పండుగా... నీకు జోహార్! - అయ్యగారి శ్రీనివాసరావు

    
ఆటోలోంచి దిగగానే అనుకున్న ప్రకారం పదిరూపాయలందించాడు భుజంగం. ఆ నోటందుకోకుండానే ఆటోడ్రైవర్ "మరో ఐదొస్తుంది సార్!" అన్నాడు ఎటో చూస్తు నిర్లక్ష్యంగా.

    "నువ్వడిగింది పదిరూపాయలే కదా? ఇంకా అయిదెందుకు?" అడిగాడు భుజంగం.

    అలా అడుగుతున్నతడ్ని అమాయకుడ్ని చూసినట్టు ఎగాదిగా చూశాడా ఆటోడ్రైవర్. అంతలోనే "అన్నీ తెలిసిన మీరు కూడా ఏమీ తెలియనట్టడుగుతారేంటి సార్!" అన్నాడు అదేదో అతిసామాన్య విషయమన్నట్టు.

    దాంతో బిక్క మొహం వేశాడు భుజంగం. "అందరికీ తెలిసి తనకు మాత్రమే తెలియని విషయమేమై వుంటుందా?" అని ఆలోచించాడు. ఫలితం శూన్యం.

    అలా ఆలోచనల్లో ఉన్న భుజంగంతో ఆటోడ్రైవర్ "ఏంటి సార్! ఏమీ ఎరుగని వళ్లలా అలా బిక్కమొహం వేస్తారు? ఆ అయిదూ దసరా మామూలు" అన్నాడు చిక్కుముడి విడదీసిన వాడిలా.

    గీరుకుపోయిన చర్మంమీద కారంగుండ తగిలినట్లు చురుక్కుమందా మాట వినగానే భుజంగానికి. దాంతో ఖస్స్‌స్...మని లేచాడా ఆటోడ్రైవర్ మీద. "నీ పిండం పిట్టలకి పెట్ట. అదేదో ఇంటర్నేషనల్ ఎఫైర్ లాగ ఎంత బిల్డప్ ఇచ్చావురా? టెన్షన్‌తో చంపావు కదా! అయినా ప్రతీ అణాకాణీ ఆవారా వెధవకీ ఇదో అలవాటై పోయింది. దసరా మామూలట... దసరా మామూలు" అంటూ వగరుస్తూ.

    అతడన్న మాటల్లో "పిండం" అన్న మాటకి అర్థం ఆ ఆటోడ్రైవర్‌కి తెలియదు కాబట్టి పెద్ద గండం తప్పింది భుజంగానికి. అయినా మిగిలిన మాటలు వింటూనే "బిల్డప్పు...లాకప్పు...అంటూ ఎక్కువ మాటలొద్దు సారూ! మీరిచ్చేది ఆఫ్టరాల్ అయిదు రూపాయలు. దానికింత... అక్కర్లేదు" అన్నాడు పరమ నిర్లక్ష్యంగా.

    దాంతో అంటుకున్న తారాజువ్వలా 'ర...య్యి'మని లేచాడు భుజంగం. "నీ మొహం మండ. నీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనబడుతున్నానేంట్రా! నీ బతుక్కి దసరా మామూలు కావాల్సొచ్చిందా! ఇలా అడిగిన ప్రతి అణాకాణీ ఆవారాగాడికల్లా ఇవ్వడానికి నా తాత కూడబెట్టిన ముల్లె ఏమైనా ఉందనుకున్నావా?" అంటూ వెర్రిగా కేకలేసాడు. దానికి కారణం అతని మనసులో రగులుతున్న బాధ. నెల్లాళ్ళ పొద్దయింది ఈ తద్దినం మొదలై. వినాయక చవితి పండుగ వెళ్ళాక కరెంటు రీడింగ్ తీసుకోవడానికొచ్చినవాళ్ళు మొదలెట్టారు. "సార్! దసరా మామూలు" అంటూ బుర్రగోక్కుంటూ.

    ఆ మాట విన్న భుజంగం "ఇప్పుడెక్కడి దసరా... రెణ్నెల్లులంది కదా?" అన్నాడు. 

    "నిజమే సార్. కానీ మళ్ళీ మేం రీడింగొచ్చేసరికి దసర వెళ్ళిపోతుంది సార్. ఏదో మీకు తోచినంత..." అన్నాడు వివరణ ఇచ్చి, చివరగా నసిగేస్తూ.

    ఆ మాటతో అంత దీనంగా అడుగుతున్నారు కదా అని అయ్లిదు రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు భుజంగం. అది చూస్తూనే అందులో ఒకడు వెర్రినవ్వొకటి నవ్వుతూ "మాలాంటి వాళ్ళతో మీకు జోకులేంటి సార్" అన్నాడు.

    ఆ మాట అతడెందుకన్నాడో అర్థంకాని భుజంగం "మీతో నేను జోకులెప్పుడేసాను" అన్నాడు మాడిపోయిన గారెలా మొఖం పెట్టి.

    ఆ మాటకు రెండో వ్యక్తి "లేకపోతే ఏంటి సార్! యాభై రూపాయలివ్వవలసిన దసరా మామూలుకి అయిదు రూపాయలిస్తే జోక్కాక మరేంటి సార్? రండి సార్. మాకవతల పనుంది" అన్నాడు బాకీదారుణ్ని అప్పిచ్చిన వాడడిగిన లెవెల్లో.

    దాంతో ఒళ్లుమండిన భుజంగం "ఏభై కావాలా?... వందొద్దూ?..." అన్నాడు వ్యంగ్యంగా. అప్పటికే లోపల రక్తం మరగడం మొదలైంది భుజంగానికి.

    "లేద్సార్! ఈ సంవత్సరానికింతే ఫిక్స్ చేసాం. అంతకంటే ఎక్కువిచ్చినా తీసుకోం" అన్నాడూ ఆ యిద్దరులో ఒకడు. అలా వాళ్లన్న ఒక్కొక్కమాట వింటుంటే పొయ్యిమీద పెట్టిన పాలలాగా రాన్రానూ పెరిగింది బీపీ. ఆ చివరిమాట వినేసరికి పగిలిన అగ్నిపర్వతం లావా ఎగజిమ్మినట్లు తన మనసులోని కోపాన్నంతా వాళ్లమీద చూపించేసాడు. అతడి ఉగ్రరూపం చూసి ఏమనుకున్నారో గాని ఆ సర్వీసు నంబరు దగ్గర ఏదో రాసుకుని మౌనంగా వెళ్ళిపోయారు.

    అయితే అంత సులువుగా వాళ్ళు వెళ్ళిపోవడం వెనుక ఆంతర్యం బిల్ కట్టడానికి వెళ్ళినపుడు గాని తెలిసిరాలేదు భుజంగానికి. నెలాఖరు. కూర ఖర్చుకే కటకటలాడుతున్న రోజులు. బిల్ కట్టడానికి ఆఖరు రోజు కావడంతో దాని పేరు చెప్పి నెల ఖర్చులకి కూడా కలిపి అప్పు చేసిన భుజంగం బిల్ కట్టడానికెళ్ళాడు.

    ఆ బిల్ కట్టించుకునే వ్యక్తి ఇతడి సర్వీస్ నంబరు చూడగానే "సార్! మీరు రీడింగ్ తీయడానికొచ్చిన బాయ్స్‌కివ్వాల్సిన దసరా మామూలు పెండింగ్‌లో ఉందిసార్. అది, మాది కలిపి ఇప్పుడిస్తేనే బిల్ తీసుకుంటాం" అన్నాడు. ఆ మాటతో భుజంగం బుర్ర బొంగరంలా తిరిగింది. ఎన్నో రకాల చెప్పిచూసాడు. సామదానబేధోపాయాలు ప్రయోగించాడు. ఇలాంటి పరిస్థితిలో తగవు పెట్టుకోకూడదని దండోపాయం ప్రయోగించలేదు. అక్కడంతమందున్నారు. వాళ్లూ తనలాగే బిల్ కట్టడానికొచ్చిన వారే. అందరూ బాధితులే. ఏ ఒక్కరైనా తనకి సపోర్ట్‌రారా అని ఆశించిన అతని ఆశ అడియాసే అయింది. వాళ్లెవరూ కలగజేసుకోలేదు సరికదా! తిరిగి తనకే పాఠాలు చెప్పడం మొదలెట్టారు కొందరు. తనను పిసినారిని చూసినట్టు చూసినవాళ్లు కొందరు.జాలిగా చూసేవాళ్లు కొందరు.చాటుగా నవ్వుకుంటున్న వాళ్లు కొందరు. అందర్నీ చూస్తున్నాడు భుజంగం. నీర్సం వచ్చింది. అయినా ఫలితం లేదు. దాదాపు చేతులు నులిపి బలవంతంగా లాకున్నట్టు లాకున్నారు రెండురకాల దసరా మామూళ్లని.

    అలా మొదలైన దసరా మామూళ్ళ ప్రహసనం అలా అలా కొనసాగింది. ఉధృతమైంది. పాలుపోసేవాడు, రోడ్డు తుడిచేవాడు, కాలువ తుడిచేవాడు, చెత్తలెత్తేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాడు... ఇలా వాళ్ళు వీళ్ళని లేదు... మనిషి ముఖం కనబడితే చాలు... దసరా మామూలడిగేసే వారెవరో ఒకరు.

    కొన్నాళ్ళు మామూళ్ళివ్వకుండా తప్పించుకున్నాడు. ఆ కాలంలో అతడు పడ్డ పాట్లు మామూలు పాట్లు కాదు. కుక్కపాట్లు. ఇస్త్రీ బండి వాడికి దసరా మామూలు ఇవ్వకపోత అసలు మడత బదులు మరో దగ్గర మడత వచ్చేటట్లు ఇస్త్రీ చేసేవాడు. దాంతో రెండు మడతలతో బట్టలు అసహ్యంగా తయారయేవి. పోనీ వాణ్ని మార్చి మరొకడికి ఇద్దామంటే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ఆ కాలనీకంతటికీ వాడొక్కడే కాంట్రాక్ట్.

    పాలవాడు కొలత తగ్గించి పొయ్యడమో, నీళ్ళు ఎక్కువ కలిపేయడమో చేసేవాడు. వాడి దగ్గర మానేద్దామా అంటే తన బడ్జెట్‌కి తగిన చవకలో మరెవరూ ఇవ్వరాచుట్టుపక్కల.

    పేపర్‌బోయ్ ఒకరోజు ముఖానికి తగిలేట్టు పేపర్ విసిరాడు. మరోరోజు పూలమొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఆ నీట్లో పడేటట్లు విసిరేసాడు. అదీ ఇదీ కాకపోత ఏదో ఒక ఎడిషన్ పేపర్ తప్పించేసేవాడు. వాడికేంపోయింది? నష్టపోతే ఏజెంట్ కదా నష్టపోయేది. మానేసినా బాధ లేదు. మళ్ళీ బుర్రతిని బుక్‌సేల్స్ ప్రమోటర్స్ ఉండనే ఉన్నారాయె.

    రోడ్డు తుడిచేవారు, కాలువతీసేవారు సరేసరి. మొదటిరోజు వాళ్ళింటి దగ్గర తుడవడం మానేసారు. రాన్రాను వారి నిరసన తీవ్రతరం చేసి ఎక్కడెక్కడి చెత్తా కూడదీసి వాళ్ళ గుమ్మం ముందు పోసేవారు. పనిమనిషి దగ్గర ఉండనే ఉంది పెద్దాయుధం. అదే నాగా పెట్టడం. వచ్చినా వదిలీ వదలకుండా, అరకొరగా తోమేసి, సబ్బుపిసర్లో, జిడ్డు ముద్దలో ఉంచేసి కడిగిపడేసేది. కూరలమ్మేవాడు, ఘూర్ఖా, కేబుల్ కనెక్షన్ వాళ్ళు, ఫోన్‌వాళ్ళు, చిన్నచిన్న రిపేర్లు చేసే వాళ్ళు... వాళ్ళంతా ఎవరి స్థాయిలో వారు నిరసన తెలిపి భుజంగాన్ని ఓడించి, దసరా మామూలు పట్టుకెళ్ళిపోయారు. ఆఖరుకి ఇంటికి రోజూ వచ్చే ముష్టివాడు కూడా ఘరానాగా మామూలు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు. అయిదూ పదీ ఇస్తే తీసుకునే వాళ్ళు కొందరైంతే, పాతిక యాభైకి తగ్గనివాళ్ళు కొందరు.

    అలా అలా ఇచ్చీ ఇచ్చీ చివరికి పెద్దమొత్తం అప్పు చెయ్యవలసి వచ్చింది. అదీనా దసరా మామూళ్ళ నిమిత్తమే. అప్పట్నుంచి అలా అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు తెచ్చిన దసరా మామూలు మాట వింటేనే చిర్రెత్తుకొస్తూంది. అందుకే ఇప్పుడీ ఆటోవాలా అలా అడిగేసరికి అంతలా రియాక్ట్ అయ్యాడు.

* * *

    అనుకోకుండా మధ్యలో తెలివొచ్చింది కనకానికి. తన నిద్రాభంగానికి కారణమేమిటో తెలీక అటూ ఇటూ చూస్తోంది. ఫేన్ తిరిగే చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దమే. కాకపోతే జాగ్రత్తగా గమనిస్తే ఏదో చిన్న ధ్వని. అది కూడా తనకు అతి దగ్గర్నుంచి వస్తూంది. అదేమిటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ గదిలో అలుముకున్న చీకటివల్ల ఏదీ స్పష్టంగా కన్పించని పరిస్థితి. అయినా అతి కష్టమ్మీద కనిపెట్టగలిగింది ఆ ధ్వని తన పక్కనున్న భర్త దగ్గర్నుంచని.  నెమ్మదిగా తడుముకుంటూ వెళ్ళి అంచనా మీద స్విచ్ నొక్కింది. స్టార్టర్ వీక్ అయిన ట్యూబ్‌లైట్ మధ్యతరగతి కుటుంబ యజమానిలాగా నీర్సంగా వెలిగింది. ఆ వెలుగులో అతి దీనంగా మొఖం పెట్టుకుని దిగులుగా కూర్చున్న భర్త ముఖాన్ని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. తర్వాత తేరుకుని నెమ్మదిగా అంది "ఎందుకండీ అంత టెన్షన్ పడుతున్నారు?" అని. ఎందుకంటే ఈ మధ్య చాలా రోజుల్నుంచి భర్త అలాగే ఉండడం గమనిస్తోంది. కానీ ఇంతలా నిద్రమానుకుని బాధ పడుతున్నాడనుకోలేదు. 

    అలా అడిగిన కనకం మాట విన్న భుజంగం "ఏం చెయ్యమంటావు కనకం? చూస్తున్నావు కదా అప్పులు. ఇవన్నీ ఎలా తీర్చాలో అర్థంకావడం లేదు. అయినా కడుపుకింత తిన్నామనా? కంటికింపుగా ఒక బట్ట కట్టుకోవడానికి కొన్నామనా? లేకపోతే ఇల్లు కట్టామనా? అక్కడైదు, ఇక్కడ మూడు, మరోదగ్గర రెండు... ఇలా దొరికిన చోటల్లా అప్పులు వాడేసాను. ఇవన్నీ ఎలా తీరుతాయి చెప్పు?" పగటి వేషగాడ్ని అసురసంధ్య వేళలో చూసి, నిద్దట్లో జడుసుకున్న చంటి పిల్లాడిలా వణికి పోతూ అన్నాడు భుజంగం.

    అతడ్నలా చూస్తూంటే జాలేసింది కనకానికి. కాని అంతలోనే కలిపురుషుడు ప్రవెశించిన ద్వాపరయుగం మనిషిలా మారిపోయింది. దానికి కారణం ఆమె మదిలో అప్పుడే వచ్చిన ఆలోచన. ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి తగిన సమయమిదే. అందుకే నెమ్మదిగా పిలిచింది. 

    ఆ పిలుపులో ఆత్మీయత, కరెంట్ పోయిన మిట్టంధ్యాహ్నపు వేసవి వేళలోని మనిషి స్థితిలో ఉన్నతనికి, కూల్‌డ్రింక్ తాగే స్ట్రాతో మొహం మీద ఊదినట్టనిపించిందా పిలుపు.

    ఆత్మీయంగా పిలిచిన ఆ పిలుపుతో "ఏమిటి?" అనడిగాడు కరిగిపోతూ.

    "ఇలా బెంగెట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి! అయిందేదో అయిపోయింది. ఈ వడ్డీలు, అప్పులు... వీటన్నిటికంటే నన్నో మాట చెప్పమంటారా?" అడిగింది నెమ్మదిగా.

    మండువేసవిలో కరెంట్ ఉన్న ఫ్రిజ్‌లోని కూలింగ్ వాటర్ దొరికినంత ఆనందమన్పించామాట. అలాంటప్పుడు వద్దనెలాగంటాడు?

    మధ్యతరగతి మొగుళ్ళని అంత సులువుగా నమ్మరు యిల్లాళ్ళు. కారణం? వారికేమాటంటే ఏ కోపమొస్తుందో తెలీదు. అందుకే నెమ్మదిగా అంది "చిరాకు పడనంటేనే" అని మాట తీసుకుని చెప్పడం మొదలెట్టింది.

    "ఎలాగూ పదివేలు అప్పుంది. నెలకి వడ్డీ మూడు నాలుగు వందలెలాగూ కట్టాలి కదా! ఎందుకంటే మూడు రూపాయలు, నాలుగు రూపాయలు లెక్కన వడ్డీకి వాడారు. దాని బదులు ఒక సులువు చెప్పనా?" అంది.

    "చెప్పు..." అన్నాడు నెమ్మదిగా నడుంమీద చెయ్యివేసి రాస్తూ.

    ఆ చర్యలోనే అతడి మనసెంత ఖుషీగా వుందో అర్థం చేసుకుని నెమ్మదిగా అంది... "మీరు ఎన్నాళ్లనుంచో నాకు నెక్లెస్ చేయిస్తానంటున్నారు. కాని కుదరడంలేదు కదా?" అని ఆపేసి, "మీరు మాత్రం కోపగించుకోనంటేనే" అంటూ ఆగిపోయిందామె. ఎందుకంటే ఆమె మధ్యతరగతి ఇల్లాలు. 

    ఆ మాటకి భార్యమీద జాలేసింది. అప్పుడప్పుడు తన చిరాకు ప్రవర్తనకి సిగ్గనిపించి, "లేదులే... చెప్పు..." అన్నాడు ఆమెని ఒడిలోకి లాక్కుంటూ.

    ఆమె చెప్పడం కొనసాగించింది. "అక్క్డా ఇక్కడా అప్పులకంటే మీ పి.ఎఫ్.లో లోన్ తీసుకుంటే అన్ని సమస్యలూ తీరిపోతాయి కదా. పాతిక వేలు లోన్ తీసుకుంటే పదివేలు అప్పుతీరిపోగా మిగిలిన పదిహేనువేలు పెడితే తులంనర నెక్లెస్ వచ్చేస్తుంది. అదీకాక నెలకిప్పుడెలాగూ నాలుగు వందలు వడ్డీ కడుతున్నారు కదా. దాని మీద మరికొన్ని వందలు కలిప్తే ఇరవై నెలల్లో మీ అప్పు తీరిపోతుంది. నాకు నెక్లెస్ మిగిపోతుంది" అంది.

    ఆ మాటతో "ఇదేదో బాగానే ఉందిలాగుంది" అనుకుని, అంతలోనే ఏదో గుర్తొచ్చి తుళ్ళుపడ్డాడు. అంతలోనే తమాయించుకుని, "అయితే నీకూ దసరా మామూలు కావాలంటావ్! అంతేనా...?" అన్నాడు.

    అలా అంటున్న అతడి ముఖం ప్రశాంతంగానే ఉందని గ్రహించిన ఆమె "దసరా వెళ్ళిపోయి పదిహేను రోజులైపోయింది కదా! లోన్ శాంక్షన్ అయి, నెక్లెస్ తయారయ్యేసరికి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇది పండగ మామూలు" అంది.

    అంతలోనే మంచి సీన్‌లో కరెంట్‌పోయిన టీవీ ప్రేక్షకుడిలా ముఖం పెట్టాడు ఏదో గుర్తొచ్చి.

    పరమాన్నం నోట్లో పెట్టగానే కంకరరాయి పంటికి తగిలినట్లు ఏదో కీడు శంకించిన కనకం "ఏమైందండీ..." అంది. ఆమె ఆశకు అప్పుడే తిలోదకాలు ఇచ్చేసింది. 

    ఆ మాటకి భుజంగం "లోన్ శాంక్షన్ చెయ్యడానికీ మామూలివ్వలి కాబోలు..." అన్నాడు.

    అది విన్న కనకం తేలికగా నిట్టూరుస్తూ "మీరే అంటుంటారు కదా, 'నూరు గేదలని కడిగిన వాడికి ఒక సాలగ్రామం లెక్కా...' అని" అంది.

    ఆ మాటకు భుజంగం భార్యవైపు మెచ్చుకోలుగా చూస్తూ "ఏమైనా నువ్వు కూడా చమత్కారివేనోయ్" అన్నాడు ఆమెను కౌగిలించుకుంటూ.

    అతడి సమస్యకి పరిష్కారం చూపిన, ఆమె ఆ క్షణంలో అందాలరాశిలా, అపరంజిబొమ్మలా ఇంకా ఇంకా... లా... లా...  కనబడుతోందతడి కళ్ళకి. అతడి మనసులో ఆనందభావనే ఆ సంతోషానికి కారణం.

(కథాకేళి మాసపత్రిక జనవరి 2009 సంచికలో ప్రచురితం)        
Comments