పాఠాంతరం - వాడ్రేవు చిన వీరభద్రుడు

  
     
నా కోసమెవరో బయట వేచి ఉన్నారని వినగానే మధ్యాహ్నభోజనానంతరం మత్తు ఒక్కసారిగా ఎగిరిపోయింది. లోపలికి పంపిన విజిటింగ్ కార్డునట్లాగే పరికించి చూస్తూ 'లోపలికి రమ్మను' అన్నాను బాయ్‌తో. అతడు వెళ్లిన వైపే చూస్తున్నాను. రెండు నిమిషాల్లో ఒక యువకుడు లోపలికి అడుగుపెట్టాడు. ముప్పైయేళ్ల వయసుండవచ్చు. జీన్సులో ఉన్నాడు. మనిషి రూపం చూడగానే ఆకట్టుకునేట్టుగా ఉంది. అంతకన్నా కూడా అతణ్ణంతకుముందు ఎక్కడో చూసినట్టనిపించింది. అతడి ఎడమచెవికి ఉందొక ఇయర్ స్టడ్. తెల్లని ఆ వంకీ మీద ఫ్లోర్‌సెంట్ వెలుతురు ఒక్కసారి తళుక్కుమని మెరిసింది.

    'మాణింగ్ సర్, అంకుల్ పంపించారు మిమ్మల్ని కలవమని' అన్నాడు.

    కూచోమని కుర్చీ చూపించాను. అంకుల్ ఎవరు అని అడగడం కన్నా ముందు 'మిమ్మల్నింతకు ముందెప్పుడో కలుసుకున్నట్టుంది' అన్నాను.

    'నన్నా' చిరునవ్వాడతడు. 'నో వే. నేను గత పదేళ్లుగా ఈ దేశంలోనే లేను' అన్నాడు.

    'ఎక్కడున్నారు? మీరేం చేస్తుంటారు?' అన్నాను కుతూహలంగా.

    'యుస్‌లో అని అక్కడితో ఆగిపోవాలనుకున్నాడుగానీ ... మళ్లా మాట్లాడకుండా ఉండలేకపోయాడు. 'నేను ఇంటర్ చదువుతున్నప్పుడే ఫాదర్ పోయారు. దాంతో మా అంకులే నన్ను చదివించారు. నా హయ్యర్ స్టడీస్ స్టేట్స్‌లోనే. హయ్యర్ అంటే ఇంగ్లీషు సాహిత్యంలో మాస్టర్స్. అక్కడే ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లెర్నింగ్ సైట్ మీద వర్క్ చేస్తున్నాను. ఇంతలో అంకుల్ ఇక్కడికి వచ్చేయమన్నారు. మీకు తెలుసుకదా, ఆయనకి కార్పొరేట్ కాలేజిలున్నాయి. వాటిని మేనేజ్ చెయ్యమని పిలిచారు' అన్నాడు.

    అప్పుడర్థమయింది నాకు అతడి అంకుల్ ఎవరో. ఆయన చాలా పేరున్న విద్యాసంస్థల యజమాని. వాళ్ల విద్యాసంస్థలకు సంబంధించి ఈ మధ్య నా దృష్టికో సమస్య కూడా వచ్చింది.

    'ముందు ఇండియాలో నాకేం పనుంటుందనుకున్నాను గాని, ఇక్కడి కాలేజిలు చూసిన తరువాత చెయ్యవలసింది చాలానే ఉందనిపించింది. ఇక్కడి కాన్సెప్ట్స్ చాలా పాతకాలంవి. నైన్టీన్త్ సెంచరీ మెథడాలజీ. దీన్ని చాలా మాడర్నైజ్ చెయ్యాలి. కాని ఏం చెయ్యాలన్నా చుట్టూ కరెప్షన్. కరప్ట్ సొసైటి ...' మాటలు మధ్యలో ఆపి -

    'చెప్పండి సార్, నన్ను చూస్తే మీకు తెలిసినవాణ్ణని ఎందుకనిపించింది?' అనడిగాడు.

    నేను నా ముందున్న విజిటింగ్ కార్డు మరోసారి చూశాను. నాకు తెలిసిన వివరాలు కావు.

    'అదొక ఇంట్యూషన్. మీ విజిటింగ్ కార్డు చూస్తే ఎందుకో నాకు తెలిసిన వాళ్లొచ్చారనిపించింది. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది. మీరు ఇంగ్లీషు సాహిత్యం చదువుకున్నానని చెప్పారు కదా. సాహిత్య వాసనన్నమాట. మిమ్మల్ని చూస్తే హామ్లెట్ రాకుమారుడిలా ఉన్నారు' అన్నాను. తళుకులీనుతున్న ఆ చెవిపోగునే చూస్తూ.

    'హామ్లెట్, ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్!' కళ్లు పెద్దవి చేస్తూ బిగ్గరగా నవ్వాడతను. 'ఈ పేరిప్పుడు ఇండియాలో వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీకిష్టమా ఆ నాటకం' అనడిగాడు.

    ఊపిరిపీల్చుకున్నాను. అతడు నా మాటలు స్పోర్టివ్‌గానే తీసుకున్నాడన్నమాట.

    'ఇష్టమనికాదుగాని, బాగా పరిచయం. ఒక రకంగా చెప్పాలంటే మా తరమంతా ఆ నాటకంతోటే పెరిగాం. ఇప్పుడు కాదుగానీ, ఒకప్పుడు హామ్లెట్ పేరెత్తకుండా ఏ సాహిత్యచర్చా జరిగేది కాదు. అవసరమున్నా లేకపోయినా ప్రతిఒక్కరికీ ఆ పేరెత్తడం ఒక ఫాషనులాగా ఉండేది' అన్నాను.

    'అట్లానా, ఇంతకీ హామ్లెట్ గురించి మీ తెలుగు సాహిత్యవేత్తల అండర్‌స్టాండింగ్ ఏమిటి?' అనడిగాడతను. ఇప్పటికతడు కుర్చీలో సౌకర్యంగా కుదురుకున్నాడు.

    'మీరు టీ తాగుతారా, కాఫీనా' అన్నాను. కాని అతడి జవాబు కోసం చూడకుండానే బాయ్‌ని పిలిచి టీ తెమ్మన్నాను.

    ఇన్నాళ్లకు ఈ పత్రికాఫీసులో హామ్లెట్ గురించి మాట్లాడటానికొక మనిషి దొరికాడన్న సంతోషంతో నా నిద్రమత్తు పూర్తిగా ఒదిలిపోయింది.

    'తెలుగుసాహిత్యవేత్తల అవగాహన కాదు, నా అవగాహన గురించే చెప్తాను. హామ్లెట్ అంటే నాకు తెలిసిన మేరకు, ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తన జ్ఞానాన్ని కర్తవ్యంగా మార్చుకోలేకపోయినవాడు ...'

    అతడు నా మాటలకి అడ్డుపడుతూ 'కర్తవ్యమా? ఏమిటి హామ్లెట్ నెరవేర్చలేకపోయిన కర్తవ్యం?' అనడిగాడు.

    'తన తండ్రి ఆత్మ కోరినట్టుగా పినతండ్రిని ..' అని అంటూండగానే, హామ్లెట్ చివరికి తన పినతండ్రిని వధించాడన్న విషయం గుర్తొచ్చి, 'అలా అని కాదు, తన తండ్రి ఆదేశాన్ని అతడు వెంటనే అమలు చేయకుండా అనవసరంగా కాలయాపన చేసి ఎన్నో మరణాలకు కారణమయ్యాడు' అన్నాను.

    అడిగిన ప్రశ్నకి జవాబు కూడదీసుకుంటున్న పిల్లవాణ్ణి చూస్తున్న ఉపాధ్యాయుడిలా అతడు నన్ను చూశాడు.

    'కాలయాపనా? అందులో హామ్లెట్ చేసిన ఆలస్యమేముంది? ఒక దేశపు రాజుని చంపెయ్యడం అంత సులభమా? అతని చుట్టూ ఎంతమంది అంగరక్షకులుంటారు? హామ్లెట్ ఉన్న పరిస్థితిలో మీరున్నా, నేనున్నా కూడా ఇప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూనే ఉండేవాళ్లం' అన్నాడు.

    నేను మాటలకోసం తడుముకున్నాను. నేనేమీ షేక్స్పియరు పండితుణ్ణి కాను. నాకా నాటకం కూడా ఏమంత జ్ఞాపకం లేదు.

    అయినా ఏదో ఒకటి మాట్లాడాలనుకుని 'హామ్లెట్ యూరపియన్ మానవుడి సమస్యకు దర్పణం. ఈడిపస్ నుంచి ఫౌస్ట్ దాకా తన స్వీయస్వరూపం తెలుసుకోడానికి అతడు చేసిన అన్వేషణ' అన్నాను.

    'ఏ విధంగా?' అన్నాడతడు. 'కొంపదీసి మీరు హామ్లెట్‌కి ఈడిపస్ కాంప్లెక్స్ ఉందంటున్నారా ఏమిటి?' అన్నాడు.

    'అవును. ఏం కాదా?' అన్నాను కొంత ఆశ్చర్యంతో.

    'అది హామ్లెట్ సమస్య కాదు. ఫ్రాయిడ్ సమస్య. హామ్లెట్ రాణితో మాట్లాడిన చివరి మాటలు గుర్తున్నాయా? ఆ మాటలు విన్నాక కూడా ఈడిపస్ కాంప్లెక్స్ గురించి ఎట్లా మాట్లాడగలం?' అన్నాడు.

    నిజం చెప్పాలంటే నాకా నాటకం మీద ఇతరులు మాట్లాడినమాటలు గుర్తున్నంతగా, అందులో పాత్రలు మాట్లాడిన మాటలు గుర్తులేవు. అయినా అంత సులభంగా నా అజ్ఞానాన్ని నేను నమ్మలేననిపించింది.

    'సరే. ఆ కాంప్లెక్సులు వదిలిపెట్టండి. హామ్లెట్ గురించి తలచుకుంటే నాకేమనిపిస్తుందంటే, అది రెండుగా చీలిపోయిన మనిషి కథ. ఫ్రాగ్మెంటెడ్ ఇండివిడ్యువల్. అతడి వెనక అతడి ఫామిలీ ఫ్రాగ్మెంటేషన్ ఉంది' అన్నాను. ఇంకా ఏదో స్ఫురిస్తున్నదిగాని, మాటలకోసం తడుముకుంటున్నాను. 'అదీ సంగతి. మీరింకా ఎర్లీ ట్వెంటియత్ సెంచరీలో ఉన్నారు. బహుశా మీరు బ్రాడ్లీ ప్రసంగాలతో ఆగిపోయుంటారు. మీరు చదివిన హామ్లెట్ టెక్ట్స్ కూడా ఓల్డ్ ఎడిషన్ అయుంటుంది. మీరు డోవర్ విల్సన్ కేంబ్రిడ్జి ఎడిషన్ చదివారా? జెంకిన్స్ రాసిన లాంగ్ నోట్స్? హెరాల్డ్ బ్లూమ్ మాడర్న్ క్రిటికల్ ఇంటర్‌ప్రెటేషన్స్ ఆఫ్ హామ్లెట్? లిటరరీ టెక్ట్స్ మాత్రమే కాదు. ఫిల్మ్, స్టేజి ఇంటర్‌ప్రెటేషన్స్ కూడా చూడాలి' అన్నాడతడు బాణాలు వదులుతున్నట్టుగా.

    'నా సంగతి సరే, మీ అవగాహన ఏమిటో చెప్పండి' అన్నాన్నేను. అప్పటికే నన్ను పూర్తిగా నిస్సత్తువ ఆవహించింది.

    టీ వచ్చింది. డిప్ టీ. అతడు టీ బాగ్ కప్పులో ముంచుతూ కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

    'నేనిట్లా హామ్లెట్ గురించి ఇంత హఠాత్తుగా మాట్లాడతానని అనుకోలేదు. అసలు ఇండియా వచ్చాక హామ్లెట్ సంగతి వదిలిపెట్టండి, షేక్స్పియరు అన్న పేరే వినలేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. వినండి' అన్నాడు.

    అప్పుడతను దాదాపు చిన్నపాటి ప్రసంగమే చేశాడు. దాని సారాంశమేమిటంటే హామ్లెట్ గురించి ప్రపంచం ఏర్పరచుకున్న అవగాహన ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది. పద్దెనిమిదో శతాబ్ది హామ్లెట్ వేరు, పందొమ్మిదో శతాబ్ది హామ్లెట్ వేరు. ఇరవయ్యవ శతాబ్దం ముగింపుకొచ్చేటప్పటికి కొత్తగా రూపొందుతున్న అభిప్రాయాలు వేరు. ఇందుకు కారణం కాలంలో వస్తూన్న మార్పు మాత్రమే కాదు. అసలు హామ్లెట్ టెక్ట్స్ కూడా కొత్త పాఠాంతరాలవల్ల మారిపోతూ వస్తోంది'. 'పాఠాంతరాలవల్ల మూలపాఠమెట్లా మారిపోతుంది? కథ అదే కదా' అన్నాన్నేను.

    అతడు మళ్లా చిరునవ్వాడు. 21వ శతాబ్దపు యువకుడి రేజర్‌షార్ప్ చిరునవ్వది.

    'ఒరిజినల్ టెక్ట్స్ మారదు. నిజమే. కాని దాన్ని మనం చదివేటప్పుడు మన ఎంఫసిస్ మారుతుంది. ఇంతదాకా మనం అంతగా పట్టించుకోకుండా దాటుకుంటూ వెళ్లిపోయిన వాక్యాలమీద మన దృష్టి కొత్తగా పడుతుంది. షేక్స్పియరు ఏం రాసాడని కాదు. మనం ఏం చదువుతున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకి ఏక్ట్ త్రీలో హామ్లెట్ రోజెన్ క్రాంజ్, గిల్డెన్ స్టెర్న్‌తో మాట్లాడిన మాటలు చూడండి. ఆ మాటలు గుర్తున్నాయా?...' అన్నాడు.

    నాకు ఆ మాటలు కాదు సరికదా, అసలు ఆ అంకమే గుర్తు లేదు. గుర్తులేదంటూ తలాడించాను.

    'చదవండి. ఒకసారి మళ్లీ చదవండి. మీ అభిప్రాయం మారిపోతుంది. ఇందాక మీరేమన్నారు. ఫామిలీ ఫ్రాగ్మెంటేషన్ అనేనా? అసలు హామ్లెట్ ఒక ఫామిలీ కథ కాదు. అది నిజానికి ఒక స్టేట్‌కి సంబంధించిన కథ. స్టేట్ అంటే అందులో ఇండివిడ్యువల్ ఉంటాడు, ఫామిలీ ఉంటుంది. కాని ఆ ఇండివిడ్యువల్‌కీ, ఆ ఫామిలీకి స్టేట్ కన్నా విడిగా ఏమీ ఎగ్జిస్టెన్స్ లేదు. ఒక కరప్ట్ స్టేట్ ఉందనుకోండి. ఆ స్టేట్‌లో ఉండే ఇండివిడ్యువల్ కూడా ఆ కరప్షన్‌కి విక్టిమ్ కాకుండా తప్పించుకోలేడు. హామ్లెట్ నాటకం ఈ దృష్టితో చూడండి. టోటల్ కరప్షన్, చెవిలో విషం పోసే కథ. పెద్ద హామ్లెట్ చెవిలో అతడి తమ్ముడు విషం పోశాడు. ఆ తమ్ముడి చెవిలో పొలొనియస్ విషం పోశాడు. ఒఫీలియా చెవిలో అతడి అన్న విషం పోశాడు. హామ్లెట్ చెవిలో ఘోష్ట్ విషం పోసింది. ఈ విషప్రయోగం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇండివిడ్యువల్ మీద స్టేట్ నిఘా పెడుతుంది. స్టేట్‌ని ఇండివిడ్యువల్ నమ్మడు. మొత్తం డెన్మార్కంతా హామ్లెట్‌ని ఒక కంట కనిపెడుతూంటుంది. డెన్మార్కులో ప్రతి ఒక్కర్నీ హామ్లెట్ ఒక కంట కనిపెడుతుంటాడు... చివరికి మొత్తం డెన్మార్కు రాజవంశమంతా నాశనమయ్యేదాకా ఇదే కథ' అన్నాడతడు.

    అతడి మాటల్లోని జ్ఞానతీవ్రతకు నేను ముగ్ధుణ్ణయిపోయాను. ఈ నవతరం యువకుడు ఒక పూర్వకాలపు నాటకం మీద ప్రసరిస్తున్న కొత్తవెలుతురు చూసి నేనెంతో మురిసిపోయాను.

    అతడే మళ్లా -

    'హామ్లెట్‌లో మరో విశేషముంది. ఒక పాత్రగా హామ్లెట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి అది రిలవెంట్‌గానే అనిపిస్తోంది' అని కూడా అన్నాడు.

    నాకు కూడా ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది.

    'ఇన్నాళ్లుగా హామ్లెట్ గురించి నాకున్న అభిప్రాయమొకటి మీ మాటల వల్ల బలపడింది. హామ్లెట్ ట్రాజెడి అని ఎందుకంటారో నాకు మొదట్నుంచీ అర్థం కాలేదు. నాటకం ముగిసేటప్పటికి శవాలు పోగుపడి వుండవచ్చు. కాని, అందులో విషాదమేముంది? మీ మాటల్లోనే చెప్పాలంటే ఒక కరప్ట్ స్టేట్ అంతమైందని సంతోషించాలిగాని' అన్నాను.

    అతడు ఇందాకటి తన మాటల భావోద్వేగంనుంచి ఇంకా బయటపడలేదు. అందుకని నా మాటలు అతడి చెవికెక్కడానికి కొంతసేపు పట్టింది. కాని వెంటనే ప్రతిస్పందించాడు.

    'అలా కాదు. అది ట్రాజెడీనే. అందులో ట్రాజెడీ ఎక్కడుందంటే, ఆ కరప్షన్ నిర్మూలించే అవకాశం హామ్లెట్‌కి వచ్చింది. కాని అతడు దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయాడు. అదే ట్రాజెడీ' అన్నాడు నన్ను నిరుత్తరుణ్ణి చేస్తూ.

    కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం.

    అప్పుడతడే అన్నాడు. 'మీరు అంకుల్‌కి ఫోన్ చేసి ఏదో మాట్లాడాలన్నారట. ఆయన నన్ను మాట్లాడమని పంపించారు. ఏమిటి సర్, విషయం?' ఆ మాటల్తో ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాను.

    'అవును, ముఖ్యమయిన విషయమే. మీ అంకుల్ వచ్చివుంటే బాగుండేది. ఇది ఆయన కాలేజీలకు సంబంధించిన విషయం' అన్నాను. 'పర్వాలేదు. నాకు చెప్పండి. ఇప్పుడు మా కాలేజీలకు నేనే మానేజర్ని' అన్నాడు.

    'మంచిది. అయితే వినండి. నాకు గత వారం రోజులుగా మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరినుండో తెలీదు. కానీ వాళ్లకు చెప్తున్నదేమిటంటే' అని నా టేబుల్ డ్రా లోంచి ఒక చీటీ బయటకు తీశాను. అది అతనిముందు పెట్టాను. 'ఇదిగో, ఇందులో ఒక అమ్మాయి వివరాలున్నాయి. ఆమె మీ ఫలానా బ్రాంచి కాలేజిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెని ఆమె క్లాస్‌మేట్స్ వేధిస్తున్నారనీ, ఆ విషయం మీద మీ కాలేజి యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడం లేదనీ, అందుకని మాకు ఫోన్ చేస్తున్నామనీ, మా పేపర్లో వార్త రాయమనీ చెప్పారు. అది మీ అంకుల్ దృష్టికి తీసుకొస్తే ఇందులో మంచి చెడ్డలు ఆయనే స్వయంగా చూసుకుంటారని ఆయన్ని రమ్మన్నాను' అన్నాను.

    అంతదాకా ఎంతో ఉత్సాహంగా కనిపించిన అతని వదనం మీద నా మాటలు నల్లని ఛాయ పరిచాయి. అతడి కళాశాలల మీద వచ్చిన ఆరోపణ వినగానే అతడు దాదాపుగా తన కుటుంబంమీదనే ఎవరో ఆరోపణ చేస్తున్నట్టుగా చలించిపోయాడని అతడి ముఖకవళికలు స్పష్టం చేస్తున్నాయి.

    కొద్దిసేపటికి 'రెచడ్. ఇదే నేనిక్కడ భరించలేకపోతున్నాను' అన్నాడతను.

    ఆ తర్వాత చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. నాకు కూడా అంతకుమించి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంతలో మా న్యూస్ ఇంఛార్జి రావడంతో ఆ యువకుడు వెళ్లొస్తానంటూ లేచి నిలబడ్డాడు.

    ఆ రాత్రి ఇంటికి వెళ్లగానే పుస్తకాల అలమారా వెతికి హామ్లెట్ నాటకం బయటకి తీశాను. నాటకం చదవడం పూర్తయ్యేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. నిజంగానే ఆ నాటకం కొత్తగా అనిపించింది. కాని ఎప్పట్లానే ఆ చివరి దృశ్యాలు నాలో ఎటువంటి జాలినీ రేకెత్తించలేకపోయాయి. అయినా, ఆ కథలో, ఆ కథనంలో ఏదో తీవ్ర విషాదముందనిపించింది. ఆ విషాదమేమిటో, నన్ను కలతపరుస్తున్న ఆ హృదయశల్యమెక్కడుందో తెలుసుకోడానికి మళ్లీ మళ్లీ చదివాను. అలా వారం రోజులపాటు ఆ పుస్తకాన్ని చదవడం కాదు, అధ్యయనం చేశాననాలి.

    ఎన్నో పఠనాల తరువాత నాకు నెమ్మదిగా బోధపడిందేమంటే హామ్లెట్‌లో విషాదం ఆ యువకుడు చెప్పినట్టుగా కేవలం స్టేట్ కరప్షన్‌లోనో లేదా ఫామిలీ ఫ్రాగ్మెంటేషన్‌లోనో లేదనిపించింది. అసలు ఆ నాటకంలో విషాదం నాటకాంతంలో లేదు. అది నాటకం మధ్యలో ఉంది. అది ఒఫీలియా మరణం. సమస్తం భ్రష్టమైన సమాజంలో ఒఫీలియాలాంటి వాళ్లకి జీవించే అవకాశమెక్కడుంటుంది? హామ్లెట్ చేసిన మొదటి హత్య పొలొనియస్‌ని చంపడం కాదు. ఒఫీలియా మీద విరుచుకుపడటంలో ఉందనిపించింది. ఆమెను నిందించడంలో, నిస్సిగ్గుగా అవమానించడంలో, అతడి స్త్రీ ద్వేషంలో, తన ఆత్మసౌందర్యానికి ఉన్మాదపూరితంగా మసిపూసుకోవడంలో ఉందనిపించింది.

    నేనా నాటకం మళ్లీ చదువుతున్నంతకాలం ప్రతి రాత్రీ నిద్రలోకి జారుకునేముందు పదే పదే ఒకే దృశ్యం కళ్లముందు కనిపించేది. నిర్మలంగా ప్రవహించే ఒక సెలయేరు. దాని ఒడ్డునే శాఖోపశాఖలుగా పెరిగిన విల్లోచెట్టు. కింద నీటి అద్దంలో దాని ప్రతిబింబం. అక్కడ ఊదారంగుపూలతో, పచ్చపూలతో, నీలిపూలతో మాలలు అల్లుకునే యువతి. అలా దండలు గుచ్చుకుంటూ పాటలు పాడుకుంటూ మైమరచి నీటిలోకి జారిపోవడం. నీళ్లమీద పలచగా పరుచుకున్న వస్త్రాలమధ్య తన ఆపద గురించి తనకేమాత్రం స్పృహలేని ఆ దేవత, అట్లానే నెమ్మదిగా మునిగిపోయి ఈ లోకం వదిలిపెట్టి వెళ్లిపోయిన దృశ్యం ...

    'మెర్మయిడ్' లాగా ఉందన్నాడు కవి ఆమెని. 'యాజ్ వన్ ఇన్‌కేపబుల్ ఆఫ్ హర్ వోన్ డిస్ట్రెస్...'- బహుశా నాటకంలోని అత్యంత విషాదాత్మకమైన వాక్యమదే అనిపించింది.

    ఈ సారి ఆ యువకుడు నన్ను మళ్లా కలిసినప్పుడు ఈ మాటే చెప్పాలనుకున్నాను. హామ్లెట్ నాటకంలో ఆ పేజీ మడిచిపెట్టుకున్నాను. ఆ పుస్తకం ఆఫీసుకి తీసుకెళ్లి భద్రంగా ఒక పక్కన పెట్టుకున్నాను, అతడొచ్చినప్పుడు చూపించాలని.

    కాని అతణ్ణి మళ్లా కలవడం నెల రోజుల తరువాతగానీ సాధ్యపడలేదు. ఈలోగా నాకు మళ్లా అవే ఫోన్‌కాల్సు మరో రెండొచ్చాయి. ఈసారి ఎస్సెమ్మెస్‌లు కూడా రావడం మొదలయ్యింది. వాటినట్లానే ఆ కాలేజీ నడిపే పెద్దాయనకు ఫార్వర్డ్ చేశాను. ఒకసారి ఊళ్లో ఒక మంత్రిగారికి జరిగిన సన్మానం సందర్భంగా ఆ పెద్దాయన కలిస్తే, ఆయనకు ఆ విషయం గుర్తు చేశాను కూడా.

    'అబ్బాయికి చెప్పానే. అతడు మీతో వివరంగా మాట్లాడతానన్నాడు. ఈ మధ్య యుఎస్ వెళ్లాడు. రాగానే ఓ సారి మీ దగ్గరకు పంపిస్తాను' అన్నాడాయన. అంతకన్నా ఆయనతో మాట్లాడే అవకాశం లేకపోయింది. మేం కలుసుకున్న సందర్భం అటువంటిది.

    కాని మూడునాలుగురోజులు తిరక్కుండానే ఆ యువకుడు నా ఆఫీసుకి వచ్చాడు.
వస్తూనే 'సారీ సర్, మీరు అంకుల్‌ని కలిసారట కదా. నేనే మీతో మాట్లాడదామనుకున్నాను. కానీ ఇంతలోనే అనుకోకుండా యుఎస్ వెళ్లాల్సివచ్చింది' అన్నాడు.

    వచ్చీ రాగానే అప్రియమైన విషయం నేరుగా మాట్లాడలేక 'యుఎస్ ఎందుకెళ్లారు' అనడిగాను.

    'ఇంతకుముందు మనం కలిసినప్పుడు చెప్పాను కదా. మా అకడమిక్ సిస్టంలో చాలా రిఫార్మ్ చెయ్యాల్సి ఉంటుందని. ముఖ్యంగా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్క్ డెవలప్ చెయ్యాలి. మా ఫాకల్టీకి కూడా చాలా ట్రయినింగ్ కావాలి. ఈ-లెర్నింగ్, వర్చువల్ లాబ్స్, లాంగ్వేజి లాబ్స్ సెట్ అప్ చెయ్యాలి. అందుకని ఒకటి రెండు ఫర్మ్స్‌తో ఎంఓయు కుదుర్చుకోడానికి వెళ్లాను. మేమనుకున్నట్లు జరిగితే, ఈ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే మా సంస్థలు నంబర్ ఒన్ అవుతాయి' అన్నాడు.

    ఆ మీదట తనే విషయంలోకి వచ్చేశాడు.

    'మీరు చెప్పిన విషయం అంకుల్‌తో మాట్లాడేను. మా బోర్డు మెంబర్లు కూడా ఒకరిద్దరితో మాట్లాడేం. మీరు మా కాలేజిల్లో ఈవ్ టీజింగ్ ఉందని చెప్పినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయానుగాని, అంతా కలిసి చర్చించుకున్నాక అదంత తొందరపడే విషయం కాదనీ, నెమ్మదిగా, డెలికేట్‌గా హాండిల్ చెయ్యాల్సిన మాటరనీ అనిపించింది' అన్నాడు.

    'ఎందుకని?'

    'ఎందుకంటే' అతడు కుర్చీలో రిలాక్స్‌డ్‌గా వెనక్కివాలాడు. 'చూడండి, ఎ. అసలు ఆ ఫోన్ కాల్స్ నిజమని ఎలా అనుకోవడం? అవి హోక్స్ కావచ్చు కదా. ఇక బి ...'

    నేనుండబట్టలేకపోయాను. 'హోక్స్ కాల్సా? ఎందుకని? ఎవరికవసరం?'

    'ఎవరికంటే ఏముంది? మీకు తెలుసుకదా, ఈ సెక్టర్‌లో మాకున్న కాంపిటిషన్. మా సంస్థల రెప్యుటేషన్ పాడుచేయడానికి చాలామందే ఉన్నారు. మీరే చూడండి. ఆ ఫోన్ కాల్సు చేస్తున్నవాళ్లు మీకే ఎందుకు చేస్తున్నారు? పోలీస్‌కి ఎందుకు చేయడం లేదు? పేరెంట్స్‌కి ఎందుకు చేయడం లేదు? మా ప్రిన్స్‌పాల్‌కి ఎందుకు చేయడం లేదు? మీకే అంటే మీడియాకే ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఎందుకంటే, వాళ్ల అబ్జెక్టివ్ క్లియర్‌గా ఉంది. ఇంతకన్నా ఏం చెప్పాలి?' అనడిగాడు.

    అతడి తర్కంలోని కూల్ నన్ను ఉడుకెత్తించింది. 'మీ మాటలు నేనొప్పుకోను. వాళ్లు పోలీసులకి కూడా ఫోన్ చేస్తూండొచ్చు. వాళ్లు దీన్ని మామూలుగా తీసుకొని ఉండవచ్చు. లేదా వెనకాడుతుండొచ్చు. ఇక పేరెంట్స్ అంటారా? పేరెంట్స్‌కి ఫోన్ చేస్తే మాత్రం వాళ్లేం చేస్తారు? ఆడపిల్లని చదువైతే మాన్పించలేరు. ఈ కాలేజి కాకపోతే మరో కాలేజి. కాని ఈవ్‌టీజింగ్ లేనిదెక్కడ అనుకుంటారు. వాళ్ల సంగతి వదిలిపెట్టండి. నేను మీకు చెప్పాను కదా. అమ్మాయి వివరాలు కూడా ఇచ్చాను. మీరు ఎంక్వైరీ చేయవచ్చుకదా. ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడి ఉండొచ్చు' అన్నాను ఆవేశంగా.

    అతడు కుర్చీలో ముందుకు వంగాడు. నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. 'మేం తీసుకోవాల్సిన మెజర్స్ మేం తీసుకుంటూనే ఉన్నాం. ఆ అమ్మాయి క్లాస్ ఇంఛార్జిని అంకుల్ పిలిపించి మాట్లాడారు. ఆమెని, ఆమె క్లాస్ మేట్లనీ అబ్జర్వేషన్లో పెట్టమన్నారు. ఆ కాలేజీలోనే ఓ ఫాకల్టీ మొన్నటిదాకా వేరే సంస్థల్లో పనిచేసి వచ్చాడు. అతణ్ణి కూడా పిలిపించి అతడి పాత సంస్థల్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు చెప్పమన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కంప్లీట్ సర్వైయలెన్స్ సెట్ అప్ చేశాం. ఇలాంటి విషయాల్లో మనం ఏ మాత్రం తొందరపడ్డా మా సంస్థల రెప్యుటేషనే కాదు, ఆ అమ్మాయి రెప్యుటేషన్ కూడా ప్రమాదంలో పడుతుంది' అన్నాడు.

    'ఆ అమ్మాయి రెప్యుటేషన్‌కి ఎందుకు ప్రమాదం?'

    'ఎందుకంటే ఆ అమ్మాయిని మా కాలేజీలోనో, బయటో ఎవడో నిజంగానే వేధిస్తూ ఉండొచ్చు. ఆమె పట్టించుకోకపోవచ్చు. కాని ఇలా ఆమెని మీడియాద్వారా ఎక్స్‌పోజ్ చేస్తే ఆమె భయపడి అతడి దారికి రావచ్చని వాడు అనుకుంటూండవచ్చు'

    అతడి మాటలు వింటుంటే మధ్యయుగాల డెన్మార్క్‌లో ఉన్నానా అనిపించింది ఒక్కక్షణం.

    'నా ఆలోచన అంత దూరం పోలేదు. సరే మంచిది. నేను చెప్పవలసింది నేను చెప్పాను. ఆ పైన మీ ఇష్టం' అన్నాను. అతడు తక్షణమే లేచి నిలబడి నాతో మరోసారి కరచాలనం చేసి 'బై' అంటూ వెళ్లిపోయాడు.
అతడు వెళ్లిపోయాక గుర్తొచ్చింది. హామ్లెట్ నాటకం మళ్లా చదివానని చెప్పడం మర్చిపోయానని. ఒఫీలియా గురించి నేను చెప్పాలనుకున్నది కూడా చెప్పనే లేదు. ఇప్పుడతను మాట్లాడిన మాటలు విన్నాక ఇంకో మాట కూడా చెప్తే బాగుణ్ణనిపించింది. మనం స్టేట్ గురించీ, హామ్లెట్ గురించీ, నీ గురించీ, నా గురించీ మాట్లాడుకోవడం వల్ల తత్వ శాస్త్రమైతే పెరుగుతోందిగాని కార్యాచరణ మాత్రం తగ్గుతోందని.
వారం రోజులు కూడా గడవలేదు.

    ఒక సాయంకాలం ఆఫీసులో టెలివిజన్ చూస్తున్నాను. రకరకాల న్యూస్ ఛానెళ్లు సర్ఫ్ చేస్తూండగా, ఒక లోకల్ ఛానెల్లో కింద ఒక స్క్రోలింగ్ పాములాగా పాకుతూంటే నా మనసేదో ప్రమాదం శంకించింది. ఆ అక్షరాలు ఒకదానివెనుక ఒకటి నెమ్మదిగా కూడబలుక్కుంటూ చదివితే - నగరంలో ఫలానా అమ్మాయిమీద ఆసిడ్ దాడి జరిగింది అనీ, ఆమె నగరంలో ఫలానా కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నట్టుగా తెలుస్తున్నదనీ ఉంది.

    వెంటనే టేబుల్ సొరుగు తెరిచి ఆ చీటీ తీసి చూశాను.

    ఆ అమ్మాయే.

    నాకు కళ్లు బైర్లు కమ్మాయి. ఒక్కసారిగా కాళ్లల్లో బలమంతా ఊడ్చుకు పోయినట్టనిపించింది. గొంతు తడారిపోయింది.

    కొద్దిసేపటికే వార్త స్క్రోలింగ్ స్థాయిదాటి రకరకాల ఛానెళ్లలో విజువల్స్ ప్రసారం మొదలయింది. ఏవేవో దృశ్యాలు. ఎవరెవరివో కంఠాలు. ఆవేశంతో, ఆగ్రహంతో, కన్నీళ్లతో, శాపాలతో ఎవరెవరో తెరమీద ప్రత్యక్షమవుతున్నారు.

    పత్రికా సంపాదకుడిగా రోజూ ఏదో దుర్ఘటనలు వింటూనే వుంటాను. ప్రచురిస్తూనే ఉంటానుగాని, ఈ సంఘటనని అట్లా తీసుకోలేకపోయాను. ఆ దురంతానికి నేను కూడా ఎంతో కొంత బాధ్యుణ్ణే అనిపించింది.
నా గడచిన జీవితంలో నేను దగ్గరగా వుండి కూడా తప్పించలేకపోయిన నా సన్నిహితుల మరణాలూ, వైఫల్యాలూ, మతిభ్రమణాలూ అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. ఎవరెవరి ముఖాలో నీడల్లాగా బరువుగా కదలాడేయి. నా గుండెమీద ఎవరో ఏదో జిడ్డుగా రాసిపోయినట్టనిపించింది.

    ఆ కలవరం మధ్యలోనే నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది. నేను హైస్కూల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాణ్ణి. ఒకరోజు రాత్రి నాకు భరించలేని కడుపునొప్పి వచ్చింది. టాయిలెట్లు డార్మిటరీకి చాలా దూరంలో ఉండేవి. ఆ అర్థరాత్రి అంతదూరం ఒక్కణ్ణీ పోవడానికి భయమేసింది. నాకెవరన్నా సాయం వస్తారేమోనని నా మిత్రులు ముగ్గురు నలుగురు పిల్లల్ని నిద్రలేపడానికి ప్రయత్నించా గాని, ఏ ఒక్కరూ నిద్రలేవలేదు. ఆ ఒంటరితనపు రాత్రి, మా అమ్మ దగ్గరలేని ఆ నిస్సహాయమైన రాత్రి నా అరుపులు విని నా కోసమొక పిల్లవాడు నిద్రలేచాడు. వాడి పేరు ఇక్బాల్. 'పద నేను వస్తాన'న్నాడు. మూడవమనిషి ఎవ్వరూ మెలకువగా లేని ఆ రాత్రి, ఆ దుర్గంధం మధ్య, వాడట్లా నిద్రతో తూలిపోతున్న కళ్లతోనే నా కోసం ఓపిగ్గా చాలాసేపు నిలబడ్డాడు. వాడు నాకేమీ సన్నిహితుడు కాదు. ఆ తర్వాత కూడా మా మధ్య చెప్పుకోదగ్గ స్నేహమేదీ వికసించనేలేదు. కాని, ఈ కలవరపాటులో వాడు గుర్తొచ్చాడు నాకు. ఇక్బాల్, ఇప్పుడెక్కెడున్నావు నువ్వు?

(ఆదివారం ఆంధ్రజ్యోతి 26 సెప్టెంబరు 2010 సంచికలో ప్రచురితం)
Comments