పెళ్లిచూపులు - వులాపు బాలకేశవులు

    
టేబిల్ మీద ఉన్న ఫైలు చూస్తున్నాడన్న మాటే కానీ సుందరం మనసు మనసులో లేదు. అతని ఆలోచనలన్నీ సుహాసిని మీదే ఉన్నాయి. కనులముందు పదేపదే ఆమె రూపమే కదులుతూంది.

    ఫైల్లో నుంచి తల ఎత్తి ఒక్కసారి తనచుట్టూ ఉన్న తోటి ఉద్యోగుల వైపు చూశాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగి పోయివున్నారు. అతను దృష్టిని మరలించి కిటికీనించి రోడ్డూ మీదికి చూశాడు. రోడ్డువారగా ఉన్న బస్ స్టాపు దగ్గర ఒక ఆమె నిలబడి ఉంది. ఆమెను చూడగానే అప్రయత్నంగా సుందరం ముఖం విప్పారింది. ఆమె దాదాపు సుహాసిని లాగానే కనిపించింది.

    ఆ క్రితం రోజు సాయంత్రమే సుందరం, అతని తల్లి కలిసి పెళ్లిచూపులు చూడడానికి ఆ వూళ్ళోనే మరొక వీధిలో ఉంటున్న ఒకరి ఇంటికి వెళ్ళారు. పెళ్ళికూతురు పేరు సుహాసిని. ఆమెకు తండ్రి లేడు. తల్లి ఉంది. 

    పెళ్ళిచూపులు మొదలయ్యాయి. సుహాసిని వచ్చి సుందరం ఎదురుగా కూర్చున్నది. మొదటి చూపులోనే ఆమె సుందరం మనసును దోచుకున్నది. ఆమె అందంగా ఉంది. మంచి ఎత్తు. ఎత్తుకు తగైన లావు. పొడుగాటి జడ. పొందికగా ఉంది. 

    సుహాసినిలో ఎలాంటి లోపము సుందరానికి కనిపించలేదు. ఆమె ఇంటర్ పాసయింది. ప్రస్తుతం ఒక ప్రయివేట్ కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం చేస్తూంది. అతనికే కాకుండా అతని తల్లికి కూడా సుహాసిని బాగానే నచ్చింది. ఆమె సుహాసినిని కొన్ని ప్రశ్నలు అడిగింది. సుహాసిని అన్నింటికి చిరునవ్వుతో జవాబులిచ్చింది. సుహాసిని గొంతు కూడా బాగానే ఉందనుకున్నారు తల్లీ కొడుకూ.

    రెండు గంటల తరవాత పెళ్లిచూపులు ముగిశాయి. సుహాసిని లోపలికి వెళ్లబోతూ ఒక్కసారి సుందరం కళ్లలోకి చిలిపిగా చూసి వెళ్ళిపోయింది. అతని ఆ చూపులో నరనరాల్లోనూ విద్యుత్తు ప్రవహించినట్టనిపించింది.

    బయటికి వస్తూ ఏ విషయం రెండు, మూడు రోజుల్లో కబురు చేస్తానన్నది సుందరం తల్లి సుహాసిని తల్లితో.

    సరేనన్నదామె.

    ఇద్దరూ ఇంటికి వచ్చారు.

    ఇంట్లోకి వచ్చిన తరవాత - "నాకు ఆ అమ్మాయి నచ్చిందమ్మా. కట్నం విషయంలో మనకు పట్టింపు లేదుకదా? మనకు ఇష్టమే నని రేపు కబురు చెయ్యవచ్చును గదా?" అన్నాడు సుందరం తల్లితో.

    మె  నవ్వి కొడుకుతో - "పిచ్చివాడా! అమ్మాయి అందంగా ఉండగానే సరిపోయిందా? గుణం కూడా చూసుకోవాలి. అందులోనూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. మనం ఆ అమ్మాయి గురించి బాగా విచారించి చేసుకోవాలి. ఆమె పనిచేసే కంపెనీలో  నీకు తెలిసిన వాళ్లెవరయినా ఉంటే అమ్మాయి గురించి అడిగి చూడు" అన్నది.

    సుందరం మాట్లాడలేదు. నిజానికి తల్లి ఆలోచన అతనికి నచ్చలేదు. సుహాసిని క్యారెక్టర్ గురించి ఎంక్వయిరీ చెయ్యటం చాలా నీచమయిన పనిలా తోచింది. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయితే గుణం మంచిది కాకుండా ఉండాలని లేదు కదా అనుకున్నాడు. అయినా, అతనికి ఆరా తీయక తప్పలేదు. లేకపోతే తల్లి వూరుకోదు. ఇలా అనుకొని ఆమె పనిచేసే కంపెనీలో తన స్నేహితులెవరయినా పనిచేస్తున్నారేమో గుర్తు చేసుకున్నాడు సుందర. అతనికి హనుమంతరావు గుర్తుకు వచ్చాడు. అతనికి ఆరునెలల క్రితమే ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ మరురోజు సాయంత్రమే అతన్ని కలవాలనుకున్నాడు సుందరం. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. అతని గుండె నిండా సుహాసిని. తన భార్య అయినట్టుగానే కలలు కన్నాడు సుందరం. ఎప్పటికో తెల్లవారు జాముకు నిద్రపోయాడు. 

    తెల్లవారిన తరవాత సుందరం రోజుకంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఈ రోజు ఎంక్వయిరీ పూర్తి అయితే త్వరలో సుహాసినిని తన భార్యను చేసుకోవచ్చు ననుకున్నాడు. సుహాసిని గురించిన ఆలోచనలతోనే ఆఫీసుకు వచ్చాడు.

    వేగంగా వచ్చి  హోటలు ముందు ఆగిన బస్సు చూడగానే సుందరం ఆలోచనలు చెదిరిపోయాయి. సుహాసినిలా ఉన్న ఆ అమ్మాయి బస్సులో ఎక్కింది. వెంటనే వెళ్లిపోయింది బస్సు. 

    ఒకసారి చేతికి ఉన్న వాచీ కేసి చూసుకున్నాడు సుందరం. లంచ్‌కి ఇంకో ఇరవై నిమిషాలు వ్యవధి ఉంది. అతనికి సుహాసిని గురించి తెలుసుకోవటానికి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉండాలనుకుంటే విసుగనిపించింది. అప్పటికప్పుడే ఆమె గురించి ఫార్మల్‌గా తెలుసుకుంటే సగం భారం తీరి నట్లుంటుం దనిపించింది. తనకు సుహాసిని గురించి ఇన్ఫర్మేషనిచ్చే హనుమంతరావును కలవాలంటే అతని ఇంటికి వెళ్లవలసిందే. అతని ఇల్లు చాలాదూరం. తీరా వెళ్లితే ఉంటాడో ఉండడో? లంచ్ టైములో అయితే ఆఫీసులోనే కలుసుకోవ్చ్చు. ఆఫీసు అక్కడికి దగ్గరే. అందుకని సుదరం పెర్మిషన్ తీసుకుని ఆఫీసు నుంచి బయటికి వచ్చాడు. రోడ్డు మీదికి రాగానే అతనికి బస్సు స్టాపు దగ్గర ఆగి ఉన్న రిక్షా కనిపించింది. అతను దానిలో ఎక్కి అడ్రసు చెప్పాడు. కదిలింది రిక్షా.

    ప్యాంటు జేబులోంచి సిగరెట్టు ప్యాక్ బయటికి తీసి ఒక సిగరెట్టు ముట్టించాడు సుందరం. నున్నగా ఉన్న తారు రోడ్డు మీద వాలు గాలిలో రివ్వున దూసుకు పోతోంది రిక్షా. సుందరం గుండెలో సన్నగా అలజడి మొదలయింది. సుహాసిని గురించి హనుమంతరావు ఏమని చెబుతాడో? నిజానికి ఆమె ప్రవర్తన ఎటువంటిదో? ఏమో? ఎలా తెలుస్తుంది? పావు గంట తరవాత అదురుతున్న గుండెను అదుపులో ఉంచుకుంటూ ఆ ఆఫీసు ముందు దిగాడు. రిక్షావాడికి డబ్బులిచ్చి లోపలకు నడిచాడు. అప్పుడే ఆఫీసులో నించి ఉద్యోగులు బయటికి వచ్చి క్యాంటీన్ వైపు వెళుతున్నారు. వాళ్లాలో సుందరానికి హనుమంతరావు కనిపించలేదు. నిముషం తరువాత ఒక్కడే వస్తూ కనిపించాడు హనుమంతరావు. అతను సుందరంను చూడగానే నవ్వుతూ విష్ చేశాడు.

    "ఏం గురూ. ఇలా వచ్చావ్? ఏమిటి కథ?"

    "ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి" చెప్పాడు సుందరం.

    "క్యాంటీన్‌కు వెళ్లి మాట్లాడుకుందాం పద" అని ఆవైపు నడిచాడు.

    ఇద్దరూ క్యాంటీన్‌లోకి వెళ్లి ఒక మూలగా ఎదురెదురుగా కూర్చున్నారు. 

    హనుమంతరావు ఏవో పదార్థాలకు ఆర్డరిచ్చాడు. క్యాంటీనంతా కోలాహలంగా ఉంది.

    "ఇంతకూ నీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, మేన్" అడిగాడు హనుమంతరావు బల్ల మీదికి వంగి. 

    "మీ ఆఫీసులో పనిచేస్తున్న సుహాసిని గురించి"

    "సుహాసిని గురించా?"

    "అవును"

    "లైన్‌లోకి వస్తున్నావా?" నవ్వుతూ అడిగాడు హనుమంతరావు. 

    "అదేం లేదు. ఆమె ఎలాంటిదో తెలియాలి"

    హనుమంతరావు ఏదో అనబోయేంతలో సర్వరు పదార్థాలను వారి ముందు ఉంచి వెళ్లిపోయాడు.

    "ఇంతకూ అసలు విషయం చెప్పలేదు నువ్వు" అంటూ అడిగాడు హనుమంతరావు.

    "నాస్నేహితుడు ఒకతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె ఇక్కడ పని చేస్తూందని తెలిసింది. అతనికి ఈ ఆఫీసులో తెల్సిన వాళ్లు ఎవ్వరూ లేరు. నన్నడిగితే నువ్వు తెలుసునని చెప్పాను. వెంటనే నన్ను ఆమె గురించి తెలుసుకు రమ్మని పంపించాడు. ఇదీ విషయం" అన్నాడు.

    హనుమంతరావు రెండు నిమిషాల తరవాత "తను నీకు మంచి ఫ్రెండా?" అని అడిగాడు.

    తల వూపాడు సుందరం. కావాలనే హనుమంతరావుకు అలా చెప్పాడు.

    "ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే అతను బాధపడడు గదా?"  అడిగాడు.

    "బాధ పడేదేముంది? ఆమె కాకపోతే ఇంకొకరు" అన్నాడు మెల్లగా. అతనిలో అప్పుడే ఏదో అనుమానం పొడచూపింది. 

    సుందరం అలా అనగానే - "అయితే అతన్ని ఈ సంబంధం వదులుకోమని చెప్పు" అన్నాడు హనుమంతరావు. 

    "వదులుకోమనా?"

    "అవును. సుహాసిని మంచిది కాదు. మా ఆఫీసర్‌కూ దానికీ లావాదేవీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు ఈ ఉద్యోగం దానికి ఎట్లా వచ్చిందనుకున్నావ్? వాడే ఇచ్చాడు. వాడొక్కడితోనే కాదు ఇంకో ఇద్దరితో కూడా సుహాసినికి చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి. దానికి వచ్చే జీతంతో అది ఫ్యామిలీని పోషిస్తుందనుకున్నావా? తలా ఒక చెయ్యి వేసి ముందుకు నెట్టుతున్నారు. మీ స్నేహితుణ్ణి ఈ సంబంధం గురించి మరిచిపొమ్మని చెప్పు. ఏమయినా నన్ను కలుసుకోవటం మంచిదే అయింది" అన్నాడు హనుమంతరావు సీరియస్‌గా.

    విస్తుబోయాడు సుందరం. అతనికి మతిపోయినట్టనిపించింది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. అతని అంచనాలన్నీ తలకిందులయినాయి. సుహాసిని మంచిది కాదా? ఆఫీసర్‌తో సంబంధం వుందా? ఇంకో ఇద్దరితో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయా? ఇది నిజమా? 

    "ఏమిటో హనుమంతరావుగారు సీరియస్‌గా మాట్లాడుతున్నారు" అంటూ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు మరొక ఉద్యోగి. 

    సుందరం ఎందుకోసం వచ్చిందీ, తను ఏమి చెప్పిందీ అంతా చెప్పాడు హనుమంతరావు.

    "సుహాసినా? అది పెద్ద కాటా. సార్ దాన్నెవడండీ పెళ్లి చేసుకొనేది? కాటాకు పెళ్లా?" పెద్దగా నవ్వాడతను.

    నిజంగానే సుందరంకు తల తిరిగి పోయింది. ఇక నిమిషం కూడా అక్కడ కూర్చో బుద్ధి కాలేదు. ఒకసారి వాచీకేసి చూసుకొని,"ఇక నే వెళతాను. ఆఫీసు టైమవుతూంది. ఈ విషయాలన్నీ మా ఫ్రెండ్‌తో చెబుతాను. థాంక్స్!" అని లేచి నిలుచున్నాడు.

    "నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. మీ ఫ్రెండ్‌కు సుహాసినిని చేసుకోవద్దని చెప్పు" మరోసారి హెచ్చరిక చేశాడు హనుమంతరావు. 

    తల ఊపుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ బయటికి వచ్చాడు సుందరం.

    మనసంతా అదోలా అయిపోయింది. తను సుహాసిని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆమెను తన భార్యగా వూహించుకుని ఎన్నో కలలు కన్నాడు. చివరికి ఇలా జరిగిందేమిటి? ఇంకా నయం! తను గుడ్డిగా పెళ్లికి ఒప్పుకోలేదు - అనుకున్నాడు. ఆఫీసుకు వెళ్ల బుద్ధికాలెదు. రిక్షా ఎక్కి తన ఇంటి అడ్రెసు చెప్పాడు సుందరం.

* * *

    నెల రోజులు గడిచాయి.

    ఒక రోజు లంచ్ అవర్‌లో సుందరం మరి కొందరు ఉద్యోగులు వాళ్ల ఆఫీసు క్యాంటిన్‌లో మాట్లాడుకుంటున్నారు. వాళ్లలా మాట్లాడుకుంటున్నప్పుడు సుందరం కొలీగ్ శివరావు ఒక ముప్పై ఏళ్లతన్ని వెంట తీసుకువచ్చాడు.

    "రండి శివరావు గారూ. ఎవరో అతిథిని తీసుకువచ్చారే?" అన్నాడు ఒక ఉద్యోగి. 

    శివరావు నవ్వుతూ తను తీసుకువచ్చిన అతన్ని వారందరికీ పరిచయం చేశాడు.

    అతని పేరు గౌతమ్‌ప్రసాద్. ఒక బ్యాంకులో పని చేస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు.

    "ఇంతకూ ఇతను వచ్చిన పనేమిటో చెబుతాను. ఇరవై రోజుల క్రితం మన సెక్షన్‌లో టైపిస్టుగా వచ్చిన రాజేశ్వరిని ఇతడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె గురించి తెలుసుకోవాలని వచ్చాడు" అందరికీ చెప్పాడు శివరావు.

    వెంటనే సుందరం కనులముందు సుహాసిని రూపం కదిలింది. తను ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం తల్లి కోరిక మీద ఆమె ప్రవర్తన గురించి చేసిన ఎంక్వయిరీ అన్నీ గుర్తు వచ్చాయి. ఎవరో మాట్లాడటంతో అతని ఆలోచనలు చెదిరిపోయాయి. 

    "గౌతమ్‌ప్రసాద్‌గారూ! వెయ్యి అబద్దాలాడి ఒక మారేజి చెయ్యమన్నారు. నిజమే. కానీ మీరు శివరావుగారి స్నేహితులు. అంటే మాకూ స్నేహితులే కదా? అటువంటి మీకు ఘోరమైన అన్యాయం జరగబోతూంటే ఎలా వూరుకోగలం చెప్పండి? దయచేసి మీరు రాజేశ్వరిని గురించి ఆలోచించటమే మానుకొని ఆమెను మరచిపొండి" అన్నాడు ఒక క్లర్కు ప్రార్థిస్తున్నట్లుగా.

    "ఎందుకలా అంటున్నారు?" ఏమీ అర్థం కాకపోవడంతో అడిగాడు గౌతమ్‌ప్రసాద్.

    "ఎందుకేమిటి సార్? రాజేశ్వరి గురించి ఈ ఆఫీసులో అటెండరు మొదలు ఆఫీసరు వరకు ఎవర్ని అడిగినా చెబుతారు ఆమె ఎలాంటిదో? అదొక పెద్ద్ హ్యాండు. మేనేజరుతో విపరీతంగా తిరుగుతూంది. వాడే దాన్ని ఇక్కడికి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. అలాంటి మనిషిని మీరు చేసుకుంటారా? వద్దు సార్,వద్దు. ఆంధ్రదేశంలో అందమైన అమ్మాయిలకు కొరతలేదు. మరి ఎవరినయినా చేసుకొండి" అన్నాడు తను మళ్లీ శ్రేయోభిలాషిలా. 

    అతని మాటలు వినగానే సుందరంకు ఎవరో కొరడాతో వీపు మీద కొట్టినట్లనిపించింది. ఇతనేమిటి రాజేశ్వరి గురించి ఇలా చెబుతున్నాడు? అనుకున్నాడు. సుందరంకు వెంటనే - అంతా అబద్ధం వీళ్ల మాటలు నమ్మవద్దు గౌమ్‌ప్రసాద్. వీళ్లంతా నీచులు. రాజేశ్వరి మంచిది. నిప్పులాంటిది అని పెద్దగా అరవాలనిపించింది. అతనికి మాటలు బయటికిరాలేదు. అంతా అయోమయంగా తోచింది. 

    రాజేశ్వరి ఇరవై రోజుల క్రితం మరో చోటు నుంచి బదిలీ అయి ఆ ఆఫీసుకు వచ్చింది. ఆమె అందమైనది. ఎవరినయినా సులభంగా ఆకర్షించగలదు. ఆమె ఆ ఆఫీసులో అడుగుపెట్టిన రోజు నుంచీ ప్రతి ఒక్కరూ (ఒకరిద్దరు ముసలివాళ్లు కూడా) ఆమెకు వలలు విసిరారు. కాని రాజేశ్వరిలో అలాంటి వికారాలు ఏమీ లేకపోవటం వల్ల ఎవ్వరి వలలోనూ ఇరుక్కోలేదు. చాలా మంది ఆమె దగ్గర మరీ వెకిలిగా ప్రవర్తించారు. వాళ్లను తిట్లతో సత్కరించింది ఆమె. ఆఫీసులో అందరూ ఒక అత్యవసర సమావేశం జరిపి ఆమె మంచిది కాదనే ప్రచారం చెయ్యాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. 

    సుందరం చూస్తుండగానే గౌతమ్‌ప్రసాద్ చిన్నబుచ్చుకున్న మొహంతో ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే అందరూ పెద్దగా నవ్వారు. 

    వాళ్ల నవ్వు చూస్తుంటే సుందరంకు వాళ్లంటే అసహ్యం కలిగింది. వెధవ మనుషులు అనుకున్నాడు.

    అతనికి ఆక్షణంలో తన మిత్రుడు అనుకున్న హనుమంతరావు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతను సుహాసిని గురించి ఎందుకలా చెప్పాడో కూడా అర్థమయింది. ఎంత అన్యాయం జరిగింది? సుహాసిని కూడా రాజేశ్వరి ఉన్న పరిస్థితిలోనే ఉండి ఉంటుంది. అప్పట్లో తను ఇలా చెప్పే మనుషులు కూడా  ఉంటారని వూహించలేకపోయాడు.

    సుందరం కనుల ముందు మంచు తెరలు తొలగాయి. అతనికి మనసు నిలువలేదు. వెంటనే సుహాసిని దగ్గరికి పరుగున వెళ్లి ఆమెను చేసుకోవటం తనకు ఇష్టమేనని చెబుదామనుకున్నాడు. కాని ఆమె ఆ సమయంలో ఆఫీసులో ఉంటుందనే విషయం గుర్తుకు వచ్చింది. సాయంత్రం ఆఫీసు వదలగానే ఆమె ఇంటికి వెళ్లాలనుకున్నాడు.

    సాయంత్రం వరకూ అసహనంగా గడిపాడు.

    చివరికి సాయంత్రమయింది. ఆఫీసు వదిలారు.

    రివ్వున బయటికి వచ్చాడు సుందరం. అతనికి ఎంతో సంతోషంగా ఉంది. తన కలలు మళ్లీ నిజం కాబోతున్నాయి. రిక్షాలో వెళితే ఆలస్య మవుతుందనుకున్నాడు. అందుకని ఆటో ఎక్కి సుహాసిని అడ్రెస్ చెప్పాడు.

    పదినిమిషాలు గడిచాయి.

    ఆటో సుహాసిని ఇంటిముందు ఆగింది. ఆ ఇంటి తలుపులు మీద అదురుతున్న గుండెతో టకటకా కొట్టాడు.

    సుహాసిని తలుపు తెరిస్తే ఆమెకు ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? సుందరంకు సిగ్గు అనిపించింది.

    భళ్లున తలుపులు తెరచుకున్నాయి. 

    ఎదురుగా - పాల నురుగులాంటి షిఫాన్ చీరలో బొమ్మలా నిలుచున్న సుహాసిని! ఎత్తయిన గుండె మీద వ్రేలాడుతున్న మంగళసూత్రం!

    సుందరంకు షాక్ కొట్టినట్లనిపించింది.

    సుహాసినికి పెళ్లయిందా?!

    ఆమె కూడా సుందరంను చూసి ఆశ్చర్యపోయింది. అతను ఎందుకు వచ్చిందీ అర్థం కాలేదు. ఏదో అడగబోయింది.

    అప్పటికి సుందరం ఆ షాక్ నించీ, తనను ఆవరించుకున్న నిరుత్సాహం నించీ బయటపడ్డాడు. 

    "సారీ!" అని తనలో తనే గొణుక్కుంటూ గుమ్మం దిగి గబగవా రోడ్డు మీదికి తడబడే అడుగులతో వెళ్లిపోయాడు. 

    అతని ప్రవర్తన వింతగా అనిపంచి అతన్నే చూస్తూ గుమ్మం దగ్గర బొమ్మలాగా నిలబడిపోయింది, పెళ్లయిన సుహాసిని.

(ఆంధ్ర సచిత్రవారపత్రిక 18-01-1991 సంచికలో ప్రచురితం)             
Comments