ఓ ఇంటివాడు - దూరి వెంకటరావు

    
అది పదంతస్తుల అపార్టుమెంటు.     ప్రతి ఫ్లోర్‌లో ఇరవై చొప్పున రెండువందల ఫ్లాట్లున్నాయి. అన్నీ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌లే.     అది ఆ ఊళ్ళో అతి చిన్నది.     పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఊళ్ళో రెండువేల సంవత్సరం నుండి ఊపందుకున్న అపార్టుమెంటు సంస్కృతి విస్తరిస్తూ నేడీ స్థితికి చేరుకుంది. ఒక సైట్లో ఒక కుటుంబం ఇల్లు కట్టుకుని నివసించే బదులు అదే స్థలంలో కొన్ని పదుల కుటుంబాలు తలదాచుకోవడం నయమే కదా! అనివార్యం కూడా. అందుకే నేడెక్కడ చూసినా అంబరాన్నంటే ఆకాశహర్మ్యాలే కానవస్తున్నాయి.     గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న ఉమాపతి పక్క మీంచి లేచేసరికి బారెడు ప్రొద్దెక్కింది. రాత్రంతా తీవ్ర ఆలోచనలతో సతమతమవుతూ ఉండటం వల్ల సరిగ్గా నిద్రపట్టలేదు.

    మంచంమీంచి లేస్తూనే "భగవాన్! ఇంకా ఎంత కాలం నన్నిలా బ్రతకమంటావ్? కట్టుకున్న ఇల్లాలితో పాటు అంతా ఒక్కొక్కరు విడిచి వెళ్ళిపోతున్నారు. కాలం కరిగిపోతున్నా ఏ కొడుకు తలమీద రెండక్షింతలు వేసే భాగ్యానికే నోచుకోలేకపోతున్నాను. పెద్దవాడినో ఇంటివాణ్ణి చేసి, చిన్నవాడికో ఉపాధి చూపెట్టి నన్ను కడతేర్చు తండ్రీ" అంటూ మనస్సులో కాస్సేపు దైవాన్ని ధ్యానించుకున్నాడు. మనిషి ఎంతకాలం బ్రతికినా బ్రతకాలనే అనుకుంటాడు. అయితే వయసు పైబడ్డాక తనకు తెలీకుండానే జీవితం మీద రోత పుడుతుంది. అనారోగ్యం, కుటుంబ సమస్యల మూలంగా లోపించిన ప్రశాంతత తిరిగి పొందాలంటే ఆధ్యాత్మిక చింతన అనివార్యం.

    అప్రయత్నంగా అతడి దృష్టి ఎలెక్ట్రానిక్ క్యాలెండర్ మీద పడింది. 06.07.2158 ఉదయం ఏడు నలభై అయిదు. తేదీ, సమయం చూసి గాఢంగా నిట్టూర్చాడు.
    వరండాలో రెండు పెద్ద వాటర్ ప్యాకెట్లు ఓ చిన్న పాల ప్యాకెట్టు పడి ఉన్నాయి. మెల్లగా వాటిని తీసి కిచెన్‌లో ఉంచి బాత్రూంకెళ్ళాడు. అతడి వయసు డెబ్భై ఐదేళ్ళు. మొన్నటి వరకు బాగానే ఉండేవాడు. ఈ మధ్యే ఆరోగ్యం క్షీణించింది. బి.పి. పెరగడం, దానికి షుగరు తోడవడంతో ఉప్పు, తీపి విసర్జించాడు. ఫలితంగా ఒంట్లో నీరసం ఆవరించింది. శరీరం సహకరించకున్నా ఇంటిపని, వంటపని తనే చేసుకోవలసి వస్తోంది.

    ఇరవై ఏళ్ళ క్రితమే అర్థాంగి తనకు గరిట అందించి వెళ్ళిపోయింది. అప్పటినుండి తనకీ తిప్పలు తప్పడం లేదు. కొడుకులు ఉన్నారన్న మాటేగాని ఏం లాభం? ఎవరి సహకారం లేదు. ఉద్యోగరీత్యా ఒకడు బెంగుళూరులో ఉంటే, మరొకడు పనికోసం ఊరూరు తిరుగుతున్నాడు. జేబు ఖాళీ అయిందేమో నిన్ననే చిన్నవాడు ఇంటికి తిరిగొచ్చాడు. ఉద్యోగాన్వేషణలో బాగా అలసి పోవడం వల్ల గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. ఈ వయసులో తను చెయ్యి కాల్చుకునే బదులు పెద్దవాడి దగ్గర ఉండొచ్చు కదా! హుం...తనకా అదృష్టం ఉంటేనా? ఎక్కడికెళ్ళినా తనే స్టవ్‌మీద కుక్కరెక్కించాలి. ఆ మాత్రందానికి ఊరు విడిచిపోవడం దేనికనుకున్నాడు. పెద్ద కొడుకు దినేష్‌కి నాలుగు పదులు దాటినా పెళ్ళి కాకపోవడంతో తండ్రిమీద గుర్రుగా ఉన్నాడు. పాపం ఉమాపతి మాత్రం ఏం చేస్తాడు? ప్రతి ఆడపిల్ల తండ్రి గడపకి కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. ప్చ్... కాలం కలిసి రావడం లేదు. ఎవరిని అడిగినా మా అమ్మాయికి మ్యాచ్ సెటిలయి పోయిందంటున్నారు. ఆడపిల్లల డిమాండు అలా ఉంది మరి. జనాభాలో మూడొంతులు పురుషులే ఉంటే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఇదంతా మన అవగాహనా లోపమే. మగపిల్లాడేదో ఉద్ధరిస్తాడనుకుని ప్రతివాడు గర్భస్థ ఆడశిశువును నిర్ధాక్షిణ్యంగా చంపుకునే కిరాతక చర్యకు పూనుకోవడం వల్లే నేడీ దుస్థితి దాపురించింది. ఒకప్పుడు జనాభాలో కాస్త అటూఇటుగా స్త్రీలే ఎక్కువగా ఉండేవారంటే జనం నవ్విపోతారు. ఆ మాట అన్నందుకు తనని పిచ్చివాణ్ణి చూసినట్లు చూస్తారు. కాలకృత్యాలు ముగించుకుని కాఫీ కలిపేందుకు ఉద్యుక్తుడయ్యాడు ఉమాపతి. 

    వాటర్ ప్యాకెట్టు కత్తిరించబోతే చేజారి నీళ్ళన్నీ క్రింద ఒలికి పోయాయి. చివుక్కుమంది ప్రాణం. మంచినీళ్ళు కొనుక్కుందామన్నా వెంటనే దొరకవు కదా! కళ్ళు తిరిగినట్లవడంతో కాఫీ ప్రయత్నం విరమించి ఉన్నచోటే చతికిలబడి పోయాడు. అలా ఎంతసేపు కూర్చుండిపోయాడో అతడికే తెలియదు. కాస్సేపటికి తేరుకుని లేచి నిలబడ్డాడు. బి.పి. పెరిగినట్లుంది. ఒకసారి డాక్టర్ చేత చెకప్ చేయించుకుంటే బావుంటుందేమో అనిపించింది. పడుకున్న ప్రణవ్‌ని లేపడమిష్టం లేక తలుపులు వారగా వేసి హాస్పిటల్‌కి బయలు దేరాడు.

    రోడ్డుమీద మనుషులకంటే ఎక్కువగా వాహనాలే రొద చేస్తూ సంచరిస్తున్నాయి. రహదారి వెడల్పు చాలినంతగా లేకపోవడంతో జనం ఒకరినొకరు త్రోసుకుంటున్నారు. మళ్ళీ రోడ్ల విస్తరణ చేపడతారంట ఎప్పుడో ఏమిటో! తొమ్మిది కాక ముందే ఎండ చుర్రుమంటోంది. ఒకప్పుడు ఆషాఢంలో ఎడతెరిపి లేకుండా వానలు కురిసేవట. నేలంతా చిత్తడిగా ఉండేదట. ఇప్పుడా పరిస్థితి లేదు. వానజల్లు కోసం అంతా వాచిపోతున్నారు. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. తొడుగు తొలగిస్తే తప్ప ఎవరు ఎవరో గుర్తుపట్టడం కష్టం.
    ఉమాపతి రోడ్డుమీద నడుస్తున్నాడన్న మాటేగానీ మనసు స్థిమితంగా లేదు. ఆ మధ్య దినేష్ వచ్చినప్పుడు జరిగిన సంభాషణ కళ్ళముందు మెదిలింది.     "ముసలాణ్ణి అయిపోతున్నా నన్నెవరూ పట్టించుకోవడం లేదు" తిరుగు ప్రయాణానికి బ్యాగు సర్దుకుంటూ ఉక్రోషంగా అన్నాడు దినేష్.     "నీకు పెళ్ళి కాలేదన్న బెంగ నాకు మాత్రం లేదట్రా? అడపా దడపా పేపర్లో ప్రకటనలు వేయిస్తూనే ఉన్నాను. గడపగడపకి తిరుగుతున్నాను. పెళ్ళికాని ఆడపిల్లలు కనుచూపు మేరలో కానరావడం లేదు. నన్నేం చేయమంటావ్ చెప్పు" ఉమాపతి మాటల్లో నిరాశా నిస్పృహలు ద్యోతకమవుతున్నాయి.
    "ఎప్పుడూ ఈ మాటేగా మీరనేది? సరే వెళుతున్నాను. ఎన్నాళ్ళని సెలవు పెట్టి ఉండిపోతాను? ఏదైనా సంబంధం కలిసొస్తే ఫోన్ చెయ్యండి".  

    "భారమంతా ఈ తండ్రిమీద నెట్టేయకుండా నీ ప్రయత్నం కూడా నువ్వు చెయ్యి బాబు. తిరగడానికి ఇక నా ఒంట్లో ఓపికలేదు. అనుకోకుండా ఏ పిల్లయినా నీకు తారసపడితే మాత్రం వెంటనే పెళ్ళి చేసుకో. ఎలాగో అలాగ నువ్వో ఇంటివాడివైతే అంతే చాలు."
    తండ్రి మాటలు దినేష్ హృదయాన్ని కలిచి వేసాయి. భారమైన మనసుతో బయట పడ్డాడు.     దినేష్ వెళ్ళి రెండు నెలలవుతోంది. ఇంతవరకు వాడి నుంచి కబురు కాకరకాయ లేదు.     కొడుక్కి ఫోన్ చేద్దామని యస్.టి.డి బూతులో దూరాడు. బిడ్డ తీపి కబురేదైనా చెబుతాడేమోనని ఆశపడితే పెదవి విరుపే చెవిలో పడ్డది. దాంతో మరింతగా కృంగిపోయాడు.     బిల్లు చెల్లిద్దామని జేబులో చెయ్యి పెట్టబోతే "రెండు వందల యాభై" అన్నాడు యస్.టి.డి వాడు.     "రేట్లేమిటలా పెంచేస్తున్నావ్?... గత నెలలో బెంగళూరుకు మాట్లాడితే రెండు వందలే కదా తీసుకున్నావు...అప్పుడే యాభై పెంచేసావా?" అడిగాడు ఉమాపతి.     "ఏం చేయమంటారు చెప్పండి. యస్.టి.డీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పైగా అంతా మొబైలే. ఎవరి చేతిలో చూసినా సెల్లే. ఎవరో మీలాంటి వాళ్ళు తప్ప మావైపు తొంగి చూడటం లేదు" అన్నాడు యస్.టి.డి అబ్బాయి.

    వాడన్న దాంట్లోనూ అర్థముంది. అందుకే మరి కిమ్మనకుండా డబ్బు చెల్లించి బయట పడ్డాడు ఉమాపతి.     జనారణ్యంలోంచి ఊడిపడి ఆపసోపాలు పడుతూ హాస్పిటల్ చేరేసరికి పదైంది.     డాక్టరింకా రాలేదు.     రోగులు అతడికోసం కళ్ళల్లో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.     "ఆడపిల్లను కను. మూడున్నర లక్షల బహుమతి పొందు" గోడమీద కుటుంబ సంక్షేమశాఖవారి ప్రకటన చదివి నవ్వుకున్నాడు ఉమాపతి. అది సమస్య తీవ్రతను తెలియజేస్తుందే తప్ప పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఎవరికి వారు ఆడపిల్లనే కనాలనుకుంటారు. అది జరిగే పనేనా? స్కానింగ్‌లో మగపిల్లాడని తేలితే మాత్రం ఎంత మంది అబార్షన్లు చేయించుకోగలరు? అధిక జనాభా దృష్ట్యా దంపతులు ఒకే బిడ్డతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వ ఆదేశం అమలులో ఉన్నా మొదట మగపిల్లాడు పుడితే మాత్రం రెండో కాన్పుకు వెసలుబాటు కల్పించబడుతోంది. ఆ రకంగానైనా ఆడపిల్లల సంఖ్య కొంతలో కొంతైనా మెరుగుపడుతుందేమోనని ఆశ.     కొడుక్కి ఇక పెళ్ళి కాదన్న బెంగ పట్టుకుంది ఉమాపతి. ఆ దిగులుతోనే మంచం పట్టాడు. సమయానికి రెండోవాడు ప్రణవ్ ఉండబట్టి సరిపోయింది లేకుంటే అతగాడికి జావకాచిపోసే నాథుడే లేకుండా పోయేవాడు. డాక్టరు రాసిచ్చిన ప్రతిమందు కొని వేస్తున్నాడు ప్రణవ్. అయినా గుణం కనిపించడం లేదు. మనోవ్యాధికి మందు ఉండదంటారు. అందుకేనేమో! రోజులు గడుస్తున్న కొద్దీ అతడి ఆరోగ్యం క్షీణించసాగింది.     తండ్రికి సీరియస్‌గా ఉందని అన్నయ్యకు ఫోన్ చేసాడు ప్రణవ్.     రెక్కలు గట్టుకుని వాలాడు దినేష్.     మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న తండ్రిని చూసేసరికి అతడికి మతిపోయింది. 'నాన్నా!' అంటూ బిగ్గరగా అరిచాడు.     ఆ పిలుపుకు ఉమాపతిలో కాస్త కదలిక వచ్చింది.     "నేను ఓ ఇంటివాణ్ణి అయ్యాను నాన్నా. నీకు చెప్పకుండా పెళ్ళి చేసుకోవలసి వచ్చినదుకు క్షమించు" తండ్రి భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు దినేష్.     పెళ్ళి మాట చెవిలో పడడటంతో కొడుకు వంక తృప్తి చూసి రెప్ప వాల్చాడు ఉమాపతి.     భోరుమన్నారంతా.     నిజానికి దినేష్‌కి పెళ్ళి కాలేదు. తండ్రి నిశ్చింతగా కన్ను మూయాలని అలా బొంకాడు.

(చిత్ర సకుటుంబ సచిత్ర మాస పత్రిక అక్టోబరు 2009 సంచికలో ప్రచురితం)
Comments