పొలిటికల్ పుష్కరాలూ – పిండ ప్రదానాలూ - వంగూరి చిట్టెన్ రాజు

 
   
ఆ మధ్య ..అంటే జూలై, 2015 నెల అంతా ఏ తెలుగు టీవీ చూసినా గోదావరి పుష్కరాల వార్తలే. పేరుకి పుష్కరాలే కానీ నిజానికి పొలిటికల్ ఆర్భాటాలే ఎక్కువ. అసలు పుష్కరుడు గోదావరిలో ఎక్కడ దాక్కున్నాడో తెలియదు కానీ, మన రాజకీయ నాయకులు ఎక్కడా దాక్కోకుండా మూడు సెకన్లలో సార్లు ములిగితే చాలు,  చేసిన మూడు కోట్ల పాపాలు కడిగి పారేసుకుని సరి కొత్త పాపాలు చెయ్యడానికి రెడీ అయిపోడానికి తయారవడానికి ఇంత కంటే సులభమైన మార్గం మరేమీ లేదు కదా అని అన్ని పనులూ మానుకుని పరిగెట్టుకుని వచ్చారు. పైగా అటు కేసీఆరూ, ఇటు నాయుడు బాబూ స్వయంగా స్నాన ఘట్టాలలో ఉండడంతో వారి తో పాటు స్నానం చేసే అపురూపమైన అవకాశం ఎవరూ పోగొట్టుకోదల్చుకో లేదు అని కూడా నాకు అర్థం అయిపోయింది. అంతే కాదు మామూలు పుష్కరాలైతే మామూలు పాపాలే పోతాయి కానీ ఇవి మహా పుష్కరాలు కాబట్టి మహా పాపాలు పోతాయి కాబట్టి కుల, మత, వర్గ, పార్టీ లకి అతీతంగా, ఎందుకైనా మంచిదని సకుటుంబ సమేతంగా అందరు రాజకీయ నాయకులూ తరలి వచ్చి ఒళ్లంతా తడుపుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు కూడా జల్లుకుని జలకాలాటలాడారు. కొందరు సినిమా దేవుళ్ళు, దేవతలు మటుకు తువ్వాళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయినా వారి అభిమానులు సొంత తువ్వాళ్ళతో స్వయంగా వారి కాళ్ళు తుడిచి పుణ్యం చేసుకున్నారు.

    కానీ నా బోటి ఎన్నారై లకి ఈ పుష్కర స్నానం చేసే అవకాశం లేదు కదా, పోనీ హ్యూస్టన్ లో మా ఇంటి పక్కనే ఉన్న “గేదెల కాలువ”...అనగా బఫెలో బయూ అనే మురికి కాలువ లో ములుగుదామా అంటే పోలీసులు మూసేస్తారు కదా  అని నేను విచారిస్తూ ఉంటే “ఏడవకు మొగుడూ, నువ్వు చేసిన పాపాలకి ఒరిజినల్ గంగా నదిలో లో పది సార్లు ములగాలి కానీ ఆఫ్టరాల్ గోదావరిలో మూడు సార్లు ములిగితే ముఫై శాతం కూడా మాఫీ అవవు.’ అని నొచ్చుకుంటున్న సమయంలో టీవీలో ఒక పబ్లిసిటీ ప్రవచన ప్రచార కర్త ఒకాయన “పుష్కరాల సమయంలో అసలు గోదావరిలో ములగక్కర లేదూ. ఈ గవర్నమెంట్ వాళ్లూ, ప్రవచనాలు చెప్పే వాళ్లూ, టీవీ వాళ్లూ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇప్పుడు  గోదాట్లో ములగక పొతే జన్మంతా పాపాత్ములుగానే ఉండి పోతారు అని ఊదరగొట్టేసి రాద్దాంతం చేస్తున్నారూ. మీరు ఇంట్లోనే హాయిగా స్నానం చేస్తున్నప్పుడు మంత్రం చెప్పుకుని, పుష్కరుణ్ణి ఆవాహనం చేసుకుంటే అంత పుణ్యమూ వస్తుంది. పాపాలూ పోతాయి” అని ఘాటిగా చెప్పారు. అది వినగానే మా క్వీన్ విక్టోరియా అర్జంటుగా మళ్ళీ బాత్ రూం లోకి పరిగెట్టింది. ఎప్పుడూ మా పూజ గదిలోంచి వినపడే ప్రార్థనలు ఇప్పుడు హఠాత్తుగా స్నానాల గదిలోంచి గణపతి నవ రాత్రులప్పుడు వీధి మైకుల టైపులో వినపడడం మొదలుపెట్టాయి. ఈ తతంగం రోజుకు మూడు పూటల చొప్పున పుష్కరాల పన్నెండు రోజులూ జరిగి మా వాటర్ బిల్లు మూడు రెట్లు అయిపోయింది.  “అన్ని సార్లు ఎందుకూ?” అని నేను నసిగితే “మూడు సార్లు ములగాలి కాబట్టి మూడు షవార్లు చేసానులే. పైగా అవన్నీ నీ తరఫునే! నువ్వు ఎలాగా పాపాలే కానీ పుణ్య స్నానాలు చెయ్యవు గా.” అంది మా క్వీన్ విక్టోరియా. అంటే నాకూ, పుష్కర పుణ్యానికీ లింకు మా క్వీన్ విక్టోరియా అనమాట అనగా ఆడ “పురోహితి”.  చెప్పొద్దూ భర్త గాడు మనకి చెప్పకుండా ఏవో పాపాలు చేసే ఉంటాడు అనే భ్రమతో, అతణ్ణి పాప విముక్తుణ్ణి చెయ్యడానికి తనకు తానే ఇంత “స్నాన శిక్ష” విధించుకున్న మహా రాణి చరిత్రలో ఇంకెవ్వరూ లేరు గాత లేరు.

    అన్నట్టు పురోహితి అంటే గుర్తుకి వచ్చింది. ఈ పుష్కరాల హడావుడి నేను టీవీ లో చూసిన దాన్ని బట్టి పిండ ప్రదానాలు ఎన్ని రకాలుగా చెయ్యవచ్చో తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. అనగా టీవీ రిపోర్టర్ల తెలుగు భాషా ప్రావీణ్యం ప్రకారం “గర్భాదానం” టైపులో “పిండ ప్రధానం”, లేదా ఇంకా ఘట్టిగా కావాలంటే ఏకంగా “ఫిండ ఫర్ధానం” చేసెయ్యవచ్చును. ఉదాహరణకి గోదావరిలో పేంటు పైకి మడత పెట్టుకుని నీట ములుగుతున్న అమ్మాయిల పక్కన ఉన్న ఒక టీవీ రిపోర్టర్ ప్రకారం “పుష్కరాలలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ పిండ ప్రధానం చాలా ఆసక్తికరంగా జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అరిటాకులో ఉన్న మూడు ఉండలూ గుండ్రంగా తెల్లగా ఉండే పరిస్థితి ఉంది. బేక్ టు స్టూడియో” అని ఆ ప్రదానోత్సవాన్ని విశదీకరించే ప్రయత్నం చేశాడు. ఇక గోదావరిలో కొట్టుకుపోకుండా స్థిరంగా నుంచోడానికి ఎంతో ఆయాసపడుతున్న మరొక రిపోర్టర్ ప్రకారం అక్కడ  “ఫిండ ఫర్ధానం చేసుకోడానికి అనేక మంది ఒకే సారి రెడీగా ఉన్న పరిస్థితి లో గోదావరిలో ఉద్రిక్తత నెలకొంది. ఒకరి ఆకు లోని పిండం పక్కనే ఉన్న మరొకరి ఆకులోకి దొర్లి వెళ్ళిపోతుండడంతో పితృ దేవతలు ఏ పిండం ఎవరిదో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అని స్థానిక పురోహితులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న పిండ పండితులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుందాం” అనే లోపుగా యాంకరమ్మ “థెంక్యూ అజారుద్దీన్, పక్క ఘాట్ లో మహమ్మద్ గజనీ గారి లైవ్ పిండ ప్రదానం చూద్దాం” అని కట్ చేసి పారేసింది .  సరిగ్గా అదే సమయంలో “గోదావరి మేరీ మాత కి పుష్కర శుభాకాంక్షలు” లాంటి ఒక పెద్ద బోర్డు కనపడి సంతోషం కలిగింది. అలాగే అన్య మతానికి చెందిన జగన్ గారు కూడా పిండ ప్రదానం చెయ్యడం, పుష్కర స్నానం చేసి పాపాలు కడిగేసుకోడం కూడా చూడ ముచ్చటగా ఉంది.  అన్నింటికన్నా నాకు నచ్చిన అంశం ఒకాయన మరో రిపోర్టర్ “మీ పిండ ప్రదానాలకి చంద్ర బాబు నాయుడు గారి ఏర్పాట్లు బావున్నాయా?” అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా “ఇప్పటికి వందకి పైగా పిండ ప్రదానాలు ఎడా పెడా చేసి చాలా హేపీగా ఫీలవుతున్నాను“ అని బొడ్డులో దోపుకున్న డబ్బు సంచీ తడుముకున్నాడు. అది వినగానే ఈ పిండ ప్రదానాల వలన పితృదేవతలు హేపీ గా ఫీలవుతారు అని ఇన్నాళ్ళూ నేను అనుకున్నది తప్పేమో అని నాకు అనుమానం వచ్చేసింది. మరో టీవీలో ఒక వె.వె గారు ..అంటే వెర్రి వెధవ గారు... ఏఎన్నారూ, ఎన్టీఆరూ, గాంధీ గారూ, ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ మొదలైన వారి ఫోటోలు ఒక పొడుగాటి కర్రకి దారం తో కట్టి , మూడు సార్లు గోదాట్లో ముంచి తీసి తన మానసిక దౌర్భాగ్యాన్ని చాటుకున్నాడు. 

    ఈ ప్రగాఢమైన పిండ ప్రదాన విషయంలో నేను గమనించిన మరొక అంశం రాజకీయ నాయకుల “స్వయం ప్రకటిత పిండ ప్రదానం”. అంటే వాళ్ళది వాళ్ళే కడుంగడు సంతసముగా పెట్టుకొనుట అని కాదు. వాళ్లకి పొలిటికల్ గా ఉపయోగపడే పబ్లిక్ పిండ ప్రదానం అనమాట. ఉదాహరణకి తెలంగాణా ఉద్యమ  నాయకులు అమర వీరులందరికీ కలిసి ఒకే పిండమూ, జగన్ పార్టీ వారు వైయెస్సార్ పోయాక ఆత్మహత్యలు చేసుకున్న వారందరికీ కలిపి రెండు పిండాలూ, మరో పార్టీ వారు ఇంకో పార్టీ వారి హయాం లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి మూడూ, బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీ కి మూకుమ్మడి భారీ పిండ ప్రదానం, సినిమా తారలు కొందరు తాము నటించి ఆత్మహత్యలకి గురి అయిన నిర్మాతలకి రహస్య పిండ ప్రదానం, కొందరు పశు ప్రియులు వారి ప్రియమైన పిల్లీ, కుక్కల పితృ దేవతలకీ చిన్న సైజువీ  ..ఒకటేమిటీ అనేక రకాల పిండ ప్రదానాలతో ఇరు రాష్ట్రాలలోను ఉహించని స్థాయిలో బియ్యప్పిండి కొరత ఏర్పడింది. వేసవి కాలం లో వడియాలు పెట్టుకోవడం స్తంభించి పోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ళలో కొంత మంది బతికుండగానే పిండ ప్రదానం చేయించుకోడానికి అర్హులేమో వేదాల్లో చూసి తెలుసుకోవాలి.    

    ఇక ఈ పుష్కర స్నానాలు చేసిన వారిలో పాపాలు కడిగేసుకోడానికి వచ్చిన  కొందరు భారీ నాయకులు కష్టపడి గోదావరిలో ములిగినప్పుడు మళ్ళీ పైకి తేలుదు రా లేక, తేల లేక శాశ్వతముగా ములుగుదురా అని నాకు అనుమానం కూడా వచ్చి ఎంతో ఉత్కంఠ తో చూసిన సందర్భాలు అనేకం. అంతే కాక కొందరు ప్రవచన కారులు పుష్కర స్నానం చేసినప్పుడు పురుషులు చొక్కా తీసేయ్యాలి అనీ, పిడికెడు మట్టి ఎక్కడికో విసిరెయ్యాలి అనీ సూత్రాలు చెప్పారుట. అందు వలన ఈ సదవకాశాన్ని పురస్కరించుకుని కేసీఆర్, చంద్ర బాబూ వెరైటీ కోసం చొక్కాలు తీసేసి మరీ బురద జల్లుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అంతే కాక ఈ చొక్కా తీసివెయ్య వలయును అనే రూలు అమ్మాయిలకి కూడా వర్తిస్తుందేమో అనే ఆశతో తెలుగు యువత తమ ఆధునిక సెల్ కెమెరాలతో అన్ని ఘాట్ లకీ, షూట్ లకీ తరలి వచ్చారు. కానీ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి, వారి షూటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక వారి సెల్ ఫోన్ లని స్వాధీనం చేసుకున్నారు. అందు వలన కోపం వచ్చి, అదే యూతు  ఇక ఉచితంగా భోజనాల పేకట్ల పంపిణీ జరిగిన ఒక చోట గుమిగూడి “ఈ పేకేట్లలో పురాతన కాలం నాటి పులి హార, దద్దోజనం లాంటి ఓల్డ్ పేషన్ద్ ఫుడ్డు ఎలా తినగలం. మాకు పిజ్జా, బర్గరూ ఉన్న ఫుడ్ ఇవ్వ లేరా?” అని ధర్నా చెయ్యడంతో “ఆయా ఫోటోలు, విడియోలు పూర్తిగా చూసి వెనక్కి తిరిగి ఇచ్చేసేలా పోలీసు యంత్రాంగం ఆ యూతు నాయకులతో  ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మరొక చోట ఒక కుల సంఘం వారు వచ్చిన భక్తులలో దళితులు ఎంత మందీ, అగ్ర కులాలలో ఫలానా అగ్ర కులం వాళ్ళు ఎంత మందీ. ఎస్టీ, ఎస్సీ ల సంఖ్య ఎంతా అని లెక్కలు వేసుకుంటున్నారు. గోదావరి పుష్కరాలలో దళితుల పిండ ప్రదానాలు ఎంత శాతం ఉంటాయి? ఎవరైనా చెప్ప గలరా? అని నా ఫేస్ బుక్ లో ఒక అనామక  స్నేహితుడు ప్రశ్న సంధించగానే ఆ అక్కౌంట్ కి వెంటనే పిండ ప్రదానం చేసేశాను.  

    ఇక ఈ పుష్కరాలు కూడా రాజకీయాల ధాటి నుంచి తప్పించుకోలేక పోయాయి అని నేను వేరే చెప్పక్కర లేదు. లక్షల కొద్దీ జనం పోగయ్యే ఈ అవకాశాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ “పుష్కర ఏర్పాట్లు” పేరిట పార్టీ ప్రచారాలు పుష్కలంగా చేసుకున్నాయి. ఒక ముఖ్య మంత్రి అయితే ఒక టాలీవుడ్ దర్శకుడి తో మూడు గంటల సేపు తన ప్రచారం వీడియో రికార్డింగ్ చేయించుకున్నారు. ఇక సదరు పుష్కరుడు ముందు తెలంగాణా గోదావరిలో ప్రవేశించి ఆ తరువాతనే ఆంధ్రా వేపు వెళ్తారు కాబట్టి మా తెలంగాణా వారు పుణ్య స్నానాలు చేశాకే మీకు అవకాశం వస్తుంది అని కొందరు ప్రబుద్ధులు టీవీలో చెప్పి తమ అజ్జానాన్ని చాటుకున్నారు. తెలంగాణా ప్రాంతం లో ఉన్న ఘాట్ లో ఓ మంత్రి గారు ములుగుతూ ఉండగా అది కవర్ చేస్తున్న టేవీ రిపోర్టర్ పక్కనే ములగడం మానేసి టీవీ కెమెరా కేసి చూస్తూ పళ్ళికిలిస్తున్న ఒకాయన్ని “మీరెక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు.” మాదాండీ..మాది రాజమండ్రి ..ఆయ్” అన్నాడు టీవీలో కనపడే అవకాశానికి మురిసిపోతూ.  ఇంకేముందీ..వెంటనే ములిగిన మంత్రి గారు గాల్లోకి తేలి పోయి “చూసిండ్రా. ఆంధ్రోల్లు పుష్కరాల ఏర్పాట్లు మా కేసీఆర్ లా చెయ్య లేక పోయిన్రు. అందుకే ఆల్లంతా మన తెలంగాణా లో పుష్కర స్నానాల కి వస్తున్రు” అని రెచ్చి పోయారు.  సరిగ్గా దీనికి రివర్స్ సీన్లు ..అంటే కరీం నగర్ నుంచి ఎవరైనా అంతర్వేది వెళ్ళారో....అక్కడి ఎమ్మెల్యే గారిది కూడా అలాంటి ప్రవచనమే. ఏ ఘాట్ చూసినా ఏమున్నది గర్వ కారణం? రాజకీయ నాయకుల పుష్కర ప్రచారం తప్ప” ..అన్నట్టు ఇలా అంటే మహా కవి శ్రీ శ్రీ గారు రాసిన ఓ పద్యం గుర్తుకు వస్తోంది.

గంగలో మునుగంగ

పాపాలు తొలంగునని

ఒక దొంగ కాశీకి పోయి గంగలో

బుడుంగున మునింగి చనిపోయె చల్లంగ

    ఈ హడావుడిలో భాగంగా ఒకానొక అమెరికా తెలుగు సంఘం నాయకుల వారు సూటూ, బూటూ వేసుకుని ఏదో పార్టీ ఒబామా గారి పక్కన ఫోటో తీయించుకుంటూ, సెల్ ఫోన్ లో గోదావరి పుష్కర స్నానాల ఫోటో చూపించి దాని పవిత్రత వివరించి ఆయన్ని ఆ పవిత్ర స్నానానికి సతీ సమేతంగా ఆహ్వానించారు. ఒబామా గారు కంగారుగా తిరస్కరించారు కానీ మిషెల్ గారు సరదా పడినట్టూ, రాబోయే కృష్ణా పుష్కరాలకి అమరావతికి తప్పకుండా వస్తానని ఆమె హామీ ఇచ్చినట్టూ ఆ అమెరికా నాయకుల వారు ఒక పత్రికా ప్రకటన లో తెలియ జేశారు. అప్పుడు అమెరికా టీవీ ఆ సమయానికి హిలరీ గారు అధ్యక్షులైతే ఆవిడనీ, మరో మగాధ్యక్షుడైతే ఆయన్నీ కృష్ణా నదిలో ములుగుతుంటే ఆ వార్తా, విజువల్స్ ఎలా కవర్ చేస్తారో చూడాలని మహా కుతుహలంగా ఉంది.  

    ఏది ఏమైతేనేం....గోదావరి పుష్కరాలు ముగిశాయి. పుణ్యం మాట, ప్రజల మాట దేముడెరుగు, రాజకీయ ప్రయోజనాలకి కొత్త పురుషార్థం సిద్ధించింది. పాప ప్రక్షాళణకి ఏవేవో నదీ పుష్కరాలు వస్తూనే ఉంటాయిగా. అనవసరంగా పుణ్యాలు చేసేసి ఉన్న రాజకీయ సమయం వృధా చేసుకోవడం ఎందుకూ? 

Comments