ప్రాచీన హోదా - పెయ్యేటి శ్రీదేవి

        
తెలుగు తల్లికి జై!
        మన తెలుగు భాషకీ జై!!
        తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించిన వారికీ జై!!!

    తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించిన శుభ సమయంలో అన్ని ఊళ్ళనించీ వచ్చిన దిగ్గజాల్లాంటి మహా ఉద్దండ తెలుగు పండితులందరు సమావేశమై, వారం రోజుల నించి సభలు, సమావేశాలు, ఇష్టాగోష్టులు, ఇంకా శత సహస్రావధానాలూ కూడా జరిపి, వాళ్ళలో వాళ్ళు పద్యాలు, గద్యాలు, కవిత్వాలు చదువుకుని, వాళ్ళవాళ్ళ తెలుగు భాషా పాండిత్యాన్నంతా తనివి తీరా ఒలకబోసుకున్నారు. వాళ్ళ తెలుగు మహదానందం అంతా ఇంతా కాదు. ఇక సభలు, సమావేశాలు ముగిసిన తరువాత ఊరెళ్ళిపోతూ మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు. తెలుగుతనం ఉట్టిపడే మల్లెపువ్వు లాంటి తెల్లటి గ్లాస్కోపంచెకట్టు, తెల్లటి ఖద్దరు చొక్కా, భుజంపైన జరీ ఉత్తరీయం, పచ్చని శరీర ఛాయ, నుదుట పొడుగాటి సింధూరనామం, ఒక విధమైన బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ, చూడగానే గౌరవభావం కలిగించే ఆయన వచ్చారంటే చాలు, చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌లో పిల్లలందరూ ఆయన్ని ఆప్యాయంగా 'తెలుగుతాతగారూ' అని పిలుస్తారు. ఆయన చెప్పే వినసొంపైన తెలుగు భాష నేర్చుకోడానికి ఆయన చుట్టూ చేరతారు.

    ఇదంతా చూసి, మా ఇంట్లో కొత్తగా చేరిన మా పనమ్మాయి సీత కూడా దాని కొడుక్కి నాలుగు తెలుగు ముక్కలు నేర్పించమని మా నాన్నగారి దగ్గరకి పంపింపింది.

    మూడు రోజుల తర్వాత  ఇదంతా చూసి, మా ఇంట్లో కొత్తగా చేరిన మా పనమ్మాయి సీత కూడా దాని కొడుక్కి నాలుగు తెలుగు ముక్కలు నేర్పించమని మా నాన్నగారి దగ్గరకి పంపింపింది.

    మూడు రోజుల తర్వాత, పొద్దున్నే ఒక్కసారి దూకుడుగా వచ్చి, నా మీద విరుచుకుపడింది మా పనమ్మాయి సీత.

    'అమ్మ గోరూ! మా పిల్లగాడికి బండనాలిక. ఇంగిలీసైతే ఆడికి నోరు తిరగదని, తెలుగైఏ నేరుచుకోడం తేలికగ వుంటాదని అనుకున్నానమ్మా. అందుకని నాలుగు తెలుగు అచ్చరాలు సెప్పండయ్యా అని మీ నాన్నగోర్నడిగినానమ్మా.  ఆరు తెలుగులో పద్దేలు రాత్తారంట కదమ్మా? అందరూ ఆయనగోరి గురించి మగొప్పగా సెబుతావుంటే, అసుమంటోరి దగ్గరైతే తెలుగు వస్తాదని ఆసె పడ్డానమ్మా. ఏదో కాసింత సదూకుని, ఏ సిన్న బల్లోనో తెలుగు పంతులైనాడంటే ఆడి బతుకు ఆడు బతుకుతాడు గదమ్మా? కాని ఇయ్యేటో సూడండమ్మా. ఈ పుత్తకంలో ఏవో రాసిచ్చి, సదూకుని రమ్మని మావోడితో సెప్పారటమ్మా. ఆడికి అందులోయి ఒక్క మాటా నోరు తిరక్క, మూడు రోజులమట్టి గిరగిరా గింగిరాలు తిరిగిపోతూ, ఎంత నాలిక సుట్ట సుట్టి పలకాలన్నా సేతకాలేదు సరిగదా, ఆడి నాలిక వాచిపోయిందమ్మా. అసలే బక్కోడు. ఇంకా నీరసించి పోనాడమ్మా. మీరన్నా పిలగాడు కొంచెం తేలిగ్గా పలికే మాటలు రాసియ్యండమ్మా' అంటూ మా నాన్నగారు రాసిచ్చిన పుస్తకం నా చేతికిచ్చింది. ఆ పుస్తకంలో మా నాన్నగారు రాసిచ్చిన మాటలేమిటా అని చూసాను. 

విష్వక్సేనుడు
వాజ్ఙయము
శ్రీకృష్ణద్వైపాయనుడు
విఘ్నేశ్వరుడు
భౄగుమహర్షి
ఋష్యశృంగుడు
జ్ఞానోదయము
సత్యహరిశ్చంద్రుడు
శ్రీమహావిష్ణువు
భారతదేశము
మాతృదేవోభవ
పితృదేవోభవ
దేశభాషలందు తెలుగు లెస్స.
.............


    ఆ మాటలు చదివిన నాకే భయమేసి నాన్నని అడిగాను. 'ఏమిటి నాన్నా? ఇంత కష్టమైన పదాలు మనలోనే ఎవరూ పలకలేక పోతున్నారు. పాపం! ఆ పనమ్మాయి కొడుకు ఏం పలుకుతాడు చెప్పండి? ఇంత చాదస్తంగా చెప్పక తేలికపాటి మాటలు నేర్పండి నాన్నా'


    ఆయన మహా తెలుగు పండితులు. ఎక్కడికెళ్ళినా పిల్లలు కనబడితే చదువు చెప్పడం ఆయనకో 'తాపత్రయ సరదా'.


    వాడు టెంత్ చదివాడు కదమ్మా. పూర్వం నాలుగో తరగతి, మూడో తరగతిలోనే ఈ మాటలు డిక్టేషనుగా చెప్పి రాయించేవారు' అన్నారు.

    ఇక ఇది కాదు పనని, ఇంకా చక్కగా అర్థమయ్యేలా చెప్పాలనే సదుద్దేశంతో ఆయన, సీత కొడుకు సూరిగాడ్ని ఇంటికి రప్పించి, కూచోపెట్టి, నాలుగు బిస్కట్లిచ్చి, మంచిమాటలు చెప్పి, బుజ్జగించి, ధైర్యం చెప్పి, వాడిని ప్రోత్సహించి, అక్షరాలన్నీ వర్ణక్రమంతో చెప్పడం మొదలుపెట్టారు.

    'చూడు నాయనా! కకారకారముల క, కకారాకారముల కా, కకారికారముల కి, కకారీకారముల కీ, కకారుకారముల కు, కకారూకారముల కూ, కకారరుకారముల కృ, ........' ఇలా క గుణింతం వర్ణక్రమంలో చెబుతూంటే, వాడింకా బెదిరిపోయి, బిక్కమొహంతో, 'అమ్మా, సూడవే. ఈయనేదో బాసలో నన్ను తిడతావుండారే. నాకీయన దగ్గిర సదువొద్దే అమ్మా' అంటూ ఏడిచేసాడు.

    అప్పటికి సీత పక్కింట్లో పని చేసొస్తానని వెళ్ళిపోబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని దులుపులు దులిపేసేదో!

    అప్పుడు నాన్నగారు మళ్ళీ సూరిగాడిని బుజ్జగించి, మరో నాలుగు బిస్కట్లు వాడి చేతిలో పెట్టి, ఎలాగైనా ప్రాచీన హోదా కలిపించిన మన తెలుగు భాషని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో వర్ణక్రమం మరో పద్ధతిలో చెప్పసాగారు.

    'ఒరే సూరిగా, ఇలాగైతే నీకు తేలిగ్గా తెలుగు వచ్చేస్తుంది చూడు. క కి తలాకట్టిస్తే క, క కి దీర్ఘమిస్తే కా, క కి ఇత్వమిస్తే కి, క కి ఈత్వమిస్తే కీ, క కి గుడిస్తే కు, క కి గుడిదీర్ఘమిస్తే కూ, క కి అరుత్వమిస్తే కృ...'

    సూరిగాడు 'అమ్మోవ్, రావేవ్, ఇప్పుడింకో రకంగా తిడతావుండారే...' అంటు ఆరున్నొక్క రాగం తియ్యడం మొదలు పెట్టేసరికి, నాన్నగారు మళ్ళీ వాడ్ని బుజ్జగించి, మరో నాలుగ్ బిస్కట్లిచ్చారు.

    వాడికి బిస్కట్ల ఆరగింపు అవుతోందే కాని తెలుగు బండి కొంచెం కూడ ముందుకి కదలటంలేదు.

    ఇంక నాన్న గారు విసిగిపోయి, చిన్న చిన్న మాటలు రాసిచ్చి చదవమన్నారు.

    వాడు కళ్ళెముకి కల్లెము అని, పెళ్ళికి పెల్లి అని, వాళ్ళు వెళ్ళారుకి ఆల్లు ఎల్లారు అని, రాధకి రాద అని, బాధకి బాద అని చదువుతుంటే వింటున్న నాకే బాధ కలిగింది. ఇక నాన్నగారు అసలే మహాపండితులు. ఆయన పరిస్థితి ఊహించుకోలేకపోయాను. ఆయన స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు కూడా ఎవరన్నా ఒత్తులు పలకకపోతే, కోపంతో గట్టిగా కేకలేసేసేవారు. మళ్ళీ కోపాన్నణుచుకుని వాళ్ళకి ఓర్పుగా నేర్పేవారు. ఎప్పుడైనా ఒత్తులు లేని తెలుగు భాష వినవలసి వస్తే తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు. ఇంక ఆరోజు భోజనం కూడా చేసేవారు కాదు.

    ఇక మా నాన్నగారు సూరిగాడిలో తెలుగుభాషాభివృద్ధి చేసే ప్రక్రియని పక్కకి పెట్టేసారు. తెలుగుభాష నేర్పాడం ఇంత కష్టమా అనుకుని, ఆ బాధనించి తేరుకోడానికి మా అబ్బాయి మీదే ఆ తెలుగు భాషాప్రయోగం మొదలుపెట్టారు. 

    వాడిదసలే పక్కా ఇంగ్లీషు మీడియం. మనం తెలుగులో మాట్లాడితే, ఇంగ్లీషులో దంచేసి సమాధానం చెప్పే మా సతీష్‌కి ఆయన చెప్పే తెలుగు వర్ణక్రమం, తెలుగు డిక్టేషను, ఒక్కటీ అర్థం కాక, 'మమ్మీ, అదేదో తెలుగు భాషంట. గ్రాండ్‌పా నాకు చెప్పలని చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఆయన చెప్పే ఆ తెలుగేదో నువ్వు నేర్చుకుని నాకు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి చెబితే, అప్ప్పుడు ఆ తెలుగు నేర్చుకుంటాను' అంటూ క్రికెట్ బేటుచ్చుకుని బైటికి తుర్రుమన్నాడు.

    తెలుగు భాషని కూడా ఇంగ్లీషు మీడియంలో చెప్పమనే వాడి అతితెలివికి బాధపడి, నేను ఒక తెలుగు పండితుల కుటుంబంలో పుట్టికూడా, నాకు వచ్చినంత తెలుగు కూడా మా పిల్లలకి రాలేదే అన్న బాధతో, నా చిన్నకూతురుకన్నా మంచి తెలుగు చెబుదామని, ఒత్తులు ఎలా పలకాలో నేర్పడం మొదలుపెట్టాను. మళ్ళీ మా తెలుగునాన్నగారి దగ్గరికి పంపితే ఏవన్నా తేడా వస్తే ఆయన తట్టుకోలేరని.

    నా కూతురు రమ్య పాపం ఒత్తులు బాగానే పలుకుతోంది గాని, పెట్టకూడని వాటికి, ఒత్తులు పెట్టి, పెట్టాల్సిన చోట ఒత్తులు మానేసి చదువుతుంటే, నేను మళ్ళీ సరిచేసి చెబుతుంటే, అదింకా కంగారు పడిపోయి అవసరం వున్నా లేకపోయినా ఏం పోయిందిలే అనుకుందో ఏమో, మొత్తం అన్ని పదాలకీ ఒత్తులు   పెట్టేస్తోంది.

    అనుబంధాలు అని చెబితే అనుభందాలు అంటుంది. 'బ కి కాదమ్మా, ద కి ఒత్తు పెట్టాలి' అని చెబితే కంగారు పడిపోయి అనుభంధాలు అని అంటుంది. ఇంకా రాధభాధ అని భంధువులు అని ఇల్లా మాట్లాడుతుండేసరికి అదేం తెలుగో నేను జీర్ణించుకోలేక పోయాను. ఒత్తులు లేకుండా మాట్లాడే వాళ్ళ తెలుగు కన్నా ఘోరంగా వుందేమో అని సందేహం వచ్చి, మళ్ళీ ఓర్పుతో నా పుత్రికారత్నానికి ఏ అక్షరాలకి ఒత్తులు పెట్టాలో, ఏ అక్షరాలకి ఒత్తులు పెట్టకూడదో విడమర్చి చెప్పడం ప్రారంభించాను.

    'ఈ ఒత్తుల కష్టాల తెలుగు ఛధవఢం నావల్ల ఖాధమ్మా. ఒత్తులు ఫెడిథే ఫెఠ్ఠానంఠావు. ఫెఠకఫోథే ఫెఠలేధంఠావు. అస్సలు నీఖేం థెలీధమ్మా.నువ్వే ముంధర థెలుగుఘు థెలుసుఖో' అంటూ అదేదో లక్షవత్తుల నోములాగ లక్షఒత్తుల తెలుగులో కసిరికొట్టింది నా లక్షఒత్తుల బంగారు చిట్టితల్లి. విస్తుపోయి వీళ్ళకి మంచి తెలుగుభాష ఎల్లా నేర్పాలా అని ఆలోచిస్తున్న నేను ఒక్కసారిగా మళ్ళీ ఉలిక్కిపడ్డాను. 

    ఏం లేదు. మళ్ళీ నా కూతురు వచ్చి, 'ఖావాలిస్తే ఫాడాలని వుందిలో భాలసుభ్రహ్మణ్యంగారిని కూడా అడుగు. నేను తెలుగు ఎంథ భాఘా మాట్లాడుతున్నానో అని మెచ్చుకుంఠారు' అంటూ ఇంకో లక్ష ఒత్తులు నా మొహం మీద గుమ్మరించింది...

    'ఒసేయ్ ఒత్తుల రాక్షసీ! మధ్యలో ఆ మహానుభావుడినెందుకే తీసుకు వస్తావు? నే చెప్పేది నీ కర్థమయి చావదు. నీ వాగుడే నీది' అని విసుక్కున్నాను.

    తెలుగు భాషని అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ స్కూల్లో, పిల్లల్ని వాళ్ళకి తెలిసిన తెలుగులో భావకవిత్వం రాసుకు రమ్మన్నారట.

    రమ్య 'భావా భావా ఫన్నీరు, భావని ఫట్టుకు థన్నేరు' అంటూ గట్టిగా పాడుకుంటూ రాస్తుంటే, 'ఏమిటే రాస్తున్నావు?' అని అడిగారు మా నాన్నగారు.

    'మా తెలుగు మాస్టారు భావకవిత్వం రాసుకు రమ్మన్నారు తాతయ్యా' అనేసరికి భావకవితం మాటటుంచి తెలుగులో తనని తాతయ్యా అని పిలిచే ఆ ఇంపైన పిలుపుకే ఆయన పరవశించిపోయారు.

    ఇంతలో 'మమ్మీ! మమ్మీ! పక్కవాల్లు పెల్లికి వెల్లారు. ఈ తాలాలు నీకిమ్మన్నారు' అంటూ నా సుపుత్రుడు అన్న మాటలకి మళ్ళీ మా తెలుగు పండిత నాన్నగారు 'శివ శివా, శివ శివా!' అనుకుంటూ చెవులు మూసుకున్నా కూడా, టి.వి.లో వస్తున్న ఏదో లైవ్ ప్రోగ్రాంలో ఏంకర్ మాటలు ఆయన చెవుల్లో పడనే పడ్డాయి.

    'మీ కల్లు చాలా బాగున్నాయండి... మీ పెల్లి ఎప్పుడు జరిగిందండి?...' ఇలా ళ కి బదులు ల పలుకుతూ ఆ ఏంకర్ ఇంటర్వ్యూ చేసుంటే, 'ఏమిటే అమ్మాయ్? ఆ మధ్య ఋ అక్షరం నిషేధించినట్టు, ఇప్పుడు ళ అనే అక్షరాన్ని కూడా నిషేధించారా ఏమిటే?' అని అడిగారు.

    'అవునూ. ళ అనే అక్షరం ఎందుకు పలకలేక పోతున్నారో, ళ కి బదులు ల ఎందుకు పలుకుతున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అందులో ఒత్తు ఏంలేదు కదా! పలకలేక పోవడానికి అదేమన్నా బ్రహ్మవిద్యా? ప్చ్! ఏమిటో... ఈనాడీ తెలుగు కష్టాలు!' అంటూ ఓ పక్క నేను బాధ పడుతుంటే, 'ఆంటీ, ఆంటీ! మా ఇంట్లో ఇవాల మంచినీల్లు రాలేదు. మా మమ్మీ ఈ జగ్గుతో నీల్లిమ్మంది' అంటూ ఎదురింటి వాళ్ళమ్మాయి వచ్చి నీళ్ళు తీసికెళ్ళింది.

    ఇంతలో 'అంకుల్, అంకుల్! ఒకసారి ఈనాడు పేపరివ్వరా? మా పేపరువాడు వర్షంలో విసిరేసాడు' అంటూ పైవాటా వాళ్ళ ఇరవై ఏళ్ళబ్బాయి సాక్షాత్తూ మా నాన్నగార్నే అడిగేసరికి ఆయన మొహం చూడలేక సిగ్గుతో తలొంచుకున్నాను. మా ఇంటికొచ్చినందుకు ఆయనకిష్టం లేని పిలుపులతో, తెలుగు భాషకి పట్టిన దురవస్థకి ఆయనకి కలిగిన మనస్తాపానికి బాధ కలిగింది.

    ఇంతలో పుండు మీద కారం జల్లినట్లు టి.వి.లో వచ్చే తెలుగు వంటల కార్యక్రమంలో మిల్క్ బ్రేక్ చేసి షుగర్ సిరప్‌లో కలపాలని, ఆంగ్లపదాలు కూడా కలుపుతూ చెబుతుంటే ఛానెల్ మార్చేసాను. అక్కడా ఒక పాటల కార్యక్రమంలో 'రాదకు నీవేర ప్రాణం, రాదా హృదయం, మాదవ నిలయం' అంటూ ఒకమ్మాయి పాడుతుంటే, మా నాన్నగారి చెవుల్లో పడకుండా గమ్మున టి.వి.కట్టేసాను.

    'అమ్మని మమ్మీ అని పిలవాల్సొస్తుందని, నాన్నని డాడీ అనాల్సొస్తుందని, తాతని, అమ్మమ్మని గ్రాండ్‌పా అనీ, గ్రానీ అనీ అనాల్సొస్తుందని, పొర్గువాళ్ళని ఆంటీ అని, అంకుల్ అని పిలుస్తారని కలలో కూడా అనుకోలేదే అమ్మాయ్! వీరబ్రహ్మంగారు ఈ విషయం చెప్పిన గుర్తు లేదు. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించారు. బాగానే వుంది. కాని తెలుగు భాషకున్న ప్రాచీన వైభవాన్ని తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నాలు ఏ ఒక్కరైనా చేస్తున్నారా? ఒత్తులు పలకక్కర్లేదన్న విపరీత సిద్ధాంతులు ఈ కాలంలో తయారవుతున్నారు. తెలుగులో 'కళ' అన్న మాట వుంది. 'కల' అన్న మాట కూడా వుంది. 'పథము' అన్న మాట వుంది. 'పదము' అన్న మాటా వుంది. దేని అర్థం దానికి వుంది. ఒత్తులు అవసరం లేదని, 'కళ'కి 'కల' అని పలికి, 'పథము'కి బదులు 'పదము' అని పలికి, 'కళ్ళు'కి 'కల్లు' అని పలికినా, 'భూతేశ్వరుడు'కి 'బూతేశ్వరుడు' అని పలికినా విపరీతార్థాలు వస్తాయి. కులమతాల కతీతంగా ఆనాటి రంగస్థల, చలనచిత్ర నటీనటులందరూ ఉచ్చారణతో సహా అన్నిటిలోను విశిష్టమైన కృషి చేసి, ఒక బంగారు శకాన్ని స్థాపించారు. కన్నాంబ గారు కాని, రఘురామయ్య గారు కాని, రేలంగి వెంకట్రామయ్య గారు కాని, ఎవరైనా వేలెత్తి చూపడానికి వీల్లేనంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అజరామరులై నిలిచారు. ఇప్పుడూ భాష పలకలేని వరు ఉత్తమ నటీనటులుగా సన్మానాలందుకుంటున్నారు. ఎక్కడో బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి వారు తప్ప, ఈ విషయాన్నెవరూ పట్టించుకోవట్లేదు. అందుకే తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే అసలు ప్రాథమిక స్థాయి నుంచే, అక్షరాలు, గుణింతాలుతో సహా సక్రమంగా పిల్లలకి నేర్పాలి. సరే, కవితా గోష్టులూ అవీ అయిపోయాయి కదా, నే వెళ్ళొస్తానే అమ్మడూ. సంక్రాంతి పండక్కి నువ్వు, అల్లుడూ, పిల్లలూ తప్పకుండా రండి. అప్పటికి మన ఆవు కూడా ఈనుతుంది. అల్లుడు గారికి జున్ను చాలా ఇష్టం. క్యాంపుకెళ్ళారు చెబుదామంటే. వచ్చాక చెప్పు. అన్నట్టు, సూరిగాడిని కూడా తీసుకురా. స్థిమితంగా వాడికి తెలుగు వచ్చేలా చెప్పడానికి ప్రయత్నిన్స్తాను. అమెరికా నించి మీ అన్నయ్య, వదిన, కూతురు సౌజన్య కూడా వస్తున్నారు. అదక్కడ గురుకులం పెట్టి పిల్లలందరికి ఆదివారాల్లో తెలుగు చాలా బాగా నేర్పుతోందట' అంటూ మా నాన్నగారి వెళ్ళబోతుంటే, 'తాతయ్యా, నేను కూడా వస్తానం'టూ రమ్య కూడా వెంటపడుతుంటే, 'వద్దమ్మా! నీకు బడి పోతుంది. శలవులు రాగానే మనమందరం వెడతాంగా' అంటూ ఆపాను.

    అపార్టుమెంట్‌లో పిల్లలందరూ, 'తెలుగుతాత గారూ! మీరిక్కడే వుండిపోండి. మేమంతా ఎంచక్కగా మీ దగ్గిర తెలుగు నేర్చుకుంటాం' అన్నారు.

    మా నాన్నగారు సంతోషంగా వాళ్ళందరినీ ముద్దులాడి, 'అమ్మడూ, వీళ్ళందరి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటగా వుంది. ఈ విషయమేమిటో నువ్వే ఆలోచించు' అంటూ ఆటో ఎక్కారు.

    ఇంతలో మా పనమ్మాయి సీత, దాని కొడుకు సూరిగాడు ఇద్దరూ సంతోషంగా వచ్చారు. వాళ్ళ సంతోషానికి కారణం ఏమిటని అడిగితే, అది చెప్పిన వాళ్ళ సంతోషకరమైన వార్తకి ఎప్పటికీ తీరని ఆవేదనతో 'శివ శివా; శివ శివా' అని ఈసారి నా చెవులే మూసుకున్నాను. వాళ్ళ సంతోషకరమైన వార్త మా తెలుగు పండిత నాన్నగారి చెవుల్లో పడకుండా, ఆటోలో జస్ట్ అప్పుడే వెళ్ళిపోయినందుకు అమ్మయ్య అనుకుని సంతోషించాను. 

    దేశ భాషలందు తెలుగు లెస్స అని, టెల్గూ ఈజ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని గొప్పగా చెప్పుకునే ఓ తెలుగు మహాజనులారా! సీతకి, సూరిగాడికి సంతోషకరమైన వార్త, నాకు బాధ కల్గించిన వార్త ఏమిటో వినాలనుకుంటున్నారా? చెబుతాను. సహనంతో వినండి.

    'కొత్తగా పెట్టిన అదేదో కానమెంటులో నా కొడుక్కి ఉద్దోగమొచ్చినాదమ్మా. ఎలకేజీ పిల్లలకి తెలుగు అచ్చరాలు నేర్పే ఉద్దోగం. నెలకి నాలుగొందలిత్తారమ్మా' అంటూ చెబుతుంటే, టెన్త్ ఫెయిలయిన తెలుగు తెలీని ఈ సూరిగాడికి తెలుగు టీచరుద్యోగమా?.. అని నేను లోపల్లోపల బాధపడుతూంటే, సూరిగాడు గర్వంగా అంటున్న మాటలేవో నా చెవుల్లో పడుతున్నాయి.

    '... బావం ముక్కెం కాని బాస ముక్కెం కాదమ్మా. బావాలు సెప్పుకోడానికే బాస పుట్టింది. అందువల్ల బాస ఎలా వుంది అన్నది కాదు సమస్స. మన బావం అవతలోల్లకి సరిగా తెలుత్తోందా లేదా అన్నదే పాయింటు. మీ పండిత నాన్నగోరు సెప్పినట్టు మాతురుదేవోబ అనే అనక్కర్లేదు. ఓ యమ్మా, నీకు నా దండాలే అన్నా సాలు, సరిపోద్ది...'

    వాడు మూర్ఖంగా ఇంకా ఏదో మాట్లాడుతూంటే, నేను సమాధానం చెప్పలేక మనసులోనే బాధ పడ్డాను. 'అవున్నాయనా! భావాలు చెప్పుకోడానికి అసలు భాష కూడా అక్కర్లేదు. సైగలు చాలు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో వున్న మన తెలుగువారు, తమ పిల్లలకి తెలుగు ఎక్కడ రాకుండా పోతుందో అన్న బాధతో, గురుకులాలు, తెలుగుబడులు పెట్టుకుని తెలుగు నేర్చుకుంటున్నారు. అటువంటిది, మనం ఆంధ్రదేశంలో వుంటూ కూడా మన పిల్లలకి సరైన తెలుగు నేర్పలేక పోతున్నాం. 'అమ్మ, నాన్న'లాంటి కమ్మని పదాలు వదిలేసి, మామీ, డాడీల సంస్కృతిలోకి దిగజారి పోయాం. ఆఖరికి రోడ్డు మీద బిచ్చగాళ్ళు కూడా 'అంకుల్! ఒక్క రూపాయి ఇవ్వరూ?' అని, 'ఆంటీ! రెండు రూపాయలివ్వరూ' అని అడుక్కుంటున్నారు. లాభం లేదు. నేనైనా నావంతు బాధ్యతగా ఏమైనా చెయ్యాలి. రేపటినుంచి కనీసం ఈ అపార్టుమెంట్‌లోని పిల్లలకయినా నాన్నగారు చెప్పినట్లు రోజూ సాయంత్రం స్వచ్ఛందంగా తెలుగు నేర్పడానికి ప్రయత్నం చేస్తాను' అని మనసులోనే నిశ్చయించుకుని, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.  
Comments