ప్రారబ్ధోత్సవం - ఇచ్ఛాపురపు రామచంద్రం

    
పల్లెల నుంచి పట్నాలకు భాగ్యవంతులైపోదామని కొందరొస్తే... బతుకు గడుస్తుందేమో అనే ఆశతో ఎందరో వస్తారు. అలాంటి 'ఎందరో'లో - 'ఎ' బార్బర్ దుర్గారావు. అతను పుట్టిందీ, పెరిగిందీ పల్లెలోనే. ఏడో తరగతి వరకూ చదువుకున్నాడు. అప్పటికతనికి పధ్నాలుగు నిండాయి. అప్పుడే అతనికి తండ్రి హితబోధ చేశాడు. "చూడు కొడకా! నోట్లో ఎన్నచ్చరాలున్నా అవి కడుపులో ఆకలిని తీర్చవు. చేతిలోని పనే పొట్ట నింపుతుంది. కులవృత్తికి సాటి రావు గువ్వల చెన్నా... అని ఊరికే అనలేదు. ఆపైన నీ యిష్టం."

    దుర్గారావు చదువు పెద్దల నెదిరించేది కాని, కులవృత్తిని కించపరిచేది కాని కాకపోవడంతో వెంటనే చదువుకి సలాం కొట్టి తండ్రి శిక్షణలోనే వృత్తి చేపట్టాడు. పని బాగానే అలవడింది. రోజులు బాగానే వెళ్ళసాగాయి. ఒక తెలుగు పండితుడికి దినం విడిచి దినం గెడ్డం గీస్తూ ఆయన మాటలు వింటూండడం వల్ల పాండిత్యమే అనిపించేంత తెలుగు భాష అంటింది. అలాగే వయసు వల్ల పెళ్ళి. పెళ్ళి వలన పెండ్లామూ, ఆమె వలన బిడ్డలూ కూడా అంటారతనికి. అప్పటినుంచి సమస్యలూ అంటసాగాయి. తండ్రి చనిపోయాడు. పల్లెలో క్షుర వృత్తికి గౌరవంతో పాటే ఆదాయం కూడా పడిపోయింది. ఫ్యాషన్ పేరిట పల్లెల యువకులు పట్నం వెళ్ళి 'కటింగ్' చేయించుకుసాగారు. సంసార భారం పెరిగి ఆదాయం తగ్గుతూండడంతో యిక అక్కడ బతుకు గడపడం కష్టమైపోయింది. తన నైపుణ్యం మీద విశ్వాసాన్ని, ఆశనీ, ధైర్యాన్నీ, అప్పు తెచ్చిన కొంత డబ్బునీ పట్టుకొని పట్నమొచ్చాడు. అతనికి పట్నం పోకడలు కొన్ని తెలుసు.

    బ్రోతల్‌హవుసుకి తప్ప మరి దేనికైనా బోర్డులేనిదే బిజినెస్సు ఉండదని - తను పెట్టబోయే షాపుకి బోర్డు రాయిద్దామని సదరు కళాప్రవీణుడి వద్దకు వెళ్ళాడు. అతగాడికేమో వినూత్న ప్రయోగాలు చేయడం విపరీతమైన సరదా. దుర్గారావ్ మంచితనాన్ని గ్రహించి అమాయకపు నిర్మాత దొరికిన అవార్డు సినిమా దర్శకుడిలా ఆనందించి, ప్రయోగాలు చేయడమనే తన సరదాను తీర్చుకునేందుకు సువర్ణావకాశం లభించిందన్న సంబరంలో విజృంభించేసాడు.

    "నీ షాపు పేరు నేను పెడతాను. బోర్డు నేను డీజైన్ చేస్తాను. సగం రేటుకే పూర్తి పని. 'ఇచ్చట మీ తల అందంగా కోయబడును' ఆర్టిస్టిక్ అక్షరాలతో. వీటి కింద కటింగ్ చేయించుకుంటున్న కళ్యాణ్, పవన్ కళ్యాణ్. బస్ నీ షాపు సూపరు డూపరు హిట్టే. ఓపనింగ్ అదిరిపోద్ది. శతదినోత్సవం మినిమమ్ గ్యారంటీ." వంద రూపాయలు లాగేసుకున్నాడు. మందు అతన్నే కొట్ట సాగాక... నీ పేరు... నీ షాపు పేరు... బరబరా" చెప్పేసాడు.

    "బర్‌బరా! అదేం పేరు? గొర్‌గొరా అని పేరుపెట్టినా కొంత అర్థముంటుంది తలగొరుగుతాను కనుక" అని నోరు విప్పాడు దుర్గారావ్. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి మీద ఉపన్యాసానికి లంకించుకోవడానికి ఆర్టిస్టుకి అవకాశం వచ్చేసింది. "రోజులెలా ఉన్నాయి. పబ్లిక్ పల్స్ ఎలా ఉంది. కంఠం బాగుండని వాడికే డిమాండ్. పందుల్ని పొడిచే వాడిలా ఉంటేనే హీరో రోల్. అలాగే గమ్మత్తుగా అర్థం లేకుండా ఉంటేనే మోడ్రనూ, పాపులరూ."

    సరే రోట్లో తలదూర్చాక రోకటిపోటుకి వెరవడమెందుకులే అని ఆర్టిష్టుకొక దణ్నం పెట్టేసి వెనుదిరిగేసరికి "ఆగు!" అని ఆరు సార్లు గద్దింపులు - ఆరు గొంతులతో. వాళ్ళారుగురూ గుండాల్లాగో, ముదురు రాజకీయ నాయకుల్లాగో, సినిమా హిరోల్లాగో క్రూరంగా ఉన్నారు తప్ప మామూలు మనుషుల్లా లేరు. వీళ్లారుగురి జుత్తులు కూడా కత్తులకో, కఠారులకో తప్ప కత్తిరికి లొంగేటట్లెంత మాత్రమూ లేవు. వాళ్ళకి తనతో పనేమిటా అని తెల్లమొహం వేసి చూశాడు దుర్గారావ్.

    "నువ్వు - హెయిర్‌కటింగ్ సెలూన్ పెట్టాలనుకుంటున్నావా?" ఆరుగురిలో ఒకడడిగాడు. "ఔను" అన్నాడు అతను నేరమేమిటో తెలియకుండానే ఒప్పేసుకుంటున్నట్లు. "నీషాపుకి ప్రారంభోత్సవం ఎవరిచేత చేయించుకున్నావ్" ఆకారం భీకరమే కాని కంఠం చుంచెలుకలా కీచుమంది.

    ఆ ప్రశ్నకే ఆశ్చర్యపడిపోయి "నాది- హెయిర్ కటింగ్ సెలూన్ కాదండి. చిన్న బడ్డీ. దానికోపెనింగూ క్లోజింగు ఉత్సవం కూడానా!" నవ్వేశాడు. "అలా వీల్లేదు. చిన్నదైనా పెద్దదైనా షాపుషాపే. దానికి ప్రారంభోత్సవం ఉండి తీరాల్సిందే" బొంగురుగొంతుతో చెప్పాడు నంబర్ త్రి.

    "అది మా మంత్రిగారే చెయ్యాల్సిందే" నంబర్ ఫోర్ శాసించాడు.

    "తమలాటి వారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమేసినట్లు నాలాటోడి మీద జోకు వేయకూడదండి పరువుపోద్ది. మంగలిషాపుకి మంత్రిగారు ప్రారంభోత్సవం చేత్తారంటే నమ్మేసేంత అమాయకుణ్ణి కాదు."
    "అమాయకుడివో, మాయకుడివో మాకనవసరం. మా మంత్రిగారొచ్చి నీ షాపు తెరిచేవరకూ నువ్వెమీ చెయ్యకూడదు." కబడ్దార్ అన్నట్లు బెదిరించాడు నంబర్ ఫైవ్. మంత్రీ మంగలీ యిద్దరికిద్దరూ ప్రజలకు చేసేది తిరుక్షవరమే కనుక వారిద్దరినీ ఒక రాటకి కట్టినా అవమానమూ అన్యాయమూ జరిగిపోవు. కాని రాజధాని కాక ఒక మామూలు పట్నంలో... అతి మామూలు షాపు తాడు తెంపడానికి మంత్రి గారొచ్చారంటే మాత్రం రాజకీయ మంత్రులకు పన్లేదనుకోవాల్సివొస్తుంది.

    అంతట మళ్ళీ ఆగూండాలు "జ్ఞాపకముంది కదా మేం చెప్పింది? మా మంత్రిగారిని కాదని షాపు తెరిచావో నీకీ వూళ్లో నీళ్ళుండవు."
    "బాబూ కత్తెరాడితే కానీ కడుపు నిండని బతుకు." ఏదో చెప్పుకోబోయాడు. వాళ్లు అతని మొర వినిపించుకోలేదు. దుర్గారావుకి కోపం వచ్చింది. పేదవాని కోపం పెదవికి చేటని మరిచిపోయాడు. తన షాపుని తానే తెరుచుకోవాలనే తన కోరికను కాదనడానికీ, అడ్డుపడడానికీ ఈ రాజకీయ సైంధవులకు హక్కెక్కడ వుంది? భారత రాజ్యాంగంలో ఎన్నో స్వాతంత్ర్యాలూ, ప్రాథమిక హక్కులూ ఉన్నాయంటారే మరి తను అప్పుచేసి కష్టపడి కట్టుకున్న బడ్డీని తన చేతులారా ప్రారంభించుకునే హక్కులేదా. ఏ ప్లీడరునో అడిగితే చెబుతాడు కాని వద్దు ఇప్పటికే తిరుగుడు కుర్చీకి, అద్దాలకూ వాటికీ తడిసి మోపెడయింది. ఆ దుష్టులు తనని వినిపించుకో స్థితిలో లేరు. (సినీ)స్టారునీ, (మిని)స్టరునీ ఆహ్వానించే వారింకొకరి మాట వినరు కదా? పిలిచేవారికి బుద్ధి లేకపోతే వచ్చేవారికైనా ఉండొచ్చుగా? నలుగురూ నవ్వుతారని మంత్రిగారే రాకుండా ఉంటారేమో? అనే ఆశతో తన బడ్డీ పనులు చూ(చే)సుకోసాగాడు.

    కానీ...చోటా రాజకీయ నాయకులు వెళ్ళి ఆహ్వానించేసరికి ఠక్కున ఒప్పేసుకున్నారు మంత్రిగారు. ఆయన మూడు రోజులై దండకావరం(మెడలో దండ పడక కలిగే బాధ)తో సఫరవుతున్నారు. ఒక్క తాడూ తెంపక వేళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. ఒక్క స్పీచీ లేక నాలిక వాచిపోతూంది. వేదికెక్కక కాళ్లు గుదులు పట్టేశాయి. ఆ ఉదయమే ఆపదల మొక్కువాడికి మొక్కుకున్నారు, తన కష్టం గట్టెక్కిస్తే కొండకొస్తానని. మొక్కుకున్నాకే టిఫిన్ మెక్కారు. నేనున్నానంటూ దేముడు ప్రారంభోత్సవాదృష్టాన్ని ప్రసాదించాడు.

    ఆవురావురుమంటూ గోడమీంచి పడే పులి విస్తరాకు కిందపడే వరకు కూడా ఆగలేక మధ్యలోనే అందుకున్న ఆకలి ముష్టాడిలా ప్రారంభోత్సవ సమయం కంటే తనే ముందు వచ్చేసాడు మంత్రి. అమాత్యులవారి ఆగమనం అంటే ఊరంతా అస్తవ్యస్తం కదా. రోడ్ల ప్రక్క బళ్ళ బతుకుల వాళ్ళకి, ముష్టి వాళ్ళకీ ఆవేళ పస్తే కదా? రోడ్ల నిండా పోలీసులూ, పొలిటికల్ పీపులూ, ట్రాఫిక్‌కి పక్కదారులూ. బర్‌బరా షాపుకి ముందరి రోడ్డు మంత్రిగారూ...వారి పార్టీ వారూ...వారూ,వారి గ్రూపు వారూ...మనిషికొక పలావ్ ప్యాకెట్ ఎర చూపి ఎమ్మెల్యే తరలించుకొచ్చిన వారితో ఆ రోడ్డు బందయింది. ఇతరులకు ఆ రోడ్డుని తాత్కాలికంగా మూసేశారు. ఊళ్ళోపెళ్ళి కుక్కలకి హడావిడి, గాడిద గానంకి ఒంటె నాట్యం అన్నట్లు మంత్రిగారి రాకకు మహా హడావిడి చేస్తున్నాయి ఎర్రబుట్టలూ, కాకీ బట్టలూ.

    ఈ సందడిలో దూరంగా తోసివేయబడ్డ దుర్గారావ్ మతిపోయి, చేష్టలుడిగి, నిశ్చేష్ట ప్రేక్షకుడిగా చూడసాగాడు. అతనికి కోపంగా ఉందీ తతంగం. చాకలి పెళ్ళానికి మంగలి విడాకులియ్యడమంతే ఇదేనేమో. బడ్డీ యజమాని తను. తను అడక్కుండానే వచ్చేసాడు మంత్రి తగుదునమ్మా అంటూ. అసలు మంత్రికీ యిలాంటి ప్రారంభోత్సవాలకీ సంబంధమేమిటి? రేపీ మంత్రులు మరీ పేట్రేగిపోయి ప్రారంభోత్సవ హక్కులమీద పేటెంటు కొట్టేసి - శోభనాలకి కూడా తయారైపోవచ్చుననే ప్రమాదాన్ని ప్రజలెందుకు పసికట్టరో? సొమ్మొకడిది - సోకొకడిది. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవవడం అంటే యిది కాక యింకేమిటి. రాజ్యం వీర భోజ్యం అన్నారు కాని, ప్రారంభం మంత్రి భోజ్యం అనలేదే. ఈ ప్రజలు గొర్రెలైనంత సేపూ ప్రారంభోత్సవం చేసే మంత్రి గురించే తప్ప యీ బడ్డీ నిర్మాణానికి అప్పులూ, చెమటా ఓడ్చిన కూలీ ఎవ్వడని ఆలోచించరేం? కూల్ డ్రింక్ దుర్గారావ్‌కి రాలేదు. కనుక అతని క్రోథం కొంచెమైనా చల్లారలేదు.

    కార్యక్రమం పీలిక పుటుక్కు (మంత్రిగారు తెలుగు ప్రియులు ఎందుకంటే ఆ బాసొక్కటే ఆయనకర్థమౌతుంది. అంచేత రిబ్బన్ కటింగ్ అనే ఆంగ్ల పదం అసందర్భమే ఔతుంది)దగ్గరకొచ్చింది. ఎవరో వెండి కత్తెరందించారు. మళ్లీ దుర్గారావ్‌లో సందేహం లాంటి వొళ్ళుమంట. ప్రారంభోత్సవం...రిబ్బన్ కటింగనగానే వెండి కత్తెరలే ఎందుకు తయారవుతాయి? నిజానికవి బాగా తెగనే తెగవు. కనీసం మంగలి షాపుల ప్రారంభానికైనా మంత్రులు ఇనుపకత్తెరలు వాడడం న్యాయంగా ఉంటుంది.

    ఆ కోత ఐపోయాక ఆ వెండి కత్తెరని షాపు యజమానయిన తనకివ్వక మంత్రిగారే జేబులో వేసేసుకోవడం దుర్గారావ్‌ని మనసులో మరో కనకదుర్గనే చేసి వొదిలింది.

    వారి కార్యకర్తలూ ఎమ్మెల్యేలూ...దండలతోనూ...పొగడ్తలతోనూ ముంచెత్తేసారు. మంత్రిగారూ మహోత్సాహంగానూ, మహోద్రేకంగానూ (సెక్రటరీ రాసిచ్చిన) మాటలాడడం మొదలు పెట్టారు మైకుని రేప్ చేస్తున్నట్లే. మైరావణుడై తన ముందుకి లాక్కుని అది ఆర్తనాదం చేసినా కేర్ చెయ్యకుండానూ, కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం మరికొంత అన్నట్లు తన మాటలు కూడా జోడించి ఉపన్యసించసాగారు. "నా అశేషాభిమానులారా! మాతృ, పితృ, అత్త, మామ, సోదర, సోదరీ, పిల్లల మణులారా! మీ అందరికీ వందేసి వందనాలు. ఈ బర్‌బరా బార్బర్ షాపుని ప్రారంభించుచున్న నేడు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సుదినము..." పెయిడ్ చప్పట్లు. పీలిక తెంపరి(రిబ్బన్ కటర్)లో ఉత్సాహం. స్వాతంత్ర్య సమరయోధులూ, ప్రఖ్యాత కవీ అయిన గురజాడ అప్పారావ్‌గారు స్త్రీ అంటే పిడికెడు జుత్తూ కడివెడు కన్నీళ్లూ అన్నారు." దుర్గారావ్ హాహాకారం.

    "కాని కాలము మారెను. నేటి మన యువతీయువకులు ఫ్యాషన్ పేరిట, జుత్తూ, గిరిజాలూ పెంచుకొనుచున్నారు. ఇది మన సంప్రదాయమెంతమాత్రము కాదని తెలుపుటకు ఎంతో సంతోషించుచున్నాను. పెరిగిన జుత్తునెప్పటికప్పుడు కోయించుచూ నూనె, కుంకుడు కాయల ఖర్చుని ఆదా చేసి జాతీయ సంపదను పెంచనూవచ్చును. క్షురకులకు పని కల్పించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించనూ వచ్చును. కనుక నిజమయిన దేశభక్తి పరాయణులు ప్రతిదినమూ క్షురకర్మ్ గావించుకొనవలెను."

    "జుత్తు వొత్తుగా పెరిగిపోయినచో మెదడుకు గాలి తగలక మనిషికి చికాకు, చుండ్రు మొదలైనవి కలుగును. కేశములు క్లేశములే" ఏకబిగిన నిమిషం పాటు చప్పట్లు ఊళలు.

    "మానవ దేహం పాలిట వైద్యుడెటులనో మానవ కేశముల పట్ల క్షురకుడటుల. ఆహా క్షురకుడు వైద్యుడి కంటే ఎక్కువ. వైద్యుడు దుష్టాంగంబునూ, క్షురకుడు దుష్టకేశములనూ ఖండించు కత్తి పనివారే అయిననూ, వీరు గోళ్లు కత్తిరించుట, వొళ్లు పట్టుట, తలంటు పోయుట వంటి అదనపు పనులు కూడా చేస్తారు కదా? అందుకని వీరు బ్రాహ్మణుల కంటే అధికులు. కనుకనే నాయీ బ్రాహ్మణులనబడుచున్నారు. వీరు సర్వాంతర్యాములు. రోడ్డుపక్కన...కాలువ గట్టున చెట్టుకింద షాపులో బడ్డీలో ఎ.సి.సెలూన్‌లో...యిళ్ళలో ఎక్కడైననూ ఎవరికైననూ తమ సేవలందిస్తూనే ఉందురు. శుభాశుభములు రెండింటి యెడలా నాయీబ్రాహ్మణులు వేదాంతులూ, విరాగులూ. ఎలాగంటే కాలిగోళ్లు తీయుట, మంగళస్నానము చేయించుట మొదలగునవి వివాహసందర్భములలో చేయుదురు. మాతాపితృలను పోగొట్టుకున్న పుత్రులకు స్మశానములో శిరోముండనము చేతురు"... పులావ్ చప్పట్లు..."సంచార క్షురశాలలు సరేసరి." ఒకసారి ఊపిరి తీసుకొని మళ్లీ సాగించారు.

    "కాలము విలువ వీరికి తెలిసినట్లు వేరొకరికి తెలియదనిన అతిశయోక్తి కాదు. ఉదయమంతయూ క్షుర వృత్తి చేసి మధ్యాహ్నము వీరు డోలు, సన్నాయి బ్యాండు మొదలగు వాటిపై సంగీత సాధన గావిస్తారు. రాజకుమారుల వలె దుస్తులు ధరించి వాద్యములు వాయిస్తూ వధూవరుల నూరేగించుచూ నడుచు బ్యాండుమేళము ఒక వంక వీనులవిందు మరొక ప్రక్క కనుల విందూ కదా?" "ఔను..." అంటూ అరుపులు... "వేయేల? సుకంసాలి, సుబ్రాహ్మణుడు అను పదములు లేవు. కాని సుమంగళి అను పదం కలదు. ఒకప్పటి 'ళ' కాలక్రమంలో 'ల' అయింది. కనుక సుమంగళమనగా మంచి మంగలని. 'ళ''ల'లు ఒకదాని బదులొకటి వొచ్చాయంతే. వీరు వాయించేవి కనుకనే మంగళ వాయిద్యా లనిపించుకున్నాయి. అంతెందుకు? బ్రాహ్మణవారమని కాని...కోమటి వారమని కాని రాజ వారమని కాని లేవు. కానీ...క్షురకుల పేరిట మంగళ వారమని ఉందంటే వీరి గొప్పతనం ఎంతదో ఆలోచించండి. మాంగల్యం తంతునానేన అన్నారు కాని బ్రాహ్మణ్యం తంతునానేన అనలేదు. వీరు కేశఖండనము గావించిన కాని వేంకటేశ్వరుడు దర్శనమివ్వడు. అంటే ముందు క్షురకుడు, తరువాత వేంకటేశ్వరుడు అనేకదా? కాలిలో ముల్లుకుచ్చుకున్ననూ వీరే, కళావంతులు కావాలన్ననూ వీరే..."

    "కళావంతులు కారు, కళాకారులు..."అని జనం లోంచి అరవబోయారు. కాని అప్పటికే.....

    "...క్షురకులు నా ఆరాధ్యదైవాలు. క్షవరశాలలు నా దేవాలయాలు. మన దేశం సుభిక్షంగా ఉండాలంటే, యింటికొక క్షురకుడు వీధికొక క్షవరశాల ఉండాలని నా ఉద్దేశ్యం. ప్రజలవద్దకు క్షవరమనే పథకం తొందరలో ప్రవేశ పెడతానని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. ఏ దేశంలో క్షురకులూ, క్షవరశాలలూ అధికంగా ఉంటాయో ఆ దేశమే నిజమైన పురోభివృద్ధి సాధించినట్లు..."కూల్డ్రింక్ చప్పట్లు, పులావ్ చప్పట్లు, డబ్బుల చప్పట్లు, ఆపేయమని చప్పట్లు. ఉపన్యాసం ముగించి "ఈ...నేను ప్రారంభించిన షాపుకి మొదటి బేరగాడుగా ఎమ్మెల్యే ఏడుకొండలు గారు..." అంటూ ప్రకటించారు మంత్రిగారు.
    ఎమ్మెల్యే గారికి ఉపన్యాసావకాశం లేదు. అప్పుడొచ్చింది ఆ బడ్డీ యజమాని గురించి ప్రశ్న. దుర్గారావ్ షాపులోకి తీసుకురాబడ్డాడు. ఎమ్మెల్యే తిరుగుడు కుర్చీలో కూర్చున్నాడు. కెమేరాలు...వార్తాపత్రికా విలేకర్లు...
    ఎమ్మెల్యేకాక ముందు ఏ వెధవ పనులుచేసి...మళ్లీ మొలవకుండా ప్రజలచేత నెత్తి మీద జుత్తు పీకించేసుకున్నాడో కాని ఆయన బుర్ర బోర్లించిన ఇత్తడి చెంబులాగే ఉంది అచ్చంగా. ఎమ్మెల్యేకి ఎక్కడ క్షవరం చేయాలో తోచక కంగారుపడిపోతూ మనసులో మాట బయటకు అనేసాడు దుర్గారావ్. "మంగలి షాపుకి మంత్రిగారి ప్రారంభోత్సవం. మరి మరుగుదొడ్డికి మీరొచ్చి తాడు కోస్తారా?" ఎమ్మెల్యే అంగీకార సూచకంగా నవ్వునవ్వాడు అతనేమడిగాడో తెలియకుండానే. ఎమ్మెల్యేకి బట్టతలేకాక బ్రహ్మ చెముడు కూడా ఉండడం వలన దుర్గారావ్ క్షెమంగా మిగిలాడు.

[మనవి: ఈ రచనలో తప్పనిసరయి కులాల పేర్లు ప్రస్తావించవలసి వచ్చినందుకు రచయిత క్షమార్హుడు]
(మానస మాసపత్రిక నవంబరు 2000 సంచికలో ప్రచురితం)
Comments