ఓం శాంతి శాంతి శాంతిః - ఆదూరి హైమవతి

    ఒహేర్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  కాలు పెట్టారు పుల్లయ్య, పిచ్చమ్మలు.  జీవితంలో మొట్టమొదటి సారిగా విమానం ఎక్కడం భూతలస్వర్గండాలర్ల పంటభూమిగా పేరుగాంచిన అమెరికాదేశంలో అడుగు పెట్టడం వారి జీవితంలో ఊహించని విషయం. పుల్లయ్య పిచ్చమ్మ  ఏకైక సంతానం సుబ్బయ్య.' సుబ్బా! ' అనిపిలిచేవారు చిన్నప్పుడు. పిల్లలు కలక్కపోతే , సుబ్రహ్మణ్య స్వామికి మొక్కు కోగా , మగపిల్లడు పుట్టగా 'సుబ్బయ్య' అని ఆదేవునిపేరే పెట్టుకున్నారు. స్కూల్ లో వేసేప్పుడు , పంతులుగారు , సుబ్బడ్ని ' సుబ్బారావుగా'  'రీ నామకరణం' చేశారు. ఆపేరుతోనే  సుబ్బడు, ఎలిమెంటరి, హైస్కూల్  చదువులు చదివాడు, కాలేజీకీ వెళ్ళాడు .అతడి తెలివితేటలకు  టీచర్లు లెక్చరర్లు  ఆశ్చర్యపడేవారు. అతని సత్ ప్రవర్తన అతని తల్లి దండ్రుల సంస్కారానికి   పెంపకానికీ ప్రతిబింబంగా ఉండేది.     

    ఆ ప్రాంతపు   ఛోటా  రాజకీయ నాయకు డైన  పాపారావు దృష్టి సుబ్బారావు మీద పడింది. పుల్లయ్య, పిచ్చమ్మల్ని, ఆదరంగా తన కార్లో  టౌన్‌కు తెచ్చి , సోఫాల్లో ఊరేసిడైనింగ్ టేబుల్ మీద నానేసిఏ.సీ రూంలో ఆరేసి, ఒకేబిడ్డడైన సుబ్బడి భవిష్యత్తు మీద ఎరేసి, వారి మెత్తని మనస్సుల్ని దోచుకుని,' ఓ.కే.' అనిపించుకున్నాడు. దాంతో సుబ్బారావు అదృష్టం మూడు డిగ్రీలు ఆరు పట్టాలు కాగాపాపారావు పంట మూడు పదవులు ఆరు హోదాలుగా పండింది.  18 ఏళ్ళ సుబ్బారావుకు, తన 16 ఏళ్ళ ఏకైక గారాల కుమార్తె 'సుభద్ర' ను ఇవ్వను, నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చయ తాంబూలాలపర్వం  చిన్నసైజు  గ్రేటర్ ఎలక్షన్ల  ప్రచారసభలా జరిపాడు పాపారావు. 

    దాంతో  సుబ్బారావు వైభోగం పెరిగింది. పైజమాలవాడు పంట్లాంలలోకి దూరి, పూరింట్లో వాడు ఏ.సీ రూంలోకి చేరిపాతడొక్కు సైకిల్ తొక్కేవాడు శాంత్రో ఏ.సీ కారులోకి మారి , పేదపుల్లయ్య కొడుకు గొప్ప పాపారావు అల్లుడిగా మారిపోయాడు. పాపారావు స్పెషల్ టీచర్తో డ్రైవింగ్ దగ్గరుండి నేర్పించాడు కాబోయే ' స్వయం విష్ణు'కు.  తమపేద కడుపున పుట్టిన  బిడ్డను లక్ష్మి వరించినందుకు  పిచ్చమ్మ పుల్లయ్యలు ఎంతో ఆనందించారు. పొంగిపోయారు  కొడుకు అదృష్టానికి .   

    సుబ్బారావు, సుభద్రలు  ఇంజనీరింగ్ పాసయ్యాక, సుభద్రతో  ఆకాశమంత షామ్యానాలో భూదేవంత  క్రొత్త గళ్ళ జంబుకానాలు పరిచి, రంగు రంగుల లైట్ల కాంతిలోవీడియోలు, ఫ్లాష్ లైట్ల  మధ్య ఆర్టిఫిషియల్ అరిటాకుల్లో, బఫే భోజనాలతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు పాపారావు, తనపార్టీ బడానాయకుల సన్నిధిలో.  తర్వాత యం.ఎస్.చదవను, సుబ్రా భార్యాసమేతంగా  అమెరికా వెళ్లగా ఆపల్లెలో కొడుకు వైభోగం తల్చుకుంటూ అదే పూరింట్లో తమ రెండెకరల పొలం దున్ను కుంటూ కూరలు పండించు కుంటూ, తమగేదెల పాలు అమ్ము కుంటూ బ్రతుకు సాగించసాగారు సుబ్రా తల్లిదండ్రులు. వారికి అదనంగా వచ్చిన సౌకర్యం 'ఫోను'! అమెరికాలోని కొడుకుతో మాట్లాడను పాపారావు ఏర్పాటు చేశాడుతనే బిల్లు కడుతూ.

    'మాపాపారావు బావ గొప్ప వ్యక్తి! ', అనుకుంటూ పుల్లయ్య - పిచ్చమ్మ  నెలకో మారు, అమెరికాలో ఉన్న కొడుకు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వినేవారు, జవాబులు చెప్తూ.    

    అలాంటివారు అమెరికా రావడమంటేసశరీరంగా స్వర్గానికి వెళ్ళి నట్లేసుబ్రా ఎం.ఎస్. పూర్తి చేసి , తానూ, భార్యా ఉద్యోగాలు చేస్తూఓకొడుకును కనిఅమెరికాలో గ్రీన్ కార్డ్ పొంది, ఆపైన అమెరికా పౌరసత్వం లభిస్తున్న సందర్భంగాపాపారావు అమెరికా వస్తూ పుల్లయ్య పిచ్చమ్మలను తనతో తెచ్చాడు. పాస్ పోర్ట్స్  వీసాలు అన్ని తనతో తీసుకెళ్ళి ఏర్పాటుచేసి, వారిద్దరికీ మంచి మంచి బట్టలు  కొన్నాడు, సుబ్రా డాలర్లతోనే. తనతోపాటు విమానం ఎక్కించుకునితెచ్చిఅమెరికా నేల మీద దింపాడు పాపారావు,వారిద్దరినీ. విమానం ఎగిరేప్పుడు విండోస్ లోంచీ వారికి క్రింద  కనిపించే  బొమ్మరిళ్లలాంటి ఇళ్ళను, చిన్న మడుగులా కనిపించే సముద్రాన్నీ, చిన్నకాలువల్లా కనిపించే నదులనూవిమానం క్రిందనుండి వెళ్ళే మబ్బులనూ, సూర్యుడినీ, చంద్రుడినీఅన్నీ చూపాడు. పుల్లయ్య, పిచ్చమ్మలు అవన్నీ చూస్తూ తెగ సంబరపడిపోయారు.  విమానంలో అమెరికా ప్రయాణం ఇంత 'ఇదిగాఉంటుందా!' అని ఆశ్చర్య పోయారు.  చికాగో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే  ఇమిగ్రషన్ చెకింగ్ అన్నీ పూర్తయి లగేజ్ లు కార్ట్ లో వేసుకుని బయటి కొచ్చారు ముగ్గురూనూ. ఎదురుగా సూట్లో ఉన్న కొడుకుని గుర్తే పట్టలేకపోయారు వారు. ఆరడుగుల ఎత్తుతో,ఎర్రగా, అమెరికా నీరు వంటబట్టినల్ల కళ్ళద్దాలతో ఉన్న సుబ్రావ్ ముందుగా "హలో! అంకుల్ ! హవ్వార్యూ!" అని పాపారావుకు షేక్ హ్యాండిచ్చి, పలుకరించి, అమ్మానాన్నలను సంబరంగా చూసి "ఏంటి నాన్నా ఇలాతగ్గి పోయారు ? ఇంకాపొలంపనులు ఎండన పడి చేస్తూనే ఉన్నారా!  అమ్మా!  ఇలా నల్లబడిపోయావు? " అంటూ  అప్యాయంగా పలుకరించి తన పెద్ద ' మెర్సిడీస్ బెంజ్ 'కార్లోకి లగేజ్ సర్ది అమ్మా నాన్నలను చెయ్యి పట్టి ఎక్కించి కారు స్టార్ట్ చేశాడు.

    దారంట ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్,  రోడ్డుప్రక్కన కొండచిలువ  కదలి వెళ్తున్నట్లున్న కార్లనూ చూసి ఆశ్చర్యపోయారు పుల్లయ్య, పిచ్చమ్మలు. పాపారావు ఆంగ్లంలో  సుబ్రావ్ తో మాట్లాడుతూనే ఉన్నాడు, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లుగా. కాస్సేపటికి పుల్లయ్యతో

    "ఆశ్చర్యంగా ఉందా!  బావగారూ! మనగేదెల్ని తెచ్చి ఈ రోడ్డుప్రక్కన ఉన్న  పచ్చగడ్డిని మేపవచ్చు కదా! అని. ' ఇక్కడ  ఇంత పచ్చ గడ్డి ఉందే! ! అని   మొదటి సారి వచ్చినపుడు నేనూ అనుకున్నాను. ఈదేశంలో దుమ్ము రేక్కండానూ, కళ్లకు పచ్చంగా అందంగా ఉండేలా గడ్డిని ఖాళీ మైదానమంతా  పెంచుతారు. మళ్ళీ మిషన్లతో  సమంగా చదునుగా ఉండేలా కత్తిరిస్తారు. ఇదోపెద్ద బిజినెస్ అనుకుంటా ఇక్కడ. ఈకార్లన్నీ చూస్తుంటే మనదేశంలో  నాలాంటి ఏరాజకీయ నాయకుడో ఎలక్షన్‌మీటింగ్ కు వస్తూన్నట్లు అనిపిస్తోంది కదూఇక్కడ ప్రతి ఒక్కరికీ ఓ కారుంటుంది కనీసం. నడచిపోయే దూరాల్లో ఏవీఉండవు. కారు లేకుంటే వీళ్ళకు కాళ్ళు లేనట్లే. మనకు కారుంటే గొప్ప. తిండికి కావలసిన వస్తువులు కొని తెచ్చు కోను కూడా కారు కావాలి ఇక్కడ. మనదేశానికి ఈదేశం మూడురెట్లు పెద్దది. మనదేశజనాభాలో మూడోవంతే ఇక్కడ!  విశాలమైన దేశం ఇది.  నాల్గు నెలలే ఎండాకాలంఎనిమిది నెలలు చలి, మంచు, వానలు. ఇక్కడ బ్రతకడం చాలాకష్టం. పేరు గొప్ప ఊరుదిబ్బ. దేశపాలకులు అతిగా  ఇళ్ళు కట్టను అప్పులివ్వడంవలన, ఖజానా ఖాళీ ఐంది. కట్టిన ఇళ్ళన్నీ, ఖాళీగా మిగిలిపోయాయి.  ప్రపంచీ కరణవల్లా, వీరు చేసిన తప్పులవల్లా, అన్ని దేశాలవారూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు ఊడాయి. కొందరు మనో ధైర్యం కోల్పోయి ప్రాణాలు తీసు కుంటున్నారు. మనకు ఇళ్ళలో కత్తి పీటలున్నట్లు ప్రతి ఒక్కరికీ  ఇక్కడ తుపాకులుంటాయి. కోపమొస్తే ఎదుటివార్ని కాల్చి చంపుతారు..." అంటూ దీర్ఘోపన్యాసం దంచుతున్న  పాపారావుతో... "అంకుల్! మీరు మాపేరెంట్స్ ను భయపెడుతున్నారేమో..." అన్నాడు సుబ్రావ్ ఆంగ్లంలో ." ఓ అయాం సారీ!  నాకు అలవాటైన ఉపన్యాస ధోరణిలో మాట్లాడేస్తున్నాను. మనిషి కనిపిస్తే మాట్లాడే అలవాటు మారాజకీయ నాయకులది." అని ఆపాడు. వారి కమ్యూనిటీ సమీపిస్తుండగా "ఇళ్ళన్నీ ఇలా మదేశంలోని పెంకుటిళ్ళలా ఉన్నయికదూ! ఇక్కడ మంచు కురుస్తుంది...ఇళ్లపై పడిన మంచు కరిగి క్రిందికి జారను ఇలా పైకప్పు కడతారు. ఇవన్నీ  చెక్క ఇళ్ళు. మనదేశంలోలా ఇటుక, సిమెంటుతో కట్టరు. నేల కూడా చెక్కే... " అంటూ మొదలెట్టాడు మళ్ళీ పాపారావు.  సుబ్రావ్ కారు గరేజ్ తలుపు, కార్లోంచే  రిమోట్ తో ఓపెన్ చేసి కారు లోనికి తీసుకెళ్ళి ఆపడంతో పాపంపాపారావు తన ఉపన్యాసం  ఆపేశాడు.

  సుభద్ర వచ్చి, అందర్నీ అప్యాయంగా పలుకరించి, లోనికి తీసు కెళ్ళిందిటాయిలెట్స్ ఎలావాడాలో  బాత్ టబ్ లో స్నానం ఎలా చేయాలో ఇంట్లో అన్నీ ఏవేవి ఎక్కడ ఉన్నాయో  చూపించింది. "అత్తమ్మ గారండీ! ఇక్కడ మనదేశంలోలాగా పనివారు దొరకరు.  అన్నీ మనమే  చేసుకోవాలి. మనటాయ్ లెట్స్బాత్ టబ్స్మనమే కడుక్కోవాలి. బట్టలుగిన్నెలు అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి.  బట్టలు బయట ఆరేయరాదు. చీరలు బయట ఆరేస్తారేమో! ఫైన్ వేస్తారు.  అన్నింటికీ మిషన్స్ ఉంటాయి." అంటూ అన్ని ఓపిగ్గాచూపి వివరించింది సుభద్ర. .

    పుల్లయ్య, పిచ్చమ్మలకు అంతాక్రొత్తగాఉంది.  భోజనానికి ముందుగానీ , తర్వాతగానీ కాళ్ళు కడుక్కోకపోడం, కొడుకు కోడలు మనవడు స్పూన్స్  ఫోర్క్స్ తో  అన్నంతినడం అన్నీ వింతగా ఉన్నాయి. `వాళ్లిద్దరూ మనవడ్ని చూడటం అదే మొదటిసారివాడిపేరు పృధ్వి. వాడు వారికి దూరదూరంగా ఉండసాగాడు. సుభద్ర " పృధ్వీ! దే ఆర్ యూర్ గ్రాండ్పేరెంట్స్దే డిడ్నాట్ నో ఇంగ్లీష్యూ హ్యవ్ టు టాక్ దెం  ఇన్ టెల్గూ" అంది.  వాడు  దానికి "నో ఐ కాంట్మై ఫ్రండ్స్ గ్రాండ్ పేరెంట్స్  ఆర్ నాట్ విత్ దెం. వై దీజ్ గైస్ కేం? డు దే గోలైక్ యూర్ ఫాదర్ఆర్  స్టే  హియర్ ఓన్లీ? " అన్నాడు వాళ్ళమ్మతో ఆంగ్లంలోనే.   

   సుభద్ర " ఏమనుకోకండి అత్తమ్మా! మామగారండీ ! వాడు పుట్టినప్పటినుండీ 'డే కేర్' లోనే ఉన్నాడు. మేమిద్దరం ఉద్యోగాలకు పోతాం గదా! అందు వల్ల  వాడికి తెలుగే రాదు. మిమ్మల్ను చూట్టం ఇదే మొదలాయె... మెల్లగా వాడు మీతో కలుస్తాడు." అంది సుభద్ర సర్ది చెప్తూ.    "అలాగేలేమ్మా!"అన్నారు వాళ్ళు, మరేం అనలేక. పాపారావు చాలా సార్లు రావడంవల్ల ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల పృధ్వి ఆయనకు మాలిమై, ఆయనతో మాట్లాడసాగాడు  ఆంగ్లంలో. మరునాడు ఉదయాన్నే పిచ్చమ్మలేచి స్నానం చేసి దీపారాధన హారతి లేకుండా పూజ చేసేసి, వంట గదిగా ఉపయోగించే కారు గరేజ్ కెళ్ళింది. నాల్గు కార్లు పార్క్ చేయతగిన పెద్ద గరేజ్ లోఓచిన్నపాటి కిచెన్ ఏర్పాటు చేశారు, సుభద్ర సుబ్రాలు. ఇంట్లోవండితే ,పోపువాసన ఇల్లంతా వ్యాపిస్తుందనిసుభద్ర వచ్చి బ్రేక్ ఫాస్ట్ కు, బ్రడ్ లేదా సీరియల్ తింటామని చెప్పి, వారానికోసారే తాము వండు కుంటామనీఇండియన్ షాప్ నుండీ చపాతీలు కొని తెచ్చు కునివేడిచేసుకుని తింటామనీ చెప్పింది. వారికోసం తెచ్చిన కూరగాయలు చూపిపొయ్యి వెలిగించడంమిక్సీ వాడటం అన్నీ చూపింది. కొడుకు, కోడలు, పృధ్విని డేకేర్ లో దింపిఆఫీస్ కెళ్ళి పోయారు.   వాడ్ని ఇంట్లో ఉంచితే ఆ తర్వాత అలవాటు పోతుందని భయంట! ఆపూటకు పిచ్చమ్మ  ఏదో ఇంత వండింది వారి ముగ్గురుకీని. రాత్రి ఔతుండగా సుబ్రా సుభద్ర, పృధ్వితో ఇంటికివచ్చాడు.  ఆ పూటకు తాను వారి కోసం తయారు చేసిన వంట భోం చేయమంది పిచ్చమ్మ. " ఆఫోర్క్ , స్పూన్లూ పక్కనపెట్టి చేత్తో తినండర్రా! రుచితెలుస్తుంది. అరచేత్తో అన్నం కలుపుకుంటే అమృతమవుతుంది.అని ఆమె చెప్పిన మీదట, గుత్తివంకాయ, మెంతి కూరపప్పూటమోటో పెరుగు చట్నీచారు, కమ్మని ఇంటిపెరుగూ ఆమె ఇండియా నుండీ తెచ్చిన గోంగూర, చింతకాయ చట్నీలతో అన్నం తినిభుక్తాయాసంతో పొట్టపట్టుకునిత్రడ్ మిల్ మీద ఓఅరగంట రన్నింగ్ చేసుకున్నారు సుబ్రా సుభద్రలు వంతులవారీగా. పాపారావు "అమ్మా! పిచ్చమ్మతల్లీ ! నీ చేతివంట అమృతప్రాయమని ఇంతవరకూ తెలీనేలేదు. మధ్యాహ్నం , ఇప్పుడూ తిని నానోటి తుప్పు వదలిపోయిం దంటేనమ్మండి. మాఆవిడ బ్రతికున్న రోజుల్లో ఆమెచేసిన వంత తర్వాత ఇప్పుడే ఇంత రుచి ఐన వంట తినడం." అన్నాడు పొగడ్త పూర్వకంగా.  

  " మీరెప్పుడైనా మాపూర్ పూరింటికి వస్తే కదా! మాఆవిడచేతివంట రుచి తెలియనూ..?" తొలిసారిగానోరు విప్పి అన్నాడు పిచ్చయ్య.  ఆరోజు నుండీ పిచ్చమ్మ అలా వంటింటికి అంకితమైందిప్రతివీకెండ్లో 'సుబ్రాఇంట్లోవిందులే విందులు. సుభద్ర తన స్నేహితులను, కొలీగ్స్ నూ పిలిస్తేసుబ్రా కూడ తీసిపోకుండా తన స్నేహితులనూ,కొలీగ్స్ నూ విందులకు ఆహ్వానించేవాడు. ప్రతి శనిఆదివారాలు లంచ్ లూడిన్నర్సూ తయారుచేయడంతో పిచ్చమ్మకు తీరికేలేదు.

  పుల్లయ్య "ఆరోగ్యం జాగ్రత్త! మరీ వయస్సుకు మించినపనిచేయకు." అన్నాడు భార్య కష్టం చూడలేక. "మన పల్లెలో పొలం పనుల కంటే కష్టం కాదులెండి. ఐనా పాపం నోరు చవి చెడి ఉన్నట్లున్నారు. ఇక కొద్ది రోజులేగా, మన పిల్లాడి లాంటి వాళ్ళే పాపం..." అంది పిచ్చమ్మ  చిరునవ్వుతో.

   పిచ్చమ్మ వండే పిండివంటలూ, మసాలా వంటల వాసనలతో గరేజ్ నిండిపోయేది. తమపల్లెలో ఎవరింట్లో ఏపేరంటాలూ, పండగలూ, పబ్బాలూ జరుపుకుంటున్నా, పల్లె వాసులంతా, 'అక్కా!, వదినమ్మా! !, చెల్లెమ్మా! అత్త మ్మా! ..' అంటూ వరుసలు కలుపు కుంటూ వెళ్ళి  వంటల్లో సాయపడేవారు. అలా పిచ్చమ్మ అన్ని రకాల వంటల్లో చేయితిరిగి పోయింది. ఆమె కేవలం   శాకాహారపు వంటకాలు మాత్రమే చేసేది. ఆమె వంటల రుచి చూడను  ఎన్నోమైళ్ళ దూరం నుంచీ డ్రైవ్ చేసుకుంటూ సుబ్రా, సుభద్రల స్నేహితులు వచ్చేవారు. వారు కోరినవన్నీ ఆమె ఓపిగ్గా వండి పెట్టేది  ప్రేమతో. వారంతా భోజనాలు చేస్తూ ఆమె వంటల్ని తెగ పొగడేవారు ఆంగ్లంలోవారిలో ఇంచు మించు 70 శాతం ఆంధ్రులే! అందుకే ఆంగ్లంలో మాట్లాడేవారు! లడ్డూలూ, బొబ్బట్లూ, పులిహోర, పాయసం, చక్రపొంగలినేతిగారెలూపెరుగు వడలూసాంబారు, రకరకాల చట్నీలుఒకటేంటి!పిచ్చమ్మ వంటలు వేటికవే ప్రత్యేకం.  సుభ్రా ఇల్లు కార్ల రాకపొకలతో కళకళ లాడగా, పృధ్వి  టాయ్ రూం బహుమతులతో నిండిపోసాగింది. సుభద్ర భోజనాలు చేస్తున్న వారితో "పాపం మా అత్తమ్మగారికి ఇంగ్లీషు రాదు. అందుకే మీకు పరిచయం చేయట్లేదు. ఇండియాలో ఓ చిన్న పల్లెవారిది. మరేమనుకోకండి."అనిచెప్పడం వినింది  పిచ్చమ్మ.  'బహుశా తనపేరు బావులేదని సందేహిస్తున్నదేమో!' అనుకుందామె. కొందరు స్నేహితులు సుభద్రకు సలహాఇచ్చారు  "మీ ఆంటీతో ఇక్కడ  ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయించరాదూ! డబ్బులకు డబ్బులూ పేరుకు పేరూనూ... మాలాంటివారికి తిండిబాధ, వంటపనీ తప్పుతాయి."అని.

    "మంచి ఇడియానే కానీ వారు ఆరునెలల విజిటింగ్  వీసాతో వచ్చారు. వారి అస్తిపాస్తులన్నీఇండియాలోనే ఉన్నాయి.  ఎక్కువకాలం ఉండలేరిక్కడ ముఖ్యంగా వింటర్లో" అని జవాబిచ్చింది సుభద్ర. వారి కమ్యూనిటీ లోని ఇండియన్స్ కొన్ని వంటలు చేయించి పెట్టమని అడిగేవారు. సుభద్ర మొహమాటపడగా "మాపల్లెలోఅందరికీ అందరం కల్సి చేసుకుంటాం. అదెంతపని నాకేం ఇబ్బంది లేదు. వస్తువులన్నీ తెమ్మను చేసిపెడతాను" అని పిచ్చమ్మ అడిగిన వారికంతా అన్నీ చేసి పెట్టేది.

   "మీ అత్తమ్మగారికి ఇంగ్లీషు వస్తే ఎంతబావుండేది! మాఇళ్ళకు తీసుకెళ్ళి చేయించు కునేవారం. మేమంతా వారు వెళ్ళేముందు  ఆమెకు సన్మానం చేయదలచాం" అని చెప్పారు సుభద్రతో.

  "అలాంటివి ఏమీ చేయకండి. వారు పల్లెటూరివారు. మానాన్నగారు వస్తూ మా బాబును చూస్తారని వెంటబెట్టుకు తెచ్చారు. మనపధ్ధతులూ అవీ  పాపం  వారికి ఏమీ తెలీవుఅంది సుభద్ర  వారితో.

     అలా పుల్లయ్య పిచ్చమ్మల ఆర్నెల్ల వీసా కాలం పూర్తయింది.  ఈలోగా పృధ్వి ఆరో పుట్టినరోజు రానే వచ్చింది. సుబ్రా , సుభద్రలకు, సిటిజన్ షిప్ , అన్నీ కలసి రాడంతో, వారు ఓపెద్ద  ఫంక్షన్ హాల్ తీసుకుని, 'గెట్ టు గెదర్' ఏర్పాటు చేశారు. సుబ్రా.మఱ్ఱి, సుభద్ర సుబ్రా, పృధ్వి సుబ్రా ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ మరి!.

   ఆ ఫంక్షన్ కు  సుబ్రా స్నేహితుడైన నగరమేయర్ 'స్కాట్' ను ఆహ్వానించాడు. పనిలో పనిగా ఆయనకు సన్మానం ఏర్పాటుచేశారు  అంతాకల్సి భవిష్యత్ లో ఏ అవసరమైనా వస్తే పనికొస్తుందని. అతను అమెరికన్ కదామరి! సుబ్రా, సుభద్రలకు ఆ మేయర్ జ్ణాపికలు యిచ్చి పృధ్వికి కూడా  బర్త్ డే బహుమతి తెచ్చి యిచ్చాడు. షుమారుగా 250మంది ఉన్న ఆసభలో  , అందరూ సుబ్రా, సుబాడ్రాలను తెగపొగిడి, వారిచ్చిన విందుల గురించీ కృతజ్ణతలు చెప్పి పుల్లయ్యా పిచ్చమ్మలకు  సన్మానం చేస్తామని వారిని స్టేజ్ మీదికి రమ్మన్నారు . సుబ్రా, సుభడ్రా "వద్దు వద్దు, వారికి ఇంగ్లీష్ రాదు .వారిని ఇబ్బంది పెట్టకండి"అన్నారు ఆంగ్లంలో. సభికులంతా పట్టుబట్టి వత్తిడి చేయసాగారు.

" ఈ ఫంక్షన్‌కు  వారు రావడమే గొప్ప. ఆయన్ని సూట్ వేసుకోమని ఎంత బ్రతిమాలినా ఇలా పంచెకట్టు, కండువాతో వచ్చారు. ఆమెను ప్యాంట్ వేసుకోమని ఎంత చెప్పినా వినక, ఇలా చీరలో వచ్చారు. స్టేజ్ మీద ఎలామాట్లాడలో వారికి తెలీదు" అని వారు చెప్తుండగా పుల్లయ్య "ఉయ్ కెన్ కం టు ది డయాస్" అన్నాడు హటాత్తుగా. పిచ్చమ్మ"  యు డోట్ బాదర్ ఉయ్ కెన్ మ్యానేజ్ ఇన్ ఎ నైస్ వే" అంది స్వఛ్ఛ మైన ఆంగ్లంలో!  సభికులతోపాటు, షుబ్రా, షుబాడ్రా, ఫుడ్వీ, పాప్ ర్రావ్ అంతా ఆశ్చర్వపోగా , పుడ్వీ  "మమ్మీ! యూ  సెడ్ దే డింట్ నో ఇంగ్లీష్ హౌ కెన్  దే స్పీక్ నవ్!" అని అరవ సాగాడు. వారి ఉఛ్ఛారణకు ఇంగ్లీ ష్ లో మాట్లాడిన తీరుకు అంతా అవాక్కయ్యారుమేయర్ స్కాట్ ముందుగా తేరుకుని  "వెల్కం గైస్ " అన్నాడు. " మిస్టర్ఫూల్ ఏ యా ఆండ్  పిక్ షం" అంటూ చేయి అందించాడు వారికి. పుల్లయ్య అతని చేయి అందుకుని స్టేజ్ ఎక్కి , పిచ్చమ్మకు స్టేజ్  ఎక్కను తన చేయి ఆసరాగాఇచ్చాడు. సభికుల్లోంచీ ఒకవ్యక్తి వచ్చి పుల్లయ్య మెడలో పూలమాలవేసి  ఙ్ఞాపికను, మేయర్ ద్వారా ఇప్పించాడు. మరో పూలమాల మేయర్ స్కాట్ కు ఇచ్చి,పిచ్చమ్మకు వేయమనగా ఆమెదాన్ని తన చేతులతో అందుకునినమస్కరించింది. మేయర్ స్కాట్ వారిని కొద్దిగా మాట్లాడమని కోరాడు. దానికి పుల్లయ్య "ఉయ్యార్ సో గ్రేట్ఫుల్   టు యు ఆల్ , ఫర్ ఇన్వయిటింగ్ అజ్  టు ది డయాస్ అండ్ ఫర్ ఆనరింగ్ అజ్. లేడిస్ ఫస్ట్! దటీజ్ వై మై వైఫ్  విల్ డెలివర్ హెర్ స్పీచ్ , ఆన్ బిహాఫ్ ఆఫ్ మి ఆల్సో ..." అని చెప్పాడు.  పిచ్చమ్మ లేచింది. భుజాల నిండుగా పైట కప్పుకుని, ఆకుపచ్చని పట్టు చీరలో, నుదుటిపై పావలాకాసంత  ఎర్రని కుంకుమ బొట్టుతోదానిక్రింద చిన్నని విభూది రేకతో, తలలో పసుపుపచ్చని చేమంతి పూలమాలతోచేతులనిండా నీలం పసుపు అకుపచ్చ గ్లాస్ గాజులతో , ఆంధ్రత్వం  ఉట్టిపడేలా, అపర 'లక్ష్మీదేవా!అన్నట్లు ఉంది ఆమె. అంతా కుర్చీల్లో నిటారుగా కూర్చున్నారు.  "మై ప్రణాంస్  టు యు ఆల్ ! బ్లస్సింగ్స్  టు చిల్డ్రన్,ఉయ్ ఆర్  సో లక్కీ టు మీట్ యు ఆల్ఐ ఉడ్ లైక్ టు షేర్ సంథింగ్ ...." అంటూఆమెఆంగ్లం లోప్రారంభించి, తన ఉపన్యాసం    కొనసాగించింది.  అనర్గళంగా సాగుతున్న ఆమె ఉపన్యాసం  జలజలా పారే సెలయేరులా ఉంది. 

  "మీరంతా మమ్మల్ని పల్లెటూరి అనాగరికులుగా భావించి ఉండవచ్చు. మేము పల్లెటూరి వారమేకానీ పనికిమాలిన వారముకాము.  మీలా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో  చదవకపోవచ్చుకానీ మాకూ తెలివిఉంది.  మా బుర్రలకు పదును పెట్టుకునే చావ ఉంది. ఏ భాషైనా  పట్టుదలతో నేర్వగలం. చిన్నప్పుడే  సంస్కృతం, తెలుగు ఇళ్ళలోనే నేర్చాం. ఈ కాలంలోలా పి.సి.లు, చేతుల్లో సెల్ ఫోన్లూ  లేకపోవచ్చు.  మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాయి.  కోఆపరేషన్  అండ్  కోఆర్డినేషన్ లు  మా పల్లెల వారికి  తెల్సు. మాతరానికీ మీతరానికీ ఎంతో తేడా ఉంది. మీకంతాతెలుసనీ మాకేమీ తెలీదనీ రాదనీ మీతరం భావన.  మాకాలంలో ఈ చదువులు లేవు. మాక్కావల్సినంత చదువు మేంచదివి, దాన్ని మాజీవితంలో ఆచరిస్తూ  ఉంటాం. చదువు జీవితాలనుధర్మంగా  న్యాయంగా మానవతా విలువలతో కొనసాగించుకోను  మాత్రమే అని మా భావనమీరు చదువు ధనం  సంపాదించుకోను స్టేటస్ మైన్ టైన్ చేసుకోను  అమెరికావంటి ఈ దేశాలకు రాను అని మాత్రమే భావిస్తారు. మీతల్లి దండ్రులు ఎన్నో త్యాగాలు చేసి మిమ్మల్ని  చదివిస్తే మీరు ఈదేశాలకు వచ్చి వారిని అనాధలుగా వదిలేస్తున్నారు, లేదా   మీ పిల్లల్ని  ఆయాల్లా సాకను  పిలిపించు కుంటున్నారు. ఈదేశంలో ఆయాలకు బేబీ సిట్టిగ్ చేయను మీజీతాల్లో సగం ఇవ్వాలి.  ఈ ఆరు నెలలనుంచీ నేను మాఇంటికి వచ్చేవారినంతా గమనిస్తున్నాను. వారి మాటలు వింటూ ఇక్కడి ఎన్నో విషయాలు తెల్సుకున్నా.   సమావేశంలో ఉన్న వారిలో 90 శాతం మంది  భారతీయులు. కాని ఎవ్వరూ భారతీయులని పోల్చుకో లేరు.  50 శాతం ఆంధ్రులు.  మీలో ఎందరు ఆంధ్రులుగా కనిపిస్తున్నారు? ఆంధ్రలోనే నేడు ఆంధ్రత్వం మచ్చుకైనాలేదు. 'రోంలో రోమన్ లా ఉండాలనే' పదం పట్టుకుని కట్టు, బొట్టు, భాష , తీరు అన్నీ మార్చేసుకున్నారు. ఈదేశస్థులను చూసిపులిని చూసిన నక్క చందాన ప్రవర్తిస్తున్నారు. ఆఫీసులకు ఆ డ్రెస్కోడ్ లో వెళ్ళినాఇలాంటి సమావేశాలకు అందరూ  ఎవరి పధ్ధతిలో వారు వస్తే ఎంతబావుంటుంది!  చక్కని భారతీయులుగా వచ్చిన మీలో కొందరిని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఏదేశంలో ఐనా , వారి వారి వాతావరణ పరిస్థితులను అనుసరించి  వస్త్ర ధారణ వున్నా, మన తీరు తెన్నులు మరచిపోడం మంచిది కాదని నా అభిప్రాయంభారతీయ సాంప్రదాయం, ఆచారవ్యవహారాలు ఉట్టెక్కాయి. ఇక్కడే కాదు నేడు ఇండియాలోనూ సిటీల్లో చూస్తే పాశ్చాత్యులే ఎంతో నయమనిపిసున్నారు.  పాశ్చత్యులే మన వస్త్రధారణకు మురిసి  చీరలు పంచ లాల్చీలు ధరించి ఈసమావేశానికి రావడం నాకెంతో ముచ్చటగాఉంది. మనంవారి పధ్ధతుల్ని వెర్రిగా అవలంబిస్తున్నాం. నాకు నిర్మొహ మాటంగా మాట్లాడటం అలవాటు.  మీరంతానాకంటే చిన్నవారు, నాబిడ్డలుగా భావించిచెప్తున్నాను. మన పధ్ధతుల్ని మనం ఎందుకు పూర్తిగా మార్చుకోవాలిఅన్నం అరచేత్తో కలిపితే మన శరీరంలోని 50 రకాల మూల పదార్ధాలు  మన అరచేతి చర్మరంధ్రాల ద్వారా కొన్నైనా ఆ అన్నంతో కల్సి  అమృతంగా మారి , రుచి పెరిగి సులువుగా జీర్ణమవుతుంది . ఎవరి మాతృభాష వారి పిల్లలకు ఉగ్గు పాలతో నేర్పాలి. ఉగ్గేలేందిఇహ ఉగ్గు భాషేంటి! ఇప్పుడు మా ఇండియాలోసైతం, ఆంగ్లం తప్ప మాతృభాష ను మరచే పోతున్నారు. పాఠశాలల్లోనూ ఆంగ్లమే! ఆవిషయంలో ఇక్కడి భారతీయులే మేలు. తమ పిల్లలకు వారి భాషనేర్పను ప్రయత్నిస్తున్నారు. ఇంత ఆత్మన్యూనతాభావం భారతీయులకుండటం  భరించలేని విషయం మాలాంటి వారికి.

    'తల్లి వడి- ప్రథమ బడి '- అన్నారు. నేడు ఇక్కడేకాక ఇండియాలోనూ 'డేకేర్లే '. అందుకే ఆభాషే మాతృభాష ఔతున్నది.  మా మనవడు పృధ్వి మాకు ఆంగ్లం రాదని  ఈ ఆరు నెలలుగా మాతో మాట్లాడనే లేదు. ఇది అతిశయం కాదు యదార్ధం. ఐతే మీరడగవచ్చు. మీకు ఆంగ్లం వచ్చుకదా మీరే మాట్లాడలేకపోయారా! అని. మేం  వెళ్ళి పోతాం. తిరిగి రాం కూడ. వాడికి మాపై ఆపేక్ష పెంచి వాడు మేం వెళ్ళిపోయాక బాధ పడటం ఇష్టం లేకనే  మా అంతట  మేం మాట్లాడలేదు. పసి హృదయాన్ని  బాధపెట్టడం సబబు కాదనిపించింది మాకు. 

  ఇహ ఇక్కడ నాకు నచ్చిన విషయాలు. మగవారు గృహిణులకు ఇంటి పనుల్లో సాయం చేయడం.  పురుషులు గిన్నెలుతోమి డిష్ వాషర్ లోవేయడం. గుడ్డలు వాషింగ్ మిష న్లో వేయడం  ఇల్లు వాక్యూం చేయడం పిల్లలకు తిండి  తినిపించడం వంటి పనుల్లో స్త్రీలకు సాయ పడటం  గొప్పవిషయం. ఇక్కడికి వచ్చాక  కేవలం వ్యవసాయమే తన పనని భావించే మా ఆయన నాకు వంట పని లో సాయం చేయడం, కూరలుతరిగి పెట్టడం, వంటివి నేర్చుకున్నారు. ఇది గొప్ప పరివర్తన! ఇతరులనుండీ మంచి నేర్చుకోను మన సాంప్రదాయంలోని మంచిని  వదులుకో నక్కరలేదు. ఒక్కసారి స్త్రీ పురుషులకు వివాహమైతే  జీవితాంతం కల్సి ఉండటం మన భారతీయ సాంప్రదాయం. చిన్న చిన్న  విషయాలకు సర్దుబాట్లు చేసుకోలేక విడాకులకు వెళ్ళడం సబబుకాదు.  కుటుంబం ఓ చిన్న సమాజం. కుటుంబంలో భార్య భర్తలైన  ఇరువురు కలసి జీవితాంతం ఉండలేనపుడు ఇహ సమాజంలోని వ్యక్తులందరితో   ఎలాకల్సి జీవిస్తారు?మనం సంఘజీవులం. ఇక్కడికివచ్చి స్థిరపడ్డ భారతీయులేకాక భారతదేశంలో  భారతీయులుసైతం నేడువిడాకులకోసం వెళ్ళడం విచారకరం. అంటే సర్దుబాటు ధోరణి తగ్గిపోతున్నదని ఋజువవుతున్నది. తమకు పడలేదని విడిపోతున్నారు తప్ప తమబిడ్డలకు తల్లి దండ్రుల ప్రేమను దూరంచేసేహక్కు వారికుందేమో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మేమిక్కడకు వచ్చాక మా మనవడితో పాటు ఆడుకునే పిల్లలు మాట్లాడుకునే మాటలు మేం విన్నాం."నీకేం రా ! మీ మమ్మీ డాడి ఇద్దరూ కలసి ఉన్నారు. నాకు మాడాడీ లే డనీ , మమ్మీ లేదనీ" బాధపడటం విన్నాం.  మన సాంప్రదాయం, మన పధ్ధతులుమనసంస్కృతి  ప్రపంచమంతా చాటిమన సంస్కృతికి వన్నెతెచ్చే ఉత్తమ సంస్కారవంతులంగా మనం ఉంటే మనమెక్కడ జీవించినా, మన మాతృభూమి ఋణం తీర్చుకున్నట్లే! మనల్ని మనమే ఉధ్ధరించు కోవాలి. దిగజార రాదు. ఎవర్నయినా నా మాటలు బాధించి ఉంటే, మీతల్లిగా భావించి   మన్నించండి. మా కొడుకు ఇక్కడికి రాగానే వాళ్ళిక్కడ స్థిరపడతారని భావించాం.  మేం ఎప్పటికైనా ఒక్కసారైనా ఇక్కడికి రావల్సి వస్తుందని, తలంచి గత పదేళ్ళుగా మేం ఆంగ్లభాష నేర్చుకోడం మొదలుపెట్టాం. మా పల్లె స్కూల్  హెడ్మాస్టర్ గారు మాకు నేర్పారు. ఈ ఉచ్చారణమాట్లాడే విధానం ఆయనే మాకు నేర్పారు. ఐతే మేం అవసరమైతేనే తప్ప ఈభాషను మాట్లాడం. ఈరోజు తొలిసారిగా ఈదేశంలో  ఇలా మాట్లాడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. భాషలో తప్పు లుంటే మన్నించండి. కృతఙ్ఞతలు. అసతోమా సద్గమయా - తమసోమా జ్యోతిర్గమయా... మృత్యోర్మా అమృతంగమయా ... ఓం శాంతి  శాంతి శాంతిః " అని నమస్కరించి తన దీర్ఘోపన్యాసం  ముగించింది పిచ్చమ్మ.  హాలంతా అరగంటసేపు కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది.      

Comments