పన్నూబోయె పరువూబోయె - గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు

    
అవ్వి మన హిందూదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. సాంప్రదాయంగా వస్తూన్న భోగం మేళాలు స్వేచ్ఛగా ఇంకా సాగుతూన్న రోజులు. నూజివీడు సంస్థానంలో ఉన్న శనివారప్పేటలో శ్రీరామనవమి పందిట్లో రాత్రి పదిగంటల వేళ భోగం మేళం జరగబోతోంది. పందిరంతా ఆడామగాజనంతో నిండిపోయి ఉంది. వేదికకు నాలుగు మూలలా ఉన్న గుంజలకుకట్టి ఉన్న కాగడాలు కాంతిని విరజిమ్ముతూన్నాయి.

    వేదికమీదనేకాక పందిట్లోకూడా అక్కడక్కడ పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి. గాయకుడూ, మృదంగంవాడూ,హార్మోనియం వాడూ,శృతివేసేవాడూ వచ్చి వేదికమీద ఒక పక్కగా సర్దుకుని కూర్చున్నారు. 

    వేదిక పక్కనే ఉన్న విడిది ఇంట్లోంచి నలభైయేళ్ళ నాయకసానీ, ఆమె కూతురు పద్దెనిమిదేళ్ల ఇందీవరమూ ఇంచుమించుగా అంతే వయస్సుగల మరి నలుగురు కుర్రసాన్లూ - జమాజెట్టీల్లాంటి ఇద్దరు వెట్టివాళ్లు దుడ్డుకర్రల్తో చెరొక పక్క కాపాలాగా నడవగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి వేదిక ఎక్కారు.

    గాయకుడు కీర్తనలు ఆలాపిస్తూండగా నాయకసాని వేస్తున్న తాళాలకూ, ఇతరవాద్యాలకూ అనుగుణంగా ఇందీవరం అభినయం చెయ్యసాగింది. మొదట 'వాతాపి గణపతిం భజే' ప్రార్థనా గీతమయింది.

    ఆ తర్వాతి దశావతార కీర్తనలో 'మత్సరమయిన మరి అంబుధిలో జొచ్చియున్న సోమకు ద్రుంచి వేదముల గాచిన మత్సావతారా!' అన్నప్పుడు ఇందీవరం తన చేతుల్తో మత్స్యముద్ర పట్టింది. మిగిలిన చరణాల్లోని ఆయా అవతారాలకూ ఆయా ముద్రలతో బాటు శరీర భంగిమలనూ బాగా చూపించింది. జనం చప్పట్లు కొట్టారు. 

    ఆ తర్వాత 'అయిగిరి నందిని' నాట్యం జరుగుతూండగా ముందు వరసలో కూర్చునున్న పెద్దల్లో కలకలం రేగింది. 'వస్తన్నాడు, వస్తన్నాడు' అన్న మాటలు లేచినయ్యి. ఇద్దరు పాలేర్లు వెంటరాగా సిల్కు లాల్చీ, జరీకండువా, మెళ్లో పులిగోరు, గొలుసు, సెంటు వాసనా వీటితో వున్న నలభైయ్యేళ్ల ఆసామీ, హళ్ళూపెళ్ళూ జనాన్ని చీల్చుకుంటూ వేదిక ముందుకు వచ్చాడు. గుబురు మీసాలు నిమురుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు.

    నాయకసాని తాళం ఆపి హడావిడిగా వెళ్లి అతనికి వంగి నమస్కరించింది. "దివాన్‌గారి బామ్మర్దులు సింగారం రాయుడు బావయ్యగారికి నమస్కారాలు...ఎన్నాళ్లకెన్నాళ్లకి! మూడేళ్లాయె రాజమండ్రిలో తమరికి నేను బస ఇచ్చి! పోన్లెండి ఇప్పటికయినా మళ్లీ మా ఆటాపాటామిద తమరికి మనస్సు మళ్లింది. అదే పదివేలు" అంది. అట్లాగే వెనక్కి నడిచి వేదికమీద నాట్యం చేస్తున్న ఇందీవరం దగ్గరకొచ్చి ఆమెతో చెవిలో ఏదోచెప్పింది. అదే సమయానికి ఇందీవరం 'జయ జయహే మహిషాసుర మర్దిని' అన్న చరణం దగ్గర శూలంతో పక్కవాటుగా మహిషాసురుణ్ణి పొడుస్తున్నట్లు అభినయిస్తోంది.

    'శంభ నిశుంభ మహా హవ దర్పిత భూత పిశాచవతే' అన్నప్పుడు ఆమె కళ్లు పెద్దవి చేసి, నాలుక బయట పెడ్తూ, భయంకరంగా మొహం పెట్టి, దోసిళ్లతో రక్తం తాగుతున్నట్లు అభినయించింది. సరిగ్గా అదే సమయానికి ఆ వేదిక వెనకనే నుంచున్న వెట్టివాడు కాగడామీదికి తన నోట్లోంచి కిరసనాయిలు చిమ్మాడు.

    భగ్గుమని మంటలేచిపడింది. అట్లా వాడు రెండు మూడు సార్లు చేశాడు. జనం నిశ్చేష్టులయ్యారు!

    అసహనంగా సింగారం రాయుడు "దీని సిగదరగ, ఈ కుర్రపిల్ల జమాయించి ఆడతాందే! దీని రిమ్మదియ్యాల!" అన్నాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు.

    మొత్తం కీర్తన పూర్తవ్వగానే మాత్రం పందిట్లో చప్పట్లు మోగిపోయాయి. ఇందీవరం తన తల్లి పక్క కెళ్లి నుంచుని సేద దీరుతోంది. గాయకుడు కృష్ణ శబ్దం అందుకొన్నాడు. 'రారా నా సామి రారా - యదువంశ సుధాంబుధి చంద్ర - నారీజన మానస చోర - భరతశాస్త్ర నిధి నీవేరా - సరస కథల నిధి నీవేరా...' దీన్ని మిగిలిన నలుగురు సానులు అభినయిస్తున్నారు.

    సింగారం రాయుడు దిక్కులు చూశాడు.  అసహనంగా అటూ ఇటూ కదిలాడు. ఉండుండి చేతిలో పది నోటు పట్టుకుని ఇందీవరం వైపు చూపిస్తూ 'రమ్మ'ని పిలిచాడు.

    ఇందీవరం అతనిదగ్గరకు వచ్చింది. తన తల్లోంచి మల్లెపూవు, బొడ్లోంచి తమలపాకు తీసింది. ఆ పువ్వును ఆ ఆకులో పెట్టి తాంబూలం అతనికిచ్చింది. ఇంతలో గులాబీ పువ్వు ఒకటి ఆమె తలలోంచి జారి కిందపడింది. సింగారం దాన్ని తీసి, "కూచో ఎహే" అని ఆమెని చెయ్యి పట్టుకుని గుంజాడు. ఆమె అతని ముందర కూలబడిపోయింది. ఆమె తల్లో ఆ గులాబీని తురిమాడు. 

    "ఇదిగో నీకు పెట్టేశాను" అన్నాడు.

    "ఓస్ పువ్వేగా పెట్టింది!" అంది ఇందీవరం.

    "ఓసి నీ సిగ్గోసిరి! నా సత్తా నీకేం దెల్సే! మనం ఒళ్లోకి దీసుకున్నామంటే ఏ సానిదైనా కెక్కుకెక్కుమనాల్సిందే! అద్సరే నీ పేరేంటి?" 

    "ఇందీవరం" సిగ్గుపడుతూ చెప్పింది.

    "కొత్తగా వచ్చావా ఏంటి? ఈ మేళంలోకి"

    "కొత్తేంటి. మూడేళ్లయితేనూ. మీరే శీతకన్నేశారు. నెల్లూరు సాన్లొచ్చి నూజివీడులోనూ, ఏలూరులోనూ ఇలాకాలు కుదుర్చుకుని మేళాలాడుతున్నారంటగా! ఆ చత్కారీవోళ్లకి మరిగి మీరే రాజమండ్రి రాటంలేదంట. మా అమ్మ జెప్పింది" అందామె.

    సింగారం ఆమె భుజం మీద చెయ్యేశాడు. ఆమెను దగ్గరికి పొదువుకున్నాడు. ఆమె బుగ్గల్ని నిమురుతూ "అవుననుకో...నువ్వన్నట్టుగానే ఆళ్లంతా చూపూ రూపూ లేనోళ్ళు. నిలువూ నిప్పచ్చరమూ తడికెలు! నీకున్న పొంగులు ఆళ్లకెక్కడియ్యి" ఇట్లా అంటూ అతను పుష్టిగా ఉన్న ఆమె ఎద మీద చెయ్యి వేశాడు. ఇందీవరం దులుపుకుంది. ముద్దుముద్దుగా అంది "ఛీ ఇంతమందిలో ఈ పనేంటి. అసలు సిగ్గూఎగ్గూ లేకుండా"

    "సానికి సిగ్గేంటి, సరసుడికి ఎగ్గేంటి"

    ఇందీవరం లేచి నుంచోబోతూ అతని చేతిలోని పది నోటును అందుకోబోయింది. సింగారం చటుక్కున ఆ నోటును వెనక్కి తీసేసుకుని తన జేబులో పెట్టేసుకుని ఒక రూపాయి నోటుతీసి ఆమెకి ఇవ్వబోయాడు. ఇందీవరం అతన్ని క్షణంసేపు చురుగ్గా చూసింది. 

    "ఉంచుకోండి" అంది. మళ్లీ లేవబోయింది.

    సింగారం ఆమెని కిందికి అదిమిపెట్టి బలంగా కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నాడు. ఆమె విదిలించుకుని లేచి నుంచుంది. అతనివైపు కోపంగా చూసింది. ఆ వెనకాల కూర్చున్నవాళ్లు అయిదారుగురు నవ్వారు. అదే వరసలో కొంచెం దూరంగా కూర్చొన్నా ఆసామి అన్నాడు. "ఏయ్‌పిల్లా ఇటుగూడా జూడు మరి" ఇల్లా అంటూ అతను తన కుడిచేతివేళ్లతో ఆమెని పిలిచాడు. ఆ వేళ్ల నిండా ఉంగరాలే. పైగా అతడి ముందుపన్ను బంగారపు కట్టుడుపన్ను. ఆమె అతని దగ్గరకెళ్లింది. ఆకూ పువ్వూ ఇచ్చింది. కూర్చుండిపోయింది. " ఈ ఊరు నాకు కొత్త. తమరి ఇవరం ఏంటో..." అంది.

    ఆమె వైపు చూస్తూ అతనన్నాడు. "నేనా మన్మథగుప్త. నూజివీడులో బంగారం యాపారం" 

    ఇందీవరం కళ్లు మెరిశాయి. "అదీ కథ. అందుకనే మీ వొంటికి ఆ బంగారం మెరుపు. మీ రవ్వల దుద్దులు చూడండి, మీ చెంపల కాంతి పడి ఎలా ధగధగామెరిసిపోతున్నాయో" ఇల్లా అంటూ ఆమె అతని చెంపల్ని తన చేతి ముణుకుల్తో సుతారంగా నిమిరింది.

    ఆ చేతిని అట్లాగే అతని కంఠం కిందినించి కిందికి జార్చింది. ఇంకా కొంచెం కిందికి నెమ్మర్దిదా పొఅనిచ్చి అతని చొక్కాలోంచి పంచెలోకి దూర్చి అతని బొడ్డు దగ్గర నిమిరింది. చటుక్కున చెయ్యి తీసేసింది.

    రహస్యంగా చెబుతున్నట్టుగా అతని చెవిలో "మీ వొయస్సు ముప్పయేళ్లేగందా" అంది.

    అప్పటికే గుప్త ఉక్కిరిబిక్కిరయిపోయాడు. ఎట్లాగో అన్నాడు "ముప్పయ్యేంటి నలభ్య్యయిదు"

    "నేన్నమ్మను. మీ చెంపలూ, రొమ్మూ, పొట్టా అట్టా ఝింగుమని బిగుసుకుంటా వుంటేనూ... అసలు ముప్పయ్యేంటి పాతికేమో గూడా" అంది ఇందీవరం.

    తేరుకుని గుప్త అన్నాడు "మరి మా ఇంటిది నాకు అరవయ్యొచ్చాయంటందేంటి?"

    ఇందీవరం నవ్వింది. "మగాడి బిగుతేందో సానికి తెలుసుద్ది గానీ సంసారికేం తెలుసుద్ది. పిల్లల్ని కనటం తప్ప...మమ్మల్ని జూసి నేర్చుకోటానికేగా ఇంతమంది ఆడోళ్లు ఇప్పుడీ పందిట్లోకొచ్చింది.

    "ఆఁఆఁ... ఇదీ నికార్సయిన మాట. వరాలమూట. ఇదిగో ఈ కట్నం దీసుకో" ఇల్లా అంటూ గుప్త పదినోటు ఇవ్వబోయాడు. ఇందీవరం "ఇప్పుడిదెందుకు మీరే నా మనిషవ్వాలిగానీ" అంటూనే సుతారంగా దాన్ని అందుకుని తన రవికెలో తురుముకుని వెనక్కి జరిగినట్టు జరిగి చటుక్కున ముందుకొచ్చి అతని ఒళ్లో కూర్చుని అతని బుగ్గమీద ముద్దుపెట్టి వెంటనే లేచి వేదిక మీదికెళ్లింది. వెళ్తూ వెనక్కి తిరిగి 'రాజమండ్రొచ్చినప్పుడు మెరక యీదిలో మా ఇంటికి రాకండా యెళ్లగలరా?" అంది. గుప్త నోరు వెళ్లబెట్టి ఆమెవైపే చూస్తుండిపోయాడు.

    వెనకాల జనంలోంచి సన్నసన్నగా "కీర్తనలొద్దు పదాలు కావాలి" అన్న మాటలు వినిపించాయి. 

    అంతవరకూ అభినయం చేస్తున్నా ఆ నలుగుర్లోంచి ఇద్దర్ని నాయకసాని విడుదల చేసింది. మిగతా ఇద్దరి చేత జానపద గేయం ఒకటి అభినయింపజేసింది.

    'నల్ల నల్ల మబ్బులోన లగ్గోపిల్లా...తెల్ల తెల్ల చంద్రుడొచ్చె లగ్గోపిల్లా అరిసె అరిసె అతికినట్టు లగ్గోపిల్లా...మన ఒళ్లుఒళ్లు అతకాలె లగ్గోపిల్లా...నా చేను ముదిరిపోయె లగ్గోపిల్లా...పలకబారదే నీచేను లగ్గోపిల్లా...' ఈ ఆఖరి రెండు చరణాల దగ్గరా ఆ ఇద్దరు సానులూ తమ తమ కటిప్రదేశాల మీద చేతులు పెట్టుకొని ఒక్కళ్లనొకళ్లు ఎదురుబొదురుగా రుద్దుకొన్నారు.

    ఆ వెంటనే వెనక్కెళ్లి పరికిణీలు దులిపారు.

    జనంలోంచి గొల్లున గోల! ఈలలు! చప్పట్లు! గుప్పుగుప్పున ఒక్కమాటుగా పైకి లేచిన పొగచుట్ట పొగలు. సింగారం రాయుడు అసహనంగా అరిచాడు."ఆపండెహె ఎదవగోల! గంటన్నరైంది ఒక్క జావళీ పాడరేంటి. ఇది సానోళ్ల మేళమా, చెంచులోళ్ల జాతరా!"

    నాయకసాని కంగారుపడింది. ఈ మాటు ఇందీవరాన్ని ముందుకుతోసింది. అయిష్టంగానే ఆమె ముందుకొచ్చింది. పాటకు తగ్గట్టు అభినయం మొదలుపెట్టింది.

    'మందారగంధమిదే - మనోహర పూసెదరా - బుగ్గపై పూసెదరా; బుగ్గపై - బుగ్గపై - బుగ్గపై పూసెదరా! నిన్న రాతిరిగంటూ - చెంపపై మిగిలెనురా - సాక్ష్యంగా నిలిచెనురా' ఇట్లా అభినయం చేస్తూనే వెండిగంధం గిన్నె తీసుకుని వేదిక దిగొచ్చి మన్మథగుపత్కు మెడలో గంధం పూసింది. మిగతా సానుల దగ్గర్నించి తాంబూలాలు అందుకున్న మిగతా సరసులక్కుడా చేతులకి గంధం పూసింది. పూస్తూనే పాటకు అభినయం చేస్తోంది.

    'అత్తరూ పన్నీరూ - మోజుతీరా చిలికెదరా - మగసిరి పెంచెదరా; కుచ్చిళ్లు సవరించీ - మోజుదీర్చుకోవేమిరా - ముద్దుదీర్చవదేమిరా...' ఎంతసేపూ మన్మథగుప్త ఉన్నవైపే అందరిదగ్గరికీ తిరుగుతూ గంధం చిలుకుతున్న ఆమెని చూసి సింగారం రాయుడు ఆవేశంగా అన్నాడు. "నేన్నీకు ఆపడట్లేదేంటే, నీ టెక్కు దించేస్తాను ఏందనుకున్నావో".

    ఇందీవరం వెనక్కి తిరిగి సింగారానిక్కూడా చేతికి గంధం పూసి తిరస్కారంగా ఒక్క చూపుచూసి వేదిక మీదికి వెళ్లిపోయింది. భోగంమేళం నిర్వాహకులు యాలకులూ, మిరియాలూ, గంజాయి ఆకు కషాయం కలిపిన పాలు - అదే భంగు - తెచ్చి ఇవ్వగా సానులూ, వాద్యగాళ్లూ అందరూ కొసరి కొసరి తాగారు.

    పావుగంటకల్లా వీళ్లందరి నరాల్లోకి కొత్త హుషారొచ్చింది. గాయకుడు కొత్తగానం అందుకోబోతుండగా సింగారం కోపంగా వేదికమీదికొచ్చాడు. ఇందీవరంతో అన్నాడు "నేన్నీకు పదికాయితం ఈలేదనేగా నీ గునుపు... ఇదిగో ఇక్కడ నేలమీద పెడతన్నా. నువ్వు ఎనక్కి వాలుమొగ్గవేసి నోటితో అందుకోవాల" ఇట్లా అంటూ అతను పది నోటును నేలమీద పెట్టాడు.

    ఇందీవరం తన రవికె ముడిని ఓ సారి సరిచేసుకొంది.

    హార్మోనియంవాడు పాములవాడి నాదస్వరం వాయిస్తుండగా ఇందీవరం అటూ ఇటూ ఊగుతూ నెమ్మదిగా వెన్నక్కి వంగటానికి ప్రయత్నించింది. చేతులు వెనక్కి వాల్చి ఎట్లాగోట్లా ఆమె వెనక్కి వాలింది.

    నోటితో ఆ నోటును అందుకోబోతోంది. సింగారం రాయుడు తన లాల్చీ జేబులోంచి సూదిమొనల్తో ఉన్న చిన్న చిన్న కంకర రాళ్ళను గుప్పెడు తీశాడు.

    విల్లులా వంగి వున్న ఆమె నడుం కింద పోశాడు. చటుక్కున ఇంకో జేబులోంచి కాకి ఈక తీశాడు.

    దాంతో ఆమె బొడ్డు మీదా, రవికె పరికిణీ మధ్యా నిమరటం మొదలు పెట్టాడు. ఉండుండి ఆమె రొమ్ముల మధ్య చీలికలో నిమిరాడు. ఆ గిలిగింతకి ఇందీవరం పొట్ట అక్కళించుకుపోయింది. ఆమె చేతులలోనూ, కాళ్లలోనూ ఒణుకు మొదలైంది. కానీ ఆమె తమాయించుకుని, ఎట్లాగో యాతన పడి నోటితో ఆ పదినోటును అందుకొంది. నెమ్మదిగా పైకి లేచింది. నాయకసాని వైపు 'చూశావా వీడు ఎట్లాంటి హింసాత్మకపువెధవో!' అన్నట్టు చూసింది. ప్రేక్షకుల్లోంచి చప్పట్లు మోగిపోయాయి.

    నాయకసాని ముందుకొచ్చి సింగారం రాయుడితో "బాబూగారూ ముందుగా చెప్పాపెట్టకుండా నిండుసభలో ఇటువంటి పరీక్షలు పెట్టడం ధర్మమేనే! తాగిన ఆ భంగు కాసిందిగాని లేకపోతే నాట్యం చేసిచేసున్న నా పిల్ల కూలబడిపోయేది గదా" అంది.

    సింగారం "ఏంటే నువ్వు నాకు నీతులు చెబుతున్నావు...! నేను గాసట బీసట గాణ్ణనుకున్నావేంటి! ఈ మూడు పరగణాల్లో నా అములుకు తిరుగులేనోణ్ణి! నాతో పెట్టుకోమాక. అసలయినా మేళానికి ఒడిగట్టాక అన్నీ ఆడాల్సిందే అని తెలీదా! శహ్ నీదీ ఒహ మేళమేనా థూ!"

    నాయకసాని మొహం ముడుచుకుని వెనక్కు వెళ్లిపోయింది. తాంబూలాలు పుచ్చుకున్న సరసులబుగ్గలు పుణుకుతూ వాళ్ళదగ్గర నుంచి కట్నాలు దండుకుంటున్న మిగతా సానులు కూడా ఈ అరుపులకి వేదికమీదికి పోగయ్యారు. అంతా గుసగుసలాడుకున్నారు.

    నాయకసాని ముందరకొచ్చి అందరికీ నమస్కరిస్తూ "బాబూ మన్నించండి. ఇది మా ఆఖరి అభినయం" అంది.

    మళ్లీ ఇందీవరం ముందుకొచ్చింది.

    గానం మొదలైంది. 'చూడు ఓయమ్మా గడుసు గుంటడు - కన్ను కొడతాడెందుకు! రాజవీధిని దారికాచి రమ్మనంటాడెందుకు!' ఈ చరణాలనే మళ్లీ మళ్లీ పాడుతూ క్రమంగా వేగం పెంచుతున్నాడు గాయకుడు.

    ఇందీవరం వేదిక అంతా కలయదిరుగుతోంది. మధ్య మధ్య గుండ్రంగా తిరుగుతోంది. గుడారంలాగా ఆమె పరికిణీ పైపైకి లేస్తోంది. సింగారం వేదిక ఎక్కాడు.

    'ఎన్ని చెప్పినా పైట కొంగు - వందలనటాడెందుకు! తొంగి చూస్తాడెందుకు - తొంగి చూస్తాడెందుకు!' ఇందీవరం గుండ్రంగా తిరుగుతూ చటుక్కున తన పరికిణీని సింగారం తలమీదికి కప్పేసింది. నాలుగు క్షణాలయిందో లేదో కెవ్వున కేకవేస్తూ వెనక్కి పడిపోయింది. గానం ఆగిపోయింది.

    గొల్లుమంటూ జనం వచ్చి ఆమె చుట్టూ మూగారు. భోగం మేళం నిర్వాహకుల్లో ఇద్దరు గబగబా వేదికమీదికొస్తూ ఒకళ్లతో ఒకళ్లు అనుకున్నారు. 'ఈ రాయుడు చుట్టుపక్కల లేడుగదాని సంబరపడ్డాం. ఎప్పుడొచ్చి జచ్చాడో మారాముళ్ల నా కొడుకు'
    
    ఇందీవరంలేచి గబగబా తన విడిదిలోకి పరుగెత్తింది. ఆమె వాళ్లు ఆమెని అనుసరించారు.

    పావుగంట తర్వాత ఆ పక్కనే ఉన్న ఇంకో ఇంట్లో కోపంగా పచార్లు చేస్తున్న సింగారం తన మనుషుల్తో అంటున్నాడు. "అది పదిమందిలో నా మొహం మీద పరికిణీ కప్పుద్దా! దీని అంతు జూస్తానీ రేత్తిరి! పిలండ్రా మనోల్లందర్నీ"

    ఇంతలో సింగారం పాలేరు హడావిడిగా లోపలకొచ్చి "దొరా సానమ్మ తొడల్లోంచి రగతం కారతాంది. నేను గూడా జూశా, తవరు ఆయమ్మకి అక్కడ కొరికేశారంట గదా!" అన్నాడు. అది విని తెల్లబోయాడు సింగారం.

    ఊపుతగ్గి కుర్చీలో కూలబడుతూ అన్నాడు "నేను దాన్ని కొరకడమేంట్రా ఎదవ కొడకా! అదే నాకు ఊపిరాడకండా తొడల్తో నొక్కితేనూ! అసలికేంటంటే నాకు నోట్లో ముందుపన్ను కదుల్తా అప్పుడప్పుడు రక్తం కారతా వుంటది. అదిప్పుడు ఈ నొక్కుడికి అక్కడే ఎక్కడో ఊడి పడిపోయింది. ఆ రక్తం దానికి అంటింది గామాల!"

    "మరి ఆ సానమ్మ అరిచి పడిపోయింది గదా దొరా!"

    "వొఠ్ఠిదిరా ఏందో టక్కుటమారం జేసింది"

    "ఏమో దొరా ఆ సానమ్మకి ఆమూల గంటుపడిందంట. అద్సరే దొరా యీళ్లతో రాజమండ్రి నించి హెడ్డు కనిస్టీబు గుడా వొచ్చాడంట. ఏలూర్లో ఉన్నాడంట. ఈనకీ ఏలూరు హెడ్డు కనిస్టీబుకీ పొత్తంట. ఆళ్లొచ్చి ఇప్పుడే మిమ్మల్ని దీసికెళ్లి ఏలూరు సబ్‌జైల్లో ఏత్తారంట... రేపు పొద్దుటేలే ఈ మేళంవోళ్లంతా నూజివీడు ఎల్లి దివోన్ గోరికీ, రాజావోరికీ పితూరీ జేత్తారంట. నాయక సానమ్మ అందరికీ చెబుతా ఉంది."

    ఆవేశం పూర్తిగా దిగిపోగా సింగారం అన్నాడు.

    "కొంపదీసి నా పన్ను దాని తొడగ్గుచ్చుకున్నాదా! ఆ గుచ్చుకోవటం ఇప్పుడు పెద్ద కేసవుద్దంటావా... ఓరి దేవుడో, ఇప్పుడు నాకు పన్నుబోయె, పరువూబోయె ఏంది దారి? ఒరేయ్ యాడనన్నా సైకిలు జూడరా! నేను యెనకమాల కూసుంటాను. నువ్వు తొక్కు. బేగి రావల్లె. వట్లూరు స్టేషనుకెల్లి పోవాల! ఏ రైలుంటే ఆ రైలుకినన్ను బెజవాడకెక్కిచ్చెయ్యాల...కదల్రా యెదవా!"

    ఆ పాలేరు కంగారుగా బయటికి పరుగెత్తాడు.

    అయిదు నిమిషాల తర్వాత సింగారం ఆ చుట్టుపక్కల పత్తాలేడు. ఇంతవరకూ 'ఆడకూతురుకు ఎంత అన్యాయం జరిగిపోయిందో!' అని సానుభూతితో ఉన్న అక్కడి జనాల్లో సింగారం పారిపోవడంతో ఇందీవరం పట్ల కలిగిన ఆ సానుభూతి అమాంతం పెరిగిపోయింది.

    ఇదంతా గమనించిన మేళం నిర్వాహకులు భారంగా ఊపిరి పీల్చుకున్నారు. 'అయినా సరే ఈ విషయం ఇప్పుడే అసిమి తేలిపోవాలి అనుకున్నారు. నాయకసాని బృందాన్ని భోజనాలు చేయించారు. ఆదరా బాదరా జోడెడ్ల బళ్లమీదకెక్కించారు. ఆఘమేఘాలమీద శనివారప్పేటకు రెండోదిక్కులో ఉన్న ఏలూరు స్టేషనుకు తరలించేశారు. తెల్లవారుఝామున మూడుగంటల వేళ రాజమండ్రికెళ్లే రైలెక్కి కూర్చున్నాక నాయకసాని తనకూతురుతో అంది ."పచ్చకళ్ల సచ్చినోడికి కొర్రు మహ బాగ దించావే మా తల్లీ. నా బుర్రలోకి కనిష్టీబు కథ దూసుకొచ్చేసిందంటే అందుక్కారణం వేదిక దిగొచ్చి నువ్వు తొడల్లో పూసుకున్న ఎర్ర తిలకమేనే మాయమ్మా... అమ్మో అమ్మో ఏం తెలివి"

* * * 

    తాను ఆడదాన్నయి పుట్టానని ఏడుస్తూ కూర్చోకండా కాస్తంత తెలివి చూపించి ఏ మామూలు ఆడకూతురైనా దుర్మార్గాన్ని ఎట్టా ఎదుర్కోవచ్చో, ఒక సామాన్యమైన సానికూతురు ఇక్కడ చేసి చూపించింది. 

    అదీ అసలు జరిగిన కథ!

(స్వాతి సపరివార పత్రిక 25.6.2004 సంచికలో ప్రచురితం)         
Comments