నో లాంగ్ బెల్ ప్లీజ్ - డి.రామచంద్రరాజు

    
‘‘నిబద్దతతో చేసే చిన్న చిన్న పనులు మామూలు మనిషిని మహోన్నతుడిని చేస్తాయి.’’

    ‘‘దిలీప్! ఇంకచాలు. టైమ్ అయిపోయింది. లాంగ్ బెల్ కొట్టించెయ్’’,  ఆత్రంగా క్యారియర్ సర్దుకుంటూ అన్నాడు హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి. దిలీప్ చదువుచెప్పే గదిలోనే గంటవుంది. 

    ఉత్సాహంగా చెప్పుతూవున్న పాఠం నుండి విసుగ్గా ముఖంతిప్పి ‘‘ఇంకా పదినిముషాలుంది గదా సార్!’’ అన్నాడు దిలీప్.

    సుబ్బారెడ్డి దిలీప్ మాటలను లెక్కచెయ్యకుండా ‘‘పరవాలేదు లేవయ్యా! రోజంతా చెప్పితే రానిది పదినిమిషాలకు మాత్రం వాళ్ళకు చదువొస్తుందా! రా. రా. మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది’’ అన్నాడు తొందరపెడుతూ. ఆ తర్వాత కూడా కొంచెం ఆలస్యంగా బస్సులున్నాయనే సంగతి ఆయనకు తెలుసు. అయినా గంటకొట్టించెయ్య మంటాడు. ప్రతిరోజు ఇదేతంతు.

    ఆయనకు ఎదురు మాట్లాడలేక ‘‘అలాగే సార్!’’ అని పిల్లలవైపు తిరిగి ‘‘గురువులేకుండా ఏకలవ్యుడెలా ‘గురి’ నేర్చుకున్నాడో రేపు చెపుతాను. రేయ్! నువ్వుపోయి బెల్ కొట్టుపో’’, అన్నాడు దిలీప్ ఒక పిల్లాగాడివైపు వేలుచూపి. ఆసక్తికరమైన కథ వింటున్న పిల్లలంతా టీచర్ మధ్యలోనే నిలిపేని ‘‘రేపు చెపుతాను’’ అనేటప్పటికి నీరుకారిపోయారు. మధ్యలోనే పాఠాన్ని ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో గమనించారు. కొంతమంది పిల్లలు సుబ్బారెడ్డి దిక్కు అసహనంగా చూశారు.

    దిలీప్ కూడా క్యారియర్ సర్దుకుని మిగతా టీచర్లతో కలిని రోడ్డువైపు యాంత్రికంగా అడుగులేయ సాగాడు. బడికి రోడ్డుకు మధ్య రెండుమైళ్ళ దూరముంది. ‘నడవడమయినా సరే ఇష్టంగా జేస్తే ఆనందంగా వుంటుంది.’

    ఈ ఉద్యోగంలో చేరి పట్టుమని నెలరోజులు కాలేదు. అప్పుడే నిరాసక్తత, అసంతృప్తి. ఉద్యోగం లేకముందు ఎక్కడైనా సరే ఉద్యోగం ‘వస్తే’ చాలనుకున్నాడు. వచ్చినరోజు, ఆతర్వాత వారం రోజులు ఎన్నో ఊహించాడు.  పిల్లలందరికీ బాగా చదువుచెప్పాలని, వాళ్ళందరిచేత మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపుపొంది, జిల్లా, రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందాలని ఆశపడి వాటిని అందుకున్నట్లు కలలు కూడా కన్నాడు. ఈ వాతావరణం చూస్తుంటే ఇప్పుడు విసుగన్పిస్తూవుంది.
 
    కొంతమంది పిల్లలకు పదిమార్లు చెప్పినా అర్దంకాక అడిగితే జవాబు చెప్పలేక పోతున్నారు. ఫౌండేషన్ సరిలేదు, మరి నేర్చుకుందామనే ఆసక్తి కూడా వాళ్ళకు లేదు. అసలు అ, ఆ లతో మళ్ళీ వాళ్ళకు మొదలుపెట్టి చెప్పితే తప్ప ప్రయోజనం లేదు. తను ఎంతో ఓపిగ్గా చెపుతూ వుండడం జూని తోటి ఉపాధ్యాయులు కొంతమంది హేళన చేశారు! ‘‘కొత్తలో మేముకూడా ఉత్తమ ఉపాధ్యాయుడన్పించుకోవాలని నీలాగే ఆరాటపడి భంగపడ్డాం’’ అన్నారు.
 
    ‘‘ఇదిగో! నువ్వేం రేయింబవళ్ళు చెప్పి ఉత్తమ ఉపాధ్యాయుడన్పించుకోవద్దులే.  టైం ప్రకారం చెప్పి వెళ్ళిపో...’’ అని హెడ్ మాస్టర్ హెచ్చరిక కూడా చేని వున్నాడు. ఆలోచిస్తూ వుండగానే రోడ్డు దగ్గర వుండే సత్రం కాడికి వచ్చాడు. అంతకుముందే అక్కడ లింగారెడ్డి, విశాలాక్షి, చలపతి చుట్టుప్రక్కల స్కూళ్ళ నుండి చేరి రాబోయే పి.ఆర్సీని గురించి అంచనాలు వేస్తున్నారు.
  
‘‘యు.జి.సి. పే స్కేల్స్ మనలాంటి వాళ్ళకివ్వాల. ప్రొఫసర్లకెందుకు దండగ. ఈ పల్లెలకొచ్చి చెప్పితే తెలుస్తుంది ఎవరికైనా’’ చలపతి అన్నాడు.

    ‘‘మీరు కరెక్ట్‌గా చెప్పారు. చాలీ చాలని జీతాలిచ్చి బాగా పనిచెయ్యాలంటే ఎట్లాచేస్తారు’’? అంది విశాలాక్షి.

    ‘‘అందుకే టైం గాకముందే రోడ్డుమీదికొచ్చేది’’ అన్నాడు వెంకటరెడ్డి. ఆ మాటలకు కొందరు ఫక్కున నవ్వారు.

    కూలివాడు ఉదయం నుండి పొద్దుపోయే వరకు చెమటోడ్జి సంపాదించేదెంతో  వూరుకేవచ్చి నవ్వొచ్చింది దిలీప్‌కు.

    ‘‘అయినా కష్టపడి పనిచేసేవాడికి, చెయ్యనోడికి జీతం ఒకటే మాదిరేగదా!’’ వెంకటరెడ్డి మాటకు రెండోవైపు చెప్పాడు చలపతి.

    ‘‘నువ్వు చెప్పేది నిజమే! మా అసిస్టెంట్ కులశేఖర్ జీతాల రోజు మాత్రం కనిపించి అన్ని సంతకాలు చేని జీతం దొబ్బుకు పోతున్నాడు గదా! ఆ యమ్.ఇ.ఓ.కు చెప్పి చెప్పి సాలయింది. ఏం ప్రయోజనం? ఆయన వాటా ఆయనకు అందుతూనే వుందిగదా!’’ లింగారెడ్డి ఆవేదన వెళ్ళగక్కాడు.

    ‘‘ఓహో! బాగుందే! కులశేఖర్ రావడంలే, చెప్పడంలే. మా చంద్రశేఖర్ స్కూలుకు వచ్చి సంతకం పెట్టి చెట్టుక్రింద పడుకుని నిద్రపోతాడు. ‘పిల్లలకింత చెప్పవయ్యా’ అంటే సేనమిరా పట్టించుకోడు’’ అన్నాడు చలపతి తన సహాధ్యాయి మీద అక్కసుతో.

    ‘‘మీరు లక్ష చెప్పండి, మన పై అధికారులు ముల్లుగర్రతో పొడవకపోతే యింతే. దద్దమ్మ యమ్.ఇ.ఓ లు, డి.ఇ.ఓ.లు వుంటే పరిన్థితి యింతే! ఆచెంచురాజు యమ్.ఇ.ఓగా వున్నప్పుడు అయ్యవార్లంతా ఉచ్చులు తెంచుకుని బడికి పరుగెత్తుతూ వుండినారు. స్కూలు టయానికి ముందే వూరు చేరుకుని అయ్యవార్ల పనితీరును విద్యార్థుల చదువును క్లాసురూములోనే పరీక్షిస్తూ, ఒక్కొక్క క్లాసులో గంటకు పైగా గడిపేవాడు. ఇప్పుడీ యమ్.ఇ.ఓ స్కూలు ముఖంజూని ఎన్నేండ్లయింది చెప్పు?’’ అన్నాడు లింగారెడ్డి. 

    ‘ఎంత ముల్లుగర్రతో ఎవడు పొడిచినా చెప్పాలనుకున్న వాడికి మనసుండాల, నేర్చుకోవాలనుకున్న వాడికి తపన వుండాల’’ ముక్తాయింపు ఇచ్చాడు చలపతి. 

* * * 

    ‘‘సార్! నమస్కారం సార్! బాగున్నారా సార్!’’ అన్నాడు దిలీప్ బస్టాపులోకి వస్తూ. బస్సుకోసం కాచుకొని వున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటరామిరెడ్డి ‘ఎవరా!’ అని సందేహంగా చూశాడు!

    ఆయన దిలీప్ దిక్కు ఎగాదిగా జూని గుర్తుకురానట్టుగా ఓ నవ్వు నవ్వాడు. ‘‘ప్చ్! ప్రయోజనం లేదు. నువ్వే చెప్పుకో’’, అన్నాడు తన జ్ఞాపకలేమికి చింతిస్తూ.

    ‘‘నేను సార్ దిలీప్‌ను! మీ స్టూడెంట్‌ను సార్! మీరు రాచపల్లెలో హెడ్‌మాస్టరుగా వున్నప్పుడు’’, అని ఇంకా చెప్పబోతూవుండగా అందుకొని ‘‘ఓరి నువ్వంటరా! బాగున్నావా!’’ అని సంతోషంగా నవ్వాడు. ‘‘ఇప్పుడేం చేస్తున్నావు’’? అడిగాడు.

    ఇంతలో బస్సు వచ్చింది! ఎక్కి పక్కన కూర్చోవాలా వద్దా? అని ఆలోచిస్తూవుంటే ‘‘రారా ఇక్కడే కూర్చో’’, అని ఆయనే ప్రక్కసీటు చూపించాడు. దిలీప్ ఆనందంగా ఒక పక్కకు ఒద్దికగా కూర్చొని చెప్పాడు. ‘‘టీచరుగా బందారుపల్లెలో పనిచేస్తున్నాను సార్! ఈమధ్యనే చేరాను’’ అన్నాడు కొంచెం గర్వంగా.

    ‘‘వెరీగుడ్! వెరీగుడ్! మీ బ్యాచ్‌లో ఎవరెవరున్నారు? వాళ్ళేమి చేస్తున్నారు?’’ ఉత్సుకతతో అడిగాడు వెంకట్రామిరెడ్డి. ఇటువంటి ప్రయోజకులైన పాతవిద్యార్థులను చూస్తే ఏ టీచరుకైనా ఎనలేని సంతృప్తి, సంతోషం! ఊపిరిపోసుకోకుండా మిగతావాళ్ళ సంగతులన్నీ అడుగుతారు.

    ‘‘సుధాకర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో వున్నాడు సార్! నరసింహులు జమ్మలమడుగులో సబ్ డివిజనల్ పోన్‌‌టమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా.....’’ ఈలోపల కండక్టర్ వచ్చి టికెట్ అడిగాడు. ‘‘సార్! మీరెక్కడికో చెప్పండి సార్?’’ అడిగాడు దిలీప్ జేబులో నుండి డబ్బుతీస్తూ.

    ‘‘రాజంపేట క్యాట్ కార్డ్, నేనిస్తాలేరా!’’ అన్నాడు వెంకట్రామిరెడ్డి.

    ‘‘వద్దుసార్! ప్లీజ్, నాకీ అవకాశమివ్వండి.’’ ప్రాధేయపడినట్లుగా అని తనే ఇద్దరికీ టిక్కెట్లు తీసుకున్నాడు. తర్వాత మొదలు పెట్టాడు. ‘‘మీరు లాంగ్‌బెల్ అయి పోయిన తర్వాతకూడా మిగతా టీచర్లంతా వెళ్ళిపోయినా, మమ్మలనందరినీ కూర్చోబెట్టుకుని చదివించినారు. నాకిప్పటికీ గుర్తుంది సార్! మేమంతా కలినినప్పుడు మిమ్ములను గురించి మాట్లాడుకుంటాము సార్! మామీద మీరు చూపించిన శ్రద్దే ఈరోజు మేమిట్లా వున్నత స్థానాల్లో వుండేందుకు కారణం సార్! ఇది నిజం సార్!’’ అన్నాడు కృతజ్ఞత మాటల్లో వ్యక్తపరుస్తూ. ఆ గురుశిష్యలిద్దరికీ బస్సు శబ్దంగానీ చుట్టుప్రక్కలవాళ్ళ మాటలు కానీ వినబడనంత ఏకాగ్రతగా మాట్లాడుకోసాగారు.

    వెంకట్రామిరెడ్డికి ఇటువంటి మాటలు చాలామంది నోట విన్నా ఎప్పుడూ అదే ఆనందం కలుగుతుంది. ‘‘వెరీగుడ్ నన్నింకా ఆవిధంగా గుర్తుపెట్టుకున్నారంటే మంచిదే’’ అన్నాడు.

    ‘‘ఆరోజుల్లో మీరు మాకు చెప్పిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు సార్!  అవన్నీ సక్రమంగా విని ఫాలో అయివుంటే కలెక్టర్‌ను అయ్యి వుండేవాడిని సార్! మీమాటల్లోని గొప్పదనం ఇప్పుడు అర్థమవుతూవుంది సార్!’’ అన్నాడు దిలీప్ ఆవేదనగా.

    ‘‘ఓ.కె. ఓ.కె., ఇప్పుడవన్నీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే. ‘అసంతృప్తి కలిగించే గతాన్ని అసలు నెమరువేసుకోకూడదు’. చాలామంది చేసే పొరపాటు ఏమంటే ఉద్యోగమొస్తానే ఇక చదవాల్సిన పనిలేదనుకుంటారు. అదే పెద్ద తప్పు. అప్పుడుకూడా... నన్నడిగితే జీవితమంతా చదువుకుంటూనే వుండాలంటాను. సర్వేపల్లి రాధాక్రిష్ణన్ అట్టా చదివే గదా రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. నువ్వు ఏపనిచేనినా సరే ఒక కమిట్‌మెంటుతో చెయ్యి. నీకపారమైన ఆనందం కలుగుతుంది. ఎటూ టీచరుద్యోగంలో చేరావు కాబట్టి విను. నేనంటే గౌరవమన్నావు నిజమేనా?’’

    ‘‘గొప్పగా సార్!’’

    ‘‘ఎందుకు?’’ ప్రశ్నించాడు.

    ‘‘మీ మాటలు మాకంత ఇంప్రెసివ్‌గా అన్పించేవి. మీకు గుర్తుందో లేదో నేను ఇంగ్లీష గ్రామరులో వెనుకబడినానని స్కూలు అయిపోయిన తర్వాత నాకొక్కడికే మీరు యాక్టివ్ వాయిన్ ప్యాసివ్ వాయిస్ చెప్పారు. ఆ తర్వాత ఆలోచిస్తే మీరెంత గొప్పవారో అర్థమైంది సార్!’’ అన్నాడు.

    వెంకట్రామిరెడ్డికి శిష్యడి మాటాలు చాలా సంతృప్తినిచ్చి గుండెల్లో వున్న సంతోషం నోటి నుండి నవ్వుగా, కళ్ళనుండి నీటిగా పైకొచ్చినాయి. ‘‘చాలు, చాలు.   నీలాగే, మిగతావాళ్ళు అంతా కాకపోయినా కొంతమంది అయినా ఆలోచించి వుంటారుగదా!’’ ఆయన గొంతు బొంగురు బోయింది.

    ‘‘ఓ యమ్మా! మిమ్ములను మరిచిపోయిందెవరు సార్? అందరికీ చాలా బాగాగుర్తున్నారు.’’

    ‘‘మరి నేను ఉపాధ్యాయుడిగా సక్సెన్ అయినట్లేగదా!’’

    ‘‘అనుమానమెందుకు సార్?’’

    ‘‘మరి నీకూ నామాదిరి అన్పించుకోవాలని లేదా?’’ అని ఆయన దిలీప్ కళ్ళలోకి చూశాడు. ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది. ఆ చూపు తనలో నిద్రిస్తున్న శక్తులను తట్టిలేపింది. కాేనపు దిలీప్ ఆలోచనలో పడ్డాడు. అంతలోనే స్పురించిన సందేహం బయట పెట్టాడు.

    ‘‘ఖచ్చితంగా వుంది సార్! కానీ తోటి ఉపాధ్యాయులు, పరిన్థితులు, నాకు సహకరించడం లేదు’’ అన్నాడు నిరాశపూరితమైన గొంతుతో.

    ‘‘ఎట్లాచెప్పు?’’ అన్నాడాయన శిష్యడి సందేహాన్ని వినాలని సమాయత్తపడుతూ.

    ‘‘మొన్నొకరోజు ఇద్దరు పేదపిల్లలకు పలకా బలపం, కొన్ని పుస్తకాలు కొనిచ్చాను సార్! మాతోటి టీచర్లు నామీద కొట్లాట వేసుకున్నారు. ‘ఇట్లాంటివి చేని మంచివాడివి అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు. ఊరివాళ్ళ దృష్టిలో నువ్వు హీరో అయి మమ్ములను పనికిమాలినోళ్ళుగా చెయ్యాలనుకుంటున్నావా?’ అని తగవేసుకున్నారు సార్’’ అన్నాడు దిలీప్, ఆవేదనతో.

    ఆమాటకు భళ్ళున నవ్వాడు వెంకట్రామిరెడ్డి. ఆ నవ్వులో ఆంతర్యం బోధపడక బిక్కమొగం వేశాడు దిలీప్. ‘దానికాయన ఏం పరిష్కారం చెపుతాడా?’ అని తదేకంగా ఆయనదిక్కే చూశాడు.

    గొంతు సర్దుకొని కాచి వడబోనిన తన అనుభవాన్ని రంగరించి చెప్పసాగాడు వెంకట్రామిరెడ్డి.

    ‘‘జీవితం ఒక యుద్దమంటాడు’ ఒక తత్త్వవేత్త. దీనికి వివరణ అవసరమా? నువ్వు మంచి పనులు చెయ్యాలంటే సవాలక్ష అడ్డంకులు. నువ్వు నీ మనసుకు నచ్చినట్లు చేస్తావా, లేక ఎదుటివారి మెప్పుకోసం చేస్తావా?’ అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఓచోట ఓ అద్బుతమైన సూక్తిని చదివాను.  ‘అందరిచేత మంచివాడు అన్పించుకోవడం వీలుగాని పని. మంచిపనులు చేసుకుంటూ పోవడమే నాపని’. నీతోటి ఉపాధ్యాయులు ఈర్ష్యపడడం నిజమే. కానీ ఆ క్లాసులోని విద్యార్థు లంతా నిన్ను ఆరాధించివుంటారు. నీకు మనసుంటే వాళ్ళ గుండెచప్పుడు విను. అజ్ఞానులైన వాళ్ళ తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రయోజకులైతే పొందే ఆనందాన్ని ఆలోచించు. నీకేది ఇష్టమో దాన్ని ఎంచుకో.’’ రిటైరైన చాలా సంవత్సరాలకు తిరిగి పాఠంచెప్పాడు వెంకటరామిరెడ్డి. ఆయన మాటలను ఒకవిధేయుడైన విద్యార్థిగా విన్న దిలీప్ గీతాసారం మొత్తం గ్రహించిన అర్జునిడిలా గుండెలనిండుగా గట్టిగా ఊపిరి పీల్చుకుని కార్యోన్ముఖ్యుడైనాడు.

* * *

    ‘‘దిలీప్!  టైమ్ అయిపోయింది. లాంగ్‌బెల్ కొట్టించెయ్’’ అన్నాడు సుబ్బారెడ్డి.

    ‘‘సారీ సార్! ఈరోజునుండి నో లాంగ్‌బెల్ ప్లీజ్. మీకు టైమ్ అయిపోయివుంటే వెళ్ళిపోండి’’ అన్నాడు దృఢంగా. ఆ గొంతులోని తెగింపుకు సుబ్బారెడ్డి జంకాడు. అయినా విననట్లు నటించి బింకం సడలకుండా క్యారియర్ సర్దుకొని  వెళ్ళిపోయాడు.

    కొన్నిరోజుల తర్వాత స్కూల్ టైం అయిపోయి చాలాసేపైనా లాంగ్‌బెల్ కొట్టకపోయే సరికి అనుమానం వచ్చి ఇంగ్లీష్ టీచర్ రాఘవ, సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చి అడిగాడు.  ‘‘సార్! హెడ్‌మాస్టర్ గారూ! ఏంటీ! ఈ మధ్య టైం అయిపోయినా లాంగ్‌బెల్ కొట్టించడంలేదు. ఏమయింది?’’ అన్నాడు. 

    ‘‘లేదు సార్! ఊర్లో వాళ్ళంతా ‘కొత్త టీచర్ చీకటి పడేంతవరకూ పిల్లలందర్ని కూర్చోపెట్టుకుని స్టడీక్లాసులు మెయిన్‌టైన్ చేస్తుంటే మీరు టైం కాకముందే, వెళ్ళిపోతున్నారే!’ ఆయనకున్న శ్రద్ధ మీకెందుకు లేదు? అని ముఖంమీదే అడుగు తున్నారు అసహనంగా. ఆ మాటలు ఈటెల్లా ఉన్నాయి. మనంకూడా మారకపోతే సమాజంలో పనికిరాకుండా పోతాం. అందుకోసం ఇక నుంచీ ‘నో లాంగ్‌బెల్ ప్లీజ్!’’’ అన్నాడు సుబ్బారెడ్డి.

    రాఘవకు విషయం అర్థమై దిలీప్ కోసం వెతికాడు. గ్రౌండ్‌లో విద్యార్థులతో కలిని అటలాడుతూ  వున్న దిలీప్ వారికో మార్గనిర్దేశకుడిలా కనిపించాడు.

(నవ్య వీక్లీ ఆగష్టు 3,2011 సంచికలో ప్రచురితం)
Comments