పొగమంచు - తులసి బాలకృష్ణ

    ఉషోదయపు వేళ -

    మా డాబా మీద పిట్ట గోడకి ఆనుకుని నిలబడి, సూర్యోదయాన్ని చూస్తూ, పొగలు చిమ్మే ఫిల్టర్‌కాఫీని సేవించడం - నా దినచర్యలో నాకు అత్యంత ఆనందదాయకమైన సన్నివేశం.

    నాలో ఒడలుమరిచే హాయి, అనిర్వచనీయమైన తృప్తి, వందేళ్లు జీవించాలనే ఆశ రెట్టింపు ఉత్సాహంతో విజృంభించే సన్నివేశమది.

    ఈ రోజున బాగా పొగమంచుగా ఉండడంతో, తెల్లారిపోయినా సూర్యోదయం సరిగా దృగ్గోచరం కావడం లేదు. పొగమంచుని చీల్చుకుని రావడానికి సూర్యకిరణాలు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. 

    తలకి చుట్టుకున్న మఫ్లర్‌ని చెవులమీదుగా మరింత గట్టిగా బిగించి, ఎడంచేత్తో శాలువాని గుండెలమీదుగా లాక్కుంటూ, కాఫీ సిప్ చేస్తున్నాను. గుండెల్లో వెచ్చగా హాయిగా ఉంది.

    ఓ పక్షి రెక్కలు టపటపలాడిస్తూ, ఏదో అర్జంటు పనున్నదాన్లా ఐమూలగా ఎగిరి, ఈ చెట్టు మీంచి పోయి ఆ చెట్టు మీద వాలింది.

    ఓ సన్నని మంచుతెర నన్ను ఒరుసుకుంటూ సాగిపోతుండగా పిట్టగోడమీద పెట్టిన సెల్‌ఫోను మ్రోగింది.

    పేరున్న క్రిమినల్ లాయర్‌గా తెల్లారితే చాలు నేనందుకునే ఫోను కాల్స్‌కి కొదువలేదు. అందుకనే మరీ ఆప్తులయిన మిత్రులు మాత్రమే ఎరిగున్న ఈ సెల్‌ని మాత్రమే ఈటైములో ప్రక్కనుంచుకుంటా. మరో సెల్‌ఫోనూ, ల్యాండ్‌లైన్ ఫోనూ క్రిందనున్నాయి.

    నెంబరు చూసాను. నా ఆప్తమిత్రుడు డియస్పి ఖాన్ నుంచి.

    'ప్రస్తుతం అతన్తో సంబంధం వున్న అర్జంటు కేసేమీ లేదే' అని ఆశ్చర్యపోతూనే, కాల్ రిసీవ్ చేసుకుంటూ, "హల్లో ఖాన్‌భాయ్ - గుడ్ మాణింగ్" అన్నాను.

    "సారీ - వెరీ బ్యాడ్ మాణింగ్ బ్రదర్" ఖాన్ గొంతులో విచారం. 

    "అదేం?" ఏదో కీడుని శంకించింది నా మనస్సు.

    "రామాలయంలో విగ్రహాలు మాయమయ్యాయి... నిన్నరాత్రి... నగలతో సహా..."

    "మైగాడ్!"

    "వేర్ ఈజ్ ద గాడ్? దట్స్ ద ప్రాబ్లెం బిఫోర్ అజ్. వియ్ హేవ్ టు లొకేట్ హిం నౌ" ఖాన్ గొంతు ఒణికింది బాధతో. పుట్టుకతో ముస్లిమ్ అయినప్పటికీ, హిందూ దేవుళ్ల ఉత్సవాల్లో అందరికంటే ఉత్సాహంగానూ, కేవలం డ్యూటీ కోసం కాకుండా కార్యక్రమం విజయవంతం కావాలనే ఓ ప్రగాఢవాంఛతోనూ సిన్సియర్‌గా పాల్గొంటారు డియస్పి ఖాన్.

    'నాకత్యంత ప్రియమయిన రామాలయంలో... దేవతా విగ్రహాలు... చోరీ...' నోటిమాట రావడం లేదు నాకు. పచార్లు ప్రారంభించాను అసహనంగా.

    "సూర్యంకి రామాలయంలో ఉద్యోగం ఇప్పించింది నువ్వే అనుకుంటా కదూ...?" ఖాన్ అడుగుతున్నాడు. నా కాళ్లు అసంకల్పితంగా తడబడ్డాయి. అప్పుడు గుర్తొచ్చింది - సూర్యం అదే గుళ్లో పని చేస్తున్నట్లు, అతనికి నేనే ఉద్యోగం వేయించినట్లు...

    నేను 'ఊఁ'...'ఆఁ!'... అనలేని పరిస్థితిని గమనించినట్లున్నాడు..."సూర్యం కూడా కనిపించడం లేదు" అన్నాడు ఖాణ్ - 'ఇలాగే మంచితనంతో అడ్డమైన వాళ్లకీ సాయం చేసేసి, పీకలమీదకు తెచ్చుకుంటావు' అన్న అలకతో కూడిన బాధ కూడా తక్కువ శృతిలో అతని గొంతులో ధ్వనించింది.

    "సూర్యం... సూర్యం చాలామంచి వాడయ్యా..." అనకుండా ఉండలేకపోయాను.

    "ఆహా - ఆ మంచివాడే కనిపించడంలేదు. ఆంజనేయుడితో సహా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, మొత్తం నగలు మాయం. మీ మంచివాడ్నే అనుమానించాల్సి వస్తోంది మరి. ప్రస్తుతం నేను గుడి దగ్గరే వున్నా..." సెల్ కట్ చేసాడు ఖాన్.

    తలమీద బలమైన ఆయుధంతో మొత్తినట్లుగా వుండి, మెదడు దిమ్మెక్కింది నాకు.

    పొగమంచు మరింత చిక్కబడింది.

    సూర్యుడు అస్సలు కనబడడం లేదు.

    గుండెల్లో చలి వందరెట్లు పెరిగింది.

    కాఫీ విషంలా తోస్తోంది.

    గబగబా మెట్లు దిగాను.

* * * 

    రామాలయంలోపలికి అడుగుపెడ్తూంటే కాళ్లు తడబడ్డాయి. ఖాన్ పరుగులాంటి నడకతో వచ్చి, నా జబ్బ పట్టుకుని, "సారీ - నేను కటువుగా మాట్లాడానేమో" అన్నాడు, ప్రక్కనే నడుస్తూ.

    "ఏమీ క్లూ దొరకలేదా? ఎక్కడికి పోతాడయ్యా? వాడూ?" నా ప్రశ్న మూలుగు లాగ ధ్వనించింది.

    గుడి పూజార్లూ, ఇ.ఓ.,ఇతర స్టాఫూ చేతులు కట్టుకుని నిలబడివున్నారు. వాళ్లమొహాల్లో విపరీతమయిన భయం తాండవిస్తొంది. బాధ్యతని సక్రమంగా నిర్వహించని భయం అది.

    ఎక్కడ చూసినా పోలీసులూ, విలేకర్లూ, ఫోటోగ్రాఫర్లూ... అంతా హడావుడిగా ఉంది. 

    గుళ్లో విగ్రహాలు పోయాయన్న సమాచారం క్రమేపీ ఊరంతా పాకి పోయినట్లుంది... జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. గుసగుసల స్థాయినుంచి హాహాకారాల స్థాయికి చేరుతోంది జనఘోష.

    నెమ్మదిగా ఇ.ఓ.దగ్గరకు నడిచి, "రాత్రి గర్భగుడి తాళాలు ఎవరిదగ్గరున్నాయి?" అనడిగాడు.

    అపరాధ భావంతో, "సూర్యం దగ్గరేనండి" అన్నాడతను భయం భయంగా. "తాళాలన్నీ అతని దగ్గరేవున్నాయండి" అనికూడా అన్నాడు నెమందిగా.

    "మొత్తం తాళాలన్నీ అతని దగ్గరే ఎందుకున్నాయి?" కోపంగా ప్రశ్నించాను. భయపడ్తూ తలదించుకున్నాడతను.

    చాచి లెంపకాయ కొడ్దామన్నంత కోపం వచ్చింది కాని, అదుపు చేసుకుని, దూరంగా జరిగి, మొహం తిప్పుకున్న నా దృష్టిలో పొన్న చెట్టుకింద బల్లకి జార్లబడి, మోకాళ్ల మీద తలవుంచుకుని, రోదిస్తున్న అనంతంగారు కనపడ్డారు. నెమ్మదిగా అటు నడిచి, బల్లమీద కూర్చుని, "అనంతంగారూ" అంటూ, ఆయన భుజం మీద చేయివేసాను. 

    ప్రయత్నపూర్వకంగా తలెత్తి, "మాధవరావుగాఊ" అంటూ బావురుమని, "ఎంత పని చేసాడండీ త్రష్టుడూ - దేముడులాంటి మీకు కూడా చెడ్డ పేరు తెచ్చే పనిచేశాడు కదండీ నీచుడూ. నా కడుపున చెడబుట్టాడు వెధవ..." అంటూ నాభి కదిలేంతగా ఏడవసాగారాయన.

    కన్నతండ్రి కూడా ఇలా అంటున్నాడంటే - సూర్యమే ఈ పనిచేశాడని నమ్మాల్సిందేనా? సూర్యం రూపం నా కళ్ళముందు మెదులుతోంది... విశ్వామితుడి వెంట అడవికి వెళ్లబోతున్న రఘురాముడులాంటి లేత సుందర రూపం. ఆ అమాయకత్వం, ఆ నిష్కపటత్వం, దైవభక్తి చిప్పిల్లే ఆ చూపులు...

* * *

    ఆ రోజు...

    ఆఫీసురూములో ఏదో కేసుతాలూకు ఫైళ్లు చూసుకుంటున్నాను.

    మా నౌఖరొచ్చి, "ప్లీడరు గుమాస్తా అనంతం గారొచ్చారండీ" అంటే, లోపలికి పంపించమన్నాను. లాయర్ మిత్రుడు సుబ్బారావు దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాడీ అనంతం గారు. చాలా సౌమ్యుడు. ఉన్నదాంట్లో పొదుపుగా, గౌరవంగా బ్రతికే పెద్దమనిషి.

    చేతులు జోడించి లోపలికి వస్తూన్న అనంతంగారితో బాటు వెనకనే ఓ యువకుడు కూడా వచ్చాడు. ఉతికి ఇస్త్రీ చెయ్యని ఖద్దరు లాల్చీ పైజామాల్లో, అమాయకత్వం ఉట్టిపడే ముఖంతో ఉన్న య్వకుడు అతను. అతని ముఖంలో ఓ విలక్షణమైన తేజస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

    "కూర్చోండి" అన్నాను.

    కూర్చోలేదు అనంతంగారు. చేతులు జోడించి నిలబడే ఉన్నారు. వెనకనున్న యువకుడూ అలాగే తలొంచుకుని నిలబడి ఉన్నాడు.

    మళ్లీ "కూర్చోండి" అని రెట్టించాను.

    "ఫరవాలేదు సర్ - సహాయం కోరివచ్చి, మీవంటి పెద్దల ముందు కూర్చునే సాహసం చెయ్యలేను. నాలుగు మాటల్లో నాక్కావలసిన సాయం గురించి చెప్పేస్తాను. మీవల్లే అవుతుందన్న ఆశతో వచ్చాను. ఇదుగో వీడు నా రెండో కొడుకు. పేరు సూర్యం. నా సమస్యేమిటంటేనండి బాబూ - వీడికి దైవధ్యాస ఉండవలసిన దానికంటే చాలా అధికంగా ఉంది. ఇరవైనాలుగ్గంటలూ దైవధ్యాసే. గుడిమూసేసే వేళయితే ఎంత బాధపడి పోతాడంటే ఎవరో అత్యంత ఆప్తుల్ని పోగొట్టుకున్నంతగా చలించిపోతాడు. కాలేజీకి పోడు. పోనీ ఏదయినా పనిలో పెడదామంటే ఏదీ చెయ్యనంటాడు. అనుక్షణం గుళ్లోనే ఉండాలని ఉందంటాడు. నేనెంత చెప్పినా వాడికి బాధ్యత నాటడం లేదు. మీవంటి పెద్దలేమన్న నయానో భయానో వాడికి భవిష్యత్తుని గురించిన హెచ్చరిక చేస్తే ప్రయోజనం ఉంటుందనే ఆశతో మీ దగ్గరకు తీసుకొచ్చాను సార్. నా సమస్యని మీకు అంటగడ్తున్నాను... నాకు తెలుసు... కాని  తప్పనిసరయి... మీమీదున్న అపారమైన నమ్మకంతో... వీడు బాగుపడతాడన్న ఆశతో..." బాగా ఒంగి నమస్కరించారు అనంతంగారు... గొంతు బొంగురుపోతూండగా...

    విషయం కొంత అర్థమయ్యింది.

    ఆయన్ని పదినిముషాలు బయట హాల్లో కూర్చోమని పంపించి, సూర్యంతో మాట్లాడాను. తనలోని ఆలోచన్లని దాచుకోకుండా చక్కగా కచ్చితంగా నాముందుంచాడు సూర్యం. జీతం బత్తెం లేని ఉద్యోగం అయినా సరే గుళ్లో దేముడికి సేవ చేయడంలోనే తనకి తృప్తి అన్నాడు.

    విషయం పూర్తిగా అర్థమయ్యింది నాకిప్పుడు.

    అనంతంగార్ని లోపలికి పిలిపించి, ఊరికే విచారించి మనస్సు పాడుచేసుకోవద్దని, నాకు చేతనయిన పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి పంపించాను ఇద్దర్నీ. 

    ఆ సాయంత్రమే రామాలయానికి వెళ్లి, గుడి స్టాఫుని, కొందరు భక్తుల్నీ సూర్యం గురించి ప్రశ్నించి అవాక్కయిపోయాను. రోజూ గుడి తెరచినప్పట్నుంచీ మూసే వరకు, స్టాఫు చేయాల్సిన విధుల్లో సగం ఇతనే చేస్తాట్ట.

    ఆ తర్వాత సూర్యం మంటపంలో కూర్చుని రామకీర్తనలు ఆలపిస్తూంటే భక్తులు పారవశ్యంతో మైఅమరచి వూగిపోవడం నా కళ్లారా చూసాను. అసలు ఇతని కీర్తనలు వినడానికే భక్తులంతా రామాలయానికి వస్తారేమోననిపించింది. 

    అది నా బాధ్యతగానూ, జన్మకు ధన్యతగానూ భావించి, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంటులో నాకున్న పలుకుబడిని ఉపయోగించి, మినిష్టరుగార్ని సంప్రదించి ఒప్పించి, స్పెషల్ కన్సిడరేషన్ మీద సూర్యానికి రామాయలంలో గుమాస్తా ఉద్యోగం యిప్పించాను. ఉద్యోగం వచ్చిన ఆనందంకంటే గుడిప్రాంగణంలోనే ఎంతసేపన్నా ఉండిపోవచ్చన్న ఆనందంతో సూర్యం ఊగి, ఉబ్బితబ్బిబ్బయి పోయాడు.

    వృత్తి, ప్రవృత్తి ఒకటే అవడంతో కొడుకుని గురించిన బెంగ తను ఇంక ఏమాత్రం పడనక్కర్లేదని నిశ్చింతని పొందిన అనంతంగారు నాకు అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలియజేసారు.

* * *

    గుళ్లో దొంగతనం జరిగాక ఈ రోజు రెండోరోజు.

    ఈ రెండు రోజులూ నాకు నిద్రాహారాలు లేవు.

    సూర్యానికి సంబంధించి ఏ సమాచారమూ లేదు.

    అతనికి నేనే రామాలయంలో ఉద్యోగం ఇప్పించానన్న విషయం ఈ రెండ్రోజుల్లోనూ దావానలంలా చుట్టు ప్రక్కల ఊళ్లకు కూడా వ్యాపించిపోయింది. ఓ లోకల్ పేపర్ వాడయితే ఆ విషయాన్ని హెడ్‌లైన్స్‌లో కూడా వేశాడు. ఉద్యోగం వేయించిన నా గురించి అందరూ ఏమైనా అనుకునే అవకాశాన్ని బాగానే కలిగించాడు.

    తలకొట్టేసినట్లుగా ఉంది నాకు.

    అంతకు మించి విశ్వాసఘాతుకానికి మారుపేరు మాన్వజన్మ అనే భావం పొటమరించి, దహించేస్తోంది నన్ను. ఇటువంటి దారుణమయిన తలంపుతోనే అమాయకంగా అగుపించే సూర్యం దేముడంటే అంత పిచ్చి భక్తి ఉన్నవాడుగా నటించాడన్నమాట! ఎంత నయవంచన?!

    బయట జీప్ ఆగిన ద్వని.

    ఆపైన బూట్ల చప్పుడు టక...టక... మంటూ.

    స్వింగ్ డోర్‌ని తోసుకుంటూ, విసురుగా, సుడిగాలిలా లోపలికి దూసుకువచ్చాడు ఖాన్. కళ్లు పండిన సీమచింతకాయల్లా ఎర్రగా ఉన్నాయి.

    ఇంకా ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందోనని తత్తరపడ్డాను.

    "ఉద్యోగానికి రిజైన్ చేసేసి, అనామకుడిగా ఎక్కడికయినా పారిపోదామనుకుంటున్నాను" ఖాన్ గొంతు పొగచూరినట్లుగా ధ్వనించింది.

    గొంతులో తడారిపోతుంటే, గుడ్లప్పగించి చూస్తున్నాను.

    "ముస్లిమ్‌గా పుట్టడం నాతప్పా? అయినా ఎన్నడన్నా మతానికి సంబంధించిన భేదభావాన్ని మాకుటుంబంలో వళ్లం చూపించామా? రామాలయంలో విగ్రహాలు మాయమవడానికి ఐ.యస్.ఐ. కారణమట - ముస్లిమ్‌ని కాబట్టి, కచ్చితంగా నేను వెనకనిలిచి, వాళ్లతో చేయికలపబట్టే సూర్యం ద్వారా ఈ పనిని చక్కబెట్టానట..."

    నావ్రేళ్లు బిగుసుకున్నాయి.

    రెప్పలు వాల్చడం ఆగిపొయింది.

    "ఎవరన్నారు అలాగని?" ఖంగుమంది నా గొంతు.

    దరిదాపు అరుస్తూనే గొంతుతో, "జనం" అని ఆగి, "ఎవరంటే ఏం చెప్పమంటావు? నీ నిర్వాకం ఫలితం ఇది! పరోపకారం అంటూ నువ్వు అనాలోచితంగా చేసిన ఈ సాయం నా ప్రాణం మీదకి..." అని అతనంటుండగానే, నేను అదుపుతప్పి, బల్లమీద చేత్తో చరుస్తూ, మరింత పెద్ద స్వరంతో, "నన్నూ అనుకుంటున్నారూ - సూర్యంగాడు విగ్రహాల్ని, నగలనీ దొంగలించడానికి వెనుక అసలు బలం నానుంచే లభిస్తోందని. ఏం చేయమంటావ్?" అరిచాను.

    రూములో నా అరుపు చాలా క్రూరంగా ధ్వనించింది.

    రెండు నిమిషాలపాటు మాయిద్దరిమధ్య భయంకర నిశ్శబ్దానిదే రాజ్యం. నాకు ఒళ్లు తెలిసేసరికి మిత్రుడి మీద అలా అదుపుతప్పి అరిచినందుకు ఆపాదమస్తకం సిగ్గు కమ్మెయ్యసాగింది. ఖాన్ కళ్లల్లోనూ నీళ్లూరి వున్నాయి. చటుక్కున లేస్తూ, నా చేతులు పుచ్చుకుని, "సారీ, రియల్లీ సారీ. పోలీసువాళ్లం. తిట్లు, విమర్శలు మాకు అలవాటయినవే. కానీ... నీకు... ఇన్నాళ్లూ ఊళ్లో ఇంత గొప్పగా గౌరవంగా బతికిన నీలాంటివాడికి... ఛ... ఆ రాస్కెల్ పట్టు బడితే పబ్లిగ్గా చర్మం ఒలిచేస్తాను..." అని, వచ్చినంత విసురుగానూ బయటకు వెళ్లిపోయాడు. 

    తలపట్టుకుని, నేను అలాగే బొమ్మలా కూర్చుని ఉన్నాను.

* * *

    అర్థరాత్రి రెండు గంటల వేళ...

    పచార్లు చేస్తున్నాను హాల్లో నిద్రపట్టక. జీరోక్యాండిల్ బల్బ్ సన్నని నీలికాంతి హాలంతా పల్చగా వ్యాపించి ఉంది.

    మనసంతా చిక్కటి చీకటి.

    నా పరువు పోయింది - గుండె ఘూర్ణిల్లుతోంది.

    ఎన్నడూ అతనుగాని, అతని కుటుంబ సభ్యులుగాని వేరే మతస్థులుగా ఎవ్వరికీ తోచని ఖాన్ - ఇప్పుడు పరాయి మతస్థుడుగానే కాదు, కుట్రదారుడిగా కూడా పుకార్లకి ఎక్కుతున్నాడు జనంనోట. ఊళ్ళో జనానికి విగ్రహాలు పోయాయన్న బాధ కంటే - తాము చందాలు వేసి తయారు చేయించిన నగలు పోయాయన్న బాధ ఎక్కువగా ఉన్నట్లుగా వింటున్నాను. రెండ్రోజులయినా సూర్యం ఆచూకీ తెలియకపోవడంతో జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. సమస్య రాజకీయపు రంగూ పులుముకొంటోంది... భగవంతుడా - ఏమిటీ పరీక్ష?!

    తలుపు మీద ఎవరో నెమ్మదిగా వ్రేళ్లతో తట్టుతూన్న ధ్వని...

    ఇంతరాత్రివేళ... ఎవరై ఉంటారు?... అయినా తలుపు ప్రక్కనే కాలింగ్ బెల్ స్విచ్ వుండగా...

    మళ్లీ తలుపు మీద వ్రేళ్లు చప్పుడు...

    ట్యూబ్‌లైట్ ఆన్‌చేసి, గ్రిల్‌లోంచి అవతలి వ్యక్తి కనిపించేందుకు తలుపు ప్రక్కనే పెట్టించిన చెక్కని జరిపించాను. బయటవ్యక్తి ప్రక్కకు జరిగి, గ్రిల్‌లోంచి నాకు కనబడేలా ఎదురుగా వచ్చినిలబడ్డాడు.

    అదిరి పడ్డాను!!

    సూర్యం!

    హాలులోని లైటు వెలుతురు అతనిముఖం మీద వాలుతోంది.

    గుడ్లప్పగించి చూసాను.

    దీనంగా చూస్తున్నాడు నావైపు.

    ధైర్యం చేసి తలుపు తీసాను.

    చటుక్కున లోపలికొచ్చి తలుపులు బిగించాడు. గ్రిల్‌ని కూడా మూసేసి, హాల్లోని ట్యూబ్ లైటు స్విచ్‌ని ఆఫ్ చేసేసాడు.

    అప్పుడు చూసాను అతని భుజానికి ఉన్న పెద్ద జోలిలాంటి మూటని. మూటని టీపాయ్ మీద ఉంచి, రెండు చేతులూ జోడించాడు నావైపు.

    దవడలు కోపంతో కంపిస్తుండగా అతన్ని మింగేసేలా చూస్తూన్నాను నేను.

    నెమ్మదిగా మూట ముళ్లు విప్పాడు సూర్యం.

    నా కళ్లు పగిలిన పత్తికాయలయ్యాయి... దొంగిలించిన దేవతా విగ్రహాల తాలూకు నగలు... ధగధగలాడుతూ... ఆ మూటలో...

    నుదుటి మీద చెమటని బొటన వ్రేలితో ఓ ప్రక్కకు ఊడ్చుతూ, బలవంతం మీద గొంతు పెగల్చుకుని, "మొత్తం అన్ని నగలూ తెచ్చేశాను సారు. దేముళ్లను మాత్రం తేలేదు. క్షమించాలి" అన్నాడు - ఒక విధమైన తెగింపుగా.

    అతితక్కువ స్వరంతో అన్నప్పటికీ స్థిరంగా, స్ఫుటంగా ఉన్నాయి అతని మాటలు. అపరాధ భావన ఛాయలేవీలేవు ఆ మాటల్లో.

    "కూర్చో" అన్నాను శాసిస్తున్నట్లుగా.

    "ఆ అర్హతలేని వాడ్ని" - నిలబడే ఉన్నాడు సూర్యం, చేతులు కట్టుకుని, వినయంగా తలవంచుకుని.

    ఒక్కక్షణం అతని ముఖంలో వింతగా చూసి, సోఫాలో కూర్చుంటూ, "ఎందుకు చేసావీ నీచమైన పని? నువ్వింకా మంచివాడివి, గొప్ప భక్తుడివీ అనుకు..."

    నా మాటలు పూర్తి కానియ్యలేదు సూర్యం. గొంతుపెంచుతూ, "భక్తుడ్నే...!" అన్నాడు ఖంగుమనే గొంతుతో, కచ్చితంగా.

    నోరుతెరచి అతని వైపే చూస్తున్నాను. 

    గుండెలు ఎగిసిపడ్తూండగా, పెదవులు అదుద్రుతూండగా, రెండు చేతులూ జోడిస్తూ, మోకాళ్ల మీద కూలబడి, గొంతుని బాగా తగ్గించి, "...భక్తుడ్నే సార్... భక్తుడ్నే! వేరే ఏమయినా కాదనండి తలవంచి ఒప్పుకుంటా. భక్తుడ్ని మాత్రం కాదనకండి. భక్తుడ్ని కాబట్టే నా దేముళ్లని నరరూప పిశాచాళ నుంచి కాపాడుకున్నాను..." అంటూ బావురుమన్నాను.

    ఆశ్చర్యపోతూ, అలాగే అతనివైపే దృష్టి సారించి, ఏడవనిచ్చాను. నెమ్మదిగా లేచి, అతని ప్రక్కనే మఠం వేసుక్కూర్చుంటూ, భుజం మీద చెయ్యివేసి, "ఏమయింది అసలు నీకు?" అన్నాను.

    కన్నీళ్లలోంచే నన్ను చూస్తూ, "అన్యాయమైపోతోంది సార్. దేముడికి అపచారం జరిగిపోతోందిసార్. వేదసారం అంతా బూడిదైపోతోందిసార్..." అంటూ, వెక్కుతూ, బలవంతాన తమాయించుకుంటూ, "సాక్షాత్తూ దేముడి ఎదుటే... ఆ దేముడికి సేవ చేయడానికి నియోగించబడ్డ ఉద్యోగులే... దక్కిన అద్భుతమైన అవకాశానికి దేముడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సేవలు చేయకుండా... ఎలా దేవుడి ఆదాయాన్ని కొల్లగొడ్దాం... ఎలా భక్తుల విశ్వసాన్ని సొమ్ముచేసుకుందాం... అని దుర్మార్గంగా ఆలోచించి ప్రవర్తిస్తూంటే... ఆ దేముడికి అన్యాయం జరిగిపోతున్నట్లు కాదా సార్?

    దాతలిచ్చిన విరాళాలలో సగానికి పైగా ధర్మకర్తలు దొంగ రసీదుల్తో కొట్టేస్తున్నారు... మిగిలిన సగంలో ఈ.ఓ. దొంగ బిల్లులతో అందులో సగం కొట్టేస్తున్నాడు. ప్రసాదం తయారీలో... దర్శనాల క్యూలలో... దేముడి అలంకరణలో... వెలిగించే హారతి కర్పూరంలో... అంతటా మోసం... దగా! లైన్లలో నిలబడ్డ భక్తుల్ని ముసలిముక్కి అనికూడా చూడకుండా పెద్దపెద్ద అరుపులు, తిట్ల సాయంతో తోసెయ్యడం, స్త్రీల అభ్యంతరకర దేహభాగాల మీద చేతులుంచి నెట్టెయ్యడం, డబ్బులు తీసుకుని దేముడ్ని సైతం తాకనీయడ, చివరకు బయట అడుక్కునే ముష్టివాళ్లదగ్గర్నుంచీ కూడా తమ మనుషుల్ని కూర్చోబెట్టి, వాటాలు పొందడం...

    తాళాలు మొత్తం నా చేతుల్లో పెట్టి, తమ బాధ్యతలు పూర్తిగా విస్మరించి, పరమ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ధూమపానం, బూతులు, జూదం, వ్యభిచారం, అసాంఘిక కార్యక్రమాలు... చూడలేను సార్...నా దేముడికి అపచారం జరుగుతూంటే...

    ఎవ్వరికి చెప్పుకున్నా నా మాటలు నమ్మరని తెలుసు...

    అందుకనే... అందుకనే... నా దేముళ్ళకు ఎక్కడ అసలైన పూజితం లభిస్తుందో... ఆ అడవుల్లోకి... ఆ కొండకోనల్లోకి... ఈ అసభ్య నాగరికత వాసన ఎరుగని ఆ అమాయక గిరిజన వాసాల్లోకి... అక్కడికి చేర్చేశాను సార్ నా దేముళ్లనీ...

    నేను నమ్మిన భద్రమైన చోటుకి చేర్చాక నాకు ఒళ్లు తెలిసింది. అప్పుడు గుర్తొచ్చారు సార్ - ఎంగిలి పళ్లతో దేముడి ఆకలి తీర్చిన అమాయకపు శబరి, పుక్కిట నీళ్లతో తన దేముడ్ని శుభ్రపరచిన కపటం ఎరుగని కన్నప్ప... నిజమే - దేముడికి తన గుండెనే నైవేద్యంగా సమర్పించే భక్తుడు ఒక్క గడ్డిపూవుని ఆయన పాదాల చెంత ఉంచితే చాలదా అని... ఈ మణిమాణిక్యాలు, పచ్చల హారాలు, చింతాకు పతకాలు, వజ్రవైడూర్యాలూ కావాలా అని... అందుకనే వీటిని తీసుకొచ్చేసాను సారు.

    కావలిస్తే... నేను చేసింది నేరమే అయితే... నా ప్రాణాలు తీసుకోండి సార్... కాని, ఏ విపరీతమైన కోరికా ఎక్కడా కోరని అమాయక భక్తుల నిష్కల్మష హృదయాలనుంచి విడదీసి, నా దేముడ్ని మాత్రం మళ్లీ తెచ్చేయమని శాసించకండి సార్..." అంటూ నా కాళ్ల మీద వాలిపోయాడు సూర్యం.

    చెవులు, కళ్లు అప్పగించి అలా అచేతనంగా కూర్చుండిపోయిన నాలో మరో రెండు నిముషాలకు గాని చలనం కలగలేదు.

    అతని స్థితి నాకు బోధపడింది.

    నా చేయి అతని తల నిమిరింది.

    లేచి, కాగితం, పెన్ను అందించి, "నీ ఈ భావాన్ని కాగితం మీద వ్రాయి సూర్యం" అన్నాను.

    గబగబా వ్రాసేసాడు సూర్యం.

    నెమ్మదిగా వీధి తలుపులు తీసాను. బయటకు నడిచి, కనుచూపు మేర కళ్లు పొడుచుకుని చూసాను. చలికాలం కావడతో మనుష సంచారం లేదు. అంతటా జీబురుమంటూన్న చీకటి. 

    తిరిగొచ్చి, సూర్యం తలమీద చెయ్యుంచి, ఆశీర్వదించాను. క్షమాభిక్ష పొందిన ఆనందంతో నాకళ్లల్లోకి చూసాడు సూరం. 'నీ ప్రపంచంలోకి నువ్వు స్వేచ్ఛగా వెళ్లు' అన్నట్లుగా, చల్లని చిరునవ్వుతో చుస్తూ, బయటకు చెయ్యిచూపించాను.

    ఆనందంతో కంపించిపోయాడు సూర్యం. చువ్వలా లేచి, నాకు నమస్కరించాడు.

    నేను," నువ్వు నాకు కనబడలేదు. తెల్లారేక మాగేటు ప్రక్కన క్రోటన్ మొక్కల దగ్గర ఈ మూటని, ఈ లెటర్‌నీ నేను చుసాను. అంతే!" అన్నాను అర్థోక్తిగా అతని కళ్లల్లోకి చూస్తూ.

    ఒక్కక్షణం కృతజ్ఞతగా నా ముఖంలోకి చూసి, అర్థమైనట్లు తలూపాడు, ఆనందంగా. ఆ వెంటనే మెరుపులా మాయమయ్యాడు.

    నాలో ఏదో తెలియని ఆనందం.

    సూర్యం ఒక్కడే... సూర్యం ఒక్కడే! నాలో ఈ రోజు త్వరగా సూర్యోదయమవుతుందన్న విశ్వాసంతో కూడిన భావన.

    నాకు తెలుసు - ఈ రోజు పొగమంచుకి సూర్యుడ్ని దాచే శక్తి ఉండదు.

    తలుపులు మూసి, హుషారుగా బెడ్‌రూంవైపు నడిచాను.

(సాహితీ స్రవంతి - సాహిత్య పత్రిక అక్టోబర్-డిసెంబర్, 2009 సంచికలో ప్రచురితం) 


Comments