నీవు ఇక్కడకు రావద్దు... - భమిడిపాటి గౌరీశంకర్

    ఆకాశం మేఘావృతమై ఉంది... ఎక్కడో వర్షం కురుస్తోంది... మెరుపులు.. శబ్దం లేకుండా... మనిషి జీవితంలో చెప్పిరాని కష్టాల్లా అప్పుడప్పుడు వెలుగులను చిమ్ముతున్నాయి...దూరంగా చెట్టుపైన ఒంటరి కాకి.. అదే పనిగా అరుస్తోంది. విసుగు చెందిన ఎవరో చిన్న రాయితో కొట్టినట్లున్నారు. ఎగిరిపోయింది. బందిఖానా జీవితంలో సుఖదుఃఖాలు.. చీకటి వెలుగులు... రాత్రి పగలు ఒకటే... నిర్దేశించిన సమయంలో ప్రణాళికతో జీవితం... కాల పరీక్ష నాళికలో పరీక్షించబడుతూ... ఒకే మూసలో... నత్తలో గుల్లలా సా...గి... పోతూనే ఉంటుంది. దీన్ని గురించి దుఃఖం, సంతోషం ఏమీలేని ఓ మానసిక శూన్యత...మెటాఫిజికల్‌ ఎమ్టీనెస్‌...


    'వర్షం వచ్చేలా ఉంది. లోపలకు వెళ్లండి మాష్టారూ.. మీ ఆరోగ్యానికి మంచిది కాదు...'' సూపర్‌వైజర్‌ జాగ్రత్త.. ఆ జాగ్రత్త మాష్టారి ఆరోగ్యం కోసమా.. తన ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసమా.. ప్రతి విషయాన్నీ ఇలా ఎందుకు ఆలోచించాలి... అతను నిజంగా మాష్టారిపై ప్రేమతోనే చెబుతున్నాడేమో... ప్రేమ అనుకోగానే నవ్వు వచ్చింది మాష్టారికి... మౌనంగా నవ్వుకున్నాడు.


    బిడ్డలపైన ప్రేమ తప్పా? కొడుకును అమితంగా ప్రేమించడం తప్పా...? అతడిని ఉన్నతుడిగా తీర్చిదిద్దడం తప్పా..? ఏది తప్పు? ఇందులో ఏదీ మాష్టారికి తప్పుగా కనపడలేదు... కానీ నాణేనికి మరో పార్శ్వం ఉందనే ఆలోచన ఆయనకెన్నడూ కలగలేదు. ప్రేమతో అతని అంతరంగిక జీవితంలోకి ఎన్నో సార్లు ప్రవేశించి ఉంటారు మాష్టారు. సత్యాన్ని తెలుసుకోలేక పోయారు... అసత్యాన్ని సత్యం చేయడానికి ప్రయత్నించి ఓడిపోయారు... ఆయన నిజంగా ఓడిపోయారా!? అయినా సమస్యను ఒకవైపు నుండి మాత్రమే ఆయన పరిశీలిస్తున్నాడనిపిస్తుంది. మాష్టారిగా పాతికేళ్ల సర్వీసు, మనిషిగా అరవై సంవత్సరాల జీవితానుభవం ఆయననెందుకు స్వార్థపరుణ్ణి చేస్తున్నాయి? ఏది స్వార్థం.. ఏది కాదు.. తత్వవిచారణ చేసే సమయమిదా!?


* * *


    వర్షం జోరుగా కురుస్తోంది. శ్రీను చిత్తు పుస్తకంలోంచి కాగితాలను చించి పడవలు చేసి ప్రవహిస్తున్న నీటిలో వేస్తున్నాడు. అవి వేగంగా పోతుంటే నవ్వుతున్నాడు.


    ''వర్షానికి తడిస్తే జలుబు చేస్తుందిరా నాన్నా.. అమ్మ కూడా లేదు కదా... అమ్మమ్మ వాళ్ల ఇంటికెళ్లింది. రేపు బడికి వెళ్లడం కష్టం. అయినా ఆ హోమ్‌వర్కు పూర్తి చేయకూడదూ. లేదంటే దెబ్బలు పడతాయి కదా...'' మాష్టారి గొంతులో కాస్త కఠినం... మరి కాస్త మార్థవం జోడించి హెచ్చరించారు. శ్రీను ఆయన ముఖంలోకి అదోమాదిరిగా చూశాడు. ఆ చూపులో ఏదో తెలియని నిరసన నాయనకు కనిపించింది. అది సహజమే అనుకున్నాడాయన.


    శ్రీను వెళ్లి పుస్తకాలను ముందేసుకుని సీరియస్‌గా వర్కు చేసుకుంటున్నాడు. అతని కళ్లలో ఏదో విషాదం... ఎందుకు? అతని సంతోషాన్ని మాష్టారు పాడుచేశాడనా? క్రమశిక్షణలో పెట్టడం తప్పా! వాడి భవిష్యత్తు కోసమే కదా ఈ జాగ్రత్త. అయినా ప్రతిపనీ పిల్లలను అడిగే చేస్తామా...


    శ్రీనుని డాక్టరు చేయాలన్నదే మాష్టారి ఆశ. ఆయనను డాక్టరుగా చూడాలనుకుంది తల్లి. కానీ కుటుంబ పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు.. ఆయనను టీచర్ని చేశాయి. బతకలేక బడి పంతులని అందరూ వెక్కిరించారు. ఆరోజులు అటువంటివి. తల్లి చనిపోతూ ''కన్నా... నా మనవడినైనా డాక్టరుని చేయరా'' అని కోరింది. ఆయన ఆమెకు మాటిచ్చాడు. అందుకే ఆయనకు అంత తపన.


    కానీ శ్రీను ఎందుకు గ్రహించడు? అయినా గ్రహించే వయసు అతనికేది. ఇంకా పదవతరగతే చదువుతున్నాడు. చిన్న పిల్లాడు... మాష్టారిగా, తండ్రిగా అతడిని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆయనకుంది. వాడికి ఇష్టం లేకున్నా సరే. తన నిర్ణయం మారదనుకున్నాడు మనసులో.


    ''ఏంటి గతంలోకి వెళ్లి వస్తున్నారా?'' మాష్టారి భుజం తడుతూ రూమ్మేట్‌ రామచంద్ర అన్నాడు.


    ''ఆ... కాదు... కాదు...'' ఆయన గొంతులో తడబాటు.


    ''ఎందుకు మాష్టారు తడబాటు... మనలాంటి ముసలాళ్లకు జ్ఞాపకాలే కదా జీవశక్తి కేంద్రాలు... దానికి సిగ్గు పడడం దేనికి.. హాయిగా నవ్వుతూ అన్నాడు.


    ఎంత చక్కగా నవ్వుతున్నాడు. అతనో పదవీ విరమణ చేసిన తెలుగు అధ్యాపకుడు.. ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. అతని భార్య ఈ మధ్యనే చనిపోయింది.


    ''నా భార్య ఒంటరిగా పోయి నన్ను మరింత స్వతంత్రుణ్ణి చేసింది మాష్టారు'' అంటాడు నవ్వుతూ.


    మాష్టారు ఆయన ముఖంలోకి చూశాడు. కళ్లలో నీరు, ఆయన భుజంపై చేయి వేసి పదండి అన్నారు.


    మౌనంగా ఇద్దరూ డైనింగ్‌ హాలుకు వచ్చారు. భోజనాల గది సందడిగా ఉంది. రామచంద్ర మామూలు మూడ్‌లోకి వచ్చాడు. రాజేష్‌ఖన్నా 'ఆరాధన'లోని ''మేరి సప్పనోంకి...'' అనే పాటను హమ్‌ చేస్తున్నాడు.


    ''భోజనం చేయండి మాష్టారు.. మనం ఆలోచించుకునేందుకు ఇంకా చాలా సమయముంది కదా. అయినా తెల్లవారి నిద్ర లేచిన దగ్గర్నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే పని ఏముంది కనుక. నెలకింత అని చెల్లించి హాయిగా తింటూ గతాన్ని తలచుకోవడమే కదా మన పని'' రామచంద్ర కామెంట్‌.


    ఆయనకెందుకో అతని కామెంట్‌ నచ్చలేదు.


    రామచంద్రకు మాష్టారి ముఖంలో భావాలు తెలిసినట్లున్నాయి. ''నేను చెప్పిందాంట్లో ఏమయినా తప్పుందా?'' అడిగాడు.


    ''చెప్పినదాంట్లో కాదు... చెప్పే విధానంలో'' అని సరిదిద్దాడాయన చిన్నగా నవ్వి.


    రామచంద్ర గట్టిగా నవ్వి ''మొత్తమ్మీద తెలుగు సారనిపించుకున్నారు''


    అదేదో సినిమాల్లో అన్నట్లు టేపురికార్డరు మాదిరిగా జీవితానికి కూడా రివైండ్‌ బటన్‌ ఉంటే ఎంత బాగుండునో... ఆయన పెదాలపై నవ్వు.


    ''ఏంటి.. మళ్లీ ఫ్లాష్‌బ్యాకా''


    ''కాదు... ఫ్రంటే''


    ''అర్ధం కాలేదు'' రామచంద్ర సందేహం.


    ''ఏం లేదు... తమ జీవితాల్లోని సుఖాలను వెతికి పట్టుకునే సమయంలో వాటిని మూర్ఖపు ఆలోచనలతో కాలాన్ని ఎందుకు వ్యర్థం చేశానా అని ఆలోచిస్తున్నా...''


    ''దానివల్ల ప్రయోజనం''


    ''ఏమీ లేకపోవచ్చు. కానీ మానసికానందం కలుగుతుంది కదా! అంతకన్నా ఏం కావాలి?'' నిద్ర సమయాన్ని సూచిస్తూ గంట కొట్టారు.


    ''తరంగ్‌'' వృద్ధాశ్రమంలో మరో రోజు ము...గి...సిం...ది.


* * *


    ''అది కాదురా... ఆ పిల్ల కులం, గోత్రం వంటివి పక్కన పెట్టు. అమ్మకు తడీ... మడీ... ఆచారం ఎక్కువ కదా. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా''


    ''అబ్బా నీకేమీ తెలియదు నాన్నా... అవన్నీ నేను చూసుకుంటాను కదా. అమ్మను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఇంకా నీ చేయి పట్టుకుని నడిచే చిన్నపిల్లాడిని అనుకుంటారు మీరు...'' శ్రీను మాటల్లో కరుకుదనం.


    నిజమే తల్లిదండ్రులు బిడ్డలను కంటారు. పిల్లలు పెద్దవాళ్లవుతుంటారు. కానీ తండ్రులు మాత్రం పిల్లలుగానే ఉండిపోతారు. ఆ రాత్రి తన భార్యకు నచ్చజెప్పాడు కోడలి గురించి. అది విన్న కొడుకు మరోసారి తనను తీర్చి దిద్దిన తండ్రిని తలచుకుని ఆనందించాడు. అది కూడా కొంతసేపే. 'ఎవరికోసం?' అనే ఆలోచన అతన్ని ఆక్రమించింది.


* * *


    ఓ పెద్ద రాబందు తన నుంచి దేన్నో దూరం చేస్తున్నది. ముందు మౌనంగా ఊరకుండిపోయాను. అది తనను కూడా ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఒకటి... రెండు... మూడు... వందలు... వేల రాబందులు తనను బతికి ఉండగానే పీక్కు తింటున్నాయి. రెండు చేతులతో వాటిని వదిలించుకోవడం సాధ్యం కావడం లేదు. తన భార్య పెద్ద కర్ర తెచ్చి వాటిని అదిలిస్తోంది. కొన్ని గుంపుగా ఆమె మీదకు వెళ్లాయి. ఆమె తనను వదిలి వెళ్లిపోతోంది. తనను రక్షించేవారు లేరా అని అరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆజానుబాహుడు పెద్ద కళ్లతో... గుండుతో... నాలుగు చేతుల్లో నాలుగు పదునైన కత్తులతో రాబందుల గుంపుపైన దాడి చేస్తున్నాడు. అవి అతన్ని పొడుస్తున్నాయి. అతని శరీరం నిండా గాయాలు... రక్తం... అయినా అతను పోరాడుతున్నాడు. చివరికి అతను విజయం సాధించాడు. తనను రక్షించాడు. ఆ తర్వాత తను స్పృహ కోల్పోయాడు.


    కల... భయంకరమైన కల. శ్రీను కళ్లు తెరిచి చూశాడు. భయంతో అతని శరీరం చెమటలు పట్టింది. పక్కకు తిరిగి చూశాడు. భార్య నిశ్చింతగా నిద్రపోతోంది. తను తప్పు చేశాడా... ఎందుకీ కల? నాన్నగారెలా ఉన్నారో... ఆ రోజు అతనికింకా గుర్తుంది.


    ''అమ్మా! తను ఈ పల్లెటూర్లో ఉండలేనంటోంది. డాక్టర్‌ చదువుకున్న నాకూ ఇక్కడ సరైన గుర్తింపు లేదు. నాన్నగారి ఆశయం నెరవేర్చలేననే సందేహం'' తను నసుగుతూ చెప్పిన మాట తల్లి గుండెను తీవ్రంగానే తాకింది.


    ''అంటే నీ ఉద్దేశ్యం మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్లి పోతానంటావు అంతేనా. నీ చదువు కోసం ఈ ఇల్లు, పొలం తాకట్టులో ఉన్నాయి. డాక్టర్‌వి కదా అని అప్పు ఇచ్చిన వారు ఊరుకుంటున్నారు. ఇప్పుడు ఇలా నువ్వు వెళ్లిపోతే నాన్నగారి కొచ్చే అరకొర పింఛనుతో అవెలా తీరతాయి'' తల్లి అరుపులు.


    ''అది కాదమ్మా.. ఈ ఇల్లు, పొలం అమ్మేద్దాం. వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేద్దాం. మిగిలిన డబ్బులతో మీరు మాతోనే హైదరాబాద్‌ వచ్చేస్తే అందరం కలిసి హాయిగా ఉందాం''


    మాష్టారు లోపలికి వస్తూనే ''ఏంట్రా...'' అనడిగాడు.


    ''చూడండి. వీడు మనల్ని వదిలి వెళ్లిపోతాడట'' ఆవేదనతో అంది తల్లి.


    ''వెళ్లనీ. ఏం? మన పెళ్లి తర్వాత మనం వచ్చేయలేదు. నిన్న మనం. ఈ రోజు వీళ్లు. రేపు వాళ్ల పిల్లలు... ఇదో చక్ర భ్రమణం. పద అన్నం వడ్డించు'' గబగబా పెరట్లోకి వెళ్లిపోయిన తండ్రి.. గమనించి ఉంటే ఆయన కళ్లలో నీళ్లు శ్రీనుకు కనిపించి ఉండేవేమో...


    ఆ రాత్రి... ''ఏవండీ... మీరు వాడినే సమర్ధిస్తున్నారు''


    ''సరూ...! ఒక్క మాట చెప్పనా. వేలాది సంవత్సరాలుగా సంఘర్షణ అనేది ఈ భూమ్మీద జరుగుతూనే ఉంది. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య. కొడుకు తండ్రిని, తండ్రి కొడుకుని నొప్పించడం తరచుగా ఎదురయ్యే సంఘటన. నిన్న, నేడు, రేపు... ఎప్పుడూ ఉంటుంది. మనిషి తాను సంతుష్టుడైన నాడు తోటి మానవులకు లేదా కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చగలుగుతాడు. సంతోషం లేని వ్యక్తి కుటుంబానికి, సమాజానికి కూడా భారమే. కనుక ముందు తనకు తాను ఆనందమయ జీవితాన్ని తీర్చి దిద్దుకోవడం ప్రధాన కర్తవ్యం. మన శ్రీను చేస్తున్నదదే. వాడి సంతోషం వాడు వెతుక్కుంటున్నాడు. వాడు చెప్పిన విధంగానే కొన్నాళ్లు చూద్దాం. కాదంటే మరో మజిలీ''


    తండ్రి మాటలు శ్రీనుకు ఎందుకో వ్యంగ్యంగా అనిపించాయి. అయితే ఆయన నోటి నుంచి వచ్చిన 'మరో మజిలీ...' అన్న మాట... ఆమెకు చివరి మజిలీ అయింది.


    కోడలి సణుగుడు పడలేక..కొడుకుతో చెప్పుకోలేక... నిద్రాహారాలు కరువై చివరకు శాశ్వత నిద్రలోకి జారిపోయింది. మాష్టారు ఏమీ చెయ్యలేక మౌనం ఆశ్రయించాడు. మరునాడే ఆయన్ని ''తరంగ్‌'' వృద్ధాశ్రమంలో చేర్పించాడు శ్రీను.


    అక్కడకు చేరగానే మాష్టారు ''బాగుందిరా పేరు... తరంగ్‌ అంటే అర్ధం తెలుసా?'' అనడిగారు.


    శ్రీను తెలియదన్నట్లు తలూపాడు.


    ''సముద్ర అలలపై నిరంతర ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలుగా సేవలందించి కాలం తీరిన నౌకలను, చివికి పోయి పాడయిపోయిన వాటిని శాశ్వతంగా వదిలించుకునే నౌకా విశ్రాంతి కేంద్రం పేరు అది. వృద్ధులు కూడా ఆ నౌకల్లాంటివారే'' అన్నాడాయన.


    రిక్షా దిగిన తండ్రికి చేయందించి... వృద్ధాశ్రమం వైపుగా నడిపించసాగాడు శ్రీను. అతని చేతిని వదిలి ''ఆనాడు నిన్ను ప్రయోజకుడ్ని చేయడం కోసం ఇలాగే రిక్షాలో నా చేతిని ఆసరా చేసి నిన్ను మెడికల్‌ కాలేజీలో చేర్పించాను. నువ్వు ప్రయోజకుడివి అయిన తర్వాత నన్ను అప్రయోజకుడ్ని చేశావు'' అన్నారు మాష్టారు.


    ఫార్మాలిటీస్‌ ముగించిన శ్రీను తండ్రికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. ఈరోజు నుండి తను, తన భార్య, తన కొడుకు హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు మనసులో.


    గతం అతడ్ని వెక్కిరించింది. చేసింది తప్పని తెలుస్తుంది. తనకొచ్చిన పీడకలకు అర్ధం...!? అతనికి తెలీలా! ఇంక ఆ రాత్రి శ్రీను నిద్రపోలేదు.


* * *


    ఇవన్నీ 'రావు' అనే మరో మిత్రుడు రాసిన ఉత్తరం ద్వారా మాష్టారికి తెలిశాయి.


    మాష్టారు వృద్ధాశ్రమం వదిలి వచ్చేశారు. ఎక్కడకు వెళ్లారు....!? అనేది రామచంద్రకు, రావుకు మాత్రమే తెలుసు. మరెవరూ తెలుసుకోలేరు. రావుకు ఎవరితో చెప్పొద్దన్నారు మాష్టారు. రామచంద్ర చెప్పడు. చెప్పలేడు. ఎందుకంటే...?


    తరంగ్‌ వృద్ధాశ్రమం ముందు కారాగింది. అందులో నుండి ఓ యువకుడు దిగాడు. అతని పేరు శ్రీను. ఆశ్రమం ముందు జనం గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. కొందరు సిమెంటు బెంచీలపైన కూర్చుని విషాద వదనాలతో చర్చించుకుంటున్నారు.


    శ్రీను ఒక ముసలాయన వద్దకు వెళ్లి తన తండ్రిని గురించి అడిగాడు. ఆ ముసలాయన కోపంగా చూసి ఒక ఉత్తరం చేతిలో పెట్టి వడివడిగా వెళ్లిపోయాడు.


    శ్రీను ఉత్తరం చదువుకుంటున్నాడు.


    ''వర్తమానంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కనపడని చీకటి ఆవరించి ఉందని నేను ఆలస్యంగా గ్రహించాను. ఈ చీకటి ఎందుకు ఏర్పడింది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇందుకు కారణం నాకు తెలిసింది నీకు చెబుతాను. తల్లిదండ్రులు చిన్నతనంలో తాము చేయలేని పనులను పిల్లల చేత చేయిస్తున్నారు. ఈనాటి బిడ్డలు పుట్టుకతోనే తెలివిగల వారు. నా మొత్తం జీవితం దుఃఖమయం. తమ జీవితాలను సుఖమయం చేసుకోలేని వారు ఇతరుల జీవితాలను ఎలా సుఖమయం చేస్తారు? ఎలా పిల్లల జీవితాలను చక్కదిద్దుతారు? ఇది ఎలా సాధ్యం? నన్ను నేను సరిదిద్దుకోదలుచుకున్నాను. పిల్లల నుండి తల్లిదండ్రులు తమ చివరి దశలో ఓ తోడూ నీడా ఆశిస్తారు. ఆశించింది దక్కకపోతే ఆవేదన కలుగుతుంది. ప్రతి తల్లిదండ్రులకీ వర్తమానంలో ఈ ఆవేదనే మిగులుతుంది. నీ మీద నాకు కోపం లేదు. అమ్మ పోవడం కూడా నేను ఆలోచించుకునేందుకు అవకాశం కలిగించింది. నువ్వు, అమ్మాయి, మనవడు సుఖంగా ఉండాలని కోరుతున్నాను. నీకు నా గురించిన వివరాలు రామచంద్ర... అదే నామిత్రుడు చెప్పవచ్చు. చెప్పలేకపోయినా ఆయన్ను నిందించకు. ఇంతకుమించి డాక్టరువైన నీకు ఏం చెప్పగలను?


ఇట్లు


నీ తండ్రి.


    ఉత్తరం పూర్తి చేసేసరికి శ్రీను కళ్ల నిండా నీళ్లు. తన తండ్రికి తాను చేసిన ద్రోహం తెలిసింది. ఉత్తరం జేబులో పెట్టుకుని మరో ముసలాయన్ని అడిగాడు ''ఇక్కడ రామచంద్ర అనే అతను...'' అతని మాట పూర్తికాకుండానే ఆ ముసలాయన...


    ''రామచంద్ర రాత్రే హార్టెటాక్‌ వచ్చి చనిపోయి అదృష్టవంతుల జాబితాలో చేరిపోయాడు. కానీ ఒక్కమాట. నువ్వు నా బిడ్డలాంటివాడివని చెబుతున్నాను. అయినవారందరూ ఉండి ఇలా అనాథలా బతకడంలోని నరకయాతన మేం అనుభవిస్తున్నాం. దయచేసి నీవంటివారు ఇటువంటి ఆశ్రమాల్లో చేరే పరిస్థితులను కల్పించుకోకండి. ప్లీజ్‌.. ప్లీజ్‌...'' కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్లిపోయాడు.


    మాష్టారి గురించి ఆయన కుమారుడు శ్రీనుకు ఎవరు చెబుతారు? కాలమే చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. బహుశా.. ఆయన ప్రశ్నకు కూడా చెప్పవచ్చు.


(ప్రజాశక్తి ఆదివారం అనుబంధం స్నేహ 10 ఏప్రిల్ 2011 సంచికలో ప్రచురితం)

Comments