నిరవధిక నిరీక్షణ - తాడిగిరి పోతరాజు

    డొంకలో తీతువు కూస్తోంది.

    ఒంటరి తీతువు నిర్విరామంగా అరుస్తోంది 'ఉత్తతీత...ఉత్తతీత' అంటూ తంగేడు పొదల్లోంచి. డొంకపై పసుపుపచ్చగా పూసిన తంగేళ్లు.

    'అబ్బ...' ముందుకి వంగి కాలి బొటనివేలుకు గుచ్చుకున్న గాజుపెంకు లాగేసుకున్నాడు. పక్కనే బొమ్మజెముడు చెట్లు మొండిచేతుల్లా ముళ్లతో కూడిన వాటి ఆకులు. వాటి మొదట్లో పగిలిన కుండపెంకులు, పగిలిపోయిన సీసా ముక్కలు వికృతంగా. వర్షం కురిసి ఆగిపోవడం వలన ఆ పోద్లనుంచి నీరు సన్నగా జాలులా డొంకలోకి దిగుతోంది. చేతికి అంటిన రక్తాన్ని ఆ వరదనీటిలోనే కడుక్కుని చంకలో ఉత్తరాల కట్ట సర్దుకొని జాగ్రత్తగా చూసుకొంటూ అడుగులు వేస్తూ మెల్లమెల్లగా డొంకపైకి ఎక్కాడు.

    గూడెంలో గుడిసెలు, వాటి ముందు తచ్చాడుతూన్న మనుషులు. శుభ్రంగా ఆరిన మెరక స్థలాల్లో పశువులను కట్టివేసి ఎండుగడ్డి పరకలు విసురుతున్నారు. 

    ఆ బాటకు, సందుగొందులకు అలవాటుపడిన అతని పాదాలు మెల్లగా నడిచి ఆ ఇంటిముందు ఆగిపోయాయి.

    "అవ్వా!" భయంభయంగా పిలిచిన పిలుపు గొంతులోనే ఆగిపోయింది.

    "అవ్వా..." కొంచెం బిగ్గరగా పిలిచాడు.

    నిర్జనంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటిలోకి తొంగి చూశాడు.

    లోపల కట్టెల పొయ్యిముందు ముసలమ్మ. పొయ్యిమీద మంగలం. పక్కనే చేటలో నారింజరంగులో మెరుస్తూన్న రాళ్లలాంటి మొక్కజొన్నలు. మొక్కజొన్నలు చిటచిట వేగూతూన్న శబ్దం.

    "ఎవల్లులా" వేగిన మొక్కజొన్న పేలాలను రాతివెండి పళ్లెంలో కుమ్మరించి బయటికి చూసింది తేరిపార అరచేతిని కళ్లపై అడ్డం పెట్టుకుని.

    చేతిలో టెలిగ్రామ్ వేళ్లమధ్య కంపిస్తోంది.

    రెండు ఎర్రగీతల మధ్య అంటించిన ఇంగ్లీషు అక్షరాలు. మళ్లీ మళ్లీ చదువుతున్నాయి అతని కళ్లు. ఎన్నిసారు చదివినా అర్థం మారని అక్షరాలు.

    'Presumed to be dead'

    'ప్రిజ్యూమ్‌డ్ టు భి డెడ్...' ఆ మాటలో అర్థాన్ని, భావాన్ని మస్తిష్కం డీకోడ్ చేసిపెట్టింది. అక్షరాలలో భద్రపరచబడిన సత్యం, ఇంగ్లీషు మాటలలోని వర్తమానం... అతని మనసు తట్టుకోలేకపోతోంది.

    "బుచ్చిరాములు దగ్గరనుండి ఉత్తరం అచ్చింది"

    "కొడుకా! నీ బాంచను. ఎంత సల్లటి కబురు సెప్పినవు పొద్దుపొద్దుగాల్నే... ఏందీ మతలబు?"

    "బుచ్చి... రాములు..." మాటలు పూర్తిచెయ్యలేక గుటకలు మింగసాగాడు. "మంచిగున్నడా?" ముసలమ్మ పూర్తి చేసింది ప్రశ్నతో. అతని కనుపాపలచుట్టూ వలయాకారంగా కన్నీళ్లు ఉబుకుతున్నాయి. చూపు పక్కకు మరల్చుకున్నాడు.
 
    ఇంటిముందు వానకు తడిసి మునగడ తీసికొన్న పిచ్చి తుమ్మ చెట్టు. వాన వెలిసినా ఆకుల పైనుండి టపటపమంటూ నీళ్లు రాలి పడుతున్నాయి. అవి పడ్తున్న చోట గుండ్రంగా రంధ్రాలు. రంధ్రాలపై అతని చూపులు నిలిచిపొయ్యాయి.

    "చప్పుడు సెయ్యవేందిరా?... ఉత్తరం సదివినోడివి...ఘట్టానే రవుతులెక్క నిలబడిపోతివి... ఆడు మంచిగ ఉన్నాడా? బతికే వున్నాడా? అసహనంతో కూడిన ప్రశ్నలు మాతృహృదయం నుండి.

    "ఆ...ఆ... బతికే వున్నాడు. ఇగో... ఉత్తరం సదివించుకొంటావా?" టెలిగ్రామ్ అందివ్వబోయాడు. కొడుకుకోసం ఎదురు చూస్తూ అలసిపోయిన కనుగుడ్లు కొత్తకాంతులతో తళతళా మెరిశాయి.

    "ఉత్తరం నువ్వే సదువు... నీదగ్గరే దాచిపెట్టుకో పాత ఉత్తరాలతో పాటు. సదివేవాల్లు ఎవరున్నారు మన ఊళ్లో...అందులో అది అంగ్రేజిలో ఉందంటివి. సదివినాక మళ్లీ తిరుగు సమాధానం రాసి పెడ్దువుగోని"

    చేతిలో ఉన్న టెలిగ్రామ్‌ను జబ్బకు వేలాడుతున్న సంచిలో కుక్కాడు.

    "చెల్లెమ్మ ఏది? కనబడదు"

    "పట్వారి ఇంటికి పోయింది. దొరవారు పండుగకు బిడ్డలను తోలకొచ్చిండు. బిడ్డలకు మనమరాళ్ళకు కొత్తబట్టలు కూట్టిస్తాండు. పొద్దున సుంకరోడొచ్చి చెప్పిపోయిండు రమ్మని. కోడలు అటు... నీవిటు... అంతే తేడా. ఈ వానకు డొంకంతా బురద బురదగా ఉందని ఒక్కడుగు దూరమైనా మంచి బాటన నడవాలని ఊళ్లోకెళ్లి నడిచినట్టుంది."

    మూలకున్న కుట్టుమిషన్. దాని చుట్టూ కత్తిరించిన కొత్త గుడ్డల పీలికలు. కుట్టిన రవికలు ఒకవైపు, కత్తిరించిన ముక్కలు మరొకవైపు పొందికగా అమర్చివున్నాయి.

    "అల్లుడేడి? సురేష్‌ని ఎటుపంపినావ్? ఈ ముసురులో?"

    "నేను పంపిత్తానా? వాడు నేను వద్దంటే ఉంటాడా? మన ఊరు చెరువు మత్తడి పారతాందంట. చిన్న పోరగాళ్లందరూ చేపలు పడ్తామని తువ్వాలలు అందుకొని ఉరికిపోయిన్రు."

    "మంచిది. ఇంకా ఉత్తరాలు ఇయ్యాల్సినవి చాలా ఉన్నాయి. కట్టకింద పల్లెకు పోయి వచ్చేప్పుడు చదివి వినిపిస్తా...మరి నేను నడత్తన్నా"

    "వండుకొన్నవా బిడ్డా? ఈ ముసురుకు కట్టెలు మండక ఊది ఊది ఊపిరెల్లిపోయింది నాకు. అందరూ తిన్నాక వచ్చినవు...తినకముందయితే మాతోపాటు ఒక బుక్క తినేటోడివి...బిడ్డా పేలాలయినా బుక్కు. టయిము లేకపోతే జేబులో పోసికొని తినుకుంటూ పో... నిలబడు... పోమాకు...జర్ర ఆగు" ఇంట్లోకి నడిచింది పేలాలకోసం.

    పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బురద కొట్టుకుంటున్న ప్యాంటును పట్టించుకోకుండా దయ్యం పట్టినవాడిలా ఊగుతూ పెద్దపెద్ద అంగలు వేస్తూ డొంకకేసి నడిచాడు.

    ఉత్తరాల డెలివరీ పూర్తయ్యాక ఇంటికొచ్చి గోళెం వద్ద కాళ్లు శుభ్రంగా కడుక్కున్నాడు. కడుక్కున్నప్పుడు బొటనవేలి గాయం మళ్లీ రక్తం కారసాగింది. పాత బనీను చింపి ఒక పీలిక దాని చుట్టు పట్టీగా చుట్టసాగాడు కిటికీలో కాలు ఎత్తిపెట్టి.

    "అన్నా... వచ్చినవే" బయట పిలుపు.

    ఇరవై అయిదేళ్ల పైబడిన స్త్రీ భుజాలమీదుగా కప్పుకున్న చీరెకొంగు. శుభ్రంగా దువ్విన తల. నోసట మామిడి చిగురు తిలకం గుండ్రంగా ఉదయిస్తున్న సూర్యబింబంలా. పాపిట్లో కుముమరేఖ... గోచిపొసుకున్న వంకాయరంగు చీరె... ఆమె ఎడమచేతి వేలు పట్టుకుని కొడుకు సురేష్. ఆమె కుడివైపున నిలబడిన అత్త కొమరమ్మ.

    వాళ్లని చూడగానే అతని ముఖం వివర్ణమైపోయింది. కానీ తమాయించుకొని ముఖంలో చిరునవ్వు తెచ్చిపెట్టికొని "రా చెల్లీ...ఈ బురదలో రాకపోతే ఏం పోయింది. సాయంత్రం నేను ఎటు తిరిగి వచ్చేవాడిని కదా?" వాళ్ల ముఖాల్లోకి సూటిగా చూడలేక, అటూ ఇటూ దిక్కులు చూస్తూ అన్నాడు.

    "అవుననుకో..." కొడుకు భుజం తడ్తూ "ఈడి బాపు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే మనసు ఉండబట్టలేక వచ్చినమన్నా. ఏదా ఉత్తరం? జర్ర సదివి ఇనిపించు" ముసి ముసి నవ్వులతో మెలికలు తిరిగిపోయింది.

    గళ్లలుంగీ సర్దుకొని స్టూలుపై కూర్చున్నాడు ప్రశాంతంగా. దళసరిగా ఇంతలావున్న అద్దాలుగల నల్లని ఫ్రేమున్న కళ్లజోడు ముక్కుపైకి ఎక్కింది. గోడ పక్కన మాసిన ఈతాకుల చాప చిరుగులతో. దానిపై కూలబడ్డారు అత్తాకోడళ్లిద్దరూ - బురదకాళ్లు చాప పక్కన పెట్టి.

    అల్లుడ్ని తొడలపైకి లాక్కున్నాడు ముద్దుచేస్తూ. వాణ్ణి పొదివి పట్టుకుంది ఎడంచెయ్యి. కుడిచేతితో ఉత్తరంవిప్పి చదవ సాగాడు.

లాహోర్
13-12-1975

    తల్లి కొమరమ్మకు కుమార్డు బుచ్చిరాములు పదివేల దండములతో వ్రాయునది ఏమనా!

    అవ్వా!

        ఇక్కడ చిక్కుబడిపోయిన బందీలందరినీ మన దేశానికి అప్పగించడానికి పాకిస్థానీ ప్రభుత్వం అంగీకరించింది.మనదేశం కూడా పాకీస్థానీ ఖైదీలను ఇడిసిపెట్టటానికి ఒప్పుకున్నదంట. బదులుకు బదులు. కాబట్టి నేను ఇంటికి రావడం ఇక రోజుల్లో పని. సురేష్ బడికి పోతాండంటే నాకు చాలా సంబరంగా ఉంది. భూదేవిని ఎక్కువగా గొడ్డుచాకిరీ చెయ్యవద్దని చెప్పు. నీ కళ్లలో చెక్కడాలు డాక్టర్లకు చూపించుకో రాజన్నతో పోయి. మొదలు ఒక కన్ను మాత్రమే ఆపరేషన్ చేయించ్కో. దానికి సూపు వచ్చినాంక రెండో కన్ను చేయించుకో. రాజన్నను అడిగినట్లు చెప్పు. మన సుట్టాలందరికీ నా దండాలు

ఇట్లు
కుమార్డు
ఇల్లిందల బుచ్చిరాములు.  

      పెదవులు సన్నగా ఒణుకుతున్నా నిగ్రహించుకుని మెల్లగా, గంభీరంగా ఎటువంటి తడబాటు లేకుండా చదివి ముగించాడు. ఆకాశంలో పట్టిన మబ్బులు విడిపోయినయి. సూర్యుడు తొంగిచూసి నీరెండ పడుతోంది భూమ్మీద.

    "ఎంత సల్లని కబురు...అదురుష్ట జాతకం ఈడిది" దిగ్గున లేచి మనవడి బుగ్గలు నిమిరి తలలో మెటికలు విరుచుకొంది కొమరమ్మ.

    "పొద్దుగాల ఇంటికాడ అంగ్రేజీలో వచ్చింది ఉత్తరం సదివించుకోమని బెదరగోడితేందివిరా?" మామూలుగా అడిగింది. దానికి అతడు పకపకా నవ్వుతూ,

    "ఉత్తరాలు ఒకటా, రెండా బొచ్చెడు. ఇంగ్లీషులో కొమరయ్య అని రాసుంటే తొందరలో కొమరమ్మని సదువుకొన్నా. అది కట్టకిందిపల్లెలో కొమరయ్యలేడూ ఆయనిది."

    "అయితే తురకోళ్ల రాజ్జెంలో ఉన్నాడన్నమాట" తనలో తాను అనుకోసాగింది కొమరమ్మ.

    "ఈడికి యాడాదిన్నర ఈడప్పుడు ఒకసారి సర్కార్ తప్పిపోయిండని టెలిగ్రామ్ ఇచ్చింది యాద్‌కున్నదన్నా?" భూదేవి మబ్బులవంక చూస్తూ మాట్లాడుకోసాగింది.

    "అవ్... అవ్...ఆ టెలిగ్రామ్ దాసినగదా?" వంత పలికాడు అతను.

    "అప్పటి సంది నాకు గట్టి నమ్మకం ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని. పాకిస్థాన్ తురకల దేశంలో ఉన్నాడన్న మాట. బతికుంటే ఇక లేనిదేముందన్నా? ఎప్పటికైనా ఇల్లు సేరనివ్వు. రంధి పడేపనే లేదు" సంతోషంగా చేతులు తిప్పుతూ వివరించసాగింది.

    కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడకుండ మౌనంగా కూర్చున్నారు ఆలోచిస్తూ. అంతలోపే బొంగురుపోయిన కంఠంతో

    "కానీ అన్నా! అమ్మలక్కలందరూ కాకుల్లా పొడిసినట్టు పొడిసి సంపుతున్నారు ’ఇంకా నీకా బొట్టెందుకు? గాజులెందుకు?’ అని. ’లేదు... సూసికోండి. ఎప్పుడైనా తిరిగొత్తాడం’టే ’నీ ముఖం’ అంటూ ఏడిపిస్తున్నారు" కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

    "లోకులు కాకులని ఉట్టిగనే అనలేదు మన పెద్దమనుషులు. మగవాళ్లే లంగనుకొంటె ఆడవాళ్లు పది ఆకులు ఎక్కువే సదివారు. వాళ్లు ఇంకా లంగలు. ఏడిసేవాళ్లను ఇంకా ఎడిపిస్తేనే వాళ్లకు సంబరం. అది సరేగానీ పండగ ఇంకా వారంరోజులే ఉంది. దొరలబిడ్డల గుడ్డలు నాజూగ్గా, తీరుతీరుగా కుట్టు. వాళ్లసలే పట్నపోళ్లు. అన్నిటికీ వంకలు పెడతారు. దొర సంగతి తెలుసుగా. ఉబ్బులింగడు. నీ పని ఆయనకు నచ్చిందంటే సరి. నెత్తిన బెట్టుకొని ఊరేగుతాడు. ఇక ఊళ్లో గిరాకీ అంతా మనదేననుకో" ఆమె దృష్టి భర్త ప్రస్తావన నుండి మరల్చటానికి ప్రయత్నిస్తూ టాపిక్ పెడదారి పట్టించాడు.

    "అవునే అన్నా! దొరసానుల గుడ్డలు మిషన్‌మీదపెట్టి నీకాడికి ఉరికొచ్చినా! కొత్త ముచ్చట ఏమిసెబుతావో అని. అత్తా పోదామా?" అంది అత్తవంక తిరిగి.

    "బర్రెకు మేత ఏసి వచ్చిన. నాకేమీ పని లేదు. నువ్వు ఆడ్ని తీసుకొని నడువు. నేను ముత్యమంతసేపు కూర్చొని వత్తా. అరికాళ్లలో ఒకటే మంటలు పోట్లూ" అంటూ గోడకు చేరగిలబడింది అరికాళ్లు ఒత్తుకుంటూ.

    కోడలు, మనుమడు వీధి మలుపు తిరిగేవరకు వాళ్లను ఓ కంట కనిపెట్టి

    "రాజన్నా..." అని  పిలిచి ముందుకు వంగి గొంతు తగ్గించుకొని అంది రహస్యం చెబుతున్నట్టుగా.

    "కోడలు భూదేవిని సూత్తావుంటే గుండె తరుక్కుపోతోంది. ఇంత వయస్సులో ఉన్నా పరాయి మగాడివంక కన్నెత్తి సూడదు. దాని పనేమో, అదేమో. నిప్పులాంటి మనిషి. ఇంకొకతి ఇంకొకతైతే ఆడు పోయిన ఆరునెలలకే మారుమనుం పోవు. బిడ్డా నీవు ఎట్టైన బుచ్చిరాములు జాడ తెలుసుకో. ఏ జైల్లో ఉన్నాడో? కన్న కొడుకుని కంటితో సూడటానికి కూడా నోచుకోలేదు ఆడు" అంటూ చెంగుతో కళ్లు ఒత్తుకోసాగింది.

    "ఊకో...ఊకో అవ్వా! మన సేతుల్లో ఏముంది సెప్పు. పెద్దదానివి నువ్వే అంత బెంగటిల్లితే ఎట్లా?' అనునయించాడు.

    "గంతే గంతే... ఎవరికి ఎట్టా రాసిపెట్టి వుందో అట్టవుతది. రాతమారవటం ఎవడి చేతవుతది? బిడ్డా... పొద్దుగాల మక్క పేలాలు బుక్కకుండా అలిగినట్టు ఉరికిపోయితివి. ఇగ్గో పేలాలు. నా మనువడి కంట్లో పడితే అన్నీ బుక్కు" అంటూ చీరచెంగుకు కట్టుకున్న ముడి విప్పింది. 

    ఆ మాతృమూర్తి ప్రేమానురాగాలకు చిహ్నంగా తెల్లని పూవులాంటి పేలాలు. అనిర్వచనీయమైన ఆనందం ఆవహించింది. అన్ని అందాలకు మించిన ఆనందం 'తల్లి ప్రేమ' అన్న అనుభూతితో కృతజ్ఞతతో అతని హృదయం ఆమె ముందు మోకరిల్లింది.

* * *

    నులకమంచంపై పరచిన జంబుఖానా ముడతలు సర్దుకుని వెల్లకిలా పడుకున్నాడు ఆలోచనలతో సతమతమౌతూ. గోడకు వేలాడుతోంది ఫోటో. తాను, బుచ్చిరాములు దిగిన ఫోటో. 'షేక్ హేండ్స్' తీసికొంటున్న భంగిమలో తామిద్దరూ. ఇన్‌షర్టు వేసుకొని, బెల్టు పెట్టుకున్న అతను, తాను. లేచి ఆ ఫోటో తీసుకొని దానివంక చూడసాగాడు. అంతూపొంతూ లేని ఆలోచనలు,జ్ఞాపకాలు నెమరు వేసుకోసాగింది మనసు.

    అది పాకిస్థాన్ సరిహద్దుల్లో పోరాటం ప్రారంభమైన రోజులు. భారతభూభాగంలోకి చొచ్చుకువస్తూన్న శత్రుసైన్యాలు, వాటిని అణచివెయ్యటానికి భారత సైన్యాల మొహరింపు జరిగిన అప్పటి రోజులు.

    బుచ్చిరాములు అధికార్ల ఆజ్ఞలను శిరసావహించి మాతృదేశ రక్షణకై తన సెలవు రద్దు చేసుకుని మళ్ళీ సైన్యంలోకి వెళ్లిపోతున్న రోజు. ఆనాడు గూడెమంతా పనుల్లోకి పోకుండా అతనితో గడిపారు. అతను కూడా ఎన్నాళ్లకెన్నాళ్లకో అన్నట్టు తనచుట్టూ ఉన్న స్వీయ పరిజనాన్ని దిగులుగా చూశాడు.

    పేదరికంతో మగ్గుతూన్న మనుషులు. నూనెలేని రాగి రంగు తలలు. ఎండకు ఎండీ సన్నగా పగుళ్లు బారిన ముఖాలు. చాకిరి చేసి చేసి మోటుగా బండబారిన చేతులు. వాళ్లతో సహజీవనం చేసే బక్కచిక్కిన ఎద్దులు మూగజీవులు.

    "మిలటరీలో పని తక్కువ సుకం ఎక్క్వంటారు...అవ్?" అడిగారొకరు.

    "అది తప్పు. చలిలో, ఎండలో, వర్షంలో బందూక్ భుజానికి తగిలించుకొని గస్తీ తిరగాలి. కొండలమీద, గుట్టలమీద తొండల్లా పాకాలి. మోకాళ్ల చిప్పలు కొట్టుకుపొయ్యేలా మోకాళ్లపై దేకాలి. అంతా నరకయాతన. ఇక ఎక్కడైనా చిన్న తప్పు జరిగిందో హవల్దార్‌నుండి లెఫ్టినెంట్ వరకూ బండబూతులు తిడతారు. నోరు విప్పటానికి లేదు."

    "తిట్లు ఓర్సుకుంటే తప్పేముందిలే తిన్నంత తిండి పెట్టినప్పుడు. కడుపు కాలే కదా నువ్వు మిలట్రీలో చేరింది."

    "అది ముమ్మాటికీ నిజం. ఆకలి రాక్షసి లాంటిది. ఆకలికోసం మనిషి అన్ని అవమానాలనూ భరిస్తాడు."

    "ముచ్చట్లల్లో బడి టైం మరిసిపోయినట్లుంది. ఇక బయల్దేరవద్దా?" తానన్నాడు.

    బుచ్చిరాములు ముంజేతిని తిప్పి టైమ్ చూసుకొన్నాడు.

    "అవ్...మూడవుతోంది. ఇక బయల్దేరాలి. లేటయితే ట్రెయిన్ మిస్సవుతుంది. ముందు మన ఊరి బస్సు దొరకాలిగదా?" అంటూ మంచం పట్టెపై కూర్చుని మేజోళ్లు దులుపుకొని పాదాలు వాట్ల్లోకి దూర్చుకుంటూ వాకిలి వైపు చూశాడు. భార్య భూదేవి తలుపు రెక్కకు ఆనుకొని అతనివైపు చూస్తోంది ఎర్రబడ్డ కళ్లతో. అంతమందిలో ఏం మాట్లాడాలో తెలియక అమాయకంగా తన వంక చూస్తోంది. తల్లి కొమరమ్మ వాకిలి చేరగిలాబడి ముక్కు చీదుకొంటోంది. 

    కాళ్లకు బూట్లు తగిలించుకొని, నిటారుగా నిలబడి "నేను పోతన్నా" అంటూ అందరికీ దణ్ణం పెట్టాడు.

    "మళ్ళీ తిరిగి రాకడ ఎన్నాళ్లకు?" 

    "ఇంకా అయిదేళ్లకు. మొత్తానికే డిస్చార్జ్ అయి వస్తా. యక్స్ సర్వీస్ మాన్‌గా నాకు ఇక్కడ ఏ గవర్నమెంటు ఆఫీసులోనో, బ్యాంక్‌లోనో కొలువు దొరుకుతుంది" అంటూ అందరికీ చెప్పుకుంటూ పక్కకి తిరిగి భార్య వంక చూశాడు. 

    జలజలా బుగ్గలపై కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ చెయ్యి ఊపింది.

    "అవ్వా... నేపోతన్నా" అన్నాడు తల్ల్లిని ఉద్దేశించి.

    "అదేం మాటరా...  పోయి వత్తా అనాలి. అపశకునపు మాటలు అనకూడదు. పోయిరా... ఒంట్లో బలముందికదా అని ఉరికురికి యుద్ధం సెయ్యకు. పొద్దుగాల్నే లేసి బగమంతునికి దణ్ణం పెట్టుకో."

    తల్లి కాళ్లు మొక్కి పైకి లేచి సూట్‌కేస్ అందుకోబోయాడు.

    "నేనున్నాగా బుచ్చన్నా" తాను సూట్‌కేస్ అందుకున్నాడు.

    ఇంకొక మిత్రుడు ఎయిర్‌బ్యాగ్ భుజానికి తగిలించుకున్నాడు. మరొక సారి భార్యను కళ్లతో పలకరించి చెయ్యి వూపి ముందుకు కదిలాడు.

    అతని వెనుక మెల్లగా కదిలిన మిగిలిన పాదాలు.

    బుస,బుస పొంగివస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణచుకుంటున్న నిట్టూర్పులు. 

    "బుచ్చన్నా! ఇగ ఉంటాం. నీకు కాలు సాగదు మేం నీ వెంట వస్తే" ఆగిపొయ్యారు.

    చకచకా నడుస్తూ, ఎండిపోయిన వాగులూ వంకలూ దాటారు. పద సవ్వడికి చేలల్లో గింజలు ఏరుకు తింటున్న పరిగపిట్టలు రివ్వున ఎగిరిపోయాయి. డొంకలో ఇసుకరేణువులు ఎండకు మిలమిలా మెరుస్తున్నాయి. వడగాలి గుండ్రంగా సుళ్లు తిరుగుతూ దుమ్మూ, ధూళి కళ్లలో జల్లి పోసాగింది. బట్టలు దులుపుకుంటూ డొంకబారుకు నడిచారు. 

    డొంకలో మేఘంలా ఎర్రదుమ్ము. పక్కకు జరిగారు.

    ఎండి నెర్రెలు కొట్టిన చేలల్లో పచ్చని గడ్డికోసం, ఎండుపరకలకోసం పగలంతా వెతికి వెతికి ఈసురోమంటూ వెనుతిరిగి వస్తున్న బర్రెలమంద. తోకలతో జోరీగలు తోలుకుంటూ, గిట్టలతో దుమ్ము రేపుకుంటూ వస్తున్నాయి. వాటి వెనుక, అడీ...అడీ అనుకుంటూ దుమ్ములో దుమ్మయిన గొడ్లకాడి చిన్నపోరగాళ్లు.

    "అన్నా...బుచ్చన్నా...పోతన్నవా?... నమత్తే...నమత్తే" అంటూ సెల్యూట్ చేశారు తమ అర్చేతులను చెవులకు ఆన్చుకొని.

    "నమస్తే...నమస్తే" అంటూ వాళ్ల వీపులు నిమిరాడు బుచ్చిరాములు చెమర్చిన కళ్లను తుడుచుకంటూ.

    నాలుగు ఊళ్ల కూడలి. జంట మామిళ్లు. ఆ స్టేజివద్ద బస్సు రెడీగా వుంది.

    "వస్తా రాజన్నా" అంటూ చేతులు కలిపి తనను గట్టిగా కౌగిలించుకున్నాడు భుజం భుజం మారుస్తూ తనను మూడుసార్లు గుండెలకు హత్తుకొని వీపు నిమురుతూ. 

    "రాజన్నా! పెళ్లి చేసుకొని నేను చాలా పొరపాటు చేశాను జీవితంలో. యుద్ధంలో నాకేదైనా కీడు మూడితే దాని గతి ఏంకావాలి? అక్కడ నేను కన్నుమూస్తే వళ్లు గుండెలు పగిలి చస్తారు...వాళ్లకు నువ్వే దిక్కు" అన్నాడు. 

    అదే ఆఖరి మాటలు...అదే ఆఖరి చూపు. ఆ మాటలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతున్నాయి. అవేదనాభరితమైన చూపులు తనను ఇంకా వెన్నాడుతున్నాయి. కనుకొలకుల నుండి జారిన కన్నీటి చుక్కలు చెవుల్లో ఇంకిపోసాగాయి. ఫోటోను గుండెలపై పెట్టుకొని మెల్లగా మగత నిద్రలోకి జారుకున్నాడు. 

* * *

    కాలం ముందుకి సాగిపోతోంది.

    అమాయకత్వానికి, అజ్ఞానానికి ప్రతీకలైన గ్రామాలలో విజ్ఞానపు కొత్త చిగుళ్లు. పగలు పోలీసులు, రాత్రిళ్లు అన్నలతో సతమతమౌతున్న రోజులు. అన్నల ఆచూకీ తెలుపమని, వాళ్లకి అన్నం పెట్టకూడదని పోలీసులు శాసిస్తున్న రోజులు. అర్థరాత్రివేళ పోలీసు వాహనాలు యువకులను లేపి తరలించుకు పోతున్న కాలం. తల్లిదండ్రులు యువకులైన తన పిల్లలను కడుపులో పెట్టుకొని దాచుకుంటున్న దుర్దినాలు.

    ఆ రోజుల్లో ఒక రోజు...

    చలికాలం గుట్టపై ఆకులులేని మోదుగు చెట్లు ఎర్రెర్రని పువ్వులతో కళకళలాడుతూన్న ఉదయం. పొద్దు నాల్గు బారలెక్కింది. చిన్న పిల్లలు చలిమంటలవద్ద ఇంకా అరజేతులను వేడిచేసుకుంటున్నారు. సురేష్ రెక్క బట్టుకొని రాజన్న ఇంటికి బడబడా గుంజుకొచ్చింది తల్లి. 

    కటికనేలపై పొద్దుకు ఎదురుగా చంకలు లేని బనియన్‌పై రాజన్న కూర్చున్నాడు. స్టూలు మీద అద్దం. ముఖం నిండా తెల్లని సబ్బు. చేతిలో ప్లాస్టిక్ రేజర్. గీచిన చెంపపై స్పోటకపు మచ్చలు లోతుగా నిగనిగా మెరుస్తున్నాయి ఎండకు.

    "ఈడి సంగతేంది? ఈడితో యాగలేకుకండా ఉన్నానన్నా! ఒద్దు రాంటే ఇనటంలేదు. యాల్లకు బువ్వ తినడు. రోజూ రాత్రిళ్లు పన్నెండుతాకా ఇల్లు చేరడు. డొంకలో మీటింగని, తాడిసెట్లలో మీటింగని సెబుతాడు. ఆ మీటింగులేందో... ఆ కతలేందో కనుక్కుని బుద్ది సెప్పు..." నడుంకి చెంగు దోపుకొంది రొప్పుకుంటూ.

    బుగ్గలు ఉబ్బించి గీక్కొంటూన రాజన్న నోరు విప్పకుండ కళ్లెత్తి సురేష్‌ను చూశాడు. ప్యాంటు, షర్ట్...తళతళా మెరుస్తూన్న నల్లని గడ్డం, డేగముక్కు.

    మూతిచుట్టూ ఉన్న సబ్బు నురగను ఎడంచేత్తో రుద్దుకొని, "నువ్వు గడ్డమెందుకు పెంచుతున్నావ్?" అడిగాడు.

    "నువ్వెందుకు గొరుక్కొంటున్నావ్?"  ఎదురు ప్రశ్న. రేజర్ టక్కున ఆగిపోయింది.

    ఉబ్బిన బుగ్గలు లొత్తలు పడ్డాయి. రెండు క్షణాలు రెప్ప వాల్చక చూశాడు ఖంగుతిన్న రాజన్న.

    "పుంజు కూతకొచ్చిందిగా సెల్లె" అన్నాడు నిస్సహాయంగా.

    "తప్పురా... పెద్దోళ్లతో మాట్లాడే తరీఖా అదిగాదు. ఏదో సంబరానికి పెంచిన మామా అంటే నీ ముల్లె ఏం పోయింది?" అంది.

    "నా గడ్డం సంగతి నీకూ, మామకు అనన్వసరం. గవన్నీ పక్కకు బెట్టు. ఇప్పుడిక్కడికి ఎందుకు తీసుకొచ్చినవ్?" మాటల్లో చీదరింపు.

    "రాత్రిళ్లు ఆ పాటలేంది? ఇళ్లపంటి తిరిగి జనాన్ని కుప్పజేసుడేంది?" అంటూ భూదేవి పెద్దగొంతుతో అరవసాగింది. మాటా మాటా పెరిగి తల్లీకొడుకులు తగాదా పడసాగారు. నిలబడి వినసాగారు దారిన బొయ్యే జనం.

    "అంటే పెద్దాలేదు, చిన్నాలేదు. నా మాటంటే లెక్కేలేదు.ఇక ముసల్దాన్నయితే పురుగును ఏరిపారేసినట్టే. ఈడ్ని సిన్నప్పుడే పటేల్ దగ్గరన్నా పాలేరుగా బెడదామన్నాంటే ఇనకుండ నువ్వు కాలేజీకి పంపిత్తివి. ఫీజులు కడితివి. నేను కూలి పని చేసి, కుట్టుపని చేసి తినీ తినకా సదివిత్తాంటే ఇవి ఏశాలు...అన్నా నాకు కూలికి పొయ్యే యాల్లవుతాంది. ఈడ్ని ఎట్టాగయినా ఒక రేవుసెయ్యి... నీ కాల్మొక్కుతా" అంటూ బొడ్లో దోపుకున్న చీరె కొంగు లాక్కుని భుజం చుట్టూ కప్పుకొని దారి పట్టింది.

    బజారులో దారికడ్డంగా కోడెలేగ, రంకె వేసి, కాలిగిట్టెతో నేలను గీస్తూ, కట్టివేసి ఉన్న ముసలి ఎడ్లపై ఓరచూపు చూస్తోంది.  

  రేజర్‌ను నీళ్లలోటాలో ముంచి శుభ్రపరుస్తూ, "నీవు చెప్పేదంతా కరెక్టే. ఉన్నోళ్లు పేదోళ్లను దోసుకుంటున్నారు. కానీ డబ్బున్న్నోళ్లు కులం పట్టింపులు లేకుండా కలిసిపోతారు దోసుకునేకాడ. కానీ పేదవాళ్లు మాత్రం గట్టా కలిసిపోరు. వాళ్లను ఒక్క తాటిమీద నడపడం ఆ దేవుడికూడా సేతగాదు" ఖండితంగా చెప్పాడు.

    "అదంతా వాళ్లను ఎడ్యుకేట్ చెయ్యటంలో ఉంది. ఎనకటిలా ఎడ్డికాలం, గుడ్డికాలం కాదు. జమానా మారిపోయింది" సవాలు విసిరాడు.

    "వారీ... సురేషూ... తండ్రిలేని పిల్లగానివనే సోయి నీకు లేదు. ఒక్క మలక పోలీసులు లాక్కెళ్లి బొక్కలో తోస్తే గప్పుడు ఎరికవుద్ది" అని నాలుక కరుచుకున్నాడు. గోడపక్కన నిలబెట్టిన తుమ్మకోళ్ల మంచం వాల్చుకొని పట్టెపై కూర్చున్నాడు.

    "అయితే మా అమ్మ ముండరాలా మామా" చూపులు విలవిల లాడుతున్నాయి.

    "తండ్రి లేడంటే నా అర్థం ఊళ్ళో లేడని అంతేగానీ సచ్చిపొయ్యాడని కాదు. పొరపాటు...పొరపాటు. వయస్సు మీదబడుతున్నకొద్దీ నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడంలేదు. చాలా పొరపాటు" రెండు చేతులతో చెంపలు వాయించుకొన్నాడు. దోషిలా తల వంచుకుని మౌనంగా ఉండిపొయ్యాడు.

    దూరంగా ఆకు రాలిపోయి మోడువారిన రాగిచెట్లు. వసంత రుతు ఆగమనం కోసం చూస్తున్నాయి వాటి కొమ్మలు ఆకాశం వైపు.

    "మామా...నీ నోటనే ఆ ముచ్చట వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మా బాపు బతికున్నట్టయితే ఈ ఇరవై సంవత్సరాలలో ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాలేదు."

    పిడిబాకు వెనక్కి తిప్పి గుండెలపై కుమ్మినట్లు "ఊ...ఊ..." అంటూ మంచానికి అడ్డంగా పడి పొయ్యాడు. మూల్గుతూ ఛాతి రుద్దుకోసాగాడు.

    "ఏమైంది మామయ్యా. డాక్టర్‌సాభ్ దగ్గరకు తోలకపోనా? ఇప్పటివరకూ మంచిగనే ఉంటివిగదా?"

    "ఆ...ఆ... గుండెల్లో మంట. మంట...ఆ...ఆ... గూట్లో అమృతాంజనం డబ్బా ఉంది. తెచ్చి ఇక్కడ రుద్దు" గుండె భాగాన్ని చేతితో రుద్దుకోసాగాడు.

    గోడపక్కన బొంగుదండెం. దానిపై వేలాడుతున్న మురికి ప్యాంట్లు, షర్ట్లులు. ఆ బట్టలను పక్కకు తొలగించి మసి చారికలతో ఉన్న ఆ గూటిలోని అమృతాంజనం డబ్బా అందుకున్నాడు సురేష్.

    "ఇక చాలు... ఇక చాలు... " అన్నట్టు చేతితో సైగ చేశాడు ఛాతిపై రుద్దుతున్న సురేష్‌కు.

    "ఆ...ఆ... జర్ర తగ్గింది. జర్ర సదురుకుందిలే" అంటూ మంచంలో నిలువుగా తిరిగాడు.

    "మావా... ఇంతలోనే ఇంత సెమట వచ్చింది వళ్లంతా. అసలు ఎక్కడ నొప్పి. ఇక్కడనా? ఇక్కడనా?" ఎదుర్రొమ్ము నొక్కుతూ "దిండు పెట్టనానే తలకింద" అని అడిగాడు. 

    "నేను ఎన్నడూ ఎరగను ఈ నొప్పి. చరచరమని మెరుపులా దూసుకుపోయింది గుండెల్లో. కొద్దిగా మంచినీళ్లివ్వు"

    ఇంటి మూలన మంచి నీళ్ల కుండ. నీళ్లు తోడే కొబ్బరి చిప్ప లోటా. కట్టె లోటాను నీళ్లలో ముంచి రెండు లోటాలు గ్లాసులో పోసి పెదవులకందించాడు.

    "ఆ...ఆ... సర్దుకుందిప్పుడు. దండెం మీద అంగీ తెచ్చివ్వు" అంటూ లేచి కూర్చుని మళ్లీ మొదలెట్టాడు.

    "అసలేం జరిగిందంటే... అప్పుడు పాకిస్థాన్ యుద్ధం ముగిసిన తరువాత అప్పటి పి.యమ్. లాల్‌బదూర్ శాస్త్రి సాబ్ తాష్కంట్ పోయిండు పాకిస్థానీ పెద్దమనుషులతో మాట్లాడేందుకు. మన సైన్యం ఆక్రమించుకున్న పాకిస్థానీ జాగా వాళ్లది వాళ్లకప్పగించాలని, అక్కడ కరాచీ, పెషావర్, లాహోర్ జైళ్లలో ఉన్న భారత సైనికులను మనకు అప్పగించాలని శాస్త్రీ సాబ్ దస్కత్ చేసిండు. కానీ మరి ఏమయిందోగానీ శాస్త్రీసాబ్ అక్కడే కాలం చేసిండు. గాలి మోటార్‌పై ఆయన శవాన్ని ఢిల్లీ తీసుకొచ్చిన్రు. అగర్...ఆయిన గిట్టా అచానక్ అక్కడ జరిగిపోకపోతే మీ నాయనలాంటి జవాన్లందరూ ఎన్నడో ఇళ్లకు వచ్చేద్దురు... మన కిస్మత్"

    డైలాగ్ డెలివరీలో పోర్షన్ మరచిపోయిన నటుడిలా టక్కున ఆగిపోయాడు నెత్తిగీక్కొంటూ.సగం పండిన బట్టతల చీకిపారేసిన తాడిపండులా. 

    "అయితే లాల్‌బహదూర్ శాస్త్రిగారు పోయారు కాబట్టి మా నాన్న విడుదల కాలేదా మావా? ఎంత ఎడ్డోడయినా ఈ ముచ్చట నమ్మడు. నీవు మాట్లాడేది నీకయినా మనసున బడుతుందో లేదో... నా కయితే ఏమీ అర్థం కావటంలేదు" బదులు చెప్పాడు సురేష్.

    అప్పుడే నిద్ర మేల్కొన్నవాడిలా కళ్లు పెద్దవి చేసుకొని చూశాడు అతను. 

    మాట్లాడుతున్న వ్యక్తి వయస్సులో చిన్నవాడయినా చదువుకున్నవాడు. నిరక్షరాస్యులను, అమాయకుక్లను నమ్మించినట్లు నమ్మించలేననే అశక్తత, అనుభూతి, ఆవహించి ఒళ్లంతా చల్లబడసాగింది. 

    "అవ్‌రా... సురేష్... నీవన్నది కూడా నిజమే. దానికీ, దీనికీ ఏం సమ్మందం. నాకు కూడా ఏమీ తెలియటంలేదు." మొదటిసారి తన ఓటమిని ఒప్పుకున్నాడు నిస్పృహ స్థితిలో. ఇంకా ఎక్కువ ప్రశ్నలడుతాడేమోనన్న భయం ఆవహించి, మంచంపై నుండి లేచి ఇంట్లోకి నడిచి తన ఎర్రరంగు డొక్కు సైకిల్ బయట పెట్టుకున్నాడు.

    "టప్పా తేవాలి స్టేజికాడికి పోయి. నువ్వు ఇంటికి నడువ్. సంగం గింగం అని మమ్ములను పరేషాన్ చెయ్యకు" అంటూ సీటుపై కూర్చొని ఫెడల్స్‍కు అందీఅందని తన పొట్టికాళ్లతో టిక్‍టిక్ అనిపించుకుంటూ వెళ్లిపోయాడు.

    సాయంత్రం అయిదుగంటలు.

    ఏందో మాగి పొద్దు గూటిలో వాలీవాల ముందే చలి మొదలయ్యింది. ఆడకూలీలు ఇళ్లకు తిరిగి వస్తున్నారు సంతోషంగా పెద్దపెద్దగా మాట్లాడుకుంటూ. వాళ్ల తలపైన చిన్నచిన్న బుట్టలు. వాటిల్లో కూలితోపాటు ఆసాములు పెట్టిన పండు మిరపకాయలు. పత్తి చేలల్లో పత్తి ఏరడానికి పోయిన కూలీల సిగలలో పత్తిపువ్వులు తెల్లగా, ఆ తెల్లని పత్తి పువ్వుల మధ్య ఎర్రని పండుమిరపకాయల అలంకరణ.

    అంతలోనే లొల్లి... కలకలం.

    అందరూ వెనక్కి పరుగెత్తుతున్నారు రోడ్డువైపు. 

    "ఉరకరా...ఉరకరా" అంటూ కేకలు.

    గతగతామంటూ చెప్పులు లేని కాళ్లతోనే ఉరుకులు పరుగులు. పిల్లాజెల్లా, ముసలీముతకా, అంతా సిమెంటు రోడ్డువైపుకు ఉరుకుతున్నారు.

    "ఏందక్కా! ఏందీ లొల్లి" లుంగీ మోకాళ్లపైకి మడుచుకుని నడుంకు గట్టిగా బిగదీసుకుంటూ అడిగాడు సురేష్.

    "రాజ్‍మమ్మద్... బస్సుకింద పడి సచ్చిపోయిండట" ఓ నడివయస్సు స్త్రీ విరబోసుకొన్న తన జుట్టును రెండు చేతులతో ముడివేసుకుంటూ పరిగెత్తుతూ సమాధానమిచ్చింది.

    క్షణాల్లో జనం పోగయ్యారు రాజ్‍మహమ్మద్ శవం చుట్టూ.

    "పాపం డొంకబాటపంటి సైకిల్ తొక్కుకుంటూ వత్తున్నాడంట. మలుపు తిరిగి సిమ్మెంటు రోడ్డు ఎక్కబొయ్యేసరికి బస్సు దూసుకొస్తోందట ఇటునుంచి. సడన్‍గా బస్సును చూసేసరికి హైబత్ తిన్నట్టున్నాడు. మలుపు కదా! ముందు చక్రం మెలిక తిరిగి బ్యాలెన్స్ ఆగక కిందబడిపొయ్యాడు. పడటం పడటంతోనే తల రోడ్డుకు గుద్దుకుంది. అసలే సిమెంటు రోడ్డు" వివరిస్తున్నాడా పెద్దమనిషి.

    "అయితే బస్సుకింద బడలేదన్నమాట"

    "లేదు...లేదు... ఇగ్గో బస్సు"

    బారెడు దూరంలో ఆర్.టి.సి.ఎర్రబస్సు. బస్సుదిగిన ప్రయాణీకులు డ్రైవర్ చుట్టూ చేరి సడెన్ బ్రేక్ వేసి, యాక్సిడెంట్ తప్పించినందుకు అభినందిస్తున్నారు.

    శవం చుట్టూ గుంపుగా నిలబడిన కూలిజనం పెద్ద పెద్దగా అరుస్తున్నారు చావుకు కారణాలు అన్వేషిస్తూ.

    "సైకిల్‌నుండి సచ్చిపోవటం ఏమిటి? ఏ కాలో, చెయ్యో, నడుములో ఇరుగుతయికాని... సిత్రంగా ఉంది రాజన్న సావు"

    "అసలు సచ్చిపోయినాంకనే కిందబడ్డట్టనిపిస్తాంది నాకు జూడ"

    ... వ్యాఖ్యలు నడుస్తున్నాయి.

    సురేష్ గుంపును నెట్టుకుంటూ శవం దగ్గరకు పొయ్యాడు. కూలి గంపలు, బుట్టలు పక్కనే పెట్టుకొన్న ఆడవాళ్లు ఏదుస్తున్నారు మౌనంగా. తన తల్లి శవం తలవద్ద కూర్చొని బిగ్గరగా ఏడుస్తోంది. 

    "ఓ అన్నా...నాకున్న దిక్కంతా నువ్వేననుకొంట్రాన్నా.'సెల్లె సెల్లె' అని నన్ను నోరారా పిలుత్తుంటివిరా అన్నా! నీ రుణం నేనెట్టా తీర్చుకోవాలన్నా" అని.

    "నీ కొడుకొత్తాడు. నువ్వు రంధి పెట్టుకోవద్దని ధయిర్నం సెబితివి కొడుకా... కొడుకు రాకముందే నీవెల్లిపోయినావా రాజన్నా" కాళ్ల వద్ద కూర్చొని తన నాయనమ్మ రొమ్ములు బాదుకుంటూ మొత్తుకుంటోంది. 

    సురేష్ శవం ముఖాన్ని స్పృశించి పరిశీలనగా చూశాడు. చెవులనుండి కారిన రక్తపు ధారలు గడ్డకట్టి ఎండిపోయినయి. ఇంక ఎక్కడా దెబ్బలు లేవు. సగం తెరిచిన గాజుకళ్లు రెప్ప వాల్చక నిశ్చలంగా చూస్తున్నాయి తన చుట్టూరా ఉన్న జనాన్ని.

    ఎడ్లబండి వచ్చింది. శవాన్ని బండిపై పడుకోబెట్టి అతని ఇంటికి తరలించసాగారు.

    "ఏ కులపోడైతేనేం? రాజన్నను రేవు బెమ్మాండంగా పారెయ్యాలి. ఊరంతా తిప్పి ఊరేగించాలి. బతికిన రెండు రోజులూ పది మంది కోసం బతకాలి మనిషి జల్మ ఎత్తినాంక. మన ఊళ్లో ఏ సావు... ఏ లగ్గం కాడ రాజన్న లేడో సెప్పండి" మాటలలో ప్రజల నివాళులు.

    "పాపం ఆలుబిడ్డలు లేని బతుకు రాజన్నది" ప్రేమాభిమానాలు కురిపించసాగారు.

    శవాన్ని బయట వాల్చి ఉన్న తీగె అల్లిన గడాంచా మంచం పై పడుకోబెట్టి ఎటువాళ్లు అటు పొయ్యారు చెయ్యవలసిన పనులు పంచుకొని. శవం పక్కనే స్టూలు వేసుకొని సురేష్ ఒక్కడే కూర్చున్నాడు.

    చీకట్లు దట్టంగా కమ్ముకోసాగాయి. చలి ముసురుకోసాగింది.

    శవం పూర్తిగా చల్లబడిపోయి అప్పటికే బిగదీసుకుపోయింది. దానిపై ముసుగు కప్పాడు సురేష్. శవాన్ని చూడటానికి వచ్చే ప్రజలకు శిరస్సు ఉన్నతంగా కనిపించాలన్న ఆలోచన కలిగి, దిండుకోసమై ఇంటిలోకి నడిచాడు.

    లోపల మంచం తలగడవద్ద దిండ్లు రెండున్నాయి. దిండుకింద దిండు. ఒకటిలాగితే రెండవది కూడా ఇవతల బడ్డది. అది దిండుకాదు. దిండులా పేర్చిన గుడ్డల మూట. దీర్ఘచతురస్రాకారపు గలీబులో పొందికగా అమర్చిన బట్టలు. 

    విసురుగా లాగటం వలన సగం సగం బయటికొచ్చి వేలాడుతున్నాయి.

    ఖాకీరంగు ప్యాంట్లు, షర్టులు, ఎండిన రక్తపు మరకలు. సంవత్సరాలుగా గాలీ, వెలుతురూ తగలక ముక్కవాసన కొడ్తున్నాయి. మడతలు విప్పి విదిలించాడు.

    వాటిల్లోనుండి జారిపడినాయి ఉత్తరాలు. ఒళ్లు జలదరించింది. బట్టలను మంచంపై విసిరిపారేశాడు. అనాలోచితంగా అతని చేతులు నేలమీద పడిన ఉత్తరాలను ఏరి పట్టుకున్నాయి.

    బయట శవం, ఇంట్లో భీతావహమైన నిశ్శబ్దం. గజగజలాడిస్తున్న చలి. అనూహ్యమైన భయంతో అచేతనమౌతున్న పాదాలు. మెల్లగా రెండడుగులు వేసి గోడకు అమర్చిన లైటుకింద నిలబడ్డాడు. ఒక్కొక్క ఉత్తరం చదవసాగాడు.

    మొదటి ఉత్తరం ఇన్‌లాండ్ కవరు నలిగి నలిగివుంది.

19-1-1971
కోదండపల్లి

    కుమారుడు బుచ్చిరాములుకు తల్లి కొమరమ్మ రాయించిన ఉత్తరమేమనగా,

    మేమందరూ ఇక్కడ బాగానే ఉన్నాం. నీవు పంపించిన పైసలతో మేము తిని తాగి తందనాలాడటంలేదు. నీవు పంపిన మనియార్డర్లన్నీ కూడబెట్టి దొరవారిది తాళ్లమిట్టి తరిపొలం ఇరవై గుంటలు ఖరీదు చేసినాం. నీవు రాజ్యం కాని రాజ్యం పోయి కట్టం చేసిన పైసలతోని ఒకపని చేసిన పేరుండాలని ఖరీదు చేసినం. మిలిట్రీ కొలువు ఇడిసిపెట్ట్నాక నీవు కాలుమీద కాలేసుకొని బతుకుతావని.

    దొర బూమి కొన్నాక ఊల్లో మన ఖదర్ పెరిగింది. పోతే నీ కొడుకు ముచ్చట. వాడు ఒడ్డూ, పొడుగూ అంతా నీవే. నీ భార్య బూదేవిని నేను నా సొంత బిడ్డను చూసినట్టు చూసుకుంటున్నా. మా గురించి నీవు ఫికర్ పెట్టుకోవద్దు...

ఇట్లు
తల్లి కొమరమ్మ

    కవరులో దాచిపెట్టబడిన మరో ఉత్తరం నలగకుండా మడతలు సాఫీగా ఉన్న కాగితం 13-12-1975 నాడు రాయబడిన లేఖ లాహోర్‌నుండి తండ్రి రాసింది.

    ఉత్తరం చదివి, విషయాలు గ్రహించాడు. కానీ అదే చేవ్రాత. నాయనమ్మ తన ఊరినుండి రాయించిన చేవ్రాత. అక్షరాల పొందికలో ఏమాత్రం తేడాలేని దస్తూరీ.

    తండ్రి రాసిన ఉత్తరాలు ఇంకా రెండుమూడు.

    ఉత్తరాలన్నీ పోల్చి పోల్చి చూసి పక్కన బెట్టాడు మంచంపైన. 

    ఆలోచనలతో సతమతమౌతూ ఇంటి చుట్టూ కలియచూశాడు. గోడపక్కన కట్టెల పొయ్యి బూడిదతో నిండివుంది. పక్కనే వంటగిన్నెలు అశుభ్రంగా వున్నాయి. ఆ మూలన తోమని ఇత్తడి స్టవ్. దాని పక్కన కిరసనాయిలు డబ్బాలు. ఇంటి నడికొప్పు దూలానికి వేలాడుతున్న ఉట్టి. అందులో అతను రాతికొరకు దాచుకొన్న చద్దిబువ్వ గిన్నె.

    మళ్లీ టెలిగ్రామ్స్ పైకి అతని చూపులు పరిగెత్తసాగాయి.

    "Missing in Action" మిస్సింగ్ ఇన్ యాక్షన్ టెలిగ్రామ్ వెనుక తెలుగు అనువాదం.

    "presumed to be dead" రెండవ టెలిగ్రామ్ 'ప్రిజ్యూమ్‌డ్ టు బి డెడ్' వెనుకవైపు తెలుగు తర్జుమా. 

    వాటికింద మరొక ఉత్తరం. మూడు సింహాల అధికార ముద్ర కలిగిన అధికార పత్రం. అందులో ఇంగ్లీషు అక్షరాలు టైపు చేయబడినవి.

15-1-1976
New Delhi

    "Buchi Ramulu listed in M.I.A. is presumed to be dead. The face is mutilated beyond  recognition. The letters in the possision of the corpse establish the identiy of the dead body as Buchi Ramulu. Belongings despatched - Body decomposed - cremation ordered"

    ఉత్తరం తిప్పి చూశాడు . ఇంగ్లీషు  ఉత్తరానికి తెలుగు అనువాదం. 

    "యుద్ధంలో తప్పిపోయినట్లుగా గుర్తించబడిన బుచ్చిరాములు మరణించినట్లుగా భావించడమైనది. ముఖం ఆనవాలు పట్టలేనంతగా ముక్కలు,ముక్కలైంది. శవం జేబులో దొరికిన ఉత్తరాలు అతను బుచ్చిరాములు అని చెబుతున్నాయి. బట్టలు వగైరేఅ పంపిస్తున్నాం. శరీరం కుళ్లిపోయినందువలన దహనం చెయ్యవలసినదిగా హుకుం జారీ చేయడమైనది"

    అదే చేవ్రాత. అతనిలో రక్తం గడ్డకట్టుకు పోయింది.

    వెన్నుపూసలోనుండి సన్నగా ఒణుకు పుట్టసాగింది.

    తలుపు చాటున దాచివుంచిన దూది పీకేపరికరం...మగ్గం. దాని ఆయువుపట్టు పెద్ద నరం. మధ్యలో తెగిపోయిన దారాలు, దారాలుగా వేలాడుతోంది చితికిపోయి. చిన్నాభిన్నమైన జీవితాల్లా ఆ దారాలకు కరిదూపం కొట్టుకున్న దూదిపింజలు వేలాడుతున్నాయి.

    నడిమంచంపై కూర్చొని తనచుట్టూ ఉత్తరాలు టెలిగ్రామ్స్ పరచుకున్నాడు.

    ఒళ్లు జలదరించే ఉత్తరాలు. మరణించిన వ్యక్తికి ఊపిరిపోసిన ఉత్తరాలు. ఉత్తరాల చుట్టూ తన భ్రమణం. తన చుట్టూ ఉత్తరాల భ్రమణం. 

    ఉత్తరాలు మౌనంగా మాట్లాడే అక్షరాలు. పలుకకనే పలకరించే పెదవులు. మాటలలో చెక్కిన శిల్పాలు. జీవితం పట్ల ఆశాజ్యోతులు వెలిగించిన ఆ శిల్పాల అమరశిల్పి శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు ఆరుబయట ప్రకృతి ఒడిలో.

    మనుషులు వస్తున్న అలికిడి. వీధిలో కుక్కలు ఆఖాశంలోకి మోరలెత్తి 'భో...' అని ఏడుస్తున్నాయి. కరెంటు స్థంభంపై గుడ్లగూబలు ఒళ్లు గగుర్పొడిచేలా క్లిచ్‌క్లిచ్ అంటూ అరుస్తున్నాయి.

    ఒంటరి తీతువు కూస్తోంది పొదలనుండి.  

 (విపుల మాసపత్రిక అక్టోబర్ 1995 సంచికలో ప్ర చురితం)
Comments