పామును తరిమిన చీమలు - పెద్దింటి అశోక్‌కుమార్

    
"పామును తరిమిన చీమలు''

    పేరు వినంగనే ఉల్కిపడి "ఎటో ఉంది. ఆడుతదా ...'' అన్నడు పెద్దసారు.

    "బర్నింగ్ టాపిక్ సార్ ... మనం చెప్పాలనుకున్నదే. మంచి సందేశం ఉంది'' స్వామి అన్నడు.

    పెద్దసారు కొంచెం ఆలోచించి "మరి పేరు మారుద్దామా ... ఇదేదో కొట్టచ్చినట్టుంది'' అన్నడు.

    "వద్దు సార్, కథకు తగిన పేరు. ముందు మీరు చదవండి'' అంటూ స్క్రిప్ట్ ఇచ్చిండు. వాటిని అయిష్టంగా తిరగేస్తూ "ఇంతకీ కథ ఏంటిది'' అన్నడు పెద్దసారు.

    స్వామి ఉత్సాహంగా "రైతు కథనే సార్. ఇప్పుడు ఊర్లె జరుగుతున్నదే'' అంటూ కథ చెప్పిండు.

    కథ వింటుంటే పెద్దసారు మొఖం మారిపోయింది. "అరే ... ఊర్ల పంచాదే'' అన్నడు నవ్వుతూ.

    స్వామికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. "అవును సార్ ... అందుకే రాసిన. ఇప్పుడు తీర్పు పెద్దమనుషుల చేతుల ఉంది. వాళ్లు వారం, రెండు వారాలు నానవెట్టి కాంట్రాక్టర్ నాగరాజుకు అనుకూలంగా తీర్పు చెప్పుతరు. ఆ లోపలనే మనం మంచి చెడు ప్రజలకు చెప్పాలె'' అన్నడు.

    అప్పుడే ఆఫీసు రూంలకు వచ్చింది హిందీ టీచర్ ప్రవీణ. స్వామి మాటలు విని "చిగురుటాకులు నాటిక లెక్కనా'' అన్నది.

    "అదొక్కటేనా ... అంతకు ముందు జీతగాడు, కల్లుదుకాణం, బోరుబాయి ... నాటికలేసినం. అన్నీ సమకాలీన సమస్యల మీదనే. అప్పటికి మీరు ఈ బడికి రాలేదు. మేం నాటకం నేర్పుతున్నమంటే కొందరికి భయం'' పెద్దసారు అన్నడు.

    ప్రవీణ కుర్చీ జరుపుకుని కూర్చుంటూ "వామ్మో ... చిగురుటాకులు నాటిక వేసినంక నాకు భయమయింది. ఎందరు తిడుతరో అనుకున్న. అయినా పోలీసులు, గొడవ ... కేసులు. ఇది మనకు అవసరమా సార్? అసలే రోజులు బాగ లెవ్వు. టీచర్లకు నక్సలైట్లతో సంబంధం ఉందని కేసులు పెడుతుండ్రట. ఏదో మన సదువు మనం చెప్పుకోక ...'' అన్నది.

    పెద్దసారు ఏదో చెప్పబోయిండు. స్వామి అడ్డుకుంటూ "మనకేంది, మనకేంపట్టె అని అందరం ఇట్లనే చూసుకుంట ఉందాం. దోచుకునేటోడు పట్టపగలే దోచుకపోతడు. చదువంటే పిల్లల పాఠ్యపుస్తకాలే కాదు. సమాజానికి పాఠాలు కూడా ...'' అన్నడు కోపంగా. "స్వామిసార్‌కు కోపం గూడా వస్తదా ...'' అంటూ స్క్రిప్ట్ అందుకుంది ప్రవీణ.

    ఇంటర్‌వెల్ కావడంతో టీచర్లు ఒక్కొక్కరే స్టాఫ్ రూంలకు వస్తున్నరు. ఫేర్‌నోట్స్‌తో వచ్చిన తెలుగు మేడమ్ రజియా బుక్స్‌ను టేబుల్ మీద పెడుతూ ప్రవీణ చేతిలోని కాగితాలను చూసి, ఉత్సాహంగా "అగో ... మల్లీ నాటకమా'' అన్నది.

    "అవును మేడమ్. ఈ సారి దుమ్ములేపుదాం. మీరు రెండు పాటలు నేర్పాలె'' స్వామి అన్నడు.

    "రెండు గాదు సార్, నాలుగు నేర్పుత. పొడుస్తున్న పొద్దు పాటమీద డాన్స్ నేర్పుత'' రజియా అన్నది.

    స్క్రిప్ట్ చేతులు మారుతున్నది. ఒకరు ఎగిరి గంతేస్తున్నరు. ఒకరు భయంగా చూస్తున్నరు. తెలుగు గ్రేడ్ టు మల్లన్న కాగితాలు తిరగేస్తూ "ఏదైనా సింబాలిక్‌గా ఉండాలెగానీ డైరెక్ట్‌గా ఉండద్దు. పోలీసుల ఫోన్ నెంబర్లు, హక్కుల కమీషన్ల అడ్రస్‌లు ఇస్తే ఎట్ల?'' అన్నడు. "అట్ల ఇయ్యడానికే కద సార్ ... మన పిల్లలతో నాటకం ఏపిస్తున్నది. వీళ్ల నటనా చాతుర్యమో, డైరెక్టర్ ప్రతిభనో చూపించాలనుకుంటే ఈ సోషల్ నాటకాలెందుకు? ఏ పురాణమో ఏద్దుము'' అంటూ స్క్రిప్ట్ అందుకున్నాడు పెద్దసారు.

    నాటిక మీద చర్చ మొదలయ్యింది. ఒకరు అవునంటున్నారు. ఒకరు కాదంటున్నారు. ఒకరు గత నాటికలతో ఎంత లాభం జరిగిందో చెప్పుతున్నరు. ఒకరు ఎన్ని కష్టాలు వచ్చినయో చెప్పుతున్నరు.

    చాయ్ వచ్చింది. తాగుకుంట మాట్లాడుతున్నరు.

    స్క్రిప్ట్ చదువుతున్న పెద్దసారు టక్కున ఆగిపోయిండు. అనుమానంగా చూస్తూ "అగో ... నాగరాజు కంకర మిషిని పెట్టుడేంది కొత్తగా'' అన్నడు.

    అందరికి అదే అనుమానం వచ్చింది. స్వామి వైపు చూసిండ్రు.

    "అదే సార్ ... అసలు కత. మొత్తం సదివితె తెలుస్తది. నాగరాజుకు గోపాలకిష్టయ్య మీద ప్రేమ పొంగి రాలేదు. అక్కడ ఉన్న గుట్ట మీద మనుసు పుట్టి వచ్చిండు. మన ఎస్పీ సాబు ఎల్లారెడ్డిపేట నుంచి వన్‌పెల్లిదాక డాంబర్‌రోడు సాంక్షన్ అడిగిండుగదా ... పోలీసు బాసు అనుకుంటే పని ఆగుతదా. మినిష్టర్ ఓకే అన్నడు. మినిష్టరు నాగరాజుకు దోస్తు. అందుకే పంచాది ముడి మీద ముడి పడుతుంది'' స్వామి అన్నడు.

    పెద్దసారు భయంగా చూసిండు. అది గమనించిన ప్రవీణ "పెద్దోల్లతో యవహారం. ఎందుకచ్చిన గొడవ. ఇంకో కత రాయరాదూ'' అన్నది.

    స్వామి పెద్దసారు దిక్కు చూసిండు. పెద్ద తలకాయలున్నయని తెలువంగనే పెద్దసారు ఆలోచనలో పడ్డడు. ఒకరు అవునని ఒకరు కాదని అక్కడికక్కడే రెండు వర్గాలు విడిపోయారు.

    ప్రవీణ గట్టిగా వాదిస్తోంది "సమాజం సరే! మన ఉనికి కూడా చూసుకోవాలి గదా. నేల విడిచి సాము చెయ్యడం ఎంతవరకు మేలు'' అంటుంది.

    "కతయినా కళయినా పేదవాని దిక్కు నిలబడాలె. తెలిసి మాట్లాడకపోవుడు, చూస్తూ మౌనంగా ఉండుడు రెండు తప్పే. సమాజం ఎప్పుడూ బలవంతుని దిక్కే ఉంటది. కనీసం మనలాంటి వాళ్లమైనా గొంతులేని వాళ్లకు గొంతు కావాలె. ఆ భూమి నాగరాజుకు ఇస్తే ఎంత నష్టమో చెప్పాలె'' సైన్స్ చెప్పే అబ్రహాం అన్నడు.

    ప్రవీణ అసహనంగా చూసింది. "ఈ నాటిక వేస్తే మాత్రం మనమీద దాడి తప్పదు. నాగరాజు మామూలు మనిషి గాదు'' అంటుండంగనే గేటుముందు పోలీసు జీబు ఆగింది.

    "అగో ... నేర్పక ముందే వచ్చిండ్రు మామలు'' రజియా నవ్వుతూ అన్నది.

    అప్పుడే పీరియడ్ బెల్ అయింది. సార్లు క్లాసులకు పోయిండ్రు. స్వామి పెద్దసారు నిర్ణయం కోసం అక్కడనే ఉన్నడు. జీపు దిగిన ఇద్దరు పోలీసులు ఆఫీసులోకి వచ్చిండ్రు. పెద్దసారు భయంగా చూసిండు.

    "ఈ మధ్య మీ ఊరోళ్లకు తెలివితేటలు ఎక్కువయినయి సార్. కలెక్టర్‌కే ఫోన్ చేసిండ్రట. ఇది నాలుగోసారి'' అంటూ టెంత్ చదువుతున్న అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ అడిగిండు పోలీసు.

    పెద్దసారు తేలిగ్గా దమ్ము తీసుకున్నడు. బర్త్ సర్టిఫికెట్ రాస్తూ "ఈ పిల్ల ఇంటలిజెంట్ సార్. నారాయణ కాలేజిల ఫ్రీ సీటుకు సెలెక్ట్ అయింది. రెండు మూడు రోజులు రాకుంటే ఎందుకో అనుకున్నం. ఎట్లయినా పెండ్లి ఆపాలె సార్'' అన్నడు.

    "మేం ఆపకుంటే మీ ఊరోళ్లు హైకోర్టుకు పోయేటట్టున్నరు'' నవ్వుతూ వెళ్లిపోయిండ్రు పోలీసులు.

    వెంటనే స్వామి రెండు చేతులను అందుకున్నడు పెద్దసారు. "ఇది మన 'చిగురుటాకులు' నాటిక చేసిన పనే సార్. ఏది ఏమన్నాగాని మనం వెయ్యాల్సిందే. రోడ్డు గూడా సక్కగ లేని ఈ ఊరికి మన మాటసాయం ఎంతో అవసరం'' అన్నడు.

    పెద్దసారు ఏమంటడో అని భయం భయంగా ఉన్న స్వామి ఎగిరి గంతేసిండు. ఇక ఎవరు ఏమన్నా ఎన్ని అడ్డుపుల్లలు వేసినా పట్టించుకోవద్దనుకున్నడు. వెంటనే పాత్రల సెలక్షన్‌లో పడ్డడు. గోపాలకిష్టయ్యది ప్రధాన పాత్ర. ఆ పాత్రకు కిష్టయ్య కొడుకునే పెట్టాలనుకున్నడు. మిగిలిన పాత్రల కోసం వెదుకుతుండు.

* * *

    పెద్దసారు నోటీసు రాసిండు. రిహార్సల్ నుంచి స్టేజి వేసేదాక ఎవరి బాధ్యతలు వారికి అప్పజెప్పిండు. అవునన్నవాళ్లు కాదన్నవాళ్లు ఒక్కటయిండ్రు. టీం వర్క్ మొదలయింది. ఒకలు పాత్రరు రాసిండ్రు. ఒకరు ఫైల్ కాపీ రాసిండ్రు.

    రెండు రోజుల్లో పాత్రలన్నింటికి పాత్రధారులు దొరికిండ్రు గాని పొలం కొన్న సాయిరెడ్డి పాత్రకు ఎవలూ దొరకలేదు. రెండు రోజుల వడపోత తర్వాత "సాయిరెడ్డి దొరికిండు సార్'' అంటూ వచ్చింది రజియా తొమ్మిదవ తరగతి చదివే పవన్‌తో.

    పవన్‌ను చూడగానే అమాయకంగా, పాత్రకు ఖచ్చితంగా సరిపోతాడనిపించింది. ఆరోజుతో పాత్రల సెలక్షన్ పూర్తయింది. అందరికీ పాత్రలను పంచిండు స్వామి. యూనిట్ పరీక్షలు అడ్డురావడంతో మూడు రోజులు నాటకం పనికి బ్రేకులు పడ్డది. పిల్లలు మాత్రం ప్రశ్న జవాబులతో పాటు పాత్రలను కూడా బట్టి పెట్టిండ్రు.

    ప్రతిరోజు సాయంత్రం రిహార్సల్. వారంలో గంటన్నర నాటిక తయారయింది. సార్లందరు చూసిండ్రు. కొన్ని మార్పులు చేర్పులు చేసిండ్రు. ఓ రోజున నాటకం వేస్తున్నమని ఎలాన్ (ప్రకటన) చేసిండ్రు. సరిగ్గా అదే రోజు రెండవ పీరియడ్‌లో స్టాప్ రూంలకు నవ్వుతూ వచ్చింది ప్రవీణ. వస్తూనే "మన కొంప మునిగింది సార్'' అన్నది భయం నటిస్తూ.

    పెద్దసారు, స్వామి సారు ఏదో పనిలో ఉన్నరు. ప్రవీణ మాటలకు భయపడి ఏమయిందని అడిగిండ్రు.

    "ఏం కాలేదు. కాకూడదనే. మనం ఎవల కతను చెప్పుతున్నమో వాళ్ల పిల్లలే నాటకంలో అదే పాత్రలో ఉన్నరు. సేటు పాత్రలో సేటు కొడుకే ఉన్నడు. విచిత్రంగా లేదూ ...'' అన్నది.

    ఇద్దరు నోరు తెరిచిండ్రు. పిల్లల పేర్లను, తండ్రి పేర్లను ఒకసారి చూసిండ్రు. నిజమే! ముందుగా తేరుకున్న పెద్దసారు "మంచిదే తియ్యి ... అట్లనన్న బుద్దికస్తరు'' అన్నడు.

    "మంచిది కాదు సార్ ... మనను ముంచేది. మనం కావాలనే వాళ్ల పిల్లలను పెట్టినమనుకుంటరు. సార్లకు ఊరి విషయాలెందుకని గొడవలస్తయి'' ప్రవీణ అన్నది అయిష్టంగా.

    స్వామి డైలమాలో పడ్డడు. పెద్దసారు మాత్రం పట్టుదలతో ఉన్నడు.

    "అనుకుంటె అనుకోని ... ఇప్పుడు మనం చేసేదేం లేదు. ఊర్లె చాటింపు చేసినం. ఊరంతా తెలిసిపోయింది. ఇప్పటికిప్పుడు పాత్రలు మార్చలేము కదా'' అన్నడు.

    లీజర్‌లో ఉన్న మరో టీచర్ ప్రవీణకు తోడయింది. "వాయిదా వేద్దాం సార్. ఈరోజు కాకుంటే మరో నాడు'' అన్నది. పెద్దసారుకు కోపం వచ్చింది. తమాయించుకుంటూ "మనం టైం పాస్‌కు నాటకం వేస్తలేం. నాగరాజు కంకరమిషిని గోపాలకిష్టయ్య భూమిలో పెట్టిండనుకో... చుట్టూ ఉన్న గుట్టలు మాయం చేస్తడు. ఒక్క రైతుకు పంట పండది. భూములు వట్టిపోతయి. బండరాళ్లను పేల్చినప్పుడు ఇండ్లు కూలిపోతయి. మేత దొరుకక, ప్రేలుడు విషం కలిసిన నీరు తాగి గోజలు (పశువులు) సచ్చిపోతయి. బోర్లు ఎండిపోతయి. ఇండ్ల మీద రాళ్లు పడి గూనలు (పెంకులు) పగిలిపోతయి. ఒక్కమాటల చెప్పాలంటే ఊరు దింపుడు కల్లమైతది. ఈ విషయాలే ప్రజలకు చెప్పాలె. ఒక్క నాగరాజు వస్తే ఇంక పదిమంది క్వారీ గుత్తదార్లొస్తరు. ఊరు మీద దుమ్మే మిగులుతది ...'' పెద్దసారు అన్నడు.

    లంచ్ తర్వాత స్టేజి ఏర్పాట్లకోసం పి.ఇ.టి. సార్‌ను ఇంకో సార్‌ను పంపిండు పెద్దసారు. ఊర్లెకుపోయిన పి.ఇ.టి. సార్ అరగంటలనే తిరిగివచ్చిండు. "సార్, నాగరాజు సేటు ఊర్లెనే ఉన్నడు. ఎక్కడ కనవడ్డా మాట్లాడుతుండె. ఇప్పుడు మొఖం అడ్డం పెట్టుకున్నడు. పంచాది అయిందట. భూమిని సేటుకు ఇచ్చిండ్రట'' అన్నడు.

    "అయితే మంచిదే. మనం కరెక్టు సమయానికి వేస్తున్నమన్నట్టు'' పెద్దసారు అన్నడు.

    "మన నాటకం చూడడానికి సేటు, పంచాది పెద్దలు గూడా వస్తుండ్రట సార్'' భయంగా చెప్పిండు పి.ఇ.టి.

    "అయితే మరీ మంచిది. ఎవరు చూడాలనుకున్నమో వారే చూస్తండ్రు'' స్వామి అన్నడు.

    "చూస్తే సరేగనీ ఏదన్నా చేస్తెనే పరేషాన్ - నాగరాజు కదర్‌నాక్'' ఒక సార్ అన్నడు.

    పెద్దసారు నవ్వుకుంట "ఇగో సార్, రోట్లె తలకాయపెట్టినం. పోటు తప్పది. ప్రజల్లోకి వెళ్లినం. నాటకాన్ని మధ్యలో వాళ్లు ఆపేస్తే మనం సక్సెస్ అయినట్టే. ఎందుకు ఆపిండ్రో ప్రజలకు తెలిసిపోతది'' అన్నడు.

* * *

    రాత్రి కచీరు ముందు స్టేజి పడ్డది. పిల్లలందరు ముందు వరుసలో కూర్చున్నరు. ఎప్పటి లెక్కనే కేబుల్ డిస్‌కనెక్ట్ చేయడంతో పిల్లా జెల్లా ఊరంతా వచ్చి కూసున్నరు.

    మొదట్లో ఇంతమంది వచ్చేవాళ్లు కాదు. 'చిగురుటాకులు'తో మంచి గుర్తింపు వచ్చింది. చిన్నతనంల పెండ్లి ఎందుకు వద్దో తెలుసుకున్నరు. 'కల్లు దుకాణం' నాటకం చూసి ఊరి మధ్యల ఉన్న రెండు దుకాణాలను బయట పెట్టించిండ్రు. అప్పటినుంచి బడి నాటకం అనంగనే ఏదో ఉంటుందని ఎగబడి చూస్తున్నరు.

    పావుగంటలో మేకప్ పూర్తయింది.

    అనుకున్నట్టే నాగరాజు, అనుచరులు, పంచాది పెద్దలు వచ్చిండ్రు. ఈసారి పక్క ఊర్లనుంచి కూడా జనం వచ్చి కూసున్నరు. పిల్లలకు చెప్పాల్సిన బాధ్యతలన్నీ చెప్పి స్టేజి దిగిండు పెద్దసారు. పెద్దసారుతో పాటు స్వామి కూడా దిగిండు. మిగతా సార్లు ఏవో పనులున్నాయని ఒక్కొక్కరు జారుకున్నరు.

    నాగరాజు పెద్దసారును ప్రత్యేకంగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నడు. స్వామిసార్ జనం వెనక్కి వెళ్లి నాగరాజుకు కనబడకుండా నిలబడ్డడు. "కథ మాదేనటగదా ...'' నాగరాజు అడిగిండు పెద్దసారును.

    "అట్ల పుకారు పుట్టింది సార్. మీదంటే మీదిగాదు. జనరల్‌గా జరుగుతున్నది'' పెద్దసారు అన్నడు. పులిముందు కుందేలులా ఉంది అతని పరిస్థితి.

    "నేను ఆ భూమిలో క్రషింగ్ మిషిన్ పెడుతున్నట్టు ఎవ్వలకు తెలువది. మీకెట్ల తెలిసింది సార్'' నవ్వుతూ అడిగిండు నాగరాజు. 

    "అట్లనా ... అయ్యో ... మాకు తెలువది సార్. కథ నడువాలని ఏదో రాసినం'' బిడియంగా అన్నడు. నాగరాజు మళ్లీ నవ్విండు. నవ్వుతా "అయ్యో ... రాస్తే రాసిండ్రు. దానిదేముంది సార్. రోడ్లు వేస్తుండ్రు. దానికి కంకర కావాల్నా వద్దా. అయినా మీరు మామూలు మనుషులు కాదు సార్. మీకు ఎక్స్‌రే కండ్లున్నయి. నా మనసులోని చెడ్డ ఆలోచనలన్నీ కాయిదం మీద పెట్టిండ్రు. రేపు నాకు ఊర్లె ఉప్పు పుట్టకుంట చేసిండ్రు. ఈ నాటకం చూసిండ్రనుకో జనం నన్ను తన్ని తరుమడం ఖాయం'' అన్నడు. పెద్దసారుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.

    నాటకం మొదలవుతున్నట్టు అనౌన్స్‌మెంట్ రావడంతో ఇద్దరూ సర్దుకుని కూర్చున్నరు. నాటకం గురించి స్వామి రెండు నిమిషాలు మాట్లాడిండు. తినబోయేముందు రుచుల గురించి ఎందుకని ముగించిండు.

    నాగరాజు వంగి పెద్దసారు చెవిలో "ఈ సామిసారు అన్నలల్ల తిరిగిండట, నిజమేనా'' అన్నడు గుసగుసగా.
పెద్దసారుకు పాణం జల్లుమన్నది.

    "ఏ ... కాదు. వట్టి పిరికోడు. బడి, ఇల్లు తప్ప ఊరు తెలువది. ఏవో కతలు రాస్తడు'' అన్నడు.

    నాటకం మొదలయింది. అయినా మాటలు ఆపలేదు సేటు.

    "నేను గుంజుకున్ననా సారూ ... కిట్టిగానికి రెండెకురాల మంచి భూమి ఇచ్చిన. సాయిరెడ్డికి యాభైవెయిలు ఇచ్చిన. నాకు మిగిలిందేందీ ... గుట్టలు చెట్లు... గంతేగదా. దీనికి మీరు నన్ను బదునాం జెయ్యవడితిరి'' నవ్వుతూ అన్నడు.

    ఏదో పని ఉన్నట్టు లేచిపోవాలని చూసిండు పెద్దసారు. నాగరాజు లెవ్వనియ్యలేదు. ఇంకేదైనా మాట్లాడితే బలవంతంగనైనా వెళ్లిపోయేవాడే పెద్దసారు. కాని ఆ తర్వాత నాగరాజు మౌనంగా నాటకం చూస్తున్నడు.

    గోపాలకిష్టయ్య పాత్ర వచ్చింది. ఎందుకూ పనికిరాని తన పదెకురాల గుడ్డం (మెట్టభూమి) గురించి బోర్లు వేసి బోర్లవడ్డ వైనం గురించి చెప్పుకున్నడు. అప్పుల గురించి, అవస్థల గురించి గుర్తు చేసుకున్నడు.

    "నాకు ఒక్కగానొక్క బిడ్డ. నా కష్టాలు అది పడవద్దు. మంచి నౌకరుగానికి ఇచ్చి పెండ్లి జేస్త. ఈ గుడ్డం మొత్తం అమ్ముత'' అనడంతో ప్రేక్షకులు కొంత ఊరట పడ్డరు. అన్నట్టుగనే పెండ్లి సంబంధం కుదిరింది. గుడ్డం అమ్ముదామని చూస్తుండు.

    తర్వాత సాయిరెడ్డి పాత్ర వచ్చింది. ముగ్గురు కొడుకులు. ఇద్దరికి పెండ్లిండ్లు అయినయి. కొడుకులు కోడండ్లతో రోజూ కొట్లాటనే. ఎల్లీ ఎల్లని సంసారం. మూడు జాగలల్ల పావు ఎకురం చొప్పున దొయ్యలు (మడిచెక్కలు)న్నయి. చిన్నకొడుకు పెండ్లి చేసి ఏరు పొవ్వాలని చూస్తుండు. ఎకురం జాగ లేకపాయె. ఏం పంచి ఇయ్యాలని బాధ పడుతుండు. గోపాలకిష్టయ్య గుడ్డం అమ్ముతుండని తెలిసి బ్యారం చేసిండు. మూడు జాగలల్ల తన పొలాన్ని అమ్ముకుని యాబై వెయిలు బయాన ఇచ్చిండు.

    పిల్లలు పాత్రల్లో జీవిస్తున్నరు. కంటనీరు పెట్టిస్తున్నరు.

    ఇక్కడ కథ మలుపు తిరిగింది. పిల్ల నల్లగుందని పెండ్లి ఎత్తిపోయింది.

    "ఇప్పుడు గుడ్డం అమ్ముకుని ఏం జేస్త. నేను అమ్మనే అమ్మ'' అన్నడు గోపాలకిష్టయ్య.

    "దీనికోసం నా పొలం అమ్ముకున్న ... ఎట్ల అమ్మవో చూస్త'' సాయిరెడ్డి అన్నడు. పంచాది ముదిరింది. చూసినవాళ్లకు ఇద్దరి వాదనలు నిజమే అనిపిస్తున్నయి. కత మాటలు కండ్ల ముందు జరుగుతున్నట్టే ఉన్నయి. ఎక్కడో విన్నట్టు ఎప్పుడో చూసినట్టు తమ కథలాగే ఉంది జనాలకు. నిశ్శబ్దంగా కూర్చున్నరు.

    సరిగ్గా అప్పుడే ప్రవేశించింది నాగరాజు పాత్ర. గోపాలకిష్టయ్యకు "అమ్మకురా ... తెర్లు తెర్లయితవు. ఈ పైసలు ఎక్కడనో పోతయి. బిడ్డ లగ్గం చెయ్యలేవు'' అని చెప్పుతున్నడు. సాయిరెడ్డికి "మొగులును చూసి ముంత బోర్లేసుకున్నవు. అమ్మేదాక ఇడువకు'' అంటున్నడు.

    చూస్తున్న జనాలకు మండుతుంది.

    అటు జనాలను ఇటు నాగరాజును చూస్తున్నడు పెద్దసారు. నాగరాజు మాత్రం సంతోషంగా ఉన్నడు. "క్లయిమాక్స్ సీన్‌లో వీడు గొడవ చేస్తడా ఏంది'' అన్న అనుమానం వచ్చింది పెద్దసారుకు. ఏదయితే అది అయిందిలే అని నిశ్చింతగా చూస్తున్నడు.

    "గుడ్డం అమ్మనే అమ్మ... అమ్మితే నా బతుకు ఎట్ల?'' గోపాలకిష్టయ్య వాదన.

    "యాభైవెయిలు బయాన ఇచ్చిన. నేను కొననంటే బయాన ఇద్దునా? యాభైకి యాబైవెయిలు ఇయ్యాల్సిందే'' సాయిరెడ్డి వాదన. పంచాది జరిగింది. భూమి నాగరాజుకు ఇవ్వాలని తీర్మానం జరుగుతున్నప్పుడు మేధా వి పాత్ర వచ్చింది. నాగరాజు ఆ భూమిని ఎందుకు కొన్నడో, క్రషెర్ మిషిని వల్ల నష్టాలేమిటో, క్రషర్ మిషన్ కావాలంటే ఎవరెవరి అనుమతి పొందాలో వారి ఫోన్ నెంబర్లు, పేలిన డిటోనేటర్ల విషం, సిలికాన్ డయాక్సైడ్ దుమ్ము రోగాలు అన్నీ వివరంగా చెప్పాలి. అది వింటే మాత్రం జనం అక్కడకక్కడే తిరగబడి క్రషర్ మిషన్‌ను ఊర్లోకి అడుగుపెట్టనివ్వరు.

    పెద్దసారుకు నాగరాజును చూస్తే భయమయింది. పక్కకి వెళ్దామా అనిపించింది. చుట్టూ అతని అనుచరులే. లేవడానికి వీలులేకుండా ఉంది. సరే వీడేం చేస్తాడులే అని ధైర్యంగా కూర్చున్నడు.

    అక్కడ సీన్ మారింది. మేధావి పాత్ర తారుమారయింది. కంకరమిషిని వల్ల వచ్చే లాభాల గురించి చెప్పుతున్నడు. కంకరలో ఎన్ని రకాలు, రోడ్డుకు ఏ కంకర కావాలి, రోడ్డుతో లాభాలెన్ని , కంకర వల్ల ఎంతమందికి కూలీ దొరుకుతుంది, కాంట్రాక్టరు ఎన్నికోట్ల పెట్టుబడి పెడతాడు, అతనికి ఎన్ని ఒత్తిడులుంటాయి...ఎందరికి మామూ ల్లు ఇయ్యాలి ... కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నడు. పెద్దసారు షాక్ తిన్నడు. నాగరాజు పెద్దసారు దిక్కు నవ్వుతూ చూసిండు. అయోమయంగా పెద్దసారు జనాలవైపు చూసిండు. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. క్రషర్ కాంట్రాక్టర్ కష్టాలు చూసి జనం ఏడ్చేలా ఉన్నారు. ఆగమాగాన స్వామి సారుకోసం చూసిండు. అంతదాక స్టేజి పక్కనే కనిపించిన స్వామి సారు కనిపించలేదు.

    "అరేయ్... ఎవడురా... పాత్రను మార్చింది'' అంటూ లేవబోయిండు పెద్దసారు. ఎవరో నోరు మూసిండ్రు. కాళ్లు చేతులను దొరకవట్టిండ్రు. మాటలు వినిపిస్తున్నయి. కండ్లు కనిపిస్తున్నయి. కాళ్లు చేతులు మాత్రం ఆడుతలెవ్వు. గొంతు పెకులుత లేదు. నాటకం అయిపోయింది.

    నాగరాజు నవ్వుతూ "షబాష్ సార్ ... ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకున్నరు. మేము మాత్రం రూపాయి కట్టల్ని తింటమా ..'' అన్నడు వెటకారంగా.

    ఎక్కడోళ్లు అక్కడ వెళ్లిపోతున్నరు.

    పెద్దసారుకు కాళ్లు చేతులు తెరిపినిచ్చినయి.

    ఎక్కడినుంచి వచ్చిండో అరుస్తూ పరిగెత్తుకచ్చిండు స్వామిసార్. అక్కడ వాళ్లు ఇద్దరే మిగిలిండ్రు. జనం వాళ్లను దాటుకుని వెళ్లిపోయిండ్రు.

* * *

    వారంలో నాగరాజు క్రషర్ మిషిన్ తెచ్చిండు.

    "పాముకు పాలుపోసినట్టా యె. ఎంతపనైపాయె'' అని స్టాఫ్ మొత్తం బాధపడ్డరు.

    కావాలనే నాగరాజు సార్లందరినీ క్రషింగ్ మిషిన్ ఓపెనింగ్‌కు పిలిచిండు. ఎవలకూ వెళ్లబుద్ధి కాలేదు.

    "అనుమంతున్ని చెయ్యబోతే కోతి అయిపాయె. మనం జెప్పింది పక్కకువెట్టి వాడు చెప్పిందే పిల్లలు చెప్పిరి. మనకు దెల్వకుంట వాడు పిల్లలకు బయట నేర్పించినట్టున్నడు. అయినా జనం ఏంటి సార్ ... మరీ నిద్రలో ఉన్నరు. చెప్పింది వినుడేగనీ ఒక్కడన్నా లేచి అడిగిండా. అదిపోనీ ... కనీసం బడికి వచ్చి ఇట్ల రాసిండ్రు ఎందుకని అడిగిండ్రా ... ఈ మాత్రం చైతన్యం లేని మనుషులతో ఏం చేస్తం. ఇది పద్ధతికాదని మనల్ని కొట్టినా సంతోషపడేవాన్ని ... ఇప్పుడు జూడు. వాడు కంకర మిషిని పెడుతడు. వీన్ని జూసి ఇంకొకడు. ఊరును పొల్లు లేపుతరు'' ఆవేశంగా అన్నడు స్వామి.

    "అవునుసార్ ... సాపకిందికి నీళ్లు వచ్చినా సల్లగ పంటే ఎట్ల ...'' రజియా అన్నది. అప్పుడే 108 ఒకటి బడి ముందునుంచే గుట్టవైపు పోయింది. దాని వెనుకనే రెండు అంబులెన్సులు, రెండు పోలీసు జీబులు. భయం భయంగా బయటకు వచ్చి చూసిండ్రు. ఇండ్లల్లోంచి సందులకు, సందులనుంచి బజార్లకు, బజార్ల నుంచి గుట్ట వైపు పిల్లజెల్ల ఆడమగ తేడా లేకుంట చీమల దండులెక్క పోతుండ్రు.

    గుట్ట మీద దుమ్ము లేస్తుంది.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 10-7-2011 సంచికలో ప్రచురితం) 

Comments