు. కొందరు కొన్ని సంవత్సరాల పాటు శిక్ష అయితే మరికొందరు యావజ్జీవ శిక్షను మోస్తున్నవారు ఉన్నారు. దాదాపు 500 మంది ఉన్నారు. ప్రస్తుతము కొందరి కాళ్ల గొలుసులు తీసేశారు. చేతులకు బేడీలు వ్రేలాడుతున్నాయి. 

    చివరి మెతుకు గతుక్కుని, ఆఖరి గుక్క నీరు త్రాగేశారు ఖైదీలంతా. గ్లాసులు - ప్లేట్లు క్రింద పెట్టేశారు. 

    వాళ్ల మధ్యనుండి రణగొణధ్వనిని సవాలు చేస్తూ ఒక యువఖైదీ నోటితో పెద్దగా ఈల వేశాడు. ఇంతకు పూర్వమే ముందుకు అడుగు వేసిన కొందరు ఖైదీలు పరుగెత్తారు. అడ్డమొచ్చిన పోలీసులను తన్ని పడేశారు. ఆ గుంపు గేటు దగ్గర ఉన్న తుపాకి సిబ్బందిని ఆక్రమించుకుంది.  

    ఏమరుపాటులో జరిగిన ఈ గందరగోళాన్ని చూసి జైలర్ నివ్వెరపోయాడు. ఇంతలో కొనరు ఖైదీలు అతన్ని చుట్టుముట్టారు. 

    పైనవున్న గస్తీ పోలీసులు ఈ దొమ్మిని చూడగానే తుపాకీలు పేల్చడం మొదలుపెట్టారు. ఆ గుంపులో కొనరు కూలిపోతున్నారు. ఇంతలో ముందుకు పరిగెత్తిన గుంపు పెద్దగేటు తాళం విప్పేసింది. గేటు విప్పుకోగానే ఖైదీల ముఠా దానివైపు పరుగుతీసింది. పైనుండి తూటాలు కురుస్తున్నాయి. ఖైదీలు వాటిని లెక్క చేయకుండా దారి చూసుకుంటున్నారు. చాలామంది చెదురుగా గాయపడి పడిపోతున్నారు. వీలు చిక్కినవాడల్లా తప్పించుకుంటున్నాడు.

    ఎట్లాగో ఒక పెద్ద గుంపు గేటును దాటింది. ఎదురుగా ఆవలి పోలీసుల కాల్పులు లెక్కచేయకుండా ఆ గుంపు చెల్లాచెదురై పరుగెత్తుతూ ఉంది. ఇనుపతీగ హద్దు దాటి ఖైదీలు కొందరు దారి చూసుకున్నారు. అందులో దొమ్మీకి పూర్వం అనుకున్న విధంగానే ఈలవేసి ఉసిగొల్పిన యువఖైదీ అందరికంటే ముందే తప్పించుకొని పరుగెత్తుతున్నాడు. వెనుక అల్లకల్లోలము, కేకలు, తుపాకి కాల్పులు అతన్ని ఆపలేదు. కొండపై నుండి పడే జలపాతంలా ఉరుకుతున్నాడు.

    దాదాపు మైలు దూరం రాగలిగాడు. దక్షిణం వైపు వెళ్లిపోతున్నాడు విసురుగా వగర్చుతూ.

    అమావాస్య కారుచీకటిలో కాలుడిలా ఉన్న రాత్రి భయానికి చిమ్మటలు 'చివుక్కు - చివుక్కు'మంటున్నాయి. చాలా దూరంలో కమ్మరి సమ్మెటపోట్లు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. ఆ ఖైదీ అటువైపు పడుతూ లేస్తూ పరుగుతీస్తూంటే గులకరాళ్లు గలగల మంటున్నాయి. 

    చివరికి నగరం శివార్లలో ఉన్న ఒక చిన్న బస్తీలోకి అడుగు పెట్టాడు. ఆ బస్తీ మధ్యలో కమ్మరి ఇంకా రాత్రి ప్రొద్దుపోయాక కూడా తిత్తి వూదుతూ పనిచేసుకుంటున్నాడు.

    ఖైదీ గమనవేగం తగ్గింది. కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు కారుతున్నా, చేతి బేడీల బరువుతోనే పెద్దగా శ్వాస విడిచి రెండుమూడు ఇండ్లు దాటాడు.

    బస్తీలో చీకటి రాజ్యం చేస్తోంది. ఎక్కడా దీపాలు లేవు. ఈ బస్తీ నిజామాబాదు పొలిమేరల్లో దాదాపు మూడుమైళ్ల దూరంలో ఒక చిన్న కుగ్రామంలో ఉంది. ఉండి - ఉండి కమ్మరి సుత్తి ఇనుముపై పడిన దెబ్బ అక్కడా ఇక్కడా కుక్కలు బొఁయ్యీ మంటూ మొరుగుతున్న చప్పుడు మిగతా ఊరంతా ఒళ్లుమరచి నిద్రపోతూ ఉంది. ఖైదీ కదులుతున్న శబ్దం, బేడీ గొలుసుల కలకలం ఖైదీని ఆ చప్పుడు భయం తొందరగా నడవనివ్వడంలేదు.

    ఖైదీని చూడగానే ఒక కుక్క బొయ్యిమంది. అతను భయపడి గోడ ప్రక్కగా వత్తిగిల్లి నడుస్తున్నాడు. మెల్లిగా నడుస్తున్నతను చటుక్కున ఆడిపోయాడు. అతను నడుస్తున్న కొంచెం దూరంలో ఏదో అలికిడి అయ్యింది. ఖైదీ కండ్లు పెద్దవిచేసి చూశాడు. మూడు ఆకారాల నీడలు కదులుతున్నాయి. ఖైదీ గోడకి అంటుకపోయాడు. అతని కెదురుగా ఉన్న ఇంటి ముందు చేరుకున్నాయి - ఆ ఆకారాలు.

    ముగ్గురు ముసుగులు కప్పుకొని ఉన్నారు. చీకటి - రాత్రికి ప్రతినిధులవలె కనపడుతున్నారు. ముగ్గురు ఏదో గుసగుసలాడుకొని ఆ యింటి ముందు నిలబడ్డారు. 

    ఖైదీ వళ్లంతా వణుకుతూంటే ఈ ముగ్గురూ ఈ రాత్రి ఏంచేస్తున్నారిక్కడ అనుకుంటున్నాడు. ఇంట్లోకి కన్నం వేస్తారో? మరేం చేస్తారో?

    అంతలో ఆ ముగ్గురిలో ఇద్దరు గోడపై కెక్కి లోపలికి దూకారు. మూడోవాడు తలుపు దగ్గరే ఉండిపోయాడు. లోపల తలుపు తట్టిన చప్పుడు. అయిదు నిమిషాలు గడిచాయి.

    "ఎవరు?" అంది మరీ లోపలి కంఠం. 

    "నేనే రంగయ్యను! మామా తలుపు తీయి!" అన్న జవాబు. 

    తలుపు తీసిన శబ్దం. తీయగానే అతన్ని పట్టుకొని లాగినట్టు - ఆ మనిషి పెనుగులాడినట్టు చప్పుడు వినబడింది. అవతలి గోడ తలుపు తీశాడు ఒకడు వచ్చి. ఖైదీ మరీ దగ్గరగా చీకటిలో అతుకిపోయి చూస్తున్నాడు.

    అతనికి లోపలి దృశ్యం కనబడింది. నడివయస్సులో ఉన్న ఒక వ్యక్తి స్తంభానికి కట్టి వేయబడి యున్నాడు. కండ్లకు గంతలు కట్టబడి ఉన్నాయి.

    "చెప్పు మరి! ఆ భూమి పట్టా కాగితంపై దస్తకతు చేస్తావా లేదా?" అని ఒక కంఠం కర్కశంగా అడిగింది.

   "నేను ప్రాణం పోయినా చెయ్యను!" అన్నాడు తన్నుకులాడుతూ ఆ స్తంభానికి కట్టివేయబడిన వ్యక్తి. ఇంతలో ఈ మూడోమనిషి ఇంట్లోకి దూరి ఏమో గాలించాడు. కొద్దిసేపటికి డబ్బు, నగలు పట్టుకొచ్చాడు.

    "ముసలి ముండాకొడుకా చావు!" అని ఒకడు కత్తి పైకెత్తాడు. కత్తి తళుక్కుమంది. ఖైదీ గుండె గుభేలుమంది. అతనిలోని మానవుడు మేలుకున్నాడు. ఇతను తలుపు దగ్గరికి పోగానే అక్కడ ఎత్తిన కత్తి దూసుకు పోయింది.

    'అమ్మయ్యో!' అన్న గావుకేకతో విలవిలా తన్నుకుంటున్నాడు ముసలి మనిషి. ఒకడు ఇంతలో ఈ ఖైదీని చూసి 'ఎవడ్రా?' అన్నాడు. ఖైదీ గబుక్కున వెనుకకు మరలి పరుగుతీశాడు. వీళ్లు ముగ్గురూ "దొంగా - దొంగా - పట్టుకోండి" అని కేకలు వేస్తూ వెంటబడ్డారు. ఆ మధ్యరాత్రి చీకటిలో కేకలు మ్రోగుతున్నాయి. ఊరికుక్కలు అన్నీ ఒక్కమారే మొరగడం మొదలుపెట్టాయి. 

    ఖైదీ అనుకోకుండానే వూరవతల పాడుబడ్డ గుడిసెలోకి దూరాడు.

    ఇంతలో దూరంనుండి జీపుకారు వేగంగా వచ్చేస్తూవుంది. తరుముకొస్తున్న వ్యక్తులు ఆగిపోయారు. కారు వచ్చేసింది. కారు బ్రేకుల మోతతో ఆగిపోయింది. పోలీసులు బిలబిలా దిగారు. 

    ఈ ముగ్గురు తరుముకొస్తున్నవారిలో ఒకడు "ఒక దొంగ పరుగెత్తి పోతున్నాడండి. మా ఇంటి ప్రక్కనే ఒక ముసలివాణ్ణి చంపేసి పారిపోతున్నాడండి"

    ఇన్స్పెక్టరు దగ్గరగా వచ్చొ - "ఖైదీలాగా ఉన్నాడా?"

    "అవునండి. చేతికి బేడీలు కూడా ఉన్నాయి"

    "అయితే కారు ఎక్కండి. దొంగలు పారిపోయి వచ్చారు జైల్లోనుండి. అందులోవాడై ఉంటాడు. ఇటువేపేగా వెళ్లింది. ఇక్కడ చుట్టుప్రక్కల దొరికి పోతాడు" అన్నాడు ఇన్స్పెక్టరు. కారు మళ్లీ బయలుదేరింది.      
      
    ఖైదీ జాగ్రత్తగా గుడిసె నుండి బయటపడి మరోదిక్కుగా పరుగుతీశాడు. ఊర్లోవాళ్లంతా లేచి లేచి 'ఏమిటీ గొడవా' అంటూ వచ్చేస్తున్నారు.

    ఎటువైపో తెలియకుండా పారిపోతున్నాడు. ఖైదీ శరీరం పూర్తిగా అలసి నరాలు కదలనన్న లోపలి భయం ఈ మనుష్యులనుండి తప్పించుకోవాలనే కోరిక, అతన్ని పరుగుతీయిస్తున్నాయి.

    త్రోవలో ఆఖరికి పాతబడి శిథిలమైన మసీదు దగ్గరికి చేరుకున్నాడు. మనుష్య సంచారం అసలు లేదు. మసీదు ప్రక్కనుండి గబగబా వెళ్లిపోతున్నాడు. చేతికి ఉన్న గొలుసుల చప్పుడు - అతని కాళ్ల సవ్వడి, నోరు ఆపలేని శ్వాస ఎగబోత ఆ నిశ్శబ్దాన్ని లేపుతున్నాయి. 

    కుక్క 'కయ్యీ' మంటూ గోల చేసింది.

    "ఎవరు ఆ పరుగెత్తుతున్నది?" అని కేక వినబడింది మసీదు గోడలమధ్య నుండి.

    ఖైదీ ఎటూ పాలుపోక నిలబడిపోయాడు. చెమటలు మరీ జోరుగా కారుతున్నాయి. భయం, అలసట ముందడుగు వేయనీయలేదు. కుక్క దగ్గరిగా వచ్చి మొరుగుతూ అతన్ని నీళ్లు కార్పిస్తూ ఉంది.

    మసీదులో నుండి ఒక పొడుగాటి వ్యక్తి పెనుభూతంలో బయటికి వచ్చాడు. "ఏయ్! మోతి, ఇక్కడ్రా!" అని కుక్కను పిలిచాడు. అది కుయీ, కుయీ మంటూ కాళ్ల దగ్గరికి తోకాడిస్తూ వచ్చింది. 

    ఆ మనిషి ఖైదీని చూశాడు. దగ్గరా పోయాడు. ఖైదీ దూరంగా జరుగుతున్నాడు భయంతో.

    "భయపడొద్దు. నేనేం అనను. ఇలా దగ్గరికి రా!" చీకటిలో వెలుగులా బయల్పడుతున్న మాటలు ఖైదీని అనుకోకుండానే అతని దగ్గరికి నడిపించాయి. అతను అగ్గిపుల్ల గీసి ఆ వెలుగులో ఖైదీని చూశాడు. ఖైదీ ఆ మనిషిని, గుర్రుమంటున్న కుక్కను చూశాడు.

    ఖైదీ డస్సిపోయి వణుకుతున్న శరీరంతో బక్కపలుచగా ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. కండ్లు లోతుగా పాలిపోయి ఉన్నాయి. చారల నిక్కరు - షర్టుతో చేతికి ఉన్న బేడీలు, గొలుసులు ఇవ్వన్ని చూశాడు మనిషి.

    పెద్ద గడ్డం, మోకాళ్ల వరకు మాసి వ్రేలాడుతున్న లాల్చి, పెద్ద పెద్ద గళ్ల లుంగి, పెద్ద పెద్ద కండ్లు, మొటూగా మురికిగా ఉన్న వ్యక్తిని చూసుకున్నాడు ఖైదీ. ప్రక్కనే బక్కగా, పొడుగుగా సాగి డొక్కలు ఎండిన కుక్క తోక ఆడిస్తూవుంది.

    "ఎవరు నువ్వు? పారిపోతున్న ఖైదీవా?"

    "అవును!"

    "మహా గొప్ప పిరికిపని చేశావు! పేరేమిటి?"

    "సత్యం!"

    "అలా అయితే భయపడకుండా రా నాతో! ఈ మసీదులో నీలాంటి వాళ్లకి చోటుంది!" అంటూ దారితీశాడు ఆ గడ్డం మనిషి. సత్యం అతని వెనకాలే వెళ్లాడు. 

    మసీదులోపల పెద్ద లోగిలి. విశాలమైన స్థలం. గడ్డం మనిషి కూర్చున్నాడు. అతన్ని కూర్చోమన్నాడు.

    "ఎవరు నీవు? నీ పేరేమిటి?" కూర్చొంటూ అడుగాడు సత్యం.

    "ఒక మనిషినే! నా పేరు కావాలంటే ఏం చెప్పాలి ఫకీరు అంటారు అంతా!" అని మెల్లిగా హేళనతో నిండిన కంఠంతో జవాబిచ్చాడు.

    కొన్ని నిమిషాలపాటు నిశ్శబ్దం కుక్క మెల్లిగా వచ్చి ఫకీరు ప్రక్క డొక్కలు చాచుకొని పడుకుంది. అతనూ నడుం వాల్చాడు.

    సత్యం భయంగా - "ఏమయ్యా! నా ఈ బేడీలు విరగ్గొడతావా" అని అడిగాడు.

    "ఎందుకు? నీ బేడీలు విరగ్గొట్టి ఈ ప్రపంచమనే మహా పెద్ద జైల్లోకి పంపమంటావా నిన్ను వద్దు ఏమిటన్నావ్ - నీ పేరు? సత్యం కదూ! ఆఁ ఆపని నావల్లకాదు. అలానే పడుకో! అది సరేగాని - సెంట్రలు జైలునుండేనా రావడం? ఏమి నేరం చేశావు? ఎలా జైలుకి వెళ్లావు" అని అడగడం మొదలుపెట్టాడు ఫకీరు. 

    ఒక పెద్ద నిట్టూర్పు విడిచి సత్యం అలానే రాళ్లపై మేనువాల్చాడు - "ఏం చెప్పమంటావు! చేశాను. నేరం మహాఘోరం అనుకోకుండానే చేశాను. ఒకరిని బ్రతికించుకోవాలని - బాగా బ్రతకాలని, పరిస్థితులకు బానిసగా మారిపోయి చేశాను" ఆగిపోయాడు సత్యం చెపుతూ.

    "అది సరేగాని జైలునుండి ఎట్లా తప్పించుకొని రాగలిగావు? అది చెప్పు ముందు" అని అడిగాడు మధ్యలో ఫకీరు.

    "ఖైదీలమంతా కొన్ని నెలలనుండి వేసుకొన్న ప్లాను ఇదంతా. అందులో ముఖ్యంగా యావజ్జీవ కారాగారశిక్షను పొందుతున్నవారి దీ ఆలోచన. వారు మిగతా ఖైదీలను పురిగొల్పి ఒక దినం భోజనాల వేళ దొమ్మీ జరిపి తప్పించుకొందామని నిర్ణయించుకొని కావలసినవన్ని ఆలోచించి సిద్ధమయ్యారు. ఆఖరికి ఈనాడు మేమంతా దొమ్మీజరిపాము. చాలామంది తప్పించుకొని పరిగెత్తారు కాని ఎంతోమంది తుపాకీ కాల్పులకి గురి అయ్యారు. నేను మాత్రం మరి కొందరితో సహా తప్పించుకోగలిగాను. మేమంతా చెల్లాచెదురుగా పారిపోయాము..." సత్యం చెప్పుతూ ఆయాసంతో ఆగిపోయాడు. 

    ఇంతలో రాత్రి రెండుగంటలు. 'టంగు టంగు'మని దూరం నుండి జైలు గంటలు వినబడ్డాయి. 

    "మీ ఖైదీల దొమ్మీ అదుపులోకి వచ్చినట్టు ఉంది. అందుకే  మరి గంటలు మ్రోగుతున్నాయి యథాలాపంగా" చిన్నగా ఫకీరు నవ్వుతూ. మత్తుగా అన్నాడు - "అయితే ఏమిటన్నావ్ ఎందుకు వెళ్లావు జైలుకి?"

    నీరసంగా సత్యం ప్రారంభించాడు - "సంవత్సరం పిల్లవాణ్ణప్పుడే మా నాన్నగారు పోయారు. ఉన్న కాస్తా రెండెకరాల భూమిని మా మామ అన్యాయం చేసి భుక్తం చేసుకున్నాడు. ఏ దిక్కూ దివాణం లేకపోయేసరికి మా అమ్మ నన్ను తీసుకొని హైదరాబాద్ నగరం చేరుకుంది. అక్కాడా - ఇక్కడా పనిమనిషిగా చేరి నన్ను సాకుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. ఆమె నన్ను తన యాభై రూపాయల సంపాదనతో గారాబంగా పెంచింది. నేను ఏవిధంగానో కష్టపడి స్కూలు ఫైనలు ప్యాసయ్యాను. మా అమ్మ కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండేది. మొదట ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తామన్నారు. కాని ఒప్పుకోలేదు మా అమ్మ. అలాగే కాలం గడుస్తూ వచ్చింది. నేను అంతలోగా టైపు పరీక్ష ప్యాసయ్యాను. నాకు టైపిస్టు ఉద్యోగం ఎంతో ప్రయత్నించిన తర్వాత కుదిరింది." 

    ఫకీరు ఖణేలుమని దగ్గాడు. కుక్క చలికి 'కుయ్యి'మంటూ సణిగింది. 

    "నేను వద్దన్నా బలవంతంగా మా అమ్మ పెండ్లి చేసేసింది. అప్పటికి నాకు ఇరవైమూడు ఏండ్లు మా అమ్మకు కడుపునొప్పి ముదిరింది. ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేయంది లాభంలేదన్నారు. అమ్మ చివరికి 'సరే'నంది. ఆపరేషన్ మహా కష్టంపై జరిగింది. కడుపులో గడ్డ తీసేశారు. డాఖ్తర్లు హడావిడిగా పరుగెత్తారు కాని చివరకు రక్తం తగ్గిపోవడం వల్ల నన్ను విడిచి అమ్మ వెళ్లిపోయింది. ఆనాడ్ నాకు కన్నీరు కంటే ఇంకే ఆప్తబంధువు లభించలేదు"

    "రెండు సంవత్సరాల తర్వాత నా భార్య ప్రసవించే రోజులు వచ్చాయి. ఆమె బలహీనంగా ఉండేది. ఆసుపత్రికి పంపించేముందే నా హృదయం కంపించిపోయింది. టైపిస్టు ఉద్యోగం వల్ల వచ్చే జీతం నెల తిరగక ముందే నీళ్లలా ఇంకిపోయేది. పట్టణంలో బ్రతుకు డబ్బులేంది కుక్క కంటే అన్యాయం. భార్య సుఖంగా ఇంటికి తిరిగిరావాలనుకుంటే మందులకి డబ్బు కావాలి. నా చేతిలో చిల్లిగవ్వకూడా లేదు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించానేగాని నా ప్రాణంలోని ప్రాణం ఆమెను రక్షించుకోవాలని ప్రయత్నించింది. డాక్టర్లు చెప్పారు - 'చాలా బలహీనంగా వుంది. ఆమెకు తగిన మందులు లేంది లాభంలే'దన్నారు. అందువల్ల కనీసం నాకు ఉన్న భార్య ప్రాణం అయినా దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశాను. అప్పు కొరకు తిరిగాను. ఎవ్వరూ ఇవ్వలేదు"

    "ఆ రాత్రి నా భార్య మహా ఘోరంగా నొప్పులు పడుతూవుంది. ఇంకేం ఒక నిశ్చయానికి వచ్చేశాను."

    "ఆనాడు ఈనాడులాంటి రాత్రే. రాత్రి పన్నెండు దాటిన తరువాత బయలుదేరాను. వడ్డి వ్యాపారి సేఠ్ జగన్నాథ్ దాస్ బంగళా చేరుకున్నాను. మెల్లిగా ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి బంగళాపై అంతస్థుపైకి దిగాను. ఒక గదిలో ప్రవేశించాను. అక్కడే ఇనప్పెట్టె ఉంది. నాకీ గది బాగా తెలుసు. మా అమ్మ ముందు ఎప్పుడైనా వస్తువులు తాకట్టు పెట్టడానికి ఇక్కడికి వచ్చేది. ఆ గదిలోనే పడుకున్నాడు జగన్నాథ్ దాస్ కొడుకు. తాళంచెవులు తలగడక్రింది నుండి లాగాను. సేఠ్ కొడుకు మేలుకున్నాడు. నేను భయంతో బిర్రబిగిసిపోయాను. బలం కూడగట్టుకొని వాడు "చోర్ - చోర్" అని కేకలు వేస్తున్నా లెక్కచేయకుండా ఒక్కతాపు తన్నాను. క్రిందినుండి కుక్క మొరిగింది. వాచ్ మాన్, సేఠ్ పరిగెత్తుకొస్తున్నారు. తప్పించుకోడానికి వీలు లేకపోయింది. పట్టుబడ్డాను. సేఠ్ కొడుకు రక్తం కక్కి క్రింద పడివున్నాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. మరుసటిరోజు కోర్టులో హాజరు పరిచారు. అక్కడే అనుకుంటాను తెలిసింది నా భార్య ప్రసవించలేక ప్రాణాలు విడిచిందని. నాకున్న ప్రపంచం మునిగిపోయింది."

    "కోర్టులో హత్యాభియోగంపై నాకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. పదిహేను సంవత్సరాలు జైల్లో గడపమని న్యాయమూర్తులు నన్ను ఈ జైల్లోకి పంపించారు. పాతిక సంవత్సరాలు దాటుతున్న  నాటి నా యువజీవితం ముప్ఫై సంవత్సరాలు పడుతున్న ఈకాలంవరకు ఈ జైల్లో గడిపాను."

    ఫకీరు లేచి కూర్చున్నాడు. తన చుట్ట వెలిగించాడు. ఖాండ్రించి ఉమ్మివేశాడు.

    "జైలు జీవితం నరకయాతనగా ఉండేది. దినమంతా కాళ్లు చేతులు వూడిపోయేలా కాయకష్టం - చాలీచాలని తిండి నన్ను ఆ జీవితం అసహ్యుణ్ణి చేసింది. ఎలాగో అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. నాలాగే జైలు జీవితం గడుపుతున్న ఇతర ఖైదీలు ఆ జీవితంతో విసిగిపోయారు. ప్రపంచంపై కసితీర్చుకోవాలని మా ప్రయత్నం. ఒక నిశ్చయానికి వచ్చి ఈ దొమ్మీకి ఈరోజు ఇలా తలపడ్డాము. జైల్లోనుండి తప్పించుకొని పారిత్పోతూ ఇక్కడే దగ్గర్లో ఉన్న బస్తీలో అడుగుపెట్టాను. అక్కడ అర్థరాత్రి ముగ్గురు గొర్రెతోళ్లు కప్పుకొన్న తోడేళ్లలాంటి మనుష్యులు తోటి మానవుణ్ణి నిలువునా గొంతు కోసేస్తుంటే రక్షించాలని ముందుకురికాను. కాని రాక్షసులు నన్ను చూసి నాపై ఆ హత్య మోపుదామని 'దొంగ' అని తరిమారు. అక్కడి నుండి తప్పించుకొని ఇలా వచ్చాను. ఆ హత్య చూసి మనస్సులోని కాస్త ఆశా అడుగంటిపోయింది. అమాయకులైన మనుష్యులనే బ్రతుకనీయక పోతే - దొంగ హంతకుడనే ముద్రపడిన నన్ను ఈ మనుష్యులు తమ మధ్య బ్రతుకనిస్తారా?" సత్యం వణుకుతున్న కంఠంతో మాటాడ్డం మానుకున్నాడు.

    "బాగుంది! ఎందుకు బ్రతకనిస్తారు? ఏం లాభం నీవు దొమ్మీచేసి పరుగెత్తిరావడం. ఎక్కడికి పోతావిప్పుడు? ఎక్కడికి వెళ్లినా పోలీసులు మళ్లీ పట్టుకుపోతారు. నీవు చేసిన తప్పు గ్రహించలేదు ఆవేశంలో. జైలు ఒక చిన్న నరకకూపం. మరి అన్నిరోజులు ప్రత్యక్ష నరకాన్ని ఈ ప్రపంచంలో అనుభవించి మళ్ళీ ఎందుకొచ్చావు ఇందులోకే? టైపిస్టు ఉద్యోగం నీలో ప్రాణం ఉండేలా చేసింది. దానితో పాటు నీ కోరికలను ఆశయాలను మూలమట్టం చేసివేసింది. నీకు తెలుసు ఆ ఉద్యోగం వల్ల నీ జీవితం అలానే గడిచి పోయేదని. పరిస్థితులకి ఎదురుతిరిగి నిన్ను మరో విధంగా పైకి లేపుకుందామని ప్రయత్నించావు. నీకు తెలుసు ఈ ప్రపంచంలో ప్రతివాడు ఏదో విధంగా చాటు మాటుగా ఒక విధంగా దొంగతనంగానే బ్రతుకు వెళ్లబుచ్చుతున్నాడు. నీవు మాత్రం సఫలీకృతుడవు కాలేదు. అయినా సత్యం! ఏముంది జీవితంలో మనలాంటివాళ్లకి. నా విషయమే చూడు. ఒకప్పుడు మహా దనవంతుణ్ణి. సారా వ్యాపారం చేసేవాణ్ణి. భార్యా - బంధువులూ చాలా సజావుగా ఉండేది జీవితం. ప్రతివాడు సారాబట్టీ పెట్టేసరికి ప్రభుత్వం అరెస్టు చేయడం మొదలుపెట్టింది. నా వ్యాపారం దెబ్బతిని మా కుటుంబాన్ని చీల్చివేసింది. ఆ కథంతా ఎందుకు చెప్పమంటావు. నేను మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చేశాను. ప్రొద్దున, సాయంత్రం ఫకీరులా బిచ్చమెత్తుకోడం, డబ్బులు కూడబెట్టి నల్లమందు కొనుక్కోడం. ఈ కుక్క ఎక్కడి నుండో దారితప్పి వచ్చి నాతోనే ఉండిపోయింది. కుక్క - నేను బ్రతుకు లాక్కొస్తున్నాము. ఇంకేం ఉందని? ఏనాడో చచ్చిపోతాను, ఈ దగ్గు - గుండెనొప్పితో. బ్రతుకు అనవసరం. దానికో అర్థం లేదు. ఈ సంసార, సంఘం, చదువులు, మర్యాదలు అన్నీ చివరికి  శ్మశానానికి దారితీస్తాయి."

    "నేను బ్రతికాను పెద్ద ఎత్తుననే. నీవూ బ్రతికావు. టైపిస్టుగా జీవితం ఒకవిధంగా యాంత్రికంగా సాగిపోయింది. నీకు ఎదురుగా ఉన్న పరిస్థితులలో పడి కిమ్మనకుండా కొంతకాలం కొట్టుకపోయావ్. నేనూ అంతే. ఈ మనుష్యులూ అంతే. అంతకంటే పెద్ద విశేషమేమీ లేదు" అంటూ శ్వాసపీల్చి పెద్దగా దగ్గాడు ఫకీరు. 

    సత్యం దూరంనుండి మాట్లాడినట్టు మెల్లిగా అన్నాడు - "అయితే ఏంచేద్దాం? మనకి దారి ఏది? అదృష్టం చెప్పుచేతల్లో  కీలుబొమ్మలా బ్రతికేకంటే చేసేదేముంది ఈలోకంలో. నాకు తెలుసు నేను మళ్లీ పట్టుబడొచ్చు. ఈసారి మరణశిక్ష విధిస్తారు. అంతకంటే ఏముంది. ఇక్కడ త్రిశంకుస్వర్గంలాంటి భూమి. అక్కడ కొనవూపిరితో ప్రాణం పీల్చుకొనే జైలు. నేను చచ్చినా -నీవు చచ్చినా సానుభూతి చూపేవాడు ఎవ్వడూ ఉండడు. పైగా పనికిరానివారు చచ్చేరులే అని ఈసడించుకుంటుంది లోకం. అందుకే నీకేమి దారితోస్తుందో చెప్పు?"

    అప్పుడే మూడు గంటలు వినబడ్డాయి.

    ఏదో దీర్ఘ ఆలోచననుండి తేరుకుని ఫకీరు అన్నాడు - "అవును సత్యం! జీవితం నిరర్థకం. ఇక్కడ ఏ అభివృద్ధి పథకాలైనా బ్రతకనేర్చినవాడి కొరకే ఉపయోగపడతాయి కాని నాకు - నీకూ కాదు. బ్రతుకు చేతుల్లో ఓడిపోయాం. అందుకే ఈ సంఘం మనకి ఆశ్రయం ఇవ్వదు. నాకో ఆలోచన తట్టింది. ఇన్నిరోజులనుండి అనుకున్నటువంటిది. ఈనాడు నాకు నీవు జతగా దొరికావు"

    "ఏమిటది. తొందరగా చెప్పు!" అన్ని ఆశ - ఆతృతతో అడిగాడు సత్యం.

    "ఏమిలేదు. నాదగ్గర నల్లమందు ఉంది. మోతాదు మించి వేసుకుందాం. మత్తుగా రాయివలె పడిపోయి ప్రాణాలు వదలివేయొచ్చు. నీకు తెలుసు - నాకు తెలుసు మనకి ఆశ ఏ కోశానా లేదని. మరి ఇంకెందుకు బ్రతికి. ఏమంటావు?"

    సత్యం మూలిగాడు. ఫకీరు నల్లమందు తయారు చేస్తున్నాడు. దూరంనుండి ఎక్కడో కోడి కూసింది. 

(ఆంధ్ర సచిత్ర వారపత్రిక 23 ఆగష్టు 1981 సంచికలో ప్రచురితం) 
Comments