పశ్చాత్తాపం - హోతా పద్మినీ దేవి

    
"ఈ ముసలాయన్ని కూర్చోబెట్టి ముప్పొద్దులా వండి పెట్టలేకపోతున్నాను. గుర్రం గుడ్డిదైనా దాణా పెట్టవలసిందేనన్నట్టు ఏ పనీ చేయలేకుండా మూల కూర్చున్న ముసలాయనకి కుడా అన్ని రుచులూ కావాలి."

    వంటింట్లో నుంచి వినిపిస్తున్న విశాల గొణుగుడు... గొణుగుడేమిటి తనకి వినిపించేలా రుసరుసలాడుతున్న మాటలు వినిపించి, హాలులో కూర్చుని పేపరు చదువుతున్న జానకిరామయ్య నిట్టూర్చాడు. ఒక్క క్షణం మనస్సు చివుక్కుమన్నా "పాపం! ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? సరిగ్గా వంట మొదలు పెట్టే సమయానికి పవర్ కట్! ఏడున్నరకల్లా పిల్లలకి క్యారేజీలు సర్ది వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూలుకి పంపి విశ్వానికి టిఫిన్ డబ్బా రెడీ చేసి తనకి టిఫిన్ పెట్టేసరికి, ఆమె ముఖంలోని అలసట అసహనంగా, నిస్సత్తువ తనపై నిర్లక్ష్యంగా మారుతుంది. ఇడ్లీలో పచ్చడి అయిపోయినా ఇటు వైపే రాదు. అడగడానికి తనకి మొహమాటం. ఎలాగో వట్టి ఇడ్లీయే తిని చెయ్యి కడుక్కుంటాడు. 
 
    సీతామహలక్ష్మి జానకిరామయ్యల దాంపత్యం నిజంగా సీతారాముల దాంపత్యమే. భర్త కనుసన్నలలో మెలుగుతూ, ఆయన నోరు విప్పి ఇది కావాలని అడగక ముందే అన్నీ అమర్చి పెట్టేదావిడ. అలాంటి ఉత్తమురాలు ఒకరోజు నిద్రలోనే చనిపోయింది. పుణ్యస్త్రీగా చనిపోయిన ఆవిడ అదృష్టవంతురాలన్నారందరూ.
భారయ్ మరణం జానకిరామయ్యని బాధించినా ఎవరినీ బాధపెట్టకుండా తను బాధపడకుండా సునాయాస మరణాన్ని పొందిన ఆమె అదృష్టవంతురాలనుకున్నాడు. కాని, తనకి తోడు నీడగా నిలిచిన భార్య లేని జీవితం ఎంత దుర్భరంగా గడవబోతోందో, తనెంత దురదృష్టవంతుడో అప్పుడు తెలిసిరాలేదతనికి.
 
    అత్తగారు పోయిన కొత్తలో విశాల ఆయన్ని బాగానే చూసేది. 'మావగారు' అని అగ్గగ్గలాడిపోతూ ఆయనకి వేళకి అన్నీ అమర్చిపెట్టేది. రెండు నెలలు గడిచేప్పటికి ఆమెలో అసహనం పెరిగి పోయింది. పిల్లలతో కలిసి ఏ సినిమాకో, పిక్నిక్‌కో వెళ్ళాలన్నా ఇంట్లో పెద్దాయన్ని వదిలేసి వెళ్ళిందని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకుంటారని భయం. పెళ్ళికో, పార్టీకో వెళ్లాలనుకుంటే ఇంట్లో మామగారికి వంట చెయ్యడం తప్పనిసరి. ఎప్పుడైనా ఇంటి భోజనం మొహం మొత్తి హోటల్‌లో తిందామన్నా అదే పరిస్థితి. క్రమేణా మామగారు వదిలించుకోలేని పెద్ద బరువుగా అనిపించసాగారు.
    
    తమకంటే పెద్దవాళ్లయిన బావగారు, తోడికోడలు అమెరికాలో ఎలాంటి బాదరబందీ లేకుండా సుఖంగా ఉంటే తామీ బరువుని మొయ్యవలసిరావడం ఆమెకి అసంతృప్తిని కలుగజేసింది. ఆమెలోని అసంతృప్తి అసహనంగా, అసహనం మామగారిపై తిరస్కారభావంగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. సన్నగా మొదలైన ఆమె సణుగుడు సాధింపుగా మారడం జానకిరామయ్య గమనించకపోలేదు. కోడలికి తన ఉనికి కంటకప్రాయంగా మారిందని గ్రహించలేని అమాయకుడు కాదాయన. జరుగుతున్న తతంగాన్ని కొడుకు చూసీచూడనట్లు ఊరుకోవడం కూడా గమనించాడు. క్రమేపీ విశ్వం తనతో మాట్లాడ్డం, తనతో కలిసి భోజనం చెయ్యడం మానేసినా, "పోన్లే చిన్నపిల్లలు, వాళ్లిద్దరికీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఉండదా" అని సర్దుకున్నాడు.
 
    పనస చెట్టు మొదట్లో బరువుగా వేలాడుతున్న కాయలని చూడగానే జానకి రామయ్య కళ్ళు మెరిశాయి. తన ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతోందో, లేక తనపై కక్ష సాధింపుతో పెడుతోందో తెలియదు గాని, కోడలు పెట్టే ఉప్పు కారం లేని చప్పిడి మెతుకులు తినితిని ఆయన జిహ్వ చచ్చింది. మంచి ఆరోగ్యం, జఠరాగ్ని కలిగిన ఆయన రుచికరమైన భోజనానికి ముఖం వాచిపోయాడు.
 
    పనస పొట్టు ఆవ పెట్టిన కూరని తలచుకుంటే ఆయన నోట్లో నీళ్ళూరుతున్నాయి. లేతగా ఉన్న పనసకాయని కోసి తను సన్నగా పొట్టు కొడితే భార్య ఎంత కమ్మని కూర వండేది? ఆ మాటకొస్తే తను పనసకాయని కోసిన రోజు ఆ వీధిలో నలుగురైదుగురి ఇళ్లలో పనస పొట్టు కూరనే వండుకునేవారు. వండుకోవడం రాని వాళ్లకి సీత వండిన కూరనే ఇచ్చేది.
మరచిపోయిన రుచి గుర్తొచ్చి నోట్లో నీళ్ళూరుతుంటే పనసకాయ కోశాడు. స్టోర్ రూమ్‌లో నుంచి పనసకాయ కోసే కత్తిపీట తెచ్చి తొక్క తీశాడు.
 
    "అమ్మా! విశాలా! గిన్నెతో కొంచెం నూనె ఇవ్వమ్మా!" కోడలిని బిగ్గరగా పిలిచాడు.
 
    "ఎందుకూ?" ముఖం చిట్లించుకుంటూ వచ్చింది. మామగారి చేతిలోని పనసకాయని చూసి ఆమె కళ్లు వెడల్పయ్యాయి.

    "పనసకాయా? ఇప్పుడు తీరుబాటుగా ఆ పనెందుకు పెట్టుకున్నారూ?"

    "పనసపొట్టు కూర తినాలని ఉందమ్మా!"
 
    "నేను వండను. ఈ వయసులో ఆవ పెట్టిన కూరలు తిని రోగం తెచ్చుకుని మీరు మంచమెక్కితే నేను చాకిరీ చెయ్యలేను" విసవిసలాడుతూ వెళ్లిపోయిందామె.
 
    జానకిరామయ్య చేతిలోని పనసకాయవైపు నిస్పృహగా చూసి అంతలోనే ఏదో స్ఫురించినట్టయి వంటగది వైపు వెళ్లాడు.
 
    "పోన్లే! నువ్వు వండొద్దు. ఎలాగూ కాయకి తొక్క తీసేసాను కదా! పొట్టుకొట్టి, చుట్టు పక్కల నలుగురికీ ఇస్తాను. వాళ్లయినా వండుకుంటారు."
 
    "అంటే! ఏమిటి మీ ఉద్దేశం? ఇరుగు పొరుగు వాళ్లకి పనసపొట్టు ఇచ్చి వాళ్లని కూర అడుక్కుని తెచ్చుకుంటారా?" విసురుగా అడింగింది.
 
    'అడుక్కుని' అనే మాట ఆయన మనసులో శూలంలా దిగబడింది. విహ్వలంలా చూస్తుండి పోయాడు.
 
    "కొంచెం నోరు కట్టుకోలేవా నాన్నా? ఈ వయసులో ఊరగాయలూ ఆవ పెట్టిన కూరలూ తింటే బి.పి.రెయిజవదా? విశాల నీ మంచి కోరి చెబుతోందని అర్థం చేసుకోవేం?" అన్నాడు విశ్వం భార్యకి సపోర్టుగా.
 
    జానకిరామయ్య పెదవులపై విరిగిన పాలలాంటి నవ్వు కదలాడింది. నిజానికి విశ్వం నోరు కట్టుకోమనవలసింది తనని కాదు. మామగారు అనే గౌరవంలేకిండా 'అడుక్కుని' అనే పదప్రయోగం చేసినందుకు చేతనైతే భార్యని నోరు మూసుకోమనాలి. ఆయన నిర్వేదంగా నవ్వుకున్నాడు. ఆ రాత్రి ఆయనకి నిద్రపట్టలేదు. కోడలి ప్రవర్తన, కొడుకు తనని పట్టించుకోకపోవడం ఆయనకి బాధ కలిగిస్తోంది. మరునాడు ఆయన నిద్రలేచేప్పటికి బారెడు పొద్దెక్కింది. పెరట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి స్తభీభూతుడయ్యాడు. పనివాడు పనస చెట్టుని గొడ్డలితో నరుకుతున్నాడు. దగ్గరుండి చెట్టు నరికిస్తున్న విశ్వం తండ్రిని చూసి అతి మామూలుగా చెప్పాడు.
 
    "పనసకాయ కావాలంటే బజార్లో కొనుక్కోవచ్చు. దానికోసం పెరడంతా ఆక్రమించుకునేలా చెట్టు పెంచుకోనక్కర్లేదు. దానికి బదులు ఏవైనా పూలమొక్కలు వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగానూ ఉంటుంది, దేవుడి పూజకూ పనికొస్తాయి" అంటున్న కొడుకువైపు చూసి నావి, బాత్‌రూమ్‌లోకి వెళ్ళాడాయన.
 
    విశ్వం ఆ నవ్వులోని వెలితిని కనిపెట్టకపోలేదు.
 
* * *

    ఆరోజు సీతామహాలక్ష్మి ఆబ్దికం. వంటమనిషి వచ్చి వంట మొదలు పెట్టింది. వంటగదిలోనుంచి కమ్మటి సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి.

    "మా అత్తగారికి కాకరకాయలు చాలా ఇష్టం. అందుకని ఎంత ఖరీదైనా సరే అని అవి కొన్నాను. కూర చెయ్యండి" చెబుతోంది విశాల.
 
    "ఎంత గొప్ప మనసమ్మా మీది. ఈ రోజుల్లో ఎవరూ తద్దినమే పెట్టడంలేదు. అలాంటిది చచ్చిపోయిన అత్తగారి ఇష్టాలను గుర్తుంచుకున్న మహా ఇల్లాలివి" వంట మనిషి విశాలని పొగుడుతోంది.
 
    వింటున్న జానకిరామయ్య విరక్తిగా నవ్వుకున్నాడు. "ఒక్కరోజు... ఒక్కరోజయినా తనకిష్టమీనవి వండిపెట్టని తన కోడలు చనిపోయిన అత్తగారి ఇష్టాలను గుర్తుంచుకుని ఆమె ఆబ్ధికమ్నాడు ఆమెకిష్టమైనవి వండించడం ఆయనలో ఎన్నో ప్రశ్నలని రేకెత్తించాయి.
 
    "మనిషి బతికి ఉండగా గుప్పెడన్నం పెట్టడానికి బాధపడే ఈ మనుషులు చనిపోయిన వాళ్లకి దినం చెయ్యడానికి వేలకి వేలు ఎందుకు ఖర్చు పెడతారు? తమ పితృభక్తిని చాటుకోవడానికా? లేక చనిపోయినవాళ్ల ఆత్మశాంతికా? బతికి ఉండగా అన్నం పెట్టనందుకు వాళ్ల ఆత్మ తమని పట్టి పీడిస్తుందనే భయంతోనా?"
 
* * *
 
    జానకిరామయ్యకి పక్షవాతం వచ్చి ఎడమ కాలు, చెయ్యి చచ్చుబడిపోయాయి. గదిలో మంచం మీద పడి ఉన్న ఆయనకి బయట నుంచి మాటలు వినిపిస్తున్నాయి.
 
    వియ్యంకుడు నీలకంఠం స్వరం అది. "ఎంతో ఆరోగ్యమైన మనిషి మీ నాన్నగారు. ఉన్నట్టుండి రోగం ముంచుకొచ్చి మంచాన పడ్డారు. ఇంతకీ విల్లేమయినా రాశారా?"
 
    "మా అమ్మ చనిపోయిన కొత్తలో ఆవిడలా తనూ నిద్రలోనే చనిపోతానేమోనని భయపడి విల్లు రాశారండి" విశ్వం చెబుతున్నాడు. 
 
    "ఈ ఇల్లూ బ్యాంకులో ఆయన పేర ఉన్న క్యాషూ తప్ప చెప్పుకోదగిన ఆస్తిపాస్తులేం ఉన్నాయి నాన్నా! మా బావగారు తనకి ఆస్తిలో భాగం వద్దని ఇదివరకు చెప్పారు. మరి ముసలాయన ఆస్తి మా ఒక్కళ్లకీ చెందేలా రాశారో లేక ఇద్దరికీ రాశారో తెలియదు" విశాల స్వరం.
 
    "ఈ ఇల్లు ఆయన స్వార్జితం. ఆయన ఇష్ట ప్రకారం రాస్తారు" అంటున్నాడు విశ్వం.
 
    "ఇచ్చేవాడుంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడని, ఆస్తి తేరగా వస్తుంటే వద్దని ఎందుకంటారు?" విశాల నిరసనగా అంటోంది.
 
    "ఆ బుద్ధి మా నాన్నకి ఉండాలి. అన్నయ్యకేం? అమెరికాలో బాగానే సంపాదించుకుంటున్నాడు. నాకు జీతం రాళ్లు తప్ప వేరే ఆధారమేదీ?"
 
    "మీ నాన్న మనకి ఆస్తి ఇచ్చారో లేదో గాని, ఆయన వైద్యానికయ్యే ఖర్చు భరించలేక అప్పులపాలయ్యేలా ఉన్నాం."
 
    వింటున్న జానకిరామయ్య నిట్టూర్చాడు.
 
    మరునాడు కొడుకుని పిలిచి తలగడ కింద నుంచి బ్యాంకు పాస్‌బుక్ తీసి ఇస్తూ చెప్పాడు.
 
    "నువ్వు ఇబ్బందిపడకు నాన్నా! బ్యాంకులో డబ్బు తీసి వాడుకో."
 
    విశ్వం కళ్లు మెరిశాయి.
 
    అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పెద్ద కొడుకు చెలం గుర్తుకొచ్చాడాయనకి. తల్లి చనిపోయినప్పుడు ఇండియాకి వచ్చి కర్మకాండకయిన ఖర్చులో తన వాటా డబ్బు ఇవ్వబోయినప్పుడు తను తిరస్కరించినప్పుడూ వాడి కళ్లలోనూ అదే మెరుపు. 
 
    "నాకు ఇంటిలో భాగం అక్కర్లేదు. నేనెలాగూ ఇక్కడికి వచ్చి స్థిరపడను. తమ్ముడికే ఇవ్వండి" అని వాడన్నప్పుడు "నాకు నీ బాధ్యతతో సంబంధం లేదు అని ఇన్‌డైరెక్టుగా వాడు చెప్పినట్లే అనిపించింది ఆయనకి. ఆయన వేదనగా నిట్టూర్చాడు. 
 
* * *
 
    మంచాన పడ్డాక గొంతెండిపోతున్నా మంచినీళ్లిచ్చే దిక్కులేక, కడుపు ఉబ్బిపోతున్నా బెడ్ ప్యాన్ పెట్టే దిక్కులేక నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిందాయనకి. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక నాలుగు రోజులు తండ్రిని కనిపెట్టుకుని సేవ చేసిన విశ్వం ఆఫీసుకి సెలవు అయిపోయిందని తండ్రి అవసరాలని చూడ్డం కోసం పని కుర్రాడిని కుదిర్చాడు. వాడిని ఇంటి పనులకి వాడుకుని మామగారి గదిలోకి వెళ్లనిచ్చేది కాదు విశాల.
 
    "పాపీ చిరాయు అని ఊరికే అన్నారా? ఆయనంత సులువుగా పోడు. ఏళ్లకిఏళ్లు మంచంలో ఉండి నా ప్రాణం తీసేవరకూ చావడు."
 
    "ఈ రోగిష్టికి సేవ చెయ్యడంతోనే నా బతుకు తెల్లారిపోతుంది" అని బాహాటంగానే విసుక్కోవడం మొదలు పెట్టింది. 
 
    వింటున్న  జానకిరామయ్య తనకి చెముడెందుకు రాలేదా అనుకునేవాడు.
 
    "వేళపట్టుకి మందులూ పళ్లూ ఫలాలూ తిని మరీ నిగనిగలాడుతున్నాడు ముసలాడు. ఇంకో పదేళ్లవరకూ ఏమీ ఢోకా లేదు" అంటున్న విశ్వం మాటలు విని మాత్రం తట్టుకోలేకపోయాడు.
 
    తన కొడుక్కీ, కోడలికీ భారమైపోయాడని ఆయనకి అర్థమయింది. వాళ్లు తన వృద్ధాప్యాన్నీ అనారోగ్యాన్నీ చీదరించుకుంటున్నారు. తను మరో నాలుగేళ్లు మంచం మీద ఇలాగే ఉంటే తనకి సేవ చెయ్యడానికి వాళ్లు సిద్ధంగా లేరు. మరో మాటలో చెప్పాలంటే, తన చావుని కోరుకుంటున్నారు. అదీ సాధ్యమైనంత త్వరలో.
 
    ఆయన తనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు.
 
* * *
 
    జానకిరామయ్య మృతదేహం హాలు మధ్యలో పడుకోబెట్టి ఉంది.
 
    'మామయ్యా' అంటూ విశాల గుండెలవిసేలా ఏడుస్తోంది. ఆమె దుఃఖం చూసేవాళ్ల కళ్లలో నీళ్లు తెప్పించేలా ఉంది. విశ్వం మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు.
 
    "పాపం! కొడుకూ కోడలూ జానకిరామయ్యని మహాశ్రద్ధగా చూశారు. అలాంటి కొడుకు ఇంకెవరికీ ఉండడు" అన్నాడు ఎదురింటి మోహన్రావు. 
 
    "పక్షవాతంతో మంచానపడినా ఎక్కువకాలం ఎవరినీ బాధపెట్టకుండా నిద్రలో సులువుగా పోయాడు" అన్నాడు పక్కింటి నరసింహం.
 
    కానీ జానకిరామయ్య మరణం సహజమైనది కాదనీ తను బతికి ఉండి కొడుక్కి భారమయ్యానని తెలుసుకుని డాక్టరు ఇచ్చిన నిద్రమాత్రలని రోజూ వేసుకోకుండా దాచి, ఒకేసారి ఓవర్‌డోస్‌లో మింగి ఆత్మహత్య చేసుకున్నాడనీ ఎవరికీ తెలియదు.
 
    "ఇంకెందుకు ఆలస్యం? పురోహితుడికి కబురు చెయ్యండీ. చీకటి పడకముందే దహన కార్యక్రమం పూర్తి కావాలి" అన్నాడొక పెద్దాయన.
 
    ఈ నేపథ్యంలో లాయర్ శశిభూషణం స్కూటర్ దిగి ఆ ఇంట్లోకి వచ్చాడు. జానకిరామయ్య మృతదేహాన్ని కొద్ది క్షణాలు తడికళ్లతో తదేకంగా చూసి చేతిలోని కవరుని విశ్వానికి అందిస్తూ అన్నాడు.
 
    "మీ నాన్నగారు గతంలో రాసిన విల్లుని సవరిస్తూ మరో విల్లు రాశారు. తన మరణానంతరం దాన్ని మీకు అందచెయ్యమన్నారు."
 
    "ఇప్పుడెందుకులెండి" అన్నాడు విశ్వం చూట్టూ ఉన్న జనాన్ని ఇబ్బందిగా చూస్తూ.
 
    "కాదు. ఇప్పుడే చదవాలి. ఆయన తను మరణించాక చెయ్యవలసిన విధులని గురించి అందులో రాశారు."
 
    విశ్వం పక్కకి వెళ్లి కవరు చించి అందులోని కాగితాలను బయటకి తీసి ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు.
 
    "నా స్వార్జితమైన ఆస్తీ, స్టేట్ బ్యాంకులో ఉన్న రెండు లక్షల రూపాయల నగదులో నా వీద్యానికీ ఖర్చవగా మిగిలిన డబ్బూ(దానిమీద నేను మరణించే రోజుకి వచ్చిన వడ్డీతోసహా) అశోక్‌నగర్‌లో నేను నివసిస్తున్న ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తం డబ్బూ సిటీలోని మదర్ థెరిసా వృద్ధ శరణాలయానికి చెందాలని ఈ వీలునామా ద్వారా నా అభిష్టాన్ని తెలియచేస్తున్నాను. మనిషి బతికి ఉండగా గుప్పెడు అన్నం పెట్టడానికి బాధపడే మనుషులు చనిపోయాక వేలకి వేలు ఖర్చుపెట్టి కర్మకాండ చెయ్యడాన్ని నేను నిరసిస్తాను. అందువల్ల నా మరణానంతరం నా మృతదేహానికి ఎలాంటి కర్మకాండ చెయ్యవద్దు. నా మృతదేహం జలచరాలకి ఆహారమవడానికి జలసమాధి చెయ్యమని నా మనవి."
 
    చదువుతున్న విశ్వం ముఖం తెల్లగా పాలిపోయింది.
 
    "ఏమిటి? ఏం రాశారు?" లోగొంతుతో అడుగుతూ విశాల అతని చేతిలోని కాగితాలను తీసుకుని చదివింది.
 
    ఆమె ముఖం అనేక రంగులు మారి చివరికి ఆగ్రహం అనే ఎరుపురంగు పులుముకుంది.
 
    "ముసలాడు కొంప ముంచేశాడు. కడుపులో ఇంత కుళ్లు పెట్టుకుని మా చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నాడు. లోకంలో కన్న కొడుకుని అన్యాయం చేస్తే తల్లిదండ్రులెవరైనా ఉంటారా? ఇలాంటి నంగనాచిని జలచరాలకి కాదు, కాకులకీ గద్దలకీ ఆహారంగా వెయ్యాలి" చుట్టూ ఉన్న జనం వింటున్నారనే ఇంగితం లేకుండా మామగారిపై ఉన్న కసిని మాటల్లో వ్యక్తపరుస్తూ శోకాలు పెడుతోంది విశాల.
 
    తండ్రి వీలునామాలో రాసిన ప్రతీ వాక్యం తను ఆయన పట్ల చేసిన తప్పులని ఎత్తి చూపిస్తుంటే విశ్వం అసహాయమైన కోపంతో భార్య చెంప ఛెళ్ళుమనిపించాడు. అతని చెక్కిళ్ళపై నుంచి దొర్లుతున్న అశ్రువులు అతని మనసుని కదిలిస్తున్న పశ్చాత్తాపానికి ఆనవాళ్ళు కాబోలు. తండ్రి మృతదేహం దగ్గర చతికిలబడి ఆయన పాదాలపై ముఖమానించి బావురుమన్నాడతను.
 
(ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2004 సంచికలో ప్రచురితం)
  
    
 
Comments