పరిధి దాటిన వేళ... - పి.వి.బి.శ్రీరామమూర్తి

    
అసహనంగా పక్కమీద దొర్లుతోంది వర్ధనమ్మ. అప్పుడే మెలకువ వచ్చి నీళ్ళు తాగటానికి లేచిన భర్త "ఏంటీ? ఇంకానిద్రపోలేదా? లేక - రేపు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి - మాకందరికీ నిద్రలేకుండా చెయ్యాలని ఆలోచిస్తున్నావా?"
    
    వర్ధనమ్మకి ఆమాటలు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అనిపించాయి. కోపం బుసలుకొడుతోంది. దుఃఖం కెరలికెరలి వస్తోంది.
 
    "ఇవాళ అలవాటయిందిగా. రేపెళ్ళినా అదెక్కడికిపోతుందిలే అని గుండెమీద చెయ్యేసుకుని పడుకుంటారు" అంది.
 
    "అంటే, వెళ్తావన్నమాట. మరోసారి అలాటి పనులు మాని కళ్ళు మూసుకు పడుకో!" అని పక్కమీద వాలాడు. వెళ్ళిన వెంటనే గురక తియ్యటం మొదలెట్టాడు.
 
    వర్ధనమ్మకెంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు.
 
    కారణం-
 
    ఒక ప్రక్క గూడ్సుబండి పరుగులాటి గురక. ఇది తనకు చాలా సంవత్సరాలుగా అలవాటే. రెండోది - పిండి మిల్లులాటి సీలింగ్ ఫాన్ చప్పుడు. మూడో కారణం వీటన్నింటికంటే ముఖ్యమైనది!
 
    ఏమిటంటే -
 
    ఇవాళ జరిగిన సంఘటనే!
 
    కానీ అందులో తన తప్పేముంది?
 
    బీపీ మాత్రలు అయిపోయాయి. భర్తకి నిన్న చెప్పింది. బజారు వెళ్ళిన మనిషి మరిచిపోయి వచ్చాడు. పిల్లలకు తీరిక లేదు. కోడలికి అవసరం లేదు. భర్త జపంలో ఉన్నాడు. తనకేం చేయాలో తోచలేదు. తనెప్పుడు గుమ్మం వదల్లేదు. అయినా ఇది మహాపట్నం! తను ఎప్పుడూ ఎరుగని ఊరు. అయినా మాత్రలు అవసరం.
 
    తన అవసరం వున్న భర్తకే తనపై ప్రేమలేదు. అతను కన్న పిల్లల కెందుకుంటుంది?
 
    అందరి ప్రశ్న ఒక్కటే!
 
    'చెప్పకుండా ఎక్కడి కెళ్ళావ్? ఎందుకెళ్ళావ్?' కూతురూ, కొడుకూ, కోడలూ - కట్టుకున్న భర్తా అందరికీ అర్థం కానిది!
 
    'ఈ మహానగరంలో తను తప్పిపోయినా, ఏ బస్సు కిందనో - లారీ కిందనో పడి మరణించినా - తామేం కావాలి? మాకు చెప్తే మేం తేలేమా? ఏనాడయినా నీవు గుమ్మంకదిలెళ్ళావా? మేం లేమా?' అన్న ఆప్యాయత వాళ్ళ ఆందోళనలో వుంటే తనెంత ఆనందించేది?
 
    కానీ -
 
    వాళ్ళ ప్రశ్నలో ఆప్యాయత లేదు. అనురాగం లేదు. ప్రేమ లేదు. గుండె తడీ లేదు. భర్త తిడుతోంటే - వాళ్ళూ తమ పరిధిలో గొంతు కలిపారు. అంతేగానీ - "అమ్మ యంత్రంలా పనిచేసి అరిగిపోయింది. అమ్మలో ఓపిక లేదు ఏదో వెళ్ళాలనిపించింది. వెళ్ళింది. అమ్మని తిడతారేం? తప్పు మనది అని ఒక్కరూ అనలేం?
 
    కూతురయినా - "అమ్మా! కొన్నాళ్ళు నా దగ్గరకొచ్చి విశ్రాంతి తీసుకో" అని అన్లేదు.
 
    "వర్ధనీ. పొరపాటయిపోయింది. ఇంకెప్పుడూ నిన్నేం అనను. నువ్వు లేకపోతే నాకు తిండి సాయించదు" అనైనా అనలేదు భర్త.

    వాళ్ళందరి ఆందోళనా ఒకటే!
 
    తనకేమయినా ప్రమాదం జరిగితే - 'ముసిల్దాన్ని సరిగా చూళ్ళేదు' అని నలుగురూ అంటే వాళ్ళ పరువేంగావాలి? - అదీ వాళ్ళ బాధ.
 
    తనకంటే తన ఆరోగ్యం కంటే వాళ్ళకి వాళ్ళ పరువు మర్యాదలే ఎక్కువ.
 
    తనకింట్లో మర్యాదలేం జరిగిందని?

    ఆనాడు -

    భర్త పరాయి స్త్రీ వలలో పడుతున్నాడనీ తెల్సి నిలదీస్తే అపరాధం అయిపోయింది! తింటోన్న అన్నం వదిలేసి కంచంలో చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడు!

    అత్తగారు తననే సాధించింది.

    "వాడు మగాడే! నాలుగు చోట్ల తిరగాల్సినవాడు! ఎవర్తో వల్లో వేసుకోటానికి ప్రయత్నిస్తుంది. అలా జరక్కుండా జాగర్తపడాల్సింది నువ్వే! అలా చేసుకోకపోవటం నీ తప్పే! ఆడదానిలో లోటుంటే మగవాడు ప్రక్కదారి పడతాడు!

    అయినా -

    భోజనం చేస్తున్నప్పుడు సతాయిస్తే వాడింకేం తింటాడు?" అని!

    తండ్రీ అంతే! 

    పురిటి కెళ్ళినప్పుడు తల్లికి చెప్తే ఆమె కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తండ్రి మాత్రం "అలాటి విషయాలు అది మనకి చెప్పనూ కూడదు. మనం అంతగా పట్టించుకోనూరాదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అయినా అల్లుడు దీన్ని వదిలేస్తానన్లేదు. వచ్చి ఎంతో సరదాగా గడిపి వెళ్ళాడు. లేనిపోని వెధవాలోచనలతో మనసు పాడుచేసుకోవద్దని చెప్పు. ఇది సహనం పాటిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి" అన్నాడు.

    తండ్రి అన్నట్లే

    పరిస్థితులు చక్కబడ్డాయి. అది అతని మంచితనం వల్ల కాదు. తాను మనిషేగానీ - మనసులేని కాయంగా బ్రతకడం వల్ల. పగలల్లా అలుపెరుగని పనిచేసి పిల్లల్నీ భర్తనీ కంటికి రెప్పలా చూసుకుంది. పాయసంలో పురుగుల్ని పక్కన పడేసింది. చేదు కూడా మందయితే భరించాలి కదా!

    ఏ రాత్రో వచ్చిన భర్తకు అన్నం పెట్టేది. అతను తిన్న తరువాత తినేది. 'నాకోసం నువ్వెందుకు నిద్రపాడు చేసుకుంటావ్?' అంటాడేమో కరిగి పోవాలనుకుంది. కానీ ఫలితం శూన్యమే! కనురెప్పలు పడిపోతున్నా అతని కాళ్ళుపట్టి - అతడు తన నించి కావలసింది - తన ప్రమేయం లేకుండానే పొందేసి - కాదంటే - వారం రోజులు మాటలు మానేసి - మాటల సూదులతో గ్రుచ్చి - తన నుండి బలవంతపు 'రాక్షసరతి'ని పొందిన ఆ విషమ ఘడియనెలా మరచిపోగలను?

    'జీవితంలో అతడు తనను సంతోషపెట్టలేదు' అనలేదామె. కానీ ఆ సంతోష పెట్టడం వెనకాల ఆవుకో గడ్డి పెట్టి పాలుపొందిన విధం! కుక్కకు అన్నపు కెరడవేసి కాపలా కాయించుకొన్న వైనం!

    తనకు ఆరోగ్యం బాలేకపోతే డాక్టర్ని తెచ్చి  వైద్యం చేయించి 'నీ కింత ఖరచ్యిందనో - అబ్బ నువ్వు మంచం ఎక్కడం కాదుగానీ... పని చేసుకోలేక చచ్చింది అమ్మ' అనో అనేవాడుగానీ -

    'ఇప్పుడే కోలుకుంటున్నావ్. కొన్నాళ్ళు రెస్టు తీసుకో. మేం చూసుకుంటాం ఈ పనులు! లేకపోతే మనిషిని పెట్టుకుంటాం కొన్నాళ్ళు!' అన్న పాపాన పోలేదు.

    ఇది నిజంగా తన దురదృష్టమేమో!
    
    లేక

    ఆడబ్రతుకులన్నీ ఇంతేనా?

    ఆలోచనలు తెగలేదు. కాలంతో పోటీ పడుతున్నాయి. గోడగడియారం రెండుగంటల రాత్రిని సూచించింది. లైటు వేసింది. బాత్రూం కెళ్ళొచ్చి నీళ్ళు త్రాగింది.

    భర్తకు మెలకువ వచ్చింది. 

    "ఏంటి? ఇంకా పడుకోలేదా? అసలే నీకు బీపీ. అదెక్కువైతే పెరాల్సిస్ వస్తుంది" అని అరిచాడు.

    కోపం వచ్చిందామెకు.

    అంతకంటే ఎక్కువ ఏడుపొచ్చింది.

    "నిద్రపట్టకపోతే చెప్ప్పు. రేపు నిద్రమాత్రలు కొనిపెడతా!" అన్నాడు.

    "పట్రండి. ఒకటికాదు. పదేసుకుంటాను. మరి నా బాధ మీకుండదు. నావల్ల మీ పరువుపోదు" అనాలనే అనుకుంది.

    కానీ

    తరతరాలనుండీ నరనరాన రక్తంలో కలిసి ప్రవహిస్తోన్న పిరికితనం ఆ మాటలను పెదవులను దాటనివ్వలేదు. మనస్సముద్రంలో తుఫాను. 'చచ్చిపోవాలి! ఎవరికీ అవసరంలేని తనెదుకు?'

    కళ్ళు మూసుకుంది. బలవంతంగా!

    కానైతే -

    చచ్చి సాధించేముంది?

    ఇవాళ మనసు ఊరటపడ్డంలేదు.

    ఘోషిస్తోంది. ఆక్రోసిస్తోంది. అనుకోకుండా గడపదాటినందుకే ఇంట్లో ఇంత కుదుపు వచ్చిందే?

    నిజంగా తనచుట్టూ వున్న సంకెళ్ళు తెగత్రెంచుకుని అవధుల పరిధి దాటితే? 

    తన మనోవ్యధ వీళ్ళకర్థం కావాలి! ఇంతకాలం తనలో దాగిన బడబానలం బయట పడాలి! ఆ తరువాత అడ్రస్‌లేని ఉత్తరం రాస్తే సరిపోతుంది.

    తిట్టుకుంటారు. ఈ ముసలిదానికీ వయసులో ఇదేం తెగులు? అని తిట్టుకుంటారు. మనిషికైతే పరిధులు. మనసుకు పరిధులెక్కడ? ఆలోచనలకు అవధులెక్కడ? చైతన్యానికి వయసుతొనేం పని?

    కొన్ని ముదిరినప్పుడే విలువ పెరుగుతుంది.

    మనసూ అంతేనేమో!

    ఏదో నిర్ణయం తీసుకోవాలి! ఎక్కడికైనా వెళ్ళిపోవాలి!

    కానీ ఎక్కడికెళ్ళగలదు? ఈ ప్రపంచం తనకేం తెలుసు?

    తన ప్రపంచం తన భర్త - పిల్లలూ - కుటుంబం!

    కానీ మనసు ఒప్పుకోలేదు.

    అంతుపట్టలేదు!

    మర్నాడూ అంతే! మూడోనాడూ అంతే! ఆలోచనలతో నలిగి పోయింది. తన ముభావాన్నెవరూ పట్టించుకోలేదు. వాళ్ళ దృష్టిలో తానో మనిషిని గానీ - దానికి మనసూ - ఆ మనసులో కోరికలూ... కోపతాపాలూ... సుఖదుఃఖాలూ వుంటాయని వాళ్ళనుకుంటేగా!

    వచ్చిన పనయిపోయింది.

    కొడుకు కొత్త ఇంట్లో దిగాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నాలుగో రోజు భర్తా ప్రయాణానికి ముహూర్తం పెట్టాడు. కొడుకూ కోడలూ ఆ ముహూర్తానికే ఎదురు చూస్తున్నారు. వందన సమర్పణకు సిద్ధంగా - బట్టలు కొని తెచ్చారు.

    తను మాత్రం టీవీ చూస్తోంది పరధ్యానంగా! టీవీలో ప్రకటన మీద తన కళ్ళూ - మనసూ నిలిచిపోయాయి అకస్మాత్తుగా! 'ఎవ్వరూ లేని ఓ లేడీ ప్రొఫెసర్‌కి - వండి - వడ్డించి - ఆమెతో కలిసిపోయే వ్యక్తి కావాలిట. ఏ బాదర బందీలు లేనిదై వుండాలి. ఆత్మీయత ఇచ్చిపుచ్చుకునేదై వుండాలి. జీతం ఎంతయినా ఫరవాలేదు. వ్యక్తి నేరుగా వచ్చి కలిస్తే మంచిది' అనే ప్రకటన. ఆ తరువాత ఆమె చిరునామా. వర్ధనమ్మలో వెలుగు నింపింది. గదిలోనికెళ్ళి అడ్రస్ నోట్ చేసుకుంది. 

    మర్నాడే భర్త ప్రయాణమయ్యాడు.

    రిజర్వేషన్ బెర్త్ మీద చీకటి పడకుండానే పడుకోవటానికి సిద్ధపడుతూ "ఇదిగో, ఒళ్ళు బరువుగా వుంది. నేను మేను వాలుస్తాను. నువ్వూ పడుకునేవ్, జాగర్త!" అని ట్రైన్‌తో పోటీగా గురక తీస్తూ నిద్రలోకి జారుకున్నాడు వర్ధనమ్మని 'నైట్ వాచింగ్' చెయ్యమని!

    అదే తనకూ కావాలి!

    ప్రక్క స్టేషన్‌లో బండి ఆగింది.

    గుండె దడ ఎక్కువయింది. తల వేడెక్కింది. చేతిలో పర్సుంది. అందులో వంద కాగితం వుంది.

    మళ్ళీ ఆలోచించింది.

    "ఈ వయసులో ఇది తగునా?...తగదు...తప్పేముంది?... ఇంకెన్నాళ్ళు?... సర్దుకుపోతేనేం?... లాభం లేదు... వీళ్ళకి బుద్ధి చెప్పాలి! తప్పదు, బుద్ధి చెప్పాలి!

    వీళ్ళంతా పశ్చాత్తాపంతో కాలిపోవాలి!

    ఇది ఇవాల్టి ఆవేదన కాదు. యాభై వసంతాల సెగ!" అంతస్సంఘర్షణ! 

    దిగిపోయింది. ఏమైతే అయింది!

    చావో...రేవో...తాడో...పేడో...!

    భర్త మంచి నిద్రలో వున్నాడు. ఎప్పుడో లేస్తాడు.'ఎక్కడ చచ్చావే?' అని గోల చేస్తాడు. కోపంతో గెంతులేస్తాడు...చిందులేస్తాడు!

    వెయ్యనీ!

    నిర్ణయం జటిలమయింది.

    బండి దూరమయింది.

    వర్ధనమ్మ ముందుకు నడిచింది!

(సుప్రభాతం వారపత్రిక 20 డిసెంబర్ 2003 సంచికలో ప్రచురితం)

Comments