పది రుపాయల నోటు - గరిశకుర్తి రాజేంద్ర

    
మనిషి ఒక కంటితో ఎంతదూరం చూడగలడో రెండో కంటితోనూ అంతేదూరం చూడగలడు. మరి ఆ దేవుడు ఒకటితో సరిపెట్టక రెండు కళ్ళెందుకిచ్చినట్లు?....

    సమదృష్టిని అలవరుచుకోమని! కాని మనిషిలో కనిపించదు మచ్చుకైనా ఈ సుగుణం.

* * *

    ఉదయం సమయానికి తయారుకావడం ప్రతిరోజు ఓ కార్గిల్ యుద్ధం చేసినంతపనే. నేను పోస్టాఫీసుకి, రమ బడికి, సంవిద్ స్కూలుకు టంచనుగా తొమ్మిదికల్లా ఇంట్లోంచి బయటపడాలి. ఉదయం లేస్తేచాలు ఎవరి హడావిడి వారిది. వంటపని ముగించుకోవడం, టిఫిన్లు సర్దుకోవడం మధ్యలో మాకూ పనిమనిషికి కాఫీ టీలు అందించడం, వీటితోపాటు 'హ్రీంకారాసన గర్భితా' అంటూ అమ్మవారి పూజ. ఒకటే హడావిడి. ఇంటికి తాళంవేసి మోపెడ్ పై బయలుదేరెవరకు ఒకటే టెన్షన్. తాళంవేసి బయలుదేరేంతలో 'ట్రింగ్, ట్రింగ్' మంటూ టెలీఫోన్ పిలుపు. అసహనంగనే తాళంతీసి ఫోన్ లిఫ్ట్ చేస్తే లైన్లో శ్రీకాంత్.

    "నేను చెప్పిన పదిరూపాయల నోటు దొరికిందా?" ఒకే ఒక ప్రశ్న. పదిరూపాయల నోటుకోసం ఈ సమయంలో హైదరాబాద్ నుండి ఫోన్ చేయాలా? ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు ఫోన్ చేసి తానెప్పుడో ఒక పదిరూపాయల నోటు ఇచ్చి దాచిపెట్టమని చెప్పానని, అది వెతికిపెట్టమని చెప్పాడు. ఆ విషయం నేనంతగా పట్టించుకోలేదు. మరీ నిలదీస్తే ఏదో ఒక పదిరూపాయల నోటు పాతదే దొరికిందని చెప్పి ఇచ్చి తప్పించుకోవాలనుకున్నను. కానీ తానానోటుపై సంతకం చేసి తేదీ కూడ వేసానని తనకానోటే కావాలని శ్రీకాంత్ రెట్టించడంతో నాకు తప్పించుకునే అవకాశం లేకపోయింది. "అలాగే వెతికిపెడతాను, కానీ నీ రాక ఎప్పుడు?" అసహనంగా ప్రశ్నించాను నేను. జవాబు చెప్పకుండా నోటు వెదకమని హెచ్చరించి ఫోన్ కట్ చేసాడు శ్రీకాంత్. ఇంటికి తాళంవేసి బయలుదేరుతూ రేపు ఆదివారం ఇల్లంతా గాలించి ఆ నోటును పట్టుకోవాలి, ధృడంగా నిశ్చయించుకున్నాను నేను.
                             
* * *

    ఆదివారం...
    
    ఈటీవీ లో భాగవతం చూస్తూ కూర్చున్నాను.
                   
    "నమస్కారం బావా"! అన్న పలకరింపుతో ప్రవేశించాడు శ్రీనివాస్, నా బావమరిది.
                  
    "శ్రీనివాస్! రా...రా..." అంటూ ఆహ్వానించాను. మనిషెందుకో కొంచం అశాంతిగా, ఆందోళనగా కనిపించాడు. కుశలప్రశ్నలయిపోయాక టీ త్రాగుతూ కూర్చున్నాం. రమ వంటపనిలో, సంవిద్ ఆటలోనూ బిజీ కాగా, మేము మాటల్లో పడిపోయాం.
             
    "ఊ... చెప్పు ఫోన్ కూడా చేయకుండా ఇలా హఠాత్తుగా ఎందుకూడిపడ్డట్టు?" హాస్యదోరణిలో ప్రశ్నించాను నేను.

    "అదే నీకు చెప్పిన విషయం ఏంచేశావ్?" ఆత్రంగా అడిగాడు శ్రీనివాస్.
             
    "ఏ విషయం?" తెలిసినా తెలియనట్టూ నటించాను నేను.
             
    "మన పిల్లల పెళ్ళి విషయం" అసహనంగా అన్నాడు శ్రీనివాస్.
             
    "శ్రీకాంత్‌కు ఆ అభిప్రాయం లేనట్లుంది" ముక్తసరిగా అన్నాను నేను.
             
    "అదేమిటీ? నీవు చెబితే నీ కొడుకు వినడా బావా!" నిష్టూరంగా అన్నాడు శ్రీనివాస్.
                
    "అయినా నాకు అర్థం కాక అడుగుతాను, అంత తొందరేమిటట?" కొంచం కోపంగానే అన్నాను నేను.

    "పెద్దన్నయ్య బిడ్డ పెళ్ళయి అయిదేళ్ళయ్యింది. కొడుకు పెళ్ళి కూడా త్వరలో కాబోతున్నది. నా ఆడపిల్లలిద్దరూ అలాగే ఉన్నారు. మేన సంబంధం తయరుగా ఉండగా ఆలస్యం దేనికీ?"
             
    "మేన సంబంధమే కావచ్చు. పిల్లల ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా? అయినా శ్రీకాంత్ తో చెప్పి ఒప్పించే ప్రయత్నం చెస్తాను" అయిష్టంగానే హామీ ఇచ్చాను నేను.
             
    నా జవాబు అతనికి సంతృప్తి కలిగించినట్టు లేదు, భోజనం అయ్యిందనిపించి వెల్లిపోయాడు శ్రీనివాస్.
             
    అయినా అతనిలో పూర్తిగా ఆశ చావలేదు. 
                             
* * *
              
    మళ్ళీ ఒకసారి శ్రీకాంత్ ఫోన్ చెసి ఆ నోటు గురించి హెచ్చరించడంతో బద్దకాన్ని వదిలించుకొని ఇల్లంతా అణువణువూ గాలించాను. నా శ్రమ ఫలించింది, ఆ పదిరూపాయలనోటు దొరికింది. శ్రీకాంత్ మళ్ళీ ఎప్పుడైనా అడుగుతాడేమోనన్న భయంతో దానిని జాగ్రత్తగానే దాచిపెట్టాను. కానీ అతి జాగ్రత్తవల్ల ఎక్కడ దాచిపెట్టానన్న విషయం మర్చిపోయాను. అందువల్ల అంత కష్టపడాల్సివచ్చింది. మొత్తమ్మీద కథ సుఖాంతమవ్వడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాను.
            
    ఆ నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే, దానిపై ఒక తేదీ వేసి పెట్టాడు శ్రీకాంత్. ఆ తేదీ ఏమై ఉంటుందా అని పరిశోదించగా, పరిశీలించగా నా మెదట్లో ఒక మెరుపు మెరిసింది....
             
    అది శ్రీకాంత్ బర్త్ డే....ఆ బర్త్ డే కు వాడు నిజామాబాద్ లో ఉన్నాడు.
                             
* * *
             
    "శ్రీకాంత్! మీ మామ శ్రీనివాస్ వచ్చి వెళ్ళాడు" అన్నాను సౌమ్యంగా.
             
    "ఎందుకట?" అసహనంగా అడిగాడు శ్రీకాంత్. వాడికి కోపం, అసహనం పాలు ఎక్కువ.
             
    "ఇంకెందుకు? నిన్ను అల్లుణ్ణి చేసుకోవడానికి."
             
    "ఇంకానయం. ఇప్పుడంటే అన్నావ్. ఈ మాట నా ముందు మళ్ళీ ఎప్పుడూ అనకు" ఒకే ఒక హెచ్చరికతో మా సంభాషణ కట్ చేసి నా నోరు మూసేశాడు, నాకు మరో మాటకు అవకాశం ఇవ్వక.
             
    నాకే విననివాడు వాళ్ళమ్మకు అస్సలు వినడన్న విషయం నాకూ, రమకు బాగా తెలుసు.
             
    "ఈ అనవసర విషయాలు అలా వుంచు, నా పదిరూపాయల నోటు సంగతి ఏం చేశావు?" తాడోపేడో తేల్చుకొనే ధోరణిలో అడిగాడు శ్రీకాంత్.
             
    నేను చాలా నిబ్బరంగా ఉన్నాను, ఆ నోటు దొరికుండకపోతే నా పరిస్థితి మరోలా ఉండేది. నోటు వాడికందిస్తూ, "నాకు తెలియకడుగుతాను ఏమిటట దీని ప్రత్యేకత?" వ్యంగ్యంగా అన్నాను.
             
    "ఎలాగూ నిజామాబాద్ వెళ్తున్నాంగా అక్కడే అందరిముందే ఈ సస్పెన్స్ ముడి విప్పుతాను" నన్ను మరింత ఊరిస్తూ అక్కడినుండి వెళ్ళిపోయాడు వాడు.
             
    'కొరకరాని కొయ్య' అనుకొని నా కోపాన్ని అణచుకోక తప్పలేదు నాకు.
                             
* * *
                
    దసరా మర్నాడు పెద్ద బావమరిది కొడుకు ఎంగేజ్‌మెంట్. దసరాకు అందరూ అక్కడకే రావాలని ఆర్డరు వేశారు మా మామగారు. తల ఊపింది నా శ్రీమతి సంతోషంగా. తోకాడించక తప్పింది కాదు నాకు.
             
    భోజనాలు చేస్తూ కుటుంబ సభ్యులంతా మాటల్లో పడిపోయాం. శ్రీనివాస్, శ్రీకాంత్‌ను పెళ్ళికొప్పించే భారం వాళ్ళ తండ్రిపై అంటే మా మామగారిపై వేసినట్లున్నాడు. వారు గొంతు సవరించుకోగానే అందరి నోళ్ళూ  మూతపడ్డాయి. కొన్ని జతల చెవులు వారు చెప్పే విషయం వినడానికి ఆసక్తిగా ఎదురు చూశాయి.
             
    "ఏం? శ్రీకాంత్! నీ పెళ్ళి విషయం ఏమాలోచించావు? మామయ్య తొందరపడుతున్నాడు" అన్నారు మా మామగారు.
             
    "నా అభిప్రాయమెప్పుడో చెప్పాను. ఆ ప్రస్తావన మళ్ళీ ఇప్పుడెందుకు?" కోపంగా అన్నాడు శ్రీకాంత్.
             
    "నీ మరదలు పిల్ల చూడ్డానికి బాగానే ఉంటుంది. అంతో ఇంతో చదువుకుంది. ముఖ్యంగా నీవంటే ఇష్టపడుతుంది. ఏమిటట నీ అభ్యంతరం?" అధికార పూర్వకంగానే అన్నారు మా మామగారు.
             
    "ఆ విషయలన్నీ అటుంచండి. నాకు నచ్చని విషయం ఏమిటో చెబుతున్నాను.  ధైర్యం ఉంటే విని అరిగించుకోండి" అని తన అయిష్టానికి అసలు కారణం బయటపెట్టాడు శ్రీకాంత్. "ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా చూడడం తల్లిదండ్రుల కనీసధర్మం. కానీ అదేమిటో కొందరు తల్లిదండ్రులు మగ పిల్లలను, వాళ్ళ పిల్లలను మాత్రమే ఆత్మీయంగా చూస్తారు. ఆడపిల్లలను, వాళ్ళ పిల్లలను అసలు పట్టించుకోరు. మరి కొందరు తల్లిదండ్రులు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. మొదటి వర్గానికి ప్రతినిధులు మీరు. రెండువైపులనుండీ ప్రేమను పొందలేని ధౌర్భాగ్యులము మేము. అందుకే మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు"  ఇంకా ఏదో చెబుతున్నాడు శ్రీకాంత్, అందరూ అవాక్కై వింటున్నారు. చిన్నపిల్లాడిలా కనిపించే శ్రీకాంత్ లో అంత భావావేశం ఉందని, ఆ కుటుంబమంటే అంత వ్యతిరేకత ఉందనీ అప్పటిదాకా నాకే తెలియదు.
             
    "అదంతా నీ ఊహ మాత్రమే నా సమదృష్టికొచ్చిన కొదవేమీ లేదు. పోనీ అలా వేరుగా చూసిన సంఘటన ఒకటి చెప్పు? పొరపాటైతే సరిదిద్దుకుంటాను" అసహనంగా అన్నారు మా మామగారు.
             
    "చదువుకోసం మీ ఇంట్లో ఉన్న రెండేళ్ళలో జరిగిన అనుభవాలు ఎన్ననీ? మీ పిల్లలు చిన్నగా దగ్గినాసరే ఆపసోపాలు పడుతూ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నేను కాళ్ళ నొప్పులతో మూడు రోజులు పడుకుంటే, పడుంటే మాట్లాడించే తీరిక లేదు మీకు. మీ మనవడి పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకటి రెండు రోజుల తేడాతో వచ్చాయి. కొడుకు కొడుకు కాబట్టి వాడి పుట్టినరోజు ఘనంగా చేసి వంద రూపాయల నోటు వాడికి గిఫ్ట్ గా ఇచ్చారు. నేను బిడ్డ కొడుకును కాబట్టి నా పుట్టినరోజు మీకెవరికీ పండగలా అనిపించలేదు. నా చేతిలో పది రూపాయల నోటు పెట్టి చేతులు దులుపుకున్నారు" శ్రీకాంత్ భావావేశం కొనసాగుతూనే ఉంది.
             
    అవన్నీ మాకు తెలియని విషయాలు కావు, పెద్దవాళ్ళం కాబట్టి సహిస్తూ వచ్చాం. ప్రేమనేది సహజంగా ఉండాలనీ బలవంతం చేస్తే వచ్చేది కాదనీ సరిపెట్టుకున్నాం. కానీ నేటి యువతకు ప్రతినిధి అయిన శ్రీకాంత్ సహించలేకపోయాడు. అందుకే ఇలా బయటపడ్డాడు. 
             
    జరిగిందేదో జరిగింది పోనీలెమ్మని సైగలతోనే వారించబోయాను నేను. కానీ వాడి ఆవేశాన్ని ఆపలేకపోయాను.
             
    "మేమేం మీ ఆస్తిపాస్తులు పంచిమ్మని అడగడం లేదు. ప్రేమరాహిత్యాన్నే సహించలేకపొతున్నాం. అందుకే ప్రేమకూ, సమదృష్టికీ తావులేని మీ కుటుంబంతో సంబంధం అసలు వద్దనుకున్నాను. ఇదిగోండి నాకు మీరు మొట్టమొదటిసారిగా ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్" అంటూ ఆ పది రూపాయల నోటు మా మామగారి చేతిలోపెట్టి అక్కడినుండి కోపంగా వెళ్ళిపోయాడు శ్రీకాంత్.

    ఎలాగైతేనేం సస్పెన్సు తెర వీడిపోయింది. ఆ పది రూపాయల నోటు వెనక ఇంత కథ ఉందన్నమాట. అక్కడున్న వారంతా ఈ 'రసాభాసను' తట్టుకోలేకపోతుంటే నేను మాత్రం అసలు రహస్యం తెలిసినందుకు సంతోషించి తేలికగా నిట్టూర్చాను.
             
    దేవుడు మనిషికి రెండుకళ్ళిచ్చినా చూసేది ఒకే దృశ్యాన్ని. కానీ మనిషికెందుకో సమదృష్టి అలవడలేదు. మా పిల్లలు రెండురకాలుగా, రెండువైపులనుండీ ప్రేమరాహిత్యాన్ని అనుభవించారు.

    అందుకే శ్రీకాంత్ లో ఈ అసహనం...కోపం...!
Comments