పరిష్కారం - తేజోమూర్తుల ప్రకాశరావు

    భళ్ళున తెల్లారేసరికి అప్పిశెట్టి మూపుపై బట్టల మూట మోస్తూ రేవుకు బయలుదేరాడు. ఇరవై రోజులుగా బల్లపండుగ ధర్మమా అని అతనికి విశ్రాంతి దిరికింది. మళ్ళీ కష్టపడాలంటే అతని శరీరం సహకరించడంలేడు. రేవు చేరుకుని మూట పడేసాడు. మనుషుల అలికిడికి రేవులో కొంగలు రెక్కలు టప టప కొట్టుకుంటూ చింత తోపువైపు ఎగిరిపోయాయి. అప్పుడు అప్పిశెట్టి ముక్కుకు పొలుసువాసన సోకింది. రేవులోని నీటిని పరిశీలనగా చూశాడు. రేవులో నీటిమట్టం తగ్గిపోయి ఉంది. నీరు కూడా బురద రంగులో ఉంది.

    "ఏట్రా బావా రేవులో నీరంతా ఏటైపోనాదంటావు?" అని పక్కనే ఉన్న భైరాగితో అన్నాడు.

    "మనము బల్లపండుగ సందడిలోన ఉండిపోనాము. అప్పుడు పెసిడెంటు కొడుకు గవర్నమెంటు లోను తోటి ఇటికల బట్టి ఎట్టినాడు. ఇదా ఈ సెరువు దిగావన పెద్దపెద్ద మన్ను కుప్పలు కనిపిస్తున్నాయి కదా. సెరువుల నీరంతా దనికోసమే వోడేస్తున్నారట" అన్నాడు బైరాగి.

    "అలాగైతే బట్టలు ఇప్పుడెలగ గుంజాల నోసోసన కొట్టీవా?" అడిగాడు అప్పిశెట్టి.

    "అయితేటి మను మాటెవలింతారు సెప్పు. ఆర్నెల్ల కాడ్నించి డబ్బులు పెంచమని అడిగినా మన మాట ఎవులు పట్టించుకుంతన్నారు? ఉత్తిపున్నేనికి జీతాలు కొలుస్తన్నట్లు మాటాడతన్నారు. మన కట్టమ్ ఎవుడు సూత్తన్నాడు సెప్పు. కసింత కారమ్ ఎక్కువేసి ఉడకబెడితే ఏ వోసనా ఉండదు" అని సలహా పారేసాడు బైరాగి. 
ఆ నీట్లోనే బట్టలు ఉతికి ఆరేసి, సాయంత్రానికి పొడి బట్టలతో ఇల్లు చేరాడు అప్పిశెట్టి.

* * *

    రాత్రి ఎనిమిది గంటలకి కల్లు పాకలో ఉన్న అప్పిశెట్టి దగ్గరకి రాముడు పరుగెత్తుకుంటూ వచ్చాడు "మామా బావని పెసిడెంటు కొడుకు సావగొట్టేస్తున్నడు రా" అంటూ అదుర్దగా చెప్పాడు.

    తాగిందంతా దిగిపోగా సర్పంచ్ ఇంటివైపు పరిగెత్తాడు. అప్పటికి సర్పంచ్ ఇంటిముందు జనం మూగి ఉన్నారు…. "ఏటయిందిరా సీమాసెలమా!" అంటూ కొడుకు దగ్గరికి పరిగెత్తాడు.

    "సూడురయ్యా! పెసిడెంట్ బాపు కొడుకెలాగ బాదీసినాడో" అంటూ తన శరీరాన్ని తండ్రి కి చూపించాడు. సింహాచలమ్ ఒంటిమీద, చేతులమీద ఎర్రని తట్లు కనిపిస్తున్నాయి.

    "ఏల ఎందుకు కొట్టినాడు" ఆన్నాడు అప్పిశెట్టి.

    "మనం గుంజిన బట్టలు నోసోసన కొడతన్నాయట. అందుకని యిస్టానుసారం తిడతన్నాడు. తిడితే మంచిగుండదు. రేవల నీరు లేకపోతే మామేటి సేత్తాము. నీరంతా నీ యిటికల కోశమే ఓడిసినావు" అన్నాను.
 
    "రేవు మీయమ్మ మొగుడు సొమ్మెట్రా అంటూ అమ్మానాబూతులు తిడతన్నాడు. నాను తిడితే ఒప్పుకోను అని మీదకెల్లినాను. దాంతోటి పక్కనున్న కొరడా కర్రతో నన్ను ఇష్టానుసారం బాదేసినాడు" అన్నాడు సింహాచలం.

    "కొట్టనేటి మరి. నా పీక నొక్కుతుంటె ఏటి సెయ్యాల. నాను కొట్టి ఒగ్గేసి నాను మాఅయ్య ఉంతే నిన్ను సంపిసుణ్ణు" అన్నాడు ప్రెసిడెంటు కొడుకు. 

    "ఏది మల్ల ఆడి ఒంటి మీద సెయ్యియెయ్యి మీ రగతం పారాల" అన్నాడు మల్లెసు ముందుకు దూకుతూ, మల్లెసు అప్పిశెట్టి తమ్ముడు కొడుకు.

    ప్రెసిడెంటు కొడుక్కూడా యుద్దానికి సిద్దపడి పోయాడు.

    ఈలోగా ఊరి పెద్దలు కల్పించుకున్నారు.

    "ఆగండ్రా, ఏటి ఇది ఊరా? అడివా ఇది. ఎవులిపటుకు ఆలు కొట్టుకుంటే మరి పెద్దమనుసులెందుకు? పంచాయితీ లెందుకు, మీ ఇద్దరిదీ తప్పే. అప్పిశెట్టి నువ్వు నీకొడుకుని తీసికెల్లు,ఓరానందు? నువ్వు లోపలికెల్లు" అని ఊరిపెద్ద పోలినాయుడు సరి చెప్పాడు. ఆనందు లోపలికెల్లి తలుపేసుకున్నాడు.

    "పెసిడెంటు బావు రానీ ఆయనకాడే ఈ యిసయం తెలుసుకుందుము" అని అప్పిశెట్టి తన కొడుకును తన వాళ్ళను తీసుకొని యింటికెళ్ళాడు. తగువు తాత్కాలికంగా చల్లారింది.

* * *

    ఇంటికి వచ్చిన ప్రెసిడెంట్ తో జరిగిన తగువంతా భార్య చెప్పింది. సర్పంచ్ కి కొడుకు తొందరపాటు చర్యకు చిరాకనిపించింది. కొడుకు ఊళ్ళొ జులాయి తిరుగుల్లు తిరగడం, చిన్నా చితకా తగువులు ఇంటిమీదకు తెస్తుండడం అతనికి కొత్తకాదు. కొడుకు ఆనంద్ ని పిలిచి కేకలేద్దామనుకున్నాడు. అది గ్రహించిన భార్య "నువ్వు సీటికీ మాటికీ సిరాకు పడితే అందరికాడా ఆడు సులకనైపోతాడు. అసలే ఆడికి పవురుసం ఎక్కువ, ఆణ్ణేటి అనకు" అంటూ హెచ్చరించడంతో విధిలేక తగ్గాడు సర్పంచ్. వెంటనే ఎవరికీ తెలయకుండా కొడుకుని తన అత్తవారింటికి పంపేశాడు.

    ఆ సాయంత్రమే అప్పిశేట్టి తనవాళ్ళతో వచ్చి సర్పంచ్ ని కలిసాడు. జరిగిందంతా విన్నమీదట సర్పంచ్ "నానూ ఆడిని తిట్టినాను లెండి. పవరుసంతో ఎన్నో అనుకుంతారు.ఆడుకుంతారు. అవి అలాగే ఒగ్గీయాలగానీ, పట్టించుకుంటేఎలాగ" అన్నాడు.
 
    "అలక్కాదు బావు. తప్పు మీ బావు సెసినాడు గాబట్టి మీ బావు చేత సిమాసెలానికి సెమాపన సెప్పించీయండి" అన్నాడొకరు అప్పిశెట్టి తరుపున.

    "బావు ఊరిలనేడు. మీరొచ్చీముందే ఆల తాతగారింటికి పనిమీదెల్లిలాడు" అన్నాడు సర్పంచ్.

    "మనము రాడానికి ముందే పంపిచ్చేత్తే ఏ తగవూ వుండదని పంపేసినట్టున్నారు" అన్నాడొకరు అప్పిశెట్టి వర్గీయుడు.

    "మాటలు తిన్నాగా రానీ, అయిన అడగడానికి మజ్జిన నువ్వెవుడివిరా మోరమీద పొడిసీగల్ను" అన్నాడు బోడినాయుడు. అతను ప్రెసిడెంట్ తమ్ముడు.

    "ఏదీ పొడు సూత్తము" రెచ్చగొట్టాడు సింహాచలం.

    "ఉండండహె మీరు తగువు తీర్సుకోవడానికి వచ్చినారా? పెంచడానికా?" అన్నాడు సర్పంచ్.

    "మీ బావు సెమాపన సెప్పాల. సమచ్చరం సివరన ఇస్తున్న జీతాల కసింతయినా పెంచాల. సెరువుల నీరు ఇటికలు సెయ్యిడానికి ఓడకూడదు" అన్నాడొక యువకుడు.

    "అందరి తోటి మాటాడి ఏయిసయం సెపుతాను" అన్నాడు సర్పంచ్.

    "మీ ఇష్టం బావు ఈ యిసయం తేలిన వొరకు మాము బట్టలు గుంజము" అంటూ లేచి పోయారు అప్పిశెట్టి మొదలైన వాళ్ళు.

* * *

    "బట్టలు గుంజక పోతే ఆలు జీతాలియ్యరు గద అప్పుడు మనమెలాగ బతకాల" అన్నాడొక ముసలాయన.

    "మనము తెరీక బట్టలు గుంజకుండ ఉండిపోతామేటి. ఒక వారం రోజులు ఆల్లకి బట్టలు గుంజుకోడం ఎంతకష్టమో తెలుస్తాది. అదీకాక కతాకార్యాలకి కవుర్లు సెప్పాలంటీ మనమే సెప్పాల. మైల బట్టలు, సమర్త బట్టలు ఆలు ఎలగ తడుపుతారు. మీరు కసింత ఓపిక పట్టుదురా ఆలు ఆల తల్లోని జేజెమ్మ దిగొస్తాది" అంటూ అందర్ని ఒప్పించాడు మల్లేసు.

    "ఆలు మరొక ఊర్నించి ఎవుల్నైనా బట్టలు గుంజడానికి తెస్తేనో?" అనుమానంగా ప్రశ్నించాడు అప్పిశెట్టి.

    "ఎవులు అలాగ రారు , ఒచ్చినా మనము అల్ని అడ్డెత్తామన్నమాట" అన్నాడు మల్లేసు.
 
    ముసలివాళ్ళు మాత్రం అర్దాంగీకారాన్నే తెలిపారు. సమావేశం ముగిసింది. అప్పిశెట్టి వర్గం వాళ్ళిచ్చిన వార్నింగుకి ప్రెసిడెంటు బంధువులు కుతకుతలాడిపోయారు.

    "ఆలు మన బట్టలు గుంజడానికి రాకపోడమేటి? మనమే ఆలకి బట్టలెయ్యద్దు. జీతాలియ్యొద్దు" అన్నారు.

    "అయితే మన బట్టలో" అడిగాడోక గ్రామ పెద్ద వీరాస్వామి.

    "మనమే గుంజుకుందము. టవునోళ్లందరూ ఏటి సేత్తాన్నారో మనమూ అలాగే సేద్దుము" చెప్పాడు శివున్నాయుడు.

    "మరి మైల బట్టల సంగతేంటి?" ప్రశ్నించాడు వీరాస్వామి.

    "పసుపునీళ్ళూ జల్లేత్తే సరి" చెప్పాడు సర్పంచ్ సాలోచననగా.

    "మరి కవుర్లు సెప్పాలంటేనో" మరొకరి సందేహం.

    "సెలు ఫోన్లున్నాయిగద. కొన్నాళ్లు ఇలాగంతే ఆలే దారికొస్తారు. మాడితే గుర్రము ఒరిగడ్డి మెయ్యిదేటి?" అన్నాడు బోడినాయుడు.

    అవే సమిష్టి తీర్మానాలుగా సమావేశం ముగిసింది.

    వయసు మళ్ళిన వాళ్లు మాత్రం వెనక్కు లాగుతునే ఉన్నారు.

* * *

    ఊళ్ళో ఇరవై రోజులుగా ఈ ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ కూలీ చేసుకుంటున్న ఆడవాళ్ళకు బట్టలు ఉతకడం మరో అదనపు పని కావడంతో మగాళ్ళ మీద విసుక్కోవడం  ప్రారంభించారు. కులవృత్తులు మానుకోలేని వయసు మళ్ళిన అప్పిశెట్టి వర్గీయులు కుర్రకారు మీద చిర చిర లాడడం  మొదలెట్టారు. అయిన ఊరు మాత్రం పొగమంచుకమ్ముకున్న ఉదయంలా గుంభనంగా ఉంది.

* * *

    ఆరోజు ఆ ఊరిని విషాదం పల్చని తెరలా అలముకుంది. ఉదయం బారెడు పొద్దెక్కుతున్న ఎవరు పనుల్లోకి వెళ్ళడం లేదు. ఈ యింటిలోనూ పొయ్యి వెలిగించలేదు. సాలల్లో పసువులు తీరిగ్గా నెమరు వేస్తూ వచ్చీపోయే వారిని చూస్తున్నాయి. ఎప్పుడో సూర్యోదయానికి ముందే తెరవబడే రామమందిరమూ తెరవబడలేదు. సర్పంచ్ తల్లి రాములమ్మ తెల్లవారు జామునే చనిపోయింది. ఆమె ధర్మమూర్తి. అజాత శత్రువు. ఆమె సాయం పొందని వాళ్ళు ఆ ఊళ్ళొ లేరంటే అతీశయొక్తి కాదేమో! అందుకే ఊరు ఊరంతా శోక సముద్రమైపోయింది.

    అక్కడున్న వాళ్ళంతా లోగొంతుల్లోనే మాట్లాడుతున్నారు. ఆటోల్లో దిగిన ఆడవాళ్లు చీరల కొంగులు నోట్లో కుక్కుకుంటు శవం దగ్గరకి చేరుకుంటున్నారు. కూతుల్లు శవం మీదపడి వర్ణ వర్ణాలుగా రోదిస్తున్నారు. కొంతమంది మగాళ్ళూ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవేవి పట్టకుండా రాములమ్మ తల దగ్గరున్న దీపం మాత్రం నిశ్చలంగా నిర్వికారంగా వెలుగుతూ ఉంది. సర్పంచ్ అరుగు మీద దూరంగా వాలు కుర్చీలో చేరబడి ఉన్నాడు. అతని కళ్ళూ ఎర్రగా ఉన్నాయి. అప్పలనాయుడు సర్పంచ్ మామగారు. అతను మాజీ మండల ప్రెసిడెంటు, మకుటం లేని మహరాజు. మామగారంటే సర్పంచ్ కు వల్లమాలిన గౌరవం.

    "నాయనా రావలసినోల్లంతా వొచ్చేసినారు కర్రలు బెత్తాయించి సొశానముల సితి పేర్పించాల నెగు" అన్నాడు అప్పలనాయుడు.

    యిబ్బందిగా చూస్తూ వాలు కుర్చీలో నుండి లేచాడు సర్పంచ్. ఇంతవరకు గ్రామమ్ లో జగుగుతున్న సంఘటనలేదీ మామగారికి చెప్పలేదు. చెపితే చిన్నతనమ్ అనుకున్నాడు. ఇక చెప్పక తప్పేలా లేదనుకొని "యిలాగ ఒకసారి రమ్మీ" అంటూ లోపలి గదిలోకి నడిచాడు అప్పలనాయుడు. అతనిని అనుసరించాడు. లోగొంతుకతో జరిగిన సంఘటనలన్నీ మామగారికి వివరించాడు. సర్పంచ్ చివరగా "అసలు తప్పంతా నీ మనవడదే, ఆడిని నీకూతురు ఎనకేసుకొస్తాది. ఈలిద్దరూ నాకాలికి బందకాలు. సుట్టలు బందుగులు కూడా తందాన తాన అన్నారు. ఇప్పుడు అంతా సెయ్యి దాటిపోయింది. ఏటి సెయ్యాలో ఏటీ తోచకుంటున్నాది. పోనీ ఆలు చెప్పిని వాటికి ఒప్పీసుకుందామంటే సులకనైపోతామేటో అనిపిస్తుంది. మనోల్లందరూ ఏటంతారో అని బెంగనాగుంది" అన్నాడు.
 
    అంతా విని అప్పలనాయుడు దీర్ఘంగా నిట్టూర్చాడు.

    "సూడు నాయనా ఇప్పుడు ఇన్ని ఆలోసించడానికి నేదు. మనముందు ఒక పెద్ద కారెము ఉన్నది. అది నువ్వు గానీ మన బందువులు గానీ ఎవలూ సెయ్యలేము. ఆ అప్పిశెట్టోలే సెయ్యాల. అందుకే అంతారు సెరమమ్ ఒలిసి సెప్పులు కుట్టించిన సాకలి రుణం తీరదంతారు. ఆలకట్టానికి మనమిచ్చిన జీతమేటీ కాదు. టౌను తోటి యిలేజిని జతకట్టలేము గద. ఈ ఇంటిల ఎవులున్నారో ఆయింటిల ఉన్నోడికి తల్సు. ఆలయితే మిసన్లోన బట్టలు ఉతికేస్తారు. మనికి అలగకాదుగద. టవున్లంట కరెంటు సొశెనాలుంటయి. శవాన్ని బండిమీదెట్టి మీట మెయ్యగానే సిటంల బుగ్గయిపోతాది. యిలేజీలంట సాకలుండాలి. మంగలుండాలి. సావుమేలముండాలి. యిది మన సంపరదాయం.

    ఆలకి తప్ప సితి పేరసం గూడ ఎవులికీ రాదు. శవం కాలుతుంటే నెగిసి పోతుంటాది. కాలిపోతుంటే శవం కాలు సేతులు యిరిగి పోయి పక్కన పడిపోతుంటాయి. ఆటిని మల్ల సితిమీదెట్టి కాలసడానికి ఎన్ని కవుకులంటావు. యియన్నీ మనికి సేత గాని పనులు. పోనీ ఆలకి ఒంగడమేల అని మీయమ్మని కాలసకుండా, సమాధి సేసీ గలవా సెప్పు? నీకు సెప్పీటోడిని కాదు గానీ నానూ సరపంచిగ సేసినాను. ఆ యనుబవము తోటి సెపుతున్నాను. పల్లిలోన అన్నిపుర్తులూ సమానమే. పల్లి శెరీరమైతే అన్ని పుర్తులు సేసినోల్లు కల్లు, కాలు, సేతులు,ముక్కు సెవుల్లాంటి వోల్లు. అన్నీ సక్కరమంగ వుంచితే ఆరోగ్గెము.
 
    నువ్వు ఆల సెరువుల నీరు వోడేత్తే ఆలు ఏటి సెయ్యాల సెప్పు? నీ లాబమ్ కోశమ్ ఆలనెందుకు ఇబ్బందెడతావు? నీకాడ సొమ్ము నేదా? సోదా? ఒక మంచి బోరింగు తీయించుకో. యిటికలపనికి వాడుకో . నీ కొడుకుని గదిమి సెమాపన సెప్పించు. ఇప్పుడాడిని ఒంచకపోతేనే బౌసెత్తులోన ఆణ్ణీ వోంచలేవు గాక వోంచలేవు. ఆలకి నువ్వు పెంచిన కూలి మీరు కరుసు పెట్టిన దానిల పైసా వాటా కూడా ఉండదు. ఎలాగో ఒకలాగ ఒప్పించి కారెమ్ జరిగేలాగ సూడు" అన్నాడు అప్పల్నాయిడు. 

    సర్పంచ్ బయటికొచ్చి చెప్పులేసుకున్నాడు. అతను మెట్లు దిగుతుంటే జనాలు దారి ఇచ్చారు. వాళ్ళమధ్యనుండి నడుస్తున్న సర్పంచ్ ఒక దగ్గర ఆగిపోయాడు. కారణమ్ ఆ గుంపులో అప్పిశెట్టి తన వర్గం వాళ్ళతో వచ్చి ఉన్నాడు. అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. సర్పంచ్ ని చూసి అప్పిశెట్టి, సింహచలం అతని దగ్గరికొచ్చి "బావూ అమ్మగారన్నాయం సేసినారు" అన్నారు. బావురుమంటూ విలపించాడు అప్పిశెట్టి. సర్పంచ్ కళ్ళలో నీళ్ళూ సుళ్ళుతిరిగాయి.
 
    "అప్పిశెట్టి మీరన్నట్టే సేద్దామురా, అమ్మని బుగ్గిసేసీడానికి రావా?" అన్నాడు అబ్యర్ధిస్తున్నాట్లు.

    అతని గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతూ ఉంది. "అమ్మసావుతోటే అయన్నీ మరిసిపోనాము బావూ. మీరు పిలిసినా పిలకపోయినా అమ్మ కారెం ఆపుతామా బావూ" అన్నాడు అప్పిశేట్టి గద్గద స్వరంతో.

    అరగంట తర్వాత అంతిమ యాత్ర మొదలైంది. ఊరంతా ఒకటిగా పోటేత్తిన సముద్రంలా స్మశానం వైపు సాగిపోయింది.
Comments