పేదల్లారా మేల్కోండి! - టి.షణ్ముఖరావు

  
 అది పట్టపగలు. మిట్ట మధ్యాహ్నం.


    అయినప్పటికీ ఈ దేశం లో రాత్రి దొంగతనాలే కాకుండా పగటి దోపిడీలు సాగుతుంటాయి కనుక, ఆ విధంగా రాత్రి అనాచారాలే కాకుండా పగటి అత్యాచారాలూ కొనసాగుతుంటాయి, ఆ విధంగా రాత్రి కీ పగటికీ, చుక్కలూ, చంద్రుడు తప్ప ప్రత్యేకమైన తేడాలేమీ కనిపించవు .
 
    
    అదొక బొక్కి రూట్లో డొక్కు బస్సు. ఆ బస్సుకి ప్రభుత్వం వారు ఎలాట్ చేసిన సీట్లు నలభై. కండక్టరుగారు ఎక్కించిన జనాభా ఎనభై పైచిలుకు. (ప్రతి ఇంటికీ ముఖద్వారం కాకుండా దొడ్డిదారి కూడా వుంటుంది కాబట్టి ప్రభుత్వం వారి నలభై సీట్ల ఆజ్ఞని దొడ్డిదారి వెంబడి కండక్టరు వారు ఎనభై చెయ్యొచ్చు.) ఆ ఎండలో ఆ బస్సు అతిప్రయాసతో వగర్చుకుంటూ, మధ్యమధ్య పానీయం సేవిస్తూ, మరమ్మత్తూ గావించుకుంటూ ప్రయాణిస్తోంది. ఓ చోట రోడ్డు మీదనే నెలకొల్పబడ్డ పూరిపాక కాఫీ హోటల్లోంచి, ఓ శాల్తీ బస్సుకడ్డంగా వొచ్చింది. (పూరిపాక కాఫీ  హొటలు రోడ్డుమీదుందా? రోడ్డు ప్రక్కవుందా? అనే సందేహం నివృత్తికాగలదు) ఆ శాల్తీ .... "ఆపండాపండి... బస్సాపండి" అని కేకేసింది.

    
    బస్సాగింది.

    
    అతి కష్టం మీద ఆ శాల్తీ బస్సులో ప్రవేశించింది.

    
    ఆ శాల్తీ పేరు పైడి భీమయ్య.

    
    పేరుకి భీముడేగాని అతడు ఆరోగ్యానికి పెరాలిసిస్. ఇంటి పేరు పైడివారేగాని అతనింట్లో మట్టిపాత్రలు తప్పించి సిల్వర్ పాత్రలు కూడాలేవు.
అతడి అస్థిపంజరం పైన మాంసంలేకుండా చర్మం మాత్రమే అతుక్కొని వుంది. తలపైన పది పుంజెల వెంట్రుకలకి మాత్రమే చోటుంది. చేతిలోకర్రొకటుంది. నోటిలో చుట్టొకటి వుంది. తలపైన పాగా వుంది. కళ్ళల్లో దైన్యం వుంది. కడుపులో ఆకలి వుంది. మనస్సులో బాధుంది. బ్రతుకులో భయంవుంది.

    
    ఇండియాలో ఏటేటా పంటలు పండుతున్నప్పటికీ అతడి ఆకలి అలాగేవుంది. ప్రతి యేడూ ప్రత్తి పండుతున్నప్పటికీ అతడి ఒంటిమీద సరిగ్గా గుడ్డల్లేవు.
నునెగింజలు తయారవుతున్నప్పటికీ అతడి జేబులో పైసా లేదు. ఎన్నో యినబ్భీరువాలు నిండుగా డబ్బువున్నప్పటికి అతడి జేబులో పైసా లేదు. ఎన్నో హాస్పిటలున్నప్పటికి అతడి ఆరోగ్యం  బాగాలేదు. ఎన్నో స్కూళ్ళున్నప్పటికి అతడి కొడుక్కి చదువు లేదు. ఎన్నో న్యాయస్థానాలునప్పటికీ అతడి బ్రతుక్కి న్యాయం లేదు.

    
    అతడి వృత్తి వ్యవసాయం. హాబీ చుట్ట కాల్చడం. అలవాటు మందులు తినడం. దినచర్య ఆ వూరి ప్రెసిడెంటుగారి ముందర వంగి నిల్చోడం అతడు చెప్పిందల్లా వినడం,అర్థమయినట్లు తలాడించడం. అది మంచైనా చెడ్డయినా చేసెయ్యడం. ఇదీ పైడి భీమయ్య జీవితం. అతడి భార్య ప్రెసిడెంటుగారిన్ని మరిగిన కోకలూ,రైకలూ సంపాదించుకున్నా ఆమెని కోప్పడలేక అభిమానం చంపుకున్నాడు.

    
    అతడి కొడుకు ఇంట్లోంచి పారిపొయి దొంగల్లో కలసిపోయినా వాడ్ని వెతికి పట్టుకోలేక ప్రేమని చంపుకున్నాడు. అతని కూతురు పేరు తెలియని వాడితో తప్పటడుగు వేసి చూలాలైనంతవరకూ(అయినప్పటికీ)ఆమెకి పెళ్ళి చెయ్యలేక సిగ్గు చంపుకున్నాడు. పాపాలు పోవాలని కొబ్బరికాయలు కొట్టాడు. పుణ్యాలు రావాలని కోళ్ళు కోసాడు. అయినా భగవంతుడు పక్షవాతంతెచ్చిపెట్టేడు. దాంతో మరతడు కదల్లేకపొయేడు. స్వామి విధేయుడైన భీమయ్య అతి కష్టం మీద పట్నంలోని ధర్మాసుపత్రికి  డబ్బు పట్టుకుని బయల్దేరాడు. ఆ డబ్బు అప్పు డబ్బు. ఆ  ఆప్పు ప్రెసెడెంటుగారిచ్చింది. వారి నుండి భీమయ్య భార్య తెచ్చింది. అదీ ప్రస్తుతం భీమయ్య జేబులో వున్న డబ్బు సంగతి. భీమయ్య బస్సులో ఎక్కాడా ? ఎక్కేడు. టిక్కేట్టు తీసుకున్నాడా ? తీసుకున్నాడు.
సీట్లో కూర్చున్నాడా? కూర్చోలేదు. ఎందుకు? బస్ చాలా రద్దీగా ఉంది.


    భీమయ్య నిల్చోలేడు.కండక్టరు కుర్చోనివ్వడు.పేషెంటిని కనికరించి ఎవడూ సీటివ్వడు.


    బాధ కాలు వంగదు. చెయ్యి  కదలలేదు. నరాలు పీకేస్తున్నాయి."అయ్య ! ఒక సీటివ్వండి.ముగ్గురు సీట్లో కనీసం నాలుగోవాడిగా,ఇద్దరి సీట్లో కనీసం మూడో వాడిగా, ఒక్కడి సీట్లో కనీసం రెండోవాడిగా, బాబూ ! ఒక్కటే సుమా ! ఒక్క సీటివ్వండి. అర్థించాడు, ప్రార్థించాడు."పో పోమ్మ"న్నారు. "మే వే గాల్లేక చస్తున్నా"మన్నారు." నువ్వేప్పుడైన బస్సెక్కావా" అని ఎకసెక్కాలాడారు. భీమయ్య నిరాశ చేసుకున్నాడు. ఓ చోట డబుల్ సీట్లో ఇద్దరు. ఇద్దరే ఇద్దరు. అదీ సింగల్ పన్నా మనుషులు కూర్చున్నారు. ప్రత్యేకంగా వార్నీ అడిగేడు. బ్రతిమాలాడు. కాని... అంతలో ఒకసారి బస్సాగి, ఓ మీసాల పెద్దమనిషి బస్సులో ప్రవేశించి, మళ్ళీ బస్సు కదిలిపోవడం జరిగేయి. ఆ పెద్ద మనిషి సిల్క్ లాల్చీ వేసేడు. గ్లాస్కొ పంచె కట్టేడు. బంగారపు చైను వాచీ పెట్టాడు. చేతులకి నాలుగుంగరాలు పెట్టాడు. నల్ల కళ్ళద్దాలు ధరించేడు. సెంటు వాడేడు. హేరాయిల్ రాసేడు. చేతిలో కాష్ బ్యాగ్ పెట్టేడు. ఆరొగ్యంగా వున్నాడు. వేయేల అతడు పైడి భీమయ్యకి పూర్తి వ్యతిరేకంగా వున్నాడు. అయితే అతడికి సీటు ఇవ్వలేదు. అతడూ ఆ యిద్దరి సీట్లో ఇద్దర్నీ అడిగాడు. ఖాళీ లేదన్నారు. మీసాల పెద్దమనిషి ఉపన్యాసం లంకించుకున్నాడు. "ఖాళీ లేదని నాకు తెలుసు అయినా సర్దుకోవాలి. ఎలాగో ఒకలాగ సీటివ్వాలి. తోటివాళ్ళ బాధని కొంచెం గమనించాలి. అదేకదా గాంధీ చెప్పింది. ఏమంటారు? మీరు టిక్కేట్టు కట్టేరు. నిజమే... నేనూ కట్టేను... రైటే... ది ఇద్దరి సీటే. కరక్టే కాని కండక్టరు సీటింగు ప్రకారం టిక్కెట్లువ్వలేదు. ఆ సంగతి ఆయన్నే అడుగుదాం... కండక్టరూ! కండక్టరూ!" కండక్టరు జనాన్నితోసుకుని రాకెట్టులా వాలాడు. "బాబ్బాబు..కొంచెం..ఇంకొంచెం సర్దుకొండి" అని ఆ ఇద్దర్నీ బ్రతిమాలి మీసాల పెద్దమనిషి కి సీటు చేశాడు. ఆ  సీట్లో మీసాల పెద్దమనిషి బైఠాయించాడు. బైఠాయించి ఉపన్యాసం కొనసాగించాడు."ఒక సీటు మీద పట్టినంత మంది కుర్చోవచ్చు. అది ఈ రోడ్లోలో అన్ రిటన్ రూల్. ఓర్చుకోవాలి. దేశం బాగుపడాలంటే మనుషులు కష్టపడాలి. తప్పదు... కొంచెం సర్దుకొండి నాయనా... అద్గదీ... మీరుకూడా. భేషొ యిప్పుడు సరిపొయింది. అయితే మీ రెక్కడ దిగుతారు?". "తరువత హాల్టింగు." "బ్రతికించేరు,మరి తమరూ!". "విజయనగరం." "చాలా దూరమే..నేనూ అక్కడికే" అని కోరకుండా సమాచారం ఇచ్చేశాడు... మీసాల పెద్దమనిషి సీటు సంపాదించగలిగేడు. ఓసారి హుందాగా కదిలిన పెద్దమనిషి ప్రక్కనే వున్న,నిల్చొని వగరుస్తున్న మన పైడి భీమయ్యని చూసేడు. భీమయ్య కూడా పెద్దమనిషి వైపు జాలిగా, దీనంగా, పళ్ళు విరిగిపోయిన ముసలినక్క తన ప్రక్కనే దుమ్ములు కొరుకుతున్న పడుచు నక్కని చూసినట్టు చూసేడు. అప్పుడు మీసాల పెద్దమనిషి జాలి ప్రదర్శించాడు. "అయ్యా ! పక్షవాతవా..మందులు తింటున్నావా? లేకపొతే నాతోరా... పట్నంలో డాక్టరికి చూపిస్తాను. నడివయస్సన్నా దాటినట్టులేదు. నీకెలా వొచ్చిందయ్యా... పాపం..." ఈ ధోరణిలో కరుణోపనాస్యం సాగించాడు. భీమయ్య అతని మంచితనాన్ని వెన్నల ఫ్రీగా పంచిపెట్టిన చంద్రుడితోనూ, కోరకుండా వాసన సరఫరా చేసిన పువ్వుల్తోనూ, అడక్కుండా వర్షం కురిపించిన మేఘంతోనూ పోల్చుకున్నాడు. భీమయ్య ఉపమానాలు పుర్తికాకముందే మరో హాల్టింగు, బస్సాగడం, మొదటున్న రెండు సన్నని శాల్తీలో ఒకటి దిగిపోవడం జరిగేయి. ఇప్పుడాసీట్లో వున్నది యిద్దరే. మీసాల పెద్దమనిషీ, మరో సన్నని శాల్తీ, ఇద్దరి సీట్లో యిద్దరే మూడోవాడిగాతను కూర్చోవచ్చు. భీమయ్య ఆ మాటే అన్నాడు. మీసాల పెద్దమనిషి విజేతలా నవ్వాడు. విరాగిలా చూశాడు. విసుగ్గా కదిలేడు... ససేమిరా అన్నాడు. "చూడు బాబూ యిది యిద్దరి సీటే... ముగ్గురు కూర్చోడానికి వల్ల కాదు. యిద్దరికే సరిగ్గా చాలడంలేదు. నువ్వు అందులోనూ జబ్బోడివి... కూర్చోలేవు... ఇది ఇద్దరి సీటే." అని మరోమారు ఖచ్చితంగా చెప్పేసి తలతిప్పుకున్నాడు. అపుడు భీమయ్య ఆశ్చర్యపోయేడు. బాధ పడ్డాడు. లోలోపల మండిపడ్డాడు. "నువ్విందాక మూడోవాడి గా కూర్చొలేదా? అలాగే నేనూను" అన్లేకపోయేడు. అతని హుందా చూసి,హొదా చూసి, కళ్ళద్దాలూచూసి, జరీ కండువా చూసి నోరు మూసుకున్నాడు. కాని అతన్ని-అంటే మీసాల పెద్ద మనిషిని నక్కతోనూ, కంసుడితోనూ, కర్కోటకుడితోనూ, కసాయివాడితోనూ ఉపమించుకున్నాడు. మొత్తానికి పైడి భీమయ్య సీటు సంపాదించుకోలేకపోయేడు అనడంకంటే సీటు సంపాదించే చొరవా, కరేజీ, కన్నింగ్ నెస్ లేవడం ఉత్తమం. భీమయ్య బాధపడుతూ ప్రయాణించేడు. ప్రయాణిస్త్తూ బాధపడ్డాడు.


    "అయ్యా !అమ్మా ! బాబూ! కొంచెం చోటు... ఒక్క సీటు... పక్షవాతం వాడ్ని... నిలబడలేని రోగిని... రక్షించండి... చోటివ్వండి... బ్రతకనివ్వండి."


(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 08-02-1974 సంచికలో ప్రచురితం)
Comments