పరివర్తన - పి.వి.సుజాతారాయుడు

    
"మిష్టర్ శ్రీవాత్సవ రేపు ఆఫీసులో ఆడిటింగ్ ఉందని తెలుసుగా... వర్క్ కొంచెం పెండింగ్ వుంది. ఇవాళ కాస్త ఆలస్యమైనా సరే ఫైల్స్ కంప్లీట్ చేసి వెళ్ళండి." మా వంక చూస్తూ అన్నాడు మేనేజర్.

    "అలాగే సార్" అన్నాను.

    ‘మరి మీరు...’ అన్నట్టు సుశీల వంక చూశాడు.

    "తప్పకుండా చేస్తాను సార్..."సిన్సియర్‍గా  సమాధానం చెప్పింది.

    ‘ఓహ్! ఏమి నా అదృష్టం’ నాలోని మరో మనిషి ఆనందంతో రెచ్చిపోతున్నాడు.

    ఆర్నెల్ల క్రితం మా ఆఫీసులో స్టెనో చేరబోతోంది అంటే... పదహారేళ్ళ ముగ్ధో... ఇరవై యేళ్ళ స్నిగ్ధో అనుకున్నాం... ఆమెకోసం ఆత్రంగా ఎదురు చూశాం. ఆరోజు రానే వచ్చింది. ఆ వచ్చింది పాతికేళ్ళ వితంతువు. ముఖాన బొట్టు లేదు. తలలో పూలు తురమ లేదు. కళావిహీనమైన ముఖంతో ఆఫీసులోకి నిర్లిప్తంగా అడుగుపెట్టింది.

    మా మగ ప్రాణాలు ఉసూరుమన్నాయి.

    సంవత్సరం క్రితం ఆమె భర్త యాక్సిడెంట్‍లో మరణించాడట. వాళ్ళది ప్రేమ వివాహం.పెళ్ళయిన సంవత్సారానికి ఆమె భర్త పోవడంతో అటు వాళ్ళు... ఇటు వాళ్ళూ  ఎవరూ ఆమెని ఆదరించలేదు. అందుకే విధిలేక ఉద్యోగం‍లో చేరిందట.

    చెప్ప కూడదు కాని ఆడది కన్పిస్తే ఆబగా లొట్టలేస్తూ... అవకాశం కోసం కాచుక్కూర్చునే మగాళ్ళుండే మామూలు ఆఫీసు మాది.

    ఆమెతో మాట్లాడాలనుకునే వాళ్ళకి... కావాలని ఆపని ఈపనీ చేస్తూ కాళ్ళూ చేతులూ తగిలించాలనుకునే వాళ్ళకి... ఆమె సీరియస్‌గా వుండడం మూలాన ఆ పప్పులేం ఉడకలేదు. ‘ఏం చేస్తే ఏం కొంప మునుగుతుందో ’ అని చొరవ చూపేవారు కాదు.

    నేను మాత్రం మనసులో ఆమెపై కోరికున్నా పైకి మాత్రం ఆమెపై జాలి పడుతున్నట్టుగా, హుందాగా వ్యవహరించి ఆమె దగ్గర మంచి మార్కులు సంపాదించాను. ఏవన్నా అవసరం వస్తే నాతోనే మాట్లాడుతుంది. మిగతావాళ్ళకి మింగుడు పడనిదీ... నాకు గర్వాన్నిచ్చేది ఈ విషయమే. సహనంతో ఏదైనా సాధించొచ్చు, కాని మగాళ్ళకి తొందరెక్కువ. అదే కొంప ముంచుతుంది.

    రకరకాల గాసిప్స్ తో ఆమెపై వున్న కసిని మాటల్లో వ్యక్త పరచి ఆనందించేవారు.

    ఆమెని పెళ్ళి చేసుకుని మరో జీవితాన్నిచ్చేవాడిని... నాకు పెళ్ళి కాక పోయుంటే... వికసించీ వికసించకుండానే మోడై పోతున్న ఆమెకి సహాయం చేద్దామన్న ఆశ.

    ఆ అందం రెప్ప వెయ్యనివ్వదు. ఊపిరి తీసుకోనివ్వదు. పాల సముద్రపు నురుగుకి కొద్దిగా గులాబీల రంగు కలిసినట్టుందే మేనిఛాయ. ముఖం పూర్ణచంద్ర బింబం. కళ్ళు అక్వేరియంలో చక చక కదలాడే మీనాలు.

    ఇన్నాళ్ళకి నా అదృష్టం పండింది. సమయం చూసి చేయిపట్టుకోవాలి. ఆపై ముందుకు... మున్ముందుకు... ఊహలు నన్ను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. కిటికీలోంచి కనిపిస్తున్న చంద్రుడు ఇంకెంత సేపని? ప్రోత్సహిస్తున్నాడు. ఆమె వంక చూశాను. దీక్షగా ఏదో ఫైల్ చూస్తోంది. నేను నెమ్మదిగా లేచాను.

    ఆ చప్పుడుకి దిగ్గున తలెత్తిందామె.

    నేను గుటకలు మింగాను.

    ఆమె నవ్వుతూ"ఏంటండీ! శ్రీవాత్సవ్ గారూ టీ తాగొస్తారా" అంది.

    "లేదండీ బోర్ కొడుతోంది. ఏదైనా మాట్లాడండి. ఎవరో సినీరచయిత అన్నాడుగా ఆడుతు... పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదని" అన్నాను. ఆమె మాటల్లో పడబోతోందన్న ఆనందం.

    "ఆ రచయిత అన్నపని వేరండి. మనమలా మాట్లాడుతూ చేస్తే మిస్టేక్స్ దొర్లి రేపు చీవాట్లు తినాల్సొస్తుంది."

    "పొన్లేండి, మీకిష్టం లేకపోతే వద్దులే" అన్నాను నిష్ఠూరంగా.

    ఆమె నవ్వి "మా ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే వారండి. నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.మా ఇద్దరి భవిష్యత్తుమీద ఎన్నో కలలు కనేవాళ్ళం. కాని అనుకోకుండా హఠాత్తుగా ఆయన ఈ లోకంనుండి, నానుండి నిష్క్రమించడంతో ఇలా ఉద్యోగం చేయాల్సివచ్చింది..." బాధగా ఆపేసింది.

    ఆమె వాళ్ళాయన ప్రస్తావన తీసుకురావడం నాకు చిరాకనిపించింది... కాని ఓపిక పట్టాలిగా..."ఈ మధ్య ఏం సినిమాలు చూశారు?" మాటమార్చి వాతావరణాన్ని తేలిక పరుస్తూ అన్నాను.

    "సినిమాలు చూడడం మానేశానండీ. ఆయనా, నేనూ ఎన్నో సినిమాలు చూశాం... ఇప్పుడు ఒంటరిగా చూళ్ళేను" అంది.

    ఛి..ఛీ..ఎంతసేపూ ఆయన... ఆయనా... చెట్టంత మగాడిని ఎదురుగా పెట్టుకుని పోయిన తన భర్తను పొగుడుతుంటే ఎలావుంటుంది? నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఫైల్ చూస్తున్నట్టుగా సీరియస్ గా యాక్ట్ చేశాను. కొంతసేపటికి లేచి "కొంచెం ఈ స్టేట్‍మెంట్ కరక్టో కాదో చూసి పెడుదురూ...కన్ఫ్యూజింగ్‍గా వుంది నాకు" అని ఆమె కుర్చీ వెనగ్గా నుంచుని ఫైలు ఆమె ముందు పెట్టాను.

    "ఇందులో కన్ఫ్యూజ్ అవడానికేముంది? స్టేట్‍మెంట్ క్లియర్ గానే వుందిగా" అంది.

    "లేదండీ... ఇక్కడ చూడండి..."ఆమె మీదుగా వంగి వేలితో చూపిస్తూ అన్నాను. నేను అగ్నిపర్వతంలా వున్నాను. ఆమెపై వున్న కాంక్ష నన్నలా చేసింది.

    ఆమె చెయ్యి కొద్దిగా వణకింది. లేవబోయింది. పరిస్థితి అసహజంగా అన్పించింది కాబోలు.

    "ప్లీజ్ సుశీలా మీరంటే నాకు చాలాఇష్టం. కోరికలను సమాధి చేసుకోకండి. భర్త పోయాడని సుఖాలకి దూరంకావడం తెలివితక్కువ. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సమయం వృధా కానివ్వద్దు... మనిద్దరం..." ఏంటేంటో మాట్లాడసాగాను. తమకంగా ఆమెని హత్తుకున్నాను. ఆ పెదాలని అందుకోవాలని తెగ తాపత్రయపడ్డాను.

    కోపంగా ముక్కుపుటాలెగరేస్తూ నన్ను దూరంగా తోసేసి "చూడండి మిస్టర్ శ్రీవత్సవ... క్షణికమైన మీ సుఖం కోసం నన్ను జీవచ్ఛవంగా మార్చకండి. మీరూ మీ భార్యకి మంచి భర్త కండి. మీరూ అడ్డదారుల్లో సుఖిస్తే... రేపు మీ భార్య తనూ అడ్డదారి తొక్కితే... వైవాహిక బంధానికి అర్థమేముంది?"

    ఉద్రేకం అణగారిపోయింది నాలో. అగ్నిపర్వతం లావా ఎగజిమ్మకుండానే చల్లబడిపోయింది. నేను సిగ్గుతో వెళ్ళి నా సీట్లో కూలబడ్డను.

    "నాకు తెలుసు, మీలో మానవత్వముంది. కాబట్టే నా దగ్గరకొచ్చిన మిమ్మల్ని ’నన్నేం చేయద్దు, నా జీవితం పాడు చేయద్దు’ అని ఏడ్చుంటే ఈపాటికి నన్ను నాశనం చేసుండేవారు. నన్ను ఇప్పటిదాకా ఆ దృష్టితో చూసినవాళ్ళుతప్ప..ఆదరించిన వాళ్ళు లేరు. ఆప్యాయంగా పలకరించిన వాళ్ళు లేరు. దురదృష్టవంతురాలిని. నాదో ఒంటరి పోరాటం.." ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.

    నేను వెళ్ళి తలనిమిరాను. ఆమె తలెత్తింది. నా కర్ఛీఫ్‍తో కన్నీళ్ళు తుడిచి "నువ్వు నన్ను మార్చావు. మనిషిగా చేశావు. ఈరోజు నుంచి నీకు తోడుగా వుంటాను. నీకు ముళ్ళకంచెనవుతాను. పద నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాను.

    బైక్ మీద ఆమెని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేశాను.

    బైక్ శబ్దం విని చుట్టూ వున్న అపార్ట్‌మెంట్‌ల్లోని  లైట్లు వెలిగాయి. బాల్కనీల్లోంచి చూస్తున్నారు.

    రేపు మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం వుందని మాట్లాడుకోవడానికి టాపిక్ దొరికిందని సంబరపడుతున్నవాళ్ళ నోళ్ళు మూయించడానికి "వెళ్ళొస్తా చెల్లెమ్మా..జాగ్రత్త"అన్నాను.

    నాకిప్పుడెంతో ఆనందంగా వుంది. క్షణికావేశంతో చేసిన తప్పుకి జీవితాంతం నరకం అనుభవించే వాడిని. నన్ను నేను సరిదిద్దుకున్నాను. కాదు సరిదిద్దబడ్డాను. దట్సెనఫ్!

(వనితాజ్యోతి నవంబరు 1998 సంచికలో ప్రచురితం)
Comments