ఒక కన్నీటి చుక్క. - కస్తూరి మురళీ కృష్ణ,

  
 "
రేణుక గర్భవతట తెలుసా?" తుఫానులా వచ్చి, రవిముందు కూచుని చెప్పింది సుజాత.
    ఆమె మాటలు రవికి పూర్తిగా అర్థమయ్యేలోగా "నేనేం తప్పు చేశాను? ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను? లేక పోతే భగవంతుడు నాకీ శిక్ష ఎందుకు విధిస్తాడు?" అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుపు ఆరంభించింది సుజాత.ఆమె వైపే నిస్సహాయంగా చూస్తూ కూచున్నాడు. ఆమెని తాను ఓదార్చలేడని రవికి తెలుసు. ఇటువంటి సందర్భాలలో రవికి తన నిస్సహాయత పట్ల తనకే అసహ్యం అనిపిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి ఇది.
    రవికి, సుజాతకు పెళ్ళయి పదిహేనేళ్ళు దాటుతోంది. మొదటి రెండేళ్ళు పిల్లలు కలగకున్నా రవి పెద్దగా పట్టించుకోలేదు.
    "ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి పెళ్ళి చేసుకున్నాం. కాస్త జీవితం ఎంజాయ్ చేద్దాం. అప్పుడే మన మధ్య మూడో వ్యక్తి ఎందుకు? ఇక వాడొచ్చాడంటే మన బతుకు అయి పోయినట్టే. అంతా వాడికోసమే బతకాలి. అంతా అయిన తరువాత 'నాకోసం మీరేం చేశారు?' అని మనల్ని నిలదీసి పోతారు. తొందరేముంది. వస్తారు. రాకుండా ఎక్కడికి పోతారు?" అని నవ్వుతూ తేలికగా కొట్టేసేవాడు రవి, సుజాత పిల్లల ప్రసక్తి ఎప్పుడైనా తెస్తే.     
    "అందరూ నన్ను అడుగుతున్నారు. ఉచిత సలహాలిచ్చి, జాలి చూపిస్తున్నారు. మగవాళ్ళు మీరు. ఏదైనా లోపమా? అని మిమ్మల్ని ఎవరూ అడగరు. పిల్లల్ని కనాల్సిన ఆడవాళ్ళ మీదే ఉంటుంది ఒత్తిడి అంతా" అంది సుజాత ఓ రోజు పార్టీ నుంచి ఇంటికి వస్తూనే. "నాకూ పిల్లలు కావాలనే ఉంది. వాళ్ళు అల్లరిగా ఇల్లంతా తిరుగుతూ ఉంటే, ఆ ఆనందం అనుభవించాలని ఉంది. వాడు మనిద్దరిదే కాదు మన పూర్వీకులందరి బాల్యాన్ని తిరిగి మన అనుభవానికి తెస్తే చూసి ఆనందించాలని ఉంది. డోంట్‌వర్రీ... మన ఇండియాలో వాసన చూస్తే పిల్లలు పుట్టేస్తారు. సారవంతమైన నేల మనది. సినిమాల్లో చూడలేదూ హీరో హీరోయిన్లు వర్షంలో తడిసి గుహలో దూరుతారు. బయటకొచ్చేసరికి పిల్లవాడు పుట్టేస్తాడు" అంటూ రకరకాల కథలు చెప్పి నవ్వించాడు.
    అయితే, ఎటువంటి కాంట్రసెప్టివ్స్ లేకుండా సంవత్సరం కలిసిన తరువాత కూడా పిల్లలు కలగక పోవడం 'ఇన్‌ఫర్టిలిటీ'కి నిర్వచనం అని రవి, సుజాతలు తెలుసుకొనే సరికి మరో రెండు సంవత్సరాలు గడిచి పోయాయి.
    అప్పుడూ విషయాన్ని రవి సీరియస్‌గా తీసుకోలేదు.
    "పిల్లలదేముంది. వొద్దన్నా వచ్చేస్తారు. వాడికింకా మూడలేదు. మూడిన మరుక్షణం పుట్టేస్తాడు. ఇప్పుడు లేడని ఏడుస్తున్నాం. అప్పుడు వొచ్చి ఏడిపిస్తాడు" అంటూ హాస్యం చేసేవాడు రవి సుజాత ఎప్పుడైనా పిల్లల ప్రస్తావన తెస్తే.
    పిల్లలు పుట్టక పోవడాన్ని రవి, గంభీరమైన సమస్యగా పరిగణించే సరికి పెళ్ళయి ఆరేడేళ్ళు దాటింది.
    చివరికి ఓ రోజు సుజాత పట్టు పట్టింది. ఏడ్చింది. దాదాపుగా హిస్టీరియా వచ్చినదానిలా ప్రవర్తించింది. అప్పుడు రవికి అర్థం అయ్యింది, పిల్లలు లేకపోవడం సుజాతను మానసికంగా ఎంత కుంగదీస్తోందో.
    వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళారు!
    ఇద్దరినీ టెస్త్ చేసింది డాక్టర్. అప్పుడు రవి ఓ విషయం గమనించాడు.
    తామిద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. కానీ పరీక్షలో లోపం తనది కాదని తేలాలని ఇద్దరూ దైవాన్ని ప్రార్థించారు.
    "పురుషులకు స్పెర్మ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళకే రకరకాల టెస్టులు చేయాలి" చెప్పింది డాక్టర్.
    తనలో లోపం లేదని తేల్చేసరికి రిలీఫ్ పొందాడు రవి. కృంగిపోయింది సుజాత.
    ఇంకొన్ని టెస్టులు చేస్తేకానీ లోపం ఎక్కడుందో కనుక్కోలేమంది డాక్టర్. కానీ ఒక్కో టెస్టు జరుగుతున్నకొద్దీ సుజాత డిప్రెషన్‌లోకి దిగజారడం, బాధ పడటం చూస్తుంటే, ఆలోపమేదో తనలో ఉంటేనే బాగుండేదింపించేది రవికి.
    ఓసారి డాక్టర్ ఓ టెస్టు రాసింది. ఆమె చెప్పిన అడ్రసు పట్టుకుని 'డయాగ్నొస్టిక్ సెంటర్'కి వెళ్ళారు. రవిని లోపలకు రానీయలేదు. సుజాతను లోపలకు తీసుకెళ్ళారు.
    బయట నుంచొన్న రవి యథాలాపంగా లోపలికి తొంగి చూస్తే కర్టెన్ కొద్దిగా తొలగి ఉండి లోపల కనిపిస్తోంది.
    నర్సు వచ్చి సుజాత కాళ్ళు ఎడం చేసి కెమరాను దూర్చి వెళ్ళింది. ఇంతలో డాక్టర్ లోపలకు వచ్చాడు.
    సుజాత లేవబోయింది. డాక్టర్ 'పడుకోమని సంజ్ఞ చేశాడు.
    రవి ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది.
    దాదాపుగా అరగంట సేపూ డాక్టర్ ముఖంకేసి చూస్తుండిపోయాడు రవి. అతడి ముఖంలో కనిపిస్తున్న ఉద్విగ్నతలు, ఇతర భావాలు రవి రక్తాన్ని మరిగించాయి. అతడు డాక్టర్ మర్యాదలను ఉల్లంఘిస్తున్నాడని గ్రహించాడు రవి.
    కానీ ఏం చేయాలి?
    తన నిస్సహాయత సుజాతపై కోపంగా మారింది. అద్దాలు బద్దలు కొట్టి, లోపలకు వెళ్ళి డాక్టర్‌ని తన్నాలనిపించింది. 'ఇక సుజాతకూ, తనకూ సంబంధం లేదనీ అనుకున్నాడు. కానీ బయటకు వస్తున్న సుజాతను చూడగానే కరిగి పోయాడు.
    చిగురుటాకులా వణికిపోతోంది. రవిని చూడగానే పట్టుకొని ఏడ్చింది."నాకు పిల్లలు వద్దు... పాడు వద్దు"అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. సుజాతను పొదివి పట్టుకున్నాడు రవి. తన మూర్ఖత్వానికి, ఇన్‌సెన్సిటివ్‌నెస్‌కి తన మీద తనకే అసహ్యం వేసింది.
    ఆ తరువాత రవిని కూడా దగ్గరకు రానీయ లేదు సుజాత.
    పాత డాక్టర్‌ను వదిలి కొత్త డాక్టర్‌ను పట్టుకునే సరికి మరికొన్ని నెలలు పట్టింది.
    మళ్ళీ అన్ని పరీక్షలూ మొదటి నుంచి ఆరంభించారు. ఈ సారి 'ఆ' పరీక్షకూడా డాక్టరే చేసింది. లేడీ డాక్టర్‌కి అయిదు నిమిషాలు పట్టే టెస్టు మగ డాక్టర్‌కి అరగంట పట్టిందని అప్పుడే తెలిసింది.
    అయితే ప్రతి నెల ఆశతో ఎదురు చూడడం, ఆశ నిరాశ కావడం రవి సుజాతలలో ఓ రకమైన ఆందోళనను కలిగించింది. అది వారిద్దరి మనస్తత్వాలపై ప్రభావం చూపించింది. ఇదే సమయంలో తన ఆఫీసులో కూడా పిల్లలు లేని వారున్నారని గమనించాడు. ఈ లోపం వారి బంధంపై ప్రభావం చూపించడం కూడా గమనించాడు. కొన్ని కేసుల్లో మగవాళ్ళు పరిక్షకి సిద్ధం కారు. దోషమంతా ఆడవారిదే అంటారు. ఇది వారిని మానసికంగా ఎంతగా కృంగదీస్తోందో గమనించాడు రవి. ఈ లోపం వల్ల సంసారాలు విచ్చిన్నమవడం, భార్యాభర్తలు శతృవుల్లా ప్రవర్తించడం చూశాడు.
    ఇదే సమయంలో సినిమాల్లో, కథల్లో పిల్లలులేని లోపాన్ని ఎంత హాస్యమైన అంశంగా పరిగణిస్తున్నారో చూసి వారి అవగాహనా రాహిత్యానికి, ఆలోచన శూన్యతకి, మానవత్వ లోపానికి అసహ్యించుకున్నాడు.
    పిల్లలు లేకపోతే పొరుగింటి వాడి దగ్గరకు వెళ్ళటం, వాడిని స్పెర్మ్ దానం చెయ్యమని అడగడం, లేకపోతే మగవాడినిక "చేతకానివాడన్నట్లు" మాట్లాడడం... నెమ్మదిగా రవి సుజాతాలు అందరినీ తప్పించుకుని తిరగడం ఆరంభించారు.
    కొన్ని నెలలు ఓ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఫలితం లేకపోతే, మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళేవారు. ఇలా వెళ్ళినపుడల్లా 'స్పెర్మ్‌టెస్ట్' అనేవారు ముందుగా.
    అలాంటి సమయాల్లో తనని తాను ఎంతగానో అసహ్యించుకునేవాడు. సిగ్గుతో కుంగిపోయేవాడు. ల్యాబుల్లో ఓ సీసా పుచ్చుకొని బాత్రూంలోకి వెళ్ళడం, స్పెర్మ్‌తో బయటకు రావడం... ఒక్కోసారి ల్యాబ్‌లో పెళ్ళికాని ఆడపిల్లలుంటారు! అందరూ తనని ఓ రకంగా చూస్తున్నారని మరింత ముడుచుకుపోయేవాడు రవి.
    కానీ సుజాత బాధతో పోలిస్తే తన బాధ ఎందుకూ పనికి రాదని రవికి తెలుసు! డాక్టర్ల పరీక్షలకు విలవిలలాడి పోయేది. భయంతో వణికి పోతుండేది. కానీ.... తప్పదు.
    అలాంటి సమయాల్లో 'మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి' అని పట్టుబట్టేది సుజాత. 'ఎలా పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు పుడతారో, లేదో, పరీక్షించు?' అనేవాడు రవి.
    రవి హాస్యంగా అన్నా సుజాత తీవ్రంగా స్పందించేది.
"అంటే నేను పనికిరానని నిశ్చయించేశారు? నేను మీకేమీ కాను?"అంటూ భోరుమనేది. "నేను పుష్పించని మొక్కను. నన్ను కొట్టిపడేయండి... లేకపోతే నేనే చచ్చిపోతాను." అంటూ మేడమీదకు పరిగెత్తేది.
    రవి ఆమెను ఓదార్చేవాడు.
    "ఒకోసారి ఇలా అవుతుంది. ఇటువంటి సందర్భాలలోనే మనం భగవంతుడిని నమ్మాలి. అయినా పిల్లలు లేకపోతే ఏమైంది? ప్రపంచంలోని పిల్లలంతా మనవాళ్ళే. ఎవరో ఒకరిని పెంచుకుందాం. లేకపోతే, ఏ బరువులు, బాధ్యతలూ లేకుండా హాయిగా ఉందాం. దేశమంతా తిరుగుదాం. ఒకడికోసం సంపాదించే అవసరం లేదు. మనం పోతే ఏడ్చేవాడు లేడు" అంటూ దగ్గరకు తీసుకునేవాడు. "మన మధ్య తేడాలు పెళ్ళయిన రోజే పోయాయి. నువ్వు పుష్పించని మొక్కవైతే నేనూ అంతే. అందుకే మనిద్దరినీ కలిపాడు. అయినా మనకింకా వయస్సేం అయిపోలేదు..." అంటూ ఆమెని అనునయించేవాడు. ఒకోసారి రాత్రంతా ఇలాగే గడిచిపోయేది.అయితే సుజాత బాధను చూసిన రవి, తన బాధను కనబరచే వాడు కాదు. సుజాత తన బాధను దాచుకోలేక పోయేది. డాక్టర్‌ని చూస్తూనే ఏడ్చేసేది. ఈ డాక్టర్ దగ్గరకు వెళ్ళిన రోజులు రాత్రంతా ఏడుస్తూనే ఉండేది.
    "నేను బతికి ఎందుకు? నేను చస్తే మీరింకొకరిని చేసుకుంటారు. నాకు చావు రాదెందుకు?" అని కుమిలికుమిలి ఏడ్చేది. ఇదంతా చూస్తుంటే రవికి, మానవ సంబంధాలలో ఎంత ఆనందం ఉందో అంత విషాదం ఉందని అర్థమయింది. మనిషి సుఖాలే కోరుకొంటాడు. కానీ కష్టం పొంచి ఉండని సుఖం లేదు. సుఖం కోరుకునేవాడు కష్టాలను భరించేందుకు సిద్ధమై ఉండాలి.
    రోడ్డు మీద బిచ్చగాళ్ళ పిల్లలను చూసి సుజాత కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. "చూడండి.... ఆ బిచ్చగాళ్ళకి కూడా పిల్లలున్నారు.. వాళ్ళు లక్ష్యం లేకుండా పిల్లల్ని మట్టిలో, మురికిలో, రోడ్లమీద ఎలా వదిలేస్తున్నారో! వాళ్ళకి ఇస్తాడు పిల్లల్ని దేవుడు! మనకెందుకు ఇవ్వడు?" అంటూ బాధపడేది. అటువంటి సమయాల్లో ఎంత ఓఅదారిస్తే అంత చిరాకు పడేది. అంత రెచ్చిపోయేది. తన సమస్యకు రవిదే బాధ్యత అని దూషించేది. చేతికందిన వస్తువులు విసిరేసేది.
    "మీకు పిల్లలు ఇష్టం లేదు. అందుకే మీరు పట్టించుకోలేదు. ఇలాగయింది మన పరిస్థితి. అంత పిల్లలు ఇష్టం లేని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు. నా జీవితం నాశనం చేశారు" అంటూ ఏడ్చేది. "అవును సరైన సమయంలో తొందరపడక పోవడం మన తప్పు" ఒప్పుకున్నాడు రవి.
    ఎక్కడైనా అందమైన పిల్లలు (పిల్లలంతా అందంగా ముద్దుగా ఉంటారు) కనిపిస్తే, "వీళ్ళని ఎత్తుకు పోదామా?" అని ఆశగా అడిగేది. తన ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలని చూస్తుంటే రవి మనసు కూడా బాధతో మూల్గేది. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటే మెత్తగా, మృదువుగా తగిలే శరీరం, అమాయకమైన వారి మొహాలు రవికి కంటికి నీరు తెప్పించేవి. కానీ రవి బయట పడేవాడు కాదు. తాను బాధ పడుతున్నట్టు తెలిస్తే సుజాత బాధ మరింత పెరుగుతుంది.
    "మీ ఇద్దరిలో ఎలాంటి లోపం లేదు. లోపం ఉంటే దానికి చికిత్స చేయవచ్చు. కాబట్టి మీరు ఎదురు చూడండి. ఎప్పుడో అవచ్చు. లేకపోతే టెస్ట్‌ట్యూభ్ బేబీకి ప్రయత్నించండి. ఫిఫ్టీ ఫిఫ్టీ" అంది డాక్టర్. అంత ఖరీదైన పిల్లవాడు వద్దని అనుకున్నారు.
    అప్పటికే నెలనెల సుజాత పడుతున్న బాధ చూసిన రవి ఓ నిశ్చయానికి వచ్చాడు. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే నష్టమే తప్ప లాభం లేదని గ్రహించాడు. ఓ నెల రోజులు సుజాతను తీసుకుని ఊళ్ళు తిరిగాడు. కొందరు "గుళ్ళకెళ్తే పిల్లలు పుడతారు" అని వ్యాఖ్యానించారు. రవి పట్టించుకోలేదు.
    ఇద్దరూ కలిసి 'ట్రీట్‌మెంట్ టెన్షన్' 'పిల్లల ఉద్విగ్నతలు' లేకుండా మనసులు విప్పి మాట్లాడుకున్నారు. భవిష్యత్తును గురించి చర్చించుకున్నారు.
    "మనకు పిల్లలు పుట్టడం లేదు. లోపం ఇద్దరిలోనూ లేదు. అదృష్టంలో ఉంది. ఇది మన వ్యక్తిత్వానికి దేవుడు పెడుతున్న పరీక్ష. మనం ఏడుస్తూ కూచుంటే, ఉన్న జీవితం చేజారిపోతుంది. కాబట్టి మనం ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలి. లేని దాన్ని వదిలేయాలి. "పోయింది పొల్లు. మిగిలింది చాలు" అనుకోవాలి. మనకు పిల్లలు లేకపోవచ్చు. కానీ బోలెడంత మంది పిల్లల్ని వద్దనుకొని పారేస్తుంటారు. అలాంటి అనాథను దత్తత తీసుకోవడం వల్ల కనీసం ఒకరికి మన పరిధిలో మంచి జీవితం ఇచ్చినట్టవుతుంది. అది కుదరక పోతే మనమే అనాథ శరణాలయం ఆరంభిద్దాం. ఎవరూ లేని వారంతా మన వారే అవుతారు" అన్నాడు రవి.
    తల ఊపింది సుజాత. "అంటే నాకిక పిల్లలు పుట్టరని నిశ్చయించేశారా?" అడిగింది.
    "లేదు.... ఒకసారి దత్తత తీసుకున్న తరువాత పిల్లలు పుడతారు. అప్పుడు మనకి ఇద్దరు పిల్లలుంటారు ఒకేసారి" అన్నాడు రవి. అప్పుడు సుజాతకు ఒక ఆలోచన వచ్చింది.
    "మీ తమ్ముడు మహేష్‌కు ఇద్దరు పిల్లలు కదా, ఇక వద్దనుకుంటున్నారు కదా! మనమో పిల్లాడిని కని ఇవ్వమంటే?"
    నవ్వాడు రవి. "వాళ్ళు ఒప్పుకోవాలి కదా! నవ మాసాలు మోసి కన్న తల్లి పిల్లవాడిని అలా ఇచ్చేందుకు ఇష్టపడదు. అది పాపం కూడా. తల్లినీ పిల్లాడినీ వేరు చేయడం" అన్నాడు రవి.
    అయినా సరే, 'అడిగి చూడండి. తరువాత అడిగిఉంటే బాగుండేదనుకోవడం కన్నా అడిగి కాదనిపించుకోవడం మేలు' అని సుజాత, రవి వెంట పడింది.
    ఆమె పోరు పడలేక, ఓ రోజు తమ్ముడి వద్ద ఈ విషయం ప్రస్తావించాడు రవి.
    మహేష్ నవ్వి ఊరుకున్నాడు.
    అతడి భార్య రేణుక మాత్రం నిర్మొహమాటంగా అంది."మేమింక వద్దనుకుంటున్నాం. మళ్ళీ తొమ్మిది నెలలు ఆ బాధ పడలేను. అంత బాధపడి కన్నవాడిని అలా ఇచ్చేయలేను. నేనేమన్నా పిల్లల్ని కనే యంత్రాన్నా?"
    "నేనే పాడైపోయిన యంత్రాన్ని" అంటూ ఏడ్చింది సుజాత ఆ రాత్రి.
    "రేణుక అన్నదాంట్లో బాధ పడాల్సినదేమీ లేదు. ఆమె వైపు నుంచి చూడు. ఆమె మాటల్లో సత్యం అర్థమౌతుంది" అంటూ సుజాతకు సర్ది చెప్పాడు రవి.
    వాళ్ళతో కాదనిపించుకున్న తరువాత తెలిసిన వాళ్ళకి తమ ఉద్దేశం చెప్పారు. అనాథ శరణాలయంలో రిజిస్టరు చేసుకున్నారు.
    మళ్ళీ సుజాత పూర్వపు మనిషిలా సంతోషంగా ఉండడం ఆరంభించింది. అది రవికి సంతృప్తినిచ్చింది.
    అయితే, పిల్లలు లేకపోవడానికి లోపం తనలోనే ఉందని తెలిసిన కొలీగ్ లావణ్య ఆత్మహత్య చేసుకోబోవడం రవిని కదలించి వేసింది. నిజంగా మన దేశంలో ప్రతి విషయం గురించి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. 'కండోం...కండోం' అంటూ ఊదరగొడుతున్నారు. కొన్ని ఇలాంటి మానసిక సమస్యల గురించి ఎవరికీ పట్టలేదు. కానీ ఎవరో ఒకరు పూనుకోందే ఈ సమస్య పదిమందికి తెలియదు. అపుడే, సుజాతతో సంప్రదించి, పిల్లలు లేని దంపతులందరినీ కలిపి ఓ సంఘం ఏర్పాటు చేయాలని నిశ్చయించు కున్నాడు. ఇలా ఒక బాధలో ఉన్నవారంతా కలిసి తమ కష్టసుఖాలు పంచుకోవడం వల్ల 'తాము ఒంటరి కాదు' అన్న స్వాంతన కలుగుతుంది. సుజాత ఉత్సాహంగా రంగంలోకి దూకింది. బండి దారిలో పడిందనిపించింది.
    ఇంతలో ఇది....
    "రేణుక గర్భవతి అయితే సంతోషించాలి, దానికి ఏడవడం ఎందుకు?" అన్నాడు రవి, ఏడుస్తున్న సుజాతను ఉద్దేశించి.
    తోకతొక్కిన తాచులా తలెత్తింది సుజాత. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
    "నేను రేణుక గర్భవతి అయిందుకు ఏడవడం లేదు. వాళ్ళు గర్భం తీయించుకుంటారట"
    ఆమె మాటలకు నిర్ఘాంతపోయాడు రవి. అతడి కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి.

* * *

    "నిజమే" అన్నాడు మహేష్ తలవంచుకుని.
    చాలా సేపటివరకూ గదిలో మౌనం రాజ్యం చేసింది. రవికేమనాలో తోచలేదు.
    చివరికి మౌనాన్ని భంగం చేస్తూ రేణుక మృదువుగా చెప్పింది.
    "మాకు ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉంది. ఇద్దరం సంపాదిస్తున్నా డబ్బు సరిపోవడం లేదు. వాడికి సరైన సమయం ఇవ్వలేకపోతున్నాం. అటువంటిది ఇప్పుడూ మరో తొమ్మిది నెలలు, ఆ తరువాత రెండు, మూడేళ్ళు మళ్ళీ బాధలు భరించలేను. నాది ప్రైవేటు ఉద్యోగం. మెటర్నిటీ లీవంటే పొమ్మంటారు. ఆయనకూ లేవు దొరకదు. ఈ కష్టాలు ఒక్కడితో పడే సరికే మాకు చచ్చినంత పనవుతోంది. మేమా కష్టం భరించలేము. అందుకని ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం".
    "మీరు వొద్దనుకున్నారు... అది నిజమే...కానీ...కన్సెప్షన్ అయింది కదా! ఇదొక రకంగా భగవత్ప్రసాదంలాంటిది. మనం డబ్బులు లేని వాళ్ళం కాదు. మేమూ ఉంటాం తోడుగా. ఖర్చులన్నీ మేము భరిస్తాం.... ఏ అవసరమైనా మేము చూసుకుంటాం. మేము బయట దత్తత తీసుకోవాలనుకున్నాం. ఇంతలో ఈ అవకాశం వచ్చింది. మన శిశువు మన దగ్గరే ఉంటుంది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కాదనుకోవడం ఎందుకు? అదీగాక, గర్భస్రావం భ్రూణ హత్య కిందకు వస్తుంది. అది అన్యాయం." రవి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    అతని మనోనేత్రం ముందు మాతృగర్భంలో ఇంకా ఏర్పడని శిశువు ఆకారం కనిపిస్తోంది. ఇంకా కళ్ళు ఏర్పడలేదు. చెవులు లేవు. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంకా ఏమీ తెలియదు. ఏమీ తెలుసుకోక ముందే, దాని జీవితం పరిసమాప్తమౌతుంది. దాని ద్వారా జాగృతమవబోతున్న పూర్వీకులతో పాటు ఒక ప్రత్యేక కలల ప్రపంచం సమసిపోతుంది. అది ఎంత అద్భుత ప్రపంచమో మన ఊహకు కూడా అందదు.
    "మీరన్నది నిజమే. మీ దృష్టి నుంచి చూస్తే మీరు కరెక్టు. కానీ మా సమస్యలు మాకున్నాయి. ఎవరి మీద ఆధారపడడం మాకు ఇష్టం లేదు." అంది రేణుక.
    "మేము అంతా ఆలోచించాం. మాకు కూడా బాధగానే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దిసీజ్ ది టఫెస్ట్ డిసెషన్ ఆఫ్ మై లైఫ్." అన్నాడు మహేష్. లేచాడు రవి.
    "ఎలాగో మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా! ఒక అనాథకు ఇల్లు ఇచ్చిన వారవుతారు! అందుకే మేము గర్భస్రావానికి సిద్ధమయ్యాం" అన్నాడు మహేష్, రవి ఇల్లు దాటుతుంటే.
    జీవం లేని నవ్వొకటి నవ్వాడు రవి.
    మానవ సంబంధాలు చిత్రమైనవి. ఎవరి దృష్టి నుంచి చూస్తే వారి ఆలోచనలు సరైనవే. వారి నిర్ణయాలు సరైనవే. ఇందులో విధిని తప్ప ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
    బయటకు వస్తూ వెనక్కి తిరిగి 'మరో సారి ఆలోచించుకుంటే బావుంటుందేమో' అన్నాడు రవి చివరి ప్రయత్నంగా.
    'ఆలోచించుకున్నాం. రేపే అబార్షన్' చెప్పాడు మహేష్.
    తలవంచుకుని వచ్చేశాడు రవి.
* * *

    జరిగింది వినగానే ఏడుపు ఆరంభించింది సుజాత. అది నిస్సహాయత వల్ల వచ్చిన ఏడుపు అని రవికి తెలుసు.
    "ఎలా ఇంత నిర్దాక్షిణ్యంగా చంపగలరు పిల్లలను? అసలా ఆలోచన ఎలా వచ్చింది? పిల్లలెంత అమూల్యమో తెలియదా?... ఇక్కడ మనం పిల్లలో రామచంద్రా అని కొట్టుకు చచ్చిపోతుంటే, అక్కడ పిల్లలెక్కువయి, బరువయి చంపుకుంటారు? ఇదెక్కడి న్యాయం" అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా అరుస్తూ ఏడవసాగింది. "అసలు మీకే పిల్లలు ఇష్టం లేదు. అందుకే అన్నీ ఇలా అవుతున్నాయి" అని అరిచింది. ఆమెను ఓదార్చే ప్రయత్నాలు చేశాడు రవి.
    "ఎవరి బ్రతుకు వారిది. ఎవరి సంసారాలు వాళ్ళవి. ఎవరి అదృష్టం వాళ్ళది. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. బయట నుంచి మనం ఎన్నయినా చెప్పవచ్చు. కానీ అనుభవించేవాడికే బాధ తెలుస్తుంది. మనకు పిల్లలలు లేరు కాబట్టి మనం ఇంతగా బాధ పడుతున్నాం. వాళ్ళ స్థానంలో మనం ఉంటే, మనమూ అలాగే ప్రవర్తించేవాళ్ళమేమో! మనం మిగిలిన అన్నం పారేస్తాం. కానీ ఆ అన్నం కోసం తపించి పోయేవారు ఎందరో ఉన్నారు. పారేసే ముందు వాళ్ళందరి గురించి ఆలోచిస్తామా? ఇదే జీవితం. ఉన్న దాని విలువ తెలియదు. విలువ తెలిసినపుడు దొరకదు. అయినా మనం దత్తత తీసుకోబోతున్నాం కదా! సంవత్సరానికి ఒకరిని తీసుకుందాం. ఇంటిని పిల్లలతో నింపేద్దాం. మనకు పిల్లలు లేరు. దేశంలో అనాథలకు కొదువలేదు కదా!" అంటూ ఓదార్చాడు... బుజ్జగించాడు.
    చివరికి ఏడ్చి ఏడ్చి అర్థరాత్రి ఎప్పుడో సొమ్మసిల్లి పడి నిద్రపోయింది సుజాత. నిద్రలో కూడా ఉండి ఉండీ ఏదో అంటోంది...వెక్కుతోంది. చాలాసేపు ఆమెనే చూస్తూ కూచుండిపోయాడు రవి. ఆమె బాగా నిద్రలోకి చేరుకున్నాక నెమ్మదిగా ఆమెను పక్కన పడుకోబెట్టాడు. నిద్రలోనే కలవరించింది సుజాత. "మనకెందుకు ఇలాగయిందండీ"
    ఆమెని వదలి బయటకు వచ్చాడు రవి.
    అర్థరాత్రి దాటడంతో అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. కాని నాలుగు గోడల నడుమ, ఎవరెవరి మనసుల్లో ఎన్నెన్ని తుఫానులు అల్లకల్లోలం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు.
    చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో చంద్రుడు వెండి వెన్నెల వెలుగు ప్రసరిస్తున్నాడు. తారలు మిలమిల లాడుతున్నాయి. ప్రపంచం ఎంతో అందమైనది. ఎంత అందమైనదో అంత కౄరమైనది.     
    అంతవరకు అణచి పట్టి ఉంచిన ఆవేదన, ఆవేశం, నిస్పృహ, నిస్సహాయత, దుఃఖం అన్నీ ఒక్కసారిగా రవిని చుట్టుముట్టాయి. రెండు చేతులూ పైకెత్తి, మోకాళ్ళ మీద కూలబడ్డాడు రవి. హృదయలోతుల్లోంచి ఆవేదనంతా వెళ్ళగక్కుతూ పెద్దగా అరిచాడు.
    శబ్దం బయటకు రాలేదు.
    పిడికిళ్ళు బిగించి నేలను పిచ్చిపట్టిన వాడిలా బాదుతూ ఏడ్చాడు.
    ఒక్క చుక్క నీరు కంట్లోకి రాలేదు.
    జుట్టు పీక్కొన్నాడు. నేలమీద పొర్లాడు.
    అభ్యర్థిస్తున్నట్టు ఆకాశం వైపు చేతులు సాచాడు.
    అంతలో అలాగే నవ్వు వచ్చింది. గుండె నిండుగా నవ్వాడు. మనసులోని వేదనంతా సుళ్లు తిరుగుతూ నవ్వు రూపం ధరించింది.
    ఏడ్చినపుడు శబ్దం వెలువడనట్టే నవ్వినపుడు శబ్దం కాలేదు.
    నెమ్మదిగా లేచి ముఖం కడుక్కున్నాడు. మనసు, శరీరం తేలికైనట్టు అనిపించింది. బెడ్రూంలోకి వచ్చాడు.
    సుజాత ఆదమరచి నిద్రపోతోంది. కానీ వెక్కడం ఆగలేదు. కంటి దగ్గర చారలున్నాయి. పక్కన పడుకుని దగ్గరకు లాక్కున్నాడు.
    సుజాత అతన్ని హత్తుకు పోయింది "ఇలాగయిందేమిటని" కలవరిస్తూ.
    ఆమెని మరింత దగ్గరగా హత్తుకున్నాడు. ఎంత దగ్గరగా అంటే ఇక వారి మధ్య గాలికి కూడా తావు లేనంతగా! అలా ఒకరినొకరు హత్తుకుని వారు భవిష్యత్తులోని అనుభవాలను ఎదుర్కొనే శక్తిని సంపాదించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జీవితం!! ఇంతే జీవితం! ఒక కన్నీటి చుక్క!
[నవ్య వీక్లీ దీపావళి ప్రత్యేక సంచిక 2008లో ప్రచురితం]
Comments