నువ్వే నేను, నేనే నువ్వు - పులిగడ్డ విశ్వనాథ రావు

    
ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. అదే మొహం. అవే బట్టలు - వాడి వాడి అరగదీసిన ఖాకీ నిక్కరు, నల్ల గళ్ళ షర్టు, చెప్పులు లేని కాళ్ళు.

    జంతికలు, కారపు బూందీ, మిక్స్‌చర్ పొట్లాలు గల సంచి ఒక చేతిలో, రెండో చేతిలో రెండు మూడు పొట్లాలు ఉన్నాయి. గబగబా మార్కెటు వైపు వెళుతున్నాడు, దుకాణాలలో అమ్మడానికి. ఇళ్ళల్లో అమ్మడం అయినట్టుంది.

     "ఓ అబ్బాయి! అబ్బాయి" అని పిలిచా.

    వెనక తిరిగి నను చూసాడు.

    దగ్గరకు వచ్చి, "పొట్లం ఐదు రూపాయలు సార్ - దుకాణాలలో ఆరుకి అమ్ముతారు. ఏఁవిటి కావాలి? మిక్స్‌చరా, కారపు బూందీనా లేక జంతికలా? చాలా కమ్మగా ఉంటాయి. ఒకసారి కొంటే మళ్ళామళ్ళా కొంటారు. ఎన్నెన్ని పొట్లాలు, సార్?" అన్నాడు.

    "నీ పేరు వెంకటరావు కదూ? నిన్ను వెంకడూ అని పిలిచే వారు?"

    "ఔను, సార్. తమరు..." అని నసిగాడు.

    "నా సంగతి తర్వాత చెప్తా కాని నువ్వు చదువుతున్నావు కూడానా, ఈ పని మాత్రమే చేస్తున్నావా?"

    "చదువు మానేయలేదండి. తీరిక దొరికినప్పుడల్లా పొట్లాలు అమ్ముతానండి"

    "ఏం చదువుతున్నావు"

    "స్కూల్ ఫైనలండి"

    "అన్నట్టు నువ్వు ఏడవ క్లాసులో నీ ఇంగ్లీషు మాస్టారు కాని, ఏ ఉద్యోగి కాని కాడే! ఈయనకి ఎవరో చెప్పి ఉండాలి. ఇంతకీ ఆ గొడవంతా ఈయనేందుకు? ఏదో చెబితే సరిపోతుందిలే అనుకుని, "నాకు గుర్తు లేదు సార్. మీకు ఏ పొట్లాలు కావాలో చెప్పండి?" అన్నాడు.

    "ముందు ఆ రహస్యం ఏమిటో చెప్పవోయ్? పొట్లాల మాట తర్వాత చెబుతా"

    "నేను మాస్టారు పాఠం గురించి అడిగ్ఫిన ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పలేకపోయేవాడినండి"

    "పచ్చి అబద్ధం. నే చెప్పేదా? నువ్వు ఇంగ్లీషు  టెక్స్ట్‌బుక్ క్లాసుకు తెచ్చేవాడివి కాదు. నిజమేనా?" 

    వెంకడి మొహం చిన్నబోయింది. ఈయనకి ఈ రహస్యాలన్నీ తెలిసినట్టుంది అనుకున్నాడు.

    "ఔను సార్, నా వద్ద ఇంగ్లీషు టెక్స్ట్‌బుక్ ఉండేది కాదండి. ఆ మాష్టారు చాలా కఠినుడండి. టెక్స్ట్‌బుక్ తేలేకపోయేసరికి ముందు అరచేతిమీద బెత్తంతో కొట్టేవాడండి. అప్పటికీ తేకపోతే బెంచి మీద నిలబెట్టేవాడండి"

    "నీ తోటి విద్యార్థుల ముందు అలా రోజూ బెంచి మీద నిలబెడితే నీకెలా అనిపించేది?"

    "ఏడుపొచ్చేదండి. కాని వాళ్ళ ముందు ఏడిస్తే మరింత తలవంపు అనుకుని ఏడుపు ఆపుకునేవాడినండి"

    "మాస్టారు రేపు తెస్తావా అని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడివి?"

    "కాని తేలేదు. అంతేనా?"

    ఔనని తలూపాడు.

    "ఎందుకని తేలేదు?"

    జవాబు చెప్పడానికి తటపటాయిస్తున్నాడు.

    "దాని వెల మరీ ఎక్కువా?"

    "ఐదున్నర రూపాయలండి"

    "ఆ పాటి డబ్బులు మీ ఇంటిలో లేవా?"

    జవాబు లేదు. 

    "జవాబు చెప్పడానికి నీ నియ్యోగపు జన్మ అడ్డు వస్తోందా?"

    "ఇంక వెళ్ళివస్తానండి"

    "మన వాడివని ఆప్యాయతతో మాట్లాడుతూంటే అలా వెళ్ళిపోతానంటావేంటి? సరే మీ నాన్నగారు కృష్ణమూర్తిగారు ఏం చేసేవారు?"

    "హెడ్ క్లర్క్‌గా పనిచేసేవారండి"

    "హెడ్ గుమాస్తాగానా? ఎక్కడ?"

    "ఆర్.ఆర్.బ్రదర్స్‌లోనండి"

    "ఆర్.ఆర్.బ్రదర్స్ అంటే రామ్‌లాల్ అండ్ రాజారామ్   అనే మార్వాడీ కోమటి కొట్టు. చిన్న బజారులో ఉంది. దాంట్లో హెడ్‌గుమాస్తా ఎక్కడ నుంచి ఊడిపడ్డాడు? అక్కడ ఫుల్‌టైము గుమాస్తానే లేడే?"

    మౌనం!

    "నాముందా నీ బడాయిలు, నాన్నా! పుట్టింటి గొప్పలు మేనమామకి చెప్పినట్టుంది, నీ వ్యవహారం. ఐతే మీ నాన్న పార్ట్‌టైముగా కోమటి పద్దులు రాసేవాడన్నమాట. ఇంకా కొట్లలో కూడా రాసేవాడుగా?"

    "ఔనండి" అన్నాడు నేరం ఒప్పుకొన్నట్టు.

    "మరి గూరవనీయులైన మహరాజశ్రీ కృష్ణమూర్తిగారు - అంటే మీ తండ్రిగారు హెడ్ గుమాస్తా అని ఎందుకు చెప్పావు?"

    జవాబు లేదు. నేరస్తుడిలా దిక్కులు చూస్తున్నాడు. జాలిగా ఉంది వెంకడి పరిస్థితి.

    "తోటి విద్యార్థులు తమ తండ్రులు పెద్ద పెద్ద ఉద్యోగాలో, సగటు ఉద్యోగాలో చేస్తున్నార్ని చెప్పుకుంటూంటే నువ్వు మాత్రం మా నాన్న కోమటి కొట్లో పద్దులు రాసే పార్ట్‌టైము గుమాస్తా అని చెప్పుకోలేక ఆయన్ని హెడ్ గుమాస్తాగా పేమోటు చేసేసుకున్నావు. అంతే కదా? మరి అలా చెప్పి ఏఆడవవేం?"

    "అది నిజమేనండి" అన్నాడు ఏడుపు మొఖంతో.

    మీకెన్ని పొట్లాలు కావాలని అడిగే స్థైర్యం కూడా కోల్పోయినట్టుంది.

    "పోనీ అది అలా ఉంచు. ఉత్త అయిదున్నర రూపాయలు చేసే ఇంగ్లీషు టెక్స్ట్‌బుక్ ఎందుకు తేలేకపోయేవాడివి, చెప్పు? ఆ పాటి డబ్బులు మీ ఇంటిలో లేవా ఏమిటి?

    "లేవండి"

    "అంత కటిక దరిద్రమా?"

    వెంకడికి దుఃఖం ముంచుకొచ్చింది. ఇహ కళ్ళంట నీళ్ళు కారడం ఖాయం అనుకున్నా. కాని తమాయించుకున్నాడు.

    "కటిక ద్రరిద్రమేనండి. మా నాన్నకి తీవ్రమైన జబ్బు చేసిందండి" అన్నాడు జీరబోయిన గొంతుతో.

     "మళ్ళా దాస్తున్నావు. ఎటువంటి జబ్బు?"

    "టి.బి.అండి. ఆరోగ్యం బాగా క్షీణించాక కోవటి కొట్లలో పద్దులు రాయడం మానేసి మంచాన పడ్డాడండి. రాత్రింబవళ్ళు జ్వరం, దగ్గు, నెత్తురుతో కూడిన కఫం, అమ్మ ధర్మాసుపత్రులలో వైద్యం చేయించింది."

    "జబ్బు నయం అయిందా?"

    "ఎలా అవుతుందండి? మందులకి, పుష్టికర ఆహారాలకీ డబ్బులు కావాలిగా. రిక్షా డబ్బులకే తడుముకోవలసి వచ్చేది. ఇంటిలో చూస్తే ఓ పూట తింటే రెండో పూట పస్తు"

    "మీది సొంత ఇల్లు కాదు కదా? అద్దె ఎలా మేనేజ్ చేసేవారు?"

    "ఇంటి అద్దె ఎన్నో నెలలుగా బకాయిలో పడిందండి. ఇంటాయన ఇల్లు ఖాళీ చేయించాడు. అప్పుడు ఇల్లు మార్చాల్సి వచ్చిందండి"

    "ఎటువంటి ఇంటికి మారారో చెప్పవేం?"

    "మురికివాడలో ఇంటికి మారామండి"

    "అంటే గుడిసెలోకన్నమాట"

    జవాబు రాలేదు.

    "మరి అక్కడ జరుగుబాటు ఎలా అయ్యేది?"

    "మా అమ్మ ఉద్యోగంలో చేరిందండి"

    "శభాష్! సిసలు నియ్యోగనిపించుకున్నావు. మీ అమ్మ ఉద్యోగం చేయడానికి బి.ఏ, ఎం.ఏ చదివిందా?"

    "ఆమె చదువుకొనేలేదండి. రెండు, మూడు ఇళ్ళల్లో వంటకి కుదిరిందండి"

    "అలా దారిలోకిరా. ఇంతకీ మీనాన్న జబ్బు నయం అవలేదన్నమాట?"

    "లేదండి. టి.బి.ఆస్పత్రిలో చేర్చారండి. అక్కడే కన్నుమూసాడు. దాంతో అమ్మకు కాస్త వెసలుబాటు దొరికిందండి. ఇంటిలో వంటపని ఎలాగూ అక్కలు చూసుకునేవారు. ఆమె ఇళ్ళ్ల్లో వంటలు చేయడంతోబాటు జంతికలు, చేగోడీలు, కారపు బూందీ, మిక్స్‌చర్ చేసి సప్లయి చేయడం మొదలు పెట్టింది"

    "ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నువ్వు చదువు మానలేదు కదూ?"

    "దానికి కారణం మా అమ్మేనండి. మా నాన్న బ్రతికున్నప్పుడు చదువు మానేయమనేవాడండి. నేను చదివించలేను. ఏదో కూలీ నాలీ చేసుకు బతకండ్రా అనేవాడు. కాని అమ్మ మాత్రం మేం చదివి తీరాలనేది"

    "కానీ మీ ఒక అన్నయ్య చదువు మానేశాడు కదా?"

    "అమ్మ ప్రోద్భవం వలన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములం కొద్దో గొప్పో చదువుకుంటున్నాం. దాంట్లో ఆమె రాత్రింబవళ్ళు విరామం లేకుండా కష్టపడి కాస్తో కూస్తో సంపాయిస్తోంది కదా?"

    "కాని మీ ఒక అన్నయ్య చదువు మానేశాడుగా?"

    "మా చిన్నన్నయ్య చదువులో వీక్ అండి. అదీకాక మురికివాడలో ఉంటున్నాం కదా. అక్కడ అల్లాటప్పాగా తిరిగేవాళ్ళు వాడిని తమ మూకలో చేర్చుకున్నారండి. దాంతో వాడు చదువుకిస్ స్వస్తి చెప్పి వాళ్ళతో తిరగసాగాడు"

    "వాడికి జైలుశిక్ష పడింది కదా? ఆ కథ చెప్పవేం?"

    "జైలు శిక్ష కాదండి. వాడిని చిల్డ్రన్ హోమ్‌లో ఉంచారండి. మా వాడలో రౌడీలు ఒక చోరీ కేసులో పట్టుబడ్డారు. నిజానికి మావాడు ఏపాపం ఎరగడు. వాళ్ళతో ఉండడం వలన పోలీసులు వాడిని కూడా పట్టుకున్నారు"

    "మీ అమ్మని లంచం అడిగుంటారు. ఆమె ఇవ్వలేదు. అంతేనా?"

    "ఆమె పోలీసుల కాళ్ళావేళ్ళా పడిందండి. కాని రెండూ వేల లంచం ఇస్తే విడిచిపెడతాం అన్నారు. అమ్మ వద్ద అంత డబ్బు ఎలావస్తుంది? అప్పు అడిగి ఐదు వందలు ఇవ్వగలనంది. వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో మా అన్నయ్యకి చిల్డ్రన్స్ హోమ్‌లో శిక్ష తప్పలేదు."

    "ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మీ ఆ అన్నయ్య?"

    "ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటున్నాడు"

    "అంటే ఎలెక్ట్రికల్ మేస్త్రీకి హెల్పర్‌గా ఉంటున్నాడన్నమాట"

    జవాబు లేదు.

    "అది సరే కాని మీ ఒక అక్క ఎవరితోనో లేచిపోయిందట?"

    అబ్బాయికి కోపం వచ్చింది.

    "అది లేచిపోలేదండి. ఎవడినో ప్రేమించి వివాహం చేసుకుందండి. ఇప్పుడు హాయిగా సంసారం చేసుకుంటోంది. దానికి ఇద్దరు పిల్లలు" అన్నాడు కొంచెం గొంతు పెంచి.

    "ఔనులే, మంచి పనే చేసింది. లేకపోతే మీ అమ్మ ఆమె పెళ్ళి చేయగలిగెదా?"

    "అలా అంటారేంటి సార్? క్రిందటేడు మా చిన్నక్క పెళ్ళి చేసిందిగా?"

    "సంతోషం. సరే ఆ టెక్స్ట్‌బుక్ విషయానికి వద్దాం. క్లాసుకి తీసుకొచ్చావా?"

    "తీసుకొచ్చానండి"

    "ఎలాగ?"

    "అప్పుడు మా నాన్న చావుబతుకుల్లో ఉన్నాడండి. అమ్మ ఇంకా ఇళ్ళల్లో వంటకి కుదరలేదు. నేను చదువు మానేస్తానంటే, మానేయమనేది. ఇంటిలో పూట గడవడమే గగనమైపోతోంది. పుస్తకానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి? అందువలన నేను పుస్తకం విషయం అమ్మకి కాని ఇంటిలో ఎవరికీ కాని చెప్పలేదు"

    "ఐతే ఏం చేశావు?"

    "ఇంగ్లీషు మాష్టారు ఓ రోజు పుస్తకం తెస్తేనే నిన్ను క్లాసులోకి రానిచ్చేది. లేకపోతే క్లాసులో అడుగు పెట్టకు" అని వార్నింగ్ ఇచ్చేశారు. దాంతో... దాంతో..."

    "ఏం చెప్పవు? చెప్పడానికి మొహమాటంగా ఉందా?"

    "ఎలాగో డబ్బు సంపాయించానండి"

    "ఎలాగో అలాగంటే?"

    అబ్బాయి ఓర్పు కోల్పోయాడు. కోపం తట్టుకోలేకపోయాడు.

    "ఇంతసేపూ మీ ప్రశ్నలకి జవాబు చెబుతూ వచ్చాను. నన్నెందుకు ఇలా వేధిస్తున్నారు? ఇంతకీ మీకు పొట్లాలు అక్కరలేకపోతే మానె. నన్ను వెళ్ళనీయండి" అన్నాడు కటువుగా.

    "అలా ఆవేశపడకు, వెంకడు - నేను నీ ఇంటి రహస్యాలు ఎవరికైనా చెబుతానా ఏవిటి? నువ్వు నాకు కావలసినవాడివి, అందుకని చనువుగా మాట్లాడుతున్నా. నాకు తెలుసులే నువ్వు పుస్తకానికి డబ్బు ఎలా సంపాయించావో?"

    "ఐతే నన్నెందుకు అడుగుతున్నారు?"

    "అయ్యా! నేను పేద విద్యార్థిని, పుస్తకాలకి డబ్బులు లేవు, మీరు దయ తలుస్తారా అని ఇంటింటా వెళ్ళి అడిగినప్పుడు నీకు ఎలా అనిపించిందా అని"

    "నాకు మొదట్లో చచ్చిపోతే మేలనిపించింది. మీరన్నట్టు నియ్యోగపు పుట్టుక కదా? కాని ఏం చేయడం? ఇంగ్లీషు క్లాసులో అడుగు పెట్టాలంటే అడుక్కోక తప్పలేదు. కొంతమంది లేదన్నారు. కొంత మంది ఇదొక వేషం అన్నారు. కొంతమంది దయతలిచారు. ఆ విధంగా పుస్తకం కొన్నాను. ఆ తర్వాత అడుక్కుంటూనే చదువు కొనసాగించాను. అమ్మ ఈ పని మొదలెట్టినప్పటి నుంచి, చేయి చాచడం మానేశాను. ఆమెకు సాయం చేస్తున్నా. ఇంతకీ మీకు మా వివరాలు ఎలా తెలుసండి?"

    "నాకు నీ కుటుంబ విషయాలన్నీ తెలుసు. అసలు నేను నీలాగే అడుక్కుంటూ, తర్వాత పొట్లాలు అమ్ముకుంటూ చదువు సాగించాను. బి.టెక్.,ఎమ్.బి.ఎ., చేసి స్టేట్స్‌లో ఉద్యోగం చేస్తూ ఓ ఇంటివాడినయ్యాను"

    "అలాగండి!"

    "అసలు నేను కూడా మీ తల్లిదండ్రులు కన్నబిడ్డనే - కానీ నీకు అన్నదమ్ముడిని కాదు"

* * *

"ఏవిటండి. అదే పనిగా ఆలోచిస్తున్నారు? టీ కప్పు అందుకోండి" అన్న మా ఆవిడ పలకరింపుతో నా చిన్ననాటి జ్ఞాపకాలు, వాటితో బాటు, ఆ అబ్బాయి కనుమరుగయిపోయారు.

"ఆ ఏం లేదు. నా ఆదిపర్వంలోకి వెళ్ళి నన్ను నేనే ఇంటర్వ్యూ చేసేసుకున్నా, సావిత్రి" అన్నా మా న్యూజెర్సీ హోమ్‌లో టీ కప్పు అందుకుంటూ.

(రచన ఇంటింటిపత్రిక డిసెంబరు,2010 సంచికలో ప్రచురితం)   
Comments