పాపం! నారాయణరావు - కన్నోజు లక్ష్మీకాంతం

    "ఏమిటండీ! ఫ్రెండింట్లో దావత్‌కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి?" ఆటో దిగుతూనే చుట్టూ వున్న వాతావరణాన్ని చూస్తూ గాభరాగా అడిగింది సుశీల. 

    ముసిముసిగా  నవ్వుతూనే  ఆగమంటూ సైగచేసి, ఆటోవాడికి డబ్బులిచ్చి పంపేసి, ఆవిడ భుజం మీద ప్రేమగా చెయ్యాసి నడవమన్నట్టు అడుగు ముందుకేశాడు నారాయణరావు. 

    “అమ్మ నీయమ్మ… ముసిలోడా…!” అని గొణుక్కుంటూనే  ఇరవై అడుగులు ముందుకెళ్లిన ఆటోనాపి, దిగి మళ్లీ వెనక్కి చూశాడాటోవాడు. 

    ఏమిటో అర్థం కాలేదు నారాయణరావుకు. 

    “సార్, సారం”టూ గబగబా వచ్చి మీ కర్చీఫ్ ఆటోలోనే మర్చిపోయారంటూ ఓ కర్చీఫ్ అందివ్వ బోయాడు.

    'థాంక్ యూ!' అంతూ అందుకోబోయి ప్యాంట్ జేబు తడుముకుంటే అది జేబులోనే వున్నట్టనిపించి 'అది నాది కాదం'టూ చెప్పి ఆవిణ్ణి మరీ దగ్గరకు లాక్కొని ముందుకు నడుస్తూ "దొంగ రాస్కెల్, అవకాశమొస్తే, సూట్‌కేసుల్తోనే మాయమయ్యే మహానుభావులుండగా వీడేమో...కావాలనే వెనక్కొచ్చాడం"టూ తిట్ల దండకం మొదలెట్టాడు.

    "ఆటోలో కూచున్నంత సేపూ మీ పచ్చి బూతు జోకులన్నీ వింటూ, పిచ్చి పిచ్చిగా మీరు చేసే పనులన్నీ వాడద్దంలోంచి చూసుండొచ్చండీ, అందుకే..."

    "కుళ్లి కుళ్లి చావనీ వెధవ" పళ్లు కొరుకుతూ నడుస్తున్నాడతడు.

    వచ్చిన బేరం పోగొట్టుకుని అదేపనిగా వాళ్లను చూస్తూ కాసేపలాగే ఆటోలో కూచుండిపోయాడు వాడు.

    "ఏమిటో ఈ కాలం వెధవలే అంత. ఏ పనీ సరిగా చేయడం రాదు గానీ, ఎదుటివాడి చేస్తే మాత్రం ఓర్వలేడు" ఆవిడ కళ్లల్లోకి చూస్తూ ముసిముసిగా నవ్వుతూనే నడుస్తున్నాడతను.

    "కాలేజీలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పటికన్నా, ఆఫీస్‌లో ప్రమోషన్ వచ్చినప్పటికన్నా ఆనందంగా వుందీరోజు. నీకో జోక్ చెప్పనా సుశీలా..." అంటూనే జోకేశాడు.

    "మనలాగే ఒక డాక్టరుగారు భార్యతో కలిసి ఇలాగే పార్క్‌లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎదురుగా ఒకావిడ అదోలా నవ్వుకుంటూ వచ్చి, వాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లిపోయింది.

    'ఏమండీ...మిమ్మల్ని చూస్తూనే విష్ చేసినట్టు నవ్వుకుంటూ పోతుందావిడ. మీకేమైనా పరిచయమా...' అంది భార్య.

    'అవునోయ్, వృత్తిరీత్యా...' అన్నాడు డాక్టర్.

    'అంటే... మీ వృత్తిరీత్యానా... లేక... ఆవిడ వృత్తిరీత్యానా...' అంటూ అతడిని సూటిగా చూసిందట" పగలబడి నవ్వుతూనే చెప్పడంతో ఆవిడ కూడా నవ్వకుండా వుండలేకపోయింది.
 
    "ఆఫీసులో వున్నన్ని రోజులూ అందరితో ఇలాంటి జోకులే చెప్పేవారు కావచ్చు."

    "ఛఛ! మగవాళ్లతో ఇలాంటి జోకులు చెప్పేవాణ్ణి కాదులే..."

    "ఆ... అంటే..."

    "ఆ... అంటే అమలాపురం, ఇ... అంటే ఇచ్ఛాపురం..."

    "అబ్బబ్బబ్బ. మాటమాటకోపాటైనా, లేక జోకైనా వుండాలన్న మాట"

    "కాకపోతే ఏమిటోయ్. జోకులకు ఆడవాళ్లయితేనే హాయిగా నవ్వుతారు మరి."

    "ఎందుకు నవ్వరూ... నవ్వుతారు మరి. వాళ్ళాయన ఇలాంటి జోకులేసి నవ్వించడు గదా..."

    "అబ్బ! ఏం చెప్పావోయ్"

    "సాల్లెండి సంబడం. నవ్వుతున్నారు గదాని..."

    "మా ఆఫీస్ లేడీసంత ఆరోగ్యంగా వున్నారంటే వాళ్లు నవ్వడమే అందుకు కారణం మరి."

    "టిన్ టిన్‌న్‌న్... నారాయణరావెక్కడున్నాడో నవ్వడమక్కడుంటుంది. టిన్ టిన్..." ప్రకటనలా చెప్పేసరికి మళ్లీ పగలబడి నవ్వింది సుశీల.

    "ఏయ్..ఏయ్..ఏయ్... ఇదేమన్నా పిల్లాపీచూ లేని ఒంటికాయ సొంటికొమ్ములాంటి దంపతుల బెడ్ రూమనుకున్నావా... ఏంది!" చిన్నగా నడుంమీద గిల్లుతూ అన్నాడతడు.

    ఉలిక్కిపడుతూనే "నిజమేనండోయ్" చేతిని మూతికడ్డంగా పెట్టుకుంది. 

    "అబ్బ! ఉలికిపాటు మాత్రం ఇంకా కిలోల లెక్కన ఉందోయ్ - అదృష్టవంతురాలివి."

    "ఆ... మీరు మాత్రం కాదా! రోజూ నిత్యపెళ్లికొడుకులా తయారై వయసు కనపడకుండా చేస్తుకుంటారు గదా!"

    "అస్సరే! కాస్సేపిక్కడ కూచుందామా..." అంటూనే ఆవిడను కూచోబెడుతూ తనూ కూచున్నాడు.

    "ఏమోనండీ...నాకేమీ అర్థంగావట్లేదు" కూచుంటూనే అంది ఆవిడ.

    "ఏ రోజైనా, దేనిగురించైనా... అర్థమయిందని చెబితే అయ్యో... ఈరోజు అర్థంగాలేదా... అని అడిగేవాణ్ణి."

    "ఆహా... అలాగా... "

    "అవును మరి. రాజుగారు రాణిగారిని ఈరోజు ఎందుకిక్కడికి తీసుకొచ్చాడూ... అంటే... తాకుతూ పక్కపక్కనే కూచుని ఆప్యాయంగా, ఆర్ద్రంగా, ప్రేమగా, ముద్దుగా కాసేపు మొగుడూ పెళ్లాల ముచ్చట్లు మాట్లాడుకోవచ్చని. అర్థమైందా...!"

    "అయ్యో! ఇదేం చోద్యమండీ. ఇక్కడికి చేరీ..."

    "అవును మరి. మనది యావరేజ్ కుటుంబం గాబట్టి, ఇల్లున్న సపరేట్ బెడ్‌రూముండదు. తిరుపతిలో రూం దొరక్కముందు మూటా ముల్లె పక్కనెట్టుకుని పడుకున్నట్లుగానో, నైట్ సర్వీస్ లేటన్నందుకు బస్టాండ్‌లో పడుకున్నట్టుగానో... అందరి భోజనాలు అయ్యాక అక్కడే పక్కలు సర్దుకోవాలి. హాల్ కం డైనింగ్ కం బెడ్‌రూం అదే కాబట్టి.

    బాధనిపించినప్పుడు చెప్పుకోవడానికీ, సంతోషం కల్గినప్పుడు మనసారా నవ్వుకోవడానికీ సెపరేట్ గదులుండాలి మేడాం. అయినా... అలాంటి వసతుల్లేని మనలాంటి జీవితాలే చాలాచోట్ల కనబడుతుంటాయి కాబట్టి బెంగపడాల్సిన పనేమీ లేదనుకో..."

    "ఇవన్నీ ఇప్పుడెందుకండీ..."

    "గత చాలా ఏళ్లుగా ఆలోచిస్తున్నందుకే, రిటైర్మెంటు తర్వాత ఇదిగో... ఇప్పుడు దొరికింది అవకాశం."

    "బాగుంది ముసలితనానికి కుసుమగుడాలనీ..."

    "ఈ ఆప్యాయతలన్నీ ముసలితనానికే కావాలి డియర్..." అంటూనే ఆవిడ తొడమీద తలపెట్టుకుని ఎంచక్కా ఆవిడ మొహంలోకి చూస్తూ పడుకున్నాడతను.

    "అబ్బ! వద్దండీ... నాకు సిగ్గేస్తోంది..."

    "కాసేపా సిగ్గంతా బ్లౌజ్‌లోనో, బ్యాగ్‌లోనో పెట్టేస్తే నీకో మాంచి జోక్ చెబుతానంటూనే 'డాక్టర్‌గారూ! ఫ్యామిలీ ప్లానింగాపరేషన్ ఎవరు చేసుకుంటే మంచిందండీ...' అని అడిగితే ,'ఇద్దరూ చేసుకోవడమెందుకైనా మంచిదన్నాట్ట'డాక్టర్."

    "అయ్యో రామ..." చాలా కాలం తర్వాత మనసారా నవ్వుతోంది సుశీల.

    "నువ్వు నవ్వుతున్నప్పుడు నిజంగా... నాకు చాలా ఆనందం కలుగుతుందోయ్. అయినా... 'అసలు' సంగతి తర్వాత ఆలోచిద్దాం గానీ ముందీ 'వడ్డీ' మాత్రం తీసుకో అంటూ ఎక్కడెక్కడో గిల్లుతూ, ముద్దులు పెట్టేస్తున్నాడు నారాయణరావు.

    "వద్దండీ... ఎవరైనా చూస్తే బావుండదు."

    "పిచ్చిదానా...! పార్కులోకొచ్చేదే అందరూ చూడ్డానికి. ఎవరూ చూడకుండా ఏం థ్రిల్లుంటుంది చెప్పు. అయినా... ఇదేమన్నా బాత్‌రూమా... బెడ్‌రూమా... ఎవరూ చూడరనడానికి. అందుకనీ..."

    "పబ్లిక్‌గా అన్ని పనులు చేసుకోలేంగదండీ..."

    "అన్నీకాదు కానీ... ఈ.. ఈ.. అల్లుడెప్పుడొస్తాడని అడుగుతోంది పిన్నీ. బన్ని... బన్నీ...బన్నీ...బన్నీ..."

    నోటికి చెయ్యి అడ్డం పెట్టుకున్నా నవ్వాగడం లేదు.

    "ఏంటండీ... ఇంత... హుషారుగా వున్నారూ...!"

    "అమ్మగారు కరుణిస్త అయ్యగారెందుకుండరు మరి"

    "అవునా..."

    "అవునుగానీ... నువ్వు కూడా ఓ జోక్ చెప్పబ్బా. పెళ్లైన కొత్తలో చాలా చెపుతూండేదానివి గదా... మరిప్పుడేమైందీ..."

    "పెళ్ళైన కొత్తలో చేసినవన్నీ ఇప్పుడు చేయాలంటే... కుదుర్తుందాండీ..." అదోలా చూస్తూ అంది ఆవిడ.

    "ఆ...ఆ...ఆ... ఏం సేస్తున్నావు..."

    "అవునండీ. అన్నీ అప్పటిలాగే..."

    "కాదులేవోయ్. ఒప్పుకుంటున్నానుగా మరి. సరే! ఓ జోకైతే చెప్పు."

    "భార్యా భర్తలిద్దరూ..."

    "అంటే ఓ భార్యా ఇద్దరు భర్తలూనా..."

    "ఛఛ...అలాగాదండి. భార్య భర్త ఇద్దరూ కలిసి విడాకుల విషయంలో దెబ్బలాడుకుంటున్నప్పుడు 'అసలు నేనేం చేస్తున్నానని విడాకులంటున్నావే' అన్నాడట భర్త కోపంతో.

    'అదేమరి... ఏం చేయడంలేదనే... విడాకులంటున్నానండీ...' అందిట భార్య."

    గభాల్న లేచి కూచుని తెగ నవ్వేస్తూ 'మొగుడూ పెళ్లామిలా జోకులేసుకుంటూ సరదాగా వుంటే అంతకన్నా ఆనందమింకేముంటుందోయ్' అంటూ చటుక్కున ముందుకొంగి బుగ్గను కొరికేశాడు.

    "అబ్‌బ్‌బ్బా..." అంది ఆవిడ.

    "హలో...హలో... సార్... ఏమిటీ సంగతీ..."

    "... ... ..."

    "హలో... మిమ్మల్నే..."

    గభాల్న తేరుకునీ, అక్కడ నిల్చున్న ఆ ఇద్దర్ని చూసి గాభరా పడ్డారా మొగుడ్స్-పెళ్లామ్స్.

    కాసేపటివరకూ నోట మాటరాలేదు వాళ్లకి.

    "ఏమయ్యా పెద్ద మనిషి. ఇంత వయసొచ్చినా సిగ్గులేదయ్యా! మేం మఫ్టీలో వున్న పోలీసులం" అంటూ దూరాన వున్న జీపును చూపించారు.

    "వయసు కనబడకుండా... అని ఇంతకు ముందే సుశీల అంటే... వీడేమో ఇంతవయసూ... అంటాడేంటి వెధవా..." అని గొణుక్కున్నాడు.

    "ఏయ్... నిన్నే..." ఇంకా పోలీస్ భాష మొదలు కాలేదు.

    "ఏమైందండీ... ఏమిటీ..." లేచి నిల్చుంటూనే అడిగాడు నారాయణరావు.

    "ఏమిటా... సరుకు దొరికితే చాలు పార్కులనీ, సినిమాలు షికార్లనీ ఎంటేసుకుని తిరిగీ, ఆనక ఇంటికెళ్లేమో ఆఫీసు నుండి అలసిపోయి వచ్చినట్టు పే...ద్ద పోజు."

    "ఏం మాట్లాడుతున్నారు సార్. మేమిద్దరం భార్యాభర్తలం. అర్థమైందా..." ఆవిడను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నారాయణరావు.

    "ఛట్. ఇక్కడ పట్టుబడ్డ ప్రతి నాకొడుకూ చెప్పే పాత మాటే అది. లేకపోతే...నేను కిరాయికి తెచ్చుకున్నానని ఏ మొగోడు జెబుతాడూ...ఊ... ఆడదీ జెప్పదు. అర్థమైందా..."

    "ఏయ్ మిస్టర్. అనవసరంగా నోరు పారేసుకోకు. ఈమె నా భార్య. నేనీమధ్యనే రిటైరయ్యాను. మా పెద్దబ్బాయేమో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్నబ్బాయేమో..."

    "హలో... మీ కథలినడానికి మమ్మల్నిక్కడ డ్యూటీ చెయ్యమన్లేదు మిస్టర్...ర్...ర్...ర్ర్. అవన్నీ పోలీస్ స్టేషన్లోనో...లేక కోర్టులోనో చెప్పుకోవాలి. పెద్దవాడివని మర్యాదిస్తున్నాం గానీ... లేకపోతేనా..."

    "ఏంటండీ...ఏమిటిదంతా...ఛఛ..."

    "కాసేపాగు సుశీ. వీళ్ల సంగతేంటో చూద్దాం..."

    "ఏమిట్రా చూసేది నా తొక్క. లాక్కుపోయి జీపులో కెక్కించనందుకేమో తెగ మాట్లాడేస్తున్నావ్" మధ్య మధ్యన తిట్లలాంటి హిందీ పదాలు దొర్లుతున్నాయి.

    "వాట్ నాన్సెన్స్...యూ... ఆర్..."

    "ఛల్ బే ఛల్, అయన్నీ పోలీస్ టేశన్ కాడ..."

    "అంటే..."

    "ఏం...సమజ్‌గాలేదా...! నడూ బే నడూ..."

    "అయ్యయ్యయ్యయ్యో... ఏం మాటలండీ"

    "ఏం మర్యాదగ బిల్సి జీబులో గూకోబెట్టాల్నా ఏంది" వికృతంగా నవ్వాడు రెండోవాడు.

    "చూడు బాబూ...ఏదైనా చలానుంటే రాయి. ఫైన్ గట్టి రేపు కోర్టుకొస్తాంగానీ పిచ్చిగా మాట్లాడుతూ మమ్మల్ని హింసించకండి" ఏం మాట్లాడాలో తోచడం లేదు నారాయణరావుకు.

    "ఈ కేసులకు చలానుండది పెద్దమనిషీ"

    "మరి..."

    "ఇంత బతుకూ బతికి ఇదేంటండీ. పిల్లలకు తెలిస్తే పరువుబోద్ది. ఎంతో కొంత వాళ్లకిచ్చి వెంటనే వెళ్లిపోదామండీ..." చెవి కొరుకుతోంది ఆవిడ.

    ఇష్టం లేకున్నా జేబులో నుండి రెండొందలు తీసివ్వబోయాడు.

    "ఏం లంచమిస్తున్నావా..."

    "కాద్సార్. నిజంగా మేం భార్యాభర్తలమండీ..."

    "కొంపలేదా... ఇక్కడెందుకీ పిచ్చి వేషాలు."

    "అరేయ్ ఆడ సారు జూస్తుండడు. వీళ్లను దీస్కొని జీప్‌కాడికి బోదాం పా..."

    "ఇంకో వంద వాళ్ల మొకాన తగలేసి జల్ది ఇక్కడ్నుంచి పోదాం పదండీ..."

    "ఐదువందలిచ్చి ఫౌరన్ పార్క్‌నుంచి బయట పడండి. లేకపోతే..."

    "డబ్బుల్లేవయ్యా బాబు..."

    "అడ్డమైన పనులకూ, ఆ తర్వాత రోగాలకూ వేలకు వేలు పెట్టొచ్చుగాని, యిజ్జత్ గాపాడుకోనీకి..."

    మరో రెండొందలు కలిపి షేక్‌హ్యాండిస్తున్నట్టుగా వాడి చేతిలో పెట్టి గబగబా అక్కడ్నుండి బయటపడ్డారా మొగుడ్స్ - పెళ్లామ్స్.

    "తన సొమ్మే అయినా దాచుకుని తినమన్నారు పెద్దలు. కాకపోతే... ఏం చోద్యమండీ... యిది."

    "అనవసరంగా భయపడ్డామేమో సుశీ?"

    "భయం కాదండీ - ఆ పోలీస్ స్టేషనూ,కోర్టూ... ఛీఛీ... చుట్టాలకు తెలిస్తే విలువేముంటుందండీ..."

    "అందుకే ఇచ్చామనుకుందామా...!"

    "మీరేం ఫీలవకండీ..."

    "ఫీలింగ్ కాదు సుశీ! కొన్ని జన్మలిలాగే వుంటాయేమో మరి... ఇంట్లో కుదరకున్నా బయటకెళ్లి మాట్లాడుకునే అదృష్టం గూడా వుండదు మరి. బ్రహ్మచర్యం మంచిదే అయినా, పెళ్లై కూడా, విధిలేక, మనలాగ బ్రహ్మచర్యం పాటించడం అంతకన్నా మంచిదేనేమో...!" జీరబోయిన గొంతుతో నిర్లిప్తంగా మాట్లాడుతున్న నారాయణరావుకు మరీ దగ్గరగా నిల్చుని "ఛఛ... మీరలా బాధగా మాట్లాడొద్దండీ..." అంటూ బుజ్జగిస్తోందావిడ.   

* * *

    పొద్దున్నే పేపరు చదువుతున్న నారాయణరావుకు టీ తెచ్చిచ్చిన వాళ్లావిడను ఓ నిముషం ఆగమని చెప్పి ఓ వార్త చూపించాడు.

    - మఫ్టీలో వున్న పోలీసులమని చెప్పి, ప్రేమికులను బెదిరించి...డబ్బూ, బంగారు నగలు దోచుకుంటున్న నకిలీ పోలీసుల అరెస్ట్ - 

    అంతే...

    నవ్వాలో, ఏడ్వాలో అర్థంగాలేదిద్దరికీనూ...

(పత్రిక మాసపత్రిక మార్చి 2006 సంచికలో ప్రచురితం)   
Comments