ప్రేమ బంధం - విడదల సాంబశివరావు

    
 ఆరోజు గుంటూరు జిల్లా కోర్టు విద్యాధికులతో, మేధావులతో నిండిపోయింది. న్యాయమూర్తి తుది తీర్పును వెలువరిస్తారని ప్రముఖులు చాలామంది ఉత్కంఠతతో ఎదురుచూస్తూ ఉన్నారు.

    ఆమె తరఫు న్యాయవాది తుది ఆర్గ్యుమెంట్‌ను వినిపించి తన స్థానంలో ఆసీనుడయ్యాడు. అదేవిధంగా అతని తరఫు న్యాయవాది కూడా తన వాదనను వినిపించి సీట్లో కూర్చుండిపోయాడు. న్యాయమూర్తి కొన్ని నిమిషాలు పాటు దీర్ఘంగా రాస్తూ వుండిపోయారు. అందరి చూపు అతనివైపే! కోర్టు హాలులో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. కొన్ని క్షణాల అనంతరం జడ్జిగారి కంఠం ఖంగున మోగింది.

    ''మీరిద్దరూ ఉన్నత విద్యావంతులు. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో, భావిభారత పౌరులను తీర్చి దిద్దుతున్నారు. అంతేగాదు.. మరో రెండు సంవత్సరాల వ్యవధిలో రిటైర్‌ కాబోతున్నారు. కూడా! సమాజానికి మార్గదర్శకత్వాన్ని చూపే మీరు ముప్పై సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకోవాలనుకోవడం సబబేనా?

    సుదీర్ఘమైన న్యాయమూర్తి ప్రశ్నకు వాళ్లిద్దరూ సమాధానం చెప్పలేదు. మౌనంగా వుండిపోయారు. తిరిగి, ఆయనే మాట్లాడ్డం ప్రారంభించారు.

    ''1980 దశకంలో మీరు చేసిన సాహనం ప్రశంసనీయమైనది. ప్రేమకు విలువిచ్చారు. మూఢ నమ్మకాల చట్రంలో బిగించబడి, ఛాందస భావాల ఒరవడిలో కొట్టుమిట్టాడుతున్న మీ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సుదీర్ఘ జీవన యానంలో మీ ఆత్మసైర్థ్యం చెక్కుచెదరలేదు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని స్థిరపడ్డారు. కానీ, జీవితం చివరి అంకంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీ బిడ్డల భవిష్యత్తుమీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోగలరా?'' వాళ్లిద్దరూ మాట్లాడలేదు. మౌనమే సమాధానమైంది.

    ''మీ ఇద్దరి దగ్గర సరైన సమాధానం లేదని అర్థమైంది. నేను తీర్పు వెల్లడించే ముందు ఓ షరతు విధిస్తున్నాను'' న్యాయమూర్తి మాటలకు అందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 

    ''మీకు పదిహేను రోజులు గడువు ఇస్తున్నాను. ఈలోపు మీ ఆలోచనల్లో మార్పు వస్తే మంచిదని నా అభిప్రాయం. సరిగ్గా ఈనెల 15వ తేదీ మీ కేసు తీర్పు వస్తుంది. అప్పటి వరకు మీరిద్దరూ కలిసే వుండాలి సుమా!'' న్యాయమూర్తి వెళ్లిపోయారు.

    తీర్పు వినాలని వచ్చిన ప్రముఖులు, మేథావులు నిరుత్సాహంతోబయటకు వచ్చారు. ఆ దంపతులిద్దరూ కోర్టు ప్రాంగణంలో వున్న తమ కారులో కూర్చున్నారు. కారు ముందుకు సాగిపోయింది. వాళ్ల ఆలోచనలు కూడా గతంలోకి తొంగిచూశాయి.

1983 సంవత్సరం...

    సునంద, విన్సెంట్‌పాల్‌ల జీవితాలలో నూతన అధ్యాయానికి తెరలేపిన సంవత్సరం. విశాఖపట్నం.. ఆంధ్రా యూనివర్శిటీలో యం.యస్‌.సి. చివరి సంవత్సరం, కెమిస్ట్రీ మెయిన్‌ సబ్జెక్టుగా ఇద్దరూ ఒకే క్లాసులో చదువుతున్నారు. అంతేకాదు... ఆ ఇద్దరూ గుంటూరు ఏ.సి కళాశాలలో బి.యస్‌.సి కూడా కలిసే చదువుకున్నారు. ఆ కారణంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువే. అదే యం.యస్‌.సి చివరి సంవత్సరం ప్రేమగా రూపాంతరం చెందింది. పెద్దలు అంగీకరించకపోయినా.. ఎదిరించి ధైర్యంగా పెళ్లి చేసుకోవాలని దృఢ నిర్ణయం తీసుకున్నారు. కారణం.. ఇద్దరివి వేర్వేరు మతాలు కావడమే!

    సనాతన సాంప్రదాయాలను తు.చ తప్పకుండా ఆచరించే హిందూ ధర్మశాస్త్ర పారంగతుడు రాఘవశర్మ. ఆయన ధర్మపత్ని తులసీదేవి. సదాచార పరాయణురాలు. ఈ దంపతుల ఏకైక పుత్రిక సునంద.
మతం వేరైనా ఉన్నత విలువలు కలిగిన విద్యావంతుల కుటుంబంలో పెద్ద కూమారుడుగా జన్మించాడు విన్సెంట్‌పాల్‌. అతని తల్లిదండ్రులు పీటర్‌పాల్‌, మేరీ దంపతులు. గుంటూరు ఏ.సి. కళాశాలలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు.

    ఆధునిక భావాలున్న పీటర్‌పాల్‌, మేరీ దంపతులు సునంద, విన్సెంట్‌పాల్‌ల ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారు. కానీ... రాఘవశర్మ, తులసీదేవి దంపతులు మాత్రం వ్యతిరేకించారు. తల్లిదండ్రుల అనుమతి కోసం వెన్సెంట్‌పాల్‌ను తీసుకొని ... ఓరోజు తన ఇంటికి వెళ్లింది సునంద. పరస్పర పరిచయాలు ముగిశాక తన అభిప్రాయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. యుక్త వయసులో వున్న కూతురు తాను ప్రేమించిన వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చి పెళ్లికి అంగీకరించమని అడుగుతోంది. అంటే.. ఒకవేళ తాను అంగీకరించకపోయినా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి మానసికంగా నిర్ణయించుకునే తనను అడుగుతున్నారని రాఘవశర్మ గ్రహించాడు. అయినా తాను అడగలవసిన ప్రశ్నలు అడిగాడు.

    ''ఈ పెళ్లికి నేను అంగీకరిస్తావని నువ్వెలా అనుకున్నావ్‌?''

    ''మీరు అంగీకరించరని తెలిసే... మీ కన్నబిడ్డగా నా బాధ్యత నిర్వర్తించాను.'' తాపీగా సమాధానం చెప్పింది సునంద.

    ''కని... 22 సంవత్సరాలు పెంచి విద్యాబుద్దులు నేర్పించిన తల్లిదండ్రుల ఎడల కన్నకూతురు నిర్వహించే బాధ్యత ఇదేనా?'' సూటిగా ప్రశ్నించాడు రాఘవశర్మం.

    ''నా మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా?'' ధైర్యంగానే ప్రశ్నించింది.

    ''నీ మనసుకు నచ్చిన వ్యక్తి.. అతని కుటుంబ నేపథ్యం, మాకూ నచ్చాలి కదా?'' పరోక్షంగా విన్సెంట్‌పాల్‌ మతం గురించి తండ్రి హెచ్చరించిన వైనం ఆమెకు అర్థమైంది. 

    ''ప్రేమ మనసుకు సంబంధించిన విషయం. కులం మతం అడ్గుగోడలు కాగూడదనేది నా అభిప్రాయం.'' సునంద చెప్పిన సమాధానంతో ఆమె అంతరంగం స్పష్టంగా తెలిసిపోయింది. రాఘవశర్మ ముఖం గంభీరంగా మారిపోయింది.

    ''ఇక నువ్వు వెళ్లిపోవచ్చు. భవిష్యత్తులో ఈ ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరుచుకోవు.'' భార్యతో కలిసి లోపలకు వెళ్లిపోయి తలుపులు మూశాడు. సునంద, విన్సెంట్‌పాల్‌ బైటకు వచ్చేశారు. తల్లిదండ్రులను కాదనుకొని విన్సెంట్‌పాల్‌తో కలిసి అతని ఇంటికి వచ్చింది సునంద. పీటర్‌పాల్‌, మేరీ దంపతులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అయితే పెళ్లి కాకుండా తమ ఇంట్లో వుండటం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. అంతేగాకుండా.. మతం సాకుతో ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించని కారణంగా మతరహితమైన వివాహం జరిపించాలనుకున్నారు. సన్నిహితుల సమక్షంలో సునంద, విన్సెంట్‌పాల్‌ల వివాహం రిజిస్ట్రార్‌ ఆఫీసులో జరిగింది. స్నేహితులను ఆహ్వానించి తమ స్వగృహంలో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు పీటర్‌పాల్‌, మేరీ దంపతులు.

    కొన్ని రోజులకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇద్దరికీ ఉద్యోగాలు రాగానే కొత్త కాపురం పెట్టించారు విన్సెంట్‌పాల్‌ తల్లిదండ్రులు. వారి కాపురం ఆనందంగా సాగిపోతోంది. 

    సునందకు ఇద్దరు బిడ్డలు జన్మించారు. తొలి సంతానం అజరు, మలి సంతానం జాహ్నవి. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అజరు ఎం.ఎస్‌. చేయడానికి అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో అతనికి సీటు లభించింది. జాహ్నవి బి.టెక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. కాలం ప్రశాంతంగా సాగిపోతోంది. ఏ లోటూ లేకుండా ఆనందంగా సాగిపోతున్న సమయంలో.. సునంద మనస్సాగరంలో ఊహించని విధంగా కల్లోలం ప్రారంభమైంది! పెళ్లయిన తర్వాత ఇదే మొదటిసారి!

    ఓ రోజు పెదనాన్న కూతురు.. దేవకి ఓ షాపులో కనిపించింది. పలకరించడం ఇష్టం లేనట్లుగా ఓ నవ్వు నవ్వి ఊరకుండి పోయింది. అయినా ప్రేమను చంపుకోలేక తనే పలకరించింది.

    ''అక్కా.. బాగున్నారా?'' ఆప్యాయంగా సునంద పలుకరింపు..

    ''ఆ.. బాగానే వున్నాం.'' ముక్తసరిగా దేవకి సమాధానం..

    ఈ సమయంలో వీళ్లిద్దరికి కొంచెం దూరంలో వున్న ఓ పురుషుడు దగ్గరకు వచ్చి పలుకరించాడు.

    ''దేవకీ.. వెళతామా?''

    సునంద దేవకి వైపు చూసింది ఎవరన్నట్లు.. దేవకి పరిచయం చేసింది.

    ''మావారు.. ప్రభాకర్‌.. ఈమె సునంద...''

    ''ఓవ్్‌ా.. మీకజిన్‌ సిస్టర్‌ అని.. ఇంటర్‌ క్యాస్ట్‌ మేరేజ్‌ చేసుకొని వెళ్లిపోయిందని చెప్పావు... ఆమేనా ఈవిడ..?'' చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నాడు అతను..

    ''ఎస్‌.. ఆమే ఈమె.. పదండి వెళ్దాం'' సీరియస్‌గా సమాధానం చెప్పి ముందుకు నడిచింది దేవకి.

    ''మా అబ్బాయి పెళ్లి హాడావుడిలో వున్నాం.. తర్వాత కలుద్దాంలెండి...'' అతను కూడా ఆమెను అనుసరించి వెళ్లిపోయాడు. సునంద చేష్టలుడిగి బొమ్మలా వాళ్ల వైపు చూస్తుండి పోయింది.

    ''స్వయానా పెదనాన్న కూతురు దేవకి.. మాట్లాడ్డం ఇష్టం లేనట్లుగా వెళ్లిపోయింది. పైగా తన కొడుకు పెళ్లి.. మాట వరసకైనా రమ్మని పిలువలేదు... ఏమిటి.. తను చేసిన తప్పు? విన్సెంట్‌పాల్‌ను మతాంతర వివాహం చేసుకోవడమేగా? ఇందుకేనా తన రక్త సంబంధీకులందరూ ఒకే ఊళ్లో వుండికూడా తనను అంటరాని దానిగా శుభాశుభాలకు ఆహ్వానించడం లేదు!

    ఆమె అంతరంగంలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో... ఎన్నెన్నో! తన ఆత్మీయులందరూ దూరమైపోయారనే వేదన ఆమె మనసులో చోటు చేసుకుంది. ఆమె మనసులోని భావాలను, గతంలో ఎన్నడూ కన్పించని భావావేశం ఆమె మాటల్లో గ్రహించాడు భర్త. కారణం ఏంటని పలుమార్లు అడిగాడు. కానీ, సునంద చెప్పలేదు... టాపిక్‌ మార్చి.. అతన్ని ఏమార్చేది. రోజులు గడిచే కొద్దీ ఆమె హృదయాందోళన పెరుగుతోంది. తన రక్త సంబంధీకులందరికీ దగ్గర కావాలనే ఆరాటం ఎక్కువవుతోంది. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది.. అది కఠినమైన నిర్ణయం!

    అదే యూనివర్సిటీలో విశ్వనాథ శాస్త్రి ఓ చిరుద్యోగి. సునంద అంటే అతనికి చాలా గౌరవం. చిన్న ఉద్యోగి అయినప్పటికీ సునంద కూడా అతనితో అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. ఓరోజు అతనితో ఏకాంతంగా సంభాషించింది. ఉద్యోగరీత్యా, ఆర్థికంగా తక్కువస్థాయిలో వున్న విశ్వనాథశాస్త్రి ఆమె ప్రపోజల్‌ను అంగీకరించాడు సంతోషంగా! ఆ రోజు తృప్తిగా ఇంటికి బయల్దేరింది భర్తతో కలిసి. గత కొన్ని రోజులుగా ఆమె ముఖంలో కన్పించని సంతోష ఛాయలు ఈరోజు కన్పించే సరికి వెన్సెంట్‌పాల్‌ ఆశ్చర్యపోయాడు.

    ''ఏవిటి...? మేడంగారు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు...?''

    ''నా సంతోషానికి కారణం ఇంటికి వెళ్లిన తర్వాత చెబుతాను.'' చిరునవ్వు పెదాలపై లాస్యం చేస్తుండగా భర్తతో అంది సునంద. డ్రైవర్‌ వింటాడని కుటుంబ విషయాలు కారులో మాట్లాడుకోవడం ఆ దంపతులకు మొదటి నుంచి అలవాటు లేదు..
  
    ''మన యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న విశ్వనాథశాస్త్రి గారి అబ్బాయికి మన జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం'' రాత్రి భోజనం చేసిన తర్వాత టి.వి చూస్తూ భర్తతో విషయం చెప్పడం ప్రారంభించింది సునంద. ఊహించని విషయం ఆమె నోటి నుంచి ఆశ్చర్యపోయాడు విన్సెంట్‌పాల్‌. 

    ''జాహ్నవికి అప్పుడే పెళ్లేమిటి? చదువుకుంటోందిగా...!?

    ''ఈ సంవత్సరంతో బిటెక్‌ పూర్తవుతుంది. ఆడపిల్ల కదా.. వెంటనే చేస్తే మంచిదని నా అభిప్రాయం.''

    ''అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకుందాం..''

    ''అక్కర్లేదు.. దానికి సొంత అభిప్రాయాలు ఏర్పడే వరకు వేచి వుండకూడదు'' సునంద కంఠంలో తీవ్రత.

    ''అంటే.. జాహ్నవికి స్వంత అభిప్రాయాలు వుండకూడదనా నీ ఆలోచన?'' అతను కూడా అదే పద్ధతిలో ప్రశ్నించాడు.

    ''అవును.. పెళ్లి విషయంలో మన అమ్మాయికి సొంత అభిప్రాయాలు వుండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను'' స్థిరంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది సునంద. 

    ''కారణం...?''

    ''మనకు దూరమైపోతుందేమోనని బాధ!?''

    ''అలా ఎందుకనుకుంటున్నావ్‌?'' 

    ''నేను నావాళ్లకు దూరమై ఇన్ని సంవత్సరాలుగా మానసిక వేదన అనుభవిస్తున్నాను కనుక!'' ఊహించని విధంగా ఆమెనోటి నుంచి వచ్చిన మాటలకు నిశ్ఛేష్టుడయ్యాడు. అయినా తమాయించుకుని...

    ''నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ కుటుంబానికి, బంధు వర్గానికి దూరమై పోయాననే బాధ ఇంత కాలం నీ గుండెల్లో గూడుకట్టుకొని వుందా?'' అతని కంఠ స్వరంలో జీర స్పష్టంగా ధ్వనించింది. తల్లిదండ్రుల వాగ్వివాదాన్ని గమనిస్తోంది జాహ్నవి దీక్షగా...!

    ''నా మనసుకు నచ్చిన వ్యక్తిగా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగానే వున్నాను. కానీ, అమ్మనాన్నలను, ఆత్మీయులైన బంధువర్గాన్ని దూరం చేసుకొని నేను సాధించింది ఏంటి? పండుగలకు, పర్వదినాలకు, ఎన్నో విలువైన అకేషన్స్‌కి పిలుపులు లేకుండా, ఆహ్వానాలు పంపకుండా నా తల్లిదండ్రులు, బంధువులు నన్ను దూరంగా, అంటరానిదాన్నిగా వెలేశారు. దాదాపు 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ వేదన పగవాళ్లక్కూడా వద్దు. అందుకే.. నా బిడ్డకు ఇప్పుడే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను'' అప్పటివరకు కనురెప్పల మాటున దాగివున్న కన్నీటి బిందువులు టపటపా రాలి కింద పడ్డాయి. అతని అహం దెబ్బతిన్నది.. తనను పెళ్లి చేసుకున్న కారణంగానే కుటుంబానికి దూరమై పోయాననే భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది. ఇంకా ఆమె మనసు తెలుసుకోవాలనుకున్నాడు.

    ''విశ్వనాథ శాస్త్రి కొడుక్కి జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం వెనుక నీ ఆలోచన ఏంటి?'' సీరియస్‌ ప్రశ్నించాడు.

    ''అతను యోగ్యుడు, గుణవంతుడు గనుక!'' ఆమె సమాధానం.

    ''అంతకంటే యోగ్యులు, గుణవంతులు నా బంధు వర్గంలో కూడా వున్నారు'' అతని మాటలకు ఆమె ఉలిక్కి పడింది.

    ''నో! నేనొప్పుకోను. నేను చేసిన తప్పు నా బిడ్డ చేయకూడదు. తన భవిష్యత్తు ఉన్నతంగా వుండాలి. నా మతం లోగిలికే నా బిడ్డ కోడలిగా వెళ్లాలి'' తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది.

    ''ఇది నిండు మనసుతో నువ్వు తీసుకున్న నిర్ణయమా సునందా?'' తాపీగా అడిగాడు. 

    ''అవును!''

    '' భవిష్యత్‌లో కూడా నీ నిర్ణయంలో మార్పు వుండదా?'

    ''ఎలాంటి పరిస్థితులలోనూ మార్పు వుండదు''

    ''అయితే.. నా అభిప్రాయాన్ని చెప్పనా?'' 

    ఆమె మౌనంగా అతని వైపు చూసింది చెప్పమన్నట్లుగా.

    ''రేపే మనం కోర్టులో డైవోర్స్‌కి అప్లై చేద్దాం'' విన్సెంట్‌పాల్‌ సీరియస్‌గా చెప్పిన మాటలు విని సునంద బిత్తర పోయింది. జాహ్నవి మాత్రం తల్లితండ్రుల సంభాషణను చిరునవ్వుతో ఆలకిస్తోంది తప్ప ఏమీ మాట్లాడ్డం లేదు. 

    ''విడాకులా?'' ఆశ్యర్యంగా ప్రశ్నించింది సునంద.

    ''అవును! 30 సంవత్సరాల మన వివాహ బంధాన్ని నీ మాటలతో అవహేళన చేశావు. భర్త అనురాగం కంటే.. నీ తల్లితండ్రులు, బంధు వర్గాల అనుబంధానికే ప్రాధాన్యత ఇచ్చావు. అన్నింటి కన్నా... కులం అహంకారంతో నా వ్యక్తిత్వాన్ని, మన ప్రేమ బంధాన్ని అవమానించావు. ఇకపై మనం కలిసి వుండటం అసంభవం!'' సీరియస్‌గా చెప్పి.. అక్కడి నుండి వెళ్లబోతూ ఆగి.. మళ్లీ అన్నాడు.

    ''విడాకులు మంజూరయ్యే వరకు మనం ఈ ఇంట్లోనే వుందాం విడి విడిగా.. జాహ్నవి ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ల దగ్గరే వుంటుంది. ఈ విషయంలో ఆమెకు స్వేచ్ఛ వుంది'' అతను బెడ్‌రూం లోనికి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిన వైపు చూస్తూ వుండి పోయింది సునంద. తల్లిదండ్రులిద్దరిని చిరునవ్వుతో గమనిస్తోంది జాహ్నవి.

    సరిగ్గా 15 రోజుల తర్వాత... కోర్టు హాలులో ప్రత్యక్షమయ్యారు సునంద, విన్సెంట్‌పాల్‌.

    న్యాయమూర్తి ప్రశ్నించాడు... ''నేను ఈ రోజు తీర్పు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. అయితే.. మీ ఇద్దరి నిర్ణయాన్ని అనుసరించే వుంటుంది నా తీర్పు. చెప్పండి.. విడిపోవాలనుకుంటున్నారా? కలిసే వుండాలని నిర్ణయించుకున్నారా?''

    ''మనసులు విరిగిపోయాయి.. కలిసి భవిష్యత్‌ను పంచుకోలేం'' అతను చెప్పాడు. 

    ''నాకు మనశ్శాంతి కావాలి.. దయచేసి విడాకులు మంజూరు చెయ్యండి'' కోర్టు హాలులో నిశ్శబ్ధం తాండవిస్తోంది.

    అప్పుడే.. నగరంలో పేరు ప్రతిష్టలున్న ప్రసిద్ధ న్యాయవాది, సీనియర్‌ లాయరు వైకుంఠమూర్తి కోర్టు హాల్లోకి ప్రవేశించాడు. ఆయన వెంట జాహ్నవి కూడా లోపలకు వచ్చింది. వైకుంఠమూర్తి లోపలకు వస్తూనే తన గంభీరమైన కంఠస్వరంతో జడ్జిగారిని పలుకరించాడు ఈ విధంగా..

    ''మిలార్డ్‌! ఈ కేసు తీర్పు చెప్పబోయే ముందు నా క్లయింట్‌ జాహ్నవి విన్నపాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవలసిందిగా కోరుతున్నాను.. ఇది ఆమె తరఫున సమర్పిస్తున్న వకాల్తా...''

    ''నువ్వు చెప్పాలనుకున్న విషయాలను ధైర్యంగా చెప్పమ్మా'' 

    జాహ్నవి బోనులో నిలబడి చెప్పడం ప్రారంభించింది.

    ''మిలార్డ్‌ ఈ కోర్టు హాలులో ఉన్న అందరికీ నమస్కారం. ఈ రోజు విడాకులు కోరుకుంటున్న ఈ దంపతులిద్దరూ నా తల్లిదండ్రులు. వీరు విభిన్న మతాలకు చెందినవారు. 30 సంవత్సరాల క్రితం పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. రసాయన శాస్త్రంలో డాక్టరేట్‌ పొంది యూనివర్సిటీలో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో కొనసాగుతున్నారు. పెళ్లయిన 30 సంవత్సరాలకు మా అమ్మకు తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధాలు వగైరా గుర్తుకొచ్చి మానసిక వేదనకు గురైంది. అఫ్‌కోర్స్‌... తప్పులేదు.. మానవ సంబంధాలు సున్నితమైనవి. అప్పుడప్పుడూ మనసును చలింపచేస్తుంటాయి. హృదయాన్ని కదిలిస్తుంటాయి. అంత మాత్రాన 30 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకోవాలనుకోవడం అవివేకం కాదా? భార్య ఆవేశంతో మాట్లాడిన సందర్భాన్ని సానుభూతితో అర్థం చేసుకోకుండా ఈ భర్త గారు  ''నా మనసును గాయపరిచావు గనుక నీతో కాపురం చేయను.. విడాకులే మనకు శరణ్యం అని కోర్టుకెక్కడం అజ్ఞానం కాదా? 

    పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రుల పర్మిషన్‌ అడిగిన వీళ్లిద్దరూ.. మైనారిటి తీరి, మేజర్లుగా గుర్తింపు పొందిన కన్నబిడ్డల అనుమతిని ఎందుకు అడగలేదు? నా అన్న అమెరికాలో చుదువుకుంటున్నాడు.. నేను ఇక్కడే వీళ్లతో వుంటూ చదువుకుంటున్నాను. మా ఇద్దరి జీవితాలను గమ్యస్థానాలకు చేర్చకుండా విడిపోయి బతకాలనుకోవడం బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు చేయదగిన పనేనా? 30 సంవత్సరాలుగా మనల్ని కాదనుకున్న బంధువుల కోసం ఈ రోజు ఎందుకు ఆరాటపడాలి? నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని నిర్ధారించాల్సింది నేను కానీ.. వీరు కాదు. జీవితాన్ని ఇచ్చారు... చదువు నేర్పారు.. జ్ఞానాన్ని అందించారు. వీరికి చెడ్డపేరు తీసుకొచ్చే ఏ పనీ చేయను'' కొన్ని క్షణాలు మౌనం వహించింది. ఆ తర్వాత తల్లిదండ్రుల వైపు చూస్తూ... ''అమ్మా! ఎవరికోసమో మనం బతక్కూడదు. మన కోసం మనం బతకాలి. నాన్నా! ఆవేశంతో అమ్మను దూరం చేసుకుంటే.. 30 సంవత్సరాల ప్రేమ బంధానికి విలువ వుంటుందా? మీ ప్రేమానురాగాలకు సాక్ష్యాలుగా మిగిలిపోయిన మా అన్నాచెల్లెళ్లను దిక్కులేని పక్షులను చేయడం న్యాయమా?''

    ఆమె కళ్ల నుండి కన్నీరు ఉబికి వస్తోంది.. మాటలు పెదాలు దాటి బైటకు రావడంలేదు. 

    ''అమ్మా... జాహ్నవీ!'' తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి ఆమెను కౌగిలించుకున్నారు. వెక్కివెక్కి ఏడుస్తూ వాళ్ల గుండెల్లో ఒదిగిపోయింది జాహ్నవి.

    న్యాయమూర్తితో సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడి వీడ్కోలు పలికారు.

(ప్రజాశక్తి ఆదివారం ప్రత్యేకం స్నేహ 23 నవంబర్ 2013 సంచికలో ప్రచురితం)

Comments