పగలు, రాత్రి... ఒక మెలకువ - బి.వి.ఎన్.స్వామి

    అలసట, ఆందోళన, తలనొప్పి కలగలసిన స్థితి బాధ్యతారాహిత్యాన్ని భరించాల్సిన దుస్థితి. బాధ్యతల కింద మెదడు నరాలు చిట్లుతున్న చప్పుళ్ళు. నిద్ర పట్టని మెలకువ. అలా నిలబడిపోయిన కళ్ళలో దృశ్యాలు మారుతున్న సందడి. కనిపెంచిన రక్త ప్రవాహం ఎదురెక్కుతున్న ఉదృతి. నమ్మిన భావజాలం, జాగిలంలా కాలం వెంట నడుస్తున్న సన్నివేశం. రెటీనా మీద చిందేస్తున్న గ్లోబల్ గువ్వలు. వీటన్నిటి మధ్య కాట కలిసిన అనుభూతి. మెల్ల మెల్లగా గుండెలపై పెరుగుతున్న ఎవరెస్ట్ బరువు. కనురెప్పలు మూతపడి రెండు కన్నీటి చుక్కలు బుగ్గల్ని ముద్దాడాయి. నాకేమస్తది? అనే ప్రశ్న నాలుగు దిక్కుల్నించి చొచ్చుకొని కర్ణభేరిని చీల్చివేసింది. ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయి. మనసు గోల పెడుతుంది. పచ్చని ఆకుల మధ్య పండిపోయి వేలాడుతున్న ఆకు పరిస్థితి నాది.

    "ఇంత రాత్రి దాక ఏం చేశావ్ ఇప్పుడా వచ్చేది?" తల్లి అడిగింది.

    "కమల వాళ్ళ తాతయ్య చనిపోయిండు. అక్కడే ఆలస్యమైంది."

    "బాగానే ఉండె కదా! ఎట్లా చనిపోయిండు."

    "మధ్యాహ్నం స్ట్రోక్ వచ్చిందట. అపోలో హాస్పటల్‌కు తీసుకెళుతుంటే బంద్ నిర్వాహకులు వాహనాన్ని ఆపేయడంతో సమయానికి ఆసుపత్రికి చేరలేదట. వైద్యం అందకనే చనిపోయిండట."

    లోపల ఉండి ఇదంతా వింటున్న నాకు బంద్‌లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గుర్తుకొచ్చింది. రాజ్యము, న్యాయస్థానము విడివిడిగా అధికారం చలాయిస్తున్న వైనం తట్టింది. తలనొప్పి మరింత ముదిరింది. అలవాటైన మాత్రలు మింగాను.

    అనంతమైన జలరాశి. సుడిగుండాల్ని కడుపులో నింపుకొని చెలియలి కట్టల్ని గౌరవిస్తున్న సముద్రం. జలచరాల ఆనంద డోలికలు, పరస్పర పరిధుల్ని దాటని జీవుల సహవాసం అన్నిటిని కప్పుకొని కల్లోలాన్ని మరచి నిద్రిస్తున్న సాగరం. అర్థరాత్రయిందేమో తీరంలో సందడి తగ్గింది. పండువెన్నెల్లో ఇసుకతిన్నెలు సేదతీరుతున్నాయి. సమీరం సయ్యాటలాడుతుంది. వాతావరణంలో ప్రశాంతత తొణికిసలాడుతుంది. ఛానలైజ్డ్ దృశ్యానికి ప్రతిబింబంలా అనిపించింది. 

    అలాంటి వాతావరణంలో ఆందోళనను నింపుకున్న పరుగుతో చిన్న భూచరమొకటి సముద్రం వైపు వస్తుంది. ఆశ్చర్యంగా కళ్ళునులుముకొని చూశాను. ఆకారం పోల్చుకోలేనంత దూరంలో ఉంది. తన చిన్న కాళ్ళతో వేగంగా వచ్చి తీరం వద్ద ఉన్న ఎత్తయిన బండపైకి ఎక్కి కూర్చుంది. భూచరం స్పష్టంగా కనిపించింది. ఏం చేస్తుందో అని ఆత్రంగా చూడసాగాను. 

    "ఉడత నీళ్లలోకి దూకింది" గట్టిగా అరిచాను.

    ప్రక్కనే ఉన్న మా ఆవిడ మెల్లగా లేపి నీళ్ళందించింది. ఎందుకా ఉలికిపాటు అని ప్రశ్నించింది. "అవునూ...ఉడత నీళ్ళలోకి ఎందుకు దూకింది" నా మనసు ప్రశ్నించింది. జీ.టి.వి. హిందీ పాటల ప్రోగ్రాంను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. రిలాక్స్ అవుదామని టి.వి. ముందు కూర్చున్న. అలా రాత్రి గడిచింది. 

    ఉదయాన్నే పేపర్ తీసుకుని కాఫీ ముందు కూర్చున్న. హెడ్డింగ్ చూసుకుంటూ పేజీలు తిరగేస్తుంటే ఒకచోట "ఎవరి కట్టడాలకు వారే బాధ్యులు" అనే కథనం కనిపించింది. సారాంశమిది. 

    రాష్ట్రంలో రకరకాల భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. బిల్డింగ్‌లు వలుస్తున్నాయి. జెండాలు మొలుస్తున్నాయి. గుడిసెలు కొలువుతీరుతున్నయి. ఏవి మిగులుతున్నాయి? మిగిలిన వాటి వెనుక ఉన్న మతలబు ఎటువంటిది? అనే విశ్లేషణ తార్కికంగా సాగింది. గుడిసెల్ని ప్రజలు, బహుళంతస్తుల్ని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కాపాడుతున్నాయి. ప్రజల ఉమ్మడి ఆస్తిగా నిలిచిన కట్టడాల మాటేమిటి? పురాతన, చారిత్రక కట్టడాల పరిరక్షణ చట్టం కిందికి రాని కట్టడాల భవిష్యత్తేమిటి అని ప్రశ్నిస్తూనే, కూలినవాటిని నిలుపుకోలేక ప్రభుత్వాలు చేతులెత్తేసిన తీరును చూపెట్టింది. చట్టం పరిధిలోకి రాకుండా, పటిష్టంగా ఉన్న కట్టడాన్ని ప్రభుత్వం తొలిగించడానికి పూనుకొందని, ఆ నిర్మాణమే రామసేతువు లేక ఆడమ్స్ బ్రిడ్జ్ అని తెలిపి ముగించింది.  

    ఆసక్తికరంగా సాగిన కథనం అసంపూర్తిగా ముగిసిందనిపించింది.

    "రామనామమే లడ్డంటా

    అది తినేవారికి తీపంటా

    రామనామమే దొరికింది

    మన కష్టములన్నీ తీరినవి"

    పూజగది నుడి అమ్మ భజన వినపడింది. ఆఫీసు టైం అయితున్నందున  లేచి ఆఫీసుకు తయారు కాసాగాను. పక్కింట్లో నుండి గొడవ పెద్దగా వినిపించింది. చెవులు రిక్కించాను. బయటికి వెళ్ళాలని ఉన్నా ఉదాసీనత ముందుకు కదలనివ్వలేదు. మా ఆవిడ నా ముందు నుండే బయటకు దూసుకెళ్ళింది.

     "నాకొడుకో, నాకొడుకో. నిన్నేం జేసిండ్రో ఏందో" ఏడుపులు వినిపించాయి.

    "ఎటు తీస్కపోతరు. ఎటుపోడు. వాడేం చిన్నపిల్లగాడా"

    "ఎవలో కొత్తోల్లు వచ్చిండ్రు. ఆటోల కూసుండపెట్టుక పోయిండ్రు. నా కొడుకునేం చేత్తరో"

    "ముడ్డికింద ముప్పై ఏండ్లున్నాయి. అసలు సంగతి తెలుసుకోక ఈ లొల్లి ఏంది"

    ఇవన్నీ వింటూనే ఉదయం టిఫిన్ పూర్తిచేశాను. మా ఆవిడ వచ్చి విషయాన్నిలా వివరించింది. ఇంటిపక్క ముసలామె కొడుక్కు పెళ్ళయింది. కొన్నాళ్ళు కాపురం బాగానే సాగింది. తరువాత ముసలామె కొడుకు తన భార్యను పుట్టింట్లో దింపి వచ్చిండు. ఇదేం పని అడిగేవాళ్ళు కరువయ్యారు. ఇటీవలే ఆమె తండ్రి దుబాయి నుండి వచ్చిండు. విషయం తెలుసుకొని అల్లుణ్ణి బలవంతంగా ఆటో ఎక్కించుకొని వెళ్ళిపోయాడని ముగించింది. ఇదంతా విన్న నాకు సమాజంలో ఆటవిక న్యాయం ఎంత సహజాంగా అమలవుతుందో అర్థమైంది. ఎవరి కట్టడాల్ని వారే రక్షించుకున్నట్లు, తన కూతురు కాపురాన్ని తనే రక్షించుకున్నాడు. ఎవరూ లేని వాళ్ళను రక్షించేదెవరు? ప్రశ్నల దాడి ఎక్కువ కాకముందే డ్రెసప్ అయి ఆఫీస్‌కు బయల్దేరాను. 

    ఉదయం పదకొండయింది. సంతకం చేసి కుర్చీలో కూర్చున్నా కుర్చీలన్నీ నిండలేదు. రిలాక్స్‌గా కళ్ళుమూసుకున్నాను. 

    "సార్! మోహన్‌ను ఎ.సి.బి వాళ్ళు పట్టుకున్నరట" ఇంట్లోకి దూసుకొచ్చిన రైల్ ఇంజన్‌లా అరుస్తూ చెప్పాడు అటెండర్.

    "ఎలా జరిగింది?"

    "పంట లోన్ సాంక్షన్ కోసం రైతుల్ని తెగ సతాయించినట్లే క్వారీ కాంట్రాక్టర్‌ను సతాయించిండట. విసిగిన కాంట్రాక్టర్ వాళ్ళ ఇంటికే వెళ్ళి డబ్బులిచ్చిండట. అతని వెనకే వెళ్ళిన ఎ.సి.బి వాళ్ళు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నరట" అంటూ మరో కుర్చీ వద్దకు వెళ్ళాడు.

    రైతులు మోహన్ బారిన పడితే, మోహన్ కాంట్రాక్టర్ బారిన పడ్డడు. కంట్రాక్టర్ తనను తాను రక్షించుకోగలిగాడు. మనసున పట్టక కిందికి పోయి కాఫీ తాగి సిగరెట్ అంటించాను. సింగిల్ పఫ్ లాగానో లేదో దూరం నుండి అరుపులు వినిపించాయి. కాసేపటికే వేల మంది ప్రజలు అగుపించారు. మా ఆఫీసు ఆవరణలో చాలా మంది పోలీస్ ఫోర్స్ ఉండటానికి కారణం అర్థమైంది. ఎర్రటి ఎండలో చెమటలు కారుతుండగా ఆ సమూహం నినాదాలు ఇస్తుంది. కంఠనాళాలు ఉక్కుతీగలుగా సాగుచుండగా ఒక బక్కపలచని వ్యక్తి, సామూహిక శక్తిగా అరుస్తున్నాడు. వాళ్ళు అంతదూరంలో ఉండగానే ఆఫీసు దారులన్నీ మూసివేశారు. సమూహం గేటు ముందుకొచ్చింది. వాళ్ళంతా బీడీ కార్మికులని అర్థమయింది. గేటు ముందు వాళ్ళ నాయకుడు, ఎస్సైతో మాట్లాడుతున్నాడు. ఊరేగింపుగా వచ్చి కలెక్టర్‌కు మెమోరాండం ఇవ్వడం రివాజు. ఆ విషయమై మాటలు దాటి వాదన మొదలనట్లుంది. నినాదాలు బిగ్గరగా వినిపించాయి. ఆసక్తిగా ఆఫీసు మెట్లు దిగి గుంపును సమీపించాను.

    "విషయమేంటి" ఒకతన్ని కదిలించాను.

    "బీడి కట్టల మీద పుర్రె, డేంజర్, బొక్కల గుర్తు వేస్తరట. ఎయ్యద్దని జులూస్ తీసినం" 

    "ఏస్తే ఏమయితది"

    "మా నోట్లో మన్నుపడ్తది."

    "సిగరెట్ డబ్బాల మీద పొగత్రాగుట హానికరము అని ఉంది కదా. వాటి తయారీదార్లు మీ తీరుగ అల్లరి చేస్తున్నారా."

    "డబ్బ మీద చిన్నగ రాస్తే కనపడుతదా. సిగరెట్ కంపెనీలెన్ని, బీడీల కంపెనీలెన్ని. సిగరెట్లు, బీడీలు తాగెటోల్లు ఎంతమంది. లెక్కలు తీస్తే దీనెనుక రాజకీయం తెలుస్తది."

    "నీవేం చేస్తవు"

    "కమీషన్‌కు బీడీలేస్త"

       "బీడీలు చేసినా, తాగినా ఆరోగ్యం దెబ్బతింటది."

    "బీడీలు చేయకపోతే జీవితం దెబ్బతింటది"

    "తాగెటోడు చావనీయా"

    "సిగరెట్, గంజాయి, గుట్కా తిని తాగెటోళ్ళు చావరా?"

    "ప్రశ్నలు వేయకుండా జవాబులు చెప్పు. బీడీలు చేసి అనారోగ్యం బారిన పడకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా."

    "బోలెడంత మంది ఉన్నారు. తంబాకు పడనోల్లు అరటిపండు తింటారు. కొంగు మూతికి చుట్టుకొని బీడీలు చేత్తరు. కాని పని బంద్ వెట్టరు. ఒక్కొక్కల్ నెలకు పద్దెనిమిది వందలు సంపాయిత్తరు. దాంట్ల పి.ఎఫ్ కింద రెండు వందలు కట్ అయితే పదహారు వదలు చేతిల పడతయి. వట్టిగ కూసుంటే ఏం వత్తది."

    "బీడీ కార్మికులకు జీతాలు, పింఛన్ల విధానం ఉందా."

    "మెల్లగా అంటవేంది సారు. నెలకు పదహారు వందలు సంపాదించేవాల్లు యాభై ఐదు సంవత్సరాల తరువాత నెలకు ఎనిమిది వందలు పింఛన్ తీసుకుంటుండ్రు. తునికాకు పెట్టుబడి లేని పంట. బీడీల కంపెనీలు స్టేట్ గవర్నమెంటు నుండి ఆకును కొంటాయి. బీడీలు తయారైనాంక కంపెనీలు సెంట్రల్ గవర్నమెంటుకు ఎక్సైజ్ డ్యూటీ కింద టాక్సు కడతాయి. కార్మిక శాఖ చట్టం(కనీస వేతన చట్టం) అమలు వల్ల చాల ఇన్‌టెన్సివ్‌లు, బోనస్‌లు దొరుకుతాయి. పి.ఎఫ్ నెంబరు ఉన్న కార్మికుల కొడుకులు, బిడ్డలకు స్కాలర్‌షిప్‌లు వచ్చినయి. కాలేజీ పోరగాండ్లు రెండువేలు, బడి పోరగాండ్లు ఐదారువందలు ఎత్తుకున్నరు. బీడీలతోటి గవర్నమెంటు, జనం ఇద్దరు బతుకుతరు. లేబరోల్లు, కమీషనోల్లు, కంపెనీ స్టాఫ్ అందరు మంచిగుంటరు."

    "అంత మంచిగున్నంక ఇట్లెందుకు జరుగతది."

    "సిగరెట్ కంపెనీల ఉచ్చుల గవర్నమెంట్ పడ్డది. పుర్రెగుర్తు తోటి తాగెటోల్లు ఎంకముందు అయితరు. తాగుడు బంద్ చేయలేక సిగరెట్ ముట్టిత్తరు. అట్ల సిగరెట్ కంపెనీలకు లాభం. గవర్నమెంట్‌కు, లేబర్‌కు నష్టం."

    "మీరు ధర్నాలు చేస్తే గవర్నమెంటు వింటదా."

    "వినకపోతే వినిపిస్తం. ఎవల కడుపులు వాల్లు చూసుకోవాలె. అంజవ్వ పదిహేనేండ్ల పొల్లగ ఉన్నప్పుడే అయ్యవ్వసచ్చిండ్రు. బీడీలు చేసుకుంట తమ్మున్ని సదివిచ్చింది. ఇప్పుడు మంచిగున్నది. మన రక్షణ కోసం మనం కొట్లాడాలె" అంటూ వెళ్ళిపోయాడు.

    లంచ్ టైం అయింది. ఆఫీస్ మెట్లెక్కడం కన్నా ఇంటికెళ్ళడం బెటర్ అని బయల్దేరాను. భుకాయాసం వల్లనో, పగలంతా దుమ్మూ ధూళిలో నిలబడ్డ ఓపిక వల్లనో, వెన్నంటుకోగానే కన్నంటుకుంది.

    బాబూ, నాయనా అంటూ అమ్మ లేపింది. చూసేసరికి నాలుగైంది.

    "ఆఫీసుకు పోవా"

    "ఇంతసేపు ఏం జేసినవు. అప్పుడే లేపొద్దా"

    "గురకలు, కలవరింతలు, మూలుగులతో పడకంతా బొర్లినవు. లేపాలనిపించలేదు."

    "నిజంగానా."

    "అలసినట్లున్నవు. నిద్ర పట్టింది."
  
    లేచి కూర్చోబోయాను. ఒళ్ళంతా సూదులతో గుచ్చిన భావన. శరీరం కాలుతుంది. మా ఆవిడకోసం ఎదురుచూడసాగాను. మడిమలు, మోకాళ్ళు కరెంట్ షాక్‌కు గురైన ఫీలింగ్. కళ్ళు మూసుకుని పడుకున్నాను. మా ఆవిడ కుదుపులతో కళ్ళు తెరిచాను. ఒళ్ళంటా తడిమి చూసింది.

    "జ్వరం వచ్చినట్లుంది. డాక్టర్ దగ్గరికి పోకపోయినవు."

    "చేతనైత లేదు."

    "నేను వచ్చేదాక అట్లనే ఉంటవా. రోజు డెబ్బయి కిలోమీటర్లు ప్రయాణం చేసివస్త్. వచ్చినాంక నా కెట్ల ఉంటదో ఆలోచించినవా. కనీసం ఇంట్లో ఉన్న పారాసెట్‌నక్ టాబ్కెట్ వేసుకుంటే అయిపోవు."

    "టాబ్లెట్స్ ఉన్న విషయం యాది లేదు."

    "ఎందుకు యాదికుంటది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుడాయె. ఆలోచిస్తే ఏమస్తది. బుర్ర ఖరాబు అవుడు తప్ప" అంటు టాబ్లెట్ వేసింది.

    కళ్ళు మూయగానే నిద్ర పట్టింది. లేచి చూసే సరికి రాత్రి పదయింది. ఒళ్ళు చెమట పట్టి తేలికగా ఉంది. తలమీద నుండి హిమాల్యాన్ని దించుకున్న హాయి కలిగింది. జరిగిందంతా ఒక్కసారి బుర్రలో తిరిగింది. జీవితాల్ని, ఆస్తుల్ని రక్షించుకోవడానికి వ్యక్తులెంత ఘర్షణకు గురవుతున్నారో తెలిసింది. ఇంతలో -

    "డాడీ ఈ పద్యం అర్థమేందో చెప్పరా" అంటూ వచ్చాడు అబ్బాయి.

    "నాకు ఒంట్లో బాగాలేదు. తాతయ్యనడుగు."

    "తాతయ్యా! ఈ పద్యం అర్థమేందో చెప్పరా."

    "సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్..." పద్యం పూర్తి చేశాడు.

    "ఇది పోతన పద్యం. మొసలిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయుధాలను మరచి తన వారికి తెలుపకుండా పరుగు తీస్తూ సరస్సు వద్దకు విష్ణువు వచ్చాడు అని అర్థము."

    "ఆయుధాలు లేకుండా మొసలిని ఎలా రక్షిస్తాడు" మనుమడి ప్రశ్న.

    "బడికి టైం అయిందనే తొందరలో నీవెన్నిసార్లు నోట్స్, కంపాక్స్ మరిచి వెళ్ళావో ఆలోచించు" తాతయ్య ప్రశ్న.

    తాతా మనుమల సంభాషణ వింటున్న నాకు ఆసక్తి కలిగింది. నా ఆలోచన ఉడతపైకి మళ్ళింది. ఉడుత పరుగుతీస్తూ వచ్చి నీళ్ళలో ఎందుకు దూకింది? కల అంతా జ్ఞాపకం చేసుకున్నాను. టీ.వీ.లో చూపిన రామసేతువు దృశ్యం కనిపించింది. ఆ పరిసరాలలోనే ఉడత దూకినట్లనిపించింది. వెంటనే వార్తా కథనం గుర్తొచ్చింది. ఉడత, వార్తాకథనం, సముద్రం ఇవన్నిటి మధ్య ఉన్న లంకె అర్థమయ్యింది. కంట్రాక్టర్ తనకోసం తాను, కూతురు కోసం తండ్రి, జీవితాల కోసం బీడీ కార్మికులు ఏవిధంగా పోరాడుతున్నారో అవగతమైంది. అదే విధంగా తన సేతువు రక్షణకోసం ఉడత దూకిందా?అని ఒక్క క్షణం అనిపించింది. హేతువు, నమ్మకం మధ్య నేను ఊగిసలాడుతుండగానే కేరింతలు వినిపించాయి. తొంగి చూశాను.

    "థాంక్యూ, తాతయ్యా" అంటూ మనుమడు తాతయ్యను ముద్దాడే దృశ్యం కనిపించింది.

(నేటినిజం దినపత్రిక స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక అనుబంధం - 2008 లో ప్రచురితం)    
Comments