ప్రేమ జిల్లాలు - కొండేపూడి నిర్మల


ప్రియమైన పార్వతీ !
ఎలా వున్నావు? నా వరకు నేను దుర్భరమైన ఒంటరి తనం భరిస్తున్నాను. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు.  అన్నీ వడ్డించాక విస్తట్లో నీళ్ళ గ్లాసు బోర్లించినట్టయింది నా పరిస్థితి.
తలంబ్రాల తన్మయం ఇంకా వదల్లేదు.
మైల స్నానం చెయ్యాల్సి వచ్చింది.  హతోస్మి.
అయినా పోక పోక, ఎవరో శపించినట్టు మన శోభనం నాడే పోవాలా మా బామ్మ? ముహూర్తం పెట్టిన వాడెవడో గానీ..
ఛ! ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.  మనకిలా రాసిపెట్టినట్టుంది. ఏం చేస్తాం?
రోజుల్ని యుగాల్లా లెక్క పెట్టడం తప్ప ప్రస్తుతానికి ఏమీ  చెయ్యలేకుండా వున్నాను.
నువ్వెంత నిరాశ పడి వుంటావో నాకు తెలుసు.
ఒక్క మండలం రోజులు గడిస్తే చాలు మనం ఒకటై పోవచ్చు. మనల్నింక అప్పుడు భూలోక,  సువర్లోక, ఆకాశ లోకాల్లో ఎవరూ కూడా వేరు చెయ్యలేరు.
అసలీ మనుషులందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళి పోదాం.
అర్ధం చేసుకుంటావు కదూ.  అప్పటిదాకా మన పెళ్ళి ఫొటోలు చూస్తూ కాలం గడుపు. నాకూ అవే దిక్కు.
వుంటాను
ఇట్లు 
నీ ప్రియమైన రాజా...

***

ప్రియాతి ప్రియమైన శ్రీవారికి,
బావుండక ఏం చేస్తాను? ఇలా జురుగుతుందని నేను మాత్రం కల కన్నానా?
ఈ మాత్రం దానికి ముహూర్తం పెట్టిన వాడ్ని ఆడిపోసుకోవడమెందుకు లెండి.  ఆయన స్వయంగా మా పెదనాన్నకి క్లాసుమేటుట. అపకారం ఊహిస్తాడా.. మీ అనుమానమె గాని...అయినా తెలంగాణా వాళ్ళకి ముహూర్తాల చాదస్తం  లేదని కోశారుగా...? మళ్ళి ఇదేమిటీ..? ఆవిడ బతికి వుండగానే పెళ్ళి చెయ్యలని మీరంతా తొందర పడబట్టి   మా వాళ్ళూ నానా తంటాలు పడి అఫ్ఫో సప్పో చేసి శుభకార్యం జరిపించారు. ఆ మాత్రం దానికి  అందరిలాగే మీరూ అనడం బాలేదు. మీ బామ్మ ఆరోగ్యంగా తిరుగుతూ ఏమీ లేదు కదా.. ఎప్పటినుంచో  మంచం పట్టి,  రోజుల మీద  వున్నది నిజమే కదా.
సరే పోనీలెండి. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదంటారు .
ఆ మాట కొస్తే నేను పుట్టాకే మానాన్నకి జీతం పెరిగిందని నేను శ్రీమహాలక్ష్మి ని అని మా ఇంట్లో  అంతా అంటారు. మీ వాళ్ళు మాత్రం నా పాదం మంచిది కాదనేశారు.  మరి మీ సంబంధం ఖాయం అయిన రోజే మా పాడి గేదె తప్పిపోయింది.  సందర్భం వచ్చిది కాబట్టీ చెబుతున్నాను.  మేం ఏమయినాఅనుకున్నామా? చదువుకున్న వాళ్ళెవరూ  ఇలాంటివి నమ్మరు.
మీరు అంత చదువు కుని కూడా ఇంత చాదస్తంగా......సరే పోనీలెండి. మీ  బాధలో మీరున్నారు. ఏమాటకామాటే.  మీ బామ్మగారు పాపం... నేనంటే ఆపేక్షగా వుండేవారు.
దిగులు పడ కండి. జీవితం అన్నాక ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. కళ్ళారా మనవడిపెళ్ళి చూసుకున్నారు కదా.  మనకంతే ప్రాప్తం అనుకుందాం
బాధతో 
మీ పార్వతి

***

పిచ్చి పార్వతీ!
అన్నిటికీ  పెడర్ధాలు తియ్యకు. మనం ఇంకా ఒకటి కాలేదు. ఒక్క ముద్దన్నా తీరలేదు. అప్పుడే అపార్ధాలా???
అయినా మీ గోదావరి జిల్లావాళ్లు మహా మాటకారులు సుమా.  పెళ్ళినాడే అర్ధం అయింది.  అబ్బా నిన్ను కాదు మీ జిల్లా వాళ్ళని అంటున్నా.
ఇంతకూ నేను అన్నదాంట్లో తప్పేంముంది?  మజ్జిగలో అరటిపండు నంజుకు తన్నట్టు మనుషుల్ని నంజుకు తింటే ఎలా చెప్పు?  రెండూ మీ అలవాట్లే...
మనవడి  పెళ్ళి  కళ్ళారా చూస్తాననడం ఆవిడ తప్పంటావా? నాకు మా తాత పేరేపెట్టారు తెలుసా! అడుగు కింద పెట్టనీకుండా పెంచింది మా బామ్మ. ఆవిడ పోవడం  మీ గేదె తప్పిపోవడం  రెండూ ఒకటేనా ? చిన్నపిల్లలాగా మాట్ల్లడకు. 
మీ నాన్నఅఫ్ఫో సఫ్ఫో చేసి పెళ్ళిచేశారంటున్నావు, మరి నా ఒడుక్కి మా నాన్న ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? తెలంగాణాలో పుట్టానన్నమాటేగానీ నా బాల్యం చదువు, అన్నీ కడపలోనే  నడిచాయి ఆ విషయం నీకూ చెప్పానుగా... అసలు ఎందుకవన్నీ ,మర్చిపో డార్లింగ్ !!!
మనం సుఖ పడ్డానికే కదా ఖర్చు పెట్టుకునేది. కాస్త ప్రశాంతంగా ఆలోచించు
ఇట్లు నీ రాజు..

***

ప్రియమైన రాజా వారికి,
నిన్న ఫోనులో ఏమిటా ముద్దులు????
కోపం వచ్చిన వాళ్లకి సారీ చెప్పాలి గానీ  ముద్దులు పెడతారా ఎక్కడయినా, ఇంకా నయం, మా వాళ్ళెవరు తియ్యలేదు కాబట్టి సరిపోయింది.మీ ఫోను చప్పుడు విని స్నానం చేస్తూ కూడా పరిగెత్తుకు వస్తూ కాల్జారి పడ్డాను,మోకాలి చిప్ప రెండు ముక్కలు  కావాల్సిన మాట. కొద్దిలో తప్పిపోయింది.ఇప్పుడు ఫరవాలేదు లెండి. అయినా  రాయల సీమ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ఏమిటీ..? నాటు బాంబుల్లాంటి వాళ్ళు అని  మా ఇంట్లో అందరికీ అనుమానమే. . వాళ్ళ  భయం  నిజం చెయ్యకండి. ఇప్పటికే పది రొజులు గడిచాయి.ఇంకొక్క ముప్పై రోజులు ఓపిక పడితే మీ వొళ్ళో వాలిపోతాను కదా!
ముహూర్తానికి ముందే కొంప ముంచరు కదా ఒకవేళ......అబ్బే వూరికే అన్నాను లెండి.
మీ ప్రియ పార్వతి.

***

పరమ దుర్మార్గపు పారూ!
నీ ఉత్తరం చదివితే నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. రాయల సీమ గురించి నీకేమితెలుసని అలా అంటున్నావు. మీ వాళ్ళు ఏదో తెలీక అంటే మటుకు మా ఇంటి కోడలుగా నువు ఖండించాలా వద్దా? రాయల సీమంటే రతనాల సీమని చెప్పు, ఇతర జిల్లాలు తినబట్టీ అది రాళ్ళ సీమగా మారిందని చెప్పు. సరేనా!
అది సరే గాని నిన్న ఆఫీసు నుంచి వస్తుంటే ఒక షో రూం లో బొమ్మకి కట్టిన చీర చూశాను. గులాబి రంగు చీర!!! నీకైతే ఎంత బావుంటుందో వూహిస్తూ నుంచుండి పోతే ట్రాఫిక్కు జాం అయిపోయి చుట్టు పక్కల అంతా చివాట్లు పెట్టారు.
ఏం చెయ్యమంటావు చెప్పు? కాలం ఇలా నత్త నడక నడుస్తోందేమిటి డార్లింగ్ ?
ఇంతకూ తొందరంతా నాకేనా? దేవీ గారికేమీ వున్నట్టు లేదేమిటి?
ఇట్లు
నీ దాసాను దాసుడు,  
పేరుకి రాజా...

***

నా  హృదయ సామ్రాజ్యా!

భలేవారండీ? ఎప్పుడెప్పుడు మన పెద్ద వాళ్ళు ముహూర్తం పెడతారా అని వుంది.
నాకు మాత్రం తొందర ఎందుకు వుండదనుకున్నారు? నేనే మైనా రాయినా? రప్పనా? మీరు పైకి చెబుతున్నారు, నెను లోపల దాచుకుంటున్నాను. నిన్న కూరలో మూడుసార్లు ఉప్పు వేశాను. గుడికి వెడుతుంటే మీ పోలికల్లో ఎవరో కనిపిస్తే క ళ్ళార్ప కుండా చూశాను.చివరికి వాడు ఇంకేదో అనుకుని ఇకిలించడం మొదలు పెట్టాడు. చెబితే ఏమనుకుంటారొ గాని రాత్రిళ్ళు మీ చొక్కా, ప్యాంటూ తొడుక్కుని నిద్ర పోతున్నానంటే నమ్మాలి. ఎంతగా చిక్కబట్టుకుందామన్నా మనసు మాట వినడం లేదు.
అవును అలా రాశారేమిటి? జిల్లలకు జిల్లాలు దోచుకుతినే అలవాటు మాకేమీ లేదు. మా నాన్న బడి పంతులు. దోచుకునే పని మీ కాంట్రాక్టర్లూ ,ఇంజనీర్లూ చేస్తారేమొ గాని మాకు తెలీదు.
లేతవి, ముదురు రంగువి కలిపి పెట్టీ నిండా అరడజను గులాబి చీరలున్నాయి. నాకు నీలం రంగంటే ఇష్టం. నీలం అంటే స్కూలు యూనిఫారం బ్లూ కాదు. అలాంటిది మీ అక్కగారు పెట్టారు. (ఉప్మాలోకి మూడు పచ్చళ్ళు వుండి తీరాలంది చూశారా, ఆవిడ- ఆవిడనీ ఆవిడ నోటి ధాటినీ మావాళ్ళింకా మర్చిపోలేదు సుమా )
లేత నీలం రంగయితే నాకు బావుంటుందని అంతా అంటారు.
అయినా ఎందుకండీ ఇప్పుడీ ఖర్చు? ఏమో మీ ఇష్టం.
మీ అధీనురాలు 
పార్వతి.

***

రతీ దేవి !
నిన్న కల్లోకి వచ్చావు. గులాబి రంగు చీరే కట్టుకున్నావు. నీకున్న గులాబీ చీరలు ఎలాంటివో నాకు తెలీదు కాని, నేను చూసిన రంగు నీ వొంటికి బాగా నప్పుతుంది. 
మా అక్క పాత తరం మనిషి. ఆవిడ ప్రేమని చూడాలి కాని చీరని కాదు. నాతో అంటే అన్నావు కాని స్కూలు యూనిఫారం రంగని ఆవిడ ముందు అనకు.  బావుండదు.
నీకు తెలీదని కాదనుకో. వూరికె చెబుతున్నా.
హమ్మయ్య. నా గుండు మీద జుట్టు నారు మడిలా మొలుస్తోంది. శోభంనం నాటికి క్రాఫింగు రెడీ. పెళ్ళింట్లో కర్మ కాండలు  చెయ్యకూడదని సత్రంలొ జరుపుతున్నారు. మ మ అనిపించుకుని నేను ఆఫీసుకి వెళ్లిపోతున్నాను. తతంగం అంతా మా పెద్దన్నయ్య జరుపుతున్నాడు.
మనం కలవడానికి ఇంక వారం రోజులే వుంది. ఆ రోజుకి నీకే రంగు చీర కావాలొ చెప్పు. కొంటాను.
ఎదురు చూపులతో 
నీ రాజాధి రాజు..

***

ప్రియమైన నా రాజాధి రాజూ!
ఎంత పల్లెటూరి దాన్నయినా ఎవరితొ ఏం అనకూడదో తెలుసు.  ప్రేమతొ మీరేం కొనిపెట్టినా సంతోషంగా కట్టుకుంటాను. 
అవునూ మా వాళ్ళు ఆ రాత్రికి పూల జడవేస్తానంటున్నారు. వేయించుకొనా ? ఇది మల్లె పూల సీజను కాదు కదా? చామంతి పూలతో వేస్తార్ట ! మరి ఇష్ట మేనా?
మళ్ళీ జిల్లా పేరు పెట్టి వెక్కిరిస్తారా? నాకయితే నాజుగ్గా కనకాంబరాలు గాని, సన్న జాజులు కాని పెట్టుకుంటే సరిపోతుందనిపిస్తోంది.
ఏ విషయం   తొందరగా చెప్పండి . మీ జిల్లా వాళ్ళకి మల్లె పూల ముడి వేసుకోమంటే నా వల్ల కాదు. మీ అత్తకూతురో ఎవరో వేసుకున్నారు చూడండి. గేదెలు వెంటపడే లావుందని మా వాళ్ళంతా ఒకటే నవ్వులు.

పరవశంతో 
పార్వతి.

***

దూరాభారమైన పరువతీ?
ఎలా వుందీ పిలుపు? నాకీ మధ్య కవిత్వం వచ్చేస్తోందోయీ. 
శరీరం వశంలో లేదంటే నమ్ముతావా? మందు నీ దగ్గరే వుంది. రోగి ఇక్కడ పడి వున్నాడు . ఇదేమైనా
న్యాయంగా వుందా చెప్పు.
నీకు ఏ చీర ఇష్టమైతే అదే కట్టుకో నీకు ఏదైనా బావుంటుంది. అసలు ఏ చీరా కట్టుకోక పోతే ఇంకా బావుంటావు. ఏ పూలు ఇష్టమైతే అవే పెట్టుకో. ఉమ్మెత్త పూలు పెట్టుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. అయినా  ఇలాంటి వివరాలు నువు అడుగుతున్న కొద్దీ నేనేమిటొ అయిపోతున్నాను. ప్లీజ్ ఇంకొక్క వారం రోజులు నన్ను కుదురుగా పని చేసుకొనివ్వు. ఇప్పటికే ఒక మెమో  వచ్చింది. శోభనం నాటికి ఊస్టింగు ఆర్డరు చేతికొస్తుందో ఏం పాడో...
ఇంతకీ మన పెళ్ళి కి పూల ముడి వేసుకున్నది మా అత్త కూతురు కాదు, పెద్దమ్మకూతురు. మేకలకి వెంట పడే ఉత్సాహం వుండాలి కాని రేపు నీ పూల జడని చూసి మాత్రం పడవా ఏమిటి? ఇన్ని వెక్కిరింతలు వెటకారాలూ  ఎక్కడ నేర్చుకున్నావమ్మాయీ ?
కనిపించకుండా ఘాటెక్కిస్తారని గుంటూరు జిల్లా వాళ్లకి ఒక పేరుంది,కొంపదీసి మీ వాళ్ళెవరైనా లేరు కదా అక్కడ  ? ?! (నువ్వంటే నాకెంత భయమో చూశావా)

ఇట్లు 
నీ సామంత రాజు

***

హబ్బా ఏమిటిది రాజా!
ఓ పట్టాన ఏదీ  తేల్చరుకదా! అలా కాదు . మీకేం కావాలొ చెప్పండి. పూలజడ ఇష్టమేనా కాదా?
అదేమిటి మాది గుంటూరు జిల్లా కాదంటారేమిటి? మా నాన్నది గోదావరి జిల్లా కావచ్చు కాని అమ్మది గుంటూరే. నేను చదువుకున్నది అమ్మమ్మ దగ్గరే కదా. గుంటూరు వాళ్ళు కల్లా కపటం తెలేని వాళ్ళండీ.  కారం మాదిరిగా మాట్లాడుతారు కాని మనసు మంచిది. నిన్న మీ పిన్ని గారట, ఎవరొ బెంగుళూరు నించి వచ్చింది. వెడుతూ వెడుతూ కొబ్బరి బోండాం చేతిలో పెట్టి వెళ్ళింది. ఆవిడ ఏ జిల్లా మనిషో నాకు తెలీదు. మనం కొత్త పెళ్ళి కూతురికి పళ్ళూ తాంబూలం ఇస్తాం, రవిక  పెడతాం అంతేగాని, ఇదేమిటొ వింతగా వుందని మా వాళ్ళు అనుకుంటుంటే నేనే సర్ది  చెప్పాను.
ఒక్క నిమిషం. అక్క ముగ్గులు పెట్టడానికి పిలుస్తోంది. మీ మైకంలో  పడి నేను పుట్టింటి వాళ్ళని  డబాయిస్తున్నానుట ! రేపు మళ్ళీ రాస్తాను.
మీ పార్వతి.

***

"ఇదెక్కడి అన్యాయం పారూ, జాకిట్టుకు ఎన్ని గుండీలుంటాయో  నాకేం తెల్సు.
అంతమాత్రాన దూరం పెట్టేస్తావా?" శొభనం గదిలో రెండో రాత్రి జాలిగా అడిగాడు రాజా.
"చెప్పలి మరి ,ప్లీజు   ....ప్లీజు    ..గుర్తు చేసుకుని చెప్పండి. మొదటిసారి చేసే అన్ని పన్లూ చాలా శ్రద్ధగా చేస్తానన్నారు కదా" అంతకంటే జాలిగా చెప్పింది పార్వతి.
"అయితే మటుకు ఆ సమయం లో అలాటివి కూడా లెక్క పెట్టుకుంటామా ఏమిటి?
"అయినా నీ జాకెట్టుకి ఎన్ని గుండీలుంటాయో  నాకెందుకు చెప్పూ. విప్పడంముఖ్యం గాని..""
"అదే నేనూ చెప్తున్నాను. మీకింకా నీ సంగతి, నా సంగతి అనే ధొరణి పోలేదు చూశారా?"
"సరె  అయితే నా చొక్కా కి ఎన్ని గుండీలున్నాయొ చెప్పమ్మా చూద్దాం"
"ఓకే అలా అడగండీ చెప్తాను, కాలరు గుండీతో కలిపి ఆరు గుండీలున్నాయి. నలభై రెండు రోజుల పాటుమీ చొక్కా అత్యంత ప్రేమతొ తొడుక్కుని నిద్ర పోయాను. అప్పుడు మీరు నా దగ్గర వున్నట్టే అనిపించింది. ప్యాంటూకి ఎన్ని బొత్తాలు వుంటాయో కూడా తెలుసు,అదేలెండి,ఈ జిప్పులకి ముందు రోజుల్లో...."
"మరి నా వియోగం విషయం నీకేం తెలుసు. ఇదిగొ ఈ గుండె లబ డబ అనడం లేదు. పార్వతి....రతీ.....తీ... అంటోంది. ఇదిగో కావాలంటే ఒకసారి నా గుండె మీద చెవి పెట్టి విను."
మీ వేషాలన్నీ నాకు తెలుసు కాని చెప్పండి నా జాకెట్టుకి ఎన్ని గుండీలు?"
".............................................."
"అణువణూవు తెలిసిపోయిందని కోశారు కదా ఇంతకు ముందు మౌనంగా వున్నారేం"
"అవునబ్బా...అణూవణూవూ తెలుసు ,జాకిట్లతొ పనేమిటి? పోనీ ఇప్పుడు లెక్క పెట్టి చెప్పనా"
"అదేం కుదరదు. ముట్టుకోకుండానే చెప్పాలి"
"శొభనం రొజున ఇలాంటి పేచీలు ప్రపంచంలో  ఎవరైనా పెడతారంటావా???"
"సరియైన జవాబు చెప్పగలిగిన వాళ్ళకి...."
"ఊ.........చెప్పగలిగిన వాళ్ళకి...?
"పూర్తి రాజ్యం ప్రకటిస్తాను"
"పోనీలే బతికించావు అర్ధరాజ్యమే దిక్కనుకున్నాను."
"కాదు పూర్తి రాజ్యమే ఇస్తాను. ఇంతకూ తమరు చెప్పగలిగినప్పుడు కదా"
"పోనీ బ్రాసరీకి ఎన్ని హుక్కులుంటాయొ చెప్పనా?"
"అక్కర్లెదు,అంత మ రీ ఎల్ కెజి జవాబులొద్దు, నేను అడింగింది చెప్పు చాలు"
"చెప్పనా నీ టైలరుగాడు ఎన్ని కుడితే అన్ని"తిక్కగా అన్నాడు రాజా.
"మధ్యలో వాడిమీదెందుకు మీక్కోపం" ఫక్కున నవ్వుతూ  అంది పార్వతి.
"తల్లీ నీ పాదాలకు నమస్కారం. తొందరగా చెప్పి పుణ్యం కట్టుకో. ఎదురుగుండా అద్దంలో నా మొహం నాకే షేక్సిపియరులా విషాదంగా వుంది, అవునూ అన్ని తెలిసిన ఆ మహా కవికి కూడా జాకిట్టుకి ఎన్ని గుండీలుంటాయొ తెలుసనుకున్నావా, తెలీదు."
"ఔను చలానిక్కూడా తెలిసి వుండదు,  గుండీలే కాదు ,గుండెలో ఏముందో కూడా...ఎంతపెద్ద రసికుడికైనా   ఇలాంటి  కీలక విషయాలు తెలివు లెండి కారణం ఏమిటంటె అవి ముఖ్యం అని అనుకోరు కనీసం, సరె నేను చెబుతాను వినండి. మీ రాయలసీమ వాళ్లకయితే మర్యాదగా ఏడు గుండీ లుంటాయి. కృష్ణాజిల్లా వాళ్లయితె ఆరు గుండీలు కుట్టినా వూరుకుంటారు. ఇక తూర్పుగోదావరి వాళ్ళు నాలుగు చాలంటారు, కావాలంటె పగ్గాలు వేసేందుకు ఒక ముడి వుంటుంది."
" ఓర్నాయనో మళ్ళీ జిల్లాల మాటెత్తావా?ఇంక నిన్ను వదిలెయ్యడానికి వీల్లేదు.ఇదిగొ చూడు ఇవాల్టి నుంచి మనిద్దరికి  అసలు జిల్లాలే లేవు "
"అదేమిటి"
"అదంతే మరి. ఎందుకంటే మనం ఇప్పుడు వుండాల్సిన జిల్లా పేరు  ప్రే..మ..జి..ల్లా...ఈ జిల్లాకి గుండీలే కాదు ,గుండీలు లెక్క పెట్టాల్సిన జాకిట్లు గాని చొక్కాలు గాని ,ప్యాంటులు గానీ, ప్యాంటీలు గానీ లేవు... లేవు.... లే...వు"

.......

ఇప్పుడు వాళ్ళిద్దరూ జిల్లాలు ఏర్పడక ముందు వున్న అందమైన  ఆటవిక మానవుల్లా వున్నారు. పలకరించే ప్రయత్నాలేమీ చెయ్యకండి.
 
(విపుల మాసపత్రిక సెప్టెంబరు 2007 సంచికలో ప్రచురితం)
Comments