ప్రవాహం తిరోగమించదు - నల్లూరి రుక్మిణి

    తన ఛాంబర్‌లో అంతక్రితం కాకినాడ పోయివచ్చిన రిపోర్టు ఫైనల్ చేస్తోంది. ఆ వారం 'ప్రజాపక్షం'లో చూపించాల్సిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ సరిచూసుకుంటూ... కాకినాడ రైతులతో సంభాషణ గుర్తు చేసుకుంటోంది. 'ఎంత కోపం. ఎంత దుఃఖం... భూములు అన్యాయంగా లాక్కున్నారని ఎంత బాధ; రైతుల మాటలు, వాళ్ళ మొహాలు తలచుకుంటోంది.

    ఇంతలో ఛాంబర్ దగ్గరకొచ్చి 'మేడమ్ సార్ పిలుస్తున్నార'ని అటెండర్ చెప్పాడు. 'మళ్ళీ ఏం పని వచ్చిందో!' అనుకుంటూ, బరువుగా లేచి అటు కదిలింది.

    సుజాత కొద్దిగా లావుగా ఉండటంతో పొట్టిగా అన్పిస్తుంది. చామనఛాయగా ఉండి సాదాసీదాగా అనిపిస్తుంది. టి.వి.యాంకర్స్‌కుండాల్సిన ఫిగర్ కాకపోవడంతో ఆమె 'ప్రజాపక్షం' వీక్లీ రివ్యూకి ఇన్‌చార్జ్‌గా ఉంది. అయితే ఆమె తెలివి, చురుకుదనం, వార్తలను 'కాచ్'చేయడంలో ఉండే నైపుణ్యం ఇదంతా ఆమెకో ప్రత్యేక గౌరవాన్ని తెచ్చాయి.

    సుజాతకు ముప్పై ఐదేళ్ళు, కానీ నభై పై బడ్డట్టుంటుంది. తండ్రి వామపక్ష రాజకీయాలకు చెందిన ప్రజాసంఘంలో పని చేసేవాడు. ఎమర్జెన్సీనాటికి చిన్నపిల్ల కావడంతో తండ్రి జైలు జీవితం ఆమెకంతగా తెలియలేదు గానీ... తరువాత నిర్బంధాలను చవిచూసిన కుటుంబాలలో వాళ్ళదీ ఒకటి. అనుకోకుండా తండ్రి అర్థాంతరంగా చనిపోవడంతో చదువుకంటే ఉద్యోగం ముఖ్యమైంది కుటుంబానికి.

    తండ్రి ఉన్న రోజుల్లో వామపక్ష అభిమానులు ఇంటికి రావడం, సాహిత్య చర్చలు, పుస్తకాలు ఆమెకు చిన్నప్పటి నుండే ప్రజల మీద ఆసక్తి పెంచాయి. తెలిసీ తెలియకుండానే తనుకూడా ఆ భావజాలానికి చెందిన మనిషిననే ముద్ర మనసులో పడిపోయింది. అందుకు వాళ్ళ కుటుంబ పరిస్థితులూ దోహదపడ్డాయి.

    అందువల్ల కూడా కావచ్చు 'ప్రజాపక్షం' వీక్లీ రివ్యూలో వైవిధ్యం చూపిస్తుందనే మంచి టాక్ వచ్చింది.

    అప్పటికి నాలుగు రోజులుగా చర్లనుండి లోకల్ రిపోర్టర్ రాజు న్యూస్ పంపిస్తున్నాడు. అవి చూస్తున్న మోహన్‌రావుకు అక్కడి పరిస్థితులు మామూలుగానే టెన్షన్‌గా ఉంటాయి, ఇప్పుడింక మరింత అలజడిగా ఉండాచ్చుననిపించి, న్యూస్ స్పెషల్‌గా కవర్ చెయ్యమని ఒక జనరల్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు. కానీ దానిమీద స్పెషల్ బులిటెన్‌కి పనికి వచ్చేటట్టు లాగాలంటే సెంటర్ నుండి వెళ్ళాల్సిందేనని అనిపించింది. అట్లా అనుకోగానే అతని దృష్టికి సుజాత వచ్చింది. 

    'కాకినాడ నుండి మొన్ననే వచ్చారు గదా, వెంటనే ఇటు పంపుతున్నానని అనుకోరు గదా!' అంటూనే... 'మీతో ఇక్బాల్‌ని కూడా తీసుకుపోండి. అతనైతే మీకు కొంత హెల్పింగ్‌గా కూడా ఉంటాడు'.

    ఇక్బాల్‌కు పాతికేళ్ళు. చురుగ్గా ఉండటమే కాదు, నమ్రతగానూ, మర్యాదగానూ కూడా ఉంటాడు.

    ఇక్బాల్ రాగానే విషయం చెప్పి, 'మేడమ్‌తో వెళ్ళు, మంచిగా కవర్ చేసి మనకు స్పెషల్ అయిటమ్‌గా తేవాలి.'

    అంతే! ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. లోకల్ రిపోర్టరుకు లాడ్జి చూడమని పురమాయించి, మరుసటి రోజు ఉదయానికి భద్రాచలంలో దిగి ఫ్రెష్ అయి వెహికిల్ మాట్లాడుకుని 'చర్ల' వైపు సాగారు. 

    భద్రాచలంలోనే చర్ల ఎలా ఉండబోతోందో అర్థమయింది. శ్రీరామ నవమివెళ్ళి వారం పదిరోజులైనా ఊరినిండా జాతరలాగా పోలీసు జీపులు మాటిమాటికీ తిరుగుతున్నయ్యి. ఇంక మూడు రోజులే గదా సభలు... టెన్షన్ పెరిగినట్లు అర్థమవుతోంది. 'గ్రీన్‌హంట్ వ్యతిరేక సభ' అంటే మాటలా! ఆదివాసీలతో... అందునా చత్తీస్‌గడ్ అంచున...

    దారి పొడవునా పోస్టర్లు చూస్తూ బాగానే ప్రచారం చేసినట్టున్నారే అనుకుంది. 'వీళ్ళకెంత ధైర్యం! ఇంతకూ పర్మిషన్ ఇచ్చారో లేదో ఈ మీటింగుకు.

    చర్ల వెళ్ళేటప్పటికి పదిగంటలైంది. అప్పటికే కమిటీ కార్యకర్తలు మూడు జీపుల్లో మూడు టీములు, మూడు వైపులా వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరుతున్నారు. 

    లోకల్ రిపోర్టర్ రాజు ఆ కమిటీ బాధ్యుడు శేఖర్‌కి వీళ్ళను పరిచయం చేశాడు.

    'మేడమ్! మీరు ఇక్కడ కవర్ చేసినా సరే! లేదూ ఈ టీముల్లో ఏదో ఒకదానితో ఆదివాసీ గూడేలకి వెళ్ళినా సరే! మీ ఇష్టం' అన్నాడు.

    సుజాతకు అక్కడికి వచ్చేటప్పటికి ఏ ఆలోచనా నిర్దిష్టంగా లేదు. శేఖర్ మాటలతో ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుంది.

    'ఇదిగో ఈ కొండలే హద్దు! అవతల చత్తీస్‌గడ్డే! అటు నుండి ఇటు ఆదివాసీలు కూలి పనులకూ, మిరపకోతలకు వస్తూనే ఉంటారు'.

    సుజాతకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎదుటే నిలబడి ఉన్నట్టు ఉన్న ఈ కొండలు రెండు రాష్ట్రాల సరిహద్దులా! ఎమేజింగ్... తాను తరచుగా వార్తలలో చూసేది ఈ చత్తీస్‌గడ్డే! ఓహ్! మావోయిస్టుల రాజ్యం!... ఏవేవో వార్తలు మనసులోకి వచ్చాయి.

    ముందుపోతున్న జీపుననుసరించి పోనిస్తున్నాడు డ్రైవర్.

    అన్నీ చిన్న చిన్న గూడేలు. జనం కనబడిన దగ్గరల్లా ఆగి నాలుగు పాటలు పాడి, రెండు మాటలు చెప్పి, కరపత్రాలు ఇచ్చి సభకు రమ్మని చెప్తున్నారు. ఆ ఆదివాసీలకు తెలుగు అర్థమయినట్టుగా చూస్తున్నారుగానీ తిరిగి జవాబు చెప్పడం లేదు. అయితే ప్రతి టీంలోనూ వాళ్ళ భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యంగా వాళ్ళంతా, తమకు ఈ విషయం తెలుసని... మీటింగుకు వస్తున్నామనీ చెప్పారు. 

    ఇక్బాల్ ఆదివాసీలనూ, వాళ్ళ మాటలనూ రికార్డు చేస్తున్నాడు. ఆయా గూడేల పోలీసుల అరాచకాల గురించి, సాల్వాజుడుం గురించి అడిగి వివరాలు రాసుకుంటున్నారు కార్యకర్తలు.

    సుజాత కూడా ఆ వివరాలు విడిగా తన నోట్సులో ఎక్కించుకుంటోంది.

    అట్లా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది దాకా తిరుగుతూ ఉన్నారు. కార్యకర్తలకు తిండితిప్పలు కూడా లేవు. పొద్దుట తినివచ్చిన టిఫిన్. రెండు మూడు బిస్కెట్ పాకెట్లు తెచ్చుకున్నారు. వస్తూ కూడా ఓ వాటర్ కాన్ జీపులో వేసుకొచ్చుకున్నారు. 

    ఆ బిస్కెట్లే సుజాతకూ రెండిచ్చారు. ఓ చోట చిన్న టీకొట్టు కనబడితే ఎప్పటివో కారపు చుట్టలూ, బిళ్ళలూ కనబడితే అవే కొని తిన్నారు. అంతే!

    ఆ కార్యకర్తలల్లో చిన్న పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగానో ఉన్నారు. తిండితిప్పలు అనుకోవడం లేదు! వీళ్ళకు ఎందుకింత ఆసక్తి! ఇంత శ్రమకోర్చి వారం రోజులుగా ఈ ఎండకు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నట్లు? ఆశ్చర్యంగా అనిపించిందామెకు.

    సుజాతకు ఇదో కొత్త అనుభవం... తను వెళ్ళిన అసైన్‌మెంట్లన్నీ టౌనుకు దగ్గరున్న ప్రాంతాలే... ఇట్లా అడవిలోపలికి ఎన్నడూ ఎళ్ళలేదు. పైగా ఆ ఆదివాసీల అనుభవాలు వినడానికి కూడా కష్టంగా, మనసును కలిచివేస్తూ ఉన్నాయి.

    అత్యాచారాలు, సామూహిక గృహ దహనాలు, గొర్రెలను, కోళ్ళను ఎత్తుకుపోడ. ఇక కొట్టడం అంటే మామూలేనన్నట్టుగా ఉన్నాయి. కాలిపోయిన ఇళ్ళు ఇంకా అలాగే మొండిగా ఉండిపోయాయి.

    సీతారాంపురం తండాలో లక్ష్మి అనే అమ్మాయి స్నానానికి పోతే, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారని... ఆమె భర్త పుల్లయ్య అడ్డుకోబోతే అతన్ని కూడా చంపారని ఆ గూడెం వాళ్ళు ఆ కథంతా చెప్తుంటే సుజాతకు కళ్ళనీళ్ళు తిరిగాయి.

    'మొన్ననే ఐదు రోజులైంది... ఇప్పపూలకు పోతే పోలీసులు కొట్టారండీ... ఇదిగో చెయ్యి ఎట్లా విరిచారో! చూడండి' అని వాచిపోయిన చెయ్యి దిగులుగా చూపించాడు 'కొయ్య' అనే ఆదివాసీ. అతని గొంతులో విచారం సుజాతలోకి ప్రవహించినట్టయింది... పాపం అనుకుంది. 

    వారి అనుభవాలన్నీ బరువుగా మోసుకుంటూ చర్ల చేరేటప్పటికి పొద్దుపోయింది. కార్యకర్తలు అక్కడే ఆగిపోగా సుజాత వాళ్ళు భద్రాచలం వెళ్ళారు.

    రెండో రోజు భద్రాచలం నుండి బయలుదేరుతూనే ఆ రోజు రాత్రి చర్లలోనే ఉండాలనుకుంది. తరువాత రోజు 'సభ' కనుక ఆ రోజు కార్యకర్తలు దొరకడం కష్టం. తను ఈరోజే వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవాలనుకుంది.

    'మేడమ్ అక్కడ లాడ్జీలు కూడా లేవండీ! ఎలా ఉంటారూ?' అని ఇక్బాల్ వద్దన్నట్టు గొణిగాడు. 

    'ఫరవాలేదులే! పాతిక మంది ఆడపిల్లలు వారం రోజులుగా ఆ ఇరుకు లాడ్జిలో సర్దుకోవడం లేదూ? ఒక్క రోజుకు ఏం కాదులే ఇక్బాల్! ఉండగలను.'

    అసలు అది లాడ్జా? చిన్న గోడౌన్‌లో మడత మంచాలు వేసిన గది. అదేమన్నా పట్టిందా వాళ్ళకు?... సుజాతకు చాలా రోజుల తరువాత తన సొంత మనుషుల దగ్గరకొచ్చినట్టుగా అనిపించింది.

    తండ్రి అర్థాంతరంగా చనిపోవడం... చేతిలో డబ్బుల్లేవు... వెనక ఆస్తుల్లేవు! తల్లి వేరే కులమని బంధువులంతా దూరం. అంతంతమాత్రంగా ఉన్న కుటుంబం వీథిన బడ్డట్టయింది.ఆ కష్టకాలంలో ఏం చేసి తామిద్దర్నీ బతికించిందో అమ్మకు మాత్రమే తెలిసిన సంగతులు!

    ప్రైవేటు స్కూల్లో నూటయాభై రూపాయలకు టీచరు ఉద్యోగం చిన్న పాక ఇరవై రూపాయల అద్దె... అదీ కూలీ నాలీ చేసుకునే వాళ్ళుండే వాడ. స్నానం చెయ్యడానికి తడికెల గది. లెట్రిన్‌కి నీళ్ళు తీసుకుని తుప్పల్లోకి పోవడం. సుజాతకు తన చిన్నతనం కళ్ళల్లో కదిలింది.

    బహుశ ఆ జీవితమే నాలో ఇంకో జీవ చైతాన్యాన్ని నింపి ఉంచిందేమో! కడుపు నిండిన జీవితం కాకపోవడం వల్ల చుట్టుపక్కల వారి పట్ల పట్టింపు, ఇప్పటికీ మిగిలి ఉంది. అందువల్లే ఈ ఆదివాసీల జీవితాలు నన్నింతగా కలవరపెడుతున్నాయి కావచ్చు.

    ఆలోచనలతో సుజాత భద్రాచలం నుండి చర్లకు వచ్చింది కూడా తెలియలేదు.

    సుజాతను చూడడంతోనే చిన్న పిల్లలు హుషారుగా ముందుకు వచ్చి ఈ రోజు అందరం గూడేలకు వెళ్ళడం లేదాంటీ. ఒక్క 'టీం' మాత్రమే అటు చింతూరు వెళ్తోంది. మిగిలిన వాళ్ళమంతా ఇక్కడే ఉంటున్నాం. ఈ రోజు చర్లలో సంత. ఈ సంతకు... చత్తీస్‌గడ్ లోతట్టు ప్రాంతాల నుండి కనీసం పదివేల మంది వస్తారంట. అందుకే ఇక్కడే ఉండి ప్రచారం చేస్తే అన్ని గ్రామాలకూ మెసేజ్ వెళ్ళిపోద్దనుకుంటున్నారు.

    సుజాత ముందు రోజంతా వాళ్ళతో ఉండడంతో ఆ పిల్లలు సుజాతను కూడా వాళ్ళ మనిషి కిందనే లెక్క వేశారు. 

    సుజాత ఆలోచనల్లో పడింది - చింతూరు వెళ్ళడమా? లోకల్‌గా సంతని కవర్ చెయ్యడమా? అని. పైగా నిన్న లేని చారలచారల డ్రస్సులతో పారా మిలటరీ వాళ్ళు ఊరంతా దిగినట్టుగా కూడా గమనంలోకి వచ్చింది. వాతావరణంలో మార్పేదో కనబడింది. పోలీసు వ్యాన్లూ, ట్రక్కులూ హడావిడిగా తిరుగుతున్నయ్యి.

    'ఏమిటో!అంతా హడావిడి ఎక్కువగా ఉందే!... అన్నది పైకే!... ముప్పై మంది... ఇప్పుడేమిటి మేడమ్! నిన్న రాత్రి పది గంటలకు ఓ ఇరవై ముప్పై మంది ఇదిగో ఆ మూల మలుపు నుండి మార్చింగ్ చేసుకుంటూ ఇటు గుండా అటు సెంటరు వేపుకు వెళ్ళారు' అని, 'మమ్మల్ని భయపెట్టాలనీ' అని నవ్విందో చిన్నపిల్ల.

    సుజాత లోకల్లోనే ఉండిపోవాలనుకుంది. వీలయినప్పుడు అమరుల బంధువులతో  ఇంటర్వ్యూలు తీసుకుపోవచ్చు ననుకుంది. పైగా సంత కూడా చూడవచ్చు.

    పదకొండు గంటలయితేగానీ సంత మొదలు కాదు... అప్పటిలోపు స్నానాలు చేద్దమనుకుంటూ ఆడ పిల్లలు బాత్‌రూమ్‌ల వైపు వెళ్ళగా... కళాకారులు నృత్యనాటికేదో ప్రాక్టీసు చెయ్యడంలో పడ్డారు.

    సుజాత వాళ్ళే కాక, మరో టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్బాల్‌ని తీసుకుని వీళ్ళు వచ్చేలోపు మనం సంతలో ఎవరన్నా దొరిక్తే మాట్లాడిద్దాం అనుకుంటూ సంతవైపు దారితీసిందామె.

    ఎండ చిటచిటలాడుతోంది అప్పటికే.

    చర్ల సంత అంత పెద్దదేం కాదు. ఎంట్రన్స్ ఒక చిన్న సందులాగా ఉండి లోపల విశాలంగా ఉండే ఖాళీ స్థలం. సందుబారు ఎలకల మందు అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ చుట్టుపక్కల రోడ్ల మీద ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పొగాకు, తినుబండారాలు, బట్టలు, తెల్లసామాన్లు ఒకటేమిటీ అన్నీ ఉన్నయ్యి. ఖాళీ స్థలమంతా టెంట్లు వేసుకుని రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. ఎక్కువ బట్టల షాపులే కనిపిస్తున్నాయి.

    నిజానికి సంతలో దొరికే ఏ వస్తువయినా చర్లలో ఏ రోజయినా దొరికేటివే! కానీ సంత ఒక ప్రాచీన సాంప్రదాయం... ఆ రోజు అన్నీ ఒకేచోట ఉండడం వల్ల ఆదివాసీలు ఒక చోటే కొనడానికి ఇష్టపడతారు. బజారంతా ఏ కొట్టులో ఏవి దొరుకుతాయో తిరిగి బేరాలాడి కొనగలిగిన లోకజ్ఞానం వాళ్ళింకా సంతరించుకోలేదు. పైగా వేల మంది ఒకేసారి తమవాళ్ళు సామూహికంగా బయటి ప్రపంచంలోకి రావడం వాళ్ళకి నైతిక బలాన్నిస్తుందేమో కూడా. బహుశ అడవి జంతువుల నుండి రక్షణగా కూడా ఉండవచ్చు.

    సంతలో కెమెరాలు, బ్యాగులు భుజాన తగిలించుకుని తిరుగుతున్న సుజాతను, ఇక్బాల్‌ను వింతగా చూడసాగారు.

    సుజాత చీరలు కొంటున్న ఆడవాళ్ళ దగ్గర నించుంది. వీళ్ళు ఏం మాట్లాడకుండా అట్లా గమనిస్తున్నట్టుగా ఉండడంతో ఆ గుడ్డల అంగడామెకు ఇబ్బందిగా ఉంది. ఆమె తెలుగు భాష, మరాఠీ భాష కలగలసిన తెలుగులో 'ఏం కావాలి?' అని అడిగింది.

    'ఏం లేదు! వీళ్ళు ఏమేమి వస్తువులు కొంటున్నారో చూస్తున్నా'మంది. ఆ ఆదివాసీలకు నిజమైన అవసరాలేమిటో, సంతలో వాళ్ళు దేనికి ప్రాధాన్యమిస్తున్నారో గమనించాలనుకుందామె! 

    బ్లూ రంగుకు, తెల్లటి చమ్కీకుట్లు ఉన్న చీరను బేరం చేస్తోంది.

    'పాంచ్ సౌ అచ్చా శాడీ డిజైన్' చీర గొప్పదనం గురించి చెప్తోంది అంగడి మనిషి.

    ఆదివాసీ మహిళల మొహంలో ఏ భావమూ కనబడలేదు. అసలు సుజాతకు వాళ్ళ మొహాల్లో భావాలు చదవాలన్నా చేతకావడం లేదు. తానొక మనిషినక్కడ ఉన్నానన్నట్టుగా తన ఉనికినే గుర్తించలేదు వాళ్ళు... ఇటు తిరిగి చూడనైనా చూడనే లేదు. 'తుమారా నాం క్యా? కహాఁసే ఆయా?' అడిగింది తనను పట్టించుకుంటారేమోనన్నట్టుగా.

    అక్కడి నుండి కదలివెళ్ళిపోయారు ఆదివాసీలు.

    దాంతో ఆ అంగడామె 'ఎవరమ్మా మీరూ? పొద్దున్నే మా  బేరాలు చెడగొట్టడానికా! ఫో! ఫో' కసిరింది. సుజాతకు ఓ క్షణం చివుక్కుమంది. అక్కడి నుండి కదిలి ఓ పక్కగా నిలబడ్డారు వాళ్ళు.

    ఆ అంగడామె ఆడవాళ్ళను భాషలో ఒకటే అరిచి పిలిచి చివరికి తిరిగి రప్పించింది. సుజాత నేరభావంతో అట్లా చూస్తూ ఉండిపోయింది. 

    తిరిగి వచ్చిన ఆ ఆదివాసీ మహిళ అదే చీరను చేత్తో పట్టుకుని 'ఏక్ సౌ' అన్నది. సుజాత దిమ్మర పోయింది. ఎక్కడ ఐదొందలు, ఎక్కడి వంద?

    బాగా ఎట్లా అడగ్గలిగారూ?

    'తీన్ సౌ'

    'నా'

    'ఏక్ సౌ దస్'... వెళ్ళడానికి సిద్ధమయిందామె.

    'అచ్ఛా! అచ్ఛా... పకడో, పకడో! ఏక్ సౌ బీస్ రుపియా'

    బేరం కట్ ఆఫ్ అయిపోయింది. గుంజులాటలు లేవు. రెండే మాటలు. ఇంతలో ఇంకో ఆమె మరో చీర బేరం చెసింది. ఆ చీర రంగు బాగానే ఉంది. కానీ మరీ పాత చీరనిపించింది. అది కూడా అరవై రూపాయలకు కొన్నారు. 

    అదంతా చూస్తున్న సుజాతకు ఓ పక్క వాళ్ళు కనబరచిన తెలివికి ముచ్చటగానే ఉన్నా దానిలో కూడా వాళ్ళు మోసపోతున్న వైనం బాధనిపించింది.
 
    అక్కడున్న చీరలన్నీ బాగా వాడినవి... ఫాల్స్ కుట్టి ఉన్నాయి. ఉతికి ఇస్త్రీ చేశారు. అవి తమ బోటి వాళ్ళ ఇళ్ళల్లో స్టీలు సామాను కోసం పదికో ఇరవైకో వేసేస్తారు. అలాంటివి వంద రూపాయలకా? ఎంత దగా! ఆ వంద రూపాయలు ఆదివాసీలు ఎంత కష్టపడితే వస్తాయీ?... వరసగా ఆడవాళ్ళు వస్తూనే ఉన్నారు... చీరల బేరాలు సాగుతూనే ఉన్నాయి.

    మెల్లిగా అక్కడి నుండి ముందుకు కదిలారు. నలుగురైదుగురు ఆదివాసీ స్త్రీలు బుట్టల్లో చింతపండు పెట్టుకుని కూర్చోనున్నారు. బహుశ లోకల్ వాళ్ళు కావచ్చు... కట్టూ బొట్టూ మధ్య తరగతి స్త్రీలనిపించారు. చింతపండు ముద్దని పదిరూపాయలకు బేరం చేస్తున్నారు. అది అరకిలో తేలిగ్గా ఉంటుందానుకుంది సుజాత.

    'అవును కొనే దగ్గరా రెండు చోట్లా దగానే'

    ఇక్బాల్ ఆమె మాటలు వింటూ 'మీరు ప్రతిదానికీ కదలిపోతే కష్టం మేడమ్!ఇంత మోసం సమాజంలో ఉంది కనకనే! వాళ్ళు ఆ మావోయిస్టులను తప్ప ఎవర్ని నమ్మడం లేదు. మీరు గంటపై నుండి ఇంత మందిని కదిలించారు... ఒక్కరితో పేరు చెప్పించుకోగలిగారా?'

    'సరేలే! పద అటువేపు కూడా తిరుగుదాం'

    అక్కడి నుండి మెల్లిగా నడుస్తూ ఒక్కొక్కళ్ళు ఏమి కొంటున్నారో గమనించసాగారు. తినుబండారాల జోలికి పెద్దగా పోవడం లేదు. ఆడవాళ్ళ గుంపు గాజుల మల్లారం దగ్గరుంది. చేతికి గాజులున్నా మరికొన్ని గాజులు వేయించుకుంటున్నారు. పక్కపిన్నులు, రబ్బరు బాండ్లు, రంగురంగుల బొట్టు బిళ్ళల దగ్గర పడుచు పిల్లలు ఎగబడుతున్నారు.

    మొగవాళ్ళు చొక్కాలు, లుంగీలు తీసుకున్నారు. ఒకతను కత్తెర బేరం చేస్తున్నాడు. 'కత్తెరెందుకూ' అంది సుజాత ఆసక్తిగా!

    సడన్‌గా మాట వినబడి తత్తరపడ్డాడతను. అయినా వెంటనే తమాయించుకుని చేతితో తలమీద చూపిస్తూ క్షవరానికని సైగ చేశాడు.

    నిజమే! అడవిలో దొరకనివీ అవసరమయినవి... ఉప్పు, ఉల్లిపాయలు వంటివి కొద్దికొద్దిగా కొంటున్నారు.

    సుజాత అవన్నీ తన అబ్జర్వేషన్ కింద నోట్ చేసుకుంది.

    అప్పటికి పన్నెండు దాటింది. ఎండకంటే వేడుగాకు చర్నాన్ని కాలుస్తున్నట్టుగా ఉంది. 'అబ్బా! నిన్నటికంటే ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. నోరు ఎండిపోతోంది. ఏదైనా తాగితే బావుండు'... అప్పటికీ బాటిల్‌లో తెచ్చుకున్న నీళ్ళు తాగుతూనే ఉంది.

    'పదండి... అట్లా రోడ్డు మీదకు పోయి ఏమైనా తాగుదాం!' ఇక్బాల్ సంత బయటకు దారి తీశాడు. 

    ఎండ తళతళమంటోంది. 'ఇది కొండల ప్రాంతం గదా! మేడమ్! కొత్తగూడెం దగ్గరే ఇక్కడకు' అని... 'అయినా నిన్న అడవిలోచెట్ల నీడన మనకు తెలియలేదు' అన్నాడు.

    అసలే వళ్ళు కలిగినామె! పైగా రోజంతా ఎసి రూమ్‌లో ఉండే ఉద్యోగం 'ఏమో! అబ్బా! ఉఫ్' అనుకుంటూ జీపు ఎక్కింది.

    జీపు రెండు మూడు ఫర్లాంగులు పోయి మెయిన్ రోడ్డు ఎక్కింది. సెంటర్‌లో తప్ప కొబ్బరి బొండాలు ఎక్కడా లేవు. బొండాలు కొట్టించుకుని చింతచెట్టు కింద ప్రశాంతంగా తాగుతున్నారు. చెమట పట్టిన శరీరాలకి చెట్ల నీడన వేడిగాలి కూడా చల్లగా హాయిగా ఉందనిపించింది. వాళ్ళతో పాటు మరో ఆటో ఆగింది. చిన్న పిల్లల్ని స్కూలు నుండి తీసుకుపోతున్న తండ్రి బాండి ఆపి కొబ్బరి బోండాం కొంటున్నాడు. మరో పక్క దూరం నుండి వచ్చాడేమో లారీ ఆపి డ్రైవర్ బోండా నీళ్ళు తాగుతున్నాడు.

    ఇంతలో దడదడలాడుతూ రెండు పోలీసు మోటారు సైకిళ్ళు వచ్చి ఆగాయి. ఆ వెనువెంటనే జీపు నిండా పారా మిలటరీ వాళ్ళు స్టెన్‌గన్స్ పట్టుకుని బిలబిలా దిగారు. ప్రశాంతంగా,హాయిగా ఉన్న వాతావరణం నిమిషంలో వేడెక్కిపోయింది. 

    ఏమిటీ గుంపులు? ఎందుకు నిల్చున్నారు? అసలు మీరెవ్వరూ! అని ఆటోవాడినీ, లారీల వాళ్ళను అందర్నీ బండి కాగితాలు, డ్రైవింగ్ లైసెన్సులూ చూపమని దౌర్జన్యస్వరంతో అరుస్తున్నారు.

    అసలు వాళ్ళు వచ్చిన తీరు, దూకుడుగా ప్రవర్తిస్తున్న వైనం చూడగానే అందరికీ నోళ్ళు మూతలు పడిపోయాయి. బోండాల కొట్టతను గబగబా వరస వెంబడి కొబ్బరి కాయలు కొట్టి పంపుతున్నాడు. అవి తాగుతూనే అటూ, ఇటూ పోతున్న వాళ్ళను కేకలేస్తున్నారు.

    అదంతా చూస్తూ 'పాపం! కొట్టువాడికి ఈరోజు లాభం గూబకు అంటినట్టే' ఇక్బాలన్నాడు.

    'పోదాం పదా!' అన్నట్టు జీపు డ్రైవర్‌కి సైగ చేసిందామె.

    'ఆగండి! వెళ్దా'మన్నట్టు అక్కడినుండే సైగ చేశాడు.

    'ఇక్కడ మనం వీళ్ళ రాజ్యంలో ఉన్నాం మేడం! జర్నలిస్టులమంటే చెల్లదు.' సుజాతకు చికాగ్గా ఉంది.  అయినా మరో అరగంట దాకా అక్కడే నిలబడి పోవాల్సి వచ్చింది. వచ్చేపోయే వాహనాలు ఆపి చెక్‌చేసి గుబగుబలాడించారు.

    మరి వాళ్ళ చేతుల్లో తుపాకులు మామూలువి కావు. వాళ్ళ అరుపులు సహజమైనవీ కావు. ఆ దారంట బండ్ల రాకపోకలు ఆగిపోయాయి.

    వీళ్ళ దెబ్బకు ఆ సెంటరులో అలికిడి తగ్గిపోయాక... ఇక చాలన్నట్టుగా జీపు మోటారు సైకిళ్ళూ ఎక్కి వెళ్ళిపోయారు.

    బిగదీసుకుపోయిన  గాలి తిరిగి వీచడం ప్రారంభించింది.

    జనమంతా ఒక్కసారిగా బూతులతో సహా తిట్లకు లంఘించారు. 

    సుజాతకు ఆ వాతావరణం పట్టించినట్టయింది. తనకే ఇలా ఉంటే నోరు లేని మామూలు జనం ఎలా ఉంటారూ? ఏమిటీ పోలీసుల రాజ్యం. ఏం జరిగిందని, ఇంతసేపూ ఈ కర్ఫ్యూ వాతావరణం... రేపు జరగబోయే మీటింగుకు జనం రాకుండా చెయ్యాలనేగా ఈ కవాతులూ!

    గబగబా అక్కడున్న జనాన్ని మాట్లాడించింది... ఇక్బాల్ రెడీ అయిపోయాడు. వాళ్ళు టి.వి. వాళ్ళని అర్థమయ్యేటప్పటికి జనం ఉత్సాహపడ్డారు. 

    'రోజూ ఇలా ఉండదు లెండి... రేపు మావోల మీటింగు కదా అందువల్ల మరింత చేస్తున్నారు. అయినా ఇది మాకు తరుచుగానే ఉంటదిలెండి. చత్తీస్‌గడ్ పక్కనే! అదిగో, ఆ కొండలవతలే కదండీ! దాదాలు ఇటు వస్తారని మాకు ఎప్పుడూ ఈ పోలీసుల బాధ తప్పదు లెండి.'

    'పైగా పదిరోజుల నుండి ఈ పాటలు పాడే వాళ్ళు ప్రచారం కోసమని వచ్చి కరపత్రాలు, పోస్టర్లు వేస్తున్నారు కదండీ... దానితో మిలట్రీ దిగిపోయి మరింత చేస్తున్నారు... ఎట్లాగయినా! మీటింగు చెదరగొట్టాలని పోలీసుల ప్రయత్నం...' తలో మాట చెప్పసాగారు.

    సుజాతకు వాళ్ళు చెప్పింది వింటుంటే భయం కలిగింది. మరోసారి ఆదివాసీలు మూల్యం చెల్లించరు కదా! అప్పుడూ ఇదే నెల... ఇప్పుడూ అదేఅ నెల... ఓహ్! సుజాతకు చిన్న జడుపు కలిగింది.

    తనప్పుడు చిన్నది. పెద్దగా తెలియదు. కానీ తరువాత చరిత్రలో ఆ ఘటన అలా మిగిలిపోయింది. మరో 'జలియన్ వాలాబాగ్'. మర్చిపోయేదా? కాలం మిగిల్చిన గాయం. ఆలోచనలతో తలకిందులయ్యింది. 

    అప్పటికే చాలా టైం అయిపోయింది. హోటల్ కూడా ఎదురుగా ఉండడంతో భోజనం చెయ్యడానికి సిద్ధమయ్యారు. అక్కడి నుండి లాడ్జి దగ్గరకు వెళ్ళేటప్పటికి సంతకు వెళ్ళివచ్చిన కళాకారుల టీం చెమటలు కారిపోతుండగా అలసిపోయి తలోవైపు జారగిల పడిపోయారు. తెల్ల పంచలన్నీ మట్టిగొట్టుకుని తడిసి ముద్దయ్యాయి. 'సౌమ్య' వాళ్ళమ్మ భుజం పట్టుకుని వేళ్ళాడుతోంది.

    'మాకు కనబడలేదే మీరూ!' అడిగింది.

    'మేం! ఇటు ఎడమ వైపు నుండి వెళ్ళాం మేడమ్! అటు అడవి నుంచి వచ్చేదారి... అక్కడైతే ఎక్కువ జనం ఉంటారనీ!... ఎండ దంచుతోంది... అందుకే ఎక్కువ సేపు ప్రోగ్రాం చెయ్యలేకపోయాం!' పాటలు పాడే కుమారి అంది. 

    మేం ఊరికే నడవటానికే ఇబ్బంది పడుతున్నాం! మీరు ఈ ఎండలో పాడీ, ఆడటం మాటలా!... చూడు ఈ పిల్ల ఎలా కందిపోయిందో! సౌమ్య బుగ్గ పట్టుకుని ముద్దు చేసింది.

    చల్లబడినాక నాలుగ్గంటలకు తిరిగి ప్రచారానికి వెళ్తామన్న మాటవిని సుజాత వాళ్ళు అక్కడే పందిరి కింద కూర్చుండి పోయారు. 

    'ఈ ఊళ్ళో ఈ మహత్తరమైన లాడ్జి తప్ప మరొక్కటి లేకపోవడం ఆశ్చర్యం... భద్రాచలం పోయి రావడం అయ్యేపని కాదు! అబ్బా!' అనుకుంది. జీపులోనే ఎసి వేయించుకుని కొద్దిసేపు సీటు మీద వాలిపోయింది. రెండు రోజులు ఎండకు తిరగడంతో అలసిపోయి కళ్ళు మూతలు పడిపోయాయి. 

    కళాకారులు, కార్యకర్తలు ఎప్పుడు వెళ్ళారో తెలియనేలేదు. ఇక్బాల్‌ని అడిగింది. 'ఓ అరగంట అయింది మేడం! మీరు బాగా అలసిపోయారనీ'... నాన్చేశాడు మాట. 'అయితే మనం వచ్చినపని చేయాలి గదా!' అని లాడ్జ్ వెనుకవైపు మళ్ళి బాత్‌రూమ్‌కెళ్ళి మొహం మీద నీళ్ళు జల్లుకుని వచ్చింది.

    వీళ్ళు వెళ్ళేటప్పటికి సంతలో నాలుగు బజార్ల సెంటత్ర్లో పాటలు పాడుతున్నారు. చుట్టూ జనం ఉన్నారు. నించున్న జనానికి కార్యకర్తలు కరపత్రాలు ఇస్తూన్నారు.

    ఇక్బాల్ తన కెమెరాకు చకచకా పనిపెట్టాడు.

    'చెయ్యర చెయ్యి లడాయి - ఆదివాసీ లడాయి
                            చెయ్యర చెయ్యి లడాయి
    భుక్తి కోసం లడాయి'... అట్లా పాడుతూ ప్రచారం చేస్తూ నడుస్తుంటే సుజాత మైమరచిపోయింది.         

    అప్రయత్నంగా
    'పోదామురా - జనసేనలో కలిసి
    ప్రజాసేనలో కలిసి - ఎర్రసేనలో కలిసి 
    చరణాలు వెలువడ్డాయి. సుజాతకు బాల్యం ఆవహించినట్టయింది.

    తన తండ్రితో ఊరేగింపుల్లో నడుస్త్తూ అప్పటి సంజీవ్, సుదర్శన్, దివాకర్, ఏసులు పాడిన పాటలు, ఆడిన నాటకాలు ఒక్కొక్కటీ కళ్ళముందు పురాగాథగా ముందుకు వచ్చాయి.

    ఎప్పటి సుజాత... ఇప్పుడీ సుజాత... పోలికేదీ?... అయినా మర్చిపోయేవేనా అవన్నీ? రైతుకూలీ సభలనాటికి ఎంత చిన్నపిల్ల... ఇదిగో ఈ సౌమ్యను చూసినట్లే చూసేవాళ్ళు తననందరూ!

    ఆ ప్రదర్శననంతా ఎంతో మమేకంతో చూడసాగింది.

    ఇక్బాల్‌కు అవేం తెలియదు. తనపై ఆఫీసర్ ఆనందంగా చూడడం అతనికీ ఆశ్చర్యంగానే ఉంది. తను ఆమెతో ఎన్నో ఎసైన్‌మెంట్లకు వెళ్ళాడు!... గానీ పని పట్ల ఎంతో ఖచ్చితంగా సమన్వయంగా ఉండేది. అట్లాంటిది ఇక్కడేదో చిన్న పిల్లలాగా ఆనందపడిపోవడం అతనికి వింతగా ఉంది. అందుకే జరుగుతున్న ప్రోగ్రాంతో పాటు మధ్యమధ్యలో ఆమెనూ వీడియో బంధిస్తున్నాడు.

    అప్పటికి చీకటి ముసురుకుంది. దారంతా పోలీసులు పహరా కాయడం గమనిస్తూనే ఉన్నారు. ఆ దృశ్యాలూ వీడియోలోకి ఎక్కాయి. 

    అప్పటికి చర్ల చుట్టుపక్కలంతా పారామిలటరీ దిగిందనే వార్తలు అందుతున్నాయి. మరోపక్క ఆదివాసీలు చత్తీస్‌గడ్ లోతట్టు ప్రాంతాల నుండి రెండు మూడు రోజుల క్రితమే బయలుదేరారనే సమాచారమూ తెలుస్తోంది.

    రేపటి రోజు ఎలా ఉండబోతోందీ? సుజాత తన తండ్రిని తలచుకుంది. తనిప్పుడు బయటి వ్యక్తిగా వచ్చింది. తనకేం సమస్య లేదు... కానీ ముప్పైఏళ్ళనాడు తన తండ్రి కార్యకర్తగా వెళ్ళి అందులో భాగమవడం వల్ల ఆయనకు పదే పదే ఆ ఘటన కళ్ళముందు కదిలాడేది కాబోలు... తెరమీద దృశ్యం చూస్తున్నట్టు ఎప్పుడూ ఎట్లా చెప్పేవాడూ!

    'పాపం! ఆదివాసీలకు ఎలా తెలుస్తుందీ ఈ చట్టాలూ, ఈ పోలీసుల గురించీ? సోమవారం సంత కలిసి వస్తుందనుకున్నారు. సభకు రావాలని తుడుం మోగింది. ఉందయానికల్లా అన్ని ప్రాంతాల నుండి అటు ఉట్నూరు, పాటిగూడ, కౌస్తాపూర్‌లపై నుండి గూడా ఎడ్లబండ్ల మీదా, బస్సుల్లో, కాలినడకనా లోయలు దాటి ఆదివాసీలంతా ఇంద్రవెల్లి ఎట్లా చేరుకున్నారు... 'కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకేం బహుమతినిచ్చిందీ?' 'మరణ మృదంగం' వినిపించింది.

    తమకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఆ సభపై కాల్పులు జరిపి... ఆదివాసీలను చంపి, జైళ్ళలో వేసి... వడ్డీ వ్యాపారుల, కాంట్రాక్టర్ల కొమ్ము కాసింది. ఆ అడవి జీవుల జీవితాన్ని కకావికలు చేసింది'... మనసు చెదిరినట్టుగా ఎప్పటికీ తలచుకునేవాడు.

    'అవును రేపటికెలా ఉండబోతోందో?

    ఈ రాత్రికే ఈ అమరుల బంధువుల్లో కొందరినైనా ఇంట్ర్వ్యూ చెయ్యాలి... రేపు వీలు కాదు... తరవాత దొరకరు.

    అసలు పొద్దుట పేపరు చూసి... రజిత, దమయంతి, నిర్మలా వాళ్ళ రియాక్షన్ చూసి తనకెంత గొప్ప ఫీలింగు కలిగిందీ? ఎన్కౌంటర్లలో చనిపోయిన కామ్రేడ్స్ వారి తల్లిదండ్రుల ఫోటోలు వేసి హృదయ విదారక వార్తా కథనాలు రాశారు. 

    ఈ ప్రచార దళాలలో వచ్చిన వాళ్ళలో ఐదారుగురు భర్తలను కోల్పోయిన వాళ్ళు, తండ్రులను కోల్పోయిన చిన్న పిల్లలూ ఉన్నారు. ఈ రెండు మూడు రోజులుగా చూస్తుంటే వాళ్ళనెవరూ బలవంతంగా తెచ్చినట్టు లేకపోగా, అందరూ ఎంత ధైర్యంగానో ఉన్నారు! ఇది ఈ తరంలో మార్పు కదా! అనిపించిందామెకు.

    తనకు తెలిసిన ఈ ముప్పై ఏళ్ళలో ఎంతో మంది ఉద్యమంలో పనిచేసిన స్త్రీలు భర్తలు చనిపోగానే తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అట్లా వెళ్ళి ఈ మామూరు సమాజంలో ఎట్లా బతకగలుగుతున్నారూ? అయినా భర్తతోపాటు వాళ్ళ చైతన్యం కూడ సామాధి అయ్యిందా? లేక అసలు ఉద్యమమే వాళ్ళకేమీ చైతన్యమివ్వలేకపోయిందా?... ఎన్నో ఏళ్ళు ఈ ప్రశ్నలకు సమాధానం లేనట్టుగానే ఉండిపోయింది.

    కానీ ఈ పిల్లలు, ఈ తరం అలా లేరు. మొగవాళ్ళకంటే ఎంతో ధైర్యంగా చైతన్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఖచ్చితంగా వీళ్ళను లోకానికి చూపించాలి. సెన్సేషన్ కోసం హృదయ విదారక వార్తలు సబ్ స్టాండర్డ్ జర్నలిజం.

    'తల్లిదండ్రులను ఆస్తి కోసం చంపిన బిడ్డలు అందరూ, అన్నీ ఉండి పట్టించుకోక శరణాలయాల్లో వదిలివేయబడుతున్న తల్లిదండ్రులు చావుకు ముందేఅ శ్మశానాల్లో పారేయబడ్డ ముసలి వాళ్ళూ వీళ్ళందరూ మనుషులు కాదా?... వీళ్ళనేం చూస్తున్నారు అని ఈ కన్న బిడ్డలు?' దమయంతి ఆవేశంగానూ కోపంగానూ అంది.

    'మనిషన్నవాడు చెయ్యగలిగినన్నాళ్ళు తనకోసం తను చేసుకోవడంలో తప్పేముంది? అది మానవ ధర్మం కాదా! తమ బిడ్డలు జనంకోసాం చనిపోతే ఆ జనం తరఫునే ఎవరో చూడక మానరు గదా!'

    'నిజమే!  వీళ్ళంతా తిరిగి ఉద్యమంలో ఎట్లా పని చేస్తున్నారూ? ఉద్యమం వీళ్ళకేమిటిచ్చిందీ? వాళ్ళ చైతన్యం, ప్రజల పట్ల వాళ్ళ ప్రేమ వాళ్ళను నిలిపిందిగానీ! వీళ్ళు ఎవరి జీవనం వాళ్ళు చూసుకుంటున్నారు గదా!

    'మీరు కింద పడుకోలేరండీ! ఇదిగో ఈ కాంప్ కాట్ మీదపడుకోండి' అని పిల్లలు మంచం తెచ్చి డాబా మీద వేశారు. 

    రాత్రి పదిగంటలు దాటాక మూడు 'టీం'లు వచ్చాయి. అంతమందీ అలసిపోయారు. తినీ తినక అన్నాలు తిన్నామనిపించి డాబాపైన ఆ మట్టి మీదనే గుడ్డలు పరుచుకుని పక్కపక్కనే ఆ యాభై, అరవై మని వరసలుగా పడుకుని అలాగే నిద్రలోకి వొరిగిపోయారు. అరగంటలో ఆదమరచి గురకలు కూడా మొదలయ్యాయి. 

    'ఇంకెక్కడి ఇంటర్వ్యూలు!... పాపం' అనుకుంది సుజాత. 

    తను భద్రాచలం పోకుండా ఆగిపోయినందుకు పని కాలేదనిపించినా బాధ మాత్రం కలగలేదు.

    సుజాత పడుకుందేగానీ చాలాసేపు నిద్రపట్టలేదు.

    తను ఈ ఎసైన్‌మెంట్‌కు వచ్చి మంచిపనే చేసింది. జ్ఞాపకాల్లో మిగిలిపోయి ఏవో పొరలు విచ్చుకుంటూ కళ్ళముందుకొస్తున్నాయి. బాల్యమే గదా బంగారు జీవితం! నాన్న, అమ్మా, తనూ, కామ్రేడ్స్, కార్యకర్తలు... ఎందరో, తన జ్ఞాపకాల్లో మరుగున పడిపోయారు. అదో జరిగిపోయిన జీవితమే అయింది తనకి.

    వెన్నెల ఆరబోసిన ఆకాస్శం ప్రశాంతంగా ఉన్న రాత్రి కొండల మీద నుండి చల్లగాలి అందరి అలసటనూ సేద తీరుస్తూ తల్లిలాగా సృజిస్తోంది. ప్రకృతిమాత లాలిపాట వింటూ సుజాత నిద్రలోకి ఎప్పుడు జారిపోయిందో!

    రెండు గంటల జామున కొండలు ప్రతిధ్వనిస్తూ ఏదో పెద్ద ఎత్తున పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాం ఉలిక్కిపడింది.

    'కాల్పులు... కాల్పులు...' అంటూ నిద్రలో నుండి కంగారుగా లేచారు కొందరు. 

    ఏదో పేలిపోయింది... లేదా పేల్చారు... మొత్తం మీద ఏదో జరగరానిది జరిగిందనే అందరి మనసులో పడింది. అందరిలోనూ ఆందోళన చోటు చేసుకుంది.

    బహుశ ఇది పోలీసుల పని కావచ్చు... ఇప్పటికే ఆదివాసీలు లోతట్టు ప్రాంతాల నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది... ఈ పేలుడు శబ్దం చుట్టుపక్కల ఐదారు కిలోమీటర్ల దాకా వినబడి... ఎక్కడి వాళ్ళక్కడ ఆగిపోవాలని అయి ఉండవచ్చు.. సుజాత మనసులో ఏవో ఆలోచనలు సాగాయి... నిజమే రక్షణ వ్యవస్థ మీద ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది.

    ఓ గంట రకరకాల ఊహాగానాలు సాగి... ఆఁ కానివ్వండి, ఏదైతే అది అవుతుందను'కుంటూ మళ్ళీ అంతా నిద్రల్లోకి పడ్డరు.

    సుజాతకు ఆలస్యంగా నిద్ర పట్టడం వల్ల కిందకి దిగి వచ్చేటప్పటికే కార్యకర్తలంతా నిద్రలు లేచి పోవడమేగాక అంతా ఏదో విచారంగానూ, ఆందోళనగానూ కూడా ఉన్నట్టనిపించింది.

    రాత్రి పొద్దుపోయాక సిటీ నుండి వర్తమానం వచ్చిందదీ హైకోర్టు కూడా మీటింగుకు పర్మిషన్ ఇవ్వలేదనీను.

    ఆ వార్త విని సుజాత అయ్యో అనుకుంది. కార్యకర్తల మొహాలు చూస్తే పాపం అనిపించింది. ఆమెకూ నీరసమనిపించింది.

    ఇంతలో పోలీసులు జీపుల్లో వచ్చి చర్లలో 144 సెక్షన్ అమల్లో ఉందని... ఇద్దరికంటే ఎక్కువ గుమిగూడరాదని చెప్పారు. లాడ్జి ముందు జీపు నిలిపి మరీ మరీ చెప్పారు.

    కార్యకర్తలవేమీ వినిపించుకున్నట్టే లేరు... 'ఇప్పుడేం చెయ్యాలీ' అన్న తర్క వితర్కాలలో మునిగిపోయారు. 

    వాళ్ళ మాటలను బట్టి పర్మిషన్ లేకపోయినా, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు! పోలీసులు అడ్డుకోకా మానరు... బహుశ గొడవ జరగవచ్చనుకుంది. ఆ ఆలోచన కలగగానే వెంటనే ఫ్రెష్ అవడం కోసం వెళ్ళిపోయింది.

    పేపర్లలో ఈ వార్తకూడా రావడంతో ఇక్బాల్ భద్రాచలం నుండి ఎనిమిది గంటలకల్లా వచ్చేశాడు. ఇద్దరూ కలిసి ఆ రోజు ఎలర్టుగా ఉండాలనీ ప్రతిదీ మిస్ అవకుండా చిత్రీకరించాలనుకున్నారు. పూర్తిగా జర్నలిస్టుల స్థితిలోకి వచ్చేశారు. 

    ముఖ్యమైన వాళ్ళు లాడ్జిలో గుమికూడడాన్ని గమనించి టిఫిన్ చేసిరావడానికి వెళ్ళిపోయారు. 

    వాళ్ళు లాడ్జి నుండి హోటల్‌కు వచ్చేటప్పటికి ఆ సెంటరంతా పోలీసుల వలయంలో ఉన్నట్టుగా ఉంది. స్టెన్‌గన్స్, ఎ.కె.47లు పట్టుకుని పారా మిలటరీ వాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ రోడ్డు మీద పోతున్న వాళ్ళను భయపెట్టేస్తున్నారు.

    ఆ వాతావరణం ఏదో యుద్ధం జరగబోతోందనే భావన కలిగిస్తోంది.

    సుజాతా వాళ్ళు తిరిగి లాడ్జికి వచ్చేటప్పటికి కార్యక్రమమేదో నిర్ణయమై శేఖర్‌తో పాటు నలుగురైదుగురు కూర్చొని మెమోరాండం తయారుచేస్తున్నారు.

    ఆడపిల్లలు వ్యూహాత్మకంగా 'కానివ్వండి. కానివ్వండం'టూ బాత్‌రూమ్‌లవైపు పరుగులు తీస్తున్నారు.

    అప్పటికే రెండు మూడు ఛానళ్ళ వాళ్ళు, పేపర్లవాళ్ళు లాడ్జి దగ్గరకు చేరి ఉన్నారు. 

    పది గంటలకు ఎం.ఆర్.ఓ ఆఫీసుకు ప్రదర్శనగా వెళ్ళి మెమోరాండం ఇవ్వాలనుకున్నట్టుగా అర్థమయింది. అప్పటికే తొమ్మిది దాటడంతో హడావిడి పడుతున్నారు. కళాకారులు డ్రస్సులతోనే బయలుదేరాలనుకున్నారు.

    ఇంతలో పోలీసులు వచ్చారు. 'మీరంతా వెళ్ళిపోవాలి. మీకు పర్మిషన్ లేదు. పైగా 144 సెక్షన్ అమలులో ఉంది కనక మీరు వెంటనే చర్ల వదిలి పోవాల'న్నారు. పారా మిలటరీ వాళ్ళు కూడా వచ్చ్చి లాడ్జి దగ్గర బారులు తీరి నించున్నారు. అరెస్టులు చేస్తారా లేదా? అన్న సందేహం అందరిలోనూ తారాడుతోంది.

    'మాకూ ఆ విషయం తెలుస్సార్... పర్మిషన్ లేకపోయినా మేమేం సభ జరుపుతామనడం లేదుగా! కానీ ప్రభుత్వం మీద నిరసన తెలియజేసే హక్కు మాకుంది గదా! ఆ విషయం ఎం.ఆర్.ఓకు తెలియజేసి వెళ్ళిపోతాం!' లక్ష్మన్ నింపాదిగా సమాధానం చెప్పాడు.

    పదిగంటలు దాటింది. ఎండ అప్పటికే తీక్షణంగా ఉంది. ఉక్కపోతతో చెమటలు కారుతున్నయ్యి. 

    పోలీసులు అక్కడే ఉండి... 'సరే మీరు చేసేఅదేదో చేసి వెళ్ళిపోండి' అని మెడల మీద నించున్నట్టుగా ఉన్నారు. పారా మిలటరీ పహారాలో.

    ఇక్బాల్ కెమెరా రెడీగా పెట్టుకున్నాడు, ఒక సెకను కూడా మిస్ కాకుండా.

    ఇంతలో ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు టయోతాలో దిగారు. వారివెంట ట్రాన్సిలేటరు కూడా వచ్చాడు.


    వచ్చీరావడంతోనే... 'వేర్ ఈజ్ ది ఆదివాసీస్ మీటింగ్ ప్లేస్... వేర్ ఈజ్ మీస్టర్ లక్ష్మణ్' అంటూ అక్కడికి చేరారు. వాళ్ళను చూడగానే జనమంతా చుట్టుముట్టినట్టు దగ్గరగా మూగిపోయారు.

    ఆ జర్నలిస్టులు అటూ, ఇటూ చూసి 'వాట్ ఈజ్ దిస్, వై దిస్ పారామిలటరీ కేం హియర్' అడిగారు.

    అసలు ఆ జర్నలిస్టులను చూడగానే పోలీసుల్లో చలనం కలిగింది. ఎవరు వీళ్ళు! ఎందుకొచ్చారు! ఇక్కడేదన్నా చిన్న అవాంతరమొచ్చినా ఇది అంతర్జాతీయ వార్త అవుతుందనే భయం కలిగింది వాళ్ళల్లో! పైగా మిలటరీ ఇక్కడెందుకుందన్న ప్రశ్న వాళ్ళలో కంగారు పుట్టించింది.

    అప్పటిదాకా లాడ్జి పందిరికిందే నించున్న వాళ్ళు నాలుగడుగులు వెనక్కి వేసి రోడ్డు మీదకు పోయారు.

    ఆ ఫ్రెంచ్ జర్నలిస్టులను చూడగానే కార్యకర్తలు ముందు రోడ్డు మీదకు వచ్చి నించున్నారు. పద్దిమంది కళాకారులు గోచీ గొంగళ్ళతో ముందు నడిచారు. మిగిలిన సంఘాల వాళ్ళంతా దాదాపు అరవై మందిదాకా బ్యానర్ వెనక నిలబడి నినాదాలివ్వసాగారు.

    టి.విల వాళ్ళు, ఫ్రెంచ్ జర్నలిస్టుల బృందంతో కలిసి సుజాత, ఇక్బాల్ ముందు పోతూ షూట్ చేస్తున్నారు.

    'ఆదివాసీలపై పారా మిలటరీ దమనకాండ నశించాలి'

    'అడవిపై హక్కు ఆదివాసీలదే'

    'ఆదివాసీలే ఈ దేశపు మూలవాసులు'... నినాదాలిస్తూ నాలుగడుగులు నడవగానే పోలీసులు వచ్చి దడికట్టినట్టుగా అడ్డు నిల్చున్నారు. మీరింతమంది అలా వెళ్ళడానికి వీల్లేదు. పది మందిని మాత్రమే అనుమతిస్తాం'.

    'మేం! అందరం  వెళ్ళాల్సిందే! మా నలభై ఆరు సంఘాల వాళ్ళం నలభై ఆరుగురం రిప్రజెంటేషన్ ఉండాల్సిందే!'

     వాదన జరుగుతూనే ఉంది... కళాకారులు ప్రదర్శనగా పాడుతూ సాగుతున్నారు... కార్యకర్తలు నినాదాలిస్తూ పోతూనే ఉన్నారు.

    పోలీసులకేం చెయ్యాలో అర్థంకాక... ఓ పక్కకు చేరి వాకీ టాకీలకిపనిపెట్టారు.

    'అవునూ! ఇంతకీ ఈ పారా మిలట్రీ వాళ్ళేరీ? వాళ్ళుంటే మనల్నింత ఈజీగా పోనివ్వరే!'... దమయంతికి అనుమానం వచ్చింది.

    అప్పుడు చుట్టూ చూస్తే ఎక్కడా వాళ్ళు కనబడలేదు... కార్యకర్తలకు అర్థం కాలేదు... 'ఈ ఫ్రెంచ్ జర్నలిస్టులను చూసిగాని పోయారా ఏమిటీ?' దానితో కార్యకర్తలు, కళాకారులూ మరింత ఉత్సాహంతో పాడుతూ నినాదాలిస్తూ సాగారు.

    అట్లా సాగుతున్న ప్రదర్శన నదీ ప్రవాహానికి పిల్లవాగుకు చేరి ప్రవాహం పెద్దదయినట్లు... ప్రదర్శన చూడడానికి వచ్చిన జనంతో ఓ ఊరేగింపుగా మారింది.

    ఆ ఊరేగింపు బస్టాండు దాటి, సెంటరు దాటి... ఎం.ఆర్.ఓ ఆఫీసు క్రాస్‌రోడ్డుదాకా వచ్చేటప్పటికి పోలీసువాళ్ళు సహించలేకప్పోయారు.

    'సభ జరగొద్దని కోర్టే ఆర్డరు వేస్తే... వీళ్ళు ఏకంగా ఊరేగింపు తీస్తున్నారని... మళ్ళీ మరోసారి ఆపడాణికి అడ్డు వచ్చారు. ఈసారి మరికొంత మంది సివిల్ పోలీసులు చేరారు.

    'వీల్లేదు ఇంతమంది...పదిమందే వెళ్ళాలి! అంతే' అని గట్టిగా నిలబడ్డారు.

    కార్యకర్తలకూ, పోలీసులకూ ఘర్షణ జరుగుతూనే ఉంది.... పోలీసులు పదిమంది ముఖ్యులను వ్యానులో వేసుకుని... సందుల్లో గుండా, గొందుల్లో గుండా స్టేషన్‌కు తీసుకుపోయారు.

    దానితో మిగిలిన కార్యకర్తలు పెద్దలొల్లిచేసి... అక్కడే ఆ నడిరోడ్డు మీదే కూర్చుండిపోయారు! 'మా వాళ్ళను విడిచిపెట్టేదాకా మేం ఇక్కడే కూర్చుంటామని'మొండికేశారు.పోలీసులు లేపాలని చూస్తున్నారుగానీ సాధ్యపడడంలేదు.

    పోలీసులకు తోచడంలేదు... ఇదంతా ఎక్కడ స్క్రోలింగ్ వస్తుందో! పైవాళ్ళతో ఏం తిట్లు తినాలోనని పీక్కుంటున్నారు. టి.విల వాళ్ళను చూస్తుంటే కంపరంగా ఉంది వాళ్ళకు. ముఖ్యంగా ఆ ఇంగ్లీషు జర్నలిస్టులు పరిగెత్తి, పరిగెత్తి వీడియో తీయడం మండుతోంది.

    ఈ గొడవ సద్దుమణిగేది కాదనుకున్నారో... అప్పటికే అరెస్టులన్న వార్తలు టి.విలల్లో రానే వచ్చాయని కంగారుపడ్డారోగానీ! తీసుకెళ్ళిన పదిమందినీ ఎం.ఆర్.ఓ దగ్గరకు తీసుకెళ్ళి అరగంటలో పని పూర్తి చేయించి కార్యకర్తలున్న రోడ్డు మీదకు తెచ్చి దింపేశారు తిరిగి.

    అప్పటిదాకా అక్కడ పెద్ద సీను జరుగుతూనే ఉంది.

    సుజాతకు అదంతా పెద్ద సంబరంగా ఉంది. ఆ మొత్తం జరిగిన ఎపిసోడ్‌లో ఆడపిల్లలు చూపిన ధైర్యం, చిరవ ఎంతో అబ్బురపరిచాయామెను. 'జీవితం వీళ్ళకింత ధైర్యాన్ని ఎట్లా నేర్పిందీ?'

    'ఆ తార చూడు ఎలా పోట్లాడుతుందో! తన భర్తను తన కళ్ళముందే తీసికెళ్ళారనీ తనీ విషయం మీడియాకు, హక్కుల సంఘానికీ తెలిపేలోపే ఎన్‌కౌంటర్ చేశారనీ చెప్పింది. తన భర్త యువజన సంఘంలో పని చేసేవాడు. కళ్ళముందేఅ భర్తను కోల్పోయిన సంఘటన కల్లోలపరిచింది నిజమే!... కానీ అది మానని గాయం కాలేదు... మానసికంగా కృంగదీసింది కావచ్చు... కానీ మనిషి దెబ్బతినిపోలేదు. చైతన్యయుతంగా తిరిగి జనంలోకి వచ్చింది. అదే ఆమెను నిలబెట్టిందేఅమో!

    తప్పకుండా దీనినంతా రికార్డు చెయ్యాల. కానీ ఎప్పుడు? ప్రశ్నార్థకం ముందు నిలబడింది. ఈ రోజు ఎలా ముగియనుందో! 

    'ఇక చాల్లెండి! అనుకున్నది సాధించారు కదా! ఇక పదండం'టూ రెండు వ్యానుల్లో అటూ, ఇటూ తిప్పి కార్యకర్తలనందరినీ లాడ్జికి చేర్చారు. 

    'ఇప్పటిదాకా మీకు సహకరించాం. ఏ గొడవలూ లేవు... వీలయినంత తొందరగా మీరు చర్ల నుండి పోతే మేం ఊపిరి పీల్చుకుంటాం'...

    'మేం చర్లలో ఉండాలో వద్దో మిరెవరూ చెప్పడానికి' అని ఆడపిల్లలు పోలీసుల మీద ఎగిరిపడుతూనే సామాను సర్దుకునే పనిలో పడ్డారు.

    సుజాత వాళ్ళు కూడా భద్రాచలం వెళ్ళి ఫ్రెష్ అయి... అక్కడే భోంచేద్దామనుకున్నారు. 'వీళ్ళు బయలుదేరాక మనం వాళ్ళతోపాటు బయలుదేరుదా'మని...ఓ పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంది.

    ఆమెకూ అలసటగానే ఉంది. మూడు రోజులుగా వాళ్ళ వెనక ఎంత ఉత్సాహంగా పరిగెత్తినా... శరీరం దాని కంట్రోలు అది చేస్తుంది గదా! మనసుకూ, తనువుకూ సమన్వయం లేని పనులంటే ఇవేనేమో!... నవ్వు వచ్చింది.

    సుజాత అట్లా ఆలోచిస్తూ పరధ్యానంగా ఆడపిల్లలు చేసే హడావిడి గమనిస్తోంది. ఇంత క్రితం దాకా పోలీసుల మీదా ఎంత ఎగబడ్డారో! ఇప్పుడంతగా ఆడపిల్లలైపోయి... జడలు వేసుకోవడం... ఆరేసిన బట్టలు సర్దుకోవడం... నేను ముందంటే నేను ముందని బాత్‌రూమ్‌లకు పరిగెత్తడం చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది.

    అట్లా చూస్తున్న సుజాత దృష్టిలో తుడుం దెబ్బ కార్యకర్తలు, లక్ష్మణ్ ఇంకా ముఖ్యులు కొందరు ఆందోళనగా ఉన్నట్టనిపించింది.   

    ఇది ఇక్బాల్‌తో చెప్పి ఏమిటో మెల్లిగా కనుక్కోమంది.

    ఇక్బాల్ అటువెళ్ళి వచ్చి 'మేడమ్! ఇప్పుడే కబురు తెలిసిందంట ఆదివాసీలు చర్లకు నాలుగు కిలోమీటర్ల దాకా వచ్చి చుట్టుపక్కల ఆగివున్నారంట. ఏమవుతుందో! ఎలా? అని ఆందోళనతో ఉన్నారు... దాదాపు ఐదువేల మంది ఉన్నారంట అక్కడ.

    ఆ వార్త విని సుజాత దిగ్భ్రాంతికి లోనయ్యింది.

    చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా! సభ లేదని తెలియదు, కబురు అందే వేళకే వాళ్ళు బయలుదేరి వచ్చి ఉండొచ్చు. కళ్ళముందు 'ఇంద్రవెల్లి' కదలాడింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి అరవై మంది ప్రాణాలు తీసారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. ఇంద్రవెల్లి ఓ మానని గాయంగా మిగిలిపోయింది.

    ఇది ఇప్పుడెట్లా పరిణమించబోతోందీ?

    అయినా ఇంత నిర్బంధంలో... ఎంత ధైర్యంగా చత్తీస్‌గడ్ నుండి అంతమంది ఆదివాసీలు ఎట్లా రాగలిగారూ! వాళ్ళ మీద జరిగే హత్యలు, హననాలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తోంది గదా! ఇదెలా సాధ్యమయిందీ? పైగా నాలుగు రోజుల ముందు నుండి లోతట్టు ప్రాంతాల నుండి నడిచి మరీ?...

    అప్పటిదాకా సిటీ వెళ్ళిపోతామన్న ఆలోచన కలిగించిన రిలాక్స్‌డ్ మూడ్ నుండి బయటపడి వెంటనే ఎలర్ట్ అయ్యింది.

    మెల్లిగా లేచింది. ఇక్బాల్‌కు చెప్పి బండి తీయమంది. నెమ్మదిగా లాడ్జి నుండి ఎడమవేపుకు జీపును తిప్పుతుండగా వెనక్కి తిరిగిచూసిన సుజాతకు అటు వచ్చిన దమయంతి కనిపించింది. 

    మెల్లిగా ఆమెకు సైగచేసి... 'ఇక్కడికే, ఇప్పుడే వద్దాం! రా' అంటే దమయంతి కూడా ఏమీ అడక్కుండా జీపు ఎక్కి కూర్చుంది.

    జీపు ఎడమ వైపుకు దారితీసి... మూల మలుపు దాటాక కొద్ది దూరం పోనిచ్చి మట్టిరోడ్డుకు మళ్ళించాడు డ్రైవర్.

    దమయంతికి అర్థం కాలేదు. అయినా ఏమీ అడగలేదు.

    రోడ్డు దాటి మట్టిబాట పట్టి ఓ కిలో మీటరు లోపలికి పోయింది జీపు. అక్కడి నుండి వరస వరసలుగా... నలుగురైదుగురు గుంపుగా, అక్కడక్కడా చెట్ల కింద... తుప్పుల చాటున... ఇళ్ళ చూరుల కింద కూర్చోనున్నారు. జీపు లోపలికి పోయే కొద్ది ఆదివాసీలు గుంపులుగా కనబడుతున్నారు.

    అప్పటికిగానీ దమయంతికి తామెందుకు ఇటు వస్తున్నామో అర్థం కాలేదు.

    వాళ్ళను చూస్తుంటే ఆమెకు నోట మాట రాలేదు... 'ఏమిటండ్డీ' అంది.

    'అందుకే నిన్ను తీసుకువచ్చింది... మాకు ఇప్పుడే ఈ సమాచారం తెలిసింది'.

    ఇంతలో తుడుం దెబ్బ నాయకుడ్డు హనుమంతరావు ఎవరినో ఎక్కించుకుని బండి మీద అటు నుండి వస్తూ... వీళ్ళ జీపును చూసి ఆగాడు. 

    'మేడమ్! అటు మామిడి తోటలో రెండు వేల మంది ఉన్నారు... రండి, చూపిస్తానని... తిరిగి తన బండిని వెనక్కి తిప్పాడు. తోటకు వెళ్ళేదారంతా మూటలతో, కావిళ్ళతో, నెత్తిమీద తపాళాలతో వందలుగా ఆదివాసీలు నడిచి వస్తూనే ఉన్నారు.

    అదంతా చూస్తుంటే సుజాతకూ ఉద్వేగంగానే ఉంది. 

    మీటింగుకు పర్మిషన్ లేదు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళను చర్ల నుండి పంపించే యత్నంలో పోలీసులున్నారు. మరి వీళ్ళకెవరు మాటామంతీ చెప్పాలి.

    సభ ఉంది రమ్మని చెప్పిన వాళ్ళు... తిరిగి వీళ్ళకు జవాబు చెప్పాలి గదా! వాళ్ళేరీ? రకరకాల ప్రశ్నలు ఆమెను తొలుస్తున్నాయి.

    దమయంతి కూడా! అంతమంది చత్తీస్‌గడ్ ఆదివాసీలు... చక్కగా తలలు దువ్వుకుని... ఉతికిన గుడ్డలతో ఎంత శుభ్రంగా సభకు తయారయ్యారూ!... అంతా ఒకే రకంగా, ఒకే ఎత్తు, ఒకే పోలికలన్నట్టుగా.. నడివయసు వాళ్లు... రివటల్లా ఎలా ఉన్నారూ!... వాళ్ళను ఏదో మహత్తరమైన మనుషులను చూస్తున్నట్టుగా! కళ్ళు అప్పగించి... చేతులు ఆశ్చర్యమేసి గుండెల మీదకు పోగా! 'మేడమ్! వీళ్ళంతా ఎట్లా వచ్చారు! ఎక్కడి నుండి వచ్చారు... పోలీసులు వీళ్ళనేం చెస్తారో? ఎట్లా?' పొంతన లేని ధోరణిలో ఆ పిల్ల మాట్లాడుతోంది. 'వీళ్లకు రక్షణ ఎట్లా?'

    మామిడి తోటలోకి జీపును తిప్పారు. తోట నిండా ప్రతి చెట్టు కిందా... చెట్టు మీదా వందలకొద్ది ఆదివాసీలు... దమయంతి నిర్విణ్ణ అయింది. ఉద్వేగం వల్ల ఒళ్ళంతా వొణికింది. అన్ని వందల వేల మంది ఆదివాసీలను ఒక్కచోటగా ఆమె జీవితంలో చూడలేదు. శరీరం స్తంభించిపోయింది.

    సుజాత కూడా అయోమయ స్థితికి గురైంది... తండ్రి పదే పదే తలపుకొస్తున్నాడు. అమ్మో ఆ దుర్మార్గులు ఎలా పొట్టన పెట్టుకున్నారనీ! చెట్టు మీదున్న వాళ్ళను చెట్టు మీదనే పిట్టలను కాల్చినట్లు - విచక్షణారహితంగా... కనీసం హెచ్చరికలైనా లేకుండా! వెళ్ళిపోతున్న వాళ్ళను సహితం ఎటుబడితే అటు పిచ్చి బట్టినట్లు... ఎన్ని శవాలు! అక్కడికక్కడ ఆ 'ఇంద్రవెల్లి' నేల మీద వొరిగిపోయారు తల్లీ!'... ఆ ఘటన నుండి చనిపోయే వరకు తన తండ్రి తేరుకోనే లేదు.

    పోలీసులు ఇక్కడికి వస్తారా! వస్తే చూడాలీ? అప్పుడంత అమాయకంగా ఇప్పటి జనం ఉంటారా? చూద్దాం! ఇప్పటికైతే వాళ్ళు లేరుగా? తన ఆలోచనలను పక్కకు నెట్టేసింది. అనుభవ మిచ్చిన స్పృహలో సుజాత 'మాట్లాడు దమయంతీ. మాట్లాడు వాళ్ళతో! దగ్గరకు పిలువు' ప్రోత్సహించింది.

    ఏం మాట్లాడాలో తోచలేదామెకు.

    ఇక్బాల్‌కి సైగ చేసి... ఆదివాసీలను హిందీలో 'దగ్గరకు రండి' అని కేకలు వేశారు. 'మీకోసం వచ్చాం' అని చెప్పారు.  

    ఆ మాటలకు తోట నలువైపులనున్న ఆదివాసీలు కదిలి వీళ్ళున్న చోటకు వచ్చారు! 'మాట్లాడు దమయంతీ... నువ్వక్కడ ఆ బజార్లో జనం ముందు చెప్పిందే! వీళ్ళకూ చెప్పూ' అంది.

    అనుకోని ఓ గొప్ప మహోద్వేగ పూరితమైన అద్భుతం ఆమె కళ్ళముందు సాక్షాత్కారమవగా మాటలురాని దమయంతి 'లాల్‌సలామ్,లాల్ సలామ్' అని నినాదాలించ్చింది. అవి స్లోగన్స్‌గా మారాయి.

    అంతే! మళ్ళీ ఆగిపోయింది. మాటలు రాని మూగదయ్యింది.

    'మాట్లాడు దమయంతీ! మాట్లాడవే! వాళ్ళకు అర్థం కాకపోయినా ఫరవాలేదు... నువ్వు చెప్పేది వాళ్ళకోసమేనని... నువ్వు వాళ్ళ మనిషేనని అనుకోవడానికి పనికి వస్తుంది'... ఆమె దుస్థితిని గమనించి ప్రోద్బలం చేసింది సుజాత.

    అప్పటికి దమయంతి కొంత ఊపిరి పీల్చుకుని, నెమ్మదిగా 'మేం మీ కోసమే ఉన్నాం! మీ మీద జరిగే నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి, లోకానికి చెప్పడానికి ఇక్కడకి వచ్చాం! కానీ పోలీసులు, కోర్టులు మీ హక్కులను కాలరాయడానికే సిద్ధమయ్యాయి. మిమ్మల్ని అడావి నుండి తరిమివేసి... మీ నేల నుండి దూరం చేసి... మిమ్ములను నిర్వాసితులను చేసి... అమెరికాకు మీ అడవిని ఖనిజాలకోసం అప్పచెప్పలను కుంటున్నారు. దానిని మనం సాగనివ్వరాదు. అందుకోసం మన ప్రాణాలనయినా అర్పిద్దాం'... అని ముగించింది.

    'అడవిపై హక్కు ఆదివాసీలదే'

    'అమర వీరులకు జోహార్'

    'కిషన్ జీ అమర్ హై'

    'అజాద్ అమర్ హై'... నినాదాలిచ్చింది.

    ఆ క్షణం చప్పున ఆదివాసీ అమరుల పేర్లు తన్నుకున్నా స్ఫురణకు రాలేదు.

    ఆమె చెప్పింది వాళ్ళకు ఎంత వరకు అర్థమయ్యిందో గానీ రెండు వేల మంది ఆదివాసీలు పిడికిళ్ళు బిగించి 'జోహార్, జోహార్' అని ప్రతిధ్వనించారు.

    అప్పుడింక నిదానంగా సుజాత వాళ్ళను మాట్లాడించి నోట్సు తిసుకోసాగింది. చత్తీస్‌గడ్‌లో తామంతా తలో ఊరి నుండి వచ్చామని చెప్పారు. ఊళ్ళపల్లి, భీమారం, చినవుట్ల పల్లి, రాంపిల్లి, పూజారి కాంకౌర్, కస్తూరి పాలెంల నుండి వచ్చినవాళ్ళు తమ గ్రామాల్లో జరుగుతున్న పోలీసుల, పారామిలటరీ అకృత్యాలు చెప్పారు. బాసగూడెంలో ఐదుగురు మహిళలను చెరిచారని, కస్తురిపాలెంలో సోంలని అరెస్టు చేశారని వివరాలు చెప్పారు. 

    'కూసుబాస' నుండి వచ్చిన ఓ ముసలి ఆదివాసీ తన మేకను కోసుకు తిన్నారని లబ్బుమని మొత్తుకున్నాడు. 'చీపురు బట్టి'నుండి వచ్చిన 'వేకు' అనే ఆదివాసీ 'మొన్ననేనమ్మా, మా ఊరు మీద బడి అందర్నీ తెగకొట్టారు. ఇదిగో ఈ చెయ్యి చూడమ్మా' అని జారిపోయిన భుజం చూపించాడు. అతనికి యాభై ఏళ్ళపైబడే ఉండొచ్చు.

    బీజాపూర్ జిల్లా కోరసగూడెం నుండి వచ్చిన శ్యామల అయితు, భీమయ్యలతోపాటు మా సంగతులు రాసుకోండంటూ ఒకరి తర్వాత ఒకరు మిగిలిన వాళ్ళు ముందుకొచ్చి ఆ ప్రాంతంలో పోలీసులు చేస్తున్న హింసాకాండను వివరించారు. 

    దమయంతి అందరినీ వరసగా వివరాలు కనుక్కుని సుజాతకు చెప్తూ సహాయపడుతోంది.

    ఇక్బాల్ ఇదంతా వీడియోలో చకచకా రికార్డు చేస్తున్నాడు.

    ఇది జరుగుతుండగానే ఎలా వార్త తెలిసిందో లక్ష్మణ్ తుడుందెబ్బ వాళ్ళు కొంతమంది అటుగా వచ్చారు. వాళ్ళు కూడా ఆదివాసీలతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుండగానే... పోలీసుల అలికిడి ఎలా కనిపెట్టారోగానీ... వీళ్ళతో పాటు రానేవచ్చారు.

    పోలీసుల జీపు రావడంతో అప్పటిదాకా నిశ్శబ్దంగా క్రమశిక్షణ గలిగిన సైనికుల్లాగ కూర్చున్న ఆదివాసీలు... బిలబిలమని లేచి నిలబడి... తోటలోకి వెళ్ళిపోయారు.  

    వాళ్ళను భయపడవద్దని చెప్పి... లక్ష్మణ్, హనుమంతరావు పోలీసులకు ఎదురు వెళ్ళారు. దమయంతి, సుజాత కూడా ఎలర్టయి వీళ్ళూ వెళ్ళారు.

    పోలీసులు ఈసారి సౌమ్యంగా లేరు. 'మీరెందుకొచ్చారిక్కడికి! మీరు చర్ల నుంచి వెళ్ళిపోవాలి! జనాన్ని రెచ్చగొడుతున్నారు... ఇక్కడే ఉంటే గొడవలు జరుగుతయ్యి' అని పోలీసు గొంతుకను ప్రదర్శించసాగారు.

    దమయంతి ఇక ఊరుకోలేదు... 'మేం వాళ్ళను మీటింగు ఉందని రమ్మని పిలిచాం.వాళ్ళు వచ్చారు. అందువల్ల మీటింగులేదాని వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు ఏం చేసినా ఆ పనిచేసి తీరుతాం! అది మా బాధ్యత.'

    'ఆ పనికి మేం ఉన్నాం! మీది కాదు బాధ్యత'

    'నో! మాదే ఆబాధ్యత. మేం అటుపోగానే వాళ్ళను అరెస్టులు చెయ్యరని నమ్మకమేముందీ? ఎక్కడి నుండి వచ్చారు ఎవరు రమ్మన్నారని ప్రశ్నలు వేసి వేధించరని ఏమిటి?'

    ఈ వాదులాటలు జరుగుతుండగానే మొత్తం మీడియా, ఆ ఫ్రెంచ్ జర్నలిస్టులూ మామిడితోటకు చేరిపోయారు.

    తిరిగి పోలీసులు తమ గొంతుకలను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు.

    మిగిలిన పోలీసులు అప్పటికే ఆదీవాసీలను తోటకు పడమటి వైపు వెళ్ళిపోండని అడవిదారి వైపు తరుముతూ తోట చివర లోయదాకా పోయారు.

    'సరేసార్! మేమేం చెయ్యలేదు కదా వాళ్ళను! పంపించి వేశాంగదా! పదండి మీరింక!' అని అందరినీ వాహనాలు ఎక్కించి తోట బయటకు పంపించే పనిలో పడ్డారు.

    సుజాత,  ఇక్బాల్, దమయంతి ఇంకా... మిరుమిట్లు గొలిపిన అద్భుతం నుండి తేరుకోనట్లుగా నిశ్శబ్దంగా నించున్నారు. ఇప్పుడు జరుగుతున్న సీను తమకు సంబంధించి కాదన్నట్టుగా ఉండిపోయారు.

    తోటంతా ఖాళీ అయింది.  

    'మీరు కూడా కదలండి... మేం గమనిస్తూనే ఉన్నాం! మూడు రోజుల నుండి వీళ్ళతోనే ఉండి... వీళ్ళకు సగం నేర్పుతున్నారు... నిజగా మీరు మీడియా వాళ్ళా! లేక వాళ్ళు పంపిన వాళ్ళా!'... సుజాతను హెచ్చరికగా మాట్లాడాడు డి.ఎస్.పి.

    సుజాతకు కోపం వచ్చింది... 'ఏమనుకుంటున్నారు మీరు?ఎక్కడ ఏది జరిగినా రిపోర్టు చెయ్యడం మా డ్యూటీ! మేం చేసేదానిమీద మీ వ్యాఖ్యానాలు అక్కర లేదు... కావాలంటే మా గురించి ఎంక్వయిరీ చేసుకోండి' అంది.

    'లేదులే మేడమ్! సరే రండి!' అని అతను జీపు ఎక్కాడు. అప్పటికే అటు గుట్టవైపు ఐదువేల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారనీ అటు పారామిలటరీ వెళ్ళి వాళ్ళని ఆపుతోందని వార్తలొస్తున్నాయి.

    కానీ అందరూ వెళ్ళిపోయారు. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియలేదు.

    'ఓహో! మన దగ్గర నుండి పోలీసులు పోయింది... అందుకేనన్నమాట... ఆ ఆదివాసీలను చుట్టుపక్కల అడవిలోనే ఆపివేయడానికి!'... అంది దమయంతి.

    సుజాత ఇంక ముందుకు పోవడం కుదరదనుకుంది. 

    ఎక్కడ బడితే అక్కడ పొలాల నిండా, రోడ్లనిండా, తోటల నిండా ఆదివాసీలే!

    వీళ్ళు కూడా జీపు ఎక్కి తోట బయటకు వచ్చి రోడ్డు ఎక్కారు. ఆ ఆదివాసీలు ఎటు వెళ్ళారో, ఎట్లా వెళ్ళారో చూడాలనిపించింది. వాళ్ళను అర్థాంతరంగా వదిలేశామన్న భావనకు గురయ్యారు. దానితో జీపును వెనక్కు తిప్పమంది సుజాత.

    జీపు వెనక్కి తిరిగి ఓ యాభై గజాలు ముందుకు పోయి ఆగింది. 

    కిందికి దిగిన ముగ్గురికీ కళ్ళముందు ఏదో వింత దృశ్యం చూస్తున్నట్టు కళ్ళు విప్పారాయి. మహాద్భుతమైనదేదో సాక్షాత్కరించినట్లు... ఆకాశం నుండి భూమి మీద దిగిన గ్రహాంతర మానవుల్లాగా ఆ దారంతా మిట్ట నుండి లోయ దాకా ఆదివాసీలు అట్లా నిల్చోనున్నారు.  

    ఒకే ఎత్తు, కోడె వయస్సులో ఉన్న పిల్లలు. దృఢంగా, విశ్వాసంతో నిలబడి ఉన్న మరో ప్రపంచపు సుశిక్షితులైన సైనికిలక్కడున్నారనిపించింది.

    ఆదివాసీలకు వాళ్ళకూ మధ్య సన్నని లోయ. లోయ నుండి మిట్టకు ఎక్కే రోడ్డు. ఆ చివరి నుండి లోయ వరకు నించుని ఉన్న ఈ దేశపు భవిష్యత్తు మానవీయ శిల్పులు... ఇటు లోయకు ఈవల మాటలు రాని మౌన ప్రేక్షకులు.

    సుజాతే ముందుగా తేరుకుని అప్పటికే అక్కడ ఫోటోలు తీస్తున్న జర్నలిస్టును, 'వాళ్ళు అట్లాగే నిల్చుండి ఇటుకేసి చూస్తున్నారేమిటీ? మీటింగు లేదని చెప్పారు గదా!' అంది.

    'అంతే మేడమ్! వాళ్ళు మనం కాదు, పోలీసులు చెప్పినా వెళ్ళిపోరు. భయపెట్టినా ఎటోపోయి దాక్కుంటారు! అంతే! వాళ్ళకు సంబంధించిన వాళ్ళెవరో, వాళ్ళు నమ్మిన వాళ్ళెవరో, వచ్చి... మీటింగు లేదు వెళ్ళిపొమ్మని చెప్పాలి. లేదంటే చీకటిపడేదాకా ఇక్కడే ఉండి ఆ సభ ఉందని చెప్పిన ప్రాంతానికి వెళ్ళి లేదని తేల్చుకుని గానీ వెళ్ళిపోరు' చెప్పాడతను.

    సుజాత దిమ్మెరపోయింది.

    నాలుగు రోజుల నాడు బయలుదేరి వచ్చి జరగని మీటింగు కోసం రాత్రిదాకా ఇక్కడే ఉంటారా! 'అవతార్్' సినిమాలోలాగా ఏ ప్రపంచపు మనుషులు వీళ్ళూ! ఎక్కడి ఉక్కు శిక్షణ!

    దమయంతి అప్పటికి తేరుకుంది. జీపు ముందుకు వచ్చి పది గజాల దూరం లోయవైపు నడిచింది... పిడికిలి బిగించి చెయ్యి ఎత్తి 'లాల్‌సలామ్, లాల్‌సలామ్' అని మూడుసార్లు నినాదాలిచ్చింది.

    ప్రతిగా ఆదివాసీల చేతులు సముద్రంలో అలలు లేచినట్టుగా ఆ చివరి నుంచి లోయ అంచుదాకా పిడికిలి బిగించి... 'లాల్‌సలామ్' చెప్పారు.

    దమయంతి మెల్లిగా పిడికిలి వదిలి... చేతిని తెరచి వీడ్కోలు చెప్తున్నట్లు అటూ, ఇటూ పదే పదే ఊపింది... ప్రతిగా రెండువేల మంది చేతులు వీడ్కోలు చెప్పాయి.

    'ది లయన్ ఆఫ్ డెసర్ట్'... 'ఓమర్ ముక్తార్లో నాయకుడికి వీడ్కోలు చెప్తున్న విప్లవకారుల్లా... చర్ల వైపు తిరిగి ఉన్న ఆదివాసీలు... అడవివైపు తిరిగి నడక సాగించారు.

    'చూశారా! మిమ్మల్ని వాళ్ళు తమ మనిషనుకున్నారు! ఇందాక మాట్లాడారు గదా అందువల్ల!.. మీరు వెళ్ళిపొమ్మంటున్నారని తెలుసుకున్నారు' ఆ జర్నలిస్టు అన్నాడు.

    ఆ ఆదివాసీలకు జనతన సర్కారు ఇచ్చిన శిక్షణ ఎంత గొప్పదీ?

    'అమరులారా! మీ త్యాగం వృథా పోదు... ఈ దేశాన్ని కాపాడే రక్షకులను మాకు ఇచ్చి, మీ రక్తాన్ని ధారపోసినందుకు అమరులారా మీకు ఈ మట్టి రుణపడి ఉంది. రుణపడి ఉంది.

    దమయంతి ఆనంద భాష్పాలో, కన్నీళ్ళో తెలియని ఉద్వేగంతో కదిలిపోయింది.

    'ఇది నాకు జీవతంలో మీరిచ్చిన గొప్ప కానుక... ఇది మహోన్నతమైన మర్చిపోలేని ఘటన... థ్యాంక్యూ... థ్యాంక్యూ... మీకు రుణపడి ఉంటాను' గద్గద స్వరంతో పదే పదే అంటోంది.

    'ఇది నీకేనా! నాక్కూడానూ!'... చెమ్మగిల్లిన కళ్ళతో దమయంతిని అక్కున చేర్చుకుంది సుజాత.

(అరుణతార మే-జూన్ 2012 సంచిక నుండి ప్రచురితం) 
Comments