పరోపకారార్థం - శ్రీకంఠస్ఫూర్తి

    
ఉదయం ఆరుఇరవై!

    విజయవాడ ఆరో నంబరు ప్లాట్‌ఫాంనుండి 'రత్నాచల్' బయలు దేరింది. ముందుగా తీసుకున్న టికెట్టుతో, కిటికీ మూలసీట్లో సౌకర్యంగా కూర్చున్నాడు కనకారావు. అతను కాకినాడ వెళ్ళాలి. సామర్లకోటలో ఈ బండి దిగి బస్సులో కాకినాడ పోవాలి. మధురానగర్‌లో మేనమామను చూసి, మూడుగంటలకి, మళ్ళీ ఇదేబండికి తిరుగు ప్రయాణం చేయాలి.

    మేనమామ మాధవరావుకు అరవై అయిదేళ్ళు. మూడు నెలల క్రితం, ఆయనకు పెద్ద ఆపరేషన్ జరిగింది. అప్పట్నుంచి చూసి వద్దామంటే, వీలు కుదరలేదు - అనడంకంటే వీలు కలిగించుకోలేదు కనకారావు. అతనికి వ్యాపారమే జీవితం. వ్యాపారమే ఆనందం... అయినా అతని అర్థాంగి సరోజ, మూడు నాలుగు సార్లు కాకినాడ వెళ్ళి వచ్చింది. అయిదురోజుల క్రితం, మళ్ళీ వెళ్ళి అక్కడే ఉండిపోయింది. కనకారావుని రమ్మని - ఫోనుమీద ఫోను! కనకారావు బయలుదేరక తప్పలేదు.

    సాధారణ టికెట్టు తీసుకున్నవాళ్ళు కూడా, ఖాళీ సీట్లు ఆక్రమించు కోవడంతో రిజర్వుబోగీ అంతా సందడిగా, రద్దీగా ఉంది. 

    కనకారావు ప్రక్క సీట్లో భార్యాభర్తలు, మూడేళ్ళ పాపను  ఒళ్లో కూర్చోబెట్టుకుని - ఒదిగి కూర్చున్నారు. కనకారావుకు కనిపించే కుడివైపు సోఫా బెంచీ మూడుసీట్లలో... కిటికి వద్ద ఏదో కంపెనీకార్డు తగిలించుకున్న ఉద్యోగి, అతని ప్రక్కనే పంచెకట్టు పెద్ద మీసాలతో ఉన్న పల్లెటూరి ఆసామి కూర్చున్నారు. ఖాళీగాఉన్న బెంచీ మొదటి సీట్లోకి... లాల్చీ పైజామాలో ఉన్న ఒక బక్క పలచని మనిషి... నంబర్లు వెదుక్కుంటూ, అప్పుడే వచ్చి ఆసీట్లో చేరగిలపడ్డాడు. సన్నగా కాస్త పొడువుగా ఉన్నాడు. నుదుట కాల్చినమచ్చ. కళ్ళజోడు, చప్పిడిముక్కు, బట్టతల, భుజానికి వ్రేలాడేసంచీ..! ఆ సంచీని ఒళ్ళో జాగ్రత్తగా సర్దుకుని - అందరి వైపు అమాయకంగా చూస్తున్నాడు. మనిషి అచ్చం 'వానపాము'లా ఉన్నాడనుకున్నాడు కనకారావు. అలా అనుకుంటే గాని అతనికి సంతృప్తి కలగలేదు...

    రత్నాచల్ అవుటర్ దాటి వేగం పుంజుకుంది!

    ఉదయకాలపు ప్రయాణం. కిటికీలోంచి చల్లగాలి వీస్తూ ఆహ్లాదకరంగా ఉంది. ప్రయాణీకులంతా ఉద్యకాలపు ఆనందాన్ని అనుభవిస్తూండగా...

    "పరిశుద్ధ పరిశుద్ధ, పరిశుద్ధ ప్రభువా!" ముసలి భిక్షగాడు ఒకడు సత్తుపళ్ళెంలో క్రీస్తుపటాన్ని పెట్టుకుని బోగిలో ప్రత్యక్షమయ్యాడు. కూర్చున్న వారిలో ఎవ్వరిలోనూ చలనంలేదు. కనీసం వాడివైపు చూడలేదు. కుడివైపు కిటికీ వద్ద కూర్చున్న కంపెనీ ఉద్యోగి "పోరాపో! ప్రొద్దుటే దరిద్రాన్ని నెత్తినేసుకుని తయారవుతారు, డర్టీరోగ్స్!" అంటూ కసిరాడు. ఆ ముసలి భిక్షగాడు కదల్లేదు. "బాబయ్యా" అంటూ అందరివైపు చూస్తున్నాడు. కనకారావుకూడా చిరాగ్గా చూశాడు. అతడి కుడివైపు బెంచీ మొదటిసీట్లోని, లాల్చీపైజామా వ్యక్తి, తన చేతిసంచీలో చేయిపెట్టి, పదిరూపాయల కాగితం బయటకు తీసి, ఆ ముసలాడి పెళ్ళెంలో వేశాడు. "అలెలూయా!" ఆ బిక్షగాడు, ఆనందంగా పదినోటు కళ్ళకద్దుకుని, ముందుకు వెళ్ళిపోయాడు.

    "వానపాము అనుకున్న వ్యక్తి ఏకంగా పదినోటు దానంచేశాడే..." అనుకోకుండా ఉండలేకపోయాడు కనకారావు. రెండు నిముషాలు గడవలేదు. ముఖమంతా కాలిపోయి, నల్లగా మాడిపోయి, ఒంటికన్నుతో భీకరంగా తలనిండా కొంగుకప్పుకున్న ఓ నడి వయసు స్త్రీ.. అందరి ముందు చేయిసాచి అడుక్కోసాగింది.

    కనకారావు ప్రక్కదంపతులు, ఆ స్త్రీ ముఖం చూడలేక తలతిప్పుకుని, ఒళ్ళోబిడ్డను దగ్గరికి తీసుకున్నారు. దాదాపు అందరూ ఆ స్త్రీని ఏవగింపుగా చూస్తున్నారు. "వెళ్ళమ్మా!వెళ్ళు! అలాపైకి వెళ్ళు!" కనకారావు కోపంతో అరిచాడు. లాల్చీ పైజామాలోని వ్యక్తి, మళ్ళీ సంచీలోంచి పదిరూపాయలు తీసి - ఆస్త్రీకి ధర్మం వేశాడు. ఆ స్త్రీ ఒంగిఒంగి దణ్ణాలు పెడుతూ వెళ్ళిపోయింది.

    "వానపాము మళ్ళీ పదిరూపాయలు వేశాడే!" కనకారావు ఆశ్చర్యంగా చూశాడు. ఆ స్త్రీ అలా వెళ్ళిందో లేదో, "భలేమంచిరోజు, పచందైనరోజు" ఒక గుడ్డివాడు పాడుతూంటే... భార్యేమో అతన్ని నడిపిస్తూ వచ్చి యాచన మొదలుపెట్టింది. ఆ గుడ్డిగాయకుడు గొంతు పెంచి గుండెలదిరేలా పాడుతున్నాడు. ఎవరూ గుడ్డివాడి గానానికి స్పందించలేదు. కనకారావుతోబాటు, అందరూ ఏమిటీ బిక్షగాళ్ళ గోల అనుకుంటూ అసహనంగా చూస్తున్నారు. 

    లాల్చీ పైజామాలోని 'వానపాము' శాల్తీ ఈసారి కూడా సంచీలోంచి, ఇరవై రూపాయలనోటు, అలవోకగా తీసి, గుడ్డివాడి బొచ్చెలో వేశాడు.

    కనకారావు 'వానపాము'వైపు అనుమానంగా చూశాడు. ఎవరీ శాల్తీ? వచ్చిన బిచ్చగాడికల్లా పదిఇరవై నోట్లు ధర్మం చేస్తున్నాడు. బాగా డబ్బున్నోడా? లేక అడ్డంగా సంపాదించి, తిన్నది అరగక, ఏం చేయాలో తోచక ఇలాదానం చేస్తున్నాడా? ఏవిటీ సంగతి?

    కనకారావు ఆలోచన్లలో కొట్టుమిట్టాడుతూండగానే... ఓ ముష్ఠితల్లి తన అయిదేళ్ళకొడుక్కి పసుపు నీలం రంగుల దుస్తులు వేసి... మూతికి ఎర్రటి స్పాంజి అంటించి, వీపుమీద రబ్బరుతోక అంటించి, బాలహనుమంతుడి వేషంలో... అందరిముందుకు నడిపించి అడుక్కోసాగింది.

    కనకారావుకు ఒళ్ళు కంపరమెత్తిపోతున్నట్లుగా ఉంది..! "ఎవరు వీళ్ళు? ఎక్కడ్నుంచివస్తున్నారు? ఇంతసేపు ఎక్కడున్నారు? నాటకంలోని పాత్రల్లా, ఒకరితరువాత ఒకళ్ళు... ప్రయాణీకుల్ని ఇబ్బంది పెడుతూ, చికాకు పెడుతూ, రైల్లో అడుక్కోవడానికి, ఎవరిచ్చారు వీళ్ళకు హక్కు..?

    కనకారావుకు స్వతహాగా అడుక్కునే వాళ్ళంటే, కోపం, అసహ్యం..! వీళ్ళు ఒఠ్ఠి సోమరిపోతులు... కనీస కష్టం తెలియనివాళ్ళు... ఒళ్ళు అలవకుండా సునాయసంగా, డబ్బు సంపాదనమరిగిన వాళ్ళు... అడుగడుగునా వాళ్ళే...! దేశదరిద్రాన్ని వెదజల్లినట్లు ఎక్కడ చూసినా వీళ్ళే..! వీళ్ళందరినీ కలిపి, కట్టకట్టి కాల్చిపడేస్తే, దేశం ఎంత పరిశుభ్రంగా ఉంటుంది? ఎవరు చేస్తారీ పని?

    బాలహనుమంతుడి వేషానికి, ఒకళ్ళిద్దరు, రూపాయి, అర్థ చిల్లర ఇచ్చినా... లాల్చీ పైజామాలోని 'వానపాము' బాలహనుమంతుడ్ని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుని సంచీలోంచి, రెండో మూడో పదులనోట్లు, ఆ కుర్రాడి బుల్లిచేతుల్లో పెట్టి ముచ్చట తీర్చుకున్నాడు. తరువాత, సగం చేయి సగం కాలు ఉన్న ఓ అవిటివాడు, కొడుకులు వదిలేసిన అనాథతల్లి, ఆసుపత్రి నుంచి సరాసరి వచ్చినట్లు, ఎర్రటి రక్తపు మరకల కట్లుకట్టుకున్న రోగిష్టివాడు, చిడతలు వాయిస్తూ రామనామం పాడిన నామాలతాత, ఇలా బిక్షగాళ్ళందరికీ పదీ, ఇరవై చేతికందినన్ని - నోట్లు సంచీలోంచి తీసి, ఆ బక్కపలచని శాల్తీ ధర్మం చేస్తూనే ఉన్నాడు. "మీదే ఊరండీ? ఏం చేస్తుంటారు? మీ పేరు తెలుసుకోవచ్చా..?" కనకారావు ఉండబట్టలేక అడిగేశాడు.

    "నన్నంతా భిక్షపతి అంటారు నాయనా!మాది అమరావతి దగ్గర చిన్న అగ్రహారం. నేనేం చేస్తుంటానని అడిగారు కదా..! ఇదిగో, ఇలా అడిగిన వాళ్ళకు ఎంతోకొంత ఇవ్వడం. అడగనివాళ్ళ నుంచి ఎంతోకొంత అడిగి తీసుకోవడం."

    భిక్షపతి మాటలు కనకారావుకు అర్థమయి అర్థంకానట్టుగా తోచాయి. 'ఏంటేంటీ..? అడిగినవాళ్ళకు ఎంతో కొంత ఇచ్చి అడగని వాళ్ళనుంచి, ఎంతోకొంత అడిగి తీసుకుంటాడా? కొంపదీసి, ఈయనేమన్నా స్వామీజీయా..? వేషం చూస్తే అలాలేదే?'

    "మీరు మరోలా అనుకోవద్దు. మీరు బాగా డబ్బున్నవారా? పూర్వీకులు దండిగా సంపాదించినవారా? ఏం లేదు... అడుక్కునే వాళ్ళందరికీ, పదులు - ఇరవైలు - ఉదారంగా ధర్మం చేస్తుంటేనూ!!" కనకారావు ఉక్రోషంగా అడిగాడు.

    "సాటి మనిషిని గుర్తించడమే సంస్కార సంపద. దాన్నిమించిన ఆస్తిపాస్తులు ఇంకేం ఉంటాయి నాయనా!"

    "ఒక్కమాట! మీరిలా భిక్షగాళ్ళందరికీ పది, ఇరవై ఇవ్వడం వాళ్ళ సోమరితనాన్ని ప్రోత్సహించడం కాదా?" కనకారావు సూటిగా అడిగాడు.

    సహప్రయాణీకులు వీళ్ళమాటల్ని ఆసక్తిగా వింటున్నారు. 

    "మనమంతా కర్మజీవులం నాయనా! పాప పుణ్యాల పరిధిలో పరిభ్రమిస్తున్న వాళ్ళం. ఈ భిక్షగాళ్ళు కర్మజీవులు. బ్రతుకు గతి తప్పిన స్థిత్లో వేరే దారిలేక, ఈ స్థితికి దిగజారిన వాళ్ళు. ఎవరూ కావాలని దిగజారి పోరుకదా! ఒకరిముందు దేహీ అనే జన్మ ఎంత దౌర్భాగ్యమో ఊహించండి! ఏదో మనకు ఉన్నంతలో, మనం తిన్నంతలో ఎంతోకొంత..."

    భిక్షపతి మాటలు కనకారావుకు మింగుడు పడలేదు. 'ఈయనేదో వేదాంతం కబుర్లు చెబుతున్నాడుగానీ, లోపల మరో మనిషి ఉన్నాడు. అందరి ముందు ఇలా ధర్మం చేయడంలో అంతరార్థం ఏదో ఉండేఉంటుంది. మందిలో మంచివాళ్ళలా నటించి... ముఖ్యంగా ఈ రైలు ప్రయాణాల్లో మోసాలు చేసేవాళ్ళని, ఎంతమందిని చూడటంలేదు. ఈ వానపాముకూడా అలాంటివాడేఈ సందేహం లేదు.'

    కనకారావు ఒక నిర్ణయానికొచ్చి, భిక్షపతిని మరింత నిశితంగా పరిశీలించ సాగాడు.  'రత్నాచల్' ఏలూరులో ఆగింది. అప్పటికి వచ్చీపోయే భిక్షగాళ్ళ రద్దీ కాస్త తగ్గింది. అడ్డంగా ఊపి అతివినయంగా ధన్యవాదాలు చెప్పాడు! 

    "ఎంతవరకూ మీ ప్రయాణం?" కనకారావు భిక్షపతిని అడిగాడు.

    "విశాఖ వరకూ టికెట్టు ఉంది... మధ్యలో ఏవూళ్ళో దిగాలనిపిస్తే ఆ వూళ్ళో దిగిపోతాను నాయనా..!"

    'ఈ మనిషే కాదు... మాటలు కూడా అయోమయంగా ఉన్నాయి. ఏమైనా మనిషి తేడా..! ఆ తేడా ఏవిటో తెలుసుకోవాలి!' కనకారావు దృఢంగా నిశ్చయించుకున్నాడు. రత్నాచల్ దడదడమంటూ పరుగుపెడుతోంది. తాడేపల్లిగూడెం దాటి, రాజమండ్రి వచ్చేలోపుగా భిక్షపతి ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. అందరివైపు చూస్తూ రెండు చేతులు జోడించాడు.

    "మీరు ఉన్నవారయితే... మనసు ఉన్నవారయితే, పరోపకారార్థం... అనాథలకి, అసహాయులకి, వికలాంగులకి, ఏదిక్కూ లేని వృద్ధులకి, ఆర్థిక సహాయం చేయొచ్చు. వంద, అయిదు వందలు, ఆపైన ఎంతైనా మీరు ఇవ్వవచ్చు... నా సంస్థలో అలాంటి అభాగ్యులు చాలామంది ఉన్నారు. మీరిచ్చిన సొమ్ముకు నేనిప్పుడే రశీదు రాసిస్తాను" భిక్షపతి అటూఇటూ చూస్తూ సహ ప్రయానికుల్ని వినమ్రంగా అభ్యర్థించాడు!

    అతనిమీద నమ్మకం కలగలేదో మాటల్లో నిజాయితీ ధ్వనించలేదోగాని ఎవరూ ముందుకు రాలేదు. కనకారావుకు మాత్రం  భిక్షపతి మీద అభిప్రాయం ఒకటి బలపడింది. ఈ భిక్షపతి నిజంగానే మోసగాడే..! అసలు స్వరూపం ఇప్పుడు బట పడింది. పదులూ, ఇరవైలూ ధర్మంచేసి, వందా, అయిదు వందలూ విరాళం ఇమ్మని అడుగుతున్నాడు. ఇదంతా ఓ నాటకం. ఆ భిక్షగాళ్ళూ ఇతగాడికి తెలిసినవాళ్ళేమో! ఏమో!

    కనకారావు కిమ్మనకుండా ఉండి పోయాడు.

    అతడు డబ్బు విషయంలో, చాలా నిక్కచ్చితనం పాటిస్తాడు. దానం, ధర్మం, దయ, మంచి మానవత్వం లాంటి మాటలు అన్ని డబ్బు తర్వాతే అనుకుంటాడు. మేనమామ మాధవరావు ఆరోగ్యం, చావు బ్రతుకుల సమస్యగా పరిణమించినప్పుడు కూడా, కనకారావు ఈ నిక్కచ్చితనమే ప్రదర్శించాడు!

    మాధవరావుకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి జరగాల్సిఉంది. లేకపోతే బ్రతికే అవకాశం లేదు. శరీరం నీరు పట్టినట్టుగా వాచిపోయి, రక్తంలో మూత్రం పేరుకుపోయి వారానికి రెండుసార్లు రక్తశుద్ధి చికిత్స తప్పని సరవుతోంది. ఆ పరిస్థితుల్లో ఎవరైనా కిడ్నీదానం చేయాలి. లేదా లక్షలు ఖర్చుపెట్టి బయటకొనాలి. అంతకంటే ముందు కిడ్నీదాత దొరకాలి. దూరంగా ఉద్యోగాల్లో ఉన్న కొడుకులిద్దరూ చేతులెత్తేశారు. ఒకడు ఉన్న డబ్బుకు అప్పు జతచేసి, ఈమధ్యనే ఫ్లాట్‌కొనేశానన్నాడు. మరొకడు కర్నాటకలో కొడుకు మెడిసిన్ సీట్‌కోసం డబ్బంతా ఖర్చయిపోయిందన్నాడు. కూతురికి ఉద్యోగం లేదు. కానీ ఆమె తండ్రికి కిడ్నీదానం చేయడానికి ముందుకు వచ్చింది. అల్లుడు పడనివ్వలేదు. నాతండ్రిని రక్షించుకుంటానని కూతురు ఏడ్చింది. గొడవపెట్టింది. పట్టుబట్టింది.

    "ఒక కిడ్నీతో నీకేమన్నా సమస్య వస్తే నేనూ పిల్లలూ ఏమయిపోవాలి..? ససేమిరాకుదరదు. అదే నీ నిర్ణయమయితే విడాకులిస్తా"నని హెచ్చరించాడు. ఎవరు ఏం చెప్పినా వినలేదు. మాధవరావు భార్యకూడా అనారోగ్యం మనిషే! కిడ్నీ ఇచ్చే స్థితిలో ఆమె కూడా లేదు. ఆ పరిస్థితిలో అందరూ కనకారావుని డబ్బు సర్దమని ప్రాధేయపడ్డారు. తనదగ్గర ఆ సమయానికి వ్యాపారం తాలూకు డబ్బున్నా లేదని నిక్కచ్చిగా చెప్పేశాడు కనకారావు! 'మేనమామ కోసం తనెందుకు పెట్టుబడి పెట్టాలి. పెట్టినా ఆ డబ్బు ఎన్నాళ్ళకు తిరిగొస్తుంది? ఎవరు తీరుస్తారు? వడ్డీ ఎంత నష్టం? కొడుకులే చేతులెత్తేసినప్పుడు తనెందుకు పట్టించుకోవాలి?' అనుకుంటూ మనసును సరిపుచ్చుకున్నాడు. తరువాత కొడుకులు ఏపాట్లు పడ్డారో... అప్పే చేశారో తప్పే చేశారో తను పట్టించుకోలేదు. మేనమామ కిడ్నీ మార్పిడి జరిగిపోయిందని విన్నాడు అల్లుడూ, మేనల్లుడూ కనకారావు.

    కనకారావు అప్పటినుంచి, కావాలనే మేనమామను చూడటానికి వెళ్ళలేదు! ఇప్పుడిక తప్పలేదు. అతడు ఆలోచనల్లో ఉండగానే 'రత్నాచల్'ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి స్టేషన్లో ఆగింది. అక్కడ దిగే ప్రయాణీకులతోబాటు, భిక్షపతికూడా దిగిపోయాడేమో అతని సీటు ఖాళీగా కనిపించింది. ఏమయ్యాడు? ఎక్కడకు పోయాడు? మనిషి ఇట్టే మాయమయి పోయాడే..! విశాఖవరకూ టిక్కెట్టు ఉందన్నాడు. రాజమండ్రిలో దిగిపోవడం ఏమిటి? విరాళాల ప్రయత్నం బెడిసికొట్టిందని మరో బోగీలోకి వెళ్ళిపోయాడా? నిజంగా దిగిపోయాడా? ఏమైనా మనిషి మాత్రం తేడాకదూ..!

    మరోగంటలో సామర్లకోట వచ్చేసింది. కనకారావు కాకినాడ బస్సెక్కి ముప్పావుగంట ప్రయాణంచేసి, బాలాజీ చెరువు సెంటర్లో దిగాడు. ఆటో బేరమాడుకుని, మధురానగర్‌లో ఉన్న మేనమామ ఇంటికి చేరేసరికి, పదకొండున్నర గంటలయింది. భార్య సరోజ ఎదురొచ్చింది.

    "ఏవండీ! వచ్చారా! అమ్మయ్య... ముందాపంపు దగ్గర నీళ్ళతో కాళ్ళు కడుక్కుని రండి!" భార్యమాటతో, కాళ్ళు కడుక్కొని హాల్లో కూర్చున్నాడు కనకారావు. అత్తగారు వచ్చి పలకరించి వెళ్ళింది. 

    "నాన్నగారు మిమ్మల్ని చూడాలని ఉందని పదేపదే అడిగితేనూ, మీకు ఫోను చేశాను. 'నాకు ఆపరేషను జరిగినప్పుడు వాడు రాలేకపోయాడు. అప్పుడేదో కారణం చెప్పావు. వాడ్ని ఒకసారి చూడాలమ్మా' అంటూ పట్టుబడితేనూ... ఇక తప్పలేదు మిమ్మల్ని రప్పించడం." చేతికి మంచినీళ్ళగ్లాసిచ్చి, 'టీపెడతా'నంటూ లోపలికి వెళ్ళింది సరోజ. మంచినీళ్ళు... తర్వాత తాపీగా టీ త్రాగి మేనమామ మాధవరావు గదిలోకి నడిచాడు కనకారావు..!

    మాధవరావు ఉన్న పెరటి వైపు గది పరిశుభ్రంగా ఉంది. కాలుష్యం ప్రవేశించకుండా కాబోలు, గదంతా మందు వాసన వేస్తోంది. మాధవరావు మంచం చుట్టూ పాతమిత్రుల్ని కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నాడు.

    "మావయ్యా! నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వాడుతున్నారా?" కనకారావు మేనమామను పలకరిస్తూ దగ్గరగా వెళ్ళి స్టూలు మీద కూర్చున్నాడు.

    "రారా! నాయనా! ఇప్పుడేవచ్చావా? నా ఆరోగ్యం బాగానే ఉంది. మందులు నిత్యం వాడుతూనే ఉండాలి... మళ్ళీ పునర్జన్మేగా! ఒక పుణ్యాత్ముడు నాకు కిడ్నీ దానం చేసి, ఈ పునర్జన్మనిచ్చాడు. ఆయనే పుణ్యం కట్టుకోకపోతే... ఈ మావయ్య నీకిలా కనిపించేవాడు కాదు" మాధవరావు ఒక్క క్షణం కళ్ళుమూసుకున్నాడు. "పోనీలే మావయ్యా! ఎలాగయితేనేంఁ! నీ ఆరోగ్యం కుదుట పడింది. ఏమైనా అదృష్టవంతుడివే నువ్వు" కనకారావు అభినందనగా అన్నాడు.

    "నాకు కిడ్నీ మార్పిడి జరిగినపుడు, నువ్వురాలేదు కదూ! నీకు అంతా చెప్పుకోవాలి. నాకు రక్తశుద్ధి జరిగే ఆసుపత్రికి యాదృచ్ఛికంగా వచ్చాడా పుణ్యాత్ముడు. నాగురించి వివరాలు తెలుసుకుని 'నేను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధం. అది మీకు సరిపోతుందనుకుంటే, ఏర్పాట్లు చేసుకోండి!' అన్నాడట. అదృష్టవశాత్తు అన్ని రక్త పరీక్షల్లోనూ, టిష్యూ పరీక్షల్లోనూ ఆయన కిడ్నీ నాకు సరిఓతుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆయనెవరో... నేనెవరో... ఏనాటి ఋణానుబంధమో!

    ప్రతిఫలంగా ఆయనేమీ ఆశించలేదు కూడా! 'పాంచభౌతికమైన ఈ శరీరం పరులకు ఉపయోగపడటం కంటే ధన్యత ఏముంది నాయనా! నేనివ్వగలిగే స్థితిలో ఉన్నాను! నాలో సంకల్పం చావు బ్రతుకుల సరిహద్దులో ఉన్న మాధవరావుకు సాయం చేయమంది... పరోపకారార్థం! ఇదం శరీరం కదా!' అన్నారు."

    మాధవరావు ఆత్రంగా చెప్పుకు పోతున్నాడు.

    "ఇంతకూ ఆయన పేరేమిటి మావయ్యా! ఏవూరు?" కనకారావు యథాలాపంగా అడిగాడు.

    "ఆయన పేరు భిక్షపతి. సన్నగా చిన్నగా చీపురు పుల్లలా ఉంటాడు. ఊరు అమరావతి దగ్గర చిన్న అగ్రహారం..."

    కనకారావు తుళ్ళిపడ్డాడు..!

    "మావయ్యా! ఈ భిక్షపతిగార్ని నేనిపుడు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో కలిశాను... రైల్లో ప్రయాణీకుల్ని విరాళాలిమ్మని అడగటం కూడా చూశాను!" ఆశ్చర్యంగా అన్నాడు కనకారావు. అతనికి, ఊహించని విధంగా అనిపించింది! భిక్షపతి రూపం కళ్ళముందు కదలినట్లయింది. "అవునా నాయనా! ఆయనే నాకు ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడు. ఊరూరా తిరుగుతుంటాడు. విరాళాలు సేకరిస్తూ... అనాథలకు, అసహాయ వృద్ధులకు సేవలు చేస్తుంటాడు. మేము కూడా ఆయన నడీపే 'పరోకారం' సంస్థకు నామమాత్రంగానే విరాళం ఇవ్వగలిగాం. భిక్షపతి బ్రైకి ఉన్నప్పుడే కాదు... గతించిన తరువాత కూడా తన సర్వావయవాల్ని వైద్య పరీక్షల నిమిత్తం దానం చేసిన త్యాగపురుషుడాయన" మాధవరావు ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు.

    కనకారావులో ఏదో కదలిక మొదలయింది! 

    'రైల్లో కలిసి, రాజమండ్రిలో దిగిపోయిన భిక్షపతి... మావయ్యకు కిడ్నీ దానం చేశాడా? అల్లుడిగా, మేనల్లుడిగా రక్త సంబంధం ఉన్న్ తను సాయం చేయడానికి ముఖం చాటేస్తే... ఏ సంబంధమూ లేని భిక్షపతి ప్రాణభిక్ష పెట్టాడా?

    కనకారావుకు ఎందుకో సిగ్గుగా ఉంది. ఏదో అపరాధ భావం దహించి వేస్తోంది. 'మనుషుల్లో ఇలాంటి నిస్వార్థపరులు కూడా ఉన్నారా? అరుదైన మనిషి... కాదు మనీషి! ఎవరు కనిపించినా, ఏం మాట్లాడినా, ప్రతికూల దృష్టితోనే చూడటం అలవాటయిన, తను రైల్లో భిక్షపతిని, మోసగాడిగా అనుమానించాడు. వానపాముగా ఛీత్కరించాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా భిక్షపతి మళ్ళీ కనిపిస్తాడా?

    కనిపిస్తే, ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి, సంస్కారానికి శిరసు వంచి నమస్కరించాలి. ఆయన నిర్వహించే పరోపకారం సంస్థకు తనూ, ఎంతో కొంత విరాళం ఇవ్వాలి.' కనకారావు ఆక్షణమే నిర్ణయించుకున్నాడు.

    "మాధవరావుగారూ! బావున్నారా! మిమ్మల్ని చూడాలనిపించింది. రాజమండ్రిలో రైలు దిగి, సరాసరి మీవద్ద్కేవస్తున్నా..." అదిగో అప్పుడు ఆగదిలోకి భిక్షపతి అడుగుపెట్టాడు..!

(జాగృతి వారపత్రిక 9సెప్టెంబరు2013 సంచికలో ప్రచురితం)   
Comments