పెద్దత్త - ఎమ్.బాలాత్రిపురసుందరి

   
"అమ్మమ్మా! దా తొరగా. బడికి వేళైపోతోంది. నన్ను దిగబెట్టాలి."

 

    అయిదేళ్ళ శీను బూట్లతో రెడీగా నుంచొన్నాడు గుమ్మం దగ్గర - వీపు మీద పుస్తకాల సంచీ మోస్తూ.

 

    "వస్తున్నారా బాబూ. ఇదిగో పిండి రోట్లో నుంచి తీసేసి... ఒక్క నిమిషం."

 

    "మీరు లేవండి పెద్దత్తా! నేను తీసి రోలు కడిగేస్తాలెండి. ఆలస్యమయితే వాడు ఊర్కోడు."

 

    "పదరా బాబూ. ఏదీ బేగ్ ఇలా ఇవ్వు."

 

* * *

 

    "ఏవండీ! నూనె, కాఫీ గుండ అయిపోయాయి. అర్జెంటుగా కావాలి."

 

    "అబ్బబ్బా! ఎన్నిసార్లు చెప్పినా కాస్త ముందు చూసుకోరేం? నాకో వేపు ఆఫీస్‌కి వేళైపోతోంది. ఇంకా స్నానమే కాలేదు. పెద్దత్తా మీరొక్కసారి కాస్త స్టొరుకెళ్ళొద్దురూ... ... ఏంటీ - వేన్నీళ్ళా? మీ కెందుకు నేను తొరుపుకుంటా గాని మీరు వెళ్ళి రండి బాబూ" ఆమె మేనల్లుళ్ళు, మేనకోడళ్ళకే కాక ఇంటి అల్లుళ్ళకీ, కోడళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ, సమస్త బంధు వర్గానికి అందరికీ పెద్దత్తే.

 

* * *

 

    "అమ్మమా! అమ్మ పనిలో వుంది కాని, నాకు చప్పున స్నానం చేయించేసెయ్. మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు ఆడుకోవడానికి" - ఏడేళ్ళ సుధ హడావుడి పెట్టేస్తోంది.

 

    "ఇదిగో వదినా! నా స్నానం, పూజ అయిపోయాయి. మడినీళ్ళు తోడి పెట్టాను. మరి నేను మైలడిపోతాను. వారకి పెట్టాను మడి నీళ్ళు. నీ స్నానమయ్యాక తీసుకో ఏం - రావే పాపా! నీళ్ళు పోస్తాను."

 

* * * 

 

    "వదినా ఏడున్నర అయిపోతోంది... మొదలు పెట్టేస్తారు హరికథ. అన్నయ్య భోజనం అయిపోయిందా! త్వరగా తెములు మరి. పద పద వేగిరం!" పెద్దత్త హడావుడికి సన్నగా నవ్వొచ్చింది రాజేశ్వరికి.

 

    * * *

 

    "ఇదుగో నిన్నట్నించీ మాత్రలేసుకుంటూనే వున్నావు. మూలుగుతూనే వున్నావు. మీ ఆయన మరీ మరీ చెప్పాడు, ఇవ్వాళ నిన్ను డాక్టరు దగ్గిరకి తీసికెళ్ళమని! లే మరి."

 

    "ఉండండి పెద్దత్తా, రోజూ చూసి రేపు వెళ్దాంలెండి."

 

    "నాకదేం తెలీదు. మీ ఆయన ఆఫీసు నుంచొచ్చి నన్నడుగుతాడు. పదమ్మా లే మరి! చీర ఇవ్వను? బాత్‌రూంలో వేన్నీళ్ళు పెట్టాను. మొహం కడిగిస్తాను, మెల్లగా లేచిరా."

 

* * *

 

    " మడమ నాయనా బెణికిందన్నావు. ఇలా రా. అమృతాంజనం కాస్త రాయనీ. నరమేనా..."

 

    "... అబ్బ! హాయిగా వుందండీ మీరలా రాస్తుంటే పెద్దత్తా."

 

* * *

 

    "ప్రియమైన నాన్నగారికి,

 

        అంతా క్షేమం. మధ్య పిల్లలిద్దరికీ ఒంట్లో బావులేదు. ఇద్దరితో ఇంటిపని  చేసుకోలేక పోతున్నాను. సాయంగా ఎవరైనా ఉంటే బాగుంటుంది. పెద్దత్తని కొన్నాళ్ళు నాదగ్గిరకి పంపండి...

 

                                                                                                            వుంటాను.

 

                                                                                                          మీ కుమార్తె..."

 

    "ఇదిగో! ఏవేవ్! చెల్లి ఏదీ - చిట్టి తల్లి ఉత్తరం రాసింది..."

 

* * * 

 

    కేలండర్ మారిపోయింది.

 

    "అమ్మా! బడికి దిగబెట్టవే."

 

    "పెద్దవాడివవుతున్నావ్. మాత్రం వెళ్ళలేవా? పద రోడ్ క్రాస్ చేయిస్తా, వెళ్ళిపోదువు గాని - " భుజానికి బ్యాగ్ తగిలించుకుని అడుగులేశాడు శీను.

 

* * *

 

    "ఏమండీ! పంచదార ఇస్తున్నారట రేషన్లో."

 

    "అబ్బ నాకు వీలవదు. రోజు నీవే ఎలాగో తెచ్చుకో."

 

* * *

 

    "అమ్మా త్వరగా రావే, నీళ్ళు పొయ్యి."

 

    "ఏమిటా తొందర? ఆదివారమేగా! చేతిలో పని అవనీ. ఆటలకేగా ఉరుకులూ పరుగులూను! కాస్సేపాగితే - మరేం ఫర్వాలేదు". 

 

    బిక్కమొహం వేసింది సుధ.

 

* * *

 

    "ఉష్! అబ్బా! మడి నీళ్ళు కాదు గాని ఇంత చిన్న గిన్నెలతో నైనా తోడుకుని మెట్లన్నీ ఎక్కి తీసుకొచ్చేప్పటికి ప్రాణం పోతోంది."

 

* * *

 

    "అబ్బా నడుం నెప్పి గుంజేస్తోంది. ఎవరన్నా అమృతాంజనం రాస్తే బాగుండును! పెద్దత్తలా అంత చక్కగా ఎవర్రాయగలరు?"

 

* * *

 

    "ప్రియమైన నాన్నగరికి,

 

        నాకు ఒంట్లో కొంచెం నీరసంగా వుంటోంది. అమ్మని సాయానికి పంపగలరా! అమ్మ వచ్చేస్తే వదిన ఒక్కర్తే పిల్లలతో చేసుకోగలదా? పెద్దత్త వున్నప్పుడయితే..."

 

    గోడకి తగిలించిన నిలువెత్తు ఫోటో లోంచి పెద్దత్త అన్నీ మౌనంగా చూస్తున్నారు.

 

* * *

 

    తెలుగుదేశంలో, మధ్య తరగతి కుటుంబాలలో చిన్న చిన్న ఇబ్బందుల నుంచీ పెద్ద కష్టాల వరకూ అన్నిటికీ తామై వెనక నిలబడి నిశ్శబ్దంగా శ్రమపడే పెద్దత్తలు తప్పకుండా ప్రతి కుటుంబంలో ఇంచుమించు వుంటారు. వారి శ్రమశక్తికి ఖరీదు కట్టే షరాబు లెవరూ లేరు, ఉండరు, ఉండబోరు. విలువ కట్టలేని శ్రమ వాళ్ళది. అలాటి వారికి నా జోహార్లు.

 

(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 15-05-1987 సంచికలో ప్రచురితం) 

  

Comments