పరివర్తన - సురేంద్ర కె.దారా

    కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమౌతూ ఆఫీసు మూసేసే సమయానికి ఒక ఆసామీ లోపలికి వచ్చాడు.  ఆఫీసు మూసేముందు మరో క్లయింటును ఎందుకుపంపాడా అని గుమాస్తాని మనసులోనే విసుక్కుంటూ వచ్చినతనివైపు చూసాను.  పల్లెటూరు ఆసామీలా వున్నాడు.  వృద్ధుడైనా బలిష్టంగా వున్న అతని విగ్రహం, పంచెకట్టిన తీరు, ముగ్గుబుట్టలా వున్న జుట్టు, పెద్ద మీసాలు అతనికి హుందాతనన్ని ఇస్తున్నాయి.

    

    “చిన్నబ్బాయిగారూ! నాపేరు మాణిక్యాలరావండి.  రంగంపేట నుంచి వచ్చాను.  పెద్దయ్యగారు వూళ్ళోలేరాండి?” అని మా కుటుంబంతో ముందే పరిచయం వున్నట్టుగా నన్ను సంబోధిస్తూ నాన్నగారి గురించి అడిగాడు.

   

     “మా పెద్దన్నయ్యని చూడ్డానికి అమెరికా వెళ్ళారు.  వచ్చే నెలలో తిరిగి వస్తారు.” అన్నాను, కోర్టుకు వెళ్ళడానికి టైం కావడంతో ‘ఇంతేనా, ఇంకేమైనా వుందా ‘ అన్నట్టుగా అతనివంక చూస్తూ.  అతని ముఖంలో డిజప్పాయింట్మెంటు/నిరాశ స్పష్టంగా కనిపించింది.  ఇంతలోనే తేరుకుని, “మీరు కోర్టుకెళ్ళే టైమయినట్టుంది కద బాబూ, సాయంత్రం మిమ్మల్నోసారి కలుస్తాను వీలవుతుందాండి?” అనడిగాడు.  యేడుగంటల తరువాత రమ్మని చెప్పి నేను కోర్టుకు బయలుదేరాను.


    నేను పదిగంటలకి ఆఫీసు మూసేసి కోర్టుకు వెళ్తానని తెలిసినా  కొంతమంది క్లయింట్లు చివరిక్షణం లో వస్తుంటారు.  ఇతనెవరో ఆవిషయం తెలిసినవాడిలా ఉన్నాడు, తొందరగానే వెళ్ళిపోయాడు.  అసలే ఈరోజు సెషన్స్ కేసు వుంది.  సాక్షులకు ఎలా చెప్పాలో శిక్షణ ఇచ్చేసరికే సమయమంతా అయిపోయింది.  వాళ్ళు చూసింది చూసినట్టు చెప్తే కేసు ఓడిపోవడం ఖాయం.  ప్రాసిక్యూటరు వీళ్ళను తికమక పెట్టడానికి ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో, వీళ్ళు దానికి తడబడకుండా ఎలాంటి సమాధానాలు చెప్పాలో వాళ్ళచేత ప్రాక్టీసు చేయించే సరికి నా తలప్రాణం తోకకొచ్చింది.  కొంతమంది చదువురాని  పల్లెటూరి క్లయింట్లతో ఇదే గొడవ.  చూసిన విషయాన్నే సరిగా చెప్పలేరు.  అలాంటివాళ్ళతో మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పే విధంగా శిక్షణ ఇవ్వడం మరీ కష్టం.  కానీ చుట్టుపక్కల నలభై యాభై గ్రామాలు మావూరి కోర్టు జూరిస్ డిక్షన్ కే రావడంతో నాకు ఇలాంటి క్లయింట్లు చాలామందే వున్నారు.  అలవాటైనపనే అయినా వాళ్ళను కోర్టుకు తయారు చెయ్యడం ఒక్కోసారి చాలా శ్రమతో కూడుకున్నపని.  కానీ ఆపనే నాకీరోజు ఇంత డబ్బును సంపాదించి పెడుతోంది.  అబద్ధం చెప్పేవాడు, తను చెప్పబోయే అబద్ధాన్ని మనస్ఫూర్తిగా నిజమని నమ్మితే ఎలాంటి అబద్ధాన్నైనా నిజమనిపించేలే చెయ్యవచ్చు అన్నది నా సూత్రం.  అవసరమైనపుడల్లా దీని ప్రతిపదికగానే నా క్లయింట్లకు శిక్షణనిస్తూంటాను.

 

    ఆఫీసులోంచి బయటకు వచ్చేసరికి డ్రైవరు కారుతో సిద్ధంగా వున్నాడు.  లోపల కూర్చుని, ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ కోర్టుకి బయలుదేరిన నాకు చాలాసార్లు గుర్తు వచ్చినట్టే నాకు గతం గుర్తుకు వచ్చింది.  ఇదే దారిలో దాదాపు పదేళ్ళ క్రితం వరకూ నాన్నగారు ఓ పాతకాలపు మోపెడ్ లో వెళ్ళేవారు.  ఇప్పుడు నేను ఏసీ కారులో వెళ్తున్నాను.  నాన్నగారి రోజులు వేరు.  అందులోనూ ఆయన పద్ధతి మరీ వేరుగా వుండేది.  ఆయనలాగా సిద్ధాంతాలు, నియమాలు పాటిస్తూ బ్రతికే రోజులు కావివి.  లోకరీతిని తెలుసుకుని తగినట్టుగా వెళ్ళడం నాపద్ధతి.


    ఊళ్ళోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరుగా నాన్నగారికి చాలా పేరుండేది.  ఇప్పటికీ ఆయనంటే ఊళ్ళో చాలా గౌరవం వుంది.  చాలా మంచి ప్రాక్టీసు వున్నా మా అన్నదమ్ములం ముగ్గురిలో ఎవరినీ లా చదివించాలనే ఆలోచనే వుండేది కాదు. 


    “అదేం, మీ పిల్లల్నెవరినీ లా చదివించరా?  ఇంత ప్రాక్టీసునీ వృధా చేస్తారా?” అని ఎవరైనా అడిగితే ఒకటే చెప్పేవారు. 


    “నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ న్యాయవాద వృత్తిలో పైకి రావడం చాలా కష్టం.  నేనుపడ్డ కష్టం చాలు.  మా పిల్లల్నెవరినీ ఈ వృత్తిలోకి తీసుకురావడం నాకిష్టం లేదు.”

 

    అది నిజమే, అందుకనే నాన్నగారు అన్నేళ్ళ ప్రాక్టీసులోనూ పేరు సంపాదించినంతగా డబ్బు సంపాదించలేదు.  అసలు నాన్నగారికి ఇష్టంలేని ఈ వృత్తిలోకి ఎలా వచ్చానంటే, వేరే గత్యంతరం లేక.  విద్యార్థులు మూడు రకాలుగా వుంటారు.  కొంతమంది ఎప్పుడూ ఒకేరకంగా వుంటారు – బాగా చదివేవాళ్ళుగా లేదా మొద్దులుగా.  రెండవ రకం వాళ్ళు, క్రింది తరగతుల్లో చదువులో వెనుకబడినట్లున్నా, తర్వాత్తర్వాత బాగా పుంజుకుని చదువులో రాణిస్తారు.  మూడవ రకం వాళ్ళు క్రింది తరగతుల్లో బాగా చదివి, పైతరగతుల్లో కి వచ్చేసరికి వెనుకబడతారు.  అన్నయ్యలిద్దరూ మొదటి రకంలో బాగా చదివే కోవకి చెంది ఒకరు ఇంజినీరై అమెరికా వెళ్ళాడు, రెండవవాడు డాక్టరై ఊళ్ళోనే ప్రాక్టీసు పెట్టాడు.  నేను మూడవ రకం వాడిని.  తెలివితేటలున్నాయన్న ధీమా వల్లనో, ఎలా చదివినా మంచి మార్కులు వస్తాయన్న గర్వం వల్లో క్రమేపీ అశ్రద్ధ చేసి, మంచి చదువులకు సీటురాక, చివరికి బి ఏ మాత్రమే చెయ్యగలిగాను.  ఆ చదువుతో తెచ్చుకోగలిగే ఉద్యోగాలు పరిమితమవడంతో, ఇక వేరే దారిలేక ఉన్న ప్రాక్టీసునైనా అందుకుంటానని నన్ను లా చదివించారు.  చదువులో అయితే వెనుకబడ్డాను కానీ లాయరుగా బాగానే రాణించాను.  అయితే నాన్నగారి దారికి భిన్నమైన దారిలో.

 

    నాన్నగారికి ప్రిన్సిపుల్స్ ఎక్కువ.  ముక్కుసూటిగా వెళ్ళేవారు.  అవినీతిమయమైన ఈలోకంలో నిజాయితీగా ఉండాలనుకోవడం, బురదగుంటలో వుంటూ మడికట్టుకోవాలనుకోవడం లాంటిది.  లంచాలు పుచ్చుకునే న్యాయమూర్తులున్నపుడు, కోర్టులో ఎప్పుడూ న్యాయమే జరగదు.  ఆవిషయం తెలుసుకోకపోతే చెట్టుకిందప్లీడరు గానే మిగిలిపోవల్సి వస్తుంది.  న్యాయం ఎటువైపు వుంటే అటే వాదించాలన్నది నాన్నగారి సిద్ధాంతం.  నాదగ్గరికి వచ్చిన క్లయింటుని గెలిపించాలన్నది నా సిద్ధాంతం.  ఈ అభిప్రాయ భేదాలవల్లే నేను ప్రాక్టీసులోకి వచ్చిన రెండు సంవత్సరాలకే నాన్నగారు ప్రాక్టీసు మాని రిటైరు అయిపోయారు.  వయసు మీదపడుతోంది, కొడుకులందరూ చేతికందివచ్చారు కాబట్టి, విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అందరికీ చెప్పినా, అసలు కారణం వేరే అని మా ఇద్దరికీ తెలుసు.

 

* * *


    లాయర్లన్నాక కొన్ని కేసుల్లో గెలుస్తాం, కొన్నింటిలో ఓడిపోతాం.  గెలిచినా, ఓడినా మాడబ్బులు మాకొచ్చేస్తాయి.  కోర్టులోని అధికశాతం కేసుల విషయంలో గెలుపు ఓటములనేవి న్యాయాన్యాలపై కాక లాయర్ల తెలివితేటాలపైనా, వాదనా పటిమపైనా ఆధారపడి వుంటాయి.  న్యాయశాస్త్రాన్ని నమ్మిన లాయరుకి గెలుపూ వుండొచ్చు, ఓటమీ వుండొచ్చు.  లౌక్యాన్ని నమ్ముకున్న నాలాంటివాడికి వాటితో పనిలేకుండా డబ్బు మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

 

    నిజానికి కోర్టు వరకూ రావలసినవి వాజ్యాలు కొన్నే వుంటాయి.  ఎక్కువ భాగం, అనవసరపు పంతాల వల్లా, పట్టుదలల వల్లా వచ్చేవే.  ఇలాంటి వాటిలో కేసు గెలవడం వల్ల కలిగే లాభం కన్నా, కోర్టు ఫీజులకీ, లాయర్లకీ పెట్టే ఖర్చే ఎక్కువగా వుంటుంది.  కేసులో బలం వున్నా లేకపోయినా, బలం వుందని క్లయింటుని నమ్మించి, మేం కూడా నమ్మినట్లు కనిపించి కేసుని వాదించాలి.  అప్పుడే మాకు ఆదాయం బాగుంటుంది.  అదృష్టం బాగుంటే ఇలాంటి కేసులు కూడా నెగ్గుతాం.  అప్పుడు, పోతుందనుకున్న కేసును కూడా గెలిపించారని మరింత పేరు వస్తుంది.  ఒకవేళ కేసు ఓడిపోతే, లాయరు చాలా కష్టపడ్డా కేసుపోయింది అనుకోవచ్చు. నాకు తెలిసి, నాన్నగారు ఇలాంటి కేసులెన్నింటినో వదిలేసారు.  ‘కోర్టులకెళ్ళి ఎందుకయ్యా నష్టపోతారు, మీలో మీరే మంచి చెడ్డల్ని చూసుకుని రాజీకి వచ్చేయండి ‘ అని యెంతోమంది క్లయంట్లను నాన్నగారు వెనక్కి పంపెయ్యడం నాకు తెలుసు.  ‘సాక్ష్యాధారాలు ప్రత్యర్థికి అనుకూలంగా వున్నాయి, మనం కేసు పెట్టినా నెగ్గదు.  మీ సమయాన్నీ, డబ్బునీ వృధా చేసుకోకండి ‘ అంటూ మరి కొన్ని విషయాల్లో కేసులు తీసుకునే వారు కారు.  చాలామంది పంతాలకొద్దీ కోర్టులకెళ్తారే తప్ప న్యాయాన్యాలకోసమే కాదు.  మనం కాదని వదిలేస్తే ఇంకో లాయరు దగ్గరకు వెళ్తారు, ఆపని మనమే చెయ్యొచ్చు కదా అన్నది నా వాదన.  వచ్చిన కేసుల్ని వదిలెయ్యడమే కాదు, డబ్బు పుచ్చుకోకుండా నాన్నగారు వాదించిన కేసులు కూడా అనేకం.  ఫీజు ఇవ్వగలిగీ ఎగ్గొట్టిన వాళ్ళూ, ఇవ్వలేక ఉచితంగా నాన్నగారి సర్వీసు పొందినవాళ్ళూ లెక్కలేనంతమంది ఉన్నారు.  నేను మాత్రం నాన్నగారు చేసిన తప్పు చెయ్య లేదు.  డబ్బు చేతిలోపడితేనే కేసు తీసుకుంటాను.

 

    ఇదిలా వుంచితే, కోర్టులో ఈరోజు నాకు బాలేదు.  సాక్ష్యాలు సరిగా లేక ఓ ముఖ్యమైన కేసు ఓడిపోయాను.  నా ఫీజు నాకు వచ్చేసినా ఓటమి అనేది ఎప్పుడూ కాస్త నొప్పిస్తుంది.  ఆ ఓటమివల్ల కాక, కోర్టు బయట వాది తరఫు మనుషులు మాట్లాడుకుంటూ అన్న మాటలు నా చెవినబడి, ఎన్నడూ లేని విధంగా నేను కలవర పడ్డాను.  “మంచికి కూడా రోజులున్నాయిరా, కేసుగనక కోట్టేసుంటే మనోడు అన్నాయమైపోయేవాడు.  ఆడూ, ఆడి పెళ్ళాం పిల్లలూ యేనుయ్యో గొయ్యో చూసుకునేవోరు.  నాయం మనేపుంది గాబట్టి  మనం నెగ్గాం, ఆ యెదవలకి శిచ్చ పడింది.  పాపపు సొమ్ము మూటగట్టుకుని ఏం బాగు పడదామను కున్నారో.  మన ప్లీడరుగారు ధర్మప్రెభువులు, నాయం యేపు నిలబడ్డారు.  దేవుడు ఆరిని సల్లగా సూడాలి.” అంటున్నాడు వాది తరఫువాడెవరో.

 

    డాక్టర్లకు చావులూ, చనిపోయిన వారి బంధువుల రోదనలూ ఎలా అలవాటవుతాయో, లాయర్లకు కూడా ఓడిపోయిన్వారి కన్నీళ్ళు అలవాటవుతాయి.  కానీ ఈసారి నా మనసులో ఏదో అసౌకర్యపు భావన కలుగుతోంది. ప్రాసిక్యూటరుని వాళ్ళు ధర్మాత్ముడంటూ పొగడడం వల్ల, నేను అధర్మం వైపు వాదించానన్న అపరాధభావమో, మేము కేసు గనుక నెగ్గి వుంటే అవతలి వాళ్ళ కుటుంబం నాశనమయ్యి వుండేదన్న న్యూనభావమో, నేనుకూడా పాపపుసొమ్ము తినేవాళ్ళ లెక్కలోకి వస్తానన్న విషయాన్ని ఇతరులు బహిరంగంగానే అనుకుంటున్నారన్న స్పృహవల్ల కలిగిన సిగ్గో తెలియదు కానీ, నా మనసు కలత చెందింది, మొదటిసారిగా.


* * *

 

    సాయంత్రం ఏడున్నర అవుతుండగా ప్రొద్దుట కనిపించిన మాణిక్యాలరావు వచ్చాడు.  వచ్చిన విషయం ఏమిటో చెప్పమన్నాను.


    “పెద్దయ్యగారుంటే మాట్లాడదామనుకున్నాను బాబూ.  ఆయన వచ్చేనెలగ్గానీ ఊరికి రారన్నారు కాబట్టి మీరు మరోలా అనుకోనంటే ఓ విషయం చెబ్దామనుకుంటున్నాను బాబూ.” అన్నాడతను వినయంగా.


    “ఏమీ అనుకోను చెప్పండి” అన్నాను.


    “పెద్దయ్యగారు మా ప్లీడరుగారండి.  దాదాపు ఇరవయ్యేళ్ళక్రితం నేనోసారి మీ నాన్నగారి దగ్గరకొచ్చాను.  మా అబ్బాయిలు నాతో ఆస్తి విషయం లో తగాదా పడ్డారు.  దావా గురించని నాన్నగారి దగ్గరకొచ్చాను.  కన్నకొడుకులే ఆస్తికోసం నాతో గొడవలు పడేసరికి నాకు చాలాకోపం వచ్చింది.  మాంచి పట్టుదల మీద వున్న నేను ఎంత ఖర్చైనా సరే కోర్టుకెళ్ళడానికి సిద్ధపడి నాన్నగారి దగ్గరకొచ్చాను.  కానీ, కుటుంబం లో గొడవలకి వీధిలో పడడం మంచిది కాదనీ, కోర్టుకు వెళ్ళి కొడుకులకి మరింత దూరం కావద్దనీ నాకు నచ్చచెప్పి శాంతపరిచారు.  ఆ తర్వాత మా అబ్బాయిలను పిలిపించి, మాట్లాడి వాళ్ళక్కూడా నచ్చ చెప్పారు.  కోపాలు చల్లారాక మా అందరికీ కళ్ళు తెరుచుకున్నాయి.  అప్పటినుంచీ మా ఇంట్లో గొడవలు లేకుండా ఉమ్మడి కుటుంబంగా వుంటున్నాము.  మీ నాన్నగారే అలా చెప్పకపోయి వుంటే ఈరోజు మ కుటుంబం ముక్కలైపోయి వుండేది.  మీరు నమ్ముతారో లేదో కానీ, మీ నాన్నగారని ఇప్పటికీ మా ఇంట్లో దేముడిలా చూసుకుంటాము.  మా పెద్దమనవడికి నాన్నగారి పేరే పెట్టాము”  అంటూ ఆగాడు.


    వేడిమీదున్నపుడే ఇనుము బాగా వంగుతుంది.  కోర్టులో విన్న మాటల వల్ల వేడి మీదున్న నా మనసు ఈమాటలకు మరింత వంగినట్టు అనిపించింది.  ఇంతలో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు మాణిక్యాలరావు.


    “వారం రోజుల క్రితం పొలంగట్టు తగాదా గురించి మా అబ్బాయిలు మీదగ్గరకు వచ్చారండి బాబూ.  నిజానికి ఆ పొలంగట్టూ, దానిమీద వున్న మామిడి చెట్లూ మా ప్రక్క పొలం వాళ్ళకే చెందుతాయండి.  వేరే విషయంలో మాటామాటా వచ్చి మా వాళ్ళు గొడవకి దిగుతున్నారు.  మీతో మాట్లాడి వచ్చాక, ఆఫీసరుకెవరికో లంచం ఇచ్చి, పట్టాల్లో కొలతలు మార్పించి ఆ గట్టూ, చెట్లూ మావేనని చూపిస్తామంటున్నారు.  పరాయోళ్ళ పొట్టకొట్టి మనం వూళ్ళేల్తామా అంటే వినరు.  మీరైనా మావాళ్ళకు కాస్త బుద్ధి చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ.  మీనాన్నగారి పేరు నిలబెట్టండయ్యా.” అన్నాడు.


    చెంపమీద చెళ్ళున కొట్టినట్టయ్యింది మాణిక్యాలరావు మాటలకు.   పరాయి వాళ్ళ పొట్టకొట్టడం, నాన్నగారి పేరు నిలబెట్టడం అన్న మాటలే నా చెవుల్లో తిరుగుతుండగా, ఆలోచించి వాళ్ళబ్బాయిలతో మాట్లాడుతానని చెప్పి మాణిక్యాలరావుని పంపించేసాను.

 

    నాన్నగారికి మంచి పేరు, గౌరవం ఉన్నాయని తెలుసు.  ‘మీరు దేముడులాంటి వారు ‘ అని మాటవరసకు కొంతమంది అనడం కూడా తెలుసు.  కానీ, క్లయింట్లు నిజంగానే ఆయన్ని దేముడిలా చూడడం అనేది చాలా గొప్ప విషయం.  నాకూ చాలా మంది క్లయింట్లు వున్నారు కానీ, ఒక్కరైనా నన్ను అలా చూస్తారా?  న్యాయవాదిగా నా వద్దకు వచ్చిన క్లయింట్ల తరఫున వాదిస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నాననీ, నాకుటుంబం సంతోషంగా ఉండడానికి కావలసింది సంపాదిస్తున్నాననీ అనుకున్నాను కానీ, పరాయివాళ్ళ పొట్టకొట్టడం గురించి లెక్క చెయ్యలేదు.  క్లయింట్లకు పూర్వంలా లాయర్లంటే గౌరవం వుండడం లేదని అప్పుడప్పుడూ బార్ రూం లో అనుకుంటూ వుంటాము.  మరి నాలాంటి వాళ్ళుంటే లాయర్లకు గౌరవం ఎందుకుంటుందీ.  నాన్నగారు నెగ్గిన కేసుల్లో ఓడిపోయిన అవతలి పార్టీవాళ్ళు తరువాతి కేసులకి నాన్నగారి దగ్గరకే వచ్చిన సందర్భాలనేకం.  తమను ఓడించిన లాయరుగారన్నా వారికి గౌరవం, నమ్మకం కాబట్టి అలా చేసేవారు.  అంతెందుకు, నాన్నగారికి ఇవ్వాల్సిన ఫీజు ఇచ్చినా తమ సంతోషం కొద్దీ వెన్నా, తేనె, తేనెపాకమూ, జున్నూ, చెఱుకులూ, తోటలో కాసాయని అరటి పళ్ళూ, మామిడి పళ్ళూ, పనస, జీడి మామిడి ఒకటేమిటి ఎన్నో రకాల పళ్ళూ – ఇలా ఎన్నో బహుమతులను ఇచ్చేవాళ్ళు.  మేం ఉన్నది పట్టణమైనా, మా ఇంట్లో పాడిలేకపోయినా పల్లెల్లో దొరికేవన్నీ నాన్నగారి క్లయింట్ల కారణంగా మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి.  నా క్లయింట్లలో ఒక్కరూ అలా తెచ్చిన దాఖలా లేదు.  ఇచ్చిన డబ్బే చాలనుకున్నారో, ఎక్కువనుకున్నారో మరి.

 

    ఈ ఆలోచనల్లో ఉన్న నాకు చదువుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.  ఖాళీ వుంటే అప్పుడప్పుడు నాన్నగారి ఆఫీసు పనిలో సహాయం చేసేవాడిని సరదాగా.  అలా ఓరోజు నేను కూడా ఆఫీసులో ఉన్నపుడు ఇద్దరు పల్లెటూరి ఆడవాళ్ళు ఎదో దావా విషయమై వచ్చారు.  వాళ్ళతో మాట్లాడి, కోర్టు ఫీజు ఇంత, తన ఫీజు ఇంత అంటూ అయ్యే ఖర్చుల వివరాలు చెప్పి, మళ్ళీ సారి వచ్చినపుడు వాటికవసరమైన డబ్బును తీసుకు రమ్మన్నారు.


    “అమ్మో, ఇంత ఖర్చు అవుతుందని తెలీదు బాబుగారూ.  ఎలాగోలా తెస్తాంలెండి” అని వెళ్ళిపోయారు.  వారి దావా వివరాలు వ్రాసుకుంటూ నాన్నగారు చూడలేదు కానీ, ఆ ఖర్చులు భరించే శక్తి వాళ్ళకు లేదని వాళ్ళ ముఖాల్లోకి చూసిన నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది.  కానీ వారికున్న సమస్య విషయంలో కోర్టుకి వెళ్ళడం తప్ప వేరే గత్యంతరంలేని పరిస్థితి.


    కొన్ని నిముషాలయ్యాక నాన్నగారు నాతో అన్నారు, “ఇందాక వచ్చిన వాళ్ళిద్దరూ బస్ స్టాండు వైపు వెళ్తూ వుంటారు.  తొందరగా సైకిలు మీద వెళ్ళి, మళ్ళీ వచ్చినపుడు తీసుకురమ్మన్న సొమ్మేదీ తీసుకురానక్కర్లేదని చెప్పానని చెప్పు.” అని నన్ను పంపించారు.  నేను వెళ్ళి దారిలో వాళ్ళను కలసి నాన్నగారు చెప్పమన్నట్లు చెప్పాను.  అప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది.  వాళ్ళు ఆనందభాష్పాలు రాలుస్తూ “మీ నాన్నగారు దేవుడు బాబూ.  దేవుడు బాబూ.” అన్న నాలుగు మాటలలోని కృతజ్ఞతా భావం తెలిసినా, నాన్నగారి మంచితనం యొక్క విలువ అప్పట్లో నాకు పెద్దగా అర్ధంకాలేదు.  కానీ మనసు పొరల్లో ముద్రించబడిన ఆ సంఘటనయొక్క సారాంశం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పాఠంలా నాకు బోధపడింది.  డబ్బుతో సౌకర్యాలను కొనుక్కోవచ్చు, సంతృప్తిని కొనుక్కోలేం.  డబ్బుంటే పేరుప్రతిష్ఠలను సంపాదించవచ్చు కానీ వాటితో గౌరవమర్యాదలు వస్తాయన్న నమ్మకంలేదు.  నాన్నగారు వీధిలో వెళ్తూంటే మోటరుబళ్ళమీద వెళ్ళేవాళ్ళు కూడా ఆగి నమస్కరించి మరీ వెళ్ళేవారు.  అదే నా విషయంలో ఐతే, తప్పించుకోలేని పరిస్థితుల్లో మాత్రమే నమస్కరిస్తుంటారు.  క్లయింట్లకి నేనంటే భయం వుంది.  నాన్నగారంటే భక్తి వుంది.  అదే తేడా.

 

    నాన్నగారి లాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టి, ఆయనమంచితనానికి ప్రత్యక్ష సాక్షినై కూడా ఇన్నాళ్ళూ ఎందుకు మూర్ఖుడిలా ప్రవర్తించానో నాకు అర్ధం కాలేదు.  మంచిపని చేసినపుడు కలిగే ఆత్మతృప్తి వెలకట్టలేని నిధి లాంటిది.  ఆనిధినిపొందినవారు నిజమైన ధనవంతులు.  నా మంచితనాన్ని మెచ్చుకుంటూ ఎవరైనా నన్ను పొగిడితే కలిగే ఆనందం ఎంత డబ్బు సంపాదించినా రానిది.  ఆ అనుభూతి నాకూ కావాలి.  ఇకపై డబ్బుని కాక, అలాంటి గొప్ప అనుభూతిని సంపాదించడానికి ప్రయత్నించాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.


(ఆదివారం ఆంధ్రజ్యోతి 30-12-2007 సంచికలో ప్రచురితం)

Comments