నుపకారికి నపకారము! - భమిడిపాటి రామగోపాలం

      
 
అతనికి కింద బెర్తే వచ్చింది. సూట్‌కేసు బెర్త్ కింద పెట్టుకోవచ్చును. కాని ఎందుకో పైబెర్తులో గాని, ఆ పక్కన అమర్చిన ఇనుపతీగల షెల్ఫులోగాని పెట్టాలనుకున్నట్టుగా పైకి ఎత్తాడు. మళ్ళీ దించేటప్పుడు సూట్‌కేసు మూల ఒకటి నా తలకు తగిలింది. అతడు సూట్‌కేసును బెర్త్ మీద పడేసి “సారీ, సార్!” అని నా రెండు చేతులూ పట్టుకుని ఊపాడు. నేను లోలోపల బాధపడుతున్నా “ఇట్స్ ఆల్ రైట్” అనేశాను. ఇద్దరం సీట్లలో కూర్చొన్నాం. ఎదురెదురు సిట్లు. కిటికీల పక్క సీట్లు.

        నాకు దెబ్బ తగిలినందుకు అతనికి కూడా కొంత మనో బాధ కలిగి ఉండాలి. అందుకనే కాబోలు, దానిని స్వాంతన పరచుకోవడానికి అన్నట్లుగా నాతో సంభాషణకు దిగాడు.         "నా పేరు అఖిలాండేశ్వరం. మీరు?" అన్నాడు.         "అఖిలాండేశ్వరమా? మీ పేరు వినగానే నా జ్ఞాపకాలు పొరలు పొరలుగా లేచి మీరెవరో తెలుసుకోవాలని కోరిక కలుగుతోంది."         అతను తెల్లమొహం వేశాడు. "నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 25 చోట్ల పనిచేసి ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూసిన గుర్తు లేదు. మీరు ఏదైనా క్లూ అందిస్తే తెలుసుకోగలనేమో."         నేను అతనికి క్లూ అందించే ప్రయత్నంలో అలా అలా జ్ఞాపకాల పొరల దిగువకి ప్రయాణం చేశాను...

* * * * *

        1975-76 ప్రాంతం. నేను శృంగవరపు కోట సబ్ పోస్టాఫీసులో క్లర్కుగా పని చేసిన కాలం. సబ్ పోస్ట్ మాస్టారు, నేను, మరొక గుమాస్తా, ఇద్దరు పోస్టుమేన్లు, ఇద్దరు రన్నర్లు. ఇదీ మా ఆఫీసుకి ఉన్న మానవ యంత్రాంగం. 

        ఒకనాడు సాయంత్రం ఐదుగంటలకి రెండు నిముషాలు ఉంది - అదే సమయంలో 20-22 వయస్సుగల ఒక అబ్బాయి ఒగర్చుకుంటూ పోస్టాఫీసుకి వచ్చాడు. "నాకొక రిజిస్టర్డు లెటర్ వచ్చిందంటండి, మా అమ్మ చెప్పింది. పోస్ట్ మాన్ మా ఇంటికి వచ్చిన సమయానికి నేనింట్లో లేను. దయచేసి ఆ రిజిస్టర్డ్ లెటర్ నాకు ఇప్పించండి" అన్నాడు.

        "మీ పేరేమిటి?" అన్నాను డెలివర్ కాకుండా ఉండిపోయిన రిజిస్టర్ లెటర్లూ, పార్సిల్సూ ఉన్న కట్ట తీస్తూ

               మా పోస్ట్ మాస్టర్ గారు కిటికీ అవతల ఉన్న అబ్బాయినీ లోపల లెక్కలు పూర్తి చేసుకుంటున్న నన్నూ పరీక్షగా చూశారు.

        "ఇతను మన బీటు పోస్టుమాను వళ్ల ఇంటికి వెళ్లినప్పుడు షికార్లు కొట్టి ఇప్పుడు తయారయ్యాడు మన పీకల మీదకి. సోమవారం ఇద్దాం, వెళ్లిపొమ్మను" అంటూ ఆ అబ్బాయి వేపు చెయ్యి చూపించి, "వెళ్లవయ్యా, వెళ్లు! ఎప్పుడూ తలుపు కొడితే అప్పుడు తీసి నీకు సలాంలు కొట్టే గులాంలు ఎవరూ లేరిక్కడ" అనేశారు.         ఆ అబ్బాయి వెర్రి మొహం వేసుకుని కిటికీ చాటుకి తప్పుకున్నాడు. పోస్టుమాస్టరు తన సీటులోకి వెళ్లిపోయాక మళ్లీ నా కిటికీ ఎదురుగా వచ్చాడు. "సార్! ఆ లెటరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి వచ్చి ఉండాలండి. రేపు ఆదివారం, బహుశా అది ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయి ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూ ఎల్లుండి సోమవారం కాకపోతే ఫరవాలేదు గానండి ఎల్లుండే అయితే మాత్రం నేను ఈ రాత్రికి రాత్రే శృంగవరపుకోట నుంచి విశాఖపట్నం వెళ్లి రేపు ఉదయమే హైదరాబాద్‌కి ప్రయాణం కట్టాలండి. అంచేత మీరు నా మీద దయ తలచి ఆ కవరు నాకిప్పించండి, సార్" అని దండాల మీద దండాలు పెట్టాడు.

        నేను పోస్టుమాస్టర్ ఉన్నవేపు చూశాను. ఆయన తల వంచుకుని లెక్కలు కూడుకుంటున్నాడు. నేను కిటికీలోంచి ఆ ఉత్తరం అతనికి ఇచ్చేసి డెలివరీ షీటు మీద సంతకం తీసుకున్నాను. ఇంతకీ టైము 5 గంటలు దాటిపోలేదు.

* * * * *

        "మీది శృంగవరపు కోటా?" అని అడిగాను.

        "అవును మీకెలా తెలుసు?"

        "సాధారణంగా జ్ఞాపకం ఉండకపోయేదే కాని, మీది చాలా రేర్ నేమ్. చాలా సంవత్సరాల క్రితం ఒక రోజు పోస్టాఫీసు కట్టేసే 

వేళప్పుడూ వచ్చి రిజిస్టర్ లెటరు తీసుకున్న అఖిలాండేశ్వరం మీరేనేమోనని అనుకుంటున్నాను..." అని ఇంకా ఏదో చెప్పబోతూ 

ఉంటే నా ఎదుటి సీటులో ఉన్నాయన రెండు చేతులూ జోడించి, నాకు నమస్కారం చేశాడు. కిందికి వంగి నా పాదాలు 

అందుకుందామని ప్రయత్నించాడుగాని రైల్లో స్పేస్ అందుకు సరిపోలేదు. నేను ముడుచుకుని ఉన్న అతని చేతులు రెండీంటినీ 

పైకి ఎత్తి విడదీశాను.

        "యు ఆర్  పర్‌ఫెక్ట్‌లీ రైట్. మీరు ఆ రోజు నాకు అక్రాస్ - ద - విండో డెలివరీ చేసిన లెటర్ విలువ ఇంత అని చెప్పలేను. 

శనివారం మీ దగ్గర ఆ ఉత్తరం అందుకున్నాను. సోమవారం ఉదయం పదిన్నరకి హైదరాబాదు జాంబాగ్‌లో ఉన్న సర్వీస్ కమీషన్ 

ఆఫీసులో ఇంటర్వ్యూకి హాజరు కాగలిగానంటే అదంతా దేవుడు మీ రూపంలో కూర్చుని నాకు చేసిన ఉపకారం తప్ప మరొకటి 

కాదు. నేను ఆ ఇంటర్వ్యూలో గెలుచుకుని డైరెక్టుగా సి.టి.ఓ గా అపాయింట్ అయ్యాను. పదేళ్ల పాటు శ్రద్ధతో, గడుసుదనంతో 

పనిచేసి ఇటు రాజకీయ నాయకుల అనుగ్రహం, ఇటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఆదరం పొంది కన్ఫర్డ్ ఐ.ఎ.ఎస్. అయ్యాను. 

ఎవరినీ నొప్పించక కొంచెం కూడా అప్రతిష్ట తెచ్చుకోకుండా నెగ్గుకొచ్చాను. ఈ రోజు తెల్లారగట్ట శృంగవరపు కోటలోనే మా 

చిన్నాన్నగారి మనవరాలి పెళ్ళి జరిగింది. నా తరానికి నేనే పెద్ద. అందుచేత చాలా పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ రాక తప్పలేదు. ఈ 

తిరుగు ప్రయాణానికి ఎ.సి.టిక్కెట్టు కోసం ఎంత గట్టిగా ప్రయత్నించినా కన్‌ఫర్మ్ అవలెదు. అయితేనేమి, 'అన్నీ మన మంచికే' 

అంటారు. ఆ విధంగా ఆనాడు మనిషి రూపంలో ఉన్న దేవుడిలాగా జన్మంతా జ్ఞాపకం ఉంచుకోదగిన ఉపకారం చేసిన మిమ్మల్ని ఏ 

ప్రయత్నమూ, వెతుకులాటా లేకుండా చూడగలిగాను."


* * * * *

        నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఆడపిల్లల పెళ్లిళ్లు కష్టపడి చేయగలిగాను. కాని మా అబ్బాయి ఎంత తెలివిగా చురుకుగా ఉన్నా వాడికి గవర్నమెంటు ఉద్యోగం రాలేదు. రాబర్టు బ్రూస్ లాగా అన్ని పోటీ పరీక్షలలోనూ బుర్ర బొప్పి కడుతూనే ఉంది. ఇప్పుడు సర్వే డిపార్ట్‌మెంట్‌లో డిప్యుటీ ఇన్స్పెచ్టర్ సెలక్షన్ బాకీ ఉంది. ఎల్లుండి అంటే సోమవారం మా వాడికి సర్వే సెటిల్‌మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ కమీషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది. మా అబ్బాయి సుమారు పది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి ఈ ఉద్యోగం తనకి రావాలంటే ఎటువంటి 'పట్టు పరిశ్రమ' చేతిలో ఉండాలి - అనే ఆలోచనలో గడుపుతున్నాడు.

        తుని స్టేషన్‌లో అఖిలాండేశ్వరం గారు నాకు కాఫీ రప్పించారు. అంతసేపూ ఉద్యోగ సంసార రంగాలలో అతని అభివృద్ధులూ, చమత్కారాలూ, చాకచక్యాలూ, అదృష్టాలూ, గడుసుతనాలూ వినడంతోటే నాకు సరిపోయింది. ఇన్ని సంగతులు, ఇన్ని ఎగుడుదిగుడులు మా పోస్టల్ శాఖలో ఉండవు గాక ఉండవు. భారతదేశంలోని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి లంచం అంటూ దొరకనిది మా డిపార్ట్‌మెంట్ వారికే. ఇంక ఆడపిల్లల పెళ్లి చేసి ఎంత అలసి పోయానో తలచుకుంటే చింత తప్ప ఏమీ తలపులోకి రాదు.

        తుని దాటాక మొదలు పెట్టిన నా స్వీయ చరిత్ర రాజమండ్రి వరకూ విన్నాడు అఖిలాండేశ్వరం గారు. ఎప్పుడు నా నోట ఏ మాట జారిందో గాని ఆయనకి (అనగా నా కంటే వయసు చేత పదేళ్లు చిన్నవాడు, మిగిలిన ప్రమాణాలన్నిటిలో నాకంటే ఎన్నో తరాల పెద్దవాడు అయిన అఖిలాండేశ్వరం గారికి) నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానో తెలియజేశాను.
        రాజమండ్రిలో ఒక డవాలా బంట్రోతు మా కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు. వస్తూనే అఖిలాండేశ్వరం గారిని గుర్తుపట్టి నమస్కారం పెట్టి "రండి అయ్యగారూ! సెకండ్ ఎ.సి.లో ఒక బెర్తు ఉంది" అంటూ అతని సూట్‌కేస్ అందుకుని వెళ్లాడు.         అఖిలాండేశ్వరం గారు నాకు ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి చెప్పాడు. "మీ అబ్బాయి సెలక్షన్ గురించి మీరు ఏ చింతా పెట్టుకోకండి. ఎల్లుండి మీ అబ్బాయితో పాటు మీరు కూడా మా ఆఫీసుకు వచ్చేయండి" అని చాలా ప్రేమగా నవ్వాడు.
        "సెలెక్ట్ చేసేది నేనే. నన్నిప్పుడు కమీషనర్ ఆఫ్ సర్వే సెటిల్‌మెంట్ అంద్ లాండ్ రికార్డ్స్ అంటారు."  

* * * * *

        సోమవారం.
        మా అబ్బాయి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఆనందంగా ఇవతలకి వచ్చాడు. "పని అయిపోయినట్టే. ఆఖరి క్షణంలో కమీషనర్ గారు నాకు షేక్‌హాండ్ ఇచ్చి 'మీ నాన్నగారిని అడిగినానని చెప్పండి' అన్నారు.

        అఖిలాండేశ్వరం గారు మా అబ్బాయికి అన్ని విషయాలూ చెప్పాడు. పది రోజులలోగా ఆర్డరు వస్తుంది. ఆర్డరు వచ్చేలోగా ఇతను శృంగవరపుకోట వెళ్లాలి. తనవి, అంటూ ఉండే సామాగ్రి అంటే చొక్కాలు, ప్యాంట్లు మొదలైన బట్టలూ, తనకి ఇష్టమైన పుస్తకాలూ తెచ్చెసుకోవాలి.         ఆర్డరు మేము ఇప్పుడు ఉంటున్న మా పెద్దమ్మాయి కేరాఫ్‌కి వస్తుంది.         అంతవరకు నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు.         అబ్బాయికి ఆరువారాల సాంకేతిక శిక్షణ ఉంటుంది. అది హైదరాబాద్ లోనే చేయించేస్తారు.         శిక్షణ విజయవంతంగా జరిగినట్టు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో పాటే అతనిని ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక జిల్లాకి ఎలాట్ చేస్తూ ఆర్డర్ ఇస్తారు.         కొన్నాళ్ల వరకు కుటుంబాన్ని తీసుకెళ్ళకుండా ఒక్కడే ఉండడం మంచిది.         ట్రైనింగుకి గాను జాయినైన నాటి నుండి సర్వీసు లెక్కలోకి వస్తుంది. జీతం చెల్లిస్తారు.

        చాలా గొప్ప ఉపకారం జరిగిందని అందరమూ సంతోషించాం.
        శృంగవరపుకోటలో ఒంటరిగా ఉంటున్న నా భార్యకు టెలిఫోన్ ద్వారా సంగతి అంతా చెప్పాను.         నేను హైదరాబాదులో ఉండనవసరం లేదని అఖిలాండేశ్వరం చెప్పారు గాని నాకు ఆ ఆర్డరు వచ్చేవరకైనా ఉండిపోవాలని ఉంది. ఏముంది! నా కూతురూ, అల్లుడూ నన్ను గౌరవంగా చూసుకుంటారు.

* * * * *

        ఇంటర్వ్యూ జరిగిన ఆరవ రోజున అఖిలాండేశ్వరం గారి పర్సనల్ అసిస్టెంట్‌నని తనను తాను పరిచయం చేసుకున్న గంగాధర్ అనే నడివయసు వ్యక్తి మా అమ్మాయి ఇంటికి వచ్చి నన్ను కలుసుకున్నాడు. పలకరింపులోనే ఒక ప్రత్యేక ఆపేక్ష కనపడింది. కాని "మీరింకా ఇక్కడే ఉన్నారా? కమీషనర్ గారు చెప్పలేదు!" అన్నాడు.

        "ఇదేమీ పరాయి ఇల్లు కాదు. మా అల్లుడు గారు చాలా మంచివాడు."

        "మీతో గుట్టుగా చెప్పవలసింది ఒకటి ఉంది. అంతకంటే ముందు మీ అబ్బాయికి వచ్చే ఉద్యోగం గురించి కూడా కొంత చెప్పాలి. మనం ఇక్కడ స్వేచ్చగా మాట్లాడుకోవచ్చునా?" అన్నాడు ఆ గంగాధర్.

        "నిరభ్యంతరంగా! మా అబ్బాయి శృంగవరపు కోట వెళ్లిపోయాడు. మా అల్లుడు ఆఫీసుకి వెళ్లాడు. మా అమ్మాయి కూరగాయల కోసం కాబోలు బజారుకి వెళ్లింది. మీరు ఒక కప్పు కాఫీ పుచ్చుకుంటారంటే నేను రెండు నిమిషాలలో తయారుచేసి పట్టుకొస్తాను."
        గంగాధర్ చేతులు రెండూ ఆడిస్తూ "అబ్బే, అబ్బే! అలాంటి మర్యాదలు వదిలేయండి. పెద్దవారు, మీరు నాకోసం ఎందుకు శ్రమ పడాలి?"         అతను వద్దనడం, నేను ఇస్తాననడం, ఈ టెన్నిస్‌లో రెండు నిమిషాలు గడిచాయి. అప్పుడు అతను పాయింట్‌కి వచ్చాడు.

        "మీ అబ్బాయికి ఇచ్చేది గెజిటెడ్ పోస్టుకాదు. అయినప్పటికీ ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో ఉన్న స్థితి ప్రకారం ఇవాళ ఫిబ్రవరి 14కదా. జూన్‌లో జరిగే డిపార్ట్‌మెంటల్ పరీక్ష వ్రాసేస్తే ఈ ఏడాదిలోపుగా అతను డిప్యుటీ ఇన్స్పెక్టరుగా ప్రమోషన్ పొందుతాడు. ఇవాల్టికి సరిగ్గా నాలుగేళ్లకి అసిస్టెంటు డైరెక్టరే అవుతాడు. అలా అలా 10-12 ఏళ్లలో డిప్యుటీ డైరెక్టర్ అయి 15-20 ఏళ్లలో జాయింటు డైరెక్టర్ పోస్టుకి వచ్చి రిటైరవుతాడు. వింటున్నారా! మీరు మా కమీషనర్ గారికి ఎప్పుడో ఆయన చిన్నతనంలో పరిచయం. మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇస్తున్నారాయన. అందుచేత మీరు మీ అబ్బాయి మీద కొంత పెట్టుబడి పెట్టడంలో తప్పేమీలేదని నేనంటే మీరు కాదంటారా?"
        నేను కొంచెం గ్రహించాను. కొంచెం నీరసం వచ్చింది. కళ్లు మూసుకుని "అబ్బే, అబ్బే!" అన్నాను. అది ప్రతిఘటన కాదు. అతను తనకో, కమీషనర్ గారికో ఏదో కానుక (లంచం) ఇమ్మంటాడని అర్థమయింది.         "అందరికీ అమలులో ఉన్న రేటు మీకు వర్తించదు. క్రిందటి వారం ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు 25మంది. ఖాళీలు 5. మీగతా నలుగిరిద్వారా రెండేసి లక్షలు తీసుకున్నాం. మీ దగ్గర ఆయన ఆశిస్తున్నది కేవలం 50,000 రూపాయలు మాత్రమే..."         నేను తల నిలువుగా ఆడించాను.

        "ఏముంది! మీ అమ్మాయిలిద్దరూ వాళ్ల తమ్ముడీకి చెరో 15వేలు ఇచ్చినా మీరు జమచేయాల్సింది జస్ట్ 20,000 రూపాయలు. అసలు మీ అబ్బాయి ఇక శృంగవరపుకోట మొహమే చూడక్కరలేదు. కనుక మీరు ఆ యిల్లు అమ్మేస్తే ఈ 50,000 కాక నికరంగా 5 లక్షలు మిగులుతాయి. మీది పాత ఇల్లే అయినప్పటికీ, కేవలం వంద గజాలే అయినప్పటికీ హైవే నెంబరు 43 మీద ఉంది కాబట్టి మంచి రేటు వస్తుంది. మీరు మీఅబ్బాయితో వృద్ధాప్యమంతా నిశ్చింతగా గడుపుకోవచ్చు. మీరూ ఆర్థికంగా అతని మీద ఆధారపడకుండా మీ పెన్షన్ మీకుంది. ఇది ఫ్యామిలీ పెన్షన్ రూల్సు వర్తించేది కూడా. అంచేత...."
        "మీకు నాలుగైదు రోజుల లోపల 50 వేలు పోగు చేసి ఇవ్వాలి! ఈ మాత్రం దానికి డొంక తిరుగుడు ఎందుకు? నేను రడీ... అయితే నా అనుమానాలు నాకుంటాయి. సొమ్ము మీకు ఇవ్వను, మీ కమీషనర్ గారికే ఇస్తాను. ఎప్పుడివ్వాలి, ఎక్కడివ్వాలి, ఆ సమయంలో అతని చేతిలో మా అబ్బాయి అపాయింట్‌మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటుందా? ఇదంతా అతని పి.ఎ.గా మీరే ఆర్గనైజ్ చేసుకోండి" అని చెప్పేసి షేక్‌హాండ్ ఇచ్చి నిలబడ్డాను. అతను షేక్‌హాండ్ ఒదిలాక నమస్కారం కూడా పెట్టాడు.         "మరి... నాకు సెలవిప్పించండి. నేను మీ సమక్షానికి వచ్చి నాలుగు సంగతులు విడమర్చి చెప్పినందుకు నా మీద కూడా కొంత దయ ఉంచండి"         వెనక్కి తిరగకుండా వెళ్లాడు.
        నేను కూడా వెనక్కి తిరిగి చూడలేదు.  

* * * * *

        అంతా అనుకున్నట్టే జరిగింది.
        అయితే ఒక చిన్న చిక్కు హఠాత్తుగా వచ్చిపడింది.         సరిగ్గా సమయానికి అవినీతి నిరోధక శాఖలో డిప్యుటీ సూపరింటెండ్‌గా పని చేస్తున్న మా అల్లుడూ జంబుకేశ్వరరావు తన బలగంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కమీషనర్‌గారి రూం దగ్గర చిన్న కాబిన్‌లో కూర్చుని ఉండే పి.ఎ.గంగాధర్ వాళ్ల వెనకాలే "ఏమిటి, ఏమిటీ" అని అరచుకుంటూ కమీషనర్‌గారి చాంబర్స్‌లోకి ప్రవేశించాడు.         "అమ్మ ముసలోడ! ఎంత పని చేశావురా!" అని నా మీద విరుచుకుపడ్డాడు. అతనిని కానిస్టేబుల్స్ నా నుడి విడదీసి కమీషనర్‌గారి సొరుగు ప్రక్కన నిలుచోబెట్టారు.         అఖిలాండేశ్వరం నాకు ఆర్డరు కాపీ చేతికందిస్తూ ఉండగా మా అల్లుడీ స్టాఫ్ అతని సొరుగులో నుంచి ఐదు నూరు రూపాయల కట్టలను పైకి లాగి టేబుల్ మీద పెట్టారు. ఒక కానిస్టేబుల్ బాత్‌రూంలోకి వెళ్లి చిన్న బకెట్‌లో కొద్దిగా నీళ్లు తెచ్చాడు. అందులో అఖిలాండేశ్వరం చేతులు ముంచారు. క్షణాలు గడిచేలోగా ఆ నీటిలో ఎర్రరంగు ఏర్పడింది. నీళ్ళను వాళ్లు తెచ్చిన మగ్గులోకి పోసి అతని చేతులకు అంటుకున్న రంగును ఒక టిష్యూ పేపర్ వేలి ముద్రలతో దాచారు. జరిగిన దానినంతటినీ ఒక కానిస్టేబుల్ డిజిటల్ కెమెరాలో పది పదిహేను ఫోటోలలో దాచాడు. 

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సెప్టెంబర్ 2009 సంచికలో ప్రచురితం)        
Comments