పల్లవి-అనుపల్లవి - ఆకెళ్ల శివప్రసాద్

    జీవితమంటే ఆయనకి సదభిప్రాయం లేదు. ఎప్పుడూ చిరాగ్గా, విసుగ్గా కనిపిస్తాడు. ప్రేమగా పలకరించిన వాళ్ళతో సైతం ముభావంగా ప్రవర్తిస్తాడు. అనవసరంగా, అసందర్భంగా నిట్టూర్పులు విడుస్తుంటాడు. ఎవరో, ఏదో కుట్రచేస్తున్నట్లు మాట్లాడుతుంటాడు. ఆరోపిస్తుంటాడు.క్షణక్షణం భయపడుతున్నట్లుగా ఉంటాడు. నిరాశ తప్ప మరొకటి ఆయనకు తెలీదు.

    ఆనందంగా ఉండేవాళ్ళు అవివేకులని, జీవితం పట్ల సరైన అవగాహన లేనివారని ఆయన గాఢ అభిప్రాయం. పెదాల మీద చిరునవ్వు నిషిద్ధం.
    ఆఫీసులోనూ అంతే.     ఇంట్లోనూ అంతే.
    ఆఫీసు ఫైళ్ళ గొడవలనీ, కొలీగ్‌స్ పని ఎగ్గొట్టడాన్నీ, ఆఫీసర్ నిరంకుశత్వాన్నీ ఇంటివరకు మోసుకు వస్తాడు. అలాగే ఆఫీసులో కొడుకుకి మంత్లీ టెస్టులో తగ్గిన మార్కుల గురించి విరుచుకు పడ్తాడు. 

    మాటల్లోనూ, చేతల్లోనూ కఠినశిక్ష అనుభవిస్తున్న వాడిలా ఉంటాడే తప్ప, జీవితమంటే పిసరంత గౌరవభావం లేదు. జీవితమెంటే 'కనిపించని వాడు' వేసిన కఠిన కారాగారశిక్ష అంటుంటాడు. ఆనందం ఏమాత్రం ధ్వనించని ఆయన ఎల్లవేళలా ఆందోళనగా ఉంటాడు.
    అయితే చిత్రం ఏమిటంటే, బారసాలనాడు ఎలా కనిపించాడో తెలీదుకానీ 'ఆనందరావు' అని అతనికి నామధేయం ఖరారు చేశారు. ఆనందానికి ఆనందరావు ఆమడ దూరమంటే మరీ తక్కువ. యోజనాల దూరం అంటే నాకు తెలీదు కనుక బహుదూరం అంటున్నాను.     అదిగో ప్రతిరోజూ లాంటి ఆ రోజుకూడా ఆనందరావు తనదైన 'జెస్చర్స్' ఇస్తూ బస్టాండ్‌లోకి వస్తున్నాడు.
    "హల్లో...గుడ్‌మార్నింగ్" పలకరింపుగా అన్నాను. వినిపించుకోనట్లు ఓ చూపు విసిరి, తల అటు ఇటు ఆడించాడు కొంగలా.

    ఈమధ్య ఆనందరావు కంపించడం లేదు. ఒకే కాలనీలో ఉంటున్నా దర్శనభాగ్యానికి నోచుకోలేదు.
    "ఏమిటండీ బొత్తిగా కనిపించడం లేదు. ఏమిటి విసేషం?" రెండో ప్రశ్న యథాలాపంగా నోరు జారింది.     "వెధవ బతుక్కి విశేషం ఒకటి. దరిదపుగొట్టు ఇన్‌స్పెక్షన్ పేరుతో పరగడుపునే ఆఫీసుకి పోవడం, అర్థరాత్రి కొంపకి తగలడ్డం". నామీద విసుక్కున్నాడో, ఆఫీసుమీద విసుక్కున్నాడో అర్థం కాలేదు. నేనేం మాట్లాడలేదు.
    "దిక్కుమాలిన ఆఫీసులో ఒక్కడికీ పని చేతకాదు. ప్రతిఫైలూ నా మొహాన్నే కొడతారు. ముడిగుబ్బలా ముడుచుకుపోతారు ఏమైనా అంటే. పనికిమాలిన కామెంట్రీ మీద ఉన్న ఆసక్తి ఆఫీసు పనిమీద ఉండదు. మూగపీనుగులు ఇలా ఏడిస్తే ఆడాళ్ళు లంగాలు లగాయతు ఆఫీసులోనే బేరాలడుకుని కొనుక్కోవడం..." పూర్తిగా దండకం అందుకున్నాడు.

    భాషాభేదం లేకుండా నాలుగైదు భాషల్ని మిళితం చేసి మరీ తిట్టాడు. పూర్తి స్థాయిలో ఆనందరావు రెచ్చిపోతున్న తరుణంలో ఆపద్బాంధవుడిలా ఆర్టీసీ బస్సు వచ్చింది. అప్పటివర్కు ఉన్న 'క్యూ' తేనె తుట్టెలా చెదరిపోయింది.
    గుంపులో ఉన్న నేను, నా ప్రమేయం లేకుండా బస్సులో చేర్చబడ్డాను. ఆనందరావు కంఠం ఇంకా'ఖంగు'మంటూనే ఉంది.     బస్సుని, జనానికి కరువైపోయిన సివిక్ సెన్స్‌ని దారిపొడుగునా తిడ్తూనే ఉన్నాడు. దిగవలసిన స్టేజ్ వచ్చింది. మళ్ళీ మా ప్రమేయం ఏమాత్రం లేకుండా రోడ్డుమీదకి విసిరివేయబడ్డాం.     బస్టాండ్ నుంచి పది నిమిషాలు నడవాలి ఆఫీసుకి చేరుకోవాలంటే. ఆనందరావు ఆఫీసు మా ఆఫీసు దగ్గరే. ఇద్దరం నడవడం ప్రారంభించాం.     ఆఫీసుకి వెళ్ళే దారిలో ఇంటివాడు పెంచిన అద్దె గురించి, పక్కవాడు ఎక్కువగా తీసుకున్న రెండు బిందెల నీళ్ళ గురించి, ఆగిపోయిన డ్రైనేజీ గురించి, దాని కంపు గురించి ఎవరూ పట్టించుకోక పోవడం గురించి, వేళాపాళా లేకుండా పోతున్న కరెంటు గురించి, వాళ్ళింట్లో పడిన చిరిగిపోయిన గాలిపటం గురించి, ఎదురింటి వాళ్ళబ్బాయి ఇంట్లోకి 'కావాలని' కొట్టిన బంతి గురించి, బంతి కోసం జరిగిన దెబ్బలాట గురించి గడగడా చెప్పి,"ఆఖరికి ఈ వాచీ కూడా 'పగ' బట్టింది. ఆగి చచ్చింది..."అంటూ చేతినెత్తి చూపెట్టాడు. నల్లటి స్ట్రాప్ ఉన్న గుండ్రటి ఎకో వాచీ.

    "టైమాగిపోయి శవంలా వేలాడుతోంది" అన్నాడు ఆయనే. కాలం కాళ్ళు చేతులు విరిగిపోవాలన్నాడు. ఇంకా చాలా అంటుండగా మా ఆఫీసు సమీపించింది.     "వస్తానండి" అరగంట తరువాత ఓ మాట అని మా ఆఫీసులోకి కదిలాను. ఆనందరావు ఏదో గొణుక్కుంటూ ఆయన ఆఫీసులోకి వెళ్ళిపోయాడు.     బుర్ర వాచిపోయింది. నిజానికి ఆనందరావు అశాంతిని ప్రకటించిన సమస్యలు ఏమీ నాకు పెద్ద సమస్యలు అనిపించలేదు. రోజువారీ సమస్యలు. అందరి జీవితాల్లో సర్వసాధారణం. ఇంటి అద్దె పెంచడాన్నీ, మంచి నీళ్ళ వివాదం, డ్రైనేజీ లీక్, కరెంట్ పోవడం వగైరాలు మామూలు విషయాలు. వాటిని జీవితానికి జత చేసి అన్యాయం అని గోలపెట్టడం దారుణం.

    అసలు నన్నడిగితే ఆకాశంలో అపురూపమైన ఆశకి ప్రతీకగా ఎగురుతున్న గాలిపటాన్ని చూడాలి కానీ, చిరిగిన గాలిపటం గురించి పట్టించుకోకూడదు. ఇంట్లోకి ఎగిరిపడ్డ బంతి అరమరికలు లేని బాల్యానికి ప్రతిబింబం. ఆగిపోయిన వాచీని శవంతో పోల్చడం అసమంజసం. ప్రతి క్షణం చీకాట్ల దొంతరలను పోగు చేసుకున్న ఆనందరావు జీవితం ఆయనకే పరిమళం అందివ్వలేదా?     చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుదామనుకుంటూనే అడగలేకపోయాను.

* * * * * * *

    ఐ.ఐ.టీలో సీటు రావడమంటే మాటలా?
    మా కాలనీలో చాలామంది విధ్యార్థులు పరీక్ష రాశారు. ఆనందరావు కొడుకు సంతోష్ ఒక్కడికే సీటు వచ్చింది. సంతోష్‌కి సీటు వచ్చిందన్న వార్త చాలా అషజంగానూ, నమ్మలేనట్లుగానూ అనిపించింది. చీకట్లనే ఆప్త మిత్రులుగా అక్కున చేర్చుకునే ఆనందరావు కొడుకైన సంతోష్‌కి చాలామందికి అసాధ్యమనిపించే కోర్సులో సీటు రావడం ఆశ్చర్యం కలిగించింది.     సంతోష్ కూడా యాక్టివ్‌గా ఎప్పుడు కనబడలేదు. మాసిన పిల్లిగడ్డంతో, దువ్వుకోని జుట్టుతో మందకొడిగా కనిపిస్తాడు. ఛురుకుపాలు వెతికినా కనిపించదు.     అలాంటివాడికి సీటు రావడమంటే –     ‘సైలెన్స్ ఇంటెలిజెంట్’ అని ఓ పదం కాయిన్ చేశాడు మావాడు.     పైకి ఎలా ఉన్నా, సరుకున్న మనిషి అనుకుని అభినందించడానికి వాళ్ళింటికి బయలుదేరాను.     దారిలోనే సంతోష్ ఎదురయ్యాడు – ఎప్పటిలాగే నిరాసక్తంగా, విచ్చరంగా. ఏదో ధోరణిలో నన్ను చూడకుండా వెళ్ళిపోతున్న అతన్ని ఆపి     "హార్టీ కంగ్రాట్యులేషన్స్ మైబాయ్" అన్నాను. సంతోష్‌లో ఏ రకమైన భావనా లేదు. కర్టసీకి ‘థ్యాంక్స్’ అని కూడా అనలేదు. ఆనందరావులా అపరాధం జరిగి పోయినట్లు నిట్టూర్పు విడిచాడు.     "వెల్‌డన్… మైబాయ్…" భుజం తడుతూ అన్నాను. ఈ సారీ ఏ రకమైన స్పందనా లేదు. మరో మాట ఏం మాట్లాడాలో తెలీక ఇబ్బంది పడ్డాను. రెండు నిమిషాలు గడిచాయి. వంచిన తల ఎత్తకుండా –     "నేను బి.కాంలో జాయిన్ అవుతాను…" రోడ్డుకి అటువైపు తల తిప్పి అన్నాడు.     క్షణం ఏం మాట్లాడాలో తెలీని స్థితి. ఒళ్ళు జలదరించింది. లక్షణంగా ఇంజనీరింగ్ సీటు వాకిలి తడితే, బి.కాం అంటున్నాడేమిటి ఈ మనిషి? పిచ్చికానీ పట్టలేదు కదా. అయోమయంగా అతనివైపు చూశాను.     "పెద్ద చదువులు మా ఇంట్లో అచ్చిరావుట…" పొడిగా అన్నాడు. నైరాశ్యం బాగా చుట్టుకుంది.     "ఎవరన్నారు?"     "మా నాన్న"     "చదువులు అచ్చిరాక పోవడమేమిటి?" విస్మయంగా చూశాను.          "ఏమో… మా నాన్నగారు ప్లీడర్ అవుదామనుకున్నారుట… కాలేజీలో చేరిన రెండో రోజే మా తాతగారు పోయారుట…"     అర్థం లేని మాటలా అనిపించింది. కాలధర్మం ప్రకారం ప్రతి మనిషి ఏదో ఒక రోజు కాలధర్మం చెందడం రివాజు. దానికీ, చదువుకీ జోడీ కుదిర్చి చదువుని ‘వెలి’ వేయడమా?     "ఏది అచ్చివస్తుందయ్యా మీకు? చదువులు అచ్చిరావు… నవ్వుకోవడం అచ్చిరాదు… పలకరింపులు అచ్చిరావు… అసలు జీవితమే అచ్చిరాదు…" కోపాన్ని అణచుకోలేనట్లు అరిచాను.     మరు క్షణమే అనవసరంగా సంతోష్ మీద అరిచాననిపించింది. అసలు దోషి ఆనందరావు. అతన్ని నిలదీయాలి.     "పద. మీ నాన్న సంగతి తేలుస్తా…" అన్నాను చేయి పట్టుకుంటూ. చేయి విడిపించుకుని –     "నేను రానండి"     "ఏం?"     "బాధని మర్చిపోడానికి వెళ్తున్నాను"
         "ఎక్కడికి?"
    "శ్మశానం దగ్గరికి…"
    లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టయింది.     "శ్మశానమా?"
    "అవునండి. బాధలకి పరాకాష్ట అదేటగా… అక్కడికి వెళ్తే జీవితం అర్థం తెలిసి, బాధ పోతుందిట…" అమాయకంగా అన్నాడు.
    "మీ నాన్న చెప్పాడా?" తీవ్రంగా అడగడంతో ఏకవచన ప్రయోగం వచ్చింది.
    అవునన్నట్లు తలూపాడు.     "చాలా బాగుంది… ఆయన చెప్పడం, నువ్వు చేయడం…"
    ఈసారి అణచుకోవాలనుకున్నా కోపం కట్టలు తెగింది. అహర్నిశలు కష్టపడి చదివి ఇంజనీరింగ్ సీటు సంపాదిస్తే, శ్మశానానికి వెళ్ళు బాధ పోతుంది అంతాడా? అసలిలాంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా?     "బాధే మర్చిపోవాలనుకుంటే ప్రత్యేకంగా శ్మశానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోనక్కర్లేదు. ఇంట్లో కూర్చుని, గది తలుపులు బిగించి గుండెలు అవిసిపోయేలా ఏడిస్తే చాలు. పద పద ఇంటికి" గట్టిగా చేయి పుచ్చుకుని లాగాను. కదల్లేదు. అతికష్టం మీద లాక్కెళ్ళినట్లు అతన్ని ఇంటివైపు తీసుకుపోయాను.
    ఇంటికి చేరెసరికి శ్మశాన నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. ఆనందరావు ముందు వరండాలో నేలకి తాకుతున్న పాత మడత కుర్చీలో కూర్చుని, ఏవో ఫైల్లు పరచుకుని, విరిగి పోయిన కళ్ళజోడుని ఓ చేత్తో పట్టుకుని ఏదో చదువుతున్నాడు.     నేనంతకు ముందు చూడని ఓ అపరిచితుడు కూడా అక్కడ ఉన్నాడు.    "ఏమండీ ఆనందరావు గారూ…" గుమ్మంలోకి అడుగుపెడుతూ పిలిచిన నావైపు, సంతోష్ వైపు చూసి –
    "ఏమిటి ఇలా వచ్చారు?" సూటిగా విషయంలోకి వచ్చినట్టు అడీగాడు.
    "లక్షణంగా ఇంజనీరింగ్ సీటు వస్తే జాయినవ్వమనకుండా శ్మశానానికి వెళ్ళమంటారా?"
    "ఏమిటి శ్మశానానికి వెళ్ళమన్నారా?" అపరిచితుడి ప్రశ్న.
    "అవునండి… సంతోష్ అదే చెప్పాడు."
    "ఇది దారుణం బావగారూ" భయంగా ఆనందరావు వైపు చూశాడు. ‘బావగారు’ అనడంలో బంధుత్వం అర్థమైంది. నేను మరో మాట అనేలోపు –
    "మాకు పెద్ద చదువులు అచ్చిరావు" మొండిగా అన్నాడు ఆనందరావు.
    "పెద్ద చదువులు చదివే అవకాశం రాక ఎంతో మంది బాధపడ్తుంటే, పెద్ద చదువులు అచ్చిరావంటారేమిటండి?"     "కనుబొమల మీది వెంట్రుకల లాంటి బ్రతుకులండి… ఎదగవు, అచ్చిరావు"     "మళ్ళీ…"     "వీడు కాలేజీలో అడుగు పెట్టిన మరుక్షణం పిండం పెట్టడానికి కూడా సిద్ధమవ్వాలి…" మూర్ఖంగా అన్నాడు.
    "కాలం ఎప్పుడూ…" సముదాయించబోతున్న నా మాటల్ని అడ్డుకుంటూ-
    "కాలం విషనాగు. ఎప్పుడూ బుసలు కొడ్తుంటుంది… అదను చూసి కాటు వేస్తుంది" అని తీవ్ర స్వరంతో అని, మరో మాట మాట్లాడకుండా ఫైల్లోకి తలదూర్చాడు.
    సంతోష్ అప్పటికే లోపలికి వెళ్ళిపోయాడు.     చేసేదేమీ లేక నేనూ బయటకు అడుగు వేశాను.     ఎంత ఆలోచించినా ఆ ఆనందరావు మనస్తత్వం అర్థం చేసుకోలేకపోతున్నాను. నిజానికి సంతోష్ మీద కలిగిన సానుభూతి, జాలీ ఆనందరావుని ప్రశ్నించడానికి కదిలించింది. మనిషికి మనిషి సహాయ పడదామనుకోవడానికి బంధుత్వాలే అక్కర్లేదు కదా. ప్రయత్నం ఫలిస్తే ఆనందంగా ఉండేది. ‘ప్చ్’ గాడంగా నిట్టూర్చాను.     "ఏమండీ!" అన్నపిలుపు వినిపించి అటువైపు చూశాను. ‘అపరిచితుడు’ వేగంగా, నా వెనకే నా దగ్గరకు వచ్చారు. తనని అన్నోజిరావుగా పరిచయం చేసుకున్నారు. మద్రాసులో ఏదో కంపెనీలో పని చేస్తున్నారుట. ఆనందరావు బావమరిది. సంతోష్‌ని ఎలాగైనా చదివించమని ఆనందరావు భార్య మరీమరీ అన్నాజీరావుని అర్థించిందిట.

    "ఆనందరావు వల్లో ఏమిటో, వాళ్ళింట్లో ఓ రకమైన నిరాశ పేరుకుపోయి ఉందండి... మా బావగారి మనస్తత్వం ఏమిటో ఇప్పటికీ...ఇప్పటి కనేముందిలెండి ఎప్పటికీ అర్థం కాదేమో! ఎప్పుడూ రుసరుసలాడుతుంటారు. మా చెల్లెలు ఆడది. ఏం చేస్తుంది చెప్పండి. పిల్లల్ని ఎప్పుడూ మమకారంగా చూడడు. అదృష్టవశాత్తూ వీడికి సీటు వచ్చింది. ఇప్పట్నుంచే వైరాగ్యం, వేదాంతం పట్టిస్తే భవిష్యత్తు ఏమౌతుంది చెప్పండి?" బాధ పడుతున్నా అసందర్భపు నవ్వు నవ్వే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు.

    అయిదు నిమిషాలు ఏం మాట్లాడలేదు. చప్పున ఓ ఊహ కలిగింది.

    "మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. నా ప్రయత్నం నేను చేస్తాను" అన్నాను.
    ఆ సాయంత్రం రైలుకి వెళ్ళేటప్పుడు మరోసారి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్పి వెళ్ళాడు.

* * * * * * *

    ఆనందరావుని మోసం చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. మా అబ్బాయిని పావుగా వాడాను.

    ఏదో పని మీద మా అబ్బాయిని అర్జెంట్‌గా బొంబాయి పంపవలసి వస్తోందని చెప్పి, సంతోష్‌ని తోడుగా పంపమన్నాను. ఆనందరావు ఏధోరణిలో ఉన్నాడో ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా నా మాటకి ఒప్పుకున్నాడు.

    ఆ రోజు సాయంత్రమే ప్రైవేట్ బస్సులో మా అబ్బాయిని, సంతోష్‌ని మద్రాస్ పంపాను.     నాలుగు రోజుల తర్వాత అన్నాజీరావు దగ్గర నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం వచ్చింది. పది రోజులు గడిచాయి. ఆనందరావు నాకు బస్టాండులో కనిపించలేదు. ఆ తర్వాత మా యింటివైపు వచ్చినా కొడుకు గురించి అడగలేదు. క్లాసులు ప్రారంభమయినాక ఇంకో ఉత్తరం వచ్చింది. ఆనందరావు ఆయుష్షులో ఏమాత్రం మార్పు లేదు. కనీసం తుమ్ము కూడా లేదు. దుక్కలా ఉన్నాడు!

* * * * * * *

    "హల్లో ..." పరిచయమైన కంఠం వినిపించేసరికి అటువైపు చూశాను. అన్నోజీరావు. ఆఫీసు పని మీద ఈ ఊరు వచ్చాట్ట. ఆనందరావుకి తనని క్షమించమని సంతోష్‌ని కాలేజీలో జాయిన్ చేసిన వెంటనే ఉత్తరం రాశాట్ట. జవాబు రాలేదుట. ఏమైందో అని కంగారు పడి ఈ ఊరూ వచ్చాట్ట. అసలు అన్నోజీరావు వచ్చినట్టే పట్టించుకోలేదుట.

    "మీ పరిస్థితి ..." అర్థోక్తిలో ఆగిపోయాడు.
    "ఆనందరావు కనిపించినా పలకరించడం లేదు. కానీ, పెద్ద తేడా అనిపించడం లేదు" అన్నాను.     అన్నాజీరావు మరోసారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు, ఆనందరావు మినహా అంతా ఆనందంగా కనిపిస్తున్నారని చెప్పి.

    ఆ సంఘటన తర్వాత ఆనందరావు భార్య ఏ కూరల కొట్టు దగ్గర కనిపించినా పలకరించేది. ఆనందరావు కూతురు స్వప్న పూవం కాలనీలో ఎవరితోనూ 'కలవని' అమ్మాయి, తరచూ మా అమ్మాయి దగ్గరికి వస్తోంది.     మా అమ్మాయి నేర్చుకుంటున్న వీణ పాటల్ని శ్రద్ధగా వింటోంది. అప్పుడప్పుడు గొంతు విప్పి ఆలపించే ప్రయత్నం చేస్తోంది. ఆ స్వరంలో తడబాటు ఉన్నా స్పష్టత కోసం ప్రయత్నిస్తున్న తపన కనిపిస్తోంది. చిన్న తపన చాలేమో జీవన ముఖచిత్రాన్నే మార్చడానికి!!

* * * * * * *

    "బేసిక్ ఇన్‌స్టింక్ట్ చూశావా?" ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు లక్ష్మణరావు.
    "లేదు" ఫైళ్ళని సర్దుతూ అన్నాను.     "వెళ్దామా?" అడిగాడు. శనివారం సగం రోజే ఆఫీసు. ఇంకా ఒంటిగంట అవుతోంది. రెండింటికి కానీ సినిమా మొదలవదు. ఇంటికి వెళ్ళి చేసే పనీలేదు.     "బాగుందా?" క్యాజువల్‌గా అడిగాను.     "బాగుందా అనే ప్రశ్న సబ్జెక్టివ్. చూసేవాళ్ళని బట్టి ఉంటుంది. నిజాయితీగా చెప్తున్నా. నాకు కథతో, కథనంతో, కెమెరాలతో ఏమాత్రం సంబంధం లేదు నీకు తెలుసుగా. బూతు సీన్లు ఉంటే చాలు డబ్బులు గిట్టుబాటు అవితాయి. అవి పుష్కలంగా ఉనాయిట చాలు" అన్నాడు. ఎప్పటిలాగే ఫ్రాంక్‌గా మాట్లాడాడు. ఆడిట్ ఆఫీసు నుంచి తరచూ మా ఆఫీసుకి వస్తుంటాడు. మా సెక్షన్‌తో ఎక్కువగా పని ఉండడం వల్ల బాగా పరిచయం. ఇద్దరం ఇంగ్లీషు సినిమాలకు వెళ్తుంటాం.

    "చాలా రోజులుగా ఆడుతున్నట్టుంది" డ్రాయర్‌కి కీ వేస్తూ అన్నాను.
    "ఆ... షరాన్ స్టోనో ఏదో ఉంది హీరోయిన్ పేరు. పూర్తిగా విప్పుకుని దర్శనం ఇస్తుందిట." మామూలుగా అన్నాడు.

    "అడల్ట్స్ మూవీయా?" అనవసరమైన ప్రశ్న అనిపించినా అడీగాను.     "ఆ... నిక్కర్లు వేసుకునేవాళ్ళే ఎక్కువ ఉంటారు" అని నవ్వాడు. నా హాబీల్లో ఒకటి ఇంగ్లీషు సినిమాలు చూడటం. 'అకిర కురసోవ' సినిమా ఎంతగా ఎంజాయ్ చేస్తానో 'రాంబో' చిత్రాన్ని అలా చూడగలను.     ఇద్దరం క్యాంటీన్‌లో టిఫిన్ చేసి, మెల్లగా హాలు వైపు కదిలాం. పావు తక్కువ రెండయింది. టికెట్లు తీసుకున్నాం. లక్ష్మణరావు హాలు వరండాలో ఉన్న షెల్ఫుల్లో రాబోయే సినిమాల పోస్టర్లు చూస్తున్నాడు. నేను టాయ్‌లెట్‌లోకి వెళ్ళి భారం తీర్చుకుని, కళ్ళజోడు తీసి వాష్‌బేసిన్ మీద పెట్టి, మొహమ్మీద నీళ్ళు కొట్టుకునేసరికి 'బెల్' వినిపించింది. లక్ష్మణరావు హడావిడిగా నా దగ్గరికి వచ్చేసరికి వేగంగా అతనితో కదిలాను. సీటు దగ్గరికి వచ్చాక ఠక్కున ఏదో గుర్తు వచ్చినట్టు...     "అరె కళ్ళజోడు మరిచిపోయాను" అంటూ వేగంగా బైటికి కదిలాను.

    వాష్‌బేసిన్ మీదే సురక్షితంగా ఉన్న కళ్ళజోడు తీసుకుని వేగంగా డోర్ దగ్గరగా వచ్చాను. క్షణం కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. అక్కడే నిలబడ్డాను. సరిగ్గా అప్పుడే నన్ను తోసుకుంటూ ఓ జీన్స్ కుర్రాడు, అతని చేయి పట్టుకుని ఓ అమ్మాయి లోపలికి కదిలారు. వాళ్ళిద్దరి వైపు చూశాను. ఎంత చీకటిగా ఉన్నా స్పష్టంగా గుర్తుపట్టగలను... ఆమె...స్వప్న!     ఇద్దరూ వెళ్ళిన వైపే చూశాను. ఓ మూలగా ఉన్న సీట్లోకి వెళ్ళి కూర్చున్నారు. నాలో ఏదో అశాంతి, అనిశ్చింత. సీటు బాగాలేదన్న వంకతో లక్ష్మణరావు విసుక్కుంటున్నా మరో సీట్లోకి మారాం. ఇప్పుడు దగ్గరగా ఆనుకుని వాళ్ళిద్దరి తలలు కనిపిస్తున్నాయి. మిగిలినదీ, అక్కడ జరుగుతున్నది ఊహించడం పెద్ద గొప్ప విషయం కాదు.     ఇంటర్‌వెల్‌లో నేను కదల్లేదు. లక్ష్మణరావు దమ్ము కొట్టడానికి బైటికి వెళ్ళాడు. నేను అటువైపే చూస్తున్నాను. తలలు మరీ దగ్గరగా ఉన్నాయి.     సినిమా మీద దృష్టికన్నా వాళ్ళిద్దరి మీద దృష్టి ఎక్కువగా ఉంది. అటే చూస్తున్న నన్ను లక్ష్మణరావు ఏమాత్రం గమనించడం లేదు. సరస శృంగారాల సన్నివేశాల్లో మునిగి పోయాడతను.     చివరి దృశ్యం రసవత్తరంగా సాగుతోంది.     షరాన్ స్టోన్, మైకేల్ డగ్లస్ మైథున క్రీడలో తేలుతున్నారు. హాలంతా వేడి శ్వాసలతో టెన్షన్‌గా ఉంది. హఠాత్తుగా ఏదో శబ్దం అయి నాయికా నాయకులు దగ్గరయ్యారు. నేను అటువైపు చూశాను. ఇద్దరూ బైటికి కదులుతూ కనిపించారు.     సినిమా పూర్తయిన సూచనగా బెల్ మోగింది. పేర్లు థియేటర్ వాడి సాంప్రదాయం ప్రకారం 'కట్' చేశాడు. ఇద్దరం హాలు బైటకి వచ్చేసరికి జనం మధ్యలో వాళ్ళు దూరంగా కనిపించారు!!

* * * * * * *

    కేవలం ఓ సంఘటన ఆధారంగా ఓ కంక్లూషన్‌కి రావడం నాకిష్టం లేదు. అంచేత స్వప్న కనిపించిన సంఘటన మరిచిపోయే ప్రయత్నంలో పడ్డాను.

* * * * * * *

    "పల్లవిని అనుసరించే అనుపల్లివి ఉండాలా?" అటు వైపు చూశాను. స్వప్న వీణ తీగలమీద వేళ్ళు ఆడిస్తూ అడిగింది. ఆమే ఈమధ్య చాలా మార్పు వచ్చింది. ఊహించని చలాకీతనం కనిపిస్తోంది. "ఆ..." అంది మా అమ్మాయి జవాబుగా. త్యాగరాజకీర్తనలు ఫెయి చేసుకుంటానంది. అదే చేస్తున్నట్టుంది.
"అంటే మా నాన్న ఉన్నట్లే మేమూ ఉండాళన్న మాట" గలగల నవ్వేతూ అంది స్వప్న. అర్థం కానట్టు చూసింది మా అమ్మాయి. ఏదో అస్పష్టంగా అర్థమయినట్టు అనిపించినా ఏమీ మాట్లాడలేదు నేను!!
* * * * * * *

    క్షణాల మీద కాలనీ అంతా ఆ వార్త పాకి పోయింది, పుట్టని వదిలిన పాములా.     ఇంటికి వస్తూనే మా ఆవిడ, మా అమ్మాయి వినకూడని విషయమన్నట్టు, అనవసరంగా దాన్ని చీవాట్లు పెట్టి లోపల గదిలోకి పంపించింది.     "విన్నారా?" ప్రశ్నించింది.     ఏమిటన్నట్టు చూశాను.     "ఆనందరావుగారి అమ్మాయి అదే... స్వప్నండి...ఎవడితోనో లేచిపోయిందట..." రహస్యం చెప్తున్నట్టు అంది.     వెంటనే నేను ఏమాటా అనలేదు. మా ఆవిడ చాలా మంది ఆడవాళ్ళలాగే, ఆరోజూ, ఆమర్నాడూ ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు గుర్తుకుతెచ్చుకుని మరీ బాధ పడింది. ఎవరితో వెళ్ళిపోయిందో ఎవరికీ తెలీదుట.
* * * * * * *

    "ఏదో ఉత్తరం వచ్చిందడి మీకు..." అంటూ డిస్పాచ్ క్లర్క్ నాకో కవర్ అందించాడు. సాధారణంగా ఇంటికి ఉత్తరాలు వస్తాయి. ఆఫీసుకి అరుదే. ఆశ్చర్యపోతూనే కవర్ చింపాను.
    "...గారికి,         నమస్కారాలు. నేను చేసింది తప్పో ఒప్పో బేరీజు వేసుకునే శక్తి లేదు. కానీ - ఒకటి -         నైరాశ్యం, విషాదం, నిస్పృహ, కుట్ర ఇవే జీవితమన్న మా నాన్నగారి నమ్మకంలో నాకు ఏమాత్రం విశ్వాసం లేదు.         నాణానికి రెండో వైపు కనిపించిన ఆనందాన్ని అందుకునే పరుగులో ఉన్నాను.                     నా జీవితం నాదేగా.
                                                                    - స్వప్న     పెద్ద కాగితంలో నలభై కొట్టివేతల మధ్య నాలు వాక్యాలు ఒదిగాయి. ఆ నాలుగు వాక్యాలు రాయడానికి ఎంత క్షోభ పడిందీ తెలుస్తోంది. ఫ్రమ్ ఎడ్రస్ లేదు.     ఆనందరావుకి ఉత్తరం చూపెడదామనిపించింది. కుర్చీలోంచి రెండడుగులు వేశానో లేదో, కాళ్ళు పీకుతున్నట్టు అనిపించింది. మనసు వెనక్కి లాగేస్తోంది. అస్తిమితంగా అనిపించింది. కుర్చీలో కూలబడ్డాను.     ఎప్పుడూ ఆందోళనగా ఉండే ఆనందరావు ముఖం కళ్ళముందు కదిలింది.     అతని నీడకి అందకుండా పరిగెడుతున్న స్వప్న, సంతోష్‌ల రూపాలు కదిలాయి.     'పల్లవి - అనుపల్లవి' అని ఇదివరకు స్వప్న అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.     వైరుధ్యాలు శ్రుతులవుతాయో     అపశ్రుతులుగా పరిణమిస్తాయో     జీవన మార్మికత అసంపూర్ణ వాక్యంలా అనిపించి గుండెని బరువుగా కుదిపేస్తోంది.
    
(ఇండియా టుడే ఫిబ్రవరి21- 5 మార్చి 1996 సంచికలో ప్రచురితం)
      

Comments