ఫ్రిజుడిటీ - నడకుర్తి(కొలకలూరి)స్వరూపరాణి

    
పొగలు గ్రక్కుతున్న గుత్తివంకాయ కూర పాత్రను స్టౌనుంచి పట్టుకారుతో పట్టుకొని తెచ్చి నేరుగా డైనింగ్ టేబుల్ మీద దించింది భాగీరథి. వేడివేడి రైస్ గిన్నె, రెండు మూడు రకాల కూరలు పచ్చళ్ళు, ఒరుగులు పెరుగులు వగైరాలన్నీ తెచ్చి టేబుల్ మీద అమర్చింది. 
 
    టేబుల్ ప్రక్కన కుర్చీలో కూర్చొని ఖరీదైన వస్తు సంభారాలతో ధనవంతంగా ఉన్న వంటగదిని అనుబంధంగా యేర్పరచిన భోజన శాలనూ పరిశీలనగా చూస్తున్న రాజేశ్వరిని పల్కరింపుగా ఓ చూపు చూచి మరో కుర్చీని టేబుల్‌కి దగ్గరగా లాగి కూర్చోబోతూండగా బైట నుంచి 
 
    "అమ్మగారూ కాస్త సద్దన్నం ఉంటే పెట్టండమ్మా" అనే ఆడకేక ప్వినబడింది యాచక సహజమైన వినయపు యాసతో.

    అదేదీ పట్టనట్టు భాగీరథి వడ్డనకు ఉపక్రమించింది.

    "కాస్త సద్దైనా ఉంటే యెయ్యండమ్మా పుణ్యముంటాది"

    ఆ కేకను పరిష్కరించనిదే స్థిమితంగా కూర్చోలేనట్లు కుర్చీలో మిసికొట్లాడుతున్న రాజేశ్వరిని గమనించింది భాగీరథి. లేచి బైటకు దారితీసింది. అదేమిటీ ఒట్టి చేతులతో వెళ్తున్నది... అనుకుంటూ ఆమె వెనకనే రాజేశ్వరీ లేచి వరండాలోకి వచ్చింది. వీళ్ళిద్దరినీ చూచి భిక్షుకి ఆశగా

    "రెండ్రోజులైందండమ్మ యెంగిలిపడి, కళ్ళు తిరుగుతున్నయ్..." అంటూండగానే భాగీరథి

    "ఏం లేదు... వెళ్ళెళ్ళు" అని లేవిడీ భంగిమలో చేయి ఆడించి గదిలోకి వెళ్ళిపోయింది.

    రాజేశ్వరి భిక్షుకిని చూచింది. అన్నపానాలు సరిగాలేక అలా ఉందో లేక అది ఆమె శరీరతత్వమో సన్నగా నాజూగ్గా ఉంది. తైల సంస్కారం లేనంత మాత్రాన నల్ల సముద్రపుటలల వలె నుదుటి మీద ముసురుకోవాలని యేముంది ముంగురులు. ఖచ్చితంగా అది ఆమె కేశసంపదయే. యెత్తుగా కొప్పు పెట్టుకొంది. పసిబిడ్డను జోలె లోనికి దిగేసుకొని భుజం మీదుగా దించి నడుముకు కట్టుకొంది. చేతుల్లో అసంపూర్తిగా ఉన్న అల్లిక బుట్ట. భిక్షుకికి ఇంత అందమా అనుకొంది.

    "బుడిగి జంగాలం అమ్మ. బొమ్మరిళ్ళు పంజరాలు ఇట్టాటివి అల్లి జీవనం చేస్తుంటాం. గొప్ప గొప్ప నగిషీ బొమ్మలు కొని సోకేసుల్లో పెట్టుకొనే పెద్దింటి తల్లులు మా వస్తువులు ఎందుకు కొంటారమ్మా. ఈ నడుమ ఒక్క వస్తువైనా అమ్ముడు బోలేదమ్మా. బోజనానికి లుకసాన బడ్డాం."

    తమ సామాజిక వర్గానికి జరిగిన అవరోధం యేదో తన యీ దీనస్థితికి కారణమన్న భావాన్ని తన శైలిలో తెలిపే ప్రయత్నంగా అగపడ్డాయ్ ఆమె మాటలు.

    "పాపం పసిది పాలకి పీకి సంపుతుందమ్మా"

    బిడియంగా చెప్పి చంక బిడ్డను సానుభూతిగా తలనిమిరి గుండెలకు హత్తుకొంది.

    గది లోనుంచి 

    "మీరు రండి రాజేశ్వరీ" అన్న పిలుపుతో రాజేశ్వరి యాంత్రికంగా లోనికి వెళ్ళింది తాను ఇక్కడ అతిథి - యేమాత్రం స్పందించినా ఇంటి గృహిణికి గౌరవ సమస్య అనే తక్షణ స్ఫురణ యేదో మేల్కొన్నట్లు. 
 
    భాగీరథి గొంతెత్తి 
 
    "రంగమ్మా యేం చేస్తున్నావ్ అటు చూడు..." అంది పురమాయింపుగా.
 
    వాళ్ళ పనిమనిషి రంగమ్మ హడావుడిగా గబగబా దొడ్లోనుంచి ఆవరణలోకి పరిగెత్తినట్లు పదపద అంటూ భిక్షుకిని పంపేసి గేటు మూసేసినట్లు చప్పుడు వినబడింది.
 
* * *
 
    డిష్‌లన్నింటినీ కలయ జూచి ఒక దాన్ని యెంచుకొంది. గరిటెడు అన్నం లాంటిది తీసి రాజేశ్వరి ముందుగల పళ్ళెంలో పెట్టింది. తానూ వడ్డించుకొంది. తెచ్చినప్పటిది వేడిగా ఉందే. ఇప్పుడేమిటి పొడిపొడిగా మంచు రెల్లల లాగా ఉంది. తను గెస్టు కదా ఒక సభాకార్యక్రమానికి వస్తే భాగీరథి తటస్థ పడింది. పిలిపించిన సంస్థ వారు సగౌరవంగా లాడ్జ్‌లో యేర్పాటు చేసిన రూమ్‌కు వెళ్ళ బోతుంటే ఆపి, పూర్వ స్నేహం పేరుతో మొగమాటమి పెట్టి, హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన - యీ ఇంటికి ఆహ్వానించుకు వచ్చింది రాత్రి భోజనాల అనంతరం. ప్రొద్దు పోయి నిద్రకళ్ళతో భాగీరథి చూపిన బెడ్‌రూంలో నిద్రించాక ఇదే మళ్ళీ భోజన కాండ.
 
    కాబట్టి ఇదేదో స్పెషల్ ఐటమ్ ఐయుంటుంది. బహుశ కూర అవసరం లేకుండా ఆరంగించే పదార్థమేమో అనుకొంటుండగా లోతు లోట ఒకటి సప్లయ్ అయింది. చూస్తే మంచు సోనలా ఉంది. ఎరుపు రంగు కారం వల్ల వచ్చిందేమో.
 
    భాగీరథి భోంచేస్తూ మధ్య మధ్య వచ్చే ఫోను కాల్స్‌ను అందుకొని బదులు చెప్తూ కానిస్తున్నది. తలతిప్పి హఠాత్తుగా చూసినట్లు ముఖంపెట్టి
 
    "ఏమిటి రాజేశ్వరీ... తింటున్నట్లు లేదే" అంది.
 
    తన సంస్కారానికి ఇదో పరీక్ష కాబోలు. గృహస్తుల గృహిణుల మనసు గాయపడకుండా ఉండేందుకు తింటున్నాను చాల బాగుంది మీ వంట అంటూ ఆహూతులు పాటించాల్సిన మర్యాదలున్నాయి.
ఏమిటో... సర్కారు జిల్లాలవాసులు అతిథికి పళ్ళెం నిండా వడ్డించి తింటావా లేదా అన్నట్లు వెంటబడి మరీ తినబెడతారు. ఈ నగరంలో... ఇక్కడనే గాక ప్రోగ్రాముల పుణ్యమా అంటూ మరి కొన్ని మార్లు కూడా ఆ బ్రెడ్ తెమ్మంటారా ఈ కేక్ తింటారా అంటారేగానీ అన్నం - కూర ప్రత్యక్షం కానే కాదు. ఆప్యాయతలు అతిథి సత్కారాలూ ఉండవని కాదు. తెలుగుజాతి యెక్కడైనా మార్దవ హృదయులే. అది యీ నగర శైలి కాబోలు.
 
    "ఏమిటండీ ఆలోచన..."
 
    "అహహ... అదీ... ఆ... పెద్ద ఆలోచనలేం కాదు"

    రాజేశ్వరి మనసులో ఒక కొంటె ఆలోచన అలలా యెగసి పడింది. 
 
    "మీకు అతిథి మర్యాదలు ఓ పాలు ఎక్కువగా ఉంది. ప్రేమతో కొసరి కొసరి వడ్డించి తినబెడుతున్నారు. ఎంతని తినగలం. మీ తృప్తి కోసం... తప్పదుగా... ఏదీ ఆ వార్తాకం గుత్తి కూర కొంచెం..." అంది నవ్వును దాచుకొంటూ.
 
    ఇబ్బంది పడడం ఇప్పుడు భాగీరథి వంతైంది.
 
    చిక్కని కొబ్బరి మసాలా గుజ్జులో సగపడా మునిగి తేలుతూ చిట్టి పొట్టి మందర పర్వతాల్లా ఉన్న వంకాయల్ని తేరిపార చూసింది. పరిగెత్తే ఎలుకను తోకను ఒడిసి పట్టుకొనంట్టు ఒక వంకాయ తొడిమను పట్టి తీసి రాజేశ్వరి పళ్ళెంలో జారవిడిచింది. ఆపైన పారసీక మదవతి సాకీ... చషకాన్ని అందించినట్లు మరో మంచు ద్రవం పాత్రను "చారు" అంటూ దగ్గరకు జరిపింది.
 
 * * *
 
    గదిలో బ్యాగులూ అదీ ఇదీ సర్దుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతున్న రాజేశ్వరికి గేటు దగ్గర నుంచి మాటలు వినబడుతున్నాయి. సారాంశం - పనిమనిషికి కూడా మిగులూ తగులూ దక్కనీయకుండా ఖాళీ చేతులతో పంపేసిందని - తెలుస్తుంది.
 
    అడుగుల చప్పుడైనా గమనించలేదు భాగీరథి గదిలోకి వచ్చేసింది.
 
    "ఏమిటండీ అప్పుడే సన్నద్ధమౌతున్నారు?"
 
    "గూడు చేరాలి కదండీ..."
 
    "ఇంకా మా యిల్లంతా చూడనే లేదు మీరు. బండి కింకా చాల టైముందిలెండి" అంటూ గదుల్లోకి బయల్దేర దీసింది భాగీరథి పిచ్చాపాటీ మాట్లాడుతూ. వద్దన్నా పేము ఊయల ఎక్కించి ఊపింది. మూడంతస్తుల మేడాయె. ఫ్లోర్‌లోనే పది పదిహేను గదులు. అవీ విశాలంగా. మాటలా! ఎక్కడికక్కడ కనువిందు చేసే నగిషీ వస్తు సామాగ్రితో క్రిక్కిరిసిన అల్మైరాలు. దేశవిదేశాల నుంచి తెప్పించి పెట్టిన గాజు పింగాణీ శిల్ప ప్రతిమల మధ్య సదస్సులలో గెల్చుకు వచ్చిన మెమొంటోలు జ్ఞాపికలతో షోకేసులు, గోడలు అలా జిగేల్‌మంటుంటే గది గదికి సిల్క్ మొఖమల్ సోఫా సెట్లు. వీటన్నిటికి గైడ్‌లా వ్యవహరిస్తోంది తను. వివిధ సందర్భాల్లో తీయించుకొన్న ఫోటోల ఆల్బమ్‌లే తిరగేసి తల గిర్రుమన్నట్లయింది రాజేశ్వరికి. సోఫాలో నుంచి లేచి అన్ని అంతస్తులూ చూచిన తర్వాత ఆమాట యీమాట మాట్లాడుతూ క్రింది గదిలోకి వచ్చారు ఇద్దరు.
 
    "ఇన్ని వసతులున్న ఇంద్రభవనంలో నీ జీవితం స్వర్గతుల్యమే" అభినందన పూర్వకంగా ముఖద్వారం ఎదురుగా ఉన్న పొట్టి ఐరన్ సేఫ్ మీద మోచేయి ఆన్చిన రాజేశ్వరి చటుక్కున చేయి లాగేసుకొంది. పల్స్‌బీట్‌తో మానవదేహంలాగా అదురుతోంది ఆ బీరువా. ఈమె ఉలికిపాటు చూచి భాగీరథి
 
    "అదేనండీ మా రెఫ్రిజిరేటరు" అంటూ వచ్చి ఓపెన్ చేసి చూపించింది.
 
    ఉదయం వండిన గుత్తి వంకాయకూర వగైరా వంటకాలన్నీ అందులో అమర్చబడి దర్శనమిచ్చాయి. ముసురుకొన్న మబ్బుతెరలు విడిపోయినట్లయింది. వంటింటి ఆధునీకరణ దీని చలువయేనన్నమాట.
 
    పల్లెలలో గ్లోబలైజేషన్ దుష్ప్రభావం వలన చేతి వృత్తులు దెబ్బ తింటున్నాయనీ, పేదలు ఉపాధి కోల్పోతున్నారనీ వింటున్నాం. కానీ ఫ్రిజ్ సంస్కృతి ఆహార ధర్మాన్నే చద్దిబరుస్తన్నదే అనుకొంది. సరదాగా నాటక ఫక్కీలో 
 

    "ఓరీ విద్యుజ్జిహ్వుడా! మా రోజువారీ వంటకాలను నీ మృత్యుశీతల పరిష్వంగంలో నిర్దయగా బంధించుకొని, వాటి తాజాదనపు రోజా పువ్వుల్ని వాడబార్చి శవ సదృశాలుగా శపిస్తున్నావన్నమాట. నిన్నిప్పుడే మదీయ బాహుదండాలతో సంహరిస్తాను చూడు" అంటూ స్విచ్చాఫ్ చేసింది.

    భాగీరథి నవ్వేసింది. వ్యంగ్యంగా భావించనందుకు సంతోషించింది రాజేశ్వరి. ఆహ్వానించడమే నేరమైనట్టు కూడా భావించడం లేదులే. కాలం అలా నడుస్తోంది. ఈమె తనదైన శైలిలో తను ఆతిథ్యమిచ్చింది అనుకొంది మనసులో.

    ఐనా మిగిలితే నిల్వగానీ నిల్వ చేయడానికి మిగల్చడం యేమిటి? ఇదేదో అదనపు విలువ - దోపిడీ సూత్రంలా. నిన్నటివి నేడు నేటివి రేపు - ఎప్పుడూ చద్ది బ్రతుకేనా. వికసించిన సాంకేతికతను వినియోగించుకోవడం ప్రగతే.కానీ మనుష్యులకు ఆధార'భూతం'లా ఉండవలసిన యంత్రం మానవత్వాన్ని నియంత్రించడమేమిటి?

    తాను పొందుతున్న రసానందాన్ని ప్రక్క అణువులకు పంచకపోవడ మానసికమైన జడత్వం అని సూత్రీకరించారొక మానసిక శాస్త్రవేత్త.

    అతిథికీ అభ్యాగతికీ చివరికి పంచన పనిచేసే సహాయకులకీ స్పందనను దక్కనివ్వని యాంత్రికతను స్థబ్దత అనవలసిందే. ఫ్రిజ్ సంబంధమైన స్థబ్దతను ఫ్రిజుడిటీ. ఆలోచనల ఉద్వేగంలో ఆ చివరిమాటను పైకి అనేసింది రాజేశ్వరి. ఆమాటలోని చివరి అక్షరాన్నే విన్న భాగీరథి

    "టీ...యా ఉండండి తెస్తాను" అంటూ కిచెన్ వైపు అడుగులు వేసింది.

    కొంపదీసి టీని కూడా ఫ్రిజ్‌లో చల్లార్చుకు రాదు కదా. అప్పుడది కూల్ టీ ఔతుంది అనుకొంది.

    "తీసుకొండి టీ"

    వేడి వేడి టీ కప్పుల ట్రేతో వచ్చిన భాగీరథిని కొంటెగా చూస్తూ

    " ఈ ఒక్క'టీ' ఫ్రీ ఫ్రం ఫ్రిజుడి'టీ'..."అంది. ఇద్దరూ నవ్వుకున్నారు.

    "ఆటో ఇంటిముందుకు రాదమ్మా. మనమే రోడ్డు మీదికి వెళ్దాము. ఎంత! ఐదు పది నిమిషాలే కదా" అంటూ బ్యాగ్ భుజానికి తగిలించుకొన్నాడు పురమాయించిన బోయ్.

    "ఇంటి ముందుకు ఎందుకు రాదట ఆటో" భాగీరథి.

    "కారణం మన వీధి చివరన ఎవరో ఆడకూతురు చనిపోయిందమ్మా. శవం రోడ్డు పక్క చెట్టు కింద ఉంది. జనం మూగారు. ఆటో రాదన్నాడు" అని గేటునుండి వెలువడిన బోయ్‌ని అనుసరించి స్నేహితురాళ్ళిద్దరూ నడువసాగారు.

    నిజమే అల్లంత దూరం నుంచే క్రిక్కిరిసిన జనం. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కథ చెప్తున్నట్లుంది. పాపం బిడ్డతల్లి అనుకొంటుందొకామె. ఒకామె కళ్ళు తుడుచుకొంటూ 'పాపిష్టిదాన్ని చెయ్యి ఖాళీలేదు పొమ్మన్నానమ్మ. ఇలా ఔతుందని నాకేం తెలుసు' అనుకొంటూ వెళ్ళింది.

    రాజేశ్వరికేదో అనుమానం వచ్చి జనంలోనుంచి దారి చేసుకొంటూ వెళ్ళి చూచింది. సందేహం లేదు. ఆ భిక్షుకియే. ప్రక్కన పసిది కిర్లుతున్నది.

    నాటు వైద్యుడొకాయన వచ్చి మనిషిని నాడి పట్టి చూచి 'జీవుడు పోలేదు, ప్రాణం ఎక్కడో కొట్టుకు లాడుతున్నది. తిండిలేక ప్రాణం కడబిట్టిందంతే' అని తేల్చి చెప్పాడు.

    జనం హమ్మయ్య అని తేలిగ్గా శ్వాస తీసుకున్నారు. ఈరోజు ఒక ఆకలిచావును చూచే అపరాధం తప్పిపోయిందంతే చాలనుకొన్నారు. విషయం నలుగురిలో పడేసరికి అంతటా సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఎవరికి తోచిన సహాయానికి వారు పూనుకొన్నారు. తినుబండారాలు, బట్టలు వగైరాలు తెచ్చి ఇస్తున్నారు. రాజేశ్వరి జాకెట్ మనీ తీసింది. చేతికి వచ్చినన్ని నోట్లు ఇంతా అని లెక్కలేకుండా పిడికిలిలో తీసి పాప చేతిలో కుక్కి జనం నుంచి వెలుపలికి వచ్చింది.

    భాగీరథి మ్లాన వదనంతో రాజేశ్వరికేసి చూడలేకుండా ఉంది. లోకాన్నంతా బుకాయించవచ్చు గానీ లోపల ఉండి గాడిద తన్నులు తన్నే మనస్సాక్షిని తప్పించుకోలేం. అపరాధ భావంతో సతమతమౌతున్న భాగీరథిని చూచి వాతావరణాన్ని తేలిక పరచే  ఉద్దేశంతో రాజేశ్వరి

    "ఆ!...దేశంలోని ఆర్థిక సమస్యలన్నింటికీ మనం బాధ్యులమా... వదిలెయ్..."

    ఊహూ...

    ఆటోవాలా అప్పుడే రెండోసారి హారన్‌ను 'బొయ్'మనిపించాడు.

    "సర్లేవయ్యా నా మీద ఆఫీసర్‌వై పోయావ్. నువ్ తొందర పెట్టకపొతే మాకు తెలియదేమో"

    ఆ జోక్‌కు భాగీరథి ఫక్కున నవ్వుతూ

    "ఆఫీసర్ కాదోయ్ 'మొ'వైపోయావే అనాలి. పెత్తనం అంటే 'మొ'ది కదా!" అంది. మార్పుకు సంతోషించింది రాజేశ్వరి. 'ఎరుక పిడికెడు ధనం' అన్నట్లు ఊరుగాని ఊళ్ళో స్నేహం చూపెట్టి, లాడ్గీలలో బిక్కు బిక్కు మనకుండ సంసార పక్షంగా ఇంటికి ఆహ్వానించింది. అనుకొంటే ఆమెపై జాలివేసింది. ఐనా మరింత ఉత్సాహ పరుస్తూ

    "నాకు సెండాఫ్ ఇవ్వడం ఇంత స్థబ్దంగానా" కొంటెగా భుజం మీద చేయి వేసి సన్నిహితంగా "నీకింకా 'ఫ్రిజు'డిటీ వదిలినట్టులేదే"

    కాదన్నట్టు భాగీరథి తల విదిల్చి

    "భావప్రాప్తి కలిగింది"

    "ఓహో ఆట ఫైనల్ అన్నమాట" నవ్వులు మిన్నంటాయి. ఆ సరికి రోడ్డెక్కి ఆటోను సమీపించారు. తిరుగు ప్రయాణం టికెట్టుతో బండి వద్ద సహాయం బోయ్ ఉన్నాడు. క్షేమంగా వెళ్ళిరమ్మని చెప్పాక ఆటో 'రయ్' మంటుంటే బైట గాలిలో ఓ చేయి ఆటోలో ఓ చేయి 'బై' అంటూ ఆడుతున్నాయి.

 
(ఆనందమయి సంస్థ ఒంగోలు వారు తెలుగుకథానికా శతజయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఉత్తమ కథగా ఎంపిక కాబడింది)
  
Comments