పాప కోరిక - గరిశకుర్తి శ్యామల

[రచయిత్రి స్వగతం:

    సమాజంలో వ్యక్తులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ వుంటారు. అందుకే పెద్దలంటారు 'ఇంటికో మంటిపొయ్యి' అని. కాలం మారుతూవుంటే కూడా సమస్యల రూపం, సంఖ్య మారుతూ వుంటుంది, పెరుగుతూ వుంటుంది.

    ఒకప్పుడు 'సంతానం' విషయంగా (ఇప్పటికీ) ఎంతటి ప్రాధాన్యత వుంటుందో ఎన్నో కథలు వున్నాయి. పిల్లలున్న ఇల్లు కళకళలాడుతూ వుంటుంది. అన్ని విధాలుగా ఉండీ సంతానం విషయంలో లోపం కలిగినవాళ్ళు ఎంతగా బాధపడతారో, ఎన్ని మొక్కులు, నోములూ తీర్చుతారో జగమెరిగిన సత్యం. కానీ, రానురాను ఆహార సమస్య, జనాభా సమస్య, నిరుద్యోగ సమస్య, చదువుల భారం, వ్యయం వీటన్నిటి దృష్ట్యా ఈనాటి యువతీ యువకులు సంతానం విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఒక్కోసారి అతిజాగ్రత్త అనే చెప్పాలి. ఎందుకంటే పిల్లల్ని పోషించగల శక్తిగలవారు కూడా ఒక్కరే చాలు అంటూ బర్త్-కంట్రోల్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే..... కానీ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులయినప్పుడు ఆ ఇద్దరికీ చెరి ఒకరు వంతున ఇద్దరు సంతానం భారం కాదేమో!.....

    ఎందుకంటే ఈనాటి యాంత్రిక జీవితంలో ఎవరిని ఎవరూ పట్టించుకొవడం లేదు. అలాగే తల్లితండ్రులు పిల్లల్ని ఆడుకోవడానికై ఇరుగుపొరుగు ఇళ్ళకు పంపడం లేదు. తమ హోదాకు తగినవారు కాదని, పిల్లలు చెడిపోతారని..... ఇలా రకరకాల కారణాలు. ఈ కాలానుగుణంగా ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లల పక్షాన ఆలోచిస్తే వాళ్ళ బాధేమిటో తెలుస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఆఫీసు పనులు, అలసట, విసుగు, చికాకు వీటిల్లో మునిగే తల్లిదండ్రులు 'కార్తీక' లాంటి పిల్లల ఒంటరితనం తలచుకుంటే, పిల్లలపై వాళ్ళ ఒంటరితనంపై జాలి కలుగకమానదు.]
 

    సౌజన్య ధనవంతుల ఇంటి అమ్మాయి. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. 'పిజి' పూర్తి చేసిన సౌజన్యను బ్యాంకు ఉద్యోగికిచ్చి పెళ్ళి చేశాడు తండ్రి మన్మథరావు.

    పెళ్ళైన కొన్నాళ్ళకు సౌజన్యకు కూడా ఎల్.ఐ.సి లో ఉద్యోగం వచ్చింది. అందమూ, డబ్బూ కలిగిన తాను ఫారిన్ లో సెటిల్ అయిన వ్యక్తిని పెళ్ళడాలని కోరుకునేది సౌజన్య.

    కానీ, కూతురును విడిచి ఉండలేని బలహీనత, దేశాభిమానం కలసి సౌజన్యకు ఇండియా సంబందమే నిర్ణయించారు మన్మథరావు దంపతులు.

    ఒకప్పుడు సంతానం సౌభగ్యం, చెట్టుకు కాయ భారమా? లాంటి పదాలు తరచూ వినబడుతూ వుండేవి పెద్దలనోట..... తరువాత..... ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు అనే నినాదం స్థానం లో మేమిద్దరం..... మాకు ఒక్కరు అనే నినాదం ఈనాటి పద్దతి, అదీ నేడు మారి, ఒకరైతే ఎంతో ముద్దు. ఇద్దరు వద్దే వద్దు. ఈ పద్దతి నచ్చిన, మెచ్చిన వ్యక్తి సౌజన్య. అందుకే గొప్పగా 'మాకు ఒక్కతే పాప, ఏం చదవాలన్న చదివించగలం. ఎక్కడికి వెళ్ళాలన్నా (ఆమె దృష్టిలో విదేశాలు) పంపించగలం. మాకు డబ్బుకు ఏం కొదువ లేదు' అంటూ తెగగొప్పలు పదే పదే చెప్పుకోవడం సౌజన్యకు మామూలే.

    అంతేకాదు, ఇద్దరూ ముగ్గురూ పిల్లలున్న వాళ్ళంటే సౌజన్యకు విసుగు, చిరాకు.....

    'ఏం మనుషులో ఏమో..... కాలనుగుణంగా మనమూ మారాలి. లేనిపోని సెంటిమెంట్స్ లో ఇద్దరూ, ముగ్గురూ పిల్లలను ఎలా కంటారో?..... నాకు ఒక పాపకే విసుగు పుట్టింది' అంటూ ధనంలో పుట్టిపెరిగిన సౌజన్య ఆప్యాయతకు, అనురాగానికి దూరంగా ఆలోచిస్తూ మట్లాడుతుంది.

    ఇక, ఆమె భర్త ఆనందరావు భార్య ఎలా అంటే అలాగే..... తప్పు..... అతని అభిప్రాయాలు ప్రత్యేకించి చెప్పడు. చెప్పినా చెల్లవనేమో!.....

* * *

    ఉదయం పది గంటలు..... ఆఫీస్ లో తాను కూర్చునే కంప్యూటర్ చెంతకు వచ్చిన సౌజన్య పక్క సీటుకేసి చూసింది.

    రమాదేవి సీటు ఖాళీ.....

    "ఏమోయ్ నీరజా! ఈ రోజు రమాదేవి రాలేదు ఏమిటీ సంగతీ?"

    "ఏమో..... వాళ్ళ పాపకు జ్వరమట....."

    "ఆహా!..... అలాగా!....."

    ఆలోచిస్తున్న సౌజన్య "అవునూ!..... నిన్న కూడా రమాదేవి రాలేదు కదూ!....."

    "అవును....." నీరజ సమాధానం.....

    "నిన్నటికి నిన్న ఏదో సమాధానం చెప్పావు కదూ!....."

    సౌజన్య నీరజతో చాలా చనువుగా ఉంటుంది. తన ఇంటివిషయాలన్నీ చెబుతుంది. అందుకనే సౌజన్య నీరజను గుచ్చి, గుచ్చి అడగడం.

    'ఈవిడకెందుకో పరాయివాళ్ళ విషయాలు' లోలోన అనుకుంటూనే, "నిన్న వాళ్ళ పెద్దమ్మాయి బర్త్ డేనట....." నీరజ ఆగ్రహాన్ని అణుచుకుంటూ చెప్పింది.

    "అవును నీరజా! ఒక రోజు బర్త్ డే, మరో రోజు జ్వరం..... ఇలా రమాదేవి పిల్లలగూర్చి ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది కదూ".

    "పోదూ..... మనకేంటీ....." సంభాషణకు అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నంలో నీరజ సమాధానం.

    "అవునులే..... నీకు ఆ రమాదేవి అంటే చాలా ఇష్టంగా".

    "అబ్బే అదేం కాదులే....."

    "అదిసరేగానీ నీరూ!" (నీరజా, సౌజన్య దాదాపు ఒకే ఈడువాళ్ళు కనుక చనువుగా ఉంటారు) సౌజన్యకు ఎవరివైనా, చివరకు నీరజవైనా పర్సనల్ మాటర్స్ కావల్సినప్పుడు నీరజ పట్ల ప్రేమ పెరిగి నీరజ కాస్త నీరు అవుతుంది.

    "ఈ రమాదేవి ముగ్గురు పిల్లలతో ఎలా వేగిస్తుందే."

    "అదేమిటీ? అలాగంటావు? తల్లికి పిల్ల భారమా?"

    నీరజ మాటలకు వెక్కిరింతలా..... "అవునులే..... ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా" రాగయుక్తంగా అందుకుంది సౌజన్య.

    ఇంతలో..... ఆఫీసర్ అడుగుల టక టక వినబడగానే, ఇద్దరూ మాటలాపేసి పనిలో పడిపోయారు.

* * *

    లంచ్ అవరు..... నీరజా, సౌజన్య బాక్సులు విప్పారు. మళ్ళీ సౌజన్య దృష్టి రమాదేవి వైపు మళ్ళింది. ఆ ఆఫీస్ లో పనిచేసె నీరజకు ఇద్దరు పిల్లలు, రమాదేవికి ముగ్గురు పిల్లలు. తనకుమాత్రం హాయిగా, ఎంచక్కా ఒకేఒక్క పాప. ఎంతో హాయిగా, సుఖంగా ఉంది తనకు.

    ఈరోజు నీరజతో చెప్పి తనే గొప్ప అనిపించుకోవాలి.

    "అవును నీరూ! ఆ రమాదేవిని చూస్తే ఏమనిపిస్తుంది?"

    'పాపం రమాదేవి చాలా మంచిది, ఆమె గురించి ఈవిడకెందుకో?' లోలోననే అనుకుంటున్న నీరజ సౌజన్య స్వభావం తెలుసు కనుక..... "ప్రత్యేకంగా నాకేమి అనిపించదు. అవునూ, ఎందుకలా అడుగుతున్నావు?"

    "చూడు నీరజా! నీకేమో గాని నాకు మాత్రం రమాదేవిని చూస్తే చాల చిరాగ్గా ఉంటుంది....."

    అంత అందమైన సౌజన్య అప్పుడుమాత్రం వికారంగానే కనబడుతుంది నీరజకు. అంత అసహ్యంగా పెట్టింది ముఖం సౌజన్య.

    "ఎందుకట!" నీరజ మాటలకు ఇక అందుకున్నది సౌజన్య.

    "ఎప్పుడు చూసినా పిల్లల గోల..... మొన్నటికి మొన్న వాళ్ళ బాబుకి మెడిసిన్ లో సీటు వచ్చిందా! తమకు చదివించే స్తోమత లేదని మామూలు డిగ్రీ చదివిస్తున్నానని చెప్పింది. ఆఫీసు అవగానే త్వరగా ఇంటికి వెళ్ళాలని ఎప్పుడూ ఆరాటపడుతుంది. అక్కడికి లోకంలో తనకే పిల్లలున్నట్టు గొప్పగా చెబుతుంది, మనకు మాత్రం లేరా ఏమిటి పిల్లలు?"

    "చూడు నీరజా! మాకు ఒక్కతే పాప, ఎంతో ఆనందంగా ఉన్నాము. మా పాప ఏది అడిగినా కొనిపెడతాం..... పెరిగి పెద్దయ్యాక ఏది చదువుతానన్నా చదువిస్తాం. అంతెందుకు? మా పాపకు ఫారిన్ సంబంధమే చేస్తాం. ఒక్కరే పిల్లలున్నవాళ్ళకు ఉన్న సుఖం ఎక్కువమంది పిల్లలున్న వాళ్ళకెక్కడిది!" సౌజన్య మాటల్లో తనకు ఫారిన్ వెళ్ళలన్న కోరిక తీరకపొయినా, తన కూతురి ద్వారనైనా నెరవేర్చుకోవాలనే ఆశ వ్యక్తమైంది.

    నిజానికి సౌజన్యకు మధ్యతరగతి వారన్నా, బీదవాళ్ళన్నా ఎంతో చులకన. తనతో ముక్తసరిగా ఉండే రమాదేవంటే నిరసన. తనను మెచ్చుకోదనే కోపం.

    సౌజన్య తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు. అలాగే ఆనందరావు ఒక్కడే సంతానం వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళకు బందువుల తాకిడీ తక్కువే. ఎవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు స్నేహితులూ, పరిచయస్తులూ రావటం తప్ప బందువులంటూ ఆ ఇంటికెవరూ రావటం సౌజన్య, ఆనందరావుల ముద్దుల కూతురు ఎప్పుడూ చూడనేలేదు.

    ఆనందరావు అహంకారంలో సౌజన్యకేమాత్రం తీసిపోలేదు. ఆఫీసులో అతని ధోరణి ఆమెలాగే ఉంటుంది. డబ్బున్నదన్న అహం, ఒక్కతే పాప అన్న గొప్ప ఆ దంపతులిద్దరిలో సమానమే.

* * *

    ఆఫీసులో ఎవరికి వీలైనంతగా వారు గొప్పలకుపోయి అనుభవించే ఆనందం ఆ రోజు సాయంత్రం తమ ఇంట్లో కార్తీక ప్రవర్తనతో నీరుగారిపోయింది. ఇంట్లో అడుగుపెట్టిన దంపతులిద్దరూ కార్తీక ప్రవర్తన చూసి కంగారు పడ్డారు. ఈజీ చైర్లో మోకాళ్ళపై తల ఆన్చి పడుకున్న కార్తీక ధోరణి వాళ్ళకు వింతగా అనిపించింది. "పాపా కార్తీ! ఏంటమ్మా ఏం జరిగింది?" అంటూ ఇద్దరూ ఒకేసారి అడిగేసరికి, కార్తీక ఒక్కసారిగా "మమ్మీ! డాడీ!" అంటూ బోరుమంది.

    "ఏమైందమ్మా? ఏమిటి విషయం? ఎందుకు ఏడుస్తున్నావ్?"

    "మమ్మీ నాకు ఆడుకోవడానికి ఓ తోడు కావాలి. ఓ చెల్లిగానీ, తమ్ముడుగానీ వెంటనే కావాలి."

    ఎన్నడూ లేంది..... కార్తీక నోట ఆ మాటలు విని దంపతులిద్దరూ నివ్వేరపోయారు.

    కార్తీక ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకొస్తాననడం, తన స్నేహితుల ఇంటికి వెళతాననడం సౌజన్యకు అలవాటే. అది ఇష్టంలేని సౌజన్య ఏదో ఒకటి చెప్పి కార్తీకను వారించేది. అవసరమైతే తమకంటే తక్కువ వారితో స్నేహం చేయకూడదని చీవాట్లు పెట్టేది. అయినా కార్తీక ఇంతగా బాదపడలేదు.

    సౌజన్య తమాయించుకొని కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అసలేం జరిగింది? ఎందుకింతలా బాదపడుతున్నావు? అనునయిస్తూ అడిగింది.

    కార్తీక వెక్కి వెక్కి ఏడుస్తూ..... "మమ్మీ! మా ఫ్రెండ్ రాధీ లేదు, రెండు రోజులుగా స్కూలుకి రావడం లేదు. వాళ్ళింటి నిండా బందువులేనట..... ఎంత సంతోషంగా చెప్పిందని. మనకలా ఇంటికి వచ్చే బందువులే లేరు. ఇద్దరూ ఆఫీసుకు వెళతారు, రాగానే ఎవరిపని వారిది. నన్నసలు పట్టించుకోరు. స్కూల్నుండి రాగానే నేను ఎవరితో ఆడుకోవాలి? నా స్నేహితులను కూడా మీరు ఇంటికి రానివ్వరు, అందుకని నాకర్జెంటుగా చెల్లిగానీ, తమ్ముడుగానీ కావాలి తెచ్చిపెట్టండి."

    పాప మాటలకు సౌజన్య తల వేడెక్కిపోయింది. తానెప్పుడూ పాపలా ఆలోచించలేదు. ఒక్కసారిగా రమాదేవీ, నీరజ ముఖాలు విజయగర్వంతో తనను వెక్కిరిస్తూ కనిపించాయి. తానెప్పుడూ నీరజను, రమాదేవినీ అధిక సంతానం అని చులకనగా చూసేది. కానీ వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు ఇలాంటి సమస్య ఎదురుపడలేదు. నిజంగా తామిద్దరూ బాగా సంపాదిస్తున్నారు. పాపతోపాటు మరో సంతానం ఉంటే ఎంత బాగుండేది. ఇద్దరం తొందరపడ్డాం, పాపను వొడిలోకి తీసుకుని ఆలోచనలో పడింది సౌజన్య.

    ఏమైనా పరిస్థితి తమ చేయి దాటిపొయింది. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, పాపను ఓదార్చడం తప్ప.

Comments